Showing posts with label black&white. Show all posts
Showing posts with label black&white. Show all posts

Friday, June 5, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 39 . . .

Portrait of Telugu Cine Hero Chiranjeevi from the movie Chiranjeevi
Ink and Pen on Paper 8" x 11"

చిరంజీవి - ఈ పేరులోనే ఒక మహత్తు దాగుంది. ఈ పదం తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదం కి ప్రతీక. వయసులో తమకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ పలికే ఒక అద్భుతమైన సంస్కృత పదం ఇది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో ఈ పదం యుగ యుగాలుగా మరణం లేక జీవించి ఉండే మహానుభావులకి మాత్రమే ఉపయోగించటం తెలిసిందే. అందులో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది "అంజనీ దేవి" పుత్రుడు "ఆంజనేయుడు". కాకతాళీయంగా ఈ చిరంజీవీ అంజనీ దేవి పుత్రుడే! కాకతాళీయం అనేకంటే "విధి విలాసం" లేదా "దైవ నిర్ణయం" అనుకోవచ్చేమో! లేదంటే "శివ శంకర వర ప్రసాదు"డు పెరిగి పెద్దయ్యాక "చిరంజీవి" గా లోకానికి పరిచయం అవటం, ఆ మార్చుకున్న పేరు మహత్తు ఇంత బలీయంగా ఉండటం...అందరి జీవితాలకీ సాధ్యం కాదు.

నా టీనేజ్ నాటి బొమ్మల్లో సినీ తారలదే ప్రధమ స్థానం. అప్పట్లో సినిమా పత్రికలు విరివిగా వస్తూ ప్రత్యేక ఆకర్షణ గా నిలవటం, అందరికీ అందుబాటులో ఉండటం అందుకు కారణం ఒకటైతే, కొత్త తరం కథానాయకులతో తీరూ తెన్నూ, రంగూ రూపూ, మాటా పాటా, నడకా నటనా మార్చుకుంటున్న తెలుగు వెండితెర మరో కారణం. శలవుల్లో ఇంటికొస్తే రోజూ మా ఊరు "కావలి" లో ఏ థియేటర్ లో ఏం  సినిమా ఆడుతుంది అని వాల్ పోస్టర్ల ద్వారా ఇట్టే తెలిసి పోయేది. అట్టా బజారు కెళ్ళి "పెండెం సోడా ఫ్యాక్టరీ", "సింగ్ స్వీట్ స్టాల్" దగ్గరకెళ్ళి చూస్తే చాలు, ప్రతి థియేటర్ హోర్డింగ్ ప్యానెల్స్ వరసగా వాల్ పోస్టర్లతో కనువిందు చేసేవి. ట్రంకు రోడ్డు పక్కన "సింగ్ స్వీట్స్ షాప్" ముందు ఒక్కొక్క హోర్డింగ్ కీ భూమిలో నాటిన రెండు  సవక చెట్టు స్థంభాలు కి (కావలి సవక చెట్లకీ, బొంత రాళ్ళకీ పుట్టిల్లు) పైన కట్టిన వెదురు తడికె, దానిపైన మైదాతో అంటించిన వాల్ పోస్టర్లు. అప్పట్లో సినిమాలకి ఊర్లో ఇదే ప్రముఖమైన మార్కెటింగ్ సాధనం. కేవలం వాల్ పోస్టర్ చూసే సినిమాలకెళ్ళే వాళ్ళం. అంటే ఆ పోస్టర్లు డిజైన్ చేసే ఆర్టిస్ట్ కి అది ఎంత పెద్ద ఛాలెంజ్ నో ఊహించుకోవచ్చు. "ఈశ్వర్", "గంగాధర్" అప్పట్లో బాగా ప్రాచుర్యం పొంది ఎక్కువమందికి తెలిసిన పబ్లిసిటీ డిజైనర్ ఆర్టిస్టులు. సినిమా టైటిల్, పోస్టర్స్ చాలా ఆకర్షణీయంగా తీర్చి దిద్దే వారు. అందమైన పోస్టర్లున్న సినిమాలు థియేటర్ లో ఆడగలిగినన్ని రోజులాడి వెళ్ళిపోయాక ఆ సినిమా పోస్టర్లపైన అతికించిన కొత్త సినిమా పోస్టర్లు చూసి, అయ్యో అంత మంచి పోస్టర్ ఇంక చూడలేమా అని నా మనసు వాపోయేది. అలా "దాన వీర శూర కర్ణ" సూపర్ సైజ్ వాల్ పోస్టర్ కనిపించని రోజైతే నా మనసు విలవిల్లాడిపోయింది.

ఈ బొమ్మ "చిరంజీవి" సినిమాలో "చిరంజీవి" ఫొటో ఆధారంగా వేసింది. అప్పటి నా బొమ్మలన్నీ క్యాజువల్ గా ఏ (సినిమా) పత్రికో, న్యూస్ పేపరో తిరగేస్తున్నపుడు చూస్తే ఆకర్షించిన మరు క్షణమే పెన్నూ, పేపరూ పట్టుకుని గీసినవే. ప్లానింగ్, కంపోజిషన్, అవుట్ లైనింగ్...ఇలాంటి ప్రత్యేకమైన ప్రక్రియలేం లేవు, ఉన్నా మనకవేమీ తెలీవు. ఇంటర్ మీడియట్ అయ్యాక ఎండాకాలం శలవుల్లో ఇంటికొచ్చినపుడు వేసింది ఈ బొమ్మ. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులేమో. మే నెల, మాంచి ఎండాకాలం. మేము అద్దెకుంటున్నది మా తాతయ్య చెల్లెలు "నారాయణవ్వ" పెంకుటింట్లోనే, ఒంగోల్ బస్టాండు సందులో కాస్త దూరం వెళ్తే "కోటి లింగం" హాస్పిటల్ అంటే రిక్షా వాళ్లందరికీ తెలుసు. అక్కడి "పోలువారి వీధి" లో రెండో ఇల్లు, పడమటి వాకిలి ఇల్లు అవటంతో మధ్యాహ్నం ఎండ వేడి ని తట్టుకుని సాయంత్రం దాకా ఇంట్లో మనగలగటం కత్తిమీద సామే. అమ్మ అయితే ఎండ సూటిగా రాకుండా వరండా కటకటాలకి దుప్పట్లు కూడా కట్టేది. అయినా లోపలికి దూరే సూర్యుడి వేడి తాకిడిని తట్టుకోవటం ఏ జీవి వల్లా అయ్యేది కాదు. పొద్దున వరండాలో కూర్చుని చదవటమో లేదా బొమ్మలేయటమో. మధ్యాహ్నం అయితే పక్కన సందులో పక్కింటి తురాయి చెట్టు నీడ న ఒక కుర్చీ వేసుకుని ఆ వేడి గాలుల మధ్యన కూచుని మళ్ళీ చదవటం, లేదా మళ్ళీ బొమ్మలెయ్యటం. సాయంత్రం అయితే కొంచెం తగ్గిన వేడి తాకిడి నుంచి ఉపశమనం కోసం అలా కాసేపు బయటికెళ్ళి తిరిగి రావటమో లేదా తోచిన బొమ్మ గియ్యటమో, ఇంతకన్నా పెద్ద షెడ్యూల్ ఏమీ ఉండేది కాదు నాకైతే. "చిరంజీవి" కి అప్పటికే రెండూళ్ళుగా పెద్ద అభిమానిని. "చిరంజీవి" సినిమానీ "కావలి" లోనే చూసిన గుర్తు. కొత్తగా ప్రయోగం చేసి ప్రేక్షకులని మెప్పించలేకపోయిన క్యారెక్టర్ లో నాకైతే ఈ సినిమా లో "చిరంజీవి" నటన బాగా నచ్చింది. "రాజా లా వెలుగు...మారాజై బ్రతుకు" అంటూ సినిమా మొదట్లోనే వచ్చే పాట భలే నచ్చేసింది. ఇందులో అంత పెద్ద పెద్ద అందమైన కళ్ళతోనే హావభావాలు ఒలికించగల నటి "భానుప్రియ" కి  కళ్ళుండీ చూపులేని గుడ్డి అమ్మాయి వేషం ఇవ్వటం ఒక్కటే నచ్చలేదు. ఆ సినిమా నిర్మాత నీ, డైరెక్టర్ నీ తిట్టుకున్నా.

ఇక ఈ బొమ్మ లోగిలి లోనికి తొంగి చూస్తే, ఎక్కువగా కనిపించేది ఫౌంటెన్ పెన్ తో గీసిన బ్లాక్ ఇంక్  గీతలు. అక్కడక్కడా పేపర్ కనపడకుండా పూర్తి బ్లాక్ బ్లాక్స్ ఉన్న చోట బ్లాక్ స్కెచ్ పెన్ను తో గీసిన లావు పాటి స్ట్రోక్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అప్పట్లో నాకు ఇంట్లో అందుబాటులో ఉన్న నాసి రకం నోట్ బుక్ పేపర్ మీద వేసిందే ఇది. ఏ పోర్ట్రెయిట్ అయినా ఎడమ కనుబొమ్మతో మొదలు పెట్టి అలా వేసుకుంటూ పోయేవాడిని. ఈ బొమ్మ వేస్తూ పోతే నడుము, మోచెయ్యి సగం వరకే పేపర్ లో పట్టి ఆ తర్వాత పేపర్ సరిపోక నన్ను పట్టి ఆపింది.  అయినా నేనాగలా. ఆ వేసుకున్న జాకెట్, చెయ్యి కింది భాగం వరకూ వేసి బొమ్మ పూర్తిచెయ్యాలని నా సంకల్పం. ఆ బొమ్మ వేసిన పేపర్ ని ఇంకొంచెం పెద్ద పేపర్ మీద డయాగనల్ గా అంటించి, మిగిలిన భాగం పూర్తి చేశా. సంతకం మోచెయ్యి కింది భాగం కొంత, నడుము నుంచి కింది దాకా ఇంకో పేపర్ మీద వేసింది. అలా ఒక్కొకసారి వింత ప్రక్రియలు చేసేవాడిని. "Necessity is the mother of invention" అన్న నానుడి బహుశా ఇలా పుట్టిందే! అలా రెండు వేరు వేరు పేపర్స్ పైన ఆవిష్కరించిన బొమ్మ ఇదొక్కటే అనుకుంటా. అప్పటి దాకా ఒక్క వెంట్రుక కూడా చెదరని క్రాఫుతో కనిపించే యన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల (చిన్న రింగు మినహా) విగ్గులు వెయ్యటంలో ఏ మాత్రం థ్రిల్ ఉండేదే కాదు. "చిరంజీవి" రేగిన సొంత క్రాఫ్ లో ఉండడంతో ఆ హైర్ స్టైల్ ని ఇందులో ఆసక్తిగా వేశా. అప్పట్లో వేసిన బొమ్మల్లో జుట్టు వెయ్యటంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేసే వాడిని. తర్వాత "ఇంజనీరింగ్ కాలేజి" లో నా బొమ్మలు అభిమానించే ఫ్రెండ్ "వాసు" ఒకసారి నేను వేసిన "భాను ప్రియ" బొమ్మ చూసి, "హెయిర్ వెయ్యటం లో స్పెషలిస్ట్ గిరీ నువ్వు" అంటూ కితాబిచ్చాడు. అప్పటి దాకా నన్ను నేనే గమనించుకోలా, నిజంగానే హెయిర్ వెయ్యటం లో మరి కాస్త శ్రద్ధ పెడుతుంటానని. అదే శ్రద్ధ ఇప్పటికీ వేసే బొమ్మల్లో కనిపిస్తూనే ఉంటుంది.

తెలుగు హీరోల్లో "చిరంజీవి" ని ఎక్కువగా, ఎక్కువ కాలం అభిమానించా. కావలి "లత థియేటర్" లో ఇంటర్వల్ ముందు వేసిన "యమకింకరుడు" ట్రెయిలర్ చూసిన క్షణం నుంచీ మొన్నటి "సైరా నరశింహా రెడ్డి" దాకా. ఆ మధ్య ఆయన రాజకీయ "రంగ ప్రవేశం" చేస్తుంటే, మృదు భాషి, ఎవ్వరినీ నొప్పించని మనస్తత్వం కల వ్యక్తి, నిజంగా ప్రజలకి ఏదో మంచి చెయ్యలన్న తాపత్రయంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాడనీ, "రాజకీయ రంగం" పైనా అప్పటి రాజకీయ నాయకుల్ని "సినిమా రంగం" పై ఎదుర్కొన్నట్టు సమర్ధంగా ఎదుర్కొని నిలబడగలడనీ "ప్రజా సేవ" అంటే ఏంటో కులమతాలకతీతంగా చూపించి సత్తా చాటగలడనీ, "చిరంజీవి" గా అందరి హృదయాల్లో నిలిచిపోగలడనీ, నిలిచిపోవాలనీ ఆశించా, ఆకాంక్షించా. కానీ భిన్నంగా "యూ టర్న్" కొట్టి "మళ్ళీ రాననుకున్నారా, రాలేననుకున్నారా" అంటూ వెండి తెర మీద కుర్రకారు స్టెప్పులకే పరిమితం అయిపోయాడు. డెబ్భయ్యవ వడిలోనూ కష్టపడి కుర్రోడిలా కనపడాలని మేకప్పుతో కుర్ర హీరోయిన్లతో ఎగరటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంటే - చిన్నపుడు యన్.టి.ఆర్, ఏయన్నార్ ని తిట్టుకునే వాళ్ళం, ఇపుడు నువ్వు కూడానా? నువ్వు చెయ్యని ఫైట్లూ, వెయ్యని స్టెప్పులూ ఇంకేం మిగిలాయని? ఈ తరం కి నువ్వేంటో ఈ వయసులో నిరూపించాలా? అది సాధ్యమా? వయసుకి మించిన పాత్రలు వేసి అప్పట్లోనే మెప్పించావ్, వయసుకి తగ్గ పాత్రలు వేసి ఇప్పుడు మెప్పించలేవా? అలా చేస్తే నాలాంటి అప్పటి నీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ "చిరంజీవి" గా మిగిలిపోవా? అని అనుకుంటూ ఉంటా.

"చిరంజీవి" - హీరో కాక ముందే "కావలి" లో ఒంగోల్ బస్టాండు దగ్గర ఒక పాత ఇంటి పై ఒక రూములో వెలసిన "చిరంజీవి అభిమాన సంఘం" కి ఆయనే స్వయంగా నెల్లూరు నుంచి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఓపన్ చేశాడనీ, బూజు పట్టి, మాడి పోయిన కరెంట్ బల్బ్ తో ఉన్న రూముని కొంచెం శుభ్రం చెయ్యించి బల్బు కొనుక్కోమని డబ్బులిచ్చాడనీ, హీరో అయ్యాక "కావలి" లో చాలా మంది నోట విన్నా. చిరంజీవి పై నా అభిమానానికి పడ్డ "పునాది రాళ్ళు" లో నేను విన్న ఈ "సంఘటన" కూడా ఒకటి.

ఒక "చిరంజీవి" అభిమాని గా నా "నీ బొమ్మల" హృదయాల్లోని మాటలివి - ఈ సమాజం నీ "స్వయం కృషి" ని, నీ ప్రతిభనీ మెచ్చి "విజేత" గా నిన్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన "ఆలయ శిఖరం" పైన "మగ మహారాజు" లా కూర్చోబెట్టింది. ఎవరికీ అందని ఆ ఎత్తున ఉన్నా, "అందరి వాడు" గా తిరిగొచ్చి సమాజానికి పెద్ద ఎత్తున నీ వంతు సహాయం చెయ్యగల మార్గం నీ బాటలో ఎదురొస్తే, అలా తొంగి చూసి మాత్రమే వెనక్కి తిరిగి "అందని వాడు" గా రానని వెళ్ళిపోయావ్. అప్పటి నీ స్థాయికి మించి కావలి లో "నీ అభిమాన సంఘం" కి నువు చేసిన సాయం గుర్తెరిగి, ఇప్పటి నీ స్థాయికి తగ్గ సాయం చెయ్యగలవన్న "అభిలాష" తో ఆ దేవుడే అవకాశం ఇచ్చినా వద్దనుకున్నావ్. "ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా?" అని ఎందరడిగినా వెనుదిరిగి చూడకుండా గుర్తించకనే వెళ్ళి పోయావ్. నీకన్నీ ఇచ్చిన ఈ సమాజానికి తిరిగిచ్చే అవకాశం వద్దని, ఆ సమాజం గుండెల్లో "చిరంజీవి"వి కాలేకపోయినా, పరిమితమయిన "తెలుగు వెండి తెర" వరకే నీ పేరుని పరిమితం చేసుకున్నా, తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ "చిరంజీవి" వే! సార్ధక నామధేయుడవే!

"చిరంజీవి చిరంజీవ"!

"అన్నీ ఇచ్చిన సమాజానికి తన వంతు తిరిగి ఇవ్వగలిగిన ప్రతి జీవీ చిరంజీవే."
~ గిరిధర్ పొట్టేపాళెం

Thursday, June 4, 2026

డియర్ బాలు . . .

Sri. S. P. Balasubramanyam
Watercolors on Paper (8" x 10")

ప్రియమైన "బాలు" కి
పుట్టినరోజు శుభాకాంక్షలు! 💙

The making video...






Friday, April 3, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 38 . . .


