Sunday, October 1, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 13 ...

Ballpoint Pen on Paper 8.5" x 11"

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 12                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 14 -->
చిన్నప్పటి నుంచీ కాయితాలంటే భలే ఇష్టం ఉండేది. పుస్తకాలంటే తెలీని పిచ్చి ఉండేది. ఏ పుస్తకం దొరికినా పూర్తిగా తిప్పందే మనసు ఊరుకునేది కాదు. నచ్చిన బొమ్మలున్న పుస్తకం అయితే ఇంక ఎన్ని గంటలైనా, ఎన్ని సార్లైనా తిప్పుతూ ఉండిపోయే వాడిని. క్వాలిటీ ఉన్న పేపర్ తో మంచి ఫాంట్ ఉన్న ప్రింట్ అయితే మహాసంతోషం వేసేది. ఏ ఊర్లో ఉన్నా లైబ్రరీలకి వెళ్ళి పేపర్లూ, పుస్తకాలూ తిరగేయటం అంటే మాత్రం చాలా చాలా ఇష్టం, ఇప్పటికీ, ఈరోజుకీ.

చిన్నపుడు మా స్కూల్ ఏ.పి.రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెన్నహళ్ళి లో మంచి లైబ్రరీ ఉండేది. చాలా మంచి పుస్తకాలుండేవి. బహుశా ఈ అలవాటుకి నాంది, పునాది రెండూ అక్కడే. రోజూ సాయంత్రం గేమ్స్ పీరియడ్ అయ్యాక ఒక అరగంట మాకు టైమ్ ఉండేది. అప్పుడు మా కోసం లైబ్రరియన్ వచ్చి ఒక గంట లైబ్రరీ ఓపన్ చేసి పెట్టేవారు. ఆ టైమ్ లో ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళి ఏదో ఒక బుక్ తిరగెయ్యటం అలవాటయ్యింది. అద్దాల చెక్క బీరువాల్లో తాళం వేసి లైబ్రరియన్ ని అడిగితే తప్ప మా చేతికివ్వని పుస్తకాల్ని సైతం తదేకంగా చూడటమే భలే ఉండేది. పొద్దునా మధ్యాహ్నం క్లాసెస్ జరిగే టైమ్ లో లైబ్రరీ తెరిచే ఉన్నా వెళ్ళే వీలుండేది కాదు. మా లైబ్రరియన్ ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. సాయంత్రం కూడా టైమ్ కి రావటం, లైబ్రరీ తెరిచి మళ్ళీ టైమ్ కి మూయటం, స్కూలు రూల్స్ ప్రకారం ఎవరైనా కావల్సిన పుస్తకం అడిగితే అద్దాల బీరువా తాళం తీసి ఇవ్వటం, మళ్ళీ వెనక్కు తీసుకుని సర్ది ఇంటికెళ్ళిపోవటం, ఇంతే. పుస్తకాల్ని తన బిడ్డల్లా పదిలంగా చూసుకునేవారు, ఎవరైనా పేజీలు అశ్రద్ధగా తిప్పినా వచ్చి చిరిగిపోతాయని పుస్తకం వెనక్కి తీసేసుకునేవారు. అంత శ్రద్ధ ఆయనకి పుస్తకాలంటే. ఎవ్వరితోనూ మాట కలపని ఆయన నన్ను మాత్రం ప్రత్యేకంగా చూసిన అనుభవం నాకుండేది, ఆ తొమ్మిదేళ్ళ వయసులో. ఎందుకంటే నా ఫ్రెండ్ ఎవరో ఆయన ఊరు కనుక్కుని ఆయన ఊరే నాదీ అని ఆయనకి చెప్పటమే, ఆ ఊరు - "కావలి". అలా ఆ లైబ్రరియన్ తో నాకు మూడునాలుగేళ్ళ పుస్తకాల జ్ఞాపకాలు, ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా.

