Ink and Sketch pens on Paper (8.5" x 11")
జీవితం లో ప్రతిదీ సహజత్వం కోల్పోయి కృత్రిమత్వం సంతరించుకునే కాలం వచ్చేసింది, మెల్లి మెల్లిగా అందరి జీవితాల్నీ మబ్బుల్లా కమ్ము కుంటోంది. ఆ మబ్బుల మసకల్లోకి కొంచెం కొంచెం గా ప్రవేశిస్తున్నాం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా, అందులో ప్రవేశం తప్పనిసరి అవుతున్న పరిస్థితి. అమ్మమ్మలు, తాతయ్యలు, తాత, బామ్మల్ని సైతం అందులోకి తోసేస్తూ ఆ మబ్బులు కమ్ముకుని జీవితాల్ని కప్పేస్తున్నాయి. నిద్దర లేచాక గుడ్ మార్నింగ్ నుంచి పడుకోబోయే ముందు గుడ్ నైట్ ల దాకా అంతా సెల్ ఫోన్ లో డిజిటల్ మెసేజ్ లే. పేరు కి ఫోనే కానీ అది తప్ప మిగతావన్నీ అదే అయిపోయింది. స్మార్ట్ ఫోన్లో నోరారా మాటలూ, పలకరింపులూ పోయి మూగబోయిన మెసేజ్ లొచ్చి చుట్టు ముట్టేశాయి. కనీసం మెసేజ్ అయినా ఏదో నాలుగు మాటల ముక్కలు చేత్తో టైప్ చెయ్యటం కూడా పోయి, ఎక్కడో ఏవరో ఏదో పంపిస్తే అది తోచిన అందరికీ టక టక టక మని ఫార్వర్డ్ చేసి వేళ్ళు దులిపేసుకోటం అంతే. మరీ వింతగా పుట్టినరోజులకి మనకి గుర్తుండే ముఖ్యమైన ఫ్రెండ్స్ కో, ఫ్యామిలీ మెంబర్స్ కో పర్సనల్ గా విషెస్ చెప్పటం పోయి గుంపులో చెప్పటం, ఇంకా విడ్డూరంగా గుంపుల్లో మనకి కొందరు పరిచయమున్నా లేకున్నా, తీరికున్నా లేకున్నా, మిస్ అవకుండా గుంపులో గోయిందా కొట్టితీరాల్సిందే, లేకుంటే గుంపులో ఎవరేం ఫీల్ అవుతారో అనే ఒక ఎబ్బెట్టు ఫీలింగ్ మెసేజ్ పంపే దాకా, పంపించాకా కూడా ఖాయం. ఇక పండగలకీ పబ్బాలకీ అయితే పొలోమని డిజిటల్ గ్రీటింగ్ ఇమేజ్ లు లెక్కలేనన్ని ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటినే గ్రీటింగ్ కార్డులు గా భావించాల్సిన దయనీయ స్థితి. ఎవరికి ఏ గ్రీటింగ్ ఇమేజ్ ఎక్కడికి ఫార్వర్డ్ కొట్టింది కూడా గుర్తుండదు చాలా మందికి. నువు ఫార్వర్డ్ చేసింది నీకే తిప్పి ఫార్వర్డ్ కొట్టే వాళ్ళూ ఉన్నారు, దీన్ని "రివర్స్ ఫార్వర్డ్" అనాలేమో. ఈ జంక్ ఫార్వర్డ్ మెసేజ్ లు అన్నీ ఎల్లకాలం పదిలంగా సేవ్ చేసిపెట్టి, వాటి మీద స్టాటిస్టిక్స్ కట్టి, పెట్టుబడి పెట్టి వాటితో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేసే ప్రపంచ స్థాయి కంపెనీలు ఈ యుగం లో వెలిగి పోవటం మొదలయిపోయింది. సహజ మేధస్సు కూడా కృత్రిమ మేధస్సుమీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన కాలం వచ్చేసింది - "ది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎరా" కి అందరం స్వాగతం చెప్పక తప్ప(ట్లే)దు.
చేత్తో కష్టపడి వేసే బొమ్మలూ చాలా మంది ఆర్టిస్ట్ లు సునాయాసంగా ఇప్పుడు డిజిటల్ లో వేసేస్తున్నారు. నాకీ బొమ్మ కావాలి అని అడిగితే క్షణాల మీద వేసిచ్చే వెబ్ సైట్సూ అనేకం ఉన్నాయి. అయితే ఆ బొమ్మల రూపు రేఖలింకా సహజత్వానికి దగ్గరగా రాలేకున్నాయి. దగ్గరగా వచ్చి చేరే రోజూ దగ్గరలోనే ఉండొచ్చు. ఏ రోజుకైనా వాటిని ఒక్క సారి "బాపు" లా ఒక్క గీత గియ్యమని అడిగి చూడండి, వాటి సత్తా మేధస్సూ అంతా ఇట్టే తేలి పోతుంది. "బాపు" ని సృష్టించగల శక్తి ఒక్క ఈ జగతికి మాత్రమే ఉంది. అంతటి మహత్తయిన గీతల్ని సృష్టించగల శక్తి ఒక్క "బాపు" కే దక్కింది.
