Showing posts with label Family. Show all posts
Showing posts with label Family. Show all posts

Saturday, January 27, 2024

ఇంకా ఇచ్చిన మాటలెన్నో . . .

"ఝాన్సి లక్ష్మి భాయి" గా మా "శ్రావణి" పాప - "లక్ష్మి హృదయ" 
Pen and watercolors on Paper (8.5" x 11")

దాదాపు రెండేళ్ళ తర్వాత ఈరోజు ఉదయం, "గిరీ, ఒక చిన్న బొమ్మ వెయ్యవా" అని నా మనసు నన్నడిగింది. ఈమధ్యనే చూసిన ఫొటో - కత్తి డాలు పట్టుకుని కదనరంగానికి సిద్ధం అయిన ఝాన్సి లక్ష్మి భాయి గా "మా శ్రావణి" కూతురు "లక్ష్మి హృదయ" రూపంలో నా మనసు మాట మన్నించా.

దాదాపు పదేళ్ళ క్రితం వాళ్ళబ్బాయి బొమ్మ వేసివ్వమని శ్రావణి అడిగితే అలానే అని మాటిచ్చా, ఆ మాట ఇన్నాళ్ళకిలా తీర్చా. "శ్రావణి" - మా చిన్నమామయ్య కూతురు, చిన్నపుడు హైదరాబాద్, విద్యానగర్ లో "గిరిమావయ్యా" అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ నా దగ్గరికి రోజూ వస్తూ ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో దేనికైనా ఏడుస్తుంటే ఎత్తుకుని వెళ్ళి శంకర్ మఠ్ దగ్గర బజార్ లో చాక్లెట్లు కొనిస్తే బుగ్గలపై కారుతున్న ఆ కన్నీళ్ళు ఒక్కసారి ఆనంద తాండవం చేసేవి. పసి పిల్లల దుఃఖాన్ని మరిపించి, మనసుల్ని మురిపించటం ఇంత సులభమా అనిపిస్తుంటుంది గుర్తుకొచ్చినపుడల్లా...

ఇంకా ఇచ్చిన మాటలెన్నో...
ఆ బాకీలన్నీ తీరేదెప్పటికో...
 

Friday, December 15, 2023

Happy Birthday my dear Bhuvan 💙💙

A very Happy Birthday Dear Bhuvan babu! 💐 🎉

Twenty one years ago, today, you gave your first smile followed by many smiles every single time I touched you and had an eye contact. That has been a miracle to me every time I recollect. That day, I believed my Dad was back in my life as you.

I wish you many many happy returns of today. Have a wonderful day bangaru babu!

With lots and lots of Love 💙💙
Dad

Tuesday, July 4, 2023

"శ్రీ రామ చంద్రుడు"...

"శ్రీ రామ చంద్రుడు"
Oil on Canvas - 24" x36" (2' x 3')

హ తెలిశాక నాన్న వేసిన మూడు శ్రీరామ చంద్రుని బొమ్మలు రోజూ మా ఇంట్లో చూస్తూనే పెరిగాను. తన పన్నెండేళ్ళ వయసులో నాన్న పుట్టిన ఊరు "దామరమడుగు" లో పెరిగిన ఇంట్లో మిద్దెమీద నున్నటి తెల్లని సున్నపు గోడమీద రంగులతో చిత్రించిన బాణం పట్టుకుని ఫ్రేమ్ లో ఇమిడి చక్కగా నిలబడి ఉన్న "కోదండ రాముడు" మొదటిది. అదే గోడపైన పక్కనే రెండవది రంగుల చిత్రం, చెట్టుకింద "సీతారాములు", ఎదురుగా బంగారు లేడి ని చూపిస్తూ పట్టి తెచ్చి ఇమ్మని చెయ్యి చూపెట్టి అడుగుతున్న సీత. మూడవది నాన్న B.Ed Training చేసిన కాలేజి "Vijaya Teachers College, Bangalore" లో ఉన్నపుడు ఆ కాలేజి మ్యాగజైన్ ముఖచిత్రం కోసం వేసిన ఇంట్లో ఫ్రేమ్ కట్టించి ఉన్న "సీతారాములు" పోర్ట్రెయిట్. ఈ మూడు బొమ్మల ప్రభావం పోర్ట్రెయిట్ అంటే ఇలానే వెయ్యాలి అనేంతగా నా బొమ్మల్లో ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది.

ఆధునిక భావాలున్న నాన్న కి దేవుడంటే నమ్మకం ఉండేది కాదు. అయినా వేసిన కొద్ది బొమ్మల్లో "శ్రీరాముడు" బొమ్మలే ఎక్కువ ఉండటం విశేషం. నాన్న పేరు "రామచంద్రయ్య", బహుశా ఆ పేరు ప్రభావం నాన్న మీద ఉండి ఉండొచ్చు.

చిన్నపుడు "బుచ్చిరెడ్డిపాళెం" లో నాన్న హైస్కూలు టీచర్ గా ఉన్నపుడు మేము ఎక్కువగా వెళ్ళిన చాలా సువిశాలమైన పెద్ద దేవాలయం "శ్రీ కోదండ రామాలయం". ఆ దేవాలయం తిరునాళ్ళు అప్పట్లో చాలా గొప్పగా జరిగేవి. నా నాలుగేళ్ళ వయసులో చూసిన "తెప్పోత్సవం" రాత్రి కోనేరు చుట్టూ చేరిన ఆ జనం మధ్య కోనేటి నీళ్ళల్లో "తెప్ప" మీద ఉత్సవం ఇంకా గుర్తున్నాయి.  శ్రీరామ నవమి ఉత్సవాలప్పుడు పది రోజులపాటు రోజూ వేకువ ఝామున ఊరేగింపు వచ్చే రాముడి ని మా చిన్నపుడు మమ్మల్ని నిద్రలేపి రోడ్డు మీదికి తీసుకెళ్ళి చూపించి మా కళ్ళకి హారతి అద్దిన మా "బామ్మ" చేతి మీద "శ్రీ రాములు" అన్న పచ్చబొట్టు అక్షరాలూ ఇంకా గుర్తున్నాయి. చిన్నపుడు ఎప్పుడూ బామ్మ చెయ్యి చూసి, బామ్మా నీకు కృష్ణుడంటే ఇష్టం కదా అయితే "శ్రీ రాములు" అని ఎందుకు పచ్చబొట్టు వెయ్యించుకున్నావ్ అని అడిగేవాళ్ళం. రామాయణ ఇతిహాసం "బామ్మ" చెప్పిన కథల్లో ఊ కొడుతూ విన్నాం. ఇప్పటి తరం కి ఆ ఇతిహాసాలు తెలీవు, కథలుగా చెప్పే బామ్మలూ లేరు, ఉన్నా వాళ్ళ  దగ్గర పెరిగే వీలూ లేదు. భారతీయ ఇతిహాసాల్లోని మహావీరులకన్నా పాశ్చాత్య కామిక్ బొమ్మల వీరులే బాగా పరిచయమైపోయారు.

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో "శ్రీ రాముడు" ని ఆదిపురుషుడు గానూ పిలుస్తారు, కొలుస్తారు. ఈమధ్య వచ్చిన పాశ్చాత్య కామిక్ ప్రభావంతో వచ్చి మెప్పించలేకపోయిన "ఆదిపురుష్" సినిమా ప్రభావంతో వేసిన పెయింటింగ్ మాత్రం కాదిది. దాదాపు రెండేళ్ళ క్రితం ఒక పేరు తెలియని శిల్పి చేతిలో చెక్కబడ్డ "శ్రీరాముడు" చెక్క శిల్పం బొమ్మ ఆధారంగా మొదలుపెట్టిన ఈ "శ్రీ రామ చంద్రుడు" ని ఇప్పటికి పూర్తి చెయ్యగలిగాను.

అన్నిటికన్నా మిన్నగా ఈ పెయింటింగ్ కి నేను పెట్టుకున్న పేరు, నాన్న పేరూ రెండూ ఒక్కటే - "శ్రీ రామ చంద్రుడు"!

Sunday, March 26, 2023

"జీవిత రంగం" లోని "జీవి తరంగం" ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రరాజం - "రంగమార్తాండ"...

 

ఇద్దరు ధీటైన నటుల "రంగమార్తాండ"

"జీవిత రంగం" పై ప్రతి ఒక్కరూ నటులే. ఇది అందరూ అనేదే, ఒప్పుకునేదే. రకరకాల పాత్రల్లో ఎవరిశైలిలో వాళ్ళు జీవించేస్తారు, కానీ అందర్నీ మెప్పించలేరు. అదే, "రంగస్థలం" పై నటీనటులు నటనలో జీవించేస్తే ప్రతి ఒక్కరి మనసునీ దోచి అందర్నీ మెప్పించేస్తారు. అక్షరాలా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ తమ "నటనా ప్రతిభ" తో  దోచేసుకునే చిత్ర రాజమే - "రంగమార్తాండ".

చాలా రోజుల తర్వాత ధీటైన నటులనుంచి ఇంకా ధీటైన మంచి అద్భుత నటన తోబాటు, విలువలు కూడిన జీవితాన్ని వెండితెరపైనే కాదు మన కళ్ళముందే ఆవిష్కరించిన అనుభూతిని మిగిల్చే సినిమా ఇది.

అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు అనేకన్నా దర్శకుడు "కృష్ణ వంశీ గారు" వాళ్ళందరి నటనలోని జీవాన్ని వెలికితీసి విలువలు కలిగిన, ఎప్పటికీ కాలం చెల్లని కుటుంబ కథాజీవం తో కలిపి అద్భుతంగా ఆవిష్కరించారు అనొచ్చేమో. నటనలో పూర్తిగా పండిన నటీనటులు తలపండిన దర్శకుడి చేతిలో మంచి కధతో కలిసి నడిస్తే ఒక జీవితమే కళ్ళ ముందు ఆవిర్భవిస్తుంది. ఖచ్ఛితంగా ఈ సినిమాలో ఇదే జరిగింది.

"ప్రకాష్ రాజ్" గారు తన విశ్వరూపాన్ని చూపించగల సత్తా ఉన్న పాత్ర లభిస్తే చూపించకుండా ఉండగలరా, ఉంటారా...అచ్చంగా అదే చేశారు. "బ్రహ్మానందం గారు" స్వచ్ఛమైన నవ్వులనే కాదు, నవ్వులంత స్వచ్ఛంగానే ఆర్ద్రతనీ, విషాదాన్ని చేసి చూపించగరని అందరికీ తెలిసినా ఆ సత్తా చాటగల పాత్ర రావటానికి ఇంత కాలం పట్టింది, అంతే...ఇద్దరూ కలిసి హృదయాన్ని పిండేస్తారంతే!

"ఇళయరాజా గారు" ఇచ్చిన సంగీతం మళ్ళీ చాలా కాలానికి వీనులవిందు చేసి వదిలేస్తుంది. ఒకప్పటి, ఎప్పటికీ వినగలిగే స్థాయి సంగీతం మళ్ళీ చాలా కాలానికి.

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు "ఆస్కార్" ని తాకింది. కానీ ఆకాశాన్నైనా తాకగల ప్రతిభ మనకెప్పుడూ ఉంది. ఇలా అప్పుడప్పుడూ వచ్చే "రంగమార్తాండ" లాంటి సినిమాలే అందుకు నిదర్శనం!

ఇప్పటి కాలం, మన చుట్టూనే కాదు మన జీవితాల్లోనూ ఎన్నెన్నో మార్పుల్ని త్వరత్వరగా తెస్తూ అందర్నీ తనతో పరుగులు పెట్టిస్తున్నా...కుటుంబం, బంధాలూ, బాంధవ్యాలూ, మనసులూ, మమతలూ ఎక్కడికీ పోవు, అలానే చెదరకుండా ఎప్పటికీ ఉంటాయి అని ఈ చిత్రం చూస్తే తప్పకుండా నమ్మకం వస్తుంది అనిపిస్తుంది.

తల్లీ, తండ్రి హృదయాలు ఏకాలంలో అయినా ఒకటే. ఇది పిల్లలు ఆకాలంలోనూ, ఈకాలంలోనూ, ఏకాలంలోనూ గ్రహించలేరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయి తల్లీ తండ్రీ పాత్రలు పోషించే కాలం రాక తప్పదు, అప్పుడు ఆ పాత్రల్లో వాళ్ళూ జీవించకా తప్పదు. అలా తరతరాలు ఆ విలువల్ని కాపాడకా తప్పదు...ఇదే "జీవిత రంగం" లోని "జీవి తరంగం"!

