Showing posts with label Pencil. Show all posts
Showing posts with label Pencil. Show all posts

Sunday, February 4, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 17 ...

 
నలభైయేళ్ళ నాటి "సాగర సంగమం" - "బాలు" పాత్రకి జీవం పోసిన "కమల హాసన్"
Pencil on Paper, 1983
Naveen Nagar, Hyderabad

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 16                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 18 -->

సాగర సంగమం - నాకు అమితంగా నచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రం. ఏదైనా ఒక కళాత్మకమైన పనితనాన్ని పరిశీలించి చూస్తే ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక చిన్నపాటి లోపం, లేదా ఇంకాస్త మెరుగ్గా చేసుండొచ్చు అన్నవి కనిపించకపోవు. ఎక్కడా ఏమాత్రమూ మచ్చుకైనా వంక పెట్టలేని పనితీరు మాత్రమే "పరిపూర్ణత్వం" అన్న మాటకి అర్ధంగా నిలుస్తుంది. ఒక్క మనిషి చేసే ఒక పనిలో "పరిపూర్ణత" ని తీసుకురావటం అంత కష్టమేమీ కాదు, ఎందరో ఇది చేసి చూపెట్టారు. కానీ అరవైనాలుగు కళల మిశ్రమం అయిన సినిమాలో ఈ పరిపూర్ణతని సాధించటం చాలా అరుదు. తెలుగులో బహుశా ఈకోవలో ఒకప్పటి "మాయా బజార్" చిత్రం ఎప్పటికీ ముందే నిలుస్తుందేమో. నావరకైతే మాత్రం ఆ తర్వాత "సాగర సంగమం" అలాంటి "పరిపూర్ణత" ని తీర్చిదిద్దుకున్న ఆణిముత్యం, తెరపై తరతరాలకీ చూపించగల అజరామర చిత్రం.

కళ - దేవుడు అడగకనే ఇచ్చే అరుదైన వరం. అలాంటి వరం పొందిన ఒక పసిపిల్లవాడి మనసున్న కళాకారుడికి తన కళకి వెలుగుని చూపగల ఒకే ఒక్క ఆశాకిరణం పరిచయమయిన కొద్ది కాలంకే దూరమవటంతో మసిబారిన జీవితం. ఆ పాత్రలో కమలహాసన్ నటన, శాస్త్రీయ నృత్యకళలో చూపిన హావభావాలు అసమానం, అద్భుతం. అందరి నటీనటుల నటన, సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం, లొకేషన్స్ ఇలా ఈ సినిమాకి అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడి నుంచీ తమ తమ విభాగంలో "పరిపూర్ణత" ని రాబట్టి, అందరి పరిపూర్ణతలనీ కలిపి సంపూర్ణంగా మలచి చూపించిన దర్శకుడు కళాతపస్వి శ్రీ|| కె.విశ్వనాథ్ గారి "పరిపూర్ణ పరిపక్వ సాగరం" - ఈ "సాగర సంగమం".

అప్పుడే 10వ తరగతి పరీక్షలు రాసి 6 సంవత్సరాల గురుకుల పాఠశాల విద్యాభ్యాసం ముగించి మా ఊరు "కావలి" కి వచ్చి ఉన్నా. ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఆ గురుకులంలో ఎలా ఒదిగానో, ఎలా ఎదిగానో నాకే తెలీదు. ఇంకెప్పుడూ ఇల్లు వదిలి దూరంగా ఉండనులే, శలవులయ్యాక మళ్ళీ అంత దూరం స్కూలుకి వళ్ళాల్సిన అవసరం మొదటిసారి లేదు అన్న సంతోషం. అలా వచ్చి కొద్ది రోజులైనా అయిందో లేదో, ఒకరోజు తాతయ్య ఇంటికి వెళ్తే హిందు న్యూస్ పేపర్లో "రావూస్ ట్యుటోరియల్, హైదరాబాద్" వాళ్ళ IAS కీ, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కాలేజి లో ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ పరీక్షకీ కోచింగ్ ప్రకటన చూసి అప్పటికే హైదరాబాద్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్న చిన్నమామయ్య దగ్గర ఉండి కోచింగ్ తీసుకునేలా నన్నూ సెట్ చేసేసి ఒకరోజు నన్ను హైదరాబాదు తీసుకెళ్ళిపోయాడు. నిజానికి హైదరాబాద్ చూడాలన్న కుతూహలం తప్ప నాకా ఎగ్జామ్ రాయలన్న ఉత్సాహం లేనే లేదు. కావలిలో ఇంటిదగ్గరే ఉండి "జవహర్ భారతి" లో ఇంటర్మీడియట్ చదవాలని ఎంతో ఆశగా ఉండేది. అప్పటికే ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూల్ ఆరేళ్ళు, మళ్ళీ రెసిడెన్షియల్ కాలేజి రెండేళ్ళు, ససేమిరా ఇష్టంలేదు, కానీ పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్ప(లే)ని రోజులు, చెప్పినా నెగ్గలేని వయసు. ఆరేళ్ళు శలవులకి వచ్చిన ప్రతిసారీ నేనింకాస్కూలుకి పోను ఇక్కడే చదువుకుంటా అని మళ్ళీ స్కూలుకి వెళ్ళాల్సిన రెండురోజులముందు నుంచీ రోజంతా ఏడుస్తూ అమ్మ వెనకే పడి వేధించిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. నాతో వేగలేక, నన్ను పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోయేది అమ్మ. శలవులయ్యి స్కూలుకి వెళ్ళాల్సిన రోజెలాగూ వచ్చేసరికి నా ఎయిర్ బ్యాగు సర్దుకుని బరువెక్కిన గుండెతో పుట్టెడు శోకం లోపలే అదిమిపెట్టి "కావలి" నుంచి "నెల్లూరు" బస్సెక్కే వాడిని. నెల్లూరు నుంచి రాత్రంతా ప్రయాణం అనంతపూరు కి, అక్కడి నుంచి మళ్ళీ బస్ లో హిందూపురం, అక్కడి నుంచి జట్కా బండిలో సేవామందిరం, అలా కావలి నుంచి దాదాపు 20 గంటల ప్రయాణం, "హిందూపురం" దగ్గర నేను చదివిన "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం".