మా స్కూల్ కి సంవత్సరానికొకసారి సోవియట్ యూనియన్ పబ్లికేషన్ బుక్స్ తో ఒక వ్యాన్ వచ్చేది. అందులో పిల్లలకి చాలా మంచి పుస్తకాలు తక్కువ ధరలకి అమ్మేవాళ్ళు, కొనే స్థోమత అంత చిన్న క్లాసులో లేకపోయినా ఆ వ్యాన్లోకెళ్ళి ఆ పుస్తకాలు తిరగెయ్యటం, ఆ పేపర్ ప్రింట్ వాసన లో ఉన్న కిక్కే వేరుగా అనిపించేది. స్కూలు రోజుల్లో మంచి క్వాలిటీ పేపర్ తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధ్వర్యంలో వచ్చిన "లేపాక్షి" పుస్తకాలైతే పేజి పేజినీ అక్షరాలతో నింపటంలో ఉన్న ఆనందం వర్ణనాతీతం.

ఇంకా వెనక్కెళ్తే, ఊహ తెలిసే నాటి కాగితాల జ్ఞాపకాలు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటాయి. అప్పుడు నాన్న సొంత ఊరు, నెల్లూరు దగ్గర "దామరమడుగు" అని ఒక మోస్తరు పల్లెటూరులో ఉండేవాళ్లం. నాన్న మా ఊరికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న "బుచ్చిరెడ్డిపాళెం" టవున్ లో హైస్కూల్ టీచర్ కావటంతో టీచింగ్ నోట్స్, బుక్స్, పరీక్షల ఆన్సర్ పేపర్స్ కరెక్షన్ కోసం ఇంటికి తెచ్చుకున్నపుడు ఒక్కొక్క పేపరూ, అందులోని స్టూడెంట్స్ అక్షరాలూ, వాళ్ళ పేర్లు చదవటం, కరెక్షన్ అయ్యాక ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ప్రత్యేకించి అక్షరాలు బాగా ఉన్న వాళ్ళకెన్ని మార్కులొచ్చాయి, వాళ్ళ పేర్లేంటి ఇవన్నీ నేనూ, అన్నా చూస్తూ గడిపిన ఆ క్షణాలూ ఇప్పటికీ మనసులో పదిలం. నాన్న స్కూల్ లో బ్రౌన్ రంగులో ఉండే బ్రెయిలీ లిపి పేపర్స్ కూడా కొన్ని టీచింగ్ పుస్తకాలకి నాన్న అట్టలుగా వేసుకంటే నిశితంగా పరిశీలించి ఆ బుడిపెల చుక్కలు ఎలా చదువుతారు అని నాన్నని అడగిన గురుతులూ చెక్కు చెదరనేలేదు.

పలక దాటి పేపర్ మీద పెన్నుతో రాసే వయసు వచ్చేసరికి మూడవ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు అమ్మ తెల్లకాగితాలు తెప్పించి, కంఠాని (అంటే పుస్తకాలు కుట్టే పెద్ద సూది లాంటిది) తో మాకు పుస్తకాలు కుట్టి వాటికి బ్రెయిలీ లిపి పేపర్స్ అట్టలు వేసి ఇచ్చేది. మాకవి నచ్చేవి కాదు. అప్పట్లో బజార్ లో దొరికే బౌండ్ నోట్ బుక్స్ వాడాలన్న కోరిక ఉండేది. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అప్పట్లో ఇప్పట్లా డబ్బులు ఒక్క పైసా కూడా వృధాగా ఖర్చు చేసే వాళ్ళు కాదు. జీ(వి)తం ఉన్నంతలో ప్రశాంతమైన జీవితం, ఎక్కువమంది పొదుపుగానే జీవితాలు గడిపే వాళ్ళు. అలా అమ్మ కుట్టి ఇచ్చిన పుస్తకాలే నాలుగవ క్లాస్ దాకా. తర్వాత గవర్నమెంట్ రెసిడెన్షియల్ (గురుకులం) స్కూల్ లో చేరిపోయాను. ఆ స్కూల్ లో ప్రతి సంవత్సరం మొదటిరోజే సరిగ్గా సంవత్సరం కి సరిపడా ప్రతి సబ్జెక్ట్ కీ తగ్గట్టు గవర్నమెంట్ ప్రొమోట్ చేస్తూ, మార్కెట్ లో వున్న అన్ని నోట్ బుక్శ్ కన్నా బెస్ట్ క్వాలిటీ బుక్స్ - "లేపాక్షి నోట్ బుక్స్" ఇచ్చేవాళ్ళు. అయినా అప్పట్లో చాలా పాపులర్ అయిన బ్రూస్లీ నోట్ బుక్ చూస్తే అలాంటిదొకటుంటే భలే ఉండేది అనుకునే వాడిని. ఆ కోరిక ఇంటర్మీడియట్ లో తీరింది.

