మనిషి పుట్టుకతోనే చుట్టూ ఉన్న పరిసరాల్నీ, మనుషుల్నీ, జీవుల్నీ చూసి అర్ధం చేసుకోవటం, చదవటం, నేర్చుకోవటం మొదలవుతుంది. మాటా, నడవడికా, ఆచరణా ఇవన్నీ పరిసర ప్రభావాలతోనే మొదలయ్యి నిత్యం ప్రభావితమవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూనే ముందుకి సాగి పోతూ ఉంటాయి. ఎంత నేర్చుకున్నా, ప్రతిరోజూ ఏదో ఒకటి, ఎంతో కొంత, కొత్తదనం ఎదురు కాకుండా ఉండదు. రోజూ ఉదయించే సూర్యుడూ ఆకాశంలో ప్రతి దినం ఒకేలా కనపడడు. చుట్టూ ఉన్న ప్రకృతి అయినా అంతే. దిన దిన ప్రవర్ధమానమే ప్రకృతి జీవం లోని పరమార్ధం.
విద్యని బోధించే సరైన గురువుండి అభ్యసించాలన్న అభిలాష ఉంటే ఆ విద్యాభ్యాసం "నల్లేరుపై బండి నడక" లా సులభసాధ్యం కాక తప్పదు. కానీ ఒక్కొకప్పుడు నేర్చుకొవాలన్న ఆసక్తి ఉన్నా కొన్ని విషయాల్లో బోధించే గురువులు అందరికీ దొరకరు. అలాంటి స్థితిలో నేర్చుకోవాలంటే శోధించాలి. ఆ విషయ శోధన ప్రక్రియలో కొందరు నిష్ణాతులు చేసిన పనులు, ఆ పనుల్లోని నైపుణ్యం పరిశీలించి అధ్యనం చేసి నేర్చుకోవలసి వస్తుంది. అదే పరిశోధన, nothing but research.
పెయింటింగ్ లో నా అభ్యాసం సరిగ్గా ఇలానే ఒక రీసెర్చ్ లా మొదలయ్యింది. పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఇంక్ పెన్, ఇంక్ బ్రష్ ల బొమ్మలు దాటి పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన "విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" లో ఇంజనీరింగ్ చేస్తున్న రోజుల్లో మొదలయ్యింది. పెయింటింగ్ మెటీరియల్ కోసం అక్కడ తిరగని స్థలం లేదు, వెదకని షాపుల్లేవు. నేర్పించే గురువులు దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేదు. కానీ ఎలాగైనా నేర్చుకోవాలన్న తపనొక్కటే ఉండేది. అదే నా శోధనకి పునాది అయ్యి నన్ను ముందుకి నడిపించింది. ఎలాగోలా కష్టపడి కావలసిన మెటీరియల్ కనుక్కుని కొనుక్కోగలిగాను. ఒక ఐదారు క్యామెల్ పోస్టర్ కలర్స్, రెండు మూడు బ్రష్ లు, అసలు వాటర్ కలర్స్ వెయ్యటానికి అదో కాదో కూడా తెలియని నాణ్యమైనదే అనిపించిన Ivory Board అని బుక్ షాప్స్, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు పిలిచే ఒక రకం పేపర్. ఇవే నాకున్న పెయింటింగ్ మెటీరీయల్.
అప్పట్లో "ఆంధ్రభూమి" వారపత్రికలో విశేషాదరణ పొందుతున్న ప్రముఖ రచయిత్రుల సీరియల్స్ కి, ఉత్తమ్ కుమార్ గారు వెస్తున్న ఇలస్ట్రేషన్స్, కళా భాస్కర్ గారి "ఎంకి బొమ్మలు" ఆ పత్రికకే ఆకర్షణగా, ప్రత్యేకంగా ఉండేవి, కారణం అవి పూర్తి స్థాయి వాటర్/పోస్టర్ కలర్స్ తో వేసిన పెయింటింగ్స్ కావటం. అలా పెయింటింగ్స్ వెయ్యాలన్న తపనా, ప్రయత్నంలో నేనూ ఉండడంతో నా రీసెర్చ్ కి సరిగ్గా సరిపడ గురువు "ఉత్తమ్ కుమార్" గారి బొమ్మల రూపంలో దొరికాడు. వారం వారం క్రమం తప్పక ఒక్కడినే హాస్టల్ నుంచి బస్ లో "పటమట" కి కేవలం ఆంధ్రభూమి కోసమే వెళ్ళి, కొని తెచ్చుకున్న వారాలెన్నో ఉన్నాయి. అలా ఆ బొమ్మలు ఆధారంగా అచ్చం అలానే వేస్తూ రంగుల కలయికా, బ్రష్ వర్క్స్ ఇవన్నీ ఆ ప్రింటెడ్ బొమ్మల్లో శోధిస్తూ సాధన మొదలుపెట్టాను. శనివారం ఒక పూట కాలేజ్, ఆదివారం హాలిడే. సెకండ్ యియర్ లో సీరియస్ గా ప్రతి శని, ఆదివారాలూ పెయింటింగ్స్ వేసే ప్రక్రియ క్రమం మొదలయ్యింది. సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువూ, సినిమాలూ, షికార్లూ తప్ప ఆటలకీ, ఇతర హాబీలకీ పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నాం, చదువయ్యాక ఇంజనీర్స్ అన్న మైండ్ సెట్ తో ఎక్కువ వీకెండ్స్ చదువుల్లోనో, లేదా ఫ్రెండ్స్ తో సినిమాలకి, షికార్లకి, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో టీవీ చూట్టం, క్యారమ్ బోర్డ్, టేబుల్ టెన్నిస్ ఆట్టమో...ఇలానే ఎక్కువగా గడిచిపోయేవి.