నవీన్ నగర్, హైదరాబాద్ - ఖైరతాబాద్ సెంటర్ లో బస్సు దిగి మెయిన్ రోడ్డు పక్క రోడ్డులో ఒక 20 నిమిషాలు రెండు మూడు వంపులు తిరిగి ఎత్తుగా పైకెళ్ళే రోడ్లు, నడిచి వెళ్తే బంజారా హిల్స్, సరిగ్గా అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి వెనుక ఉన్న రెండవ రోడ్డులో ఒక రెండంతస్థుల బిల్డింగ్ లో కింద ఒక రూమ్ లో చిన్నమావయ్య, ఇంకొక బంధువు సుబ్రమణ్యం మామయ్య ఇద్దరూ ఉండేవాళ్ళు. ఒక రెండునెలలున్నానేమో అక్కడ వాళ్ళతోబాటు. హైదరాబాద్ సిటీలో బస్సెలా ఎక్కాలి, ఎక్కడ ఏ బస్ ఎక్కి ఎక్కడికి ఎలా వెళ్ళాలీ ఇవన్నీ ఒకరోజు నన్ను తనతో తీసుకెళ్ళి తిప్పిమరీ నేర్పించాడు సుబ్రమణ్యం మామయ్య. ఆయనకి నెలవారీ బస్ పాస్ ఉండేది. నాకంటే కొద్ది సంవత్సరాలే పెద్ద, అప్పటికే చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడక్కడ. చిన్నమావయ్య ఆయన్ని సుబ్రమణ్యం అని పిలిస్తే నేనూ అలానే పిలిచేవాడిని, నాకన్నా పెద్ద అయినా. ఆ రెండు నెలల్లో నేను చిన్నమామయ్యతో కన్నా సుబ్రమణ్యం మామయ్య తోనే ఎక్కువగా గడిపాను. రోజూ ఆఫీస్ నుంచి సరిగ్గా టైమ్ కి ఇంటికి వచ్చేసేవాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా నా కోచింగ్ ఒక పూటే, సాయంత్రం వచ్చి నన్ను ఏదో ఒక ప్లేస్ కి తీసుకెళ్తుండే వాడు. అలా నెమ్మదిగా హైదరాబాద్ లో భయం లేకుండా ఒక్కడినే బస్సులు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళగలిగేలా నన్ను తయారుచేశాడు సుబ్రమణ్యం మామయ్య. ఆదివారం సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే తెలుగు సినిమా చూద్దామని పైన ఓనర్ ఇంటికి నన్ను తీసుకెళ్ళేవాడు. ఒక ఆదివారం నేను మొదటిసారి టీవీ లో చూసిన సినిమా యన్.టీ.ఆర్ "రాణీ రత్న ప్రభ". తర్వాత నేను ఇంటర్ ఆంధ్రలొయోలా కాలేజి, విజయవాడలో చేరి హాస్టల్ లో ఉన్న రెండేళ్ళు నాకు ఉత్తరాలు రాస్తుండేవాడు. నాన్నకున్న హాబీని కంటిన్యూ చేస్తూ అప్పటికే నేను స్టాంప్స్, ఫస్ట్ డే కవర్స్, కాయిన్స్ సేకరిస్తుండేవాడిని. ప్రతి ఉత్తరమూ ఫస్ట్ డే కవర్స్ లోనే రాసేవాడు. ఇంటర్ అయ్యాక నా అడ్రెస్ మారి మా ఉత్తరాలకు బ్రేక్ పడింది.

