సితార - భానుప్రియ
Ink on cheap Notebook Paper (6.5" x 8")
కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా అప్పటి వెలుగు చూడని నా "ఇంకు పెయింటింగుల్లో" పరిపూర్ణంగా ప్రతి క్షణమూ గుర్తున్న వాటిల్లో ఇదొకటి.
సుర్రున మండిస్తూ ముందరి వరండాలోకి కటకటాలగుండా దూసుకొచ్చే సూరీడెండని ఆపగలిగే సాధనాలు అప్పట్లోనూ ఉన్నా, అంత ఆర్ధిక స్థోమత లేదు. దుప్పటి అడ్డం కడితే వెలుతురుని కొంత ఆపగలిగినా ఆ వేడితాకిడిని ఆపటం దుప్పటి తరం అయ్యేది కాదు. మధ్యాహ్నం వెయ్యాలని కూర్చున్న ఈ బొమ్మకి నారాయణవ్వ తాటాకుల వసారానే మళ్ళీ ఆసరా అయ్యింది. ఈ పెయింటింగు మొదలెట్టింది ఒక మధ్యాహ్నం అక్కడే, పూర్తి చేసిందీ ఆ మధ్యాహ్నమే, అక్కడే. అప్పటి నా "ఇంకు పెయింటింగుల్లో" ప్రతిసారీ తప్పక వస్తున్న ప్రస్తావన "నారాయణవ్వ పూరి గుడిశ".
అవును, "నారాయణవ్వ పూరి గుడిశ", అక్కడ కూర్చునే అప్పట్లో చాలా బొమ్మలేశాను. అసలు మేముంటున్న పెంకుటిల్లూ మా నారాయణవ్వదే. రెండు పెంకుటిళ్ళ జంట, ఆ ఇళ్ళ వెనుక ఉండేది చిన్న పూరి గుడిశ, ఆ గుడిశ ముందు ఒక వసారా, వసారాలో నాపరాళ్ళ అరుగు, ఆ అరుగు మీద లోపల దిండు తో సహా చుట్టచుట్టి పెట్టిన పరుపు, కింద ఎత్తిపెట్టిన ఒక నులకమంచం. రెండు పెంకుటిళ్ళూ అద్దెకిచ్చి తను మాత్రం పూరి గుడిశ లోనే ఒక్కటే నివాసముండేది. శ్రమ, కాయకష్టమే చివరిదాకా ఆమె నమ్ముకున్న జీవనం. ఒక్కొక్క ఇంటికీ అద్దె నెలకి 100 రూ||, అయినా అమ్మ దగ్గర మాత్రం 50 రూ|| లే తీసుకునేది. అపుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి మిగిలినా పిల్లల చదువులకి ఉపయోగపడతాయి అన్న మా స్థితిలో, అలా సహాయం అందించి ఆదుకుని మా అభివృద్ధి బాటలో పరోక్షంగా ఎంతో పెద్ద సహాయం చేసింది "మా నారాయణవ్వ". అద్దె డబ్బులతోబాటు శ్రమించి సంపాదించుకున్న కొద్ది డబ్బులనూ జాగ్రత్తగా పొదుపుచేసి అందులోనూ కొంత మిగుల్చుకుని దాచుకునేది.
స్కూలు నుంచి శలవులకి ఇంటికొచ్చి శలవులయ్యాక తిరిగి వెళ్ళే ముందు, "వెళ్ళొస్తాను నారాయణవ్వా" అని చెప్పటానికి వెళ్ళిన ప్రతిసారీ "ఉండు నాయనా" అంటూ లోపలికెళ్ళి గుప్పెటలో మడిచిన 5 రూ|| ల కాయితం నా చేతిలో పెట్టేది. వద్దు నారాయణవ్వా అని ఎంత చెప్పినా వినేది కాదు. బహుశా ఆ 5 రూ లు అప్పట్లో ఆమెకి ఓ రెండు మూడు రోజుల సంపాదన, ఓ పదిరోజుల సేవింగ్స్ అయి ఉండొచ్చు. ఇలా క్రమం తప్పక ప్రతి శలవులకీ నాకు డబ్బులిచ్చిన "ఏకైక వ్యక్తి" గా "మా నారాయణవ్వ" నా మనసులో ఈనాటికీ పదిలంగా ఉండిపోయింది, అందుకే అప్పటి నా బొమ్మల్లో ఆమెని తల్చుకోకుండా ఉండలేను, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను.