Sunday, March 5, 2023

Father and Son time...

Portrait of Geno Smith, American Football Seahawks Quarterback player
Oil on Canvas 24" x 36"

Father and Son Time

"Dad, I wanna do some Oil Painting of this over my Spring break." - got a message from my son Bhuvan, last Sunday, a day before he was scheduled to fly from Detroit to Boston for a 5-day Spring break, coming home. Along with the message, he sent me a picture of American Football player - Seahawks team  Quarterback, Geno Smith.

"Sure Boo babu, I will teach you.", I replied.

I was looking forward to the moment. He arrived Monday night. Tuesday morning he wanted to start his very first Oil Painting. Of course, he watched me several times doing Oil Paintings.

Day-1, Tuesday

All my Art material, framed paintings, blank canvases were still inside boxes in the basement in our new house we moved into 2 months ago. I took a 30 minute break after my morning meetings to open up the boxes, finding all required for him to start painting. I was able to locate and find all needed.

In the afternoon break, I quickly showed him on a canvas size newsprint paper, how to start sketching with a pencil, then outlining with a single Oil Paint, and then start underpainting. I even showed him how to hold the brush for an ease of hand movements. Bhuvan has been a keen observer right from his childhood. He picked up all in no time and then get going all by himself.

His underpainting looked very good in just one color of some brown shade. He followed all what I said identifying 3 different areas of light: leaving white canvas in the lighter areas, covering dark areas with paint, and covering light areas with lighter shade of the same color. He was on the right track.

Day-2, Wednesday

He asked me about how to proceed with the next steps. I explained him how to choose colors, mix colors on the palette, start painting the first abstract layer. He continued along the path.

Day-3, Saturday

Two days he didn't touch it, and as he was leaving Sunday morning, he was determined to finish it on Saturday afternoon. He focused on details, changed background the way he was visualizing the finished painting. He was on a mission that afternoon to complete. Indeed he finished and signed. He was so happy of his accomplishment at the end; took lot of pictures with it.

He came to me after dinner and shared his most happy moment, saying- "Dad, do you know that I posted this painting on Instagram and tagged "Geno Smith" and he liked it.", showing me that. I know that a sports star responding to an unknown fan's post/story on social media is a defined moment. I was extremely happy for Bhuvan.

Carrying forward the Legacy...

Kids watch us very closely, learn, and follow. I still remember the only one incident of my Dad doing an art work of "Swami Vivekananda" that I watched a little bit when I was 6 years old. That was a "defining moment" which put me on my Art journey with a life-long passion for it.

I am quite happy that my son started getting back onto his early developed childhood Art sense. Once you feel the "kick" of how satisfied you will be from your creation, you want to experience it again and again. That's an amazing feeling in any Art!

For me, it took 3 months to finish my very first oil painting. Bhuvan did it in just 3 days, working few hours each day. Also, it's big in size, 2 feet x 3 feet. I did not have any master to learn from. That's the difference. Learning from a master is like learning years of his experience in just a very short-time. One must be lucky to have this kind of opportunity. I am lucky to have my Son learning years of my experience.

I am with an amazing feeling now - my soul lives longer with my Son in his first Oil Painting, a first of it's kind experience.

"When my Son carries my legacy, I extend my life."
~ Giridhar Pottepalem


Saturday, November 19, 2022

ఇప్పటికీ, ఎప్పటికీ వేధించే సమాధానం లేని ప్రశ్న...


కొత్త బడి, కొత్త ప్రదేశం, కొత్త మిత్రులు, కొత్త టీచర్స్, కొత్త ఆహారపు రుచులు, కొత్త ఆటలు, కొత్త అనుభవాలు...ఇలా 9 యేళ్ళ ప్రాయానికి "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం" లో 5 వ తరగతి చేరేసరికి ఒక్కసారిగా అన్ని మార్పులు...కలిసి ఒకరకంగా జీవితం రుచి చూడకముందే మళ్ళీ కొత్త జీవనం. ప్రతిరోజూ పొద్దున 5 నుంచి రాత్రి 9:30 వరకూ అంతా కొత్త కి అలవాటుపడేసరికి ఒక సంవత్సరం తెలీకుండానే కొత్తగా గడచిపోయింది.

5 వ తరగతి క్వార్టర్లీ పరిక్షల్లో 36 మంది ఉన్న క్లాస్ లో నా ర్యాంక్ 20. దసరా శలవులనుంచి స్కూలుకి తిరిగి  వచ్చాక, పరీక్షల్లో ర్యాంకులిస్తారని, ఆ వివరాలు ప్రోగ్రెస్ కార్డ్ రూపంలో ఇళ్లకు పంపిస్తారని తెలిసింది. నాన్న రాసిన ఉత్తరం లో "మీ స్కూల్ నుంచి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. మీ క్లాస్ లో నీ ర్యాంక్ 20, ఈసారి పరీక్షల్లో బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి." అని చూసేదాకా ఎంత వెనకున్నానో కూడా అర్ధం కాని వయసు. హాఫియర్లీ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ కోసం పెద్దగా కృషి చేసింది లేదు. కొంచెం మెరుగయ్యి 18 ర్యాంక్ కి చేరాను. యాన్యువల్ పరిక్షలు రాసి వేసవి శలవులకి ఇంటికెళ్తే నాన్న గొంతు క్యాన్సర్ చికిత్సతో "మద్రాస్ విజయా నర్సింగ్ హోమ్" లో ఉన్నాడు. ఒకరోజు తాతయ్య నన్నూ అన్ననూ రైల్లో తీసుకెళ్తే కందుకూరు నుంచి మద్రాస్ వెళ్ళి ఒక్కరోజు ఉండి చూసి వచ్చాము. 

వేసవి శలవులు ముగిశాక, 6 వ తరగతి మొదటి రోజు మొదటి పీరియడ్ తెలుగు. క్లాస్ రూమ్ మారింది, సైన్స్ ల్యాబ్ దగ్గరుండేది. తెలుగు మాష్టారూ మారారు. వరుసకి నలుగురు చొప్పున రెండు వరుసల్లో అందరం రోల్ నంబర్స్ ప్రకారం కూర్చునేవాళ్ళం. నా క్లాస్ రోల్ నంబర్ 4, మొదటి వరసలోనే ఎప్పుడూ. కొత్త తెలుగు మాష్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు సార్. క్లాస్ లో అటెండన్స్ అయ్యాక వరసగా ఒక్కొక్కరినీ లేపి 5 వ క్లాసులో వచ్చిన క్వార్టర్లీ, హాఫియర్లీ, యాన్యువల్ మూడు ర్యాంకులూ చెప్పమన్నారు. నా వంతు వచ్చాక చెప్పాను, క్వార్టర్లీ 20, హాఫియర్లీ 18, యాన్యువల్ 4. మా క్లాస్ లో ఆటూ ఇటుగా మొదటి మూడు ర్యాంకులొచ్చిన ముగ్గురూ మూడు పరీక్షల్లోనూ అవే తెచ్చుకున్నారు. అందరం చెప్పటం అయ్యాక నన్ను లేచి నిలబడమన్నారు. "మీ క్లాస్ లో అందరికన్నా మంచి ర్యాక్ ఎవరు తెచ్చుకున్నరో తెలుసునా, ఈ అబ్బాయి." అంటూ ప్రశంశించారు. అంతేకాదు, "నీ ర్యాంక్ ని ఇలాగే నిలబెట్టుకుని వచ్చే పరీక్షల్లో ఇంకా ముందుకి వెళ్ళటానికి కృషి చెయ్యి." అంటూ ప్రోత్సహించారు కూడా. నాకు అలా ఎందుకన్నారో బోధపడనేలేదు. నాలుగో ర్యాంక్ ఎలా మంచి ర్యాంక్ అవుతుంది, ఒకటి, రెండూ మూడు కదా మంచి ర్యాంకులు అనుకున్నాను. తర్వాత మిత్రుడు పి.వి.రాం ప్రసాద్ చెప్తేకానీ బోధపడలేదు ఎందుకలా అన్నారో.

తర్వాత నాన్న కూడా అలానే మెచ్చుకుంటూ ఉత్తరం రాస్తాడని ఎదురు చూశాను. కానీ అప్పటికే ఉత్తరం రాయలేని స్థితిలో ఉన్నాడని తెలీదు. ఆ సంవత్సరమే సంక్రాంతి శలవుల్లో మమ్మల్ని ఈలోకంలో వదిలి నాన్న  పైలోకాలకెళ్ళిపోయాడు, ఒక సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడి. 

ఆ రోజు తెలుగు సార్ ప్రశంశల స్ఫూర్తితో 6 నుంచి 10 వ తరగతి వరకూ అన్ని పరిక్షల్లో నా ర్యాంక్ ని ఇటుగా నాలుగు కి దగ్గరే నిలుపుకోగలిగాను తప్ప ఎంత ప్రయత్నించినా ఒకటి, రెండు, మూడు...అటు మాత్రం చేరలేకపోయాను. ఎంత కష్టపడ్డా, ఒకటీ రెండు మార్కుల తేడాతో మొదటి ముగ్గురూ అక్కడే ఉంటూ వచ్చేవాళ్ళు. ఒక్కొకసారి మొదటి ముగ్గురిపైన టీచర్స్ ఇంప్రెషన్స్ కూడా అందుకు తోడ్పడుతూ దోహదపడేదేమో.

ఈ 6 వ తరగతి సంఘటనా, తెలుగు మాష్టారూ ఎప్పుడూ గుర్తుకి వస్తూనే ఉంటారు. అప్పటి టీచర్స్ ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక సహజ లక్షణాన్ని గుర్తించి ప్రోత్సహిస్తూ ప్రభావితం చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఒక్కటి మాత్రం అంతుతెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది, ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంది. అసలు  నాకు 4 వ ర్యాంక్ వచ్చిందని నాన్న కి తెలిసిందా, ఆయనున్న పరిస్థితిలో నా ప్రోగ్రెస్ కార్డ్ చూశాడా, చూస్తే మెచ్చుకుంటూ నాకు ఉత్తరం ఎందుకు రాయలేదు, బహుశా అప్పటికి రాయలేని స్థితిలో ఉన్నాడేమో, అని...

కొన్ని ప్రశ్నలకి జీవితంలో సమాధానం దొరకదు, సమాధానం లేని ప్రశ్నలుగానే ఎప్పటికీ మిగిలిపోతాయి...