మా రూమ్ లో స్టవ్ ఉండేది. నేనూ చిన్నమామయ్య ఎక్కువగా మెస్ లో తింటుండేవాళ్ళం. అప్పుడప్పుడూ చిన్నమామయ్య చేసేవాడు. నాకప్పటికి వంట చెయటం రాదు. ఒక సారి చిన్నమామయ్య దగ్గర "పప్పు పులుసు" చెయటం నేర్చుకున్నా, "పాలకూర పప్పు" చిన్నమామయ్య చేస్తే చూసి నేర్చుకున్నా. అవి రెండే నాకొచ్చిన కూరలు. ఒకరోజు రాత్రి ఒంటరిగా ఉన్నాను, చిన్నమామయ్య కోసం ఎదురు చూసి చూసి మెస్ లు కూడా మూసేసిన టైమ్ కి వంట చేద్దామని రైస్ వండి, ఆమ్లెట్ వేద్దామని ఒక్కటే గుడ్దు ఉంటే అది కొట్టి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి కలిపాను, పెద్ద ఆమ్లెట్ వస్తుందని ఆశ అంతే. ఆ ఆమ్లెట్ కాస్తా హాంఫట్ అయ్యింది. బహుశా ఆ రాత్రి పస్తున్నానేమో. ఆ విషయం ఒకసారి బామ్మ కి చెప్తే కడుపుబ్బా నవ్వి, "పిచ్చి నాయనా నీళ్ళు పోసేస్తే పెద్ద ఆమ్లెట్ వచ్చేస్తుందా" అని నన్నూ నా వంటనీ ఎప్పుడూ తమాషా చేసేది. టెన్త్ పరీక్షల రిజల్ట్స్ నేను హైదరాబాదులో ఉన్నపుడే వచ్చాయి. మా స్కూల్ లో నలుగురికి టాప్ టెన్ లో స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. నాకూ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, ఎనిమిది మార్కుల్లో మిస్ అయ్యాను. చిన్నమామయ్య న్యూస్ పేపర్ తోబాటు స్వీట్స్ తెచ్చి కంగ్రాట్స్ చెప్పేదాకా రిజల్ట్స్ తెలీదు. మేముంటున్న నవీన్ నగర్ ఇంకొకవైపు నుంచి ఒక ఇరవై నిమిషాలు నడిచెళ్తే ఎర్రమంజిల్ మెయిన్ రోడ్డు పై ఒక నెల్లూరు వాళ్ళ హోటల్ ఉండేది. సండేస్ పొద్దున నేనూ చిన్నమామయ్య వెళ్ళి ఇడ్లీ, దోశ తినేవాళ్లం. తమాషా ఏంటంటే అక్కడ ఇడ్లీ లోకి కారప్పొడి, నెయ్యి, మినుముల పచ్చడి పెట్టేవాళ్ళు. మినుముల పచ్చడి నెల్లూరు స్పెషల్. నెల్లూరులో అందరికీ భలే ఇష్టం. దానికోసమే వెళ్ళేవాళ్ళం. అప్పుడే పది, ఇరవై పైసల నాణేలు కొత్త కొత్త రకాలు "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" కొన్ని నెలలు విడుదల చేస్తుండేది. హైదరాబాద్ లో మాత్రం సర్క్యూలేషన్లో ఉండేవవి కొత్తల్లో. ఆ హోటల్లో చిల్లర తళ తళ మెరుస్తున్న కొత్త కాయిన్స్ ఇచ్చేవాళ్ళు, అన్ని రకాలూ సేకరించానప్పట్లో. అప్పుడప్పుడూ సాయంత్రం ఒక్కడినే అలా బంజారా హిల్స్ అక్కినేని గారి ఇంటి మీదుగా హోటల్ బంజారా దాకా వెళ్తుండే వాడిని, ఎప్పుడన్నా నాగేశ్వర్రావు గారు కనిపిస్తారేమో అని ఆ ఇంటి వైపు చూసేవాడిని, ఇద్దరు మనుషులంత ఎత్తున్న ప్రహరీ పైన ఇనుప కంచె, ఇంటి రెండవ అంతస్తు రూమ్స్ కిటికీలు, కాగితం పూల చెట్లూ మాత్రం కనపడేవి, ఎప్పుడూ గేట్ మూసే ఉండేది, ఒక గార్డ్ కాపలా కూడా.

రావూస్ కోచింగ్ సెంటర్, హిమయత్ నగర్ లో ఉండేది. ఖైరతాబాద్ లో బస్సెక్కి లక్డీ కా పూల్ లో దిగి మరో బస్సెక్కి లిబర్టీ సెంటర్ దగ్గర దిగి 5 నిమిషాలు నడిస్తే చాలు. మొదటి రోజు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు రాజశేఖర్, హరనాథ్. కోచింగ్ కి వెళ్ళిన అన్ని రోజులూ ముగ్గురం రోజూ లిబర్టీ దగ్గర కలిసి అక్కడ ఒక హోటల్ లో ఇడ్లీ భలే ఉంటుందని వాళ్ళే నాకు చెప్తే (నిజంగానే భలే ఉండేది) రోజూ టిఫిన్ చేసి కోచింగ్ కి వెళ్ళేవాళ్ళం. ఒక ఆదివారం ముగ్గురం కలిసి అమీర్ పేట లో "మనిషికో చరిత్ర" సినిమాకెళ్ళాం. తర్వాత నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ లో, వాళ్ళిద్దరూ హైదరాబాద్ లోనే ఏవో కాలేజెస్ లో ఇంటర్మీడియట్ చేరిపోయాం. దార్లు తప్పినా రాజశేఖర్ నేనూ రెండేళ్ళు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, తర్వాత పూర్తిగా తప్పి పోయాం.