Indian Ink on Paper (8" x 11")
నా బొమ్మలు నన్నెక్కువగా తీసుకెళ్ళే గత జ్ఞాపకాల్లో నా ఇంజనీరింగ్ కాలేజి నాటి రోజులు ప్రముఖంగా కనిపిస్తాయి. పొద్దున నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకోబోయే దాకా ఏ.పి.రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి; లొయోలా కాలేజి, విజయవాడ హాస్టల్ డిసిప్లిన్ కి ఎనిమిదేళ్ళుగా అలవాటు పడిపోయిన నా రోజు వారీ టైమ్ టేబుల్, వి.ఆర్.సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ లో చేరగానే అక్కడి వాతావరణం కి అలవాటు పడలేక పోయింది. ఒక్కసారిగా స్వేచ్ఛ ఎక్కువై పోయి, మాకు మేమే కింగ్స్ అన్నట్టుండే ఎక్కువమంది విద్యార్ధులు, క్లాస్ కి టైమ్ అవుతున్నా నిద్ర లేవని రూమ్ మేట్స్, క్లాస్ కి కొట్టే డుమ్మాలే కాదు, మెస్ లోనూ చిత్ర విచిత్రాలు చేస్తూ, కాఫీ తాగి డైనింగ్ హాల్ బయట గ్లాసులు చెట్లల్లోకి విసిరికొట్టి విసురుగా వెళ్ళే సీనియర్లు, వాళ్ళని చూసి చాలామంది జూనియర్లూ అదే పనిగా కాఫీ, టీ తాగిన గ్లాసులు విసిరి కొట్టటం, తర్వాత బుట్టల్లో అక్కడంతా తిరిగి గ్లాసులు ఏరి కడిగే ఇద్దరు పని వాళ్ళు - ఇది ఒకరకంగా బాధ్యత లేని విద్యార్ధుల మితిమీరిన స్వేచ్ఛల చేష్టలకి పరాకాష్ట. అవన్నీ చూస్తుంటే ఇంజనీరింగ్ కాలేజి అంటేనే ఇలానే ఉంటారా, ఇలానే ఉండాలా అన్న ప్రశ్నలు నాలో మెదిలేవి. దానికి తోడు ర్యాగింగ్ పీరియడ్ లో బయటపడే కుల, వర్గ హెచ్చుతగ్గులు, అప్పటిదాకా మార్కుల హెచ్చుతగ్గులు తప్ప మరో రకం హెచ్చుతగ్గులు కనపడని స్కూల్, జూనియర్ కాలేజి వాతావరణం లోంచి ఒక్కసారిగా ఇవన్నీ చూస్తూ ఆక్రోశించిన మనసు,  మొదటి సంవత్సరం అలా ఇమడలేని వాతావరణంలో ఇమడాల్సి వచ్చింది. అలా నాలాగే చాలా మంది వీటికి అడ్జస్ట్ అవుతూ అందరితో మొదటి సంవత్సరం కలిసి మెలిసి తిరిగినా, "ఒక గూటి పక్షులు ఒక చోటికి చేరుతాయి" అన్నట్టు "ఒకే మనస్తత్వం గల విద్యార్ధులు ఒక్కటిగానే కలిసి తిరుగుతారు" అని నిరూపిస్తూ రెండవ సంవత్సరంలో స్నేహితులు, రూమ్ మేట్స్ అందరికీ మారిపోయారు. కలగూరగంపగా మొదలైన మొదటి సంవత్సరం తర్వాత రెండవ సంవత్సరం అందరికీ స్థిరంగా ముందుకి సాగింది. కావలసినంత స్వేచ్ఛ ఉన్నా హాస్టల్ లో ఇమడలేని వాళ్ళు మరింత స్వేచ్ఛకై కాలేజి చుట్టుపక్కల అద్దె రూములు వెతుక్కుని వెళ్ళిపోయారు.

అలా కొత్త పరిచయాలు, కొత్త వాతావరణంలో ఇమిడిన మొదటి సంవత్సరంలో బొమ్మలు వేసిన గుర్తులేమీ లేవు. వారానికి ఒక పూట మధ్యాహ్నం ఉండే నాలుగు గంటల "ఇంజనీరింగ్ డ్రాయింగ్" క్లాస్ ని మాత్రం పూర్తిగా ఆస్వాదించే వాడిని. మిని డ్రాఫ్టర్, పేపర్ డ్రాయింగ్ బోర్డుకి అలైన్ చేసి డ్రాఫ్టింగ్ టూల్స్ తో పర్స్ పెక్టివ్, 3D, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీయటం భలే ఆసక్తిగా అనిపించేది. నేను కంప్యూటర్ సైన్స్ అయినా మొదటి సంవత్సరం లో అందరికీ ఒకే సబ్జెక్ట్స్ కనుక ఇంజనీరింగ్ డ్రాయింగ్ తప్పనిసరి. ఆ తర్వాత డ్రాయింగ్ సబ్జెక్ట్ మాకు లేదు. సివిల్, మెకానికల్ వాళ్ళకి ఉండేది. అయితే అయ్యో మాకు ఉంటే బాగుండేదే అన్నంతగా ఆస్వాదించా ఆ క్లాస్ ని మాత్రం. అప్పటిదాకా శలవులకి ఇంటికి వెళ్ళినపుడు మాత్రమే బొమ్మలు వేసేవాడిని. ఇంటర్ లో చదువు, సినిమాలు తప్ప వేరే లోకం లేని లొయోలా కాలేజిలో బొమ్మలకి పెద్దగా సమయం లేకుండానే గడచి పోయింది. రెండు సంవత్సరాల్లో రెండే బొమ్మలు వేసిన గుర్తు హాస్టల్ లో - ఒకటి అప్పటి పత్రికల్లో బాపు లాగే అనిపిస్తూ బొమ్మలు వేసే "ఆర్టిస్ట్ చంద్ర" గారి బొమ్మని చూసి వేసిన ఒక బొమ్మ, "సితార" సినిమా చూడవయ్యా "భానుప్రియ" నీకు తప్పకుండా భలే నచ్చుతుంది అంటూ పదే పదే చెప్తుండే మిత్రుడు "నీలాచలం" ప్రభావంతో వేసిన ఒక "భానుప్రియ" బొమ్మ. అయితే ఇంటర్మీడియట్ రెండేళ్ళూ వారం వారం క్రమం తప్పక "స్టెల్లా కాలేజి" దగ్గర బస్సెక్కి "రాఘవయ్య పార్కు" దగ్గర దిగి "బీసెంట్ రోడ్డు" లో నడుస్తూ వెళ్ళి "ఏలూరు కాలువ" దాటి "అలంకార్ థియేటర్" చుట్టూ ఉన్న థియేటర్లలో చూసిన సినిమాలు, ఆ సినిమా తాలూకు కటౌట్ లు నాకు పెయింటింగ్స్ మీదున్న ఆసక్తి ని లోలోపలే పెంచసాగాయి.

ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో "విజయవాడ" లో నా బొమ్మల ప్రస్థానం మొదలయ్యింది. హాస్టల్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికెళ్ళగలిగే స్వేచ్ఛ ఉండటంతో, పెయింటింగ్ మెటీరియల్ కోసం సిటీ బస్సుల్లో వెళ్ళి విజయవాడలో నేను తిరగని ప్రదేశం లేదు. మా కాలేజి "కానూరు", "తాడిగడప" కి మధ్య లో ఉండేది, అక్కడికి దగ్గరగా షాపులున్న బజారు అంటే "పటమట" దాకా వెళ్ళాలి, లేదంటే అక్కడి నుంచి ఇంకా నాలుగైదు కిలోమీటర్లలో "బీసెంట్ రోడ్డు". ఈ ఏడెనిమిది కిలోమీటర్ల రేడియస్ మధ్యలో ఇంకెక్కడా షాపింగ్ కి తావు లేదు. ఇంకా లేదంటే "ఒన్ టవున్" వెళ్ళాలి, ఇరుకు సందుల్లో బోర్డులు కూడా లేకుండా చిన్న తలుపు తప్ప ఏమీ లేని గోడవున్ లా ఉండే హోల్ సేల్ షాపులు, "ఒన్ టవున్" నిండా అంతే. "పటమట" లో ఉన్న నాలుగైదు బుక్ షాపులు, అన్ని ఫ్యాన్సీ షాపులూ బ్రష్, పోస్టర్ కలర్స్ కోసం గాలించి గాలించి దొరక్క చివరికి బీసెంట్ రోడ్డు, అలంకార్ ఎదురుగా రైల్వే రోడ్డు ఇవన్నీ అయిపోయి ఆఖరి పోరాటం "ఒన్ టవున్" సందుల్లో కూడా చేశా.

"పటమట" షాపులో ఒకాయన "ఒన్ టవున్" లో అయితే దొరుకుతాయి అనటంతో గుడ్డిగా ఒక రోజు సాయంకాలం పని గట్టుకుని ఈ "ఒన్ టవున్" పని పడదాం అని బస్సెక్కి వెళ్ళి అక్కడ "కాళేశ్వర రావు మార్కెట్" లో దిగి రెండు మూడు సందుల్లోకి దూసుకు పోయా నడకతో. ఎక్కడ చూసినా ఎత్తైన అరుగులు మెట్లూ ఎక్కితే ఉండే మూతేసిన తలుపుల షాపులే. అక్కడక్కడా కొన్నిటికి మాత్రం చిన్న చిన్న బోర్డులున్నాయి. అక్కడైతే దొరుకుతాయి అన్న ఆయన మాట గట్టిగా పట్టుకుని వచ్చి గాలిస్తున్నా తప్ప, నిజానికి అక్కడ దొరుకుతాయి అన్న ఆశ పోయింది. అయినా ఆయనెవరో అలా అంత ఖచ్చితంగా ఇక్కడే దొరుకుతాయి అని తెలిసినట్టు ఎందుకు చెప్పుంటాడు, ఎక్కడో ఉండే వుంటాయి అనుకుంటూ, తలుపులు తెరిచి బస్తాల్లో సరుకు లోపలికో బయటికో తీసుకెళ్తున్న పని వాళ్ళని దాటి మెట్లెక్కి తలుపు దగ్గరికెళ్తే లోపల కనిపించే ఓనర్ ని "మీ దగ్గర పెయింటింగ్ బ్రష్ లూ, కలర్స్ దొరుకుతాయా అనటం", అయేంటో తెలీదన్నట్టు చేతులూపిన సైగో, లేదా "లేవు" అన్న నోటి మాటతో ఎక్కి దిగిన మెట్లే అన్నీ. చీకటి పడుతున్నా అలా ఇంతదూరం వచ్చా, ఈ సందులో ఏమన్నా దొరుకుతాయేమో అని సందు సందూ తిరుగుతూనే ఉన్నా. చివరికి నిరాశగా వెనుదిరిగి వెళ్తూ ఒక దగ్గరా అదే సీన్, బస్తాలు లోపలికీ బయటికీ మోస్తున్న కూలీలు, మెట్లు ఎక్కితే ఒక చిన్న కౌంటర్ లా షట్టర్ తెరిచి లోపల నిలబడి కనిపించిన ఒక యజమాని. సరే ఇక్కడా అడిగి చూద్దాం అని మెట్లెక్కి వెళ్ళి అడిగితే, "ఉండు తెస్తా" అంటూ లోపలికెళ్ళాడు, ఒక ఐదు పది నిమిషాలు వైటింగ్. ఏం తెస్తాడో నేను చెప్పింది అర్ధ అయిందో లేదో, వెళ్ళిపోదామా మళ్ళీ సిటీ బస్ లు దొరుకుతాయో లేదో అని సందేహంలో కొట్టుకుంటున్న మనసు. నాలుగైదు చిన్న అట్ట పెట్టెలతో వచ్చాడు, ఒకటి తెరిచి నా ముందుంచాడు. నా కళ్ళని నేనే నమ్మలేక పోయా. మహాద్భుతం నా కళ్ళ ఎదుట. "క్యామెల్" పోస్టర్ కలర్స్ బాటిల్స్ సెట్. ప్రతి డబ్బా లో వేరే వేరే షేడ్స్ ఉన్నాయి. ఏమీ దొరకని నాకు ఒక్కసారిగా నాలుగైదు రక రకాలు కలర్ షేడ్స్ ఉన్న సెట్స్ లో ఏది తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితి. నన్ను నేనే నమ్మలేకపోయా. ఏదో ఆరు రంగులున్న ఒక సెట్ తీసుకుని ఆ సందుల్లో నడక సాగించా. విజయం సాధించిన ఆనందం లో నడక వేగం పెరిగింది, తొందరగా కాలేజి చేరుకోవాలని. అలా మొదలయిన నా బొమ్మల నడక ఆ రంగుల్తో కొత్త లోకాలకెళ్ళిపోయింది. తర్వాత ఇంకో సారి పని గట్టుకుని వెళ్ళి అదే సందు వెతికి పట్టుకుని, "ఇంకేమన్నా వేరే రంగులుంటే చూపిస్తారా" అని ఆ షాప్ ఆయన్ని కొంచెం విసిగించి అడిగి అడిగి మరీ ఒక సిల్వర్ కలర్ పెయింటింగ్ వెతికి తెచ్చుకున్నా. అదీ "క్యామెల్" కలరే, అయితే తెచ్చుకున్నాక తెలిసింది అది "ఫ్యాబ్రిక్ పెయింట్" అని. అప్పుడర్ధం అయ్యింది ఆ హోల్ సేల్ షాపుల్లో ఈ రంగులెందుకున్నాయో. బట్టలమీద వేసే రంగులు ఫ్యాబ్రిక్ పెయింట్స్ హోల్ సేల్ గా అమ్ముతారు. నా అదృష్టం కొద్దీ ఆయన దగ్గర కొన్ని పోస్టర్ కలర్ సెట్స్ ఉన్నాయి ఆ రోజు, కేవలం నా కోసమే అన్నట్టు.

అలా ఆ రంగుల సెట్ చిక్కటంతో -
"రంగుల లోకం పిలిచే వేళ... రాగం నీలో పలికే వేళ...
విరులా తెరలే తెరచీ రావే... బిడియం విడిచీ నడచీ రావే...
నువ్వేలే రాజ్యం ఉంది... ఆ నాలుగు దిక్కులలో...
లయగా రావే... ప్రియ హృదయ జతులతో..."
అంటూ ఆ రంగుల లోకంలోకి ఆహ్వానించిన నా బొమ్మలు.

రంగులతో పెయింటింగ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో అప్పటిదాకా రంగులు దొరక్క బ్లాక్ ఇంక్ నీళ్లతో కలిపి వేసిన పెయింటింగ్స్ లా ఇండియన్ ఇంకు కి నీళ్ళు కలిపి బ్రష్ తో వేసిన చిత్రం ఇది. చూడటానికి అప్పటి సినిమా తార "విజయశాంతి" లా అనిపిస్తున్నా నిజానికి "మల్లెమొగ్గలు" అన్న సినిమా లో "సాగరిక" బొమ్మ ఆధారంగా వేసింది. బొమ్మలోకన్నా అందంగా రావాలని చేసిన కొన్ని చిన్న చిన్న మార్పులతో రేఖల కొలతలు మారి మరో నటి రూపురేఖలకి దగ్గరగా వచ్చింది. ఈ చిత్రం చూసినప్పుడల్లా నాకు గుర్తొకొచ్చే ఒక తమాషా హాస్టల్ సంఘటన - నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఉన్నా. క్యాంపస్ లోని న్యూ హాస్టల్ లో నా రూములో అప్పటిదాకా వేసిన కొన్ని పెయింటింగ్స్ వాల్ మీద అంటించి ఉండేవి. ఫ్రేములు చేయించే స్థాయి లేని రోజులవి. మాకు రెసిడెన్షియల్ వార్డన్ గా అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక ఎలక్ట్రానిక్స్ జూనియర్ లెక్చరర్ ఉండేవారు. ఆయనకీ హాస్టల్ లో మాలానే ఒక రూము. మెస్ లెక్కలు, అవసరమైతే కొంచెం మామీద పెత్తనం చేస్తూ మమ్మల్ని కంట్రోల్ లో పెట్టే బాధ్యతలు. అప్పుడప్పుడూ రాత్రిపూట మెస్ ముగిశాక అలా రూములు రవుండ్స్ వేసేవారు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నా, నవ్వులు వినపడుతున్నా వచ్చి వార్నింగ్స్ ఇస్తూ. చాలా ఫ్రెండ్లీ గా ఉండేవారు. ఒకరోజు నా రూము నుంచి కొంచెం మాటలు, నవ్వులు వినపట్టంతో హెచ్చరికలు ఇవ్వాలని లోపలికొచ్చి గోడమీదున్న నా బొమ్మలు చూసి ఎవరేశారు అంటూ అడిగి వాటి గురించి మెచ్చుకోలుగా కాసేపు వచ్చిన పని మరచి బొమ్మల గురించే మాట్లాడి, వెళ్తూ వెళ్తూ "అన్నిటికన్నా ఆ విజయశాంతి బొమ్మ సూపర్ గా ఉందయ్యా, దాన్ని బాగా ఫ్రేమ్ చెయ్యించి పెట్టు" అంటూ వెళ్తుంటే అది "విజయశాంతి కాదు" అని నోటి దాకా వచ్చినా, పాపం అలా అనుకుని సంతొషపడనీలే అని ఆయన వెళ్ళాక నేనూ నా రూమ్ మేట్ నవ్వుకున్నాం. నవ్వు అలా ఆయన పొరపాటు పడినందుకు కాదు. మా కాలేజి లో బాలకృష్ణ "వీరాభిమానులు" ఎక్కువగా ఉండేవాళ్ళు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే, సినిమా తుస్సుమన్నా సరే హాస్టల్ లో కోలాహలంగా అరుచుకుంటూ ఒక టి రెండు రోజులు హడావుడి చేసేవాళ్ళు. వాళ్ళ హడావుడి ఎక్కువగా ఉందంటే సినిమా తుస్సుమన్నట్టే లెఖ్ఖ. వాళ్ళందరి ఫ్యావరెట్ హీరోయిన్ అప్పట్లో "విజయశాంతి" నే. ఈయనా పెద్ద "బాలకృష్ణ" అభిమానే అని అందరికీ తెలుసు, అందుకే చుట్టూ అన్ని బొమ్మలున్నా ఈ బొమ్మ ఆయనకి ప్రత్యేకంగా నచ్చేసింది, అలా ఈ బొమ్మ చూసినప్పుడల్లా ఆ తమాషా సంఘటన, బాలకృష్ణ అభిమానుల కోలాహలం ఇప్పటికీ గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడీ వింత కోలాహలం అమెరికా "డల్లాస్" దాకా విస్తరించింది.