ఈ బొమ్మ కూడా స్ట్రెయిట్ గా Bril ఇంకు బుడ్డీ, ఆ బుడ్డీ మూత ప్యాలెట్టు, మగ్గుతో నీళ్ళు, ఒకే ఒక్క బ్రష్, నాసిరకం నోట్ బుక్ పేపర్ మీద ఫ్రీ హ్యాండ్ తో వేసిందే. ఆధారం, వార పత్రికలో వచ్చిన "సితార భానుప్రియ" స్టిల్. అప్పటిదాకా పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ తో అచ్చు గుద్దినట్టు పోర్ట్రెయిట్ లు వెయటం సాధనతో నేర్చుకున్నా. బ్రష్ తో కూడా సాధన చేస్తే సాధించగలనన్న బలమైన నమ్మకానికి పునాది వేసిన పెయింటింగ్ ఇది. ఇప్పుడు డిజిటల్ బొమ్మలో తెలియట్లేదు గానీ, అప్పటి నాకళ్ళకి మాత్రం ఆ డ్యాన్స్ కాస్ట్యూమ్, వేసుకున్న ఆభరణాలూ జిగేలుమంటూ వెలిగిపోతూ కనిపించేవి. బొమ్మ కింద పెట్టే సంతకం అప్పటికింకా పరిణతి చెందలేదు. ఇందులో కింద కనిపించే స్ఫురణకు రాని 19 అన్న అంకె నాకూ వీడని మిస్టరీనే!
అప్పటి బొమ్మల్లో తప్పులూ, తడికలూ, తప్పటడుగులూ వేసి ఉన్నా, అనాటి ఆపాటి జ్ఞానానికి అందుబాటులో నాకు తెలిసిన పరుగు అంతే. పడుతూ లేస్తూనే కొంచెం మెరుగవుతున్నాననిపిస్తూ ఇంకా ఉత్సాహంగా పరిగెట్టటమొక్కటే తెలుసు. అలుపులేని పరుగులో ఎప్పుడైనా ఇలా ఆగి ఒక్కసారి పరిగెట్టిన దూరం కొలుద్దామని ప్రయత్నిస్తే ప్రతి బొమ్మలో, ప్రతి మలుపులో ఎన్నో, ఎన్నెన్నో మధుర స్మృతులుగా మారిన జ్ఞాపకాలే ఆ దూరం కొలిచే నా కొలమానాలూ, కాలమానాలూ...
"ప్రతి అనుభవాన్నీ ఒక మంచి జ్ఞాపకంగా, ఆ జ్ఞాపకాన్ని ఓ మంచి స్మృతిగానూ మలుచుకోగలిగే జీవితం చిన్నదే అయినా దాన్ని సంపూర్ణంగా జీవించినట్టే." - గిరిధర్ పొట్టేపాళెం
Details
Title: సితార - భానుప్రియ
Reference: A photo published in a Telugu weekly magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: Aug 18, 1985
బహుశః 19 అన్నది ఒక వరుససంఖ్య కావచ్చును. అలోచించండి. అప్పటికి మీరు వేసిన బొమ్మలసంఖ్య కావచ్చును, లేదా సినీ ఆర్టిస్టుల బొమ్మల్లో అది 19వది కావచ్చును. అలాగా... అలోచించండి స్ఫురించకపోదు.
ReplyDeleteకరెక్ట్...అయ్యుండొచ్చండీ, భానుప్రియ వి దాదాపు 25 వరకూ వేశాను, మీరన్నట్టు ఆ వరుస క్రమంలో బహుశా ఇది భానుప్రియ 19 వ బొమ్మ అయ్యిండాలి...సరిగ్గా అదే అనిపించింది మీరన్నది చదివి ఆలోచించాక. థ్యాంక్యూ అండీ!
Deleteఇప్పటికి నేను చూసిన మీ రెండు బొమ్మల్లోనూ చూడగా, హ్యూమన్ అనాటమీ మీద మీకు అప్పటికే మంచి అవగాహన వచ్చినట్లు తోస్తున్నది. (కృష్ణగారు కొందరు అర్టిస్టుల బొమ్మలను చూసి విసుక్కుంటూ ఉండేవారు, అనాటమీ అవగాహన సరిగా లేదూ వేళ్ళు తగలేసాడూ అనో కళ్ళు సరిగా రాలేదూ అనో అంటూ)
ReplyDeleteహ హా...అవునండీ చిన్నప్పటి నుండీ తెలీదు, హ్యూమన్ అనాటమీ మీద బొమ్మల్లో మీరన్నట్టు నాకు బాగానే గ్రిప్ ఇండేది. ఎక్కువ తక్కువలు అనిపిస్తూ ఎబ్బెట్టుగా వేసిన దాఖలాలు చాలా తక్కువ, ఒక్కటి మాత్రమే అలా అనిపించింది ఉంది వందలకొద్దీ వేసిన నా బొమ్మల్లో నాకు తెలిసి. ఎవరైనా హ్యూమన్ అనాటమీని చెడగొడితే నేనూ కృష్ణ గారిలానే లోపల అలానే అనుకుంటాను.
Delete