ఒకరోజు చిన్నమామయ్య లక్డీ కా పూల్, మీరా డీలక్స్ థియేటర్ లో "సాగర సంగమం" సినిమా సెకండ్ షో కి తీసుకెళ్ళాడు, నాకప్పట్లో ఫైటింగ్ సినిమాలంటేనే ఇష్టం ఉండేది, అయిష్టంగా ఆ సినిమాకెళ్ళాను, అయితే తమాషాగా నేనప్పటికి హైదరాబాద్ లో చూసిన ప్రదేశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయి రవీంద్రభారతి, ఖైరతాబాద్ వినాయక విగ్రహం, బిర్లా మందిర్, హోటల్ అశోక. నాకా సినిమా భలే నచ్చింది. తర్వాత "సితార" పత్రిక నా చేతికొస్తే ఒకరోజు మధ్యాహ్నం ఒక్కడినే ఏమీ తోచక పేపర్, పెన్సిల్ తీసుకుని ఆ పత్రిక ముఖచిత్రం పై ఉన్న కమలహాసన్ బొమ్మ వెయటం మొదలుపెట్టాను. చాలా బాగా వచ్చేసింది, అచ్చు గుద్దినట్టే అనిపించింది. తర్వాత చాలా రోజులు చూసుకుని పొంగిపోయాను. అన్న, నేనున్నానని హైదరాబాద్ చూట్టానికి వస్తే నేనే "సాగర సంగమం" సినిమా భలే ఉంది అని వాడికి చెప్పి మరీ తీసుకెళ్ళాను. అప్పటికే ఎక్కడికైనా సిటీ బస్సులెక్కి భయం లేకుండా తిరగటం వచ్చేసిన నేనే వాడికి అప్పుడు హైదరాబాద్ కి గైడ్. మొదటి జేమ్స్ బాండ్ సినిమా "ఫర్ యువర్ ఐస్ ఓన్లీ" కూడా లక్డీకాపూల్ అమరావతి థియేటర్ లో చిన్నమామయ్యతో కలసి చూశా. నేనూ అన్నా ఇద్దరం కలిసి అబిడ్స్ చెర్మాస్ పక్కన సందుల్లో గుండా లోపలికెళ్తే ఒక థియేటర్ ఉండేది, అందులో "మూన్ రేకర్" కూడా చూశాం. అవే నేను మొదట చూసిన జేమ్స్ బాండ్ సినిమాలు.

అలా నేనున్న, చూసిన హైదరాబాద్ మొదటి అనుభవంలో ఒక మధురమైన అనుభూతి "సాగర సంగమం" సినిమా. తర్వాత పరీక్ష రాసి "కావలి" కి వెళ్ళాక నా చేతికి అందిన "సాగర సంగమం" లోని "కమల్ హాసన్ డ్యాన్స్ స్టిల్స్" ప్రతిదీ పెన్సిల్ తో అప్పట్లో బొమ్మలు వేశాను. ఆ సినిమా అంటే నాకున్న ఇష్టం అభిమానం, U.S. వచ్చిన చాలా ఏళ్ళకి మళ్ళీ 2010 లో బొమ్మలు వెయటం మొదలుపెట్టాక వాటర్ కలర్స్ లో కమల్ హాసన్ నటరాజు డ్యాన్స్ భంగిమ ని వేశాను. ఇంకా కమల్ హసన్ పోర్ట్రెయిట్ కూడా వేశాను. అందులో హీరోయిన్ జయప్రద బొమ్మా వెయ్యాలని ఉండేది, కుదరలేదింకా. 2010 నుంచి దాదాపు పదేళ్ళు ప్రతి సంవత్సరం జనవరి 1 న ఈ సినిమా చూసేవాడిని. చూసిన ప్రతిసారీ అదే "గొప్ప" అనుభూతి. ఆ అనుభూతిని మాత్రం మాటల్లో పెట్టలేను. ఆ సినిమాలో బాలు పాత్రకి అంతగా కనెక్ట్ అయిపోయాను, అంతే. నా మొదటి హైదరాబాద్ అనుభవంలో చూసిన "సాగర సంగమం" సినిమా, ఆ సినిమా చూశాక వేసిన ఈ బొమ్మ ప్రభావం నామీద ఒక జీవితకాలం పడింది. శాస్త్రీయ నృత్యం అంటే ఒకరకమైనా ఆరాధనా ఏర్పడింది. ఓ పదేళ్ళ క్రితం "నృత్యాంజలి" అనే పేరుతో సిరీస్ మొదలుపెట్టి, ఇప్పటిదాకా ఒక యాభై దాకా బొమ్మలూ, పెయింటింగ్స్ వేసి ఉంటాను.