నా పెయింటింగ్స్ సాధన ప్రక్రియలో మొట్టమొదటి రంగుల పెయింటింగ్స్ కొంచెం సులభం అనిపించిన వాటితోనే మొదలుపెట్టాను. ఇంకా గుర్తుంది, మొట్టమొదటిది టేకాఫ్ అవుతున్న ఒక Boeing 747 Airplain. దానికి "Fly High. Your aim the sky, your goal the star." అని క్యాప్షన్ కూడా రాశాను. అలా మెల్లిగా పెయింటింగ్స్ లోకి ప్రవేశించి ఒక రెండుమూడు పెయింటింగ్స్ వేశాక "ఉత్తమ్" గారి బొమ్మలు చూసి అచ్చం అలానే పొల్లుపోకుండా వేసే ప్రయత్నం కొంతకాలం చేశాను. అలా వేసిన కొన్ని పెయింటింగ్స్ లో ఇది ఒకటి. అయితే అప్పటిదాకా, ఆ తరువాతా వేసిన అన్నిటి కన్నా ఇది మాత్రం నాకెంతో ప్రత్యేకంగా ఉండేది. "ఉత్తమ నాయికలు" అన్న శీర్షికన "ఉత్తమ్" గారు వేయటం మొదలుపెట్టిన సిరీస్ లో బహుశా మొదటి పెయింటింగ్ ఇదే అనుకుంటా. దీని తరువాత ఆ సిరీస్ అలా కొనసాగించారన్న గుర్తు లేదు కానీ, ఆగింది అని మాత్రం గుర్తుంది.
"ఉత్తమ్" గారు వేసిన అన్ని బొమ్మల్లో ఈ బొమ్మ నాకెంతో ఇష్టం. ఇంజనీరింగ్ ఫైనల్ యియర్ లో ఉన్నపుడు శని, ఆది వారాలు ఏకబిగిన కూర్చుని పూర్తిచేసిన పెయింటింగ్ ఇది. అయితే అప్పటికి నేను చేసిన అతికొద్ది పెయింటింగ్స్ సాధనతో ఈ పెయింటింగ్ వెయ్యాలని మొదలు పెట్టటం నాకప్పుడు "కత్తి మీద సాము" లాంటిదే. ఉన్న ఐదారు రంగుల కలయికలతో కావలసి రంగుల్ని తీసుకు రావటం, పెయింటింగ్ లో ఉండవలసిన షేడ్స్, మెళకువలూ ఇవేవీ సరిగా తెలియకపోవడం, అయినా కింద మీదా పడి కసరత్తులు చేస్తూ వెయ్యటం అంటే ఒక రంకంగా నడవడం పూర్తిగా రాకుండానే పరిగెత్తడం లాంటిది. ఇంకా గుర్తుంది, సగం పూర్తయిన పెయింటింగ్ బాగా వస్తుందన్న సంతోషంలో ఒక చిన్న నలుపు రంగు చుక్క పొరబాటున ముఖం మీద చిందటం. అసలే ది వాటర్ కలర్స్ కోసం వాడే పేపర్ కాకపోవటం, రంగులు కూడా పోస్టర్ కలర్స్ అవటం తో, అది చెరపటం సాధ్యం కాని పని. ఆ చుక్కని కవర్ చేస్తూ వైట్ రంగుని అద్దీ అద్దీ మళ్ళీ దానిపైన రంగుల షేడ్స్ అద్ది ఇలా ఎన్నెన్నో ప్రయాసలతో పూర్తి చేశా. అన్ని ప్రయాసల్లోనూ తగ్గక వెయటం వల్లేమో ఇప్పటికీ చూసిన ప్రతి సారీ సంతృప్తిని ఇచ్చే పెయింటింగ్ అవటంతో మరింత అభిమానం అన్నిటికన్నా మిన్నగా.