గిరిధర్ పొట్టేపాళెం
కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం, 1977 - 83, V-X

~~~~ *** ~~~~

Dec 2021, కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ 50 Years Golden Jubilee వేడుకలని పునస్కరించుకుని, ఆ సందర్భంగా మా స్కూల్ తో, మా స్కూల్ లో విద్యార్ధులుగా మాకున్న అనేక తీపి గురుతులనీ, అనుభవాలనీ కలగలిపి ఎప్పటికీ అందరూ హాయిగా చదువుకునేలా ఒక మంచి Coffee Table Book - Souvenir పుస్తకంగా తీసుకు రావాలని నేను Lead తీసుకుని చేసిన ప్రయత్నంలో భాగంగా నా వంతుగా రాసిన నా ఒక తియ్యని అనుభవం. Pandemic, మరియూ ఇతర కారణాలవల్ల ఆ ప్రయత్నం ఆగింది, ఆ పుస్తకం వెలుగు కి నోచుకో(లే)దు.

Thursday, September 29, 2022

కదిలే కాలంతో మోసుకెళ్ళే జ్ఞాపకాలు...

Sep 28, 2009 . . .

ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలిద్దరితోబాటు, ఒక రాగి నాణెం (US one-cent Coin) , కొన్ని నవధాన్యాలు తీసుకుని 7 గంటలకి ముందే కార్ లో బయలుదేరా. ఆరోజు దసరా. కొత్త ఇల్లు ఫౌండేషన్ వేస్తామని బిల్డర్ రెండు రోజుల ముందే చెప్పాడు. ఏదీ ముందుగా అనుకోలేదు. కానీ మంచి రోజూ, దసరా అలా కలిసొచ్చాయి. దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాం. కష్టపడి స్వయం సంపాదనతో కట్టుకున్న మొదటి ఇల్లు, 9, 7 ఏళ్ళ పిల్లలు, ఈ ఇంట్లోనే ఆడుతూ, పాడుతూ పెరిగి పెద్దయ్యి రెక్కలొచ్చి కాలేజీలకె(గిరె)ళ్ళిపోయారు.

పిల్లల్తో కలిసి ఇంటా బయటా ఆడిన ఆటలు, చాలా కాలం బ్రేక్ తర్వాత బొమ్మల శ్రీకారం, వారం వారం క్రమం తప్పక కొన్నేళ్ళపాటు ఏకధాటిగా వేసిన వందలకొద్దీ బొమ్మలు, పదకొండేళ్ళు తప్పకుండా ప్రతి సంవత్సరం వినాయకచవితికి మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమలు, ప్రతి బొమ్మలోనూ పెనవేసుకున్న గాలీ, వెలుతురూ, అనుభవం తాలూకు జ్ఞాపకాలూ, జీవితంలోంచి కొందరి వ్యక్తుల నిష్క్రమణా, కొత్త పరిచయాలూ, రెండున్నర సంవత్సరం ఇల్లు కదలనివ్వని కరోనా మహమ్మారి కాలం, ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలతోబాటు కొన్ని చేదు అనుభవాలూ మిగిల్చి పదమూడేళ్ళు వేగంగా కదిలి ముందుకెళ్ళిపోయింది కాలం.

Sep 28, 2022 . . .

ప్రతి ఆదికీ తుది తప్పకుండా ఉంటుంది, అది ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది. సరిగ్గా పదమూడేళ్ళ తర్వాత అదే Sep 28, 2022 రోజు మా ఇంటితో అనుబంధం చివరి రోజు. అంతా యాదృచికమే. ముందుగా అనుకున్నదేమీ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం, కాలం తయారుచేసిన ప్రణాళికలానే అనిపిస్తూ ఆశ్చర్యం. ఎప్పుడెలా ఏం జరగాలన్నది కాలనిర్ణయమేనేమో, కాలమహత్యం అంటే ఇదేనేమో! 

కష్టపడి నిర్మించుకున్న గూడయినా, ఎంచుకున్న బంధమయినా, పెంచుకున్న అనుబంధమయినా వీడి వెళ్లటం కష్టమే. తప్పనపుడు వెళ్తూ తీసుకెళ్ళేది మాత్రం జ్ఞాపకాల్నే.

"కదిలే కాలంతో ప్రయాణించే జీవితం ఎక్కడికైనా, ఎప్పటికైనా మోసుకెళ్ళేది మాత్రం ఒక్క జ్ఞాపకాల్నే."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~~~ ** ~~~~

ఫౌండేషన్ - దసరా ఉదయం, Sep 28, 2009

Framing in progress, Oct 2009

Framing done, Nov 2009

Outside construction, pretty much done, Dec 2009

గృహప్రవేశం, Apr 2010

గృహప్రవేశం, Apr 2010

గృహప్రవేశం, Apr 2010

Good Bye, Sep 28, 2022, 7:20 PM

Monday, September 5, 2022

To a Teacher up in Heavens...

 
Right most sitting in the school photo was my Dad at the
High School, Sullurpet,  Nellore, AP, India

"My Father was my first and best Teacher".

With the best hand-writing I have ever seen and the very best Artistic skills, my Dad was a Teacher by profession. I only had watched him closely before I was 9 years old. At that age, I used to say to myself, when I grow up, I want to write and draw like my father does. Also, the concern he showed for poor kids was something touched me deep.

God neither gave me an opportunity to be his student, nor to wish him a "Happy Teachers Day".

From earth, I wish my Dad up in heavens a "HAPPY TEACHERS DAY" who is guiding and blessing me all my life invisibly.

HAPPY TEACHERS DAY! 💐💐

Thursday, August 4, 2022

"యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం" in Newspaper...

Facebook లో నా "యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం..." చదివి చాలా మంది స్పందించారు. ఇది Telugu Newspaper లో యధాతదంగా ప్రచురితం చేసిన Gonugunta Kalyan గారికి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ... 🙏


Sunday, July 31, 2022

యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం...

ఈ భూమ్మీదపడ్డాక చుట్టూ ఉన్న మనుషులనీ, ప్రదేశాలనీ గ్రహించి గమనించగలిగే శక్తి కొన్నేళ్ళకి కానీ మనిషికి రాదు. ఒకటి రెండేళ్ళకే ఆ శక్తి వచ్చినా ఇంకో రెండు మూడేళ్ళు ఎలాంటి జ్ఞాపకాలూ గుర్తులేకుండానే గతంలోకి జారుకుంటాయి. నా గతంలో నాకు గుర్తుండి, నేనెళ్ళగలిగే నా అట్టడుగు జ్ఞాపకాల లోతులు నా మూడేళ్ళ వయసు నాటివి. అప్పుడు నా లోకంలో నాకుంది అమ్మ, నాన్న, బామ్మ, అన్న, చెల్లి. ఆ లోకం పేరు "బుచ్చిరెడ్డిపాళెం". "బుచ్చి" గానే అందరూ పిలిచే ఒక పచ్చని ఊరు, నెల్లూరు జిల్లా లో ఒక మోస్తరు పట్టణం.

అప్పట్లో బడిలో చేరాలంటే ఐదేళ్లు నిండాలి. నన్ను మాత్రం నాలుగేళ్ళకే బడిలో చేర్చారు నాన్న, ఐదేళ్ళ అన్నకి తోడుగా. బడికెళ్లక ముందు ఇంట్లో కొన్ని జ్ఞాపకాలున్నా, బడితోనే మొదలయిన జీవితానుభవాలు ఒక్కొక్కటీ జ్ఞాపకంగా గుండెలోతుల్లో చోటుచేసుకున్నాయి. మా బడి ని "కోనేరు బడి" అని పిలిచేవాళ్ళు. ఊరుకి ఒక చివర ఉన్న పెద్ద "శ్రీ కోదండరామ స్వామి దేవాలయం". ఎదురుగా చాలా పెద్ద కోనేరు. ఆ కోనేరు కి నాలుగు పక్కలా రోడ్డు. ఒక పక్కన రోడ్డుకానుకుని ఒక చిన్న బడి, అక్కడే మొదలయిన జ్ఞాపకాలు. మా ఇంటికెదురుగా ఉన్న రోడ్డెక్కి ఒక కాలు కిలోమీటరు (కాలు అంటే పావు అని) నేరుగా నడుచుకుంటూ వెళితే కోనేరు వస్తుంది. కోనేరంటే గుర్తోచ్చే అప్పటి మా ఇంట్లో నా పేచీ జ్ఞాపకం- అన్నకి ఇష్టమైనది ఏదైనా ఇంట్లో చేస్తే అమ్మతో "నేను నీ పిల్లోడ్ని కాదు, కోనేరు దగ్గర తిరణాల్లో దొరికితే తెచ్చి పెంచుకున్నారు, వాడే నీ పిల్లోడు" అని. ఇప్పుడు తల్చుకుంటే ఆ పసితనం లో "అమ్మ ప్రేమ" అంతా తనకి మాత్రమే దక్కాలని పేచీ పెట్టే పసి హృదయం, ఆ వయసులో లోకం తెలియని అమ్మే లోకం అయిన పిల్లలందరూ ఏ కాలంలో అయినా ఇంతే!

ఇండియా వెళ్ళిన ప్రతిసారీ నేను వెళ్ళాలని ఆరాటపడే ఊరుల్లో "బుచ్చి" ఒకటి. కొన్ని సార్లు వెళ్ళటం కుదిరేది కాదు. కొన్ని సార్లు వెళ్ళినా అన్ని ప్రదేశాలూ చూడలేకపోయేవాడిని. ఈసారి 2022 జనవరి లో మాత్రం చూడాలని ఆరాటపడే ప్రదేశాలన్నీ, కొన్ని దాదాపు 45 ఏళ్ళ తర్వాత మొదటిసారి మనసారా చూసుకున్నాను.

అప్పట్లో "బుచ్చి" లో బాగా ఇష్టమైన ప్రదేశం "బెజవాడ గోపాలరెడ్డి పార్కు". ఊరు మధ్య చాలా అందమైన పార్కు. పచ్చని పచ్చిక, పెద్ద పెద్ద చెట్లు, అశోక చెట్లు కూడ, అక్కడక్కడా మంచి నీళ్ళ కుళాయిలు, పెద్ద మెయిన్ గేటు, పార్కు మధ్యలో పెద్ద కొండ, కొండ కింద నీటికొలను, కొలనులో కాలు ముసలి నోటికి చిక్కి తొండం పైకెత్తి మొరపెట్టుకుంటున్న ఏనుగు, మొర ఆలకించి చేతిలో చక్రం తో కొండ మీద ప్రత్యక్షమైన విష్ణు మూర్తి. "గజేంద్ర మోక్షం" కథ ని కళ్లముందు అద్భుతంగా ఆవిష్కరించన వైనం ఎదురుగా, దూరంగా కట్టిన స్టేజి, ఆపైన కట్టిన మైకు సెట్టు, వెనుక ఎత్తైన స్థంభం పై పార్కు మూసే వేళ మోగే సైరను తో సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఆ పార్కుకి నేనూ అన్నా నాన్నతో కలిసి వెళ్ళి ఆడుకున్న చాలా చల్లని సాయంత్రాలు ఇప్పటికీ నిన్ననే అన్నంత స్పష్టంగా గుర్తున్నాయి.

కోనేరు బడిలో ఒకటవ తరగతి, రెండవ తరగతి కొద్ది నెలలూ చదివాను. బడి మెట్లమీద ఇంటర్వల్ లో చిన్న చిన్న సీసాల్లో పొప్పరమిట్లు (పిప్పరమెట్లు), జీడి ఉండలు అమ్ముకునే ఒక అవ్వ మాత్రం జ్ఞాపకాల్లో ఇంకా గుర్తుంది. ఇంకా బాగా గుర్తున్న ఒక సంఘటన, ఇప్పటికీ నేనూ అన్నా తరచూ తలచుకుంటూనే ఉంటాం - ఒక చాలా బీద విద్యార్ధి చిరిగి పోయిన చొక్కా, చెడ్డీ మాసి చెరిగిన తలతో మా క్లాస్ లో ఉండేవాడు. గుడ్డలకి కూడా నోచుకోలేనంత బీద పిల్లలు ఉంటారని అప్పుడే అర్ధం అయ్యింది. ఒకరోజు ఆ విషయం అన్నా, నేనూ ఇంటికొచ్చి నాన్న కి చెప్పాం. తర్వాతి రోజు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకుని రమ్మని నాన్న చెప్పటంతో లంచ్ టైమ్ లో తీసుకొచ్చాం. ఆ అబ్బాయికి మాతోనే ఇంట్లో భోజనం పెట్టించి, మా బట్టలు ఒక రెండు జతలు ఇచ్చి, నూనె పెట్టించి తల దువ్వించి ఆ అబ్బాయిని మాతో బడికి నాన్న పంపారు. అపుడెంతగానో సంతోషించిన మా మనసుల ఆ అనుభవం ఇప్పటికీ మదిలో పదిలమే.

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగేవి. రథోత్సవం, ఇంకా కోనేరులో తెప్ప ఉత్సవం కూడా జరిగేది. ఒక పడవలో దేవుని విగ్రహాలు పెట్టి కోనేరు నీళ్ళల్లో అంతా ఊరేగించేవాళ్ళు. ఒక సంవత్సరం మాత్రమే చీకటి పడే సాయంత్రం వెళ్ళి ఆ తిరునాళ్ళ  సంబరాలు చూసిన గుర్తు. అప్పుడు రోడ్డు పక్కన రంగురంగుల ఆట బొమ్మలు, ఆట వస్తువులు అమ్మే చిన్న చిన్న అంగళ్ళు వెలిసేవి. మామూలుగా ఆ తిరునాళ్ళలో దొరికే కొన్ని ఆట వస్తువులూ, బొమ్మలు తర్వాత కావాలంటే ఎక్కడ వెతికినా దొరకవు. "నక్కలోళ్ళు" అనేవాళ్ళు అవి అమ్మేవాళ్లని. చాలావరకు వాళ్ళు చేత్తో తయారు చేసి తెచ్చి అమ్మేవే అవన్నీ. పిల్లల్ని ఆకట్టుకునే పసుపు, పచ్చ, రోజా, ఎరుపు, బులుగు రంగుల్లో చాలా ఇంపుగా ఉండేవి. చాలా ఆట వస్తువులు వెదురు పుల్లల్తో, లేదా ప్లాస్టిక్ తో చేసి ఉండేవి. ఆ తిరునాళ్ళ లో నాకు కొనిచ్చిన నాకమితంగా నచ్చిన ఒక ఆట వస్తువు - చక్రం. రెండు వేళ్ళతో పట్టి తిప్పి వదిలితే భూచక్రంలా నున్నటి గచ్చుపై ఏకబిగిన చాలా సేపు తిరిగేది. ఆ చక్రంతో సెట్టుగా సన్నని స్టీల్ రేకు తో చేసిన చేప, కప్ప, పాము, గద్ద లాంటి ఫ్లాట్ గా ఉండే పలుచని చిన్న చిన్న బొమ్మలు. ప్రతి బొమ్మకీ ఒక చిన్న సూది తో పొడిచినట్టు మధ్యలో ఒక డాట్ లాంటి నొక్కు ఉండేది. చక్రం తిరిగేప్పుడు ఆ చక్రం మొన కిందకి మెల్లిగా తోస్తూ జరిపి ఏదైనా ఆ బొమ్మ నొక్కు లో చక్రం మొన ఉండేలా చేస్తే ఆ చక్రం తో బాటు నేలపై ఆ బొమ్మ చాలా తమాషాగా కదలాడేది. మ్యాజిక్ ఏంటంటే చేప కదలికలు అచ్చం చేపలానే ఉండేవి, గద్ద అయినా, కప్ప అయినా అంతే, అచ్చం వాటిలానే. అది చాలా వండర్ లా అనిపించేది. ఆ చక్రంతో అలా ఎన్ని గంటలు ఆడి ఉంటానో నాకే తెలీదు. తర్వాతి సంవత్సరం పక్కనే మా ఊరు "దామరమడుగు" కి ఫ్యామిలీ వెళ్ళిపోయాం. అప్పుడు నాన్న కట్టిన మా కొత్తింట్లో గచ్చు చాలా నున్నగా ఉండేది, ఆ ఇంట్లోనూ వాటితో ఆడిన గుర్తులున్నాయి. ఆడి ఆడి ఇరిగిపోగా, మళ్ళీ అలాంటి బొమ్మలు కొనాలని అమ్మనీ బామ్మనీ చాలా సార్లు అడిగేవాడిని. ఎక్కడా దొరకలేదు. ఆ కోరిక ఇప్పటికీ కోరికగానే మిగిలిపోయింది. ఇక తీరదు. "బుచ్చి" అంటే గుర్తుకొచ్చే ఒక తియ్యని జ్ఞాపకం ఇది.

ఇంకా అందరం కలిసి సాయంత్రం నడచుకుంటూ వెళ్ళి "గిరిజా టాకీస్", "మమోలా మహల్" లో చూసిన "దసరా బుల్లోడు", "బుల్లెమ్మ బుల్లోడు", "ఇద్దరు అమ్మాయిలు" లాంటి సినిమాలు, రేడియోల్లో తరచూ విన్న "ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో ఆనందం నిండెనులే...", "నీ పాపం పండెను నేడూ నీ భరతం పడతా చూడు...", "కురిసింది వానా నా గుండెలోనా...", "నల్లవాడే అమ్మమ్మొ అల్లరిపిల్లవాడే...", "చేతిలో చెయ్యేసి చెప్పు రాధా..." పాటలు ఇప్పుడు చూసినా విన్నా అప్పటి జ్ఞాపకాల తరంగాలు తియ్యగా వచ్చి మదిని తాకుతూనే ఉంటాయి. 

ఇంటి కి ఆనుకునే ఉన్న వరిచేలూ, ఆ పక్కన కనిపించే పిల్ల కాలువ మల్దేవు, అది దాటి పార్కు మీదుగా వెళితే నాన్న పనిచేసిన పెద్ద హైస్కూలు, మెయిన్ రోడ్డు దగ్గర ఉండే అరటి పళ్ళు, స్వీట్స్ బళ్ళూ ఇవన్నీ నా చిన్ననాటి "బుచ్చిరెడ్డిపాళెం" చెరగని గురుతులు.

అన్నిటి కన్నా తియ్యనైన గురుతులు మాత్రం చల్లని సాతంత్రం స్కూలు నుంచి నాన్న వచ్చాక నాన్నతో కలిసి "బెజవాడ గోపాలరెడ్డి పార్కు" కెళ్ళి గడిపిన కొన్ని సాయంత్రాలు. చల్లని పైరగాలికి రయ్యిమంటూ దూసుకెళ్ళే తురిమెళ్ల బస్సెక్కి నెల్లూరు కి చేసిన ప్రయాణాలు, ఒకటి రెండు సార్లు నాన్న తో వెళ్ళి చూసిన నాన్న టీచరు గా పనిచేస్తున్న DLNR (దొడ్ల లక్ష్మినరసింహారెడ్డి) గవర్నమెంట్ హైస్కూలు".

నాన్నతో గడిపిన ఆ కొద్ది కాలం...
మదిలో గడచిన చెరగని మధురం!!

అప్పుడే కాదు ఇప్పుడూ "బుచ్చి" అలా పచ్చగానే ఉంది, ఎప్పటికీ అలానే ఉంటుంది. అది "బుచ్చి" ప్రత్యేకత!

"కదిలే కాలంతో కదలక ఆగిపోయే జ్ఞాపకాలే జీవితం."
- గిరిధర్ పొట్టేపాళెం