అప్పటిదాకా ఇంత కరెక్ట్ గా నేనేసిన పోర్ట్రెయిట్స్ ఏవీ లేవు, ఇదే ప్రధమం, అదే ఈ బొమ్మ ప్రత్యేకత. తర్వాత వేసిన పోర్ట్రెయిట్స్ అన్నిటికీ ఇదే కొలమానం అయ్యింది. పెన్సిల్ దాటి పెన్ను, అదీ దాటి ఇంకు, ఇంకా పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్ ఇలా వేసిన ఎన్నో పోర్ట్రెయిట్స్ కి వేసిన పునాది - ఈ బొమ్మ నాకు ఇచ్చిన స్ఫూర్తి, నాలో పెంచిన విశ్వాసమే. తర్వాత ఇంజనీరింగ్ రోజుల్లో ఉధృతంగా వేసిన బొమ్మలు, హైదరాబాద్ TCS లో జాబ్ చేస్తున్నపుడు ఆర్టిస్ట్ అయ్యే మార్గాలకోసం హైదరాబాద్ లో నా అన్వేషణలూ ఇలా నా బొమ్మల "సాగరం" లో హైదరాబాద్ సిటీ, ఆ అనుభవాలూ, అనుభూతులూ ఒక అనురాగ "సంగమం". ఇప్పుడు దూరమై పోయినా అప్పుడు తిరిగిన ఆ ప్రదేశాలనీ, కలిగిన అనుభవాలనీ, పొందిన  అనుభూతుల్నీ, పరిచయమయిన మనుషుల్నీ, దగ్గరయిన మనసుల్నీ నిత్యం గుర్తుకి తెస్తూ మదిలో నిరంతరం సంద్రించే "సాగర సంగమం"...

"ప్రదేశాలు మారినా మనుషులు వీడినా, మారని వీడని తొలి అనుభూతుల జ్ఞాపకాలే అనుభవాల సాగర సంగమాలు"
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, February 19, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 6 ...

Portrait of Suhasini from the Telugu movie "మంచు పల్లకి"
Free hand Pencil on Paper ()


"తార"లనంటిన నా బొమ్మలు - "స్వర్ణ యుగం"

స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి "భారతదేశ స్వర్ణయుగం" గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో "మన స్వర్ణ యుగం". నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ బొమ్మకీ రెట్టించిన ఉత్సాహంతో ఆగకుండా పరుగులేస్తూ పైపైకి దూసుకెళ్ళిన కాలమది.

అవి నా ఇంటర్మీడియట్ కాలేజ్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. ఎప్పటిలానే పరీక్షలు రాసి కావలి మా ఇంటికి రావటంతో ఆ రెండు నెలలూ ఖాళీనే. రెండవ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముందే చదివెయ్యాలని టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా అవి తెరిచే ఉత్సాహం అస్సలుండేది కాదు. దేనికైనా ప్రేరణ అవసరం. శలవుల్లో చదువుకి మాత్రం అది దొరకటం చాలా కష్టం. చదువు పక్కనబెట్టి ఏం చేద్దామా అని  చూస్తుంటే ఇదుగో మేమున్నామంటూ ముందుకొచ్చేసేవి నా బొమ్మలు. ఇక వాటితో కూర్చుంటే రోజంతా తెలియకుండానే గడిచిపోయేది. ప్రతిరోజూ ఏం సాధించానో తెలీకపోయినా ఏదో సాధించేశానని సంతృప్తిగానే ఉండేది.

దానికి ముందు పదవ తరగతి వరకూ శలవులకి వచ్చినపుడు అడపా దడపా బొమ్మలేస్తూ వచ్చినా వరసగా బొమ్మలు వేసిన కాలం మాత్రం ఈ రెండు నెలలే. వేసినవన్నీ పోర్ట్రేయిట్సే, అవన్నీ నాటి తెలుగు తారాలోకంలో ప్రముఖులవే, అన్నీ పెన్సిల్ తో వేసినవే. కానీ రేఖా చిత్రాలు కాదు. పెన్సిల్ తో వేసిన పెయింటింగ్స్. కొన్ని ఫ్రీహ్యాండ్ తో వేసినవి, కొన్ని అప్పుడే తెలుసుకున్న రహస్య చిట్కాతో వేసినవి. ఆశ్చర్యం ఏంటంటే పరిశీలించి చూస్తే రెండిట్లోనూ పట్టూ, పట్టు వదలని (విక్ర)మార్కూ కనిపిస్తాయి.