పూర్తిచేశాక ఆదివారం "విజయవాడ పటమట" వెళ్ళి కొన్ని జిరాక్స్ కాపీలు తీయించాను, బ్లూ, బ్రౌన్, గ్రీన్ రంగుల్లో. తర్వాత నాతో శలవులకి మా ఊరు "కావలి" కి తీసుకెళ్ళి అన్నతో కలిసి కావలి ట్రంక్ రోడ్డు పక్కన, ఒంగోలు బస్టాండుకి దగ్గరలో ఉన్న ఒక ఫ్రేములు చేసే షాపు ఆయన దగ్గరికెళ్ళి చుట్టూ నల్లని బార్డర్ తో ఫ్రేము చెయ్యమని చెప్పాను. అలాగే చేసిస్తా అని తీసుకున్నాడు. కానీ ఇంటికొచ్చాక మనసు మాత్రం బిక్కు బిక్కు మంటూనే ఉండేది. ఎలా చేస్తాడో ఏమో, ఒకవేళ ఏమన్నా మరకలు అయితేనో, లేదా అసలు పోగొట్టేస్తేనో ఇలా రకరకాలుగా ఆలోచనలు మెదిలేవి. మధ్యలో ఒకసారి వెళ్ళి మొదలుపెట్టారా, పెట్టుంటే ఎలా వస్తుందో చూస్తాను అన్నాను, ఇంకా లేదని చెప్తూ, ఏం ఫరవాలేదు ఎలాకావాలని చెప్పావో గుర్తుంది, బాగా చేసిస్తాను అని చెప్పాడు. నాలుగైదు రోజుల తర్వాత అయ్యాక వెళ్ళి తీసుకుని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. చాలా బాగా చేసిచ్చాడు. వెనక నల్లని వెల్వెట్ లాంటి క్లాత్, ఒక ఇంచ్ బోర్డర్ కనపడేలా, కార్నర్స్ షార్ప్ కాకుండా ఒక ఇంచ్ ట్రయాంగిల్ కట్ అవుతూ, టేబిల్ మీద పెట్టుకోటానికీ, గోడకి తగిలించటానికీ రెంటికీ అనువుగా ఎంతో బాగా చేశాడు. ఇప్పటికీ అదే ఫ్రేమ్ లో నా వద్దే అలాగే భద్రంగా ఉంది.
ఇదే బొమ్మని ఈ పెయింటింగ్ కన్నా ముందు బ్లాక్ ఇంక్ పెన్ తో మా కాలేజి యాన్యువల్ మ్యాగజైన్ కి వేశాను. మ్యాగజైన్ లో ప్రింట్ కూడా అయ్యింది. అప్పుడు కొన్న మ్యాగజైన్స్ ఇప్పుడు నాతో లేకున్నా వాటిల్లో ఉత్తమ్ గారి బొమ్మలూ, ఆయనే రాసి బొమ్మ కూడా వేసిన ఒక కవితా, కొన్ని కార్టూన్లూ, కొన్ని పంచతంత్రం బొమ్మల కతలూ, మైటీ హనుమాన్ అని మొదలుపెట్టి రెలీజ్ చేసిన మొదటి అండ్ ఒకేఒక్క అద్భుతమైన పెయింటింగ్స్ ఇంగ్లీష్ కామిక్ బుక్, ఒకటి రెండు "కళా భాస్కర్" గారి "ఎంకి" బొమ్మల పేపర్ కటింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఇదివరకు నా బొమ్మల మాటల్లో హైదరాబాద్ లో ఉత్తమ్ గారిని కలవాలని చేసిన ప్రయత్నం, కలిసిన కళా భాస్కర్ గారి జ్ఞాపకం పంచుకున్నాను. "కళా భాస్కర్" గారు ఇపుడు లేరనీ, స్వర్గస్తులయ్యారనీ తెలిసి బాధ పడ్డాను. ఉత్తమ్ గారితో మాత్రం ఒక పదేళ్ళ క్రితం ఫోన్ లో ఇండియా వెళ్ళినపుడు రెండు సార్లు మాట్లాడగలిగాను.
"ఉత్తమ నాయికలు" అన్న శీర్షికన "ఉత్తమ్" గారి బొమ్మ చూసి వేసిన ఈ బొమ్మకి నేనిచ్చుకున్న టైటిల్ "ప్రియబాంధవి". అప్పటి నవలా రచయిత్రి "శ్రీమతి బొమ్మదేవర నాగ కుమారి" గారు రాసిన "పయనమయే ప్రియతమా" అన్న నవలలో చదివిన, అందులో ఆమె వాడిన ఒక తియ్యని తెలుగు పదం ఇది. ఈ పదం అంత వరకూ తెలీదు, ఎప్పుడన్నా మదిలో మెదిలితే గుర్తుకొచ్చేది మాత్రం ఇదే పెయింటింగ్, వెన్నంటే ఆనాటి జ్ఞాపకాలూ.
ఈ పెయింటింగ్ లో వేసిన తేదీ చూస్తే ఈ మాట్లాడే రంగుల గుర్తులన్నీ ముప్పైఐదేళ్ళ నాటి చెదరని జ్ఞాపకాలు. కాలం గిర్రున తిరిగిందో, లేదా కాలంకన్నా జీవితమే ఇంకా వేగంగా తిరిగిపోయిందో తెలీదు కానీ, జ్ఞాపకాలు మాత్రం ఇంకా నిన్నటివే అన్నట్టు ఇందులో పదిలంగా దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ ఇలా బయటికి తొంగి చూస్తూనే ఉంటాయి...
"దిన దిన ప్రవర్ధమానమే జీవిత పరమార్ధం!"
~ గిరిధర్ పొట్టేపాళెం
~~ ** ~~ ** ~~
("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)
నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...