~~~~~ o o o o ~~~~

యాబైఏళ్ళ క్రితం మేమున్న ఇల్లు ఇప్పటి మొండి గోడలు
ఇంకా నాకోసమేనా అన్నట్టుండటం విశేషం

ఇంటి పక్కన కోనేరుకి వెళ్ళే రోడ్డు..
చెట్ల వెనక ఇరువైపులా ఇప్పటికీ ఉన్న అప్పటి  పెద్ద బంగళాలు

రోడ్డు పక్కన అప్పటి ఒక బంగళా

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - గాలిగోపురం
100 అడుగులతో రాష్ట్రంలోనే రెండవ ఎత్తైన గోపురం

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - లోపల విశాలమైన ఆలయం

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - గోపుర శిల్పాలు

ఆలయ ముఖద్వారం - అప్పుడేసిన బుడి బుడి అడుగుల్లో ఇప్పటి నేను

కోనేరు - ఈ పిక్చర్ లో కుడివైపున రోడ్డు మీదే మా బడి ఉండేది

ఆలయం వెలుపల పక్కన మండపం, స్టేజి

ఆలయ విశిష్టత తెలుపుతూ ఇప్పటి బోర్డ్

నాన్న టీచర్ గా పనిచేసిన హైస్కూల్ ఇప్పటికీ అలానే ఉంది

"పచ్చని బుచ్చి" చుట్టుపక్కల వరి పొలాలు

Saturday, June 18, 2022

కన్నీళ్ళలోనే కనిపిస్తూ కరిగిపోయే "నాన్న" జ్ఞాపకాలు...

 
🌹 "నాన్న" 🌹

"బస్ స్టాండ్" లో శబ్ధాలకి బస్సులో మెలకువొచ్చింది. బహుశా ఉదయం 10 గంటల సమయం. ఎక్కడున్నానో తెలుసుకోటానికి కొన్ని క్షణాలు పట్టింది. నాన్న ఒళ్ళో పడుకున్నా. పక్క సీట్ లో నాన్న లేడు, బస్సాగితే దిగుంటాడు. ఒకవేళ నాన్న వచ్చేలోపు బస్సు కదిలెళ్ళిపోతే, భయంతో అటూ ఇటూ బస్సు విండోలోంచి చూస్తూనే ధైర్యం చేసి లేచి ఒకసారి బస్సు డోర్ దాకా వెళ్ళి తొంగి చూసి కూడా వచ్చా. దిగే ధైర్యం మాత్రం లేదు, బస్సెళ్ళిపోతే, లేదా సీట్ లో ఇంకెవరైనా కూర్చుంటే. కాసేపటికి నాన్నొచ్చాడు, జామకాయలు, అరటిపళ్ళు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని. మనసు కుదుటపడింది. కానీ రాగానే నన్ను ఇదివరకు బస్ స్టాప్ లో అడిగిన మాటే మళ్ళీ అడిగాడు. "నేను చెప్తా డ్రైవర్ కీ, కండక్టర్ కీ, నిన్ను జాగ్రత్తగా స్కూలు దగ్గర దించమని, ఏం భయం లేదు, ఒక్కడివే వెళ్ళగలవు, నేను దిగి వెనక్కి "కావలి" కెళ్ళనా" అని. మళ్ళీ గుండె గుభేలున ఏడుపు "అమ్మో నాకు భయం, నేనొక్కడినే పోలేను" అంటూ. అప్పటిదాకా అలా బస్సాగిన ప్రతిదగ్గరా అడుగుతూనే ఉన్నాడు, పాపం అనుకోకుండా నన్ను స్కూలు దాకా దిగబెట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పట్లో ఫోన్లు లేవు. నాన్న "కావలి బోయ్స్ హైస్కూల్" లో 9, 10 తరగతులకి "ఇంగ్లీష్" & "సోషల్ స్టడీస్" సబ్జక్ట్స్ టీచర్. రెండ్రోజులు స్కూల్ లో ముందు లీవ్ కి పర్మిషన్ తీసుకునే అవకాశం లేకుండా వెళ్ళాల్సివచ్చిన పరిస్థితి, నా స్కూల్ ప్రయాణంతో. నాన్న టెన్షన్స్ గ్రహిచేంత తెలివిగల వయసు రాలా నాకప్పటికింకా.

అప్పుడు నాకు 9 ఏళ్ళు. బస్సాగింది "మదనపల్లి" లో అని తెలిసింది. అప్పట్లో చాలా ఊర్లల్లో బస్ స్టాండ్ అంటే ఊరి మధ్యలో రోడ్డు పక్కన చిన్న మైదానం. గుంటలూ, నీళ్ళూ, చెత్తా-చెదారం తో చుట్టూ చిన్న చిన్న అంగళ్ళు, ఆగ్గానే బస్సు చుట్టూ పరిగెత్తి వచ్చే పళ్ళు, సోడాలు, రకరకాల లోకల్ మిఠాయిలు అమ్ముకొంటూ జీవించే వాళ్ళు...అంతే! ఊరిగుండా వచ్చేపోయే బస్సులు ఆ మైదానంలో వచ్చి కాసేపాగి వెళ్తాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా అక్కడే. ఏవైనా వివరాలు కావాలంటే ఆ అంగళ్ళలోనే అడగాలి. "తిరుపతి" నుంచి "హిందూపురం" దాటి అక్కడి నుండి 3 కి.మీ "సేవామందిరం" పక్కన ఉండే మా స్కూల్ మీదుగా "కర్ణాటక రాష్ట్రం" లో "చిత్రదుర్గ" కి వెళ్ళే బస్ లో ఉన్నాం. "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5 వ క్లాస్ చేరిన సంవత్సరం మొదటి దసరా శలవులకి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్ కి వెళ్తూ నేను, నన్ను తీసుకెళ్తూ నాన్న.