ఓ నలభై యేళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కృత్రిమం కాని అందమైన సహజ మానవ యుగం కళ్ళ ముందు స్పష్టంగా కదుల్తుంది. గ్రీటింగ్స్ ని కేవలం విషెస్ రూపంలో చెప్పేసి హమ్మయ్య ఒక పని అయిపోయింది అని ఊపిరి తీసుకునే రోజులు కానే కావవి. పండగలు, పుట్టినరోజులు, ఇష్టంగా, ఆప్యాయంగా అంతా కలసి చేసుకోవటమే తెలిసిన రోజులు. ఏ చిన్న పని చెయ్యాలన్నా కష్టపడి, ఇష్టంగా, సొంతగానో ఇంకొకరిని అడిగో నేర్చుకుని సమయం వెచ్చించి చేసి తృప్తిని పొంద గలిగిన రోజులు. ప్రతి పండక్కీ, సంబంధం లేని ప్రతి విషయాలకీ వెల్లువలా గ్రీటింగులూ, విషెస్ చెప్తూ పోకుండా, తమకి ముఖ్యమైన రోజులకి ముందుగానే ఆ రోజుని గుర్తుపెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాలుగు చోట్ల తిరిగి, నాలుగు షాపుల్లో వెతికి, నచ్చిన గ్రీటింగ్ కార్డులు కొని, స్వహస్తాలతో అందులో విషెస్ రాసి, ఎన్వలప్ లో భద్రంగా పెట్టి పోస్ట్ చేసే రోజులవి. ఆ పోస్ట్ లో గ్రీటింగ్ కార్డు తోబాటు అక్షర రూపంలో పదిలపరచిన మనసు భావాలూ భద్రంగా కొద్ది రోజుల తర్వాత అవతలి వ్యక్తులకి అంతే పదిలంగా అందేవి. ఎన్వలప్ చూడగనే విప్పారే మనసు, విప్పి చూసుకున్నా క మరింతగా మురిసిపోయే క్షణాన ఆ మనసు పడే సంతోషం, పొందే ఆనందం డిజిటల్ మెసేజుల్లో ఎప్పటికీ రానే రాదు. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్ కీ ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, పొలిటీషియన్ ఇలా ఒక రోజు సృష్టించేసి లెక్కలేననన్ని ఇమేజ్ లు మెసేజ్ లుగా ఫార్వర్డ్ కొట్టటం జీవితంలో భాగమై పోయింది.
"గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అని నన్నయ రచించిన మహాభారతంలో నే ఎప్పటికీ గడిచిన రోజులే మేలన్న సత్యం చెప్పబడింది. ఓ ముప్పై నలభై ఏళ్ళనాటి కాలం, కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఒక నెల ముందు నుంచే న్యూ ఇయర్, సంక్రాంతి కి గ్రీటింగ్ కార్డులు అమ్మే చిన్నపాటి దుకాణాలు బజారుల్లో ప్రత్యేకంగా వెలిసేవి. కొత్త సంవత్సరం రోజూ, సంక్రాంతి పండగ రోజులూ బయటికెళ్తే కొత్త బట్టలు తొడుక్కుని అందరూ ఇంటా బయటా కళకళలాడుతూ కనిపించేవాళ్ళు. పూలూ పళ్ళూ కూడా గ్రీటింగ్స్ లో పాలు పంచుకొనేవి.
అప్పటి గ్రీటింగ్ కార్డుల్లో "బాపు" కార్డులకి ఓ ప్రత్యేకత ఉండేది. "బాపు గ్రీటింగ్ కార్డులు" ఎంత పాపులర్ అంటే ఆర్ట్ అన్నా, బాపు అన్నా తెలియని వాళ్ళైనా అందరూ ఆయన వేసిన బొమ్మల కార్డులు చూసి మురుసిపోయేవాళ్ళు. తెలుగుదనం ఉట్టిపడుతూ చూసి వాటికి ఆకర్షితం కాని మనిషే ఉండేవాడు కాదు. ఇంకా ఎందరో మంచి ఫొటోగ్రాఫర్లు తీసిన అందమైన చిత్రాలు - ప్రదేశాలు, పువ్వులూ, పక్షులూ, జంతువులూ, ఇవన్నీ గ్రీటింగ్ కార్డులపైన ప్రింట్ అయిన సహజ సిద్ధమైన ప్రకృతి రూపాలే. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఏరి కోరి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని వాటి మీద అక్షరాలు రాసి, కవర్ లో పెట్టి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి పోస్ట్ చేసి రావటం లో దూరంగా ఉన్న తమ ఆప్తులకి పంపించే ఆ శుభాకాంక్షల్లో తమ మనసునే కాక కొంత జీవితాన్నీ చేర్చి పంపటం, అటువైపు అందిన ఆ కార్డులోని జీవత్వాన్ని తెరిచి చూడటం లో పొందిన ఆనందం... ఈ ప్రక్రియలోని సహజమైన ప్రేమా ఆప్యాయతల విలువ - అది పొందితేనే తప్ప ఎంత చెప్పినా అర్ధం కాదు.