కాలేజి లో ఫ్రెండ్స్ తో కాలక్షేపాలు, కబుర్లు, సరదాలు, షికార్లు అన్నీ తర్వాత మధురానుభూతులుగా మిగిలిపోతాయి. అలా నా ఇంజనీరింగ్ కాలేజి అనుభూతుల్లో అన్నిటా అంతటా నా బొమ్మల మధురాలే చోటు చేసుకున్నాయి. అంతగా ఆ కాలేజి లో బొమ్మల సాధన తపించి చేశా, చాలా బొమ్మలు వేశా. చివరికి కాలేజి లో ఒక ఆర్టిస్ట్ గా ఎంతో మందికి సుపరిచయం అయ్యా. ఫైనల్ యియర్ లో మా క్లాస్ లో ప్రతి ఒక్కరికీ రెండు పేజీలు చొప్పున "సోవనీర్ బుక్" లో ఒక పేజి లో పేరు, ఫొటో, దాని కింద ఒక చిన్న చిలిపి కామెంట్, పక్క పేజి లో అడ్రస్ ఉండే బుక్ లో నా ఫొటో కింద పెట్టిన కామెంట్ "రవివర్మ ఆఫ్ ది కాలేజ్". అది చూసుకుని పొంగి పోలేదు. "రవివర్మ" అంత అవ్వాలంటే పెద్ద పెద్ద ఆయిల్ పెయింటింగ్స్ వెయ్యాలి. కొద్ది పోస్టర్ కలర్ రంగులకే విజయవాడంతా తిరగాల్సొచ్చింది, ఆయిల్ పెయింట్స్ మెటీరియల్ నాకెప్పుడు దొరికేదీ. తర్వాత చాలా ఏళ్ళకి తీరని నా కలని నిజం చేస్తూ ఆయిల్ పెయింటింగ్స్ పట్టుబట్టి సాధించి మరీ వేశా. ఆ ఒకానొక చిరకాల వాంఛనీ నా బొమ్మలు తీర్చాయి. ఏ జన్మలో ఏ తీరని కోరికో ఈ జన్మలో ఇలా "నా  బొమ్మలు" గా వచ్చి, ఎవరు కాదన్నా, ఎవరు నన్నొదిలి వెళ్ళిపోయినా, నను వీడక నా జీవితంలో నాతోనే ఉండిపోయాయి...

"జీవితంలోకి వచ్చే ప్రతిదీ కా(లే)దు, వీడక ఉండేదే అనుబంధం."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" చదివి, అవి నచ్చి, ఆపకుండా ఎందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...





Thursday, February 5, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 37 . . .

Portrait of Telugu movie actress - Bhanu Priya
Ink pen on Paper (8" x 11")

జీవితం ఒంటరి ప్రయాణమే. ఒంటరిగా రావటం, ఒంటరిగానే వెళ్ళి పోవటం. రాకపోకల మధ్య నీ ఊపిరి నీదే, నీ అడుగులు నీవే, నీ నడక నీదే, నీ  పయనం నీ గమ్యం రెండూ నీవే. నువ్వేసే అడుగులూ, నువు నడిచే దార్లూ ఒంటరివే. తెలియని గమ్యం వైపు నువ్వేసే నీ అడుగులే నీ దిశ నిర్దేశ మార్గాలు. నీ పయనంలో నువు నడిచే బాటలు, ఆ బాటల్లో నీకెదురయ్యే ప్రదేశాలూ, నువు కలిసే మనుషులూ నీలాగే వాళ్ళ జీవితాల్లో ఒంటరిగా వాళ్ళ గమ్యం వైపు సాగిపోతున్న జీవన బాటసారులే.

హైదరాబాద్ -  అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మహా తెలుగు నగరం. పొట్టకూటికోసం వచ్చి చేరే చదువుకో(లే)ని నిరు పేదకైనా, చదువులు ముగిసిన నిరుద్యోగికైనా, డబ్బున్న మహారాజుకైనా నీడనివ్వగల ఒకే ఒక "మహా తెలుగు వృక్షం". విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో నాలుగేళ్ళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్య ముగించి, డిగ్రీ సర్టిఫికేట్ తోబాటు, అమ్మ శ్రమ ని ఐదువేల రూపాయల రూపంలో జేబులో పెట్టుకుని చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు వేసిన తొలి అడుగు నా జీవిత దిశని నిర్దేశించింది. చిన్నమామయ్య ఫ్యామిలీ తో విద్యానగర్ లో ఉండడంతో ముందు అక్కడికెళ్ళి తర్వాత ఎలాగోలా ఒక చిన్న రూమ్ అద్దెకి దొరికితే అందులో ఉంటూ మెస్ భోజనం చేస్తూ జాబ్స్ వెతుక్కోవటం మొదలుపెట్టాలి, నా కాళ్ళపై నేను నిలబడగలగాలి - అప్పటి(కి) నా ఆశయం అంతే.

అందరి లాగే అక్కడికొచ్చి చేరిన నన్నూ హైదరాబాద్ అక్కున చేర్చుకుంది. అది వరకే పదవ తరగతి శలవుల్లో చిన్నమామయ్య దగ్గర రెండు నెలలు ఉండడంతో హైదరాబాద్ బాగా పరిచయం. ఆ సుపరిచయమే నన్ను హైదరాబాద్ నగరానికి లాక్కొచ్చింది. అప్పట్లో బి.టెక్ కంప్యూటర్ సైన్స్ కి పెద్దగా అవకాశాలు హైదరాబాద్ లో లేవు. బోంబే, ఢిల్లీ లో కొంచెం మెరుగ్గా, తర్వాత అప్పుడప్పుడే వింటున్న బెంగుళూర్, అంతే. నాకవేవీ పరిచయం లేని నగరాలు కావటంతో హైదరాబాద్ వైపు నా తొలి అడుగులు పడ్డాయి. తెచ్చుకున్న డబ్బుతో ఒక సంవత్సరం పాటు ఉద్యోగం రాకున్నా నెట్టుకు రావొచ్చు. దిగిన తెల్లారే నల్లకుంట, శంకర్ మఠ్ ఎదురుగా షాపులపైన ఫ్లోర్ లో ఉండే "స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్" లో అకౌంట్ ఓపెన్ చేయించి డబ్బులు అందులో డిపాజిట్ చేయించాడు చిన్నమామయ్య. జాబ్ దొరికే దాకా నా నిరుద్యోగ భృతి అదే. కావాలంటే అమ్మకి జాబు రాస్తే ఎలాగోలా పంపిస్తుంది. కానీ ఇంకా అమ్మ శ్రమ మీద ఆధార పడటం ఇష్టం లేదు. ప్రతి పైసా ఆచి తూచి ఖర్చుపెడితేనే ఆ మహా నగరంలో మనుగడ. ఎక్కువగా ఎక్కడికైనా నడకే, లేదంటే ఎంత సేపు వెయిట్ చేసయినా, ఎన్ని మారాల్సి వచ్చినా సిటీ బస్సులే. ఆటో ఎక్కాలంటే మీటర్ లో తిరిగే రూపాయి సంఖ్యలు చూస్తేనే భయం. ఆటో ఒక లగ్జరీ.

హైదరాబాద్ కి వచ్చిన రెండో రోజు నుంచే ఉత్సాహంగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టా. ఒంటరిగానే ముందుకి అడుగులేశా. డెక్కన్ క్రానికిల్ న్యూస్ పేపర్ లో అప్పట్లో రోజూ వస్తున్న ఒకటీ రెండు "కంప్యూటర్ సెంటర్ ప్రకటనలు" చూసి ఫైల్ లో డిగ్రీ సర్టిఫికేట్, బయోడేటా తో విద్యానగర్ లో సికిందరాబాద్ కి ఎక్కిన "సిటీ ట్రెయిన్" (ఇప్పుడిదే మెట్రో గా రూపాంతరం చెందింది) నా మొదటి ప్రయత్నం. తర్వాత కొద్ది రోజులకి నాలాగే వచ్చి తమ ఒంటరి పయనంలో కొందరు నా క్లాస్ మేట్స్ కలవటం, కలిసి రూమ్ అద్దెకి తీసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో పడిపోయా. జాబ్స్ కి అప్లికేషన్స్ వేస్తూ, పబ్లిక్ సెక్టార్ జాబ్స్ కి టెస్టులు రాస్తూ, చివరికి ఎయిర్ ఫోర్స్ అయినా, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అన్న ఏ జాబ్ కైనా అప్లై చెయటంతోనే నాలుగు నెలలు దొర్లిపోయాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గి నన్ను వరించిన నా మొదటి ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్న్మెంట్ ది, డిస్ట్రిక్ కంప్యూటర్ సెంటర్ లో డాటా ప్రోసెసింగ్ ఆఫీసర్ గా. అయిష్టంగానే అందులో చేరిపోయా. ఆ నాలుగు నెలల కాలంలో విద్యానగర్, రామ్ నగర్, శంకర్ మఠ్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, చిక్కడపల్లి లో పబ్లిక్ లైబ్రరీ ఇవే ఎక్కువగా నేను తిరిగిన ప్రదేశాలు.

ఉద్యోగ వేటలో రోజూ విద్యా నగర్ నుంచి పొద్దున్నే 10 గంటలకి కాలి నడకన బయల్దేరి చిక్కడపల్లి పబ్లిక్ లైబ్రరీ కెళ్ళి జాబ్స్ కాలమ్స్ చూసి వివరాలు రాసుకుని, రూమ్ కి వచ్చి అప్లై చెయటం నా దైనందిన కార్యక్రమం. ఆదివారం లైబ్రరీ శలవు, కొంచెం బోర్ గా అనిపించేది. అలా ఒక ఆదివారం అతి బోరు కొడుతున్న సమయం లో చిన్నమామయ్య వాళ్ళింటో కూర్చుని పేపర్ తిరగేస్తూ అందులో ఒక సినిమా ప్రకటన చూసి ఏమీ తోచక ఇంక్ పెన్ తో గీసిన గీతలే ఈ బొమ్మ. "ఏ గీత గీసినా నీ రూపమే అన్నట్టు" (నా)కనిపించే అప్పటి నటి "భానుప్రియ" బొమ్మిది. తమాషా ఏంటంటే కింద తెలుగులో "గిరి" అని ఇంగ్లిష్ లో Giridhar అని సంతకం పెట్టింది మాత్రం మా చిన్నమామయ్య. అప్పటికి కొన్ని వందల బొమ్మలేసినా, వేసిన బొమ్మ కింద నా సంతకం ఇదీ అని ఒక పద్ధతిలో నేనింకా సెటిల్ అవలేదు. ఒక్కొకసారి చిన్నమామయ్య సంతకాన్ని అనుకరించే వాడిని, ఒక్కొక సారి అప్పటి సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ సంతకం కూడా అనుకరించేవాడిని. తెలుగులో, ఇంగ్లీష్ లో రకరకాలుగా బొమ్మల కింద సంతకాలు పెడుతూ ఉండటం చూసి బొమ్మయ్యాక, "ఏది గిరీ ఇలా ఇవ్వు, సంతకం ఎలా పెట్టాలో చూపిస్తా" అని తీసుకుని చిన్నమామయ్య పెట్టిన రెండు సంతకాలవి. చిన్నమామయ్య అప్పటికి బొమ్మలు వెయ్యటం తగ్గి రచనల్లో ఉన్నా, దానికి ముందు  పెద్ద చిత్రకారుడు. చిన్నప్పటి నుంచీ నేనేసే బొమ్మలు చూసి నను ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి మా ఫ్యామిలీలో. అయితే సరిగ్గా ఏ బొమ్మ చూసి ఈ బొమ్మ వేశా అన్నది స్పష్టంగా గుర్తులేదు కానీ, అప్పడు వివాదాస్పదంగా "బ్రహ్మర్షి విశ్వామిత్ర" సినిమా ప్రకటనలో చూసి వేసింది అని మాత్రం గుర్తుంది. ఆ సినిమా లో హీరోయిన్ "భానుప్రియ" కాదు. బహుశా ముందుగా ప్రకటనలో ఇచ్చి తర్వాత "మీనాక్షి శేషాద్రి" ని మార్చారో ఏమో తెలీదు. అలా ఉద్యోగ వేటలో ఉన్నా, అదపా దడపా బోర్ కొట్టినపుడల్లా బొమ్మల పయనం మాత్రం సాగేది. ఆ కాస్త నిరుద్యోగ పయనంలోని కొద్ది బొమ్మల్లో ఇది ఒకటి. హైదరాబాద్ లో అప్పుడు చిన్నమామయ్య విద్యానగర్ ఉంటున్న ఇంట్లో వేసిన ఒకే ఒక బొమ్మ కావటం దీని ప్రత్యేకత.

అలా ఉద్యోగ వేట బాటలో ఉన్నపుడు అడపా దడపా బొమ్మలు వేస్తున్నా, జాబ్ వచ్చాక ఆ డబ్బుల్తో చాలా ఆర్ట్ మెటీరియల్ కొని ముమ్మరంగా పెయింటింగ్స్ వెయ్యాలన్న కోరిక మాత్రం మదిలో బలంగా నాటుకునే ఉండేది. మా పెద్దమామయ్య "కావలి" లో ఉండే వాడు. ఆయనతో  ఎవరైనా ఏదైనా అనుభవం లేకుండా ఎదురు వాదిస్తే ఒక బలమైన వాక్యంతో ఆ వాదనకి ముగింపు పలికే వాడు. ఆ వాక్యం ఎప్పుడూ ఈ రెండు మాటలతోనే మొదలయ్యేది. "ఒరే పిచ్చోడా, ...". బహుశా అప్పుడు నా మదిలో నా కోరిక పెద్దమామయ్య ముగింపు వాక్యం లాగే నన్ను చూసి వెక్కిరించే ఉంటుంది -"ఒరే పిచ్చోడా, జాబ్ వచ్చాక నీకింక బొమ్మలకి టైమ్ ఉండదురా..." అంటూ. సరిగ్గా అలా మొదటి జాబ్ వచ్చాక, వెనుదిరిగి చూడలేదు. రెండు దశాబ్దాలు బొమ్మల సడి, సందడి లేకుండానే జీవితం అమిత వేగంగా ముందుకి దూసుకు పోయింది.

అలా రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ సీరియస్ గా బొమ్మలు వేసే ప్రయత్నాలు చేశా. అందరిలాగానే జాబ్, ఫ్యామిలీ, పిల్లలు, పరుగులుతో బిజీ లైఫ్ లోనూ ఒక ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ కూడా వెయ్యలేనన్ని బొమ్మలు ఒక ఐదేళ్ళల్లో(నే) వేశా. స్కెచ్ లతో మొదలుపెట్టి రెండు మూడు స్కెచ్ బుక్కులు నింపేసి, వాటర్ కలర్స్ మొదలు పెట్టి ప్రొఫెషనల్ స్టైల్ పోర్ట్రెయిట్స్ దాకా, నా చిరకాల వాంఛ అయిన ఆయిల్ పెయింటింగ్సూ చిన్నా పెద్దా క్యాన్వాసులపై ముమ్మరంగా వేశా. ఒక రకంగా వేసీ వేసీ ఒక దశలో ఎవరి కోసం వెయ్యాలింకా అని అనిపించి అలసి పోయి చివరికి ఆపా కూడ. నేనొదలాల(నుకు)న్నా నన్నొదలని(వి) నా బొమ్మలు, నన్నే అంటి పెట్టుకున్న(వి) నా బొమ్మలు. నా బొమ్మలు లేని నేను లేను. ఈ జీవితంలో నాకు ఎప్పుడూ, నేనెక్కడున్నా, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటినా తోడైనవి, తోడున్నవి, కడదాకా నాతోనే ఉండేవీ నా బొమ్మలు మాత్రమే. బొమ్మలు వెయ్యటం నేర్చుకోవాలని, వెయ్యాలని చిన్నప్పట్నుంచీ ఎంతగా తపించానో వేసిన ప్రతి బొమ్మనీ అంతగా ప్రేమించా. నా జీవన పయనంలో "నా బొమ్మల ప్రేమ" ని ఇష్ట పడ్డ ప్రతి మనిషినీ, ప్రతి మనసునీ ఒక బాంధవ్యానుబంధంగా భావించా, ప్రేమించా. ఎప్పటికీ అలానే భావిస్తా, ప్రేమిస్తా, ప్రేమిస్తూనే ఉంటా...

"జీవితం ఒంటరి ప్రయాణమే...అయినా వేసే ప్రతి అడుగునీ గుర్తించి ప్రేమించు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" చదివి, అవి నచ్చి, ఆపకుండా ఎందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Monday, January 19, 2026

Listen to your soul...

Ink pen on Paper (8.5" x 11")

Sometimes, life slows you down. But never stop your passion. It's the extra mile that you run that matters in life's race. That extra mile is the important one that makes you satisfied and fulfills your soul.

Always listen to your soul.

Sunday, October 5, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 33 . . .

 
"A Beautiful Lake"
Indian Ink & water with brush on Paper, 10" x 3"

అనంత విశ్వంలో మన ప్రమేయం లేకుండా సాగిపోయే ఒక అద్భుతం - కాలం. ఇందులో "మారనిది ఇది" అంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇందులో ఇమిడిపోవాల్సిందే. ముందుకి పోతూ వెనకటితో పోలిస్తే ఎంతో కొంత మారి తీరాల్సిందే. అది జీవమైనా, సజీవమైనా, నిర్జీవమైనా. చెక్కు చెదరవు అనిపించే మనిషి జ్ఞాపకాలైనా, కాలంతో ఎంతో కొంత మారుతూ ముందుకి పోవాల్సిందే.

నిన్నటి జ్ఞాపకం ఓ పదేళ్ళ తర్వాత నిన్నటిలా అనిపించదు. పాతబడే కొద్దీ తియ్యని జ్ఞాపకం మరింత తియ్యగా అనిపించొచ్చు, చేదు జ్ఞాపకం లో చేదు కాస్తయినా తగ్గిపోనూవచ్చు. మొన్న, నిన్నటి కొత్త, సరికొత్త అనుభవాల జ్ఞాపకాల ప్రభావం పరస్పరం ఒకదానిపై ఒకటి ఎంతో కొంత తప్పకుండా ఉండే తీరుతుంది.