అది తెలుగు వారపత్రికలకు "స్వర్ణ యుగ కాలం". అందులో సినిమా పత్రికలూ వచ్చిచేరాయి. సినీతారల ముఖచిత్రాలతో, సెంటర్ స్ప్రెడ్ విశ్వరూపాలతో వారం వారం అందంగా ముస్తాబై వచ్చి పత్రికలన్నీ ఊరూరా బంకుల్లో తోరణాలు కట్టేవి. ఆ తారాతోరణాళ్ళోంచి కొందరు తారలు నా బొమ్మల్లోకి దిగివచ్చిన గురుతులే ఆనాటి నా బొమ్మలన్నీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ కి వేరు వేరు పెన్సిల్స్ అంటూ ఏవీ వాడింది లేదు, వాడింది కేవలం HB పెన్సిల్ మాత్రమే. లైట్ షేడ్ 6H తో మొదలయ్యి 5H, 4H, 3H, 2H, H ఇలా సంఖ్య తగ్గుతూ తర్వాత వచ్చి చేరే HB, అక్కడి నుండి డార్క్ షేడ్ B తో మొదలయ్యి, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B ఇలా సంఖ్య పెరుగుతూ ఇన్ని రకాల లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పెన్సిళ్ళు ఉంటాయని అప్పుడు తెలిసినా అన్ని ఊర్లల్లో అవి దొరకని కాలం, దొరికినా అన్నీ కొనే స్థోమత లేని కాలం.   

ఎండా కాలం, ఇంటా బయటా మండే కాలం. పడమర ముఖం పెంకుటిల్లు, భగ భగ మండే ఎండ వేడి, మధ్యాహ్నం నుంచి పొద్దుగూకే దాకా రోజంతా ప్రతి నిమిషమూ పెద్ద పరీక్షే. బొమ్మ పొద్దునే మొదలుపెట్టినా పూర్తిచెయ్యాలనే దీక్ష మధ్యాహ్నం కొనసాగించక తప్పేది కాదు. మధ్యాహ్నం అయితే పెంకుల కప్పు వేడికి తాళలేక కుర్చీ, అట్టా ఎత్తుకుని సందులో గోడకింద నీడలో చేరేవాడిని. మా ఇంటి గోడకీ, పక్కింటి ప్రహరీ గోడకీ మధ్య సరిగ్గా కుర్చీ పట్టేంత సందు. పక్కింట్లోని తురాయి చెట్టు నీడ కూడా కలిపి ఇంట్లో కన్నా కొంచెం బెటర్ గా ఉండేదక్కడ. అదే ఎక్కువగా మధ్యాహ్నం నా మల్టీ పర్పస్ ఎయిర్ కండిషనింగ్ ఏరియా; స్టడీ రూమ్ + ఆర్ట్ స్టుడియో. ఇంజనీరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్ లోనూ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కూర్చునే చదివాను. డిస్టింక్షన్ మార్కుల ప్రభావం ఆ స్థల మహిమే :)

ఆనాడు "తార"ల లోకాన్నంటిన నా బొమ్మలలోకం లోకి ఈనాడు తొంగిచూస్తే తృప్తిగా అనిపించేవీ, కళ్ళకి కట్టినట్టు మనసుకి కనిపించేవీ:
   . గమ్ముగా అస్సలు కూర్చోలేని స్వభావం
   . ఏదో చెయ్యాలన్న తపన
   . ఎందుకేస్తున్నానో కూడా తెలీకుండానే వేస్తూ పదునెక్కుతున్న బొమ్మలు
   . బొమ్మ బొమ్మకీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
   . ఆ బొమ్మల వెనక పడ్డ కష్టం
   . పడ్డ కష్టం లోంచి లేచి ఎప్పటికీ పదిలంగా మదిలో నిలబడిపోయిన సంతృప్తి
   . ప్రతి బొమ్మలో నిక్షిప్తమైన అలనాటి జ్ఞాపకా(లా)లు

ఎన్నో జ్ఞాపకాల మూటల్ని తమలో కలుపుకుని, నన్ను వదలక నాతోనే ఉంటూ, తెరిచి చూసిన ప్రతిసారీ నా  గతంలోకి నన్ను మళ్ళీ మళ్ళీ లాక్కెళ్ళే నా బొమ్మలు, ఇవే నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ "నిజమైన నా నేస్తాలు", తృప్తిగా నేను తరచూ తలుచుకునే "మధుర క్షణాలు"...

"కళాకారుడు తన కళని పూర్తిగా ఆశ్వాదించేది చుట్టూ ప్రేక్షకులు లేనప్పుడే."
- గిరిధర్ పొట్టేపాళెం

 
"దాసరి నారాయణ రావు"

"రాధ"

 "చిరంజీవి ఖైది"

 "శ్రీదేవి"

"శ్రీదేవి"

 "జయసుధ"

 "జయసుధ"

 "జయసుధ"

"సుహాసిని"

Saturday, January 23, 2021

The Legacy...

Color Pencils on Paper (11" x 14")
Artist: Bhuvan Pottepalem   

Parents are models for their kids. Kids observe, copy and learn from their parents. By following and practicing certain things at home parents keep building their legacy, knowingly or unknowingly. Creating an atmosphere at home for the "love of anything" makes the foundation. Constantly following and practicing that thing keeps building the legacy of it. The legacy built and left behind by parents will be remembered and carried on by their kids.

I am happy to foresee that Bhuvan is going to carry on the Legacy. The "Legacy of Art", left behind by my Father, that I proudly remember and carry on...