బాపు గ్రీటింగ్ కార్డుల్ని చూసి అచ్చం అలానే నేను వేసిన బొమ్మల్లోని(ది/ధి), సంతకం లేని అతి కొద్ది నా బొమ్మల్లో ఇదీ ఒకటి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో శలవుల్లో వేసింది. వేసిన ఇల్లూ, ఆ సమయం ఇంకా మదిలో పదిలం. నా బొమ్మల ప్రయాణం మొదలయిన టీనేజ్ లో "కావలి" లో మేం అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటింట్లో వేసింది. నా గ్రీటింగ్ కార్డుల సేకరణలో ఉన్న బాపు గారి గ్రీటింగ్ కార్డు ని చూసి, అచ్చం అలానే గీసిన గీతలవి. "బాపు" బొమ్మ ఒక్క "బాపు" కే సాధ్యం. ఈ ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు. అయినా అచ్చం అలాగే వెయ్యాలని పట్టిన పట్టు విడవని ఆ పట్టుదల ప్రతి గీత వంపులోనూ కనిపిస్తుంది. ఒక్కో గీతని ఎన్ని సార్లు చెరిపి గీసుంటానో నాకే తెలీదు. ఒక్క దెబ్బకి బాపు గారి ఏ గీతని అయినా అచ్చం అలాగే గీయగలిన ఆర్టిస్ట్ ఎవరూ లేరు, ఉండ(లే)రు కూడా. అంత దైవత్వం సంతరించుకున్న గీతలవి. బహుశా బాపు గారు డెభ్భై, యనభయ్యవ దశకాల్లో కేవలం గ్రీటింగ్ కార్డుల కోసమే కొన్ని బొమ్మలు వేసి ఉండొచ్చు. నాట్య భంగిమ లో నిలబడి ఉన్న ఈ విఘ్నేశ్వరుని బొమ్మ కూడా అలాంటిదే. గీతలనైతే ఎలాగో కష్టపడి అటూ ఇటుగా సాధించా, కానీ రంగులు అద్దటంలో తడబడిపోయా. కారణం అప్పటికి మన ఆర్ట్ ఇంకా గీతల దగ్గరే ఉంది, అది దాటి రంగులు అద్దే దాకా ఎదగలేదు. అప్పుడున్న కొన్ని స్కెచ్ పెన్నుల్తో రంగులు అద్దినా మెయిన్ బొమ్మ వెనక భాగం బ్లూ ఇంకు నీళ్ళల్లో కలిపి పూయటం, అందులోనూ పేపర్ సాదా సీదా పేపర్ కావటంతో ముద్దలు ముద్దలు గా అయిపోవటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పడ్డ కష్టమంతా ఈ బ్యాక్ గ్రౌండ్ రంగుల ముద్దల్లో కరిగి చెరిగిపోయి చెందిన మనస్తాపం ఛాయలూ ఇంకా మదిలో ఉన్నాయి. ఎప్పుడు ఈ బొమ్మ చూసుకున్నా ఆ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం కలవర పెడుతూనే ఉంటుంది. మామూలుగా అప్పట్లో ఒక బొమ్మ సంతృప్తిని ఇవ్వకుంటే మళ్ళీ అదే అంతకన్నా బాగా వేసి తృప్తిపొందే వాడిని. ఈ బొమ్మ గీతల్లో పడ్డ కష్టం మళ్ళీ పడటం సాధ్యం కాలేదు. రంగులు రాకున్నా, గీతలు బానే వచ్చాయి అన్న తృప్తి సరిపెట్టు కోవలసి వచ్చింది.
గ్రీటింగ్ - పలకరింపు అన్నది రెండు జీవాలను ఆప్యాయతతో కలిపే స్పందన. అది కార్డుల రూపంలో అందుకున్నా అందులో రాసిన అక్షరాల్లో ఆ జీవ స్పందన కలిసుండేది. ఆ స్పందన కూడా కృత్రిమం గా మారితే మనిషి మనుగడకి అర్ధమే మారిపోతుంది. మాట మనిషికి దేవుడిచ్చిన ఒక వరం. మాట మాత్రమైనా లేకుండా మనుషులు దూరమై పోతున్నారు. వాళ్లలోని మమతలూ దూరమైపోతున్నాయి. ఆప్యాయంగా "ప్రియమైన గిరికి" అని ఉత్తరం అందుకుని కొన్ని దశాబ్దాలు గడచి పోయాయి. "ఎలా ఉన్నావు గిరీ" అన్న పిలుపూ వినబడే రోజులు కాలంలో వెనక్కి దొర్లి పోయాయి. మిగిలింది మాత్రం వెనుకటి కాలంలో దాగిన జ్ఞాపకాలే...
"కాలం దూరం చెయ్యలేనివి జ్ఞాపకాలు మాత్రమే."
~ గిరిధర్ పొట్టేపాళెం
~~ ** ~~ ** ~~
("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)
నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...