నిశ్చల నీటిలో పయనించే పడవ ముందుకి సాగుతూ పోయే కొద్దీ, ఆ పడవ తాకిడికి కొత్తగా పుట్టే అలలు ఆ పడవని తోస్తూ, ముందుకి పోనిస్తూ అవి వెనక్కి పోతూ పాత అలలతో కలిసి కనుమరుగవుతూ నిశ్చలమయిపోతూ ఉంటాయి. అలాగే ముందుకి సాగే జీవితం అనే పడవలో ప్రతి అనుభవం ఒక అల లాంటి అనుభూతి అయి మనల్ని ముందుకి నడిపి అది వెనక్కి వెళ్ళి నిశ్చలమైపోయి ఒక జ్ఞాపకంగా మిగిలి పోతుంది. మనల్ని ముందుకి నడిపించే ప్రతి అనుభూతీ, కాలంలో మరుగై ఒక జ్ఞాపకమై కనుమరుగై పోయినా, కొన్ని జ్ఞాపకాల ఉనికి మాత్రం కళ్ళముందు సజీవంగా ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళముందున్నా, కనుమరుగైనా మనసులో మాత్రం అప్పుడప్పుడూ అలల్లా మెదులుతూ కనిపించకనే కనిపించే జ్ఞాపకాలే జీవితం తిరిగుతూ చేరే తీరాలకి తిరిగిన మలుపులు. ఈ విశ్వం అనే మహాసాగరంలో పయనించే ఒక పడవ మన జీవితం అయితే, ఆ పడవలో సుదూర తీరాలకి పయనించేది మనం, మనతో ప్రయాణించే మన అనుభవాలూ, మన జ్ఞాపకాలూ.

నా బొమ్మల నదీ ప్రవాహంలో నేను సాగించిన పయనం, ఆ పయనంలో పుట్టిన ప్రతి బొమ్మా నను ముందుకి నడిపిన అలలా కనుమరుగైనా, నా కళ్ళముందు ఇప్పటికీ సజీవంగా నిలిచిన మరిచిపో(లే)ని ఒక తియ్యని జ్ఞాపకమే. నేను వేసిన అన్ని బొమ్మల్లో ఇలాంటి బొమ్మ ఇదొక్కటే కావటం ఈ బొమ్మ ప్రత్యేకత.

సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ఉన్నపుడు మొదలయ్యింది నా సరికొత్త బొమ్మల ఉత్సాహాల ప్రవాహం. ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మల ప్రవాహంలో పయనిస్తూనే ఉన్నా, ఇక్కడ ఉత్సాహంగా మొదలు పెట్టిన ఆ ప్రవాహం మాత్రం కొత్త నదీ ప్రవాహంలో సరికొత్త పడవలా కొత్త కొత్త పుంతలు తొక్కింది. ఆ బొమ్మల ప్రవాహంలో నను ముందుకి నడిపిన అలల్లో ఒకానొక మొదటి అల(జడి) తాకిడి జ్ఞాపకం ఈ బొమ్మ.

అప్పటిదాకా ఇలా కూడా బ్రష్ తో బొమ్మలు వెయ్యొచ్చు అని తెలీదు. కాలేజి లైబ్రరీ లో ఒక బుక్ రాక్ లో ఒక్క అర లో మాత్రం కొద్దిపాటి ఆర్ట్ బుక్స్, మ్యాగజైన్స్ ఉండేవి. ఇంజనీరింగ్ కాలేజి లైబ్రరీలో ఆర్ట్ పుస్తకాలుండటం నాకప్పట్లో కొంచెం ఆశ్చర్యం అనిపించినా, ఆ పుస్తకాల్ని ఎవరూ కదిలించిన దాఖలాలు లేకపోవటం ఆశ్చర్యం అనిపించ లేదు. లైబ్రరీకి ఎప్పుడెళ్ళినా ఎవరూ కదిలించని ఆ బుక్ రాక్ దగ్గరికెళ్ళి ఆ పుస్తకాలు తిరగేసేవాడిని. అందులో ఒక బుక్ నా రూముకి తెచ్చుకున్నా. అందులో ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్, బహుశా చార్ కోల్ తో వేసింది అనుకుంటా, సరిగా గుర్తు లేదు, ఆ బొమ్మ బాగా ఆకట్టుకుంది. చాలా ఫాస్ట్ స్ట్రోక్స్ తో వేసిన బొమ్మ అది. ఒక లేక్ మధ్యలో చిన్న దీవిలా అనిపించే చోట ఒక చిన్న ఇల్లు, పక్కన పెద్ద చెట్లు, పొదలు తో తక్కువ గీతల్లో ఎక్కువ ఊహల్ని రేకెత్తించే బొమ్మది. దాన్ని చూసి ఇండియన్ ఇంక్ లో ముంచిన బ్రష్ తో సాగిన పడవ ప్రయాణమే ఈ పెయింటింగ్. ఇది పెయింటింగ్ లా అనిపించకున్నా దీన్ని పెయింటింగ్ అనే అనాలి. ఎందుకంటే పూర్తిగా బ్రష్ తోనే వేసింది కాబట్టి. ఇండియన్ ఇంక్ కి నీళ్ళు కలిపి పలుచబడ్డ రంగుని ఆకాశం కీ నీటి కీ పెయింటింగ్ లో లా అద్దిన తీరూ ఇందులో గమనించొచ్చు.

ఈ బొమ్మని నిశితంగా పరిశీలిస్తే అందులోని ప్రతి చిన్న గీతా, కాలంలో ఒదిగి చలించే పెద్ద పెద్ద నిశ్చల జీవాల్ని తనలో ఒదిగేలా చేసుకుంది. ముక్కలు ముక్కలుగా అంటీ అంటనట్టున్న గీతలు ఒకదాని పక్కన ఒకటి కలిసి అవి కలిగించే చలనంలో కదిలే చెట్లూ, వాటి ప్రతిబింబాలను తమపై కదిలించే అలలూ, ఆ అలలపై పయనించే పడవా, ఆ పడవలో ముందుకి సాగే ప్రయాణం. ఇవన్నీ కలిసి ఒక్కటైన దృశ్యం.

ఈ ప్రక్రియంతా ఒక రెండు మూడు మైళ్ళ కనుచూపు మేర కనిపించే దృశ్యాన్ని ఐదారు ఇంచిల సైజ్ పేపర్ మీద సన్నని బ్రష్ ని కొద్ది పాటి ఇంక్ లో ముంచి, చేతి వేళ్ళ చలనం నింపుకున్న రేఖల్తో వేసి పరిగెత్తే కాలాన్ని బొమ్మగా కట్టి బంధించ(గలగ)టం. అందుకేనేమో దీన్ని "చిత్రకళ" అన్నారు. అయితే అది కలో, కళో కూడా తెలియని అప్పటి నా బొమ్మల పయనం లో ఒంటరిగా సాగించిన ప్రయాణం నాది. ఆ బొమ్మల ప్రయాణంలో సునాయాసంగా సరస్సుల పై ఆహ్లాదంగా సాగే పయనం లా కొన్ని బొమ్మలు అలవోకగా వెయ్యగలిగిన అందమైన అనుభూతులూ, గిర్రున తిరిగే సుడిగుండాల లోతుల్లో చిక్కుకుని కొట్టుకులాడి గంటలకొద్దీ పడ్డ కష్టానికి ఫలితం రాక ముందుకి పోలేక అక్కడనే నిలబడిపోయిన పరిస్థితులూ, వేగంగా ప్రవహించే నదీ ప్రవాహంలో మరింత వేగంగా ముందుకి నడిచిన అనుభూతులూ, ఒక్కోసారి ప్రవాహానికి ఎదురీదలేక అలసి ఓడి వెనక్కి తోసివేయబడ్డి విసుగూ నిరాశా ఆవహించిన క్షణాలూ అనేకానేకం. 

వేసే ప్రతి బొమ్మా ఉత్సాహంగా ఒక ప్రవాహాన మొదలయే పడవ ప్రయాణమే. మొదలుపెట్టినపుడు ఆ పడవ ప్రయాణం ఎలా ముందుకి సాగుతుందో తెలియని సందిగ్ధమే. ముగిశాకే అర్ధమయ్యేది అది సునాయాసమో, ప్రయాసో, నిరాసో, నిస్పృహో. ముప్పైఎనిమిదేళ్ళనాటి ఆ(నాటి) ప్రయాణం లో నేను చేరిన ఒక అందమైన తీరం ఈ బొమ్మ. 

గీత గీశాక అది నిశ్చలనంగా మారినా అది గీసే ప్రక్రియలో ఆర్టిస్ట్ చేతి చలనం మారబోయే ఆ నిశ్చలనంలో ఇమిడిపోయి ఎప్పటికీ చలిస్తూ కనిపిస్తూ చూపరులను కదిలిస్తూ ఉండటం గమనార్హం. ఈ బొమ్మలో అలాంటి నిశ్చల చలనాలు ప్రతి బ్రష్ స్ట్రోకులోనూ, ప్రతి రేఖలోనూ ఉన్నాయి.

శక్తిని సృష్టించలేం, అలాగే నాశనం కూడా చేయలేం, కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మాత్రమే మార్చగలం. ఇది భౌతిక శాస్త్ర నియమం. ఈ శాస్త్రీయ సృష్టి నియమం ఒక కళాకారుడి చేతివేళ్ళ కొసల నుంచి పుట్టే శక్తికీ వర్తిస్తుంది. హృదయంలో పుట్టే అతి సున్నితమైన ఆ శక్తిని చేతి వేళ్ళ కొసలదాకా పట్టి తీసుకునొచ్చి తనదైన రీతిలో కదలాడే ఊహల అలలపై సాగించే పడవ యానమే బొమ్మల ప్రయాణం. తీరం కానరాని ఆ పడవ ప్రయాణంలో ఒక కళాకారుడు చేరుకున్న కళా తీరాలే కదిలించే కదలని బొమ్మలు...

"తీరం కానరాని పడవ ప్రయాణంలో ఒక కళాకారుడు చేరుకున్న తీరాలే కదిలించే కదలని బొమ్మలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, August 23, 2025

మెగా శిల్పి...

Portrait of Chiranjeevi
Pen on paper 8.5" x 11"

"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు" అన్న మాటలకి నిలువెత్తు నిదర్శనం "చిరంజీవి". ఏ రంగంలో అయినా రాణించాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు, కృషీ, పట్టుదలతోబాటు క్రమశిక్షణ కూడా అవసరం. ఇవన్నీ కూడగట్టుకుని ఒక్కొక్క మెట్టూ ఎక్కి శిఖరం చేరిన "చిరంజీవి". 

"చిరంజీవి చిరంజీవ!"