నిజానికి ఒక 8 వ తరగతి సీనియర్ ఫ్రెండ్ "ఆనంద్" ని వాళ్ళ నాన్న మా "కావలి" దగ్గరే "బిట్రగుంట" నుంచి మా స్కూల్ కి తీసుకెళ్తుంటే నన్ను  వాళ్ళతో జతచేసి పంపుతూ ముందుగానే వాళ్ళని కలిసి మాట్లాడి అన్నీ సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేశాడు నాన్న. అనుకున్న ప్రకారం మేము "కావలి" లో ఫలానా రైలెక్కి "బిట్రగుంట" స్టేషన్ లో అదే ఫలానా రైలెక్కే వాళ్లని కలవాలి. నాన్న "నెల్లూరు" లో దిగిపోయి వెనక్కి "కావలి" వెళ్లాలి, వాళ్ళతో కలిసి నేను "తిరుపతి" వెళ్ళి, అక్కడి నుంచి "వెంకటాద్రి ట్రెయిన్" లో "హిందూపూర్" వెళ్ళి, అక్కడి నుండి స్కూల్ కి వెళ్లాలి, ఇదీ ప్లాన్. అనుకున్న రైలెక్కి "బిట్రగుంట" లో చూశాం, వాళ్ళు కనబడలా. నాన్నకి "నెల్లూరు" దాకే టికెట్ ఉంది. నాకేమో "తిరుపతి" దాకా ఉంది. నెల్లూరులోనూ దిగి చూశాం, ఆ రైల్లో ఎక్కడా కనబడలా. పాపం "దామరమడుగు" నుంచి "బామ్మ" కూడా వచ్చింది "నెల్లూరు" స్టేషన్ కి, నాన్ననీ కలిసి ఆ రెండు నిమిషాలు నన్ను చూడాలని. అప్పుడు ఉత్తరాలు, నోటి మాట తప్ప మరే కమ్యూనికేషన్ సాధనాలూ లేవు. అయినా ముందుగా అనుకుంటే, ఎక్కడా ఎవ్వరూ ఎవ్వర్నీ మిస్ అయ్యేవాళ్ళే కాదు. ఎక్కడ ఏ రోజు ఏ టైమ్ కి అనుకుంటే ఆ టైమ్ కి అక్కడ సరిగ్గా కలిసేవాళ్ళు. ట్రెయిన్ ఆగింది కొద్ది నిమిషాలే. అటూ ఇటూ పరిగెత్తినా లాభం లేదు, ఎంత వెదికినా వాళ్ళ జాడ లేదు. తర్వాత అక్కడే ఉండి అట్నుంచి వచ్చే మరికొన్ని  రైళ్లకోసం వేచి, రాగానే వెదికి చూశాం, వాళ్ళు కనిపించలా. మధ్యాహ్నం దాటే దాకా అలా అన్ని రైళ్ళకోసం ఉన్నాం, ఇక ఎలాగో మిస్ అయ్యారనర్ధమైంది. 

ఇద్దరికీ "హిందూపురం" దాకా పోనూ, నాన్న కి రానూ టికెట్స్ కి నాన్న దగ్గర డబ్బులు లేవు. అప్పటికి బ్యాంక్ లే అంతంతమాత్రం. ATM లు కనిపెట్టేదాకా మానవుడింకా ఎదగలేదు. ఎక్కడికి బయలుదేరినా ఖర్చు ఉరామరిగ్గా ఎంతో అంతే జేబులో పెట్టుకునేవాళ్ళు. పాపం నాన్నకి ఎప్పుడూ లేని సంకటస్థితొచ్చింది. మళ్ళీ వెనక్కి "కావలి" వెళ్ళి డబ్బులు చూసికుని వెళ్ళాలంటే నాకింకోరోజు స్కూల్ పోతుంది. "నెల్లూరు" లో బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఆ రాత్రికి అక్కడే ఉండాల్సొచ్చింది. రేపు పొద్దున్నే "తిరుపతి" ప్రయాణం. ఆ సాయంత్రం వాళ్ళింటి దగ్గర్లో ఉన్న "శ్రీరామ్ A/C థియేటర్" లో శోభన్ బాబు "గోరింటాకు" సినిమా కి తీసుకెళ్ళాడు, చాలా బాగా గుర్తుంది, నా మొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్ అనుభవం అది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మొట్టమొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్. అప్పట్లో ఆ వయసులో ఆ థియేటర్ లో సినిమా చూస్తే "ఎవరెస్ట్" ఎక్కినంత సంబరంగా ఫ్రెండ్స్ తో గొప్పగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆ అనుభవం అలాంటిదే, ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికీ అప్పటికింకా ఆ అనుభవం సాధ్యంకాలా.

తర్వాతిరోజు పొద్దున్నే టిఫిన్ చేసి బయల్దేరి మధ్యాహ్నానికి "తిరుపతి" చేరుకున్నాం. బస్ స్టాండ్ లో ఎంక్వైరీ చేస్తే "హిందూపురం" నేరుగా వెళ్ళే బస్సు రోజుకి ఒక్కటే, పొద్దున్నే ఉంటుందని చెప్పారు. ఇక డైరెక్ట్ బస్సుల్లేవు. వెళ్ళాలంటే రెండు మూడు బస్సులు పట్టుకుని ఊర్లు మారి వెళ్ళొచ్చు, కానీ చాలా తిప్పలు పడాలి. నాన్న బస్ స్టాండ్ పక్కనే లాడ్జి లో రూమ్ తీసుకున్నాడు. ఇంకా గుర్తే, మధ్యాహ్నం పక్కనే రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళి ఎంక్వైరీ లో చాలా వివరాలు అడిగాడు ట్రెయిన్స్ గురించి కూడా. కానీ రూమ్ తీసేసుకున్నాం. ఇలా సందిగ్ధాల మధ్య ఎక్కడ భోజనం చేశామో మాత్రం నాకు గుర్తు లేదు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా అని చెప్పాడు. సంతోషానికి అవధుల్లేవు, నా ఫ్యావరెట్ హీరో కృష్ణ "దొంగలకు దొంగ" రిలీజ్ అయ్యుంది, ఆ సినిమా వాల్ పోస్టర్లే ఎక్కడ చూసినా. ఆ సినిమాకే వెళ్దాం అని పట్టుబట్టాను. అప్పట్లో మనం దేనికైనా ఇంట్లో పట్టుబడితే ఉడుంపట్టే, ఇప్పుడైతే పట్టుబట్టకున్నా పట్టించునే నాధుడే లేడు గానీ ;)  సాయంత్రం రెడీ అయ్యి, టిఫిన్ చేసి "దొంగలకు దొంగ" సినిమా ఆడుతున్న "ప్రతాప్ థియేటర్" కెళ్ళాం. టికెట్ కౌంటర్స్ చాలా రష్ గా ఉన్నాయి, నాన్న చాలా ట్రై చేశాడు, దొరకలా, టికెట్స్ అయిపోయాయని బోర్డ్ తిరగేశారు. దానికానుకునే "మినీ ప్రతాప్ థియేటర్" లో "చిల్లరకొట్టు చిట్టెమ్మ" సినిమా కి టికెట్స్ తీసుకున్నాడు. "దొంగలకు దొంగ" తప్ప ఇంకే సినిమా చూడాలని నాకిష్టంలేదు, కానీ తప్పలేదు. పొద్దున్నే చీకటితో లేచి బస్సు టికెట్స్ కొనే దగ్గరనుంచీ నాన్న బస్సెక్కిస్తే నేనొక్కడ్నే వెళ్లగలను అని నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ససేమిరా పోలేనని ఏడుపే అడిగిన ప్రతిసారీ. కలిసి అలా ఆ బస్సులో మా స్కూలు కి బయల్దేరాం.

"మదనపల్లి" దాటాక ఇంక నాన్న ఒక్కడివే వెళ్ళగలవా అని అడగ లేదు. సాయంత్రం స్కూలు చేరుకున్నాం. ఇంకా కళ్ళకి కట్టినట్టే గుర్తుంది. ఒకరోజు స్కూల్ మిస్ అయ్యాను. సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ గేమ్‌స్ ఆడి వచ్చి డిన్నెర్ కి ముందున్న ఒక గంట బ్రేక్ టైమ్ అది. నా ఫ్రెండ్స్ అందర్నీ పలకరించి పరిచయం చేసుకున్నాడు, తర్వాత వాళ్ళని అడిగానని చెప్పు అంటూ ప్రతి ఉత్తరంలోనూ అందరి పేర్లూ రాసేవాడు. "కావలి" కి దగ్గరలో వేరే ఊర్ల నుంచి ఉన్న ఇద్దరు మా సీనియర్స్ , "గౌరవరం" నుంచి మధుసూధన్ 7 వ క్లాస్, "కావలి" నుంచి "ఫణీంద్ర" 6 వ క్లాస్ వాళ్ళనీ పరిచయం చేసుకుని, నన్ను చూసుకోమనీ చెప్పాడు వాళ్లకి. కొత్తగా మాకు స్కూల్ డార్మిటరీస్ లో ఉండే కాట్ సైజ్ కి సరిపడేట్టు ఆ శలవుల్లో ఇంట్లో మూడ్రోజులు మనిషిని పెట్టి బూరగదూది తో వడికించి, కుట్టించి మాతో తెచ్చిన నా పరుపూ, దుమ్ముకి మాసిపోకుండా ఆ పరుపుకి బాగా ఆలోచించి కుట్టించిన ముదురాకుపచ్చ రంగు ముసుగూ, కాట్ కి ఉండే వస్తువులు పెట్టుకునే డ్రాయర్స్, నా సూట్ కేస్ సర్ది, అన్ని జాగ్రత్తలూ చెప్పాడు. చీకటి పడుతూ ఉంది, డిన్నర్ బెల్లు కొట్టగానే నన్ను డిన్నర్ కి పంపించి తిరిగి వెళ్ళిపోయాడు. పాపం, ఆ టైమ్ లో భోజనంకూడా లేదు, స్కూల్ మెస్ లో అడిగుండొచ్చేమో, కానీ అక్కడ మాకు భోజనం ఫ్రీ, పేరెంట్స్ కి లోపలికి ఎంట్రీ లేదు. అక్కడినుండి "కావలి" దాకా ఆ రాత్రి ఎన్ని తిప్పలో చివరికెలావెళ్ళాడో, ఎప్పుటికి ఇల్లు చేరుకున్నాడో ఆ దేవుడికే తెలియాలి. చేరాక కొద్ది రోజులకి ఉత్తరంలో రాసిన గుర్తు, మా సీనియర్ ఫ్రెండ్ వాళ్ళు అనుకున్న ట్రెయిన్ కాకుండా, ముందు వెళ్ళే ట్రెయిన్ తీసుకున్నారని, పొరబాటు అని తెలియక మాకోసం వాళ్ళూ నెల్లూరు, తిరుపతి స్టేషన్స్ కూడా వెదికారని.

తర్వాత సంక్రాంతి శలవులకి నేను నాన్న ఉత్తరంలో రాసినట్టే మా ఇంకో సీనియర్ "గౌరవరం" 7 వ తరగతి అబ్బాయి "మధుసూధన్ రావు" తో కలిసి వచ్చా. శలవులయ్యాక ఆ అబ్బాయితోనే "గౌరవరం" లో కలిసి "నెల్లూరు" నుంచి బస్ లో నన్ను స్కూల్ కి పంపించాడు నాన్న.

వేసవి శలవులకి కూడా మళ్ళీ నాన్న ఉత్తరంలో వివరంగా రాసినట్టే నా సీనియర్ "మధుసూధన్ రావు", క్లాస్మేట్ "రాజశేఖర్" లతో కలిసి "నెల్లూరు" వచ్చి, "కావలి" బస్సెక్కి ఆ అబ్బాయి "గౌరవం" లోనూ, రాజశేఖర్ "చౌదరిపాళెం" రోడ్డు దగ్గరా దిగిపోతే నేను "కావలి" లో దిగా. దిగి నాన్న చెప్పినట్టే అర్ధరూపాయికే రిక్షా మాట్లాడుకుని నా ఎయిర్ బ్యాగు తో ఇంటిదగ్గర రిక్షా దిగా. ఇల్లు తాళం వేసుంది. ఎవ్వరూ లేరు, నాన్న "మద్రాస్" విజయా నర్సింగ్ హోమ్ లో ఉన్నాడు, ఉత్తరాల్లో రాశాడు నాన్న. ఆరోగ్యం బాలేక మద్రాస్ హాస్పిటల్ లో ఉన్నాడనీ, నేను శలవులకి వచ్చేలోపు వచ్చేస్తాడనీ మాత్రం తెలుసు. "గొంతు క్యాన్సర్" అని తెలీదు, ఒకవేళ తెలిసినా అదేంటో, ఎంత డేంజరో కూడా నాన్న చెప్తేనే తప్ప తెలియని వయసు. ప్రతి విషయమూ వివరంగా రాసే నాన్న, తను హాస్పిటల్ లో ఉన్నట్టు, ఏం భయం లేదని ఉత్తరాల్లో నాకు రాశాడు. నేను "కావలి" ఎవరితో కలిసి రావాలో, ఎలా రావాలో, దిగేముందు బస్సులో ఏమీ మర్చిపోకుండా బస్సు జాగ్రత్తగా దిగి రిక్షా ఎంతకి మాట్లాడుకోవాలో, రిక్షా ఆయనకి ఇంటి అడ్రెస్ ఏమని చెప్పాలో కూడా వివరంగా రాశాడు కానీ వచ్చే సరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరని మాత్రం రాయలేదు. ఎందుకు రాయలేదని నాకు ఆలోచనొచ్చింది, కానీ అడిగే అంత కొద్ది సమయం కూడా నేను తర్వాత నాన్నతో లేను. నేనొచ్చే సమయానికి ఎవరో ఒకరిని ఇంటి దగ్గర ఉండి నన్ను రిసీవ్ చేసుకోమని తప్పకుండా చెప్పే ఉంటాడు, ఎవరో మళ్ళీ మిస్ అయ్యేఉంటారు అని మాత్రం నా మనసుకి ఇప్పటికీ తెలుసు. ఆ శలవులన్నీ "కందుకూరు" లో కాపురం ఉంటూ "మార్కాపూర్" లో "డిప్యూటీ కలెక్టర్" గా పనిజేస్తున్న "తాతయ్య" దగ్గర అన్నతో గడిపాను. ఆ శలవుల్లో ఒకరోజు తాతయ్య మా ఇద్దరినీ "మద్రాసు" తీసుకెళ్ళాడు. "విజయా నర్సింగ్ హోమ్" లో విజిటర్ అవర్స్ లో వెళ్ళి కాసేపు నాన్నని చూసి వచ్చాం, అప్పుడు నన్నేం పలకరించాడో, నాతో ఏం మాట్లాడాడో గుర్తు లేదు. ఉత్తరాల్లో రాసినట్టే "బాగా చదువి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నాకు బాగయిపోతుంది, నా గురించి దిగులు పెట్టుకోవద్దు." అని మాత్రం చెప్పి ఉంటాడు.!