ఇంజనీరింగ్ లోనూ క్లాస్ నోట్స్ నీట్ గా రాసుకునే అలవాటుండేది. అయితే మంచి క్వాలిటీ పేపర్ ఉన్న నోట్ బుక్స్ మార్కెట్ లో దొరికేవి కాదు. తర్వాత TCS లో జాబ్ చేరాక ప్రతి నెలా మొదటి రోజు కొన్ని నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ప్రాజెక్ట్ నోట్స్ రాసుకోవటానికి ఇచ్చేవాళ్ళు. చాలా మంచి క్వాలిటీ పేపర్, ఆ పేపర్ మీద రాయటం అంటే చాలా ఇష్టం ఉండేది.

ఊహ తెలిసినప్పటినుంచీ బొమ్మలు వేస్తూనే ఉన్నా. పెన్ తోనో, పెన్సిల్ తోనో బొమ్మ వెయ్యాలనుకున్నప్పుడల్లా నా దగ్గర అప్పటికి ఉన్న పేపర్ మీద వెయ్యటమే తెలుసు. అలా జీవితం ముందుకెళ్తున్న క్రమంలో USA వచ్చాక పేపర్స్, పెన్స్, పెన్సిల్స్ కి కొదవే లేదు. ఎక్కడ చూసినా బెస్ట్ క్వాలిటీ కావల్సినన్ని అందుబాటులో ఉంటాయి. కానీ రాసే వాళ్ళే తక్కువ.

ఈ బొమ్మకూడా అలా అప్పటికప్పుడు అనుకుని దొరికిన పేపర్ మీద వేసిందే. USA కొచ్చాక మొదటి కొన్ని సంవత్సరాలు బొమ్మలు వేసేంత టైమ్ లేకుండా చాలా బిజీ గా గడచిపోతున్న రోజులవి. వచ్చీ రాగానే మా ఆవిడ USMLE ప్రిపరేషన్లో పడిపోవటం, నేనేమో దొరికిన టైమ్ కాస్తా టెక్నాలజీ బుక్స్ చదవటం, ప్రొఫెషన్ తో, ఇంటా బయటా పనులతోనే సరిపోయేది. అయితే ఒకరోజు ఈ బొమ్మ వెయ్యటానికి మాత్రమే అన్నట్టు కొన్ని గంటల టైమ్ ఒంటరిగా దొరికింది.

ఆరోజు USMLE Step-1 పరీక్ష, ఎనిమిది గంటల పరీక్ష అది, పొద్దున్నుంచి సాయంత్రం దాకా. Boston దగ్గర్లో ఒక హోటల్ పరీక్ష సెంటర్. పొద్దున్నే డ్రైవ్ చేసుకుని మా ఆవిడని పరీక్షకి తీసుకెళ్ళి నేనూ అక్కడే హోటల్ రిసెప్షన్ లో వెయిటింగ్ లో ఉండిపోయాను. అక్కడున్న మ్యాగజైన్స్ తో కాసేపు కాలక్షేపం అయినా, ఇంకా చాలా టైమ్ ఉంది. ఒక షాపింగ్ క్యాటలాగ్ తిరగేస్తుంటే ఒక ఫొటో చూడగానే బొమ్మ గియ్యాలి అన్నంతగా ఆకట్టుకుంది. బిజినెస్ క్యాజువల్ డ్రెస్ లో నిలబడి ఉన్న ఒక మోడెల్ ఫొటో. నా బ్యాక్ ప్యాక్ లో టెక్నాలజీ బుక్స్, బాల్ పాయింట్ పెన్స్ ఉన్నా పేపర్ లేదు. రెసెప్షన్ దగ్గరికెళ్ళి అడిగితే రెండుమూడు పేపర్స్ ఇచ్చారు. చెప్పాగా క్వాలిటీ పేపర్ కి కొదవే లేదిక్కడ ఎక్కడా. ఇక బొమ్మ గీస్తూ మిగిలిన టైమ్ అంతా గడిపేశాను. కాలం తెలీకుండానే దొర్లిపోయింది అం(టుం)టామే సరిగ్గా అలాంటి సంఘటనే అది. ఎన్ని గంటలు అలా గడిపేశానో తెలీదు, బొమ్మ మాత్రం పూర్తి చేశాను. స్ట్రెయిట్ గా పేపర్ మీద బాల్ పాయింట్ పెన్ తో వేసిన బొమ్మ ఇది.