"ఎక్కిన ప్రతి మెట్టు గుర్తున్నపుడే శిఖరం పై విలువ." ~ గిరిధర్ పొట్టేపాళెం

~~~ *** ~~~


Thursday, August 7, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 32 . . .

"భాను ప్రియ"
Ballpoint Pen on paper


గీసే ప్రతి గీత లో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీత లో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ - చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందునా వేసేది పోర్ట్రెయిట్ అయితే ఆ పొర, తడబాట్ల పరిమితి పరిధి మరింత ఎక్కువవుతుంది. ఇలా అన్ని విధాలుగా డ్రాయింగ్ అనేది ఒక ఛాలెంజ్ ప్రక్రియ. ఈ బొమ్మ నేరుగా బాల్ పాయింట్ పెన్ తో వేసింది. అంటే ఇంకెంత సవాలో ఊహించుకోవచ్చు. కళ్ళు, చూపు, ముక్కూ, ముక్కు పుడక, పెదవులు, ఆ పెదవులపై తళుక్కుమనే సన్నని వెలుగు, జుట్టూ, బొట్టూ, కట్టూ ఇలా అన్నీ కొలిచినట్టు ఉంటే తప్ప పూర్తి అయిన బొమ్మ ఆ బొమ్మ తాలూకు వ్యక్తి(ది)గా అనిపించదు. ఇవన్నీ ఒకే బొమ్మలో ఒడిసి పట్టుకో(గలగ)టమే పోర్ట్రెయిట్ స్పెషాలిటీ.

పోర్ట్రెయిట్ - బొమ్మల్లో ఇదొక ప్రత్యేక విభాగం, అందరు ఆర్టిస్టులు దీని జోలికి పోరు. పోయినవాళ్ళు ఇది బాగా ఇష్టపడతారు, బాగా ఆనందిస్తారు కూడ. ప్రతి మనిషి ముఖంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రత్యేకతల్ని గమనించి పట్టుకోగలిగితే ఆ వ్యక్తి ముఖకవళికలు దగ్గరగా వస్తాయి. ఒక్క చిన్న పొరబాటు చాలు, ఆ వ్యక్తి రూపురేఖలు వేసే బొమ్మలో పూర్తిగా మారిపోయి ఇంకెవరిదో అనిపించటానికి.

నా బొమ్మల్లో ఎక్కువగా వేసింది పోర్ట్రెయిట్స్ నే. చిన్నపుడు చందమామ బొమ్మల మాస పత్రిక చూస్తూ అందులో ఆఖరి పేజీల్లో చిన్నపిల్లల కోసం ఉండే వ్యాపార ప్రకటన "పాపిన్స్ పిప్పరమింట్స్" లో పిల్లాడి బొమ్మని చూసి, ఆ పిల్లాడి క్రాఫు ముందుకి తిరిగిన చిన్న రింగు, గుండ్రటి చుక్కల్లాంటి రెండు కళ్ళు, ఇంగ్లీషు అక్షరం యల్ షేపులో ఉండే ముక్కు, చేప లాంటి నోరు వేసి మొదలు పెట్టిందే నాకు తెలిసి మొట్టమొదట నేను వేసిన పోర్ట్రెయిట్. తర్వాత రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇలా దేవుళ్ళ బొమ్మలు వేస్తూ, కొద్దికాలంలోనే యన్.టీ.రామారావు, కృష్ణ, ఏ.యన్.ఆర్. ల బొమ్మలు వెయటంలో భలే సంతోషంగా అనిపిస్తూ ముందుకి సాగింది పోర్ట్రెయిట్స్ తో నా ప్రయాణం. అలా సినిమా హీరోల్ని అచ్చుగుద్దినట్టు వేస్తూ, చూడకుండా కూడా కొన్ని గీసే స్థాయి కి చేరుకున్నా. "నేరం నాది కాదు ఆకలిది" లో పెద్ద టోపీ పెట్టుకుని నోట్లో సిగరెట్ తో ఉన్న యన్.టీ.ఆర్. బొమ్మైతే చక చకా దొరికిన చోటల్లా గీసేసే వాడ్ని.

చిన్నపుడు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి బొమ్మని వెయ్యాలని ట్రై చేసే ఉంటారు. చాలా మంది ముక్కుని వేసే దగ్గర మాత్రం చాలా కష్టపడే వాళ్ళు. అప్పుడు మేముంటున్న మా ఊరు "కావలి". సినిమా థియేటర్స్ లో ఇంటర్వల్ తర్వాత సినిమా మొదలయ్యే ముందు బయట క్యాంటీన్ లో వేడి వేడి పులిబంగరాలు, మసాలా వడలు తిని, చల్లని సోడానో, వేడి వేడి టీ నో, సిగిరెట్టో తాగొచ్చి సెటిల్ అయ్యే ప్రేక్షకులు వచ్చి కుర్చీల్లో కూర్చునేలోపు తెరపై వేసే, గ్లాస్ పలక మీద వేసిన స్లైడ్స్ లో "పొగ త్రాగరాదు", "ముందు సీట్లపై కాళ్ళూ పెట్ట రాదు" అన్న స్లైడ్స్ తప్పనిసరిగా ఉండేది. ఎవరితో వేయించేవాళ్ళో తెలీదు గానీ, అప్పుడున్న సినిమాల ట్రెండు ని బట్టి "పొగ త్రాగరాదు" అన్న స్లైడ్ కి ఏదో ఒక హీరో సిగిరెట్ తాగుతూ ఆ సిగిరెట్ మీద పెద్ద ఇంటూ మార్కు తో అంతా బానే వేసే వాళ్ళు, ఒక్క ముక్కు తప్ప. ముక్కు దగ్గర మాత్రం సునాయాసంగా అనిపిస్తూనే పడ్డ కష్టమంతా కొట్టొచ్చినట్టు కనపడేది. సునాయాసంగా విచిత్రంగా వేసి పారేసే వాళ్ళు, ముక్కు ముక్కే కాకుండా పోయినా చూడగానే ఫలానా హీరో అని తెలిసిపోయేలా. నాకెప్పుడు థియేటర్లో అవి చూసినా నేనైతే ఇంకా బాగేద్దును అనుకునేవాడ్ని, కానీ అవి ఎవరేస్తారో ఎలా వేస్తారో మాత్రం తెలిసేది కాదు. మా అన్న ఫ్రెండ్స్ నా బొమ్మలు చూసి నువ్వెయ్యొచ్చు కదా గిరీ, బొమ్మలు సరిగ్గా వెయటం రానోళ్ళే వేస్తున్నారు అనేవాళ్ళు. అవెలా వేస్తారో తెలుసుకుని వెయ్యాలని ఉన్నా, ఎవర్ని సంప్రదించాలో తెలిస్తే కదా. చొరవ తీసుకుని థియేటర్ యజమానిని కలిసేంత వయసూ లేదు, ఆ పిల్ల వయసులో అంత పెద్ద సాహసమూ చెయటం తెలీదు. "సాహసం శాయరా ఢింబకా" అని పలికే మాంత్రికుడూ లేడప్పుడు పక్కన. అందుకే ఇంట్లో నాలుగు గోడల మధ్యనే నా పోర్ట్రెయిట్ బొమ్మలు క్రమేపీ కుదురుగా ఎదగ సాగాయి.

ఇంటర్మీడియట్ కాలేజి రోజుల్లో హీరోల్ని దాటి హీరోయిన్ బొమ్మలు అడపా దడపా వేసేవాడ్ని. బాపు, చంద్ర గార్లు వేసిన అందమైన వయ్యారాల అమ్మాయిల బొమ్మలూ వెయటం మొదలుపెట్టాను. ఆడవాళ్ళ ముఖం లో సహజంగానే ఉండే సున్నితత్వాన్ని, కళ్ళల్లో, నవ్వులో ఉండే అందాన్ని, జుట్టులోని హొయల్నీ బొమ్మల్లో పట్టుకో గలగటం నాకేమీ కష్టంగా అనిపించలేదు. యన్.టీ.ఆర్ ని పట్టినంత తేలిగ్గానే పట్టేశా. తర్వాత శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల హాసన్ ఇలా వేస్తూ వేస్తూ ముఖకవళికలు అచ్చు పోసినట్టు గీయటంలో పట్టు సాధించా. అలా వేస్తూ వేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో చాలా కాలం అలనాటి అందాల తార "భాను ప్రియ" బొమ్మల్ల దగ్గర ఆగిపోయా.

"భాను ప్రియ" కళ్ళల్లో పలికే భావాలని, అమాయకత్వాన్ని బొమ్మల్లో పట్టాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఆ నాలుగేళ్ళలోనే. దాదాపు రెండు డజన్ల దాకా రకరకాల పోర్ట్రెయిట్స్ వేసుంటా. ఈ బొమ్మ బహుశా "శ్రావణ మేఘాలు" అన్న సినిమా లోని స్టిల్ అనుకుంటా. ఇందులో ఏదో తెలియని అమాయకత్వం తొణికిసలాడుతున్న ఒక పల్లెటూరి పిల్ల ముఖంలో సహజమైన అమాయకత్వంలో దాగిన ఒకింత సిగ్గు, ఒకింత బిడియం, ఒకింత మురిపెం కలిపిన ఆ చూపుల భావాల్ని వెయ్యాలని చేసిన ప్రయత్నమిది. నేరుగా బాల్ పాయింట్ పెన్ను తోనే వేసిన బొమ్మ కనుక తప్పుల తడికలకి తావే లేదు, ఉన్నా సరిదిద్దటం వీలే కాదు. నిజానికి నేరుగా బాల్ పెన్ తో మొదలు పెట్టేంత సాహసం చెయ్యవసరం లేదు గానీ, కొన్ని కొన్ని అలా అనుకోకుండా వేసి బాగా కుదరటంతో చాలా వరకు అలాగే మొదలుపెట్టి వేసేసేవాడ్ని. ఇప్పుడు వెను దిరిగి చూస్తే అంత కాన్ఫిడెన్స్, అంత నైపుణ్యం ఎట్టొచ్చిందా ఆ రోజుల్లో అనిపిస్తూ ఉంటుంది.

అప్పట్లో వేసిన చాలా బొమ్మలకి చుట్టూ రకరకాల బార్డర్స్ వేసేవాడ్ని. ఈ బొమ్మకి మాత్రం ఒక సర్కిల్ గీశా. దాని వల్ల ఈ పోర్ట్రెయిట్ మరింతగా ఎలివేట్ అయ్యిందనిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి అమెరికా వచ్చాక తెలుసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్ "నార్మన్ రాక్వెల్" పోర్ట్రెయిట్స్ లో ఎక్కువగా కనిపించేది ఇలా బొమ్మ చుట్టూ సర్కిల్. బహుశా అప్పటికి ఎక్కడైనా "నార్మన్ రాక్వెల్" వేసిన బొమ్మలు ఎప్పుడైనా చూశానా అంటే ఆ ఛాన్సే లేదు. అప్పట్లో మనకి "రవి వర్మ" పేరు, చందమామ, నవలలు, వారపత్రికల్లో బొమ్మలు వేసే తెలుగు ఆర్టిస్టుల పేర్లు, బొమ్మలూ తప్ప ఇంకెవరివీ తెలీవు.

కాలేజి లో నా రూమ్ కి వచ్చి నేనేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకున్న ఫ్రెండ్స్ కొద్ది మందే అయినా నేనప్పుడు వేసిన "భానుప్రియ" పోర్ట్రెయిట్స్ ద్వారా అందరికీ నేను "భానుప్రియ" అభిమానిగా ఎప్పటికీ గుర్తుండిపోయా. అమెరికా వచ్చిన కొత్తల్లో "లాస్ ఏంజలస్" లో ఉండే ఒక ఫ్రెండ్ "ఏం గిరీ, మీ భానుప్రియ ఉండేది ఇక్కడే తెలుసా" అన్నపుడు మాత్రం అయ్యో అక్కడుంటే ఎప్పుడైనా కనిపిస్తే నేను వేసిన బొమ్మలు చూపెట్టే వాడిని అని మాత్రం అనుకున్నా. 1997 లో "Giri's Home" అని నా వెబ్సైట్ లో నేనప్పటికి వేసిన బొమ్మలన్నీ ఉండేవి. ఎప్పుడో ఒకప్పుడు "భానుప్రియ" కంటపడకపోతుందా అనుకునేవాడ్ని.

ఆర్ట్ నా హాబీనే అయినా, దాంతో నా సుదీర్ఘ ప్రయాణం లో నా బొమ్మలు మెచ్చిన మనుషులు అతి కొద్దిమందే, నేనూ, నా బొమ్మలూ వాళ్ళకి గుర్తున్నా లేకున్నా నాకు మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తే. చాలా ఏళ్లకి మళ్ళీ టచ్ లోకి వచ్చిన నా ఇంజనీరింగ్ కాలేజి నాటి మిత్రులు మాటల్లో "ఎప్పుడు టీవీ లో భానుప్రియ ని చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి గిరీ" అన్న మాటల్లో చెప్పలేని సంతోషం మాత్రం నా పోర్ట్రెయిట్స్ లో అంతగా ఒదిగి పోయిన అలనాటి అందాల నటి ఆ "భానుప్రియ" బొమ్మల దే...

"గీసే గీత లో నింపే ఇష్టమే బొమ్మకు ప్రాణమై జీవం పోసేది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Tuesday, April 8, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 29 . . .

"వెన్నెల్లో ఆడపిల్ల"
Indian ink on Paper

వెన్నెల రాత్రి - నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే - ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.

"వెన్నెల్లో ఆడపిల్ల" - ఒకవేళ ఇవి ఆ వర్ణన రెండు పదాలు అయితే? పక్కపక్కన చేరిన ఈ రెండు పదాలు ఏ మనసునైనా తప్పక ఊహల పదనిసల్లోకి తీసుకుపోయి వెన్నెల తోటలో విహరింపజేస్తాయి. మనసు ఊహల విహారాలకి కవి కానవసరం లేదు, ఆ ఊహల అనుభూతిన ఊయలలూగగల హృదయముంటే చాలు.

సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ - మరవలేని, మరపురాని నా ఒంటరి పెయింటింగ్ పయనానికి నాంది. అప్పటి వార పత్రికల్లోని కథలు, సీరియల్స్, నవలలు, వాటిల్లోని బొమ్మలు ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న, చేసిన రోజులవి. అప్పటికి నేనూ కొన్ని తెలుగు నవలలు చదివున్నా కానీ, "యండమూరి వీరేంద్రనాథ్" గారి "వెన్నెల్లో ఆడపిల్ల" నవల గురించి వినటమే తప్ప ఇంకా చదవలేదు. మా హాస్టల్ లో కొందరు కాలేజి పక్కనే ఉన్న "తాడిగడప" లో ఒక చిన్న షాప్ నుంచి నవలలు రెంట్ కి తెచ్చి చదువుతూ ఉండేవాళ్ళు. అలా ఒకసారి ఎవరో తెచ్చిన ఈ నవల చేతులు మారుతూ నా చేతికొచ్చింది. ఓ మధ్యాహ్నం మొదలు పెట్టి ఏకబిగిన చదవటం పూర్తిచేసినా పూర్తిగా అందులోనుంచి బయటికి రావటానికి చాలా సమయం పట్టింది. చాలా రోజులు ఆ నవల లోని సన్నివేశాలు నున్ను వెంటాడుతూనే ఉండిపోయాయి. ఏ పత్రిక అయినా, నవల అయినా అక్షరాలకన్నా నేను మొదట చూసేది మాత్రం అందులోని బొమ్మల్నే. చదవక ముందు ఆ నవలపైన చూసిన ముఖచిత్రానికీ, చదివాక పరిశీలించి మరీ మరీ చూసిన అదే ముఖచిత్రానికీ తేడా మనసు మాటల్లో చెప్పటం చేతకాని అప్పటి నా ఆ అనుభూతి నాతో ఆ బొమ్మని వేయించింది. "వెన్నెల్లో ఆడపిల్ల" - పొందికైన ఈ రెండు పదాల కి ఆర్టిస్ట్ "చంద్ర" గారు వేసిన ఆ బొమ్మ అంతే పొందికగా కుదిరింది అనిపించింది. ఆ కథా, కథనం నన్నెంతగా కదిలించాయో, ఆ ముఖచిత్రమూ అంతగానే కదిలించింది.

ఈ నవల్లో పాత్రల పరిచయం, వాటిని నడిపించిన తీరూ ఒక అద్భుతమైన అనుభూతిని మిగిలిస్తుంది. కథా నాయకుడు "రేవంత్", ఒక చెస్ ఛాంపియన్ ప్లేయర్. అందం, తెలివీ, చదువూ ఉన్న కథానాయకి "రమ్య" అతనికి కనపడకుండా, దోబూచులాడుతూ అతని మేధస్సుకి పెట్టే చిన్న చిన్న చిక్కుముడి లాంటి పరీక్షలు, వాటిని విడదీస్తూ వివరిస్తూ చెప్పే సమాధానాలూ, ఆమెని చూడాలన్న కుతూహలం పెరుగుతున్నా అతనికి కనపడని ఆమె, వారిద్దరి మధ్యా జరిగే సంఘటనలు ఇవన్నీ పాఠకుల్ని వెన్నెల తోటల్లో దోబూచులాడుతూ కనిపించినట్టే అనిపిస్తూ, కనిపించక అక్కడక్కడా కట్టిపడేస్తూ, మనసుని సుతిమెత్తగా తాకుతూ వెళ్ళిపోయే చల్లని వెన్నెల పిల్ల గాలుల్లానే అనిపిస్తూ సాగిపోతాయి.

కథానాయకి  తన ఫోన్ నంబర్ కనిపెట్టమని అతనికి క్లూలు ఇస్తూ, అతని మేధస్సుకు పరీక్షలు పెడుతూ ఇలా చాలా ఆసాక్తికరంగా వారిద్దరి మధ్యా కథనం సాగిపోతుంది. చివరికి కనిపెట్టి చెప్పాలనీ, ఆమెని చూసే ఘడియలు సమీపిస్తున్న వేళ అతని చేతికి అందించిన ఆమె రాసిన ఆఖరి ఉత్తరం, అప్పటికే వెన్నెల కిరణం వీడి చీకటిలో కలసి వెళ్ళి పోయిందని తెలిసీ, దగ్గరికెళ్ళి ఆమెని ఒకసారి చూడాలని మనసు బలంగా లాగుతున్నా, గులాబి రేకులమధ్యన ఆమె చేతిని మాత్రమే చూసి, ఇంతదాకా తనని ఊహల్లోనే ఊహించుకుటూ వస్తున్న తన రూపంని మది ఊహల్లోనే నిలుపుకోవాలని, కాలిన చితి ఆరేదాకా అక్కడే ఉండి వెనుదిరిగినపుడు రాలిన ఒక కన్నీటిబొట్టు మాటున మౌనం మాట్లాడే మాటలు ముగింపుగా ఆగే ఆఖరి పేజీ తో పాఠకుని గుండె తడైపోతుంది. ఒక్కసారి చదివితే ఎప్పటికీ తడి ఆరని ఆ అనుభూతి మదిలో సజీవంగా మిగిలిపోయేలా ఆ ముగింపు ఇచ్చిన రచయితకి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఆద్యంతమూ వాళ్ళిద్దరి పాత్రలనీ కథలో నడిపించిన తీరు, అన్నిటికీ మించి ముగింపు, చివరికి ఆఖరి వాక్యమూ అన్నీ ఒక మధురానుభూతిలా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

"వెన్నెల్లో ఆడపిల్ల" అన్న పేరు ఈ నవలకి ఎంత చక్కగా అమరిందో, ఆ రెండు తెలుగు పదాల కలయికకి ఆ చంద్రుని పేరున్న ఆర్టిస్ట్ "చంద్ర" గారు వేసిన ముఖచిత్రం బొమ్మ వెన్నెలంత పొందిగ్గా ఒద్దిగ్గా ఒదిగి మెరిసింది. అప్పటి నా జ్ఞాపకాల్లో ఆ నవలకి ప్రముఖ ఆర్టిస్ట్ "చంద్ర" గారు వేసిన బొమ్మ ఆరెంజ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో నలుపు తెలుపు సన్నని చెస్ బోర్డ్ గళ్ళలో కలిసి, పెద్ద పెద్ద కళ్ళతో, నుదుటిన పెద్ద బొట్టుతో, అందం మేధస్సూ రెండూ కలిసి, ముగ్ధ మనోహరంగా కనిపించే ఒక అమ్మాయి క్లోజప్ ఫేస్. చూడగనే "వెన్నెల్లో ఆడపిల్ల" అనిపిస్తుంది. తీర్చి దిద్దినట్టున్న ఆ బొమ్మ ఇప్పటికీ నా కళ్ళకి కట్టినట్టే ఉంది. ఆ నవల, ఆ నవలా ముఖచిత్రం మిగిల్చిన ఆ మధురానుభూతిని, అప్పుడప్పుడే కుంచె తడబడుతూ బుడి బుడి గీతల అడుగులు వేస్తున్న నా బొమ్మల ప్రయాణం లో పదిలపరచాలని చేసిన ప్రయత్నమే ఈ ఇండియన్ ఇంక్ తో వేసిన "వెన్నెల్లో ఆడపిల్ల" బొమ్మ. మెడని తాకుతూ ఎడమ చెంప కింది వంపు దగ్గర పడ్డ కష్టం మాత్రం గుర్తుంది. ఈ బొమ్మ నాడి అక్కడే ఉంది. పూర్తి గా "ఇండియన్ ఇంక్" లో కుంచె ముంచి అద్దిన బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది. ఇంక్ ని నీళ్ళల్లో కలిపి పలుచని గ్రే కలర్ షేడ్స్ అక్కడక్కడా కనిపిస్తాయి. కుంచె తడబాటు అడుగులూ స్పష్టంగా కనిపిస్తాయి.

ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఈ నవల కొత్త ప్రింట్ ముఖచిత్రం బొమ్మ అలానే ఇంకెవరో వేసినా "చంద్ర గారు" వేసిన బొమ్మంత అందంగా మాత్రం లేదు. నా జ్ఞాపకాల్లో నిలిచిన అప్పటి ఈ నవల ముఖచిత్రం తర్వాతెక్కడా కనిపించలేదు. రీప్రింట్ కి వేసిన ముఖచిత్రం ఒరిజినల్ "చంద్ర" గారు వేసిందైతే కాదు, ఆ ఫీల్ కూడా రాలేదు. ఆర్టిస్ట్ "చంద్ర" గారు అంటే నా మదిలో మెదిలే అతికొద్ది బొమ్మల్లో ఇది ఒకటి. దీనికి ముందు ఇంటర్మీడియట్ లో ఉన్నపుడు "చంద్ర" గారు వేసిన ఒక బొమ్మ అచ్చుగుద్దినట్టు వేశాను, కాలంతో ఎక్కడో కనపడకుండా వెళ్ళి పోయిన ఆ బొమ్మే మొదటిది.

తెలుగు అక్షరానికే కాదు, తెలుగుదనానికీ వన్నెలు అద్దిన అందరి అభిమాన ఆర్టిస్ట్ "బాపు" గారు మెచ్చిన ఇప్పటి తరం ఆర్టిస్ట్ "అన్వర్" గారు, పదిహేనేళ్ళక్రితం నా బ్లాగ్ లో నా ఈ "వెన్నెల్లో ఆడపిల్ల" బొమ్మని చూసి, "ఆ గడ్దం కింది వంపుని ఒడిసి పట్టటం అంత సులభం కాదు గిరిధర్ గారూ!" అంటూ చేసిన వ్యాఖ్య నా ఈ బొమ్మకి లభించిన ఒక గొప్ప కితాబు. "చంద్ర" గారి "డెబ్బయ్యవ" పుట్టినరోజుకి "ఒక చంద్రవంక" అన్న టైటిల్ తో ఆర్టిస్ట్ "అన్వర్" గారు పూనుకుని  ప్రచురించిన పుస్తకంలో "ఒక చెరగని ముద్ర చంద్ర" అని చంద్రగారి బొమ్మలతో నాకున్న అనుభవాల్ని నెమరువేసుకుంటూ నేను రాసిన వ్యాసానికి ఓ రెండు పేజీలు చోటు దక్కటం నా బొమ్మలు నాకందించిన వరం. ఆ వ్యాసం లోని ఆఖరి వాక్యం - "ఆయన ఎరుగని ఆయన కోట్లాది అబిమానుల సమూహంలో ఒక గిరిధర్". కానీ అది ప్రచురణ అయిన తరువాతి సంవత్సరం అదే ఆర్టిస్ట్ "అన్వర్, "మోషే దయాన్" గార్లతో కలసి 2017 లో హైదరాబాదులోని "చిక్కడపల్లి" లో నివాసం ఉంటున్న "చంద్ర" గారి ఇంటికి వెళ్ళి ఆయనతో రెండు గంటలపాటు ముచ్చటించిన నా అనుభవం, "చంద్ర" గారి బొమ్మలతో నాకున్న నా రెండు బొమ్మల ఫలితమే అన్న బలమైన నా విశ్వాసం. ఆయన ఎరుగని ఆయన కోట్లాది అబిమానుల సమూహంలో ఆరోజు నన్నెరిగిన ఆ "పున్నమి తెలుగు వెన్నెల చంద్రుడు" తనచేత్తో ఒక కాపీ నాకివ్వగా, మీ సంతకం పెట్టివ్వండి చంద్ర గారూ, పదిలంగా దాచుకుంటాను అని నేనడగ్గా, నేను ఆయన పక్కన కూర్చుని చూస్తుండగా స్వయంగా నాకోసం ఆ పుస్తకంలో "'గిరి' కి చంద్రుడు" అని రాసి నా చేతికివ్వటం ఈ జన్మలో నా బొమ్మల పుణ్య ఫలం.

ఇపుడున్నంతగా కమ్యూనికేషన్ వసతులు లేని ఆరోజుల్లో హైదరబాదులో ఎంత కష్టపడినా ఒక్క అభిమాన ఆర్టిస్ట్ నైనా కలిసే అవకాశమే రాలేదన్న "చిన్న బాధ" ఆ రోజు "చంద్ర" గారిని కలిశాక కాస్తంత తీరింది. అదీ నాకు పరిచయం అయిన ఇప్పటి తరం గొప్ప ఆర్టిస్ట్ లు "అన్వర్ గారు", "మోషే దయాన్ గారు" తో కలసి వారి సమక్షంలో "చంద్ర" గారిని కలవ(గలగ)టం.

ఆరోజు వారి ముగ్గురితో కలిపి గడిపిన సమయం ఎప్పటికీ అపూర్వం. గడచిన కాలంలో వెలుగు చూడని నా బొమ్మల అనుభవాల అనుభూతుల్లో ఈ "వెన్నెల్లో ఆడపిల్ల" అందించిన అనుభూతి ఎప్పటికీ ఓ ప్రత్యేకం...

"గత కాలపు కిరణాల్లో ఇప్పటికీ కదలాడే అందమైన జ్ఞాపకం - వెన్నెల్లో ఆడపిల్ల."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ... 

Monday, August 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 23 . . .


Ballpoint pen on Paper (8.5" x 11")

నుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంతబాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.

సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి కూడా. హాస్టల్ లో సెకండ్ ఇయర్ లో నా పక్క రూమ్ లో ఉండే "వాసు" (శ్రీనివాస్ నీలగిరి, మెకానికల్ ఇంజనీరింగ్) నాకు పరిచయమయ్యి మంచి మిత్రుడయ్యాడు. వాసు దగ్గర ఏదో మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక ఫుల్ పేజి కలర్ ఫొటో చూశాను. ఒక చిన్న పాప సముద్రం లోని నీళ్ళన్నీ తోడి తన బకెట్ లో నింపాలన్నట్టు ఆ నీళ్లల్లో దిగి చూస్తుండటం, చూడగానే నన్నెంతో ఆకట్టుకుంది. ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ చాలా గొప్పగా తీశాడు. అప్పట్లో మంచి ఫొటో చూస్తే దాని బొమ్మగా గియ్యాలనో, పెయింటింగ్ గా ట్రై చెయ్యాలనో అనిపించేది. ఈ బొమ్మ చూడగానే తీసుకుని బాల్ పాయింట్ పెన్ను తో వెయ్యటం మొదలు పెట్టాను. కళాదృష్టి కలిగిన వాసు కూడా అప్పట్లో నా బొమ్మలకు అభిమాని. వేసిన ప్రతి బొమ్మా పరికించి చూసేవాడు. నా బొమ్మల స్ఫూర్తి తో తనూ క్యారికేచర్స్ ట్రై చేస్తుండేవాడు. వాసు ది గుంటూరు, విజయవాడకి దగ్గరే కావటంతో నెలకి రెండుసార్లన్నా ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు. ఒకసారి దీపావళి కి నలుగురు ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకెళ్ళాడు, రెండ్రోజులు సరదాగా గుంటూరు తిరిగాం. వెంకటేష్ "వారసుడొచ్చాడు" సినిమా కూడా చూశాం. అప్పట్లో తెలుగు వారపత్రికలు, సినిమాల్లో కొంచెం భిన్నంగా పబ్లిసిటీ డిజైన్ చేసే ఆర్టిస్ట్ లు వీళ్ళే నా బొమ్మల సాధనానికి గురువులు. చిరంజీవి "రుద్రవీణ" సినిమాలో "లంక భాస్కర్ గారు" సినిమా టైటిల్స్ లో కొత్తగా రాసిన ఇంగ్లిష్ ఫాంట్ కి ఆ సినిమా న్యూస్ పేపర్స్ పబ్లిసిటీ లో గీసిన చిరంజీవి బొమ్మలకీ చాలా ఆకర్షితుడ్నయ్యాను. ఆ ఇంగ్లీష్ ఫాంట్ ని అనుకరిస్తూ నోట్ బుక్స్ లో హెడింగ్స్, నా పేరూ రాసుకునే వాడిని.

నాలుగేళ్ళ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తయ్యి, మూడవ సంవత్సరంలోకి అప్పుడే అడుగుపెట్టాం. నాలుగేళ్ళూ క్యాంపస్ లో హాస్టల్స్ లోనే ఉన్నాను. కాలేజి లో రెండు హాస్టల్స్ ఉండేవి. మొదటి రెండేళ్ళు ఓల్డ్ హాస్టల్ అని ఒకటి, చివరి రెండేళ్ళు న్యూ హాస్టల్ అని ఇంకోటి ఉండేది. న్యూ హాస్టల్ మంచి ఆర్కిటెక్చర్ తో కట్టిన బిల్డింగ్, మా కాలేజి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిజైన్ చేశారు అని అనేవాళ్ళు. ట్రైయాంగిల్ ఆకారంలో ఆర్కిటెక్చర్ కొత్తగా ఉండేది. పక్కనే ఆనుకుని పొలాలు, కొద్ది దూరంలోనే కనిపిస్తూ ఉండే కానూరులోని "విజయలక్ష్మి సినిమా థియేటర్". మా హాస్టల్ నుంచి పెద్ద పొలం గట్టుమీద పది నిమిషాల్లో నడచి వెళ్ళొచ్చు, అక్కడే చాలా సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఎక్కువగా శనివారం సెకండ్ షోలకి, అప్పుడప్పుడూ మ్యాట్నీలకి. కొత్త సినిమాలు వస్తే మొదటిరోజు మ్యాట్నీకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్తే టికెట్స్ ఇచ్చేవాళ్ళు, క్యూ లో వెళ్ళే పనిలేదు, అయితే అలా వెళ్ళి నేర్పుగా చెప్పి టికెట్స్ తీసుకురాగల సత్తా అందరికీ ఉండేది కాదు, కానీ ప్రతి ఫ్రెండ్ సర్కిల్ లో అలాంటి వాడొకడుండేవాడు. మా ఫ్రెండ్స్ లో "బాలసుబ్రమణ్యం" అని తిరుపతి ఫ్రెండ్ విజయవాడలో ఏ థియేటర్ కెళ్ళినా మేనేజర్ రూమ్ కెళ్ళి కాలేజి పేరు చెప్పి తమాషాగా టికెట్స్ సంపాదించుకొచ్చేవాడు.

మూడవ సంవత్సరం వచ్చేసరికి పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలుపెట్టి వేస్తూ ఉన్నాను. అప్పటికి రెండేళ్ళు కాలేజ్ మ్యాగజైన్ లో నా బొమ్మలు ప్రింట్ అవటంతో చాలామందికి "గిరిధర్" అన్న పేరు స్టూడెంట్ గానే కాదు ఆర్టిస్ట్ గానూ సుపరిచయం అయ్యింది. ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు ఆర్ట్ మీద మక్కువ ఉన్న ఒకరిద్దరు జూనియర్స్ ఆదివారం మధ్యాహ్నం పనిగట్టుకుని నా రూమ్ కి వచ్చేవాళ్ళు ఏం పెయింటింగ్ వేస్తున్నానో చూట్టానికి. కాలేజి మ్యాగజైన్ అంటే గుర్తుకొచ్చే ఒక తమాషా సంఘటన. మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కాలేజి మ్యాగజైన్ కి బొమ్మలు, కవితలు, ఆర్టికిల్స్, ఫొటోస్ సబ్మిట్ చెయ్యొచ్చు అని లిటరరీ క్లబ్ న్యూస్ బోర్డ్ లో నోటీస్ పెట్టారు. అది చూసి నేను వేసిన మూడు బొమ్మలు సబ్మిట్ చేస్తే మూడూ తీసుకున్నారు. అది తెలిసి నా ఫ్రెండ్ ఒకతను ఒక బొమ్మ తెచ్చిచ్చి నాతో వెయ్యించుకుని కింద తన పేరు కూడా నేనే రాసిస్తే సబ్మిట్ చేశాడు. అది తెలిసిన ఇంకో అతను నాకు పరిచయం కూడా లేదు, ఏదో వారపత్రిక పట్టుకొచ్చి అందులో ఒక బొమ్మ వేసి తన పేరు రాయమని ఇబ్బంది పెట్టి మరీ వేయించుకున్నాడు. తర్వాత ప్రింట్ అయిన మ్యాగజైన్ లో వాళ్ళిద్దరూ వాళ్ళ పేరు చూసుకుని మురిసిపోయారు గొప్పగా. నాకు మాత్రం నా మూడు బొమ్మలు, ఆ రెండు బొమ్మలూ కలిసి ఐదు బొమ్మలు ఏకంగా నా ఒక్కడివే ప్రింట్ అవటం చూసుకుని మురిసిపోయాను. తర్వాత ఆ ఇద్దరూ కొంచెం ఆందోళనకూడా పడ్డారు పాపం, ఎవరైనా వచ్చి బొమ్మ వేసివ్వమంటే ఏం చెయ్యాలా అని. కాలేజి తమాషాలు అలా(నే) ఉంటాయి.

న్యూ హాస్టల్ లో ఉన్న రెండేళ్ల కాలేజ్ లైఫ్ భలే ఉండేది. సీనియర్స్ అయ్యాం, ఇంకో ఒకటి రెండేళ్ళలో కాలేజి అయిపోతుంది. ఒక పూట మాత్రమే క్లాసులు. ప్రాక్టికల్స్ కంప్యూటర్ ల్యాబ్ కి పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు. ఎపుడన్నా వెళ్ళి అందరం ఒక్క సారి "మిని కంప్యూటర్ డంబ్ టర్మినల్స్" ముందు కూర్చుని లాగిన్ అయ్యి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏదోటి రాద్దామని మొదలు పెట్టేసరికి లోడ్ ఎక్కువయ్యింది, సిస్టమ్ రీబూట్ చెయ్యాలి అరగంట పడుతుంది అని చెప్పేవాళ్ళు, హ్యాపీ గా హాస్టల్ కి వెళ్ళిపొయేవాళ్ళం, ఇంక మళ్ళీ వచ్చే పనిలేదు. అలా మధ్యాహ్నం పరీక్షలు లేకుంటే, సినిమాకి వెళ్ళకుంటే ఎక్కువగా బొమ్మలు వేస్తుండేవాడిని. ఫైనల్ ఇయర్ లో "సోవనీర్" అని ఒక బుక్ ప్రింట్ చేసి బ్యాచ్ లో అందరికీ ఇచ్చేవాళ్ళు. అందులో ఒక్కో పేజీకి ఒక్కొక్కరి చొప్పున ఆ ఇయర్ బ్యాచ్ లో అన్ని బ్రాంచ్ ల వాళ్లవీ పాస్ పోర్ట్ ఫొటో, అడ్రెస్స్, ఫొటో కింద ఒక తమాషా క్యాప్షన్, క్లాస్ మేట్స్ సెలెక్ట్ చేసిందే. క్యాప్షన్స్ సరదాగా ఉండేవి. నాకు నా క్లాస్ మేట్స్ అందరూ కలసి పెట్టిన క్యాప్షన్ "రవివర్మ ఆఫ్ ది కాలేజ్" అని. తమాషాగా అనిపించింది, నన్ను రవివర్మ తో పోల్చటం ఏంటి అని. అప్పట్లో ఇండియా మొత్తం మీద బ్రిటీష్ కాలం నాటి "రాజా రవివర్మ" అంత పాపులర్ పెయింటర్.

అప్పట్లో చాలా బొమ్మలు ఈ బొమ్మలాగే క్యాజువల్ గా గియ్యటంతోనే మొదలయ్యేవి. ముందుగా అవుట్ లైన్ వేసుకోవటం, పేపర్ మీద కంపోజిషన్ చేసుకోవటం ఇలాంటివేవీ ఉండేదికాదు. అలా పెన్నుతో గీస్తూ పూర్తిచేశాక చుట్టూ బార్డర్ ఇండియన్ ఇంక్ తో వేసేవాడిని. అప్పటికి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ బొమ్మల్లో కమాండ్ వచ్చేసుంది కనుక ఈ బొమ్మలో గమనిస్తే షేడ్స్ సులభంగా వెయ్యగలిగాను. ఆ హెయిర్, హ్యాట్, బాడీ వెనుక భాగం నీడల ఛాయల్లో ఇది కనిపిస్తుంది. ఎదురుగా సముద్రపు నీళ్ళ ని అంత శ్రద్ధగా వెయ్యకపోయినా సముద్రం అనిపించేలా గీసిన సన్నని గీతల షేడ్స్ రియలిస్టిక్ గా లేకున్నా సముద్రాన్ని మాత్రం తలపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు వేసే బొమ్మల్లో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయేమో కానే, అప్పటి పోర్ట్రెయిట్స్ బాడీ ప్రొపోర్షన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసేవాడిని, అంటే అంత ఎక్కువగా శ్రద్ధ ఉండేదన్నమాట ;)

కాలేజి లో ఫ్రెండ్స్ ఇచ్చిన ఉత్సాహం, ప్రోత్సాహం తో నా బొమ్మల ప్రయాణం నాలుగేళ్ళు కొత్త కొత్త ప్రక్రియలు చేస్తూ, మెళకువలు నేర్చుకుంటూ, మెటీరియల్ కోసం విజయవాడ నగరం అంతా గాలిస్తూ, ఆంధ్ర భూమి వారపత్రికలో వచ్చే ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి సాధన చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా, ఆనందంగా సాగిపోయింది. కాలేజి అయ్యాక ఉద్యోగ వేటలో మా అందరి బాటలూ వేరయ్యాయి. ఎవరి విజయబాటల్లో వాళ్ళు పయనిస్తూ అన్ని దిక్కులకీ అందనంత దూరాలకి అందరం వెళ్ళిపోయాం. అస్థిరంగా మొదలుపెట్టిన కాలేజి బయట జీవిత ప్రయాణాలు స్థిరంగా కుదుటపడి జీవితాల్లో స్థిరపడ్డాం. విజయవాడ లో ఒక్కరూ లేరు, కొందరు వాళ్ళ స్వస్థలాల్లో ఇంజనీర్స్ గా, కొందరు హైదరాబాద్, సింగపూర్, కువైట్, అమెరికాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చాలాకాలం ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండానే ఉండిపోయాం. త్వరత్వరగా మారిపోతున్న ఇప్పటి కాలం లో మళ్ళీ అందరం ఈమధ్యనే వెలుగులోకి వచ్చేశాం. మాట్లాడుకున్నపుడల్లా నా బొమ్మల ప్రస్థావన రాకుండా ఉండదు. నేను అప్పట్లో ఎక్కువగా వేసిన నా అభిమాన నటి "భానుప్రియ" ని గుర్తుచేసుకోకుండా ఉండరు. అమెరికాలో భానుప్రియ ఉండేది, నీ బొమ్మలు ఎప్పుడూ చూడ్లేదా అని కూడా అడుగుతుంటారు. లేదు, చూసుండదు. నా బొమ్మలు చూసినవాళ్ళు అతి కొద్దిమందే. ఆ కొద్ది మందిలో "భానుప్రియ" ఉండే ఛాన్స్ లేనే లేదు. ఎప్పుడూ ఎక్కడా వెలుగు చూడని నా కాలేజి రోజుల బొమ్మలు అవన్నీ. అవి చూసిన కాస్త వెలుగల్లా నా చుట్టూ ఉన్న మిత్రుల ముఖాల్లో సరదా, తామాషాల నవ్వులు, ఆ నవ్వులతోబాటు వాళ్ళ కళ్ళల్లో స్నేహ కాంతులు చిందిన అప్పటి వెలుగులే...