జీవితంలో ఊహ తెలిశాక రెండు రోజులు నేనొక్కడినే పూర్తిగా నాన్నతో గడిపిన క్షణాల సంఘటన అదొక్కటే, ఆ నా స్కూలు ప్రయాణం లో! ఏ దురలటూ లేని, ఎందరికో సాయపడుతూ, ఎంతో ఉన్నత భావాలతో ఎందరికో స్ఫూర్తిగా జీవిస్తూ, ఆ కాలం సమాజ హెచ్చుతగ్గులపై కళ్ళముందు పసిపిల్లలని హేళనగా అవమానిస్తే సహించక, అలా అవమానించే వాళ్ళకి కనువిప్పు కలిగిస్తూ, హైస్కూల్ టీచర్ వృత్తిలో పాఠాలు చెప్తూ ఎందరి విద్యార్ధులనో ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన నాన్నని మానుంచి దూరంగా ఇంకొక్క సంవత్సరంలో తనదగ్గరికి తీసుకెళ్ళిపోవాలని, నాన్న కంఠానికి "గొంతు క్యాన్సర్" కర్కశంగా సృష్టించి, బహుశా అంత కర్కశంలోనూ కొంచెం దయతలిచి నాకా రెండు రోజుల జ్ఞాపకాల్ని మాత్రం అందివ్వాలని సంకల్పించి ఆ పరిస్థితుల్ని కల్పించాడేమో "దేవుడు"! నాకెదురుపడితే ఆ దేవుడి కంఠం మూగబోయేలా నిలేసి గట్టిగా "మా నాన్న జీవితంపై నీ హక్కేంది" అని "ఒకే ఒక్క ప్రశ్న" అడగాలని ఆ చిన్న వయసులో బలంగా అనుకున్నా చాలాసార్లు. అలాటి రోజు ఉండదనీ, రాదనీ అప్పుడు తెలీదు. ఇప్పుడు బాగా తెలుసు, అసలు "దేవుడు కేవలం మానవ సృష్టే" అని.

నాలుగు పదులు కూడా నిండని నాన్న జీవితం లో నేనున్నది పదేళ్ళే. "నాన్న" లేకుండా నాలుగు దశాబ్ధాలు దాటి ముందెకెళ్ళిపోయిన నా జీవితంలో నాన్నని తల్చుకోని రోజు ఒక్కటంటే ఒక్కటైనా లేదు. జీవితమంతా కలల్లోనే, కన్నీళ్ళలోనే కనిపిస్తూ, ఆ కలల్లోనే చెదిరిపోతూ, కన్నీళ్ళలోనే కరిగిపోతూ మదిలో మాత్రం "చెదరని కరగని జ్ఞాపకంగానే" ఎప్పటికీ మిగిలి పోయాడు "నాన్న"...

నిండు జీవితం గడిపి తమ పిల్లల ఉన్నతి చూసిన తల్లిదండ్రులూ, ఆ పిల్లలూ అదృష్టవంతులు!

పిల్లల ఉన్నతి చూసి మురిసిపోతూ వాళ్ళ కళ్ళెదుటే ఉన్న తండ్రులందరికీ -  
"హ్యాపీ ఫాదర్స్ డే!" 🌹🌷🌺

---------- o o o ----------

"చిన్నతనంలోనే తమ తల్లిదండ్రుల్ని దూరం చేసిన దేవుడు,
ఎప్పటికీ ఆ పిల్లల ఎదుట కంటబడ(లే)ని దోషిగా నిలబడిపోతాడు."
- గిరిధర్ పొట్టేపాళెం

Saturday, March 5, 2022

"పిన్ని" - "అమ్మ" తర్వాత అంతటి కమ్మదనం, ఆప్యాయత నింపుకున్న తెలుగు పదం...

నా వాళ్లందరితో చాలా ఏళ్ళ తరువాత నేను జరుపుకున్న
నా పుట్టినరోజు కి "పిన్ని" శుభాకాంక్షలు, 2017

ఊహ తెలిసిన నాటి నుంచీ ఆ పిలుపూ ఆప్యాయతా మాకెంతో దగ్గరగానే ఉన్నాయి, పిన్ని రూపంలో. అప్పుడు నాకు బహుశా ఆరేళ్ళు. అయినా ఇంకా బాగా గుర్తుంది. "చీరాల" లో తాతయ్య తహసిల్దారు (అంటే ఒక తాలూకా కి హెడ్) గా ఉన్నారు. శలవులకి మేము దామరమడుగు నుంచి బయల్దేరి నెల్లూరులో రైలెక్కి సంబరంగా చీరాల చేరాం. "పిన్ని" ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరం కొద్ది గంటలు అటూ ఇటుగా చీరాల చేరుకున్నాం.

ఆ శలవులకి చీరాల చేరినరోజునే మధ్యాహ్నం, ఎప్పుడూ ఆటల్తో చలాకీగా ఉండే నేను కదలకుండా పడుకునే ఉన్నాను. నా వళ్ళు కాలిపోతుండటం చిన్నమామయ్య మొదటిగా గుర్తించాడు. ఇంట్లో అమ్మ, పిన్ని, అమ్మమ్మ, చిన్నమామయ్య, పిల్లలం మాత్రమే ఉన్నాం...ఇంతవరకే గుర్తుంది.

తర్వాతి రోజు కళ్ళుతెరిచి చూస్తే అమ్మ, పిన్ని ఇద్దరితో నేను హాస్పిటల్ లో ఒక రూమ్ లో, గంట గంటకీ వచ్చిపోయే డాక్టర్లు నర్సులు, బెడ్ దిగకూడదు. నాకిష్టం లేని పాలు గడగడా తాగెయ్యాలి, ఇంకెవరైనా అయితే ఈ ఒక్క మాట మాత్రం అస్సలు వినేవాడిని కాదు. కానీ చెప్పింది "పిన్ని". కాబట్టే గడగడా తాగేసేవాడిని. నాకు టైఫాయిడ్ జ్వరం అనీ, ఒక పదీఇరవై రోజులు చెప్పినట్టు వింటే తగ్గిపోయి ఇంటికెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చనీ "పిన్ని" చెప్తేనే తెలిసింది.

అప్పుడు అమ్మతో అన్నిరోజులూ అక్కడ మాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ త్వరగా కోలుకునేలా చూసుకుంది "పిన్ని". తర్వాత తెలిసింది నేను స్పృహలేకుండా వళ్ళు కాలిపోతూ పడుకుని మన స్మారకంలో లేకుండా ఉంటే అమ్మ ఏడుస్తూ దేవుడింట్లోకెళ్ళి పడిపోయిందని, అప్పుడు "పిన్ని" ఒక్కటే ధైర్యంగా పరుగున నన్ను భుజాన వేసుకుని ఇంట్లో ఉన్న ఒక జవాన్ (అప్పట్లో కనీసం ఒకరిద్దరు బంట్రోతులు తహసిల్దారు ఇంట్లో విధిగా రోజూ ఉండేవారు, ఏవైనా పనుల సాయంకోసం. ఒక జీప్ కూడా ఉండేది) సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి చేర్చిందని. ఆలశ్యం అయితే ఏమయ్యేదో ఊహకే అందని ఆలోచన అని. నా జ్ఞాపకాల్లో "పిన్ని" తో నా మొట్టమొదటి జ్ఞాపకం ఇదే. తన అక్కకే కే కాదు, మా ఫ్యామిలీ లో అక్కరకురాని ఎవరికి ఏ ఆపద వచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడేది "పిన్ని".

నాన్న పోయాక, నెల్లూరు లో ఉంటున్న "పిన్ని" శలవులకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతో బాగా చూసుకునేది. ఒకసారి పిల్లలనందరినీ రిక్షాల్లో నెల్లూరు , కనకమహల్ లో "రామదండు" సినిమా కి తీసుకెళ్ళింది. అప్పుడు పిల్లలం, మమ్మల్నందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. సినిమా చూసి రిక్షాల్లో ఇంటికి వెళ్తూ మేమూ పిన్ని తో "రామదండు" లోని పిల్లల్లా ఫీల్ అవుతూ సంబరపడిపోయిన ఆ రోజు ఇప్పటికీ కళ్ళకి కట్టిన అందని "అందని జ్ఞాపకమే".

నేను రెసిడెన్షియల్ స్కూల్ నుంచి శలవులకి వచ్చి వెళ్ళేప్పుడు ప్రతిసారీ కావలి నుంచి బస్ దిగి నెల్లూరులో సాయంత్రం పిన్ని దగ్గరికెళ్ళి కాసేపు ఉండి భోజనం చేసి రాత్రి బస్ అనంతపూర్ కి వెళ్ళటం పరిపాటి. ఇలా చాలా సార్లు వెళ్ళిన జ్ఞాపకం. నేను 8 వ తరగతికి వచ్చే సరికి పిన్ని వాళ్ళూ కావలికొచ్చి స్థిరపడిపోయారు. ఇక అప్పటి నుంచీ శలవుల్లో నాలుగైదురోజులకొకసారి పిన్ని దగ్గరికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. శలవుల్లో అందరం కలిసి అప్పుడప్పుడూ "దామరమడుగు" వెళ్ళి "బామ్మ" తో గడిపే వాళ్ళం. అలా "కావలి" లో ఒకే ఊర్లో అందరం కలీసి పెరిగిన జ్ఞాపకాల్లో "పిన్ని" లేని సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 

"పిన్ని" గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ వెనకే ఎక్కువగా గుర్తుకొచ్చే సంఘటన ఒకటి -
నేను "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5th క్లాస్ నుంచి 10th దాకా ఆరేళ్ళు చదివాను. కొంతమంది స్నేహితులకి వాళ్ళ తలిదండ్రులు అప్పుడప్పుడూ వచ్చి, బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చిచ్చి, ఒకపూట ఉండి, అన్నీ చూసుకుని మరీ వెళ్ళేవాళ్ళు. ఆ ఆరేళ్ళలో ఎప్పుడూ ఎవ్వరూ నన్ను చూట్టానికి రాలేదు. నాన్న బ్రతికుంటే ఎన్నోసార్లు తప్పకుండా వచ్చి ఉండేవాడు. అమ్మకి అంత అండదండలు లేవు, అన్న నాకన్నా ఒక్క సంవత్సరమే పెద్ద.