"Legacy isn’t tomorrow. Legacy is now. Today’s footprint is tomorrow’s legacy."

Details
Reference: American Football players - Seattle Seahawks team
Mediums: Color Penils on Paper
Size: 11" x 14" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook

Sunday, July 12, 2020

Day 8 of 10 - Simple, Special and Beautiful...

Simple, Special and Beautiful
Pencil on Paper (5" x 7")     

Back to 1988...

స్వర్ణకమలం - కాలేజి రోజుల్లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన సినిమా. ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు. "భానుప్రియ" పాత్రని "కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్" గారు మలచి, తీర్చిదిద్దిన తీరు, దానికి సరిగ్గా తగ్గట్టు ఆమె చూపించిన అభినయం "స్వర్ణకమలం" అనే ఓ గొప్ప తెలుగు పదానికి నిండు రూపాన్నిచాయి. ఏ తెలుగు డిక్షనరీ లోనైనా ఈ పదానికి విడమరిచి మరీ అర్ధం చెప్పాలంటే ఈ సినిమాలో ఈ పాత్రని చూసి అర్ధం చేసుకోవాల్సిందే అన్నంతగా ఆ పాత్రని పోషించి, దానికి జీవం పోసి, ఆ పాత్రని ఎప్పటికీ సజీవం చేసిన నాటి మంచి నటీమణి, అంతకి మించిన మంచి నర్తకి "భానుప్రియ".

నా బొమ్మల్లో ఇప్పటికీ "భానుప్రియ" దే అగ్రస్థానం. దాదాపు 25 పోర్ట్రెయిట్స్ దాకా వేశాను. నా బొమ్మల్లో భరతనాట్యం మీద నా ఆసక్తి కి బీజం "సాగరసంగమం". ఆ మూవీ చూశాక, అప్పట్లో ఆ సినిమాలో "కమలహాసన్" డ్యాన్స్ స్టిల్స్ ప్రతిదీ పెన్సిల్ తో వేశాను. అలా నా బొమ్మల్లో డ్యాన్స్ కి "సాగరసంగమం" సినిమా బీజం అయితే, అది మొలకెత్తి చిగురించి ఎదిగింది మాత్రం "స్వర్ణకమలం" తోనే.

అలానే ఇప్పటిదాకా ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా పెయింటింగ్స్ వేసింది ఏదీ అంటే అది "భరతనాట్యం". "నాట్యాంజలి" అని మొదలెట్టి 1,2,3...12...21...అని ఇలా లెక్కపెట్టుకుంటూ పోతూ, ఎక్కడో లెక్క తప్పి, లెక్క పెట్టటమే మానేశాను. బహుశా అన్నీకలిపి ఓ యాభై పైనే వేసుంటానేమో ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ మీదే. ఈ సబ్జెక్ట్ కి స్ఫూర్తి కూడా అలనాటి నటి "భానుప్రియే"!

"భానుప్రియ" ని ఎప్పుడు TV లో చూసినా నువ్వే గుర్తొస్తావ్ గిరీ అని ఇప్పటికీ కొందరు ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు. అసలు "భానుప్రియ" ఎవరో తెలీకుండా, ఆమె సినిమా చూడకుండానే ఆమెకి అభిమానినయ్యాను.

Back to few more years, 1984...

"ఆంధ్ర లోయోలా, విజయవాడ" లో ఇంటర్మీడియట్ రోజులు..."నీలాచలం" అని ఒక ఫ్రెండ్ Bi.P.C. గ్రూపు, "తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్" నుంచి, అందుకేనేమో సహజంగా "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్  నుంచి మా బ్యాచ్ లో ఉన్న మా ముగ్గురితోనే ఎక్కువగా సావాసం చేశాడు. చాలా సౌమ్యుడూ, నెమ్మదస్తుడూ. హాస్టల్లో ఎప్పుడూ మాతోనే మసలేవాడు. నన్ను `గిరిధర్` అని పిలిచే అతి కొద్ది ఫ్రెండ్స్ లో అతనూ ఒకడు. నేనేసే బొమ్మలు చూసి బాగ మెచ్చుకునేవాడు, నీలాచలం మాటలు నాకిప్పటికీ గుర్తే. "గిరిధర్ , నువ్వు `సితార` సినిమా చూడాలి, అందులో "భానుప్రియ" అని కొత్తనటి, ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయి, కళ్ళతోనే యాక్ట్ చేస్తుంది. మంచి డ్యాన్సర్ కూడా. నువ్వు ఆసినిమా చూస్తే తప్పకుండా ఇష్టపడతావు, ఆమె బొమ్మలు చాలా గీస్తావు." అని ఎప్పుడూ నా పక్కన భుజం మీద చెయ్యేసి నడుస్తూ అంటూనే ఉండేవాడు. అలా అతను అనేకసార్లు చెప్పీ చెప్పీ, తర్వాత `సితార` ఫొటోలు పత్రికల్లో చూసి, నీలాచలం చెప్పేది నిజమేనా అనుకున్నాను.