"ఆనాటి వెలుగులో ఈనాడు కదలాడే నీడలే జ్ఞాపకాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, August 3, 2024

కళాభినేత్రి...

కళాభినేత్రి వాణిశ్రీ
ballpoint Pen on Paper (8.5" x 11")
 
చాలా కాలం నాటి కోరిక, నా చిన్నప్పటి అభిమాన నటి "వాణిశ్రీ" గారి బొమ్మ వెయ్యాలని. ఈరోజు సోషల్ మీడియా లో వాణిశ్రీ గారి పుట్టినరోజని తెలిసి, నాకిష్టమైన "ప్రేమ్ నగర్" సినిమా లోని "తేటతేట తెలుగులా..." పాటలో ఒక ఫ్రేమ్ ఎంచుకుని వేశాను, a quick line drawing with ballpoint pen.

💐   వాణిశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు!

Saturday, July 6, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 22 . . .


భానుప్రియ - శ్రావణ మేఘాలు, 1986
Ballpoint Pen on Paper 14" x 8"

చూట్టానికి పూర్తయినట్టే కనిపిస్తున్నా నేను కింద సంతకం పెట్టి, డేట్ వెయ్యలేదు అంటే ఆ బొమ్మ ఇంకా పూర్తి కాలేదనే. అలాంటి సంతకం చెయ్యని అరుదైన ఒకటి రెండు బొమ్మల్లో ఇది ఒకటి. ఈ బొమ్మ వేసినపుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ఉన్నాను. కానీ కాలేజి హాస్టల్లో వేసింది కాదు. నా చిన్ననాటి మా ఊరు "దామరమడుగు" లో శలవులకి "బామ్మ" దగ్గరికి వెళ్ళి ఉన్నపుడు వేసింది. నాన్న పుట్టి పెరిగిన ఊరు "దామరమడుగు".

అప్పటికి పదేళ్ళు వెనక్కి వెళ్తే అక్కడే స్థిరపడాలని నాన్న ఇష్టంగా కష్టపడి కట్టుకున్న మా కొత్త ఇంట్లో నాన్న, అమ్మ, బామ్మ, అన్న, చెల్లి, నేను అందరం కలిసి ఉన్నాము. అందమైన అసలు సిసలు తెలుగు పల్లె వాతావరణం సంతరించుకున్న ఊరు. చుట్టూ ఎటు వెళ్ళినా, ఎటు చూసినా పచ్చని పైరుపొలాలు, చల్లని పైరగాలులు. ఊరికి ఒక చివర శివాలయం, చాలా పెద్ద గాలిగోపురం, విశాలమైన మండపాలతో తమిళనాడు దేవాలయ కట్టడాల మాదిరిగానే ఉండేది. ఎదురుగా మూడు రోడ్ల కూడలి, మధ్యలో పాతిన ఆంజనేయస్వామిని చెక్కిన రాయి, ఎప్పుడూ పసుపు పూసి కుంకుమ బొట్లుతో ఉండేది. ఊరి మొదట్లో కూడా అచ్చం ఇలాంటిదే ఇంకొక రాయి ఉండేది. అప్పట్లో గ్రామ దేవతగా ఆ ఊరికి ఆంజనేయస్వామి ని పెట్టుకుని ఉంటారు. శివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకి ఒక పక్కన మా ఇల్లు. మిద్దె మీదకెక్కితే ఇంటికెదురుగా పక్కనే ఉన్న మూడంతస్తుల మిద్దెకన్నా ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆ చెట్లపైన గుంపులు గుంపులుగా తెల్లటి కొంగలు, కుడిపక్కన గాలిగోపురం, దూరంగా పచ్చని వరిపొలాలు, ఇంకా దూరంగా "కోవూరు థర్మల్ పవర్ స్టేషన్" లోని చాలా వెడలు, ఎత్తైన పేద్ద  సిమెంట్ గొట్టం, అందులోంచి లేచి మేఘాల్లో కలసిపోతున్న సన్నని పొగ, ఎంతో ఆహ్లాదంగా ఉండేది.

గట్టిగా మూడేళ్ళున్నామేమో ఆ ఊర్లో. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం కి మధ్యలో ఉంటుంది. మహాభారతం ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు దిగ్గజ కవుల్లో ఒకరైన "తిక్కన సోమయాజి" పుట్టిన ఊరు "పాటూరు" కి వెళ్ళాలంటే మా ఊరు దగ్గర బస్సు దిగి రెండు మైళ్ళు మా ఇంటిమీదుగానే పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్డులో నడచి వెళ్ళాలి. సారవంతమైన వ్యవసాయ భూమితో "మొలగొలుకులు" అనే ఒక ప్రత్యేకమైన వరి వంగడం పైరుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడ ఎక్కువమంది ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కలిసి మెలిసి జీవించే చిన్న ఊరు, అందరికీ అందరూ తెలుసు. ఊరిలో ఎక్కువగా కమ్యునిస్ట్ భావజాలం నిండి ఉండేది. ప్రాచీన కులాల ప్రాతిపదికగా హెచ్చుతగ్గులు ఇప్పటికీ ఉగ్గుపాలతో నూరిపోస్తున్న (అ)నాగరిక సమాజంలో అప్పుడే అవి లేకుండా రూపు మాపారు. బడుగు బలహీన వర్గాలనీ, చదువునీ, చదువుకున్న వాళ్ళనీ గౌరవంగా చూసేవాళ్ళు. భూస్వాముల, సంపన్నుల ఆధిపత్యం అస్సలంటే అస్సలుండేది కాదు. ఒకరకంగా పేదవాడి మాటే ఎక్కువగా చెల్లుబాటయ్యేది. ఊరి కట్టుబాట్లు అలానే పెట్టుకున్నారు. ఎవరి మధ్యనయినా వివాదాలు తలెత్తితే పోలీసులకి ఊర్లో ప్రవేశం లేదు, ఊర్లో పెద్దమనుషులే కలిసి పరిష్కరించేవాళ్ళు. ఒకరకంగా అప్పటి సమాజంలో ఆ ఊరొక "ఆధునిక మైన పల్లె". అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ "సుజాతా రావు" గారికి అందుకనే ఆ ఊరంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

నా చదువు రెండవ తరగతి నుంచి నాలుగవ తరగతి దాకా ఆ ఊరి బళ్ళోనే సాగింది. మా ఊరు నుంచి మూడు మైళ్ళు దూరం "బుచ్చిరెడ్డిపాళెం". అక్కడి హైస్కూలులో నాన్న టీచర్. రోజూ సైకిల్ మీద స్కూలుకి వెళ్ళి వస్తుండేవాడు. "జక్కా వెంకయ్య" అని అప్పట్లో కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఊరే, నాన్నకి చిన్నప్పటి ఫ్రెండ్ కూడా. ఆయన కుటుంబం వాళ్ళు కట్టించిన బడి అప్పుడు ఆ ఊర్లో ఉన్న "ప్రాధమిక పాఠశాల". ఒకటి నుంచి ఏడు తరగతుల దాకా ఉండేది. వరుసగా ఏడు రూములు, పొడుగ్గా వరండా, ప్రతి రూముకీ తలుపు, రెండు కిటికీలు, ప్రతి రెండు రూములకీ మధ్యన తలుపులేని ద్వారం. అది బడికోసమని కట్టినది కాదు, వడ్లు నిల్వచేసేందుకు కట్టిన రూములు కానీ బడికోసం ఇచ్చేశారు అనేవారు. బడి ఎదురుగా వడ్లుని బియ్యం గా ఆడించే మిషన్. మిషన్ అంటే చిన్నది కాదు మూడంతస్తుల ఎత్తులో ఒక ఫ్యాక్టరీ అంతుండేది. ఊర్లో ఉన్న రెండు వడ్ల మిషన్లలో ఇది చాలా పెద్దది. చుట్టూ ప్రహరీ గోడ, ఆనుకునే పచ్చని పొలాలు. బడి వెనకనే మల్లెపూల తోట, స్కూల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సపోటా చెట్టు, ఆ పక్కనే ఇటుకరాళ్ళ బట్టీలు. ఇవన్నీ ఇప్పుడు తల్చుకుంటే అచ్చం చందమామ పుస్తకంలోని గ్రామాల బొమ్మాల్లోలా ఉండేవి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ.

సాయంత్రం బడి అయ్యాక మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు, ఆ చుట్టు పక్కలున్న అన్ని రోడ్లూ మా పిలకాయలవే. శిరి, గిరి (అంటే శ్రీధర్, గిరిధర్...అన్న, నేను), శీనయ్య, శివకుమార్ (వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మా ఇంటి వెనకే ఇల్లు), మల్లిఖార్జున్ (ఈ మధ్యనే చనిపోయాడు), శీనడు, ప్రభాకర్ (మా చిన్నాన్న కొడుకు) మేము ఏడుగురం కలిసి ఆడని ఆట లేదు, పాడని పాటా లేదు. తెగ ఆడేవాళ్ళం. గోళీలు, బొంగరాలు, బిళ్ళంగోడు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ళలు, దొంగా పోలీస్, డిమిండాల్, గాన్లు, టైర్లు, తాటి బుర్రలు కి పుల్ల గుచ్చి పంగాలు కర్ర తో తిప్పే బళ్ళు, సబ్బు పెట్టెకి దారం కట్టి లాగే బళ్ళు, చివరికి ఇళ్ళు కట్టేందుకు తోలి పెట్టిన ఇసుక కుప్పలు తిరుపతి కొండలుగా, ఇటుక రాళ్ళని ఎక్కుతున్న బస్సులుగా వాటిపైన తిప్పేవాళ్లం. దారిలో వస్తూ పోయే ఎద్దుల బండి వెనక పట్టుకుని కాళ్ళు పైకెత్తి కోతిలా వేళ్ళాడుతూ ఆ బండాయన వెనక్కి చూసి అరిచేదాకా చాలా దూరం పోయేవాళ్లం. వర్షాకాలంలో పెద్ద వర్షం వస్తే మా ఇంటి ఎదురుగా పొంగి పొర్లే కాలువ ఊరి చివరిదాకా పారి అక్కడి పొలాల మధ్య పారే "కోవూరు కాలువ" లో కలిసేది. ఆ కాలువల వెంట కాగితం పడవలు చేసి వాటితో పరుగులు తీసేవాళ్ళం. ఇక మా ఇంటి దగ్గరున్న దేవాలయంలో అయితే చెట్లూ, మండపాలూ, గోపురాలూ, గోడలూ అన్నీ మావే. అయితే ఆ దేవాలయం గోడలు ఎక్కి ఆడే ఆటల్లోమాత్రం నాకూ అన్నకీ మిగతా పిల్లలకన్నా కొంచెం స్వేచ్ఛ తక్కువ. ఎవరైనా చూస్తే నాన్నకి చెప్తారనే భయం. కొంచెం చీకటి పడబోయే దాకా చూసి మేము ఇంటికి రాకుంటే మెల్లిగా బామ్మ బయల్దేరేది నన్నూ అన్నని వెతుక్కుంటూ, "నాయనా శిరీ, గిరీ" అని పెద్దగా పిలుస్తూ. ఆ పిలుపు వినబడితే ఇంక ఎక్కడి ఆటలు అక్కడ కట్టు, ఎక్కడి వాళ్ళం అక్కడ ఆగి ఇళ్లకి బయల్దేరేవాళ్ళం. సాయంత్రం అయితే ప్రతి ఇంట్లోనూ "దాలి" అని వేసే వాళ్ళు. దాలి అంటే ఇంటి వెనక ఒక మూల చిన్న గుంట, అందులో ఒక పెద్ద కుండ ఎప్పుడూ పెట్టే ఉండేది. సాయంత్రం అయితే చుట్టూ గడ్డి పెట్టి మంట పెడితే నీళ్ళు కాగుతూ ఉండేవి. ఊర్లో సాయంత్రం అయితే దాదాపు ప్రతి ఇంటి వెనకనుంచీ పొగ పైకి లేస్తూ ఉండేది. వేడి నీళ్ల స్నానం చేసి, ఇంట్లో వోల్టేజి తక్కువగా ఉన్న లైట్ల వెలుగులో కాసేపు చదివి, భోజనం చేసి నిద్రపోయేవాళ్లం. ఎండా కాలం అయితే మిద్దెమీద పరుపుల పక్కలు, చుక్కలు చూస్తూ బామ్మ కథలు వింటూ నిద్ర పోయేవాళ్లం. చలికాలం అయినా, లేదా వర్షం వచ్చినా వరండాలో దోమతెర కట్టిన మంచాల మీద పక్కలు.

పండగలప్పుడైతే వాతావరణం భలే ఉండేది. వినాయక చవితి అయితే పొద్దున్నే లేచి పిలకాయలం ఊరి పొలాల గట్ల వెంట వెళ్ళి తిరిగి పత్రి, గరికె, పూలూ కోసుకుని వచ్చే వాళ్ళం. అందరివీ వరి పొలాలు కావడంతో ముఖ్యంగా "సంక్రాంతి పండగ" బాగా జరుపుకునే వాళ్ళు. పొద్దున్నే నెత్తిన రాగి గిన్నె, కాషాయం బట్టలతో, విభూది, నామం దిద్దుకుని, పూల దండ వేసుకుని నారదుడి అలంకరణతో భజన చేస్తూ బియ్యం కోసం వచ్చే హరిదాసులు. బియ్యం దోసిట్లో తీసుకెళ్ళి వేసేటపుడు కిందికి వంగి కూర్చుంటే ఆ గిన్నెలో బియ్యం వెయ్యటం భలే తమాషాగా ఉండేది. ఇంకా బుట్టలు పట్టుకుని గుంపులు గుంపులుగా ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో చాలా మంది వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలుకూడా. అందరికీ ఒక బుట్టలో రెడీగా పెట్టుకున్న వడ్లు వేసే వాళ్ళం. సాయంత్రం అయితే వేషాలు వేసుకుని పాటలు, డ్యాన్సులు వేస్తూ ఇంటింటికీ వేషగాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళకి మాత్రం నిప్పట్లు (అంటే అరిసెలు), ఉప్పు చెక్కలు, బెల్లం చెక్కలు ఇవి మాత్రమే ఇవ్వాలి, ఇంకేం తీసుకోరు. రాత్రి కొంచెం పొద్దుబోయాక పెట్రొమాక్స్ లైట్స్ వెలుగు లో "కీలు గుర్రాల" ఆటలు, మా ఇల్లు దేవాలయం దగ్గర ఉండడంతో ఆ కూడలిలో వచ్చి చాలా సేపు ఆడేవాళ్ళు. వీళ్ళు ఏమీ ఆశించరు, కేవలం ప్రజలకి ఎంటర్టెయిన్మెంట్ కోసం అంతే. ఆ మూడు పండుగ రోజుల్లో  ఒకరోజు మాత్రం పొద్దు పోయాక దేవాలయం బయట స్టేజీ కట్టి డ్రామా వేసేవాళ్ళు. బాల నాగమ్మ, దుర్యోధన ఏకపాత్రాభినయం, గయోపాఖ్యానం ఇలాంటి నాటకాలు ప్రసిద్ధి. అప్పుడు మా ఇంటి ప్రహరీ గోడమీద,  మిద్దెపైనా కొంత మంది చేరేవాళ్ళు చూట్టానికి. ఎవర్నంటే వాళ్ళని బామ్మ చేరనిచ్చేది కాదు.

"బామ్మ" - దామరమడుగు అంటే గుర్తుకొచ్చే మొట్ట మొదటి వ్యక్తి బామ్మ. బామ్మ లేని మా జీవితం లేదు. మా జీవితాల్లో, ఆ ఊరితో, ఆ ఇల్లుతో అంతగా పెనవేసుకుపోయింది బామ్మ. మాకే కాదు ఊర్లో అందరికీ ఆమె బామ్మే. చిన్నా, చితకా, పిల్లా, పెద్దా అంతా "బామ్మా" అనే పిలిచేవాళ్ళు. సాయంత్రం అయితే మా ఇంటి వాకిట మెట్లమీద చేరేది. వచ్చే పోయే పిల్లా జెల్లా ఒక్కరినీ వదలకుండా, ప్రతి ఒక్కరినీ పలకరించాల్సిందే, అందర్నీ విచారించాల్సిందే. బామ్మకి గిట్టని వాళ్ళని మాత్రం పలకరించకుండా అట్టే తేరపారి చూసేది. ఎవర్నైనా పలకరిస్తే పలక్కుంటే మాత్రం విసిరే మాటల చురకలూ, ఛలోక్తులూ వాళ్ళకి సూటిగా తగలాల్సిందే. ఎవరైనా పలక్కుండా గమ్ముగా దగ్గరికొస్తే మాత్రం, "ఎవురయ్యా నువ్వా" అంటా తెలిసినా తెలియనట్టే పలకరించేది. అలా ఆ ఊర్లో అందరూ బామ్మకి పరిచయస్తులే.

ఆ ఊరు వచ్చిన రెండు మూడేళ్ళకే నాన్నకి "కావలి" ట్రాన్స్ఫర్ కావటంతో ఇల్లు, పొలం చూసుకునే పన్లు బామ్మకి అప్పగించి మేమంతా "కావలి" కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కావలికెళ్ళిన రెండేళ్ళకే అనూహ్యమైన మార్పులు జరిగి, పరీక్షలు రాసి సెలెక్ట్ అయి తొమ్మిదేళ్ళకే "ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి" లో నన్ను చేర్పించటం, ఎలాంటి దురలవాట్లూ లేని నాన్నకి గొంతు క్యాన్సర్ వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళి పోవటంతో, అందరూ ఉన్నా మాకే అండా లేని ఆ ఊర్లో, బామ్మ మా ఇల్లూ, పొలం చూసుకుంటూ వాటిని మాకోసం మా భవిష్యత్తు కోసం కాపాడుకుంటూ, చాలా ఏళ్ళు పాతబడే దాకా మా కొత్త ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది. అందుకనే మేము ప్రతి శలవులకీ "దామరమడుగు" వచ్చి కొద్ది రోజులు బామ్మ దగ్గరుండి వెళ్ళే వాళ్ళం. అప్పుడప్పుడూ బామ్మ "కావలి" వచ్చి మాతో కొద్ది రోజులు గడిపి వెళ్ళేది. 

అలా ఇంజనీరింగ్ చేస్తున్నపుడూ శలవుల్లో బామ్మ దగ్గరికి  వెళ్ళేవాడిని. అప్పటి చిన్ననాటి స్నేహితులంతా చదువుల్లోనో, ఊర్లల్లో వ్యవసాయాల్లోనో చేరి దూరమయిపోయారు. వెళ్తే ఒకరో ఇద్దరో ఇంటికొచ్చి పలకరించేవాళ్ళు. మిగిలిన రోజంతా నేనూ, అన్నా, బామ్మ, అమ్మా, సమయం ఒక మాత్రాన ముందుకి సాగేదే కాదు. రోజులు చాలా పెద్దవిగా అనిపించేవి. నేనూ అన్నా "క్యారమ్స్" ఆడే వాళ్ళం, పొలాల్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళం, రేడియోలో పాటలు వినేవాళ్ళం, బీరువా తెరిచి మా చిన్నప్పటి నాన్న గురుతులు చూసుకునే వాళ్ళం. ఎంత చేసినా ఏం చేసినా రోజు మాత్రం ముందుకి కదిలేది కాదు. అలాంటప్పుడు ఒక్కోసారి కాగితం పెన్నూ తీసుకుని బొమ్మలు మొదలుపెట్టేవాడిని. అన్న ఆ ఊరికి వచ్చే ప్రతిసారీ నెల్లూరు బస్టాండులో "సితార" లేదా "జ్యోతిచిత్ర" సినీ వారపత్రిక కొనేవాడు. దాన్నే రోజూ అటూ ఇటూ తిరగేసే వాడు. అలా అప్పటి ఒక "సితార" పత్రిక ముఖచిత్రం మీద అచ్చయిన ఇంకో సితార "భానుప్రియ" నాట్య భంగిమని చూసి వేసిన బొమ్మ ఇది. నేను బొమ్మలు వేస్తానని తెలిసి ఆ ఊర్లో ఒక పిండి మిషన్ ద్వారం గడపకీ నన్ను అడిగి ఎర్రని బొట్లు, పువ్వులు పెయింట్ వేయించుకున్నారు. మా చిన్నాన్న ఇంటి సింహద్వారానికి పసుపు రంగు మీద నాన్న వేసిన ఎర్రని తామరపువ్వులు రంగు వెలిస్తే వాటిపైన నాతో మళ్ళీ అలాగే రంగులు వేయించుకున్నారు. అప్పటికి మనం బొమ్మలు బాగా వేస్తాం అని ఊర్లో ఫ్రెండ్స్ కి, కొంతమంది బంధువులకీ తెలుసు. వాళ్ళెవరైనా వస్తే నేను వేసిన బొమ్మలు చూసేవాళ్ళు, లేదంటే మనకి మనమే ప్రేక్షకులం, అంతే.