సహజంగా ఏ ఆర్టిస్ట్ అయినా ఉన్న స్పేస్ ని బట్టి బొమ్మ సైజ్, కంపోజిషన్ ఇలా కొంత ప్లానింగ్ చేసి, పెన్సిల్ రఫ్ స్కెచ్ వేసుకుని మరీ బొమ్మ మొదలు పెడతారు. ముఖ్యంగా పోర్ట్రెయిట్స్ అయితే ఒక్కొక ఆర్టిస్ట్ ఒక్కో రకంగా మొదలు పెడతాడు. నేను మాత్రం ఎప్పుడూ నా ఎడమ చేతి వైపు కనిపించే కనుబొమ్మతోనే (అంటే బొమ్మలో కుడి కనుబొమ్మనమాట) మొదలు పెడతాను. కంపోజిషన్, సైజ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మైండ్ లోనే జరిగిపోతాయి. పెన్సిల్ తో లా కాక, మొదలు పెడితే కరెక్షన్ కి తావు లేనిది బాల్ పాయింట్ పెన్ తో బొమ్మెయటం అంటే. చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్రతి గీతా ఉండాలి, ప్రపోర్షన్స్ ఎక్కడా దెబ్బతినకూడదు. ఇది కొంచెం కష్టమే, అయినా నేను దీక్షగా కూర్చుని స్ట్రెయిట్ గా బాల్ పాయింట్ పెన్ తో వేసిన ప్రతి సారీ, ప్రతి బొమ్మా కొలిచినట్టు కరెక్ట్ గా వచ్చేది. దీక్షలో ఉండే శ్రద్ధేనేమో అది!

అప్పుడే ఈ బొమ్మను దాటి పాతిక సంవత్సరాల కాలం ముందుకి నడిచెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే, ఇండియా లో అన్నీ, అందర్నీ వదిలి ఇంత దూరం వచ్చి కొత్తగా మొదలుపెట్టిన జీవితం, ఇంకా నిన్నో మొన్నో అన్నట్టే ఉంది. ఎక్కడ పుట్టాను, తొమ్మిదేళ్ళ నుంచే హాస్టల్స్ లో ఉండి చదువుకుంటూ ఎలా పెరిగాను. జాబ్స్ చేస్తూ ఎన్ని సిటీస్, ఎన్ని (ప్ర)దేశాలు తిరిగాను, చివరికి అందరినీ వదిలి ఇక్కడికొచ్చి స్థిరపడ్డాను.

ఎక్కడున్నా, ఎలా ఉన్నా అప్పుడూ, ఇప్పుడూ నాతో ఉన్నవీ, నన్నొదలనివీ మాత్రం నా బొమ్మలే. అప్పుడప్పుడూ అప్పటి నా బొమ్మలు చూసుకుంటుంటే ఎందుకో మనసు మనసులో ఉండదు, గతం లో(తుల్లో)కెళ్ళిపోతుంది. ప్రతి బొమ్మలోనూ ఆ బొమ్మ వేసినప్పటి గడచిన క్షణాలన్నీ జ్ఞాపకాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. చూసిన ప్రతిసారీ అందులో దాగిన ప్రతి క్షణం నన్ను చూసి మళ్ళీ బయటికి వచ్చి పలకరించి వెళ్ళిపోతూనే ఉంటాయి. కొన్నిటిలో గడిచిన క్షణాల ఆనందమే కాదు, తడిచిన మనసూ దాగుం(టుం)ది.

"గడిచిన కాలంలో మునిగిన జ్ఞాపకాల తడి ఎప్పటికీ ఆరదు."
~ గిరిధర్ పొట్టేపాళెం

No comments:

Post a Comment