కానీ ఒకరోజు నాకోసం వెతుక్కుని మరీ ఒకాయనొచ్చాడు. ఆయనెవరో నాకు తెలీదు, ఎప్పుడూ చూడనైనాలేదు. అప్పుడు 9th క్లాస్ లో ఉన్నాననుకుంటా. సాయంత్రం గేమ్స్ పీరియడ్ అయ్యాక వాళ్ళనడిగీ వీళ్ళనడిగి నా రూమ్ కనుక్కుని వచ్చి నన్ను కలిశాడు. "నేను నీకు మామయ్యని అవుతాను. పిన్ని పంపింది, చూసి రమ్మని" అని రెండు "క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్" ఇచ్చాడు. నాకు అంతుబట్టలేదు. ఎవరైనా పొరబాటున ఇంకొక పిల్లోడి కోసం వచ్చి నాకిచ్చిపోయాడా ఈయనెవరో నేనెప్పుడూ చూడలేదు అన్న సందేహం ఆయన వెళ్ళాక కూడా ఉండిపోయింది. కానీ తెల్లమొహం వేసుకుని ఉలుకూ పలుకూ లేని నన్ను ఆయన "గిరిధర్ నువ్వేకదా" అని మళ్ళీ అడిగి మరీ ఖచ్చితంగా "నీకోసమే, పిన్ని ఇచ్చి నిన్ను చూసి రమ్మంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. మా స్కూల్ మొత్తానికి నా పేరుతో ఇంకెవ్వరూ లేరు, ఖచ్చితంగా నేనే. కానీ ఎక్కడో ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో హిందూపురం దగ్గర ఒక మారుమూల పల్లెటూరు పక్కన "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూలు". ఆ పేరింటేనే అలాంటి పేరుతో ఒక ఊరుంటుందా అన్న సందేహమే తప్ప దారి కనుక్కోవటమే కష్టం ఆరోజుల్లో. అసలు ఈ స్కూలు కి "కావలి" నుంచి ఎలా రావాలో తెలుసుకుని రావటం కూడా కష్టమే. ఇంత దూరం "పిన్ని" ఈయనెవర్నో ఎందుకు పంపుతుంది, ఆ ఏమోలే, అని నాలుగు రోజులు ఆ "క్రీమ్ బిస్కెట్లు" తినే సంతోషంలో ఉండిపోయాను. ఆరోజుల్లో జాబుజవాబులే కమ్యూనికేషన్. శలవులకి ఇంటికెళ్ళాక "పిన్ని" గుర్తుచేసింది ఆ విషయం. అప్పుడు అర్ధం అయ్యింది, నాకు తెలియని ఒక బంధువు పనిమీద "అనంతపురం" దగ్గరికి వెళ్తుంటే చూసి రమ్మని "పిన్ని" చెప్పిందనీ, వెళ్తూ "బిస్కెట్ ప్యాకెట్స్" తీసుకుని వెళ్ళమని మరీ చెప్పి పంపిందనీ. ఆ సంఘటన శిలపై చెక్కిన చెరగని గుర్తుగా నా పసిమనసు పై ముద్రపడిపోయింది. అన్నేళ్ళు దూరంగా ఉన్న నా దగ్గరికి ఒక్కరు చూట్టానికి వచ్చారు, ఆ ఒక్కరూ "పిన్ని" పంపితేనే అని. అప్పట్లో మామూలు బిస్కెట్లే అమృతంకన్నా మిన్న, ఇక "క్రీమ్ బిస్కెట్లు" అంటే అది దేవతలకి దక్కిన అమృతం కన్నా ఎక్కువే, దక్కనిదింకేదో. అది నాకు దక్కించింది మా "పిన్ని".

ఒకసారి ఇంజనీరింగ్ చేస్తున్నపుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి "తిరుపతి" లో. చూసుకుని  వెనక్కి "విజయవాడ" వెళ్తూ, అప్పటికప్పుడు అనుకుని "కావలి" లో ముగ్గురు ఫ్రెండ్స్ తో దిగిపోయాను, వాళ్ళకి మా ఊరుని, మా ఇంటినీ, అమ్మనీ, అన్ననీ పరిచయం చెయ్యాలని. ఇలాంటపుడు అమ్మకి "పిన్ని" నే కొండంత అండ. ఆ రెండ్రోజులూ వచ్చి అమ్మకి అండగా ఉండి, మాకు వంటలూ, వడ్డింపులూ చేసి వెళ్ళింది. 

ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి అయ్యాక జాబ్ కోసం "హైదరాబాద్" వచ్చాను. అప్పట్లో "కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్" కి సరయిన జాబ్స్ లేవు. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరికి అప్పుడే ఏదో ఒక జాబ్ వచ్చేసింది. రెండు నెలల కృషి, అయినా జాబ్ రాలా. ఒకరోజు దిగులుగా ఇంటికి ఉత్తరం రాశాను. దానికి జవాబుగా వచ్చిన ఉత్తరం నన్నెంతో ఉత్సాహపరిచింది. అది రాసింది "పిన్ని". "గిరీ నువ్వెళ్ళి రెండు నెలలు కూడా కాలేదు, నీకప్పుడే ఏం వయసయిపోయిందని రా జాబ్ కోసం అంతగా దిగులు పడుతున్నావ్. తప్పకుండా వస్తుంది, త్వరలోనే, ధైర్యంగా కృషి చెయ్యి." అంటూ రాసింది. ఆ ఉత్తరం కొండంత ధైర్యాన్నిచ్చింది. తర్వాత ఒక నెల లోపే మొదటి జాబ్ లో జాయిన్ అయ్యాను. "పిన్ని" రాసిన ఆ "ఒకే ఒక్క ఉత్తరం" ఎప్పటికీ మరచిపోలేను.

నా పెళ్ళికి దగ్గరుండి నలుగు పెట్టి నన్ను పెళ్ళికొడుకుని చేసింది మా "పిన్ని".

తర్వాత అమెరికా వచ్చి స్థిరపడిపోయాను. "పిన్ని" కూడా కొన్నేళ్ళు తన కూతురు "ఇందు" దగ్గర "కాలిఫోర్నియా" లో ఉండేది. ఒకసారి అందరూ "బోస్టన్" లో మా ఇంటికొచ్చి కొద్దిరోజులుండి వెళ్ళారు. అప్పుడు మొదటి డిన్నెర్ కి, వచ్చేముందే ఒక కూర మాత్రం నేనే చేశాను, "చికెన్ ఫ్రై". భోజనం దగ్గర "పిన్ని" కి చిన్న పజిల్ విసిరాను. "ఉన్న కూరలన్నింటిలో ఒక్క కూర నేను చేశా పిన్నీ, ఏదో చెప్పుకో చూద్దాం, నువు చెప్పలేవు" అని. మరీ అంత నిఖ్ఖచ్చిగా అడిగే సరికి తప్పు పోకూడదని అన్నీ రుచి చూసి కనిపెట్టేశా అని, చాలా సమయస్ఫూర్తిగా-  "ఏదో కరెక్ట్ గా చెప్పలేను కాని ఖచ్చితంగా చికెన్ మాత్రం కాదు" అంది. అదొక్కటే పిన్నీ నేను చేసింది అంటే నిజంగానే బిత్తరపోయింది. "ఇది చేసింది నువ్వా, ఇంక గొప్ప టేస్ట్ చికెన్ నేనెపుడూ తిన్లేదు" అంది. తర్వాత వెళ్ళేరోజు మళ్ళీ నాతో చేయించుకుని "కాలిఫోర్నియా" తీసుకెళ్ళింది. ఎన్నో సార్లు మాటల్లో "నువు చేసిన చికెన్ ఫ్రై టేస్ట్ అట్టనే నా నాలిక మీద నిలబడిపోయింది గిరీ" అనేది. బహుశా పిన్ని కి నేనిచ్చిన తియ్యని గురుతు ఇదేనేమో.

ఇక శలవుల్లో "పిన్ని" తో మేమంతా కలసి వెళ్ళిన తిరుమల ప్రయాణాలూ, రామాయపట్నం సముద్ర విహార భోజనాలూ, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని తియ్యని అనుభూతులే!

నెలన్నర క్రితం "పిన్ని" కి ఆఖరి "సంక్రాంతి". క్యాన్సర్ తో చివరి రోజులు. నేనూ ఇండియా లో ఉన్నాను. రాలేని పరిస్థితిలోనూ ఎంతో తపనపడి, ఎంతో కష్టపడి కూతురు "ఇందు" తో  "హైదరాబాదు" నుంచి "నెల్లూరు" వచ్చి కొద్దిరోజులుండి మాతో పండుగ జరుపుకుంది. సంక్రాంతి కి నాకూ, అన్నకీ బట్టలు పెట్టింది. "పిన్ని" చేతుల మీదుగా కొత్త బట్టలు అందుకుని సంక్రాంతి ని పిన్నితో అందరం కలసి జరుపుకున్నాం. ఆఖరిసారి "పిన్ని" పాదాలని తాకి మనసారా నమస్కరించుకున్నాను. మళ్ళీ తాకగలనో లేదో అన్న ఆలోచన ఎంత దిగమింగినా గుండెని తొలిచేసింది. తిరిగి హైదరాబాదు కి వెళ్తూ ఎక్కలేక ఎక్కి కారు లో పడుకుని చేతిలో చెయ్యి వేసి "సరే గిరీ, వెళ్ళొస్తా" అన్న ఆఖరి మాట, ఆఖరి చూపు అదే...

అందర్నీ వదిలి ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయింది "పిన్ని".

ఎన్ని కష్టాలున్నా తనలోనే దాచుకుని అందరికీ "ప్రేమ" ని మాత్రం పంచి, ఏన్నో అందమైన జ్ఞాపకాలని మిగిల్చి అందనంత దూరం వెళ్ళిపోయిన "పిన్ని" కి... 
ప్రేమతో 
ప్రేమాంజలి ఘటిస్తూ... 🙏

"ప్రేమ- ప్రేమించే మనసుకది వరం. ప్రేమించబడే మనసుకది అదృష్టం." - గిరిధర్ పొట్టేపాళెం


"చిన్నది కాని పిన్ని కానుక", నా పుట్టినరోజు  కి

చివరి కొన్ని సంవత్సరాలు "కావలి ఇస్కాన్ కృష్ణుని సన్నిధి" లో
"పిన్ని" గడిపిన ప్రశాంత జీవితం గురుతుగా నాకు దక్కిన కానుక

Wednesday, March 31, 2021

Gentleman....

 
Portrait of Rithvik Pottepalem
Watercolors on Paper 8.5" x 11"  

A boy becomes a man by age. A man becomes a gentleman by his behavior and maturity.
A very "Happy Birthday" to my Son, a boy who becomes a Gentleman by all means!

Happy Birthday Rithvik!
Always be gentle and a Gentleman!!

Details 
Title: Gentleman...
Reference: Picture of my son Rithvik
Mediums: Ink and Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Saturday, January 23, 2021

The Legacy...

Color Pencils on Paper (11" x 14")
Artist: Bhuvan Pottepalem   

Parents are models for their kids. Kids observe, copy and learn from their parents. By following and practicing certain things at home parents keep building their legacy, knowingly or unknowingly. Creating an atmosphere at home for the "love of anything" makes the foundation. Constantly following and practicing that thing keeps building the legacy of it. The legacy built and left behind by parents will be remembered and carried on by their kids.

I am happy to foresee that Bhuvan is going to carry on the Legacy. The "Legacy of Art", left behind by my Father, that I proudly remember and carry on...

"Legacy isn’t tomorrow. Legacy is now. Today’s footprint is tomorrow’s legacy."

Details
Reference: American Football players - Seattle Seahawks team
Mediums: Color Penils on Paper
Size: 11" x 14" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook

Tuesday, December 15, 2020

Yet another reason to Smile...

"Yet another reason to Smile"
Portrait of Chi. Bhuvan
Watercolors on Paper (8.5" x 11")  

మన "బాపు" పుట్టిన ఈ రోజు
అంతటా తెలుగు బొమ్మల పండుగ
మా "భువన్" పుట్టిన అదే రోజు
మా ఇంట చిరునవ్వుల సందడిగా
రంగులు తోడై నవ్వులబొమ్మ పండగా...

Yet another reason to Smile in my life- my dear Bhuvan!

Since that first day of his very first Smile when Bhuvan came into my life, I have had a bigger reason to Smile. Today, it's been 18 years of that magic Smile!

A Smile on a face always reflects on another face. A Smile with oneself reflects on one's own Soul. A Smile with your loved-one reflects on your life!

With a Smile on my face from my Soul, I wish my dear "బంగారు బాబు"
A VERY HAPPY BIRTHDAY with MANY MANY SMILES of the day!

"A child's smile is worth more than all the money in the world." ~ Lionel Messi 

Details 
Title: Yet another reason to Smile (Portrait of Chi.Bhuvan)
Mediums: Watercolors
Size: 12" x 16" (30.5 cm x 40.5 cm)
Surface: Fabriano extra-white Watercolor Paper, Cold Press, 140 LB

Wednesday, November 25, 2020

ఎక్కడో ఉండే ఉంటాడు...