ఈ బొమ్మ వేసిన క్షణాలూ గుర్తున్నాయి. ఊరికే సరదాగా టైమ్ పాస్ కోసం బాల్ పాయింట్ పెన్నుతో మొదలు పెట్టిన బొమ్మ. కొంచెం వేశాక బాగా వస్తుంది అనిపించటంతో అలా మొత్తం వేసుకుంటూ వెళ్ళాను, బహుశా రెండురోజులు సమయం తీస్కునుంటానేమో, కానీ కావలి కి వెళ్ళాల్సిన రోజు రావడంతో పూర్తి చెయ్యకుండా నాతో తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత పాదాల కింది భాగం పూర్తి చెయ్యనేలేదు. కొన్నేళ్ళ తర్వాత ఎప్పుడో ఒకసారి కింద పచ్చ గడ్డిలా గీసి అక్కడ మాత్రమే పచ్చని రంగు వేశాను. ఇప్పటికీ సంపూర్ణం అయ్యీ కానీ అసంపూర్ణమయిన బొమ్మ ఇది.

అయితే ఇందులో అప్పటికి కొంత పదునెక్కిన నా పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమాత్రం పెన్సిల్ వాడకుండా నేరుగా పెన్నుతో సరిదిద్దేందుకు తావు లేకుండా వేసిన బొమ్మ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి. హావభావాలే కాదు, బాడీ ప్రపోర్షన్స్ కొలిచినట్టుండాలి, అందులోనూ నాట్య భంగిమ, ఏ మాత్రం పొల్లుపోయినా విభిన్నంగా అనిపిస్తుంది. అప్పటికే పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలు పెట్టి కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాను. అందుకనేనేమో ఈ బొమ్మలోనూ ఆ చీరా షేడ్స్ కూడా పెన్నుతోనే అయినా పెయింటింగ్ ఛాయల్లోనే వేశాను.

మామూలుగా నా బొమ్మల్లో హెయిర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని. ఇందులో కూడా పెట్టాను, కానీ ఇంకా పూర్తి కాలా, ఇంకొక రౌండ్ వేస్తే కానీ పూర్తి కాదు. ఇన్నేళ్ళు పూర్తి కానిది ఇక ఎప్పటికీ కాదు. ప్రతి ఆర్టిస్ట్ వేసే బొమ్మల్లో కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతుంటాయి. కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు, కొన్ని పూర్తి కావంతే. ఈ బొమ్మ పూర్తికాకపోవటానికి కారణమేమీ లేకున్నా పూర్తి కాని అసంపూర్ణమైన ఈ బొమ్మ నాకు మాత్రం సంపూర్ణ మైనదే. ఎందుకంటే - నా చిన్ననాటి మా పల్లెటూరి వాతావరణం, మేమందరం కలిసి ఉన్న మా ఇల్లు, ఆ గాలీ, ఆ నేలా, ఆ కాలం, కాలం మోసుకెళ్ళి పోయిన ఆనాటి జ్ఞాపకాలూ, వీటన్నిటినీ ప్రతి గీతలో పదిలంగా పది కాలాలపాటు సంపూర్ణంగా పదిలపరచుకుని, దాచుకుని, చూసిన ప్రతిసారీ కొద్ది క్షణ్ణాలైనా నాకు "పునర్జన్మ" ని ప్రసాదించి కరిగి పోయిన కాలంలో ఘనీభవించి పోయిన అప్పటి తియ్యని జ్ఞాపకాలని మళ్ళీ కదిలిస్తూ, మనసుని తాకి ద్రవిస్తూ...

"అసంపూర్ణమైన పనిలోనైనా ఒదిగిన జ్ఞాపకాలు మాత్రం సంపూర్ణమే." 
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Friday, January 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 16 ...

రాధాకృష్ణులు - రేఖా చిత్రం
Indian Ink and Poster Colors on Paper


<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 15                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 17 -->
రాయటం నేర్చిన ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు ఏదో ఒక రేఖాచిత్రం గీసే ఉంటారు. ఒక మనిషినో, పువ్వునో, చెట్టునో, కదిలే మేఘాన్నో, ఎగిరే పక్షులనో, నిండు చందమామనో, లేదా రెండు కొండల మధ్యన పొడిచే సూర్యుడినో. రేఖాచిత్రాలే గుహల్లో వెలుగు చూసిన మొదటి మానవ చిత్రాలు. ఎలాంటి బొమ్మల ప్రక్రియ అయినా మొదలయ్యేది ఒక చిన్న రేఖతోనే. సంతకం కింద తేదీ వెయ్యని నా అతికొద్ది బొమ్మల్లో ఈ రేఖా చిత్రం ఒకటి. 1992-93 సంవత్సరాల మధ్య వేసింది.

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజీ చదువు పూర్తి చేసాక, సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ కెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్ తోబాటు స్కాలర్ షిప్ రూపంలో వెనక్కి వచ్చిన ఆఖరి సంవత్సరం కట్టిన ట్యూషన్ ఫీజ్  Rs. 5,000 రూపాయలతో డిసెంబర్ 1989 లో భవిష్యత్తు బాటని వెదుకుతూ ఒక్కడినే హైదరాబాదు మహానగరానికి పయనమయ్యాను. అప్పట్లో బెంగుళూర్, ఢిల్లీ అయితే కంప్యూటర్ సైన్స్ కి జాబ్స్ ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువ అని విన్నా అక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేకపోవటం, హైదరాబాద్ లో చిన్నమామయ్య ఫ్యామిలీ శంకర్ మఠ్ దగ్గర విద్యానగర్ లో ఉండటం, ఇంకా నా పదవ తరగతి శలవుల్లో ఒక రెండు నెలలు హైదరాబాద్, నవీన్ నగర్ లో (శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి ఇంటి వెనుక) ఉంటూ హిమయత్ నగర్ "రావూస్ ట్యుటోరియల్స్" లో కోచింగ్ చేరి హైదరాబాద్ చూసిన అనుభవం...ఆ సుపరిచయం తో హైదరాబాద్ నాకు కొత్తేమీ కాకపోవటం...అలా అక్కడ జీవితం ఒకరకంగా పునః ప్రారంభమయ్యింది.

అప్పటికే హైదరాబాద్ మహానగరం. ఎక్కడికెళ్ళాలన్నా సిటీ బస్సులు, ఆటోలు, లేదంటే నడక...ఇవే  మార్గాలు. సెల్ ఫోన్ తో బుక్ చేస్తే మనం ఉన్న దగ్గరికి వచ్చి ఎక్కించుకునే ఓలా, ఊబర్ల కాలం ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చి ఉన్నా, ఆటో ఎక్కాలంటేనే తిరిగే మీటర్ చూసి కళ్ళు తిరిగే కాలం, ఓలా గీలా టాక్సీలు భరించే స్తోమత అందరికీ ఉండేది కాదు. అయినా ఉత్సాహంగా వెళ్లిన రెండో రోజే ఉద్యోగ వేట మొదలయ్యింది. ఒక పేజీ Resume ఫైల్ పట్టుకుని The Hindu, Deccan Chronicle Newspapers లో చూసిన ఒకటి రెండు Computer Centers addresses వెదుక్కుంటూ విద్యానగర్ నుంచి సికిందరాబాద్ కి సిటీ ట్రెయిన్ లో ప్రయాణం, నా జాబ్ ప్రయత్నంలో తొలి ప్రయాణం...ఇప్పటికీ కొత్తగానే గుర్తుంది. అప్పుడు కొద్ది రూట్స్ లో మాత్రమే సిటీ ట్రెయిన్స్ ఉండేవి. బహుశా ఆ రూట్ ఫలక్ నుమా నుంచి సికిందరాబాద్ వరకూ అనుకుంటాను. క్రిక్కిరిసిన సిటీ బస్సులతో పోలిస్తే ట్రెయిన్స్ అర కొర ప్రయాణీకులతో చాలా ఖాళీ గా నడిచేవి. ఇప్పుడు మెట్రో రెయిల్ అంత ప్రాచుర్యం లో లేవవి. అసలు సిటీ ట్రెయిన్స్ ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలీదు. అలా సికిందరాబాద్ లో ఒకటి, రెండు చిన్న కంపెనీలకెళ్ళి రెసెప్షన్ డెస్క్ వద్ద పరిచయం చేసుకుని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని జాబ్స్ కోసం వచ్చాను అని చెప్పి ఇస్తే, ఏవైనా జాబ్స్ ఉంటే లెటర్ పంపిస్తాం అని చెప్పి Resume తీసుకునేవాళ్ళు. పోస్టల్ అడ్రెస్ చిన్నమామయ్య ఇంటిది ఇచ్చి రోజూ ఏమైనా పోస్ట్ లో వస్తాయా అని కొన్ని రోజులు ఎదురు చూశాను. ఎప్పుడూ ఎక్కడినుండీ అలాంటి కాల్ లెటర్స్ అయితే రానేలేదు. చివరికి విద్యానగర్ దగ్గరే ఉన్న VST Industries (Vazir Sultan Tubacco Company) కెళ్ళి కూడా Resume ఇచ్చి వచ్చాను, పెద్ద కంపెనీ, కంప్యూటర్స్ ఉండి ఉండొచ్చు అని చిన్నమామయ్య చెప్తే.

అప్పట్లో ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి పబ్లిక్ సెక్టర్ కంపెనీ జాబ్స్ కి ఎంట్రన్స్ పరీక్షలకి నోటిఫికేషన్స్ పేపర్స్ లో వేస్తూ ఉండేవాళ్ళు. అలా కొన్ని పరీక్షలు కూడా రాసి కాల్ లెటర్స్ కోసం ఒకటి రెండు నెలలు ఎదురుచూపులు. అలా రెండు మూడు నెలల తర్వాత News Paper లో A.P. Technology Services Limited, State Government Jobs కోసం Notification చూసి apply చేసి ఒకరోజు పొద్దున ఉస్మానియా యూనివర్సిటీ లో ఎగ్జామ్ రాశా. ఆరోజు సాయంత్రమే బూర్గుల రామకృష్ణా రావు గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్ లో, ట్యాంక్ బండ్ అంచున, లిబర్టీ దగ్గర రిజల్ట్స్ పెట్టారు. పరీక్షలో నెగ్గాను, తరువాతి రోజే ఇంటర్వ్యూ కూడా అయ్యింది. అదే మొట్టమొదటి ఇంటర్వ్యూ, బాగా చేశాను. ఒక నెల తర్వాత అనుకోకుండా రిజిస్టర్డ్ పోస్ట్ లో అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. Government Jobs అంటే నాకు ఆసక్తి లేదు. అయినా అయిష్టంగానే చేరిపోయాను. నెలకి Rs. 1,500 శాలరీ. అప్పుడు సగటు శాలరీల కన్నా చాలా తక్కువ. కానీ ఆ జాబ్ మంచి అనుభవాన్నిచ్చింది. చాలా నేర్చుకునే అవకాశం ఉండేది, ఎంతో స్వయంకృషితో నేరుకున్నాను. అదే నా కెరీర్ కి గట్టి పునాది అయ్యింది. అప్పుడప్పుడే గవర్నమెంట్ రికార్డ్స్ కంప్యూటరైజేషన్ మొదలయ్యింది. ట్రెజరీ, పోలీస్ శాఖ, RTO ఆఫీసుల్లో సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ మొదటిసారి ప్రవేశపెట్టిన బ్యాచ్ మాదే. ఆ ఘనత అంతా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్స్ గా ఉన్న శ్రీ. మర్రి చెన్నారెడ్డి, శ్రీ. నేదురుమల్లి జనార్ధన రెడ్డి, శ్రీ. కోట్ల విజయభాస్కర రెడ్డి గార్లదే. ఆ నాలుగైదు ఏళ్లలో చాలా గట్టి పునాదులు వేశారు. మొట్ట మొదటి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కూడా అమీర్ పేట లో వెలిసింది అప్పుడే. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కి పునాదులు వేసిన క్రెడిట్ నూటికి నూరు శాతం వాళ్ళదే.

హైదరాబాద్ వచ్చాక సరిగ్గా మూడు నెలలు పట్టింది అలా మొదటి జాబ్ లో చేరటానికి. ఆ మూడు నెలల్లో రోజూ చిక్కడపల్లి లైబ్రరీ కి నడిచి వెళ్ళి News Papers అన్నీ జాబ్ నోటిఫికేషన్స్ కోసం తిరగేయటం ఒక పూట పనిగా పెట్టుకున్నాను, పనిగా అనేకన్నా లక్ష్యంగా పెట్టుకున్నానేమో అనిపిస్తుందిపుడు, ఒకరోజు మిస్ అయినా ఏదో మిస్ అయిపోతాను అన్నంట్టుండేవాడిని. అయినా బొమ్మలు మాత్రం మానలేదు. అడపా దడపా పేపర్స్ పై  వేస్తూనే ఉన్నాను. జాబ్ వచ్చాక ఆర్ట్ మెటీరియల్ కొనటానికి డబ్బులుండేవి, అబిడ్స్, కోఠి కెళ్లి వెతికి మరీ ఆర్ట్ మెటీరియల్, ఆర్ట్స్ బుక్స్, మ్యాగజైన్స్ బాగా కొనేవాడిని.

ఇండియన్ ఇంక్ లో ముంచి బ్రష్ తో వేసింది ఈ రాధాకృష్ణుల బొమ్మ. ఈ బొమ్మకి మూలం నా మొదటి జాబ్ లో కొలీగ్ పెళ్ళి కార్డ్ పై ఒక కార్నర్లో ప్రింట్ చేసిన ఒక ఇంచ్ సైజ్ బొమ్మ. భలే నచ్చింది. పెన్సిల్ తో రఫ్ లైన్ స్కెచ్ వేసుకునేపుడు ముఖాల్లో ఆ ప్రశాంత చూపుల కోసం చాలా కష్టపడ్డాను. కళ్ళు, ముక్కు, పెదవులు, కింద గడ్డం తో సహా ప్రతిదీ చక్కగా అమరితే కానీ రాని ఆ ప్రశాంతతని రేఖల్లో తీసుకురావటం అంత సులభం కాదని నేర్చుకున్నాను. ఒకరకంగా సన్నని సున్నితమైన ఆ గీతల్లోనే 3D ఎఫెక్ట్ తీసుకురావాలి. ఆ గీతల వంపుల్లో బుగ్గలు, మెడ, పెదవి కింది గడ్డం వంపులు ప్రతిదీ కొలిచి గీసినట్టు వస్తే కానీ బొమ్మ పూర్తిగా అందంగా కనపడదు. చిన్న గీత ఎక్కడ కొంత అటూ ఇటూ అయినా కొట్టొచ్చే మచ్చలా కనపడిపోతుంది. ముఖ్యంగా రాధ బొమ్మ గడ్డం చాలా సార్లు రబ్బర్ (ఎరేజర్) తో రబ్బీ రబ్బీ వేశాను. రేఖల బొమ్మల్లో ఉన్న సవాలు అప్పుడు అర్ధం అయ్యింది, చూట్టానికి సులభం అనిపించేంత సులభం మాత్రం కాదని. ప్రతి రేఖలో అంతర్లీనంగా ఆ కష్టం, అనుభవం దాగి ఉంటాయి.

మనం చేసే పనుల్లాగే, ఆర్టిస్ట్ కి వేసే బొమ్మల్లోనూ కొన్ని అసంతృప్తి నీ, కొన్ని తృప్తి నీ, కొన్ని సంతృప్తి నీ కలిగిస్తాయి. కొన్ని బొమ్మలు ఎంత కష్టపడి, ఎంత బాగా వేసినా అసంతృప్తినే మిగిలిస్తాయి, ఇంకా వాటిల్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ని కలిగిస్తూ. కొన్ని తృప్తిగా అనిపిస్తాయి, బాగా వేశాను అన్న ఫీలింగ్ ని ఇస్తూ. అతికొద్ది బొమ్మలు మాత్రమే సంతృప్తిని ఇస్తాయి. అవి చూడటానికి సింపుల్ గా ఉన్నా, అందులో పడిన కష్టం, ఆ కష్టంలో ని సంతృప్తి వేసిన ఆర్టిస్ట్ మనసుకి మాత్రమే తెలుస్తుంది. అప్పటి నా బొమ్మల్లో సంతృప్తిని ఇచ్చిన బొమ్మల్లో ఇది ఒకటి.

అప్పుడు నా దగ్గర క్యామెల్ పోస్టర్ కలర్ సెట్ లో హైదరాబాద్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్లో ఒక బుక్ షాప్ లో కొన్న రెండు స్పెషల్ కలర్ బాటిల్స్ ఉండేవి, ఒకటి గోల్డ్, ఇంకొకటి సిల్వర్. బార్డర్లకి ఎక్కువగా ఆ రెండిటిలో ఏదో ఒకటి వాడేవాడిని, ఇందులో బార్డర్స్ కి గోల్డ్ కలర్, కార్నర్స్ లో ఇండియన్ ఇంక్ వాడాను. కాలక్రమేణా గోల్డ్ కలర్ కొంచెం వెలిసి పోయినా వేసినప్పుడు అచ్చం గోల్డ్ లా మెరిస్తూ ఉండేది. తర్వాత హైదరాబాద్, అబిడ్స్ లోని ఒక ఫ్రేమింగ్ షాప్ కెళ్తే సరిగ్గా ఈ బొమ్మ పట్టే రెడీమేడ్ ఫ్రేమ్ దీనికోసమే అన్నట్టుగా దొరికింది. నేను బంగారు రంగులో వేసిన బార్డర్ కి నలుపు, నలుపు వేసిన కార్నర్స్ కి బంగారు రంగు లో ఉన్న కాంట్రాస్ట్ మెటల్ ఫ్రేమ్ అది. చాలా కాలం నాతోనే నేనున్న చోటల్లా అలా అదే ఫ్రేమ్ లోనే ఈ రేఖాచిత్రం ఉండేది.

ఇప్పటికీ ఈ బొమ్మ నాదగ్గరే ఉంది, అయితే ఫ్రేమ్ లో లేదు. ఆ ఫ్రేమ్ జీవితకాలం ముగిసిపోవడంతో ఆర్ట్ పోర్ట్ ఫోలియో ఫైల్ లో భద్రంగా ఉంది. ఎపుడన్నా ఆ ఫైల్ తెరిస్తే ఒకటి రెండు క్షణాలు మాత్రమే చూస్తాను. చూసిన ప్రతిసారీ హైదరాబాద్ కి జాబ్ కోసం వచ్చిన తొలినాటి రోజులు, బయటి ప్రపంచంలో ఒంటరిగా వేసిన తొలి అడుగులు, విద్యానగర్ చుట్టూ నడచిన పరిసరాలు, విద్యానగర్ ట్రెయిన్ స్టేషన్ లో కూర్చున్న బెంచి, నడచిన రైలు పట్టాలు, ఇష్టంలో పడిన కష్టాలు, తడబడినా నిలకడగా నిలబడిన జీవితం ని గుర్తు చేస్తూ, మరచిపో(లే)ని హైదరాబాద్ జ్ఞాపకాల అనుభవాలని గుర్తుకి తెస్తూ...

"అసంతృప్తి, తృప్తి, సంతృప్తి ల కలయికే నిలకడగా కదిలే జీవితం."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...