నేను, లక్ష్మి, అన్న (Dec 29, 1976, Kavali)

నా "కావలి" - తియ్యని జ్ఞాపకాలు

"ఎంగటేశులు" చనువున్నోళ్ళూ, నోరు తిరగనోళ్ళూ "వెంకటేశ్వర్లు" పేరు ని పిలిచే తీరు. ఆ పిలుపులో చనువూ ఆప్యాయతా రెండూ విడదీయరానంతగా కలిసిపోయి ఉంటాయి. కొందరు "వెంకటేశ్వర్లు"లకైతే అదే అసలు పేరైపోయేది, పిల్ల పెద్దా అందరూ అలానే పిలిచేవాళ్ళు.

"కావలి" - గుర్తుకొస్తేనే జ్ఞాపకాల కెరటాలు మనసులోతుల్లోంచి వచ్చి మదిని సున్నితంగా తాకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎనిమిదేళ్ళ వయసులో, రెండు మూడేళ్ళు "పచ్చని పల్లెసీమ" లో ఆటపాటల్తో గడిచిన బాల్యం తర్వాత నాన్న హైస్కూల్ టీచర్ జాబ్ ట్రాన్స్ ఫర్ తో  "కావలి టౌన్" కొచ్చాం. పాతూరు గర్లిస్కూల్ దగ్గర అమ్మమ్మ వాళ్ళింట్లో చేరాం. నిజానికి కావలి అమ్మమ్మ వాళ్ళ ఊరు. కానీ అప్పుడు అక్కడ లేరు, తాతయ్య కందుకూరు లో తాసిల్దారుగా పనిచేస్తుండడంతో అమ్మమ్మవాళ్ళూ అక్కడే ఉన్నారు.

ఎక్కువగా పెద్ద పెద్ద ఇళ్ళు, రోడ్లు, విష్ణాలయం, శివాలయం, కలుగోళ్ళమ్మ దేవాలయం, ఇంకా చిన్న చిన్న ఆలయాలు, చర్చిలు, మశీదులు, మందిరాలు, పార్కులు, లైబ్రరీలు, ఐదారు సినిమా హళ్ళూ, ఊరు మధ్యలో వెళ్తూ ఎప్పుడూ వాహనాల్తో రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్, రోడ్డుకిరువైపులా చిన్న హోటల్స్, ఫ్యాన్సీ స్టోర్స్, క్లాత్ మర్చంట్స్, షూస్, బేకరీస్, ఫర్నీచర్స్, స్వీట్స్, టైలరు షాపులు, ఫొటో స్టుడియోలు, చిన్న చిన్న బంకులు, ఇలా అన్నిరకాల షాపులూ... పళ్ళూ, ప్లాస్టిక్ సామాన్లూ, వేపిన వేరుశనక్కాయలు, పులిబంగరాలు, మసాల వడలు, ఇడ్లీ, దోశ టిఫిన్లూ, ఇలా వివిధ రకాల తోపుడు బళ్ళూ... సెంటర్ లో తారు రోడ్డుపైన ఒకపక్కగా శుభ్రంగా చిమ్మి చుట్టూ చిన్న చిన్న రాళ్ళ బోర్డర్ తో మధ్యలో రంగు రంగుల చాక్ పీసులతో మెరుపులద్ది మెరిసిపోయే ఆంజనేయ స్వామి, యేసుప్రభుల బొమ్మలు, ఆ బొమ్మలపైన అక్కడక్కడా విసిరిన ఐదు, పది పైసల బిళ్ళలు... గోడల నిండా ఎక్కడ చూసినా సినిమా వాల్ పోస్టర్లు, "మశూచి తెలుపండి, రూ. వెయ్యి పొందండి" స్టెన్సిల్ రాతలు, కుటుంబ నియంత్రణ లాంటి గవర్నమెంట్ ప్రమోషన్ పెయింటింగులు... ఏమీ తోచని వాళ్ళు అలా బజార్ కెళ్తే చాలు, తెలీకుండానే సమయం గడిచిపోయేది. ఏ పనీలేక, ఏమీ తోచక రోజంతా బజారుల్లోనే గడిపేసేవాళ్ళూ ఊర్లో చాలా మంది ఉండేవాళ్ళు. ఇంకా బొంతరాళ్ళతో కట్టిన పెద్ద పెద్ద సువిశాలమైన స్కూల్స్, కాలేజ్ లూ, తాలూకా ఆఫీసూ, కోర్ట్, పోలీస్ స్టేషన్, బస్టాండ్, రైల్వే స్టేషన్...ఇలా నా ఎనిమిదేళ్ళవయసుకి "కావలి" చాలా పెద్ద పట్టణం.

మా ఇంటి దగ్గరే ఒక చిన్న నాలుగుగోడల రేకుల గది లో ఉండేవాడు, అప్పుడే కొత్తగా పెళ్లయి కాపురం పెట్టిన "ఎంగటేశులు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. బహుశా నాకన్నా ఒక పదేళ్లు పెద్ద ఉంటాడేమో, అంతే. ఆ చుట్టుపక్కల అందరిళ్ళకీ వస్తూ అమ్మనీ, నాన్ననీ విజయక్కా, రామచంద్ర మావా అంటూ పలకరిస్తూ రోజూ ఇంటికి వస్తుండేవాడు.

ఒకసారెప్పుడో స్కూలు నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన నాన్న ని బజారు తీసుకెళ్ళమని అడుగుతున్నామేమో...నేను తీసుకెళ్తా అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన "ఎంగటేశులు" అనటం, జాగ్రత్తగా తీసుకెళ్ళి, తీసుకొస్తాడో లేదో అన్న డౌట్ తో వద్దులే అని అమ్మ అనటం, లేదు పోవాలని మేము పట్టుబట్టటం, అలా మొదటిసారి మా ముగ్గుర్నీ "బజార్" కి తీసుకెళ్ళుంటాడు "ఎంగటేశులు". అప్పట్నుంచీ రోజూ సాయంత్రం "ఎంగటేశులు" తో చాలా సార్లు బజారుకెళ్ళిన గుర్తులు. ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టారు ఊర్లో,  బస్టాండ్ లో బస్సులకోసం ఉండే విశాలమైన స్థలంలో. ఆరోజు బజారుకి తీసుకెళ్ళిన "ఎంగటేశులు" మమ్మల్ని ఎగ్జిబిషన్ కీ తీసుకెళ్ళాడు. ఎగ్జిబిషన్ లోని "రూపాయి ఫొటో స్టుడియో" లో మేమెంతో ముచ్చటపడ్డ "తాజ్ మహల్" తెర ముందు నిలబెట్టి తీయించి తీసుకొచ్చిన ఫొటో కావలిలో మా మొట్టమొదటి ఫొటొ. అప్పట్లో ప్రతిరోజూ భలే చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం, నిజంగానే తాజ్ మహల్ ఎదురుగా నిలబడి తీసుకున్నంత ఆనందంతో. నాన్న, ప్రతీ ఫొటో వెనకా తీసిన తేది తప్పక వేసేవాడు. ఈ ఫొటో వెనుక నాన్న వేసిన తేది 29-12-1976.
చాలా తక్కువ కాలం, కేవలం కొద్దినెలలే అలా "ఎంగటేశులు" తో నా అనుబంధం. ఆ తర్వాత కావలి కి చాలా దూరం, హిందూపూర్ దగ్గర "కొడిగెనహళ్ళి రెసిదెన్షియల్ స్కూల్" కెళ్ళిపోయాను ఐదవ క్లాస్ లోనే.  మొదటిసారి దసరా శలవులకి, రెండోసారి సంక్రాంతి శలవులకీ ఇంటికొచ్చి గడిపిన పది పదిహేను రోజులు సరిగా గుర్తుకూడా లేవు. సమ్మర్ శలవులకి వచ్చినపుడు ఇళ్ళు తాళం వేసి ఉంది, బ్యాగ్ పక్కన పెట్టుకుని మెట్లమీద కూర్చుని ఏడుస్తూ ఉన్న ఆ గంటో, రెండు గంటలో  మాత్రం బాగా గుర్తుంది. అప్పుడు "ఎంగటేశులు" రాలేదు, బహుశా ఇంట్లో లేడేమో. ఆ తర్వాత ఎప్పుడూ "ఎంగటేశులు" ని కలిసిన గుర్తులు లేవు. ఈ ఫొటో చూసుకున్న ప్రతిసారీ గుర్తుకొస్తూనే ఉంటాడు. "చిన్న శురీ, పెద్ద శురీ" అని నన్నూ అన్ననీ పిలుస్తూ, నవ్వుతూ రోజూ ఇంటికి వస్తూ ఉండేవాడు, మా ముగ్గుర్నీ చేతులుపట్టుకుని నడిపించుకుంటూ బజారుకి తీసుకెళ్తుండేవాడు.

జీవితంలో ఎందరో తారసపడుతూ ఉంటారు, కొందరితో గడిపేది కొద్ది కాలమే అయినా మదిలో ఎప్పటికీ "ఇష్టంగా" మిగిలిపోతారు. గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఆప్యాయంగా పలరిస్తూనే ఉంటారు...

మా మంచి "ఎంగటేశులు"... ఎక్కడో ఉండేవుంటాడు, అలాగే నవ్వుతూ పిల్లల్ని ఇప్పటికీ చెయ్యిపట్టుకుని నడిపించుకుని షికారుకో, బజారుకో తీసుకుని వెళ్తూ...

Monday, August 31, 2020

There goes away, a piece of my heart from (ho)me!

Day-1 with my "heart" in my hands, Urbana, IL, USA 


"Bhuvan?"
"Yeah"
"Can you come down for a sec? It's opinion time and I need your opinion."
"Ok"
"How is it?"
"It's good."
"Just good?"
"Very good!"

Last few years, I have been seeking Bhuvan's opinion on every single painting I worked on. Oftentimes he either says 'good' or 'very-good'. Sometimes, he even identifies areas of improvements. He has been my first critic, the very first person to see most of my completed Art works.

Bhuvan has never been away from me for more than a couple of weeks. It happened only once when he went to India on vacation with his mom and brother Rithvik. That was almost 10 years ago when he was little. I was asking him the other day if he ever was away from me for few days except his trip to India that I could not join. He reminded me his one-week school-trip to Washington D.C. in his 9th grade. Of course, that was another instance.

Bhuvan is a grown-up kid now, and goes all the way to Univ. of Michigan, Ann Arbor, MI, far away from (ho)me for his undergrad. I suddenly feel void in my life. I really don’t know how I lived before Bhuvan came into my life with a smile. When he smiled every single time I took him into my hands, on day-one in the hospital, I felt like my Dad came back into my life. His very first daycare caretaker “Susan” always used to say to me, “He is so cute, I don’t want him to grow up.”. I said the same to myself many times, year after year, every single year as he was growing up.

Time flies faster than we think, it flew-by very fast with Bhuvan in my life. It's only like yesterday that I was driving him to Kumon classes, RSM classes, FLL Robotics, Sunday classes at MIT, Soccer games, Basketball games, Ultimate Frisbee games, Tennis plays, daily Karate classes for 7 years until he got his black-belt, Swimming classes, Swimming meets, Piano classes, Violin classes, Sunday Prajna classes, Art classes, numerous birthday parties, Sleepovers, Hindu temples, cultural events and competitions he participated, events we attended, every family-trip we made in the past 17 years, and the list goes on. My evenings and weekends, last 17 years were mostly filled with him and his classes.

Now, suddenly new questions: "How am I going to live?" and "What am I going to do?" pop up in my mind, making me go blank. I was always hoping he would go to a college close to where we live, definitely not hundreds and hundreds of miles away. On one side I feel happy that Bhuvan chose one of the finest universities in the country and in the world. On the other half, I go unhappy as I miss him already. I knew this day arrives one day, but it arrived faster than I thought it would. It's been only two days since we dropped him off at his college. I am missing my heart already.

Whenever I say, "Bhuvan, you are my best friend.", he just nods his head. A follow-up saying, "Bhuvan, I am your best friend.", he simply smiles. That smile Bhuvan gives me is the same smile he gave me on day-one when he arrived in my life. The same smile that keeps me alive even when he stays away from (ho)me.

"Bhuvan, I left a piece of my heart in your college campus."
"I will collect it when you bring it back home with you once you finish your college."
"I am always your best friend."
"Give me that smile again..."
"Miss you!"
"Love you!"

- Your Best Friend
       ~ ~ ~ ~ ~
 
“Children make you want to start life over.” ~ Muhammad Ali

Bhuvan at his best, any sport he plays

His dream starts @ UMich, Michigan, USA

With my best friend in my life...@ UMich, Aug 29, 2020