కానీ "నీలాచలం" నన్ను చూడమంటూ పదే పదే చెప్పిన `సితార` సినిమా చూసే అవకాశం చాలా సంవత్సరాలదాకా రాలేదు. అప్పట్లో ఆ సినిమా చాలారోజులు ఆడి సెన్సేషన్ సృష్టించి థియేటర్స్ లోనుంచి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన "ప్రేమించు పెళ్ళాడు" సినిమా నాకెంతో నచ్చింది. అదే నేను చూసిన "భానుప్రియ" మొదటి సినిమా. సితార ఫొటోల్లో చూసి నేననుకున్న సింప్లిసిటీ ఈ సినిమాలోనూ కనిపించింది. అందులో "భానుప్రియ" కళ్ళతోనే చేసిన అభినయం, నృత్యాలూ చూసి "సింపుల్"  గా అభిమానినయ్యాను. తర్వాత వచ్చిన "అన్వేషణ" కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది.  ఆ సినిమాలో డైరెక్టర్ వంశీ గారు చాలా ఫ్రేముల్లో కళ్ళతోనే అభినయం చేయించారు. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ గా అనిపించింది. "విజేత" లోనూ బాగా నచ్చింది. "ఆలాపన" లో ఒక పాటకి చేసిన నృత్యం ఎప్పటికీ మరచిపోలేను. "మంచిమనసులు" సినిమాలోనూ ఒక పాటలో ఎంతో హృద్యంగా  చేసిన నాట్యం ఎప్పుడు చూసినా నన్ను కదిలిస్తూనే ఉంటుంది.

తర్వాత వచ్చిన "స్వర్ణకమలం" అయితే ఇక ఇంతకన్నా "భానుప్రియ" కి గొప్ప సినిమా రాదేమో అన్నంతగా నన్నూ నా బొమ్మల లోకాన్నీ ఆకట్టుకునేసింది. పేపర్స్ లో వచ్చిన డ్యాన్స్ స్టిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను, బొమ్మలు వెయ్యటంకోసం. చికాగో లో ఉన్నపుడు ATA Conference లో నా Art Works 5 display చేస్తే, అందులో "స్వర్ణకమలం" లోని ఓ డ్యాన్స్ స్టిల్ ని పెన్సిల్ తో వేసిన బొమ్మ చాలా నచ్చింది, కొనుక్కుంటాను అంటూ నాకొచ్చిన ఫోన్ కాల్ ఎప్పటికీ మర్చిపోలేని ఆనందం. "స్వర్ణకమలం" లో "భానుప్రియ" డ్యాన్స్ స్టిల్స్ చాలా వేశాను. ఇంకా చాలా ఉన్నాయి, వెయ్యాలి, వేస్తాను.

వికీపీడియా లో "భానుప్రియ" ప్రొఫైల్ పేజి లో ఇప్పటికీ నేను వేసిన డ్రాయింగ్స్ ఉన్నాయి. వికీపీడియా  "స్వర్ణకమలం" పేజి లోనూ నేనేసిన బొమ్మ ఒకటి ఇప్పటికీ ఉంది. గూగుల్ లో ఎవరైనా సెర్ఛ్ చేసినా బహుశా నేను వేసిన బొమ్మలే ఎక్కువగా కనిపించొచ్చు. ఆ మధ్య ఒకసారి TV9 చూస్తున్నపుడు "భానుప్రియ" చెల్లెలు "శాంతిప్రియ" పై ఏదో ప్రోగ్రాం వస్తూ చూపించిన కొన్ని ఫొటోల్లో నేనేసిన "భానుప్రియ" బాల్ పాయింట్ పెన్ స్కెచ్ చూసి చాలా థ్రిల్లింగ్ అయ్యాను.

"భానుప్రియ" కనపడకుండా నా బొమ్మలలోకం లేదు, నా బొమ్మలు చెప్పే కబుర్లు పూర్తి కావు. అలా "భానుప్రియ" నా బొమ్మల్లో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సింపుల్, స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ గానే మిగిలి ఉంది, ఉంటుంది...

Check the following links:




Thursday, August 22, 2019

Star Star "Mega Star" Star...

ఈనాటి "మెగా స్టార్" ఆనాటి నా "స్టార్" బొమ్మల్లో
Pencil, Ballpoint Pen and Ink Pen on paper    

ఈనాటి "మెగా స్టార్" ఆనాటి నా "స్టార్" బొమ్మల్లో...
Those were the days, my favorite Star was also my Hero in my Arts (1984...85)

Happy Birthday to MegaStar Chiranjeevi!
Your growth is an inspiration for (m)any!!

Also, this is just a coincidence that this post is my 300th post. Happy that it's my Art of my favorite Star of all-times ;)

Saturday, May 12, 2018

మహానటి...

"మహా నటి" సావిత్రి

"మహా నటి" అన్న తెలుగు పదానికర్ధం
"సావిత్రి" అనే అందమైన అభినయం.

Details
Title: "మహా నటి" సావిత్రి
Mediums: Pencil on Paper
Inspiration: Her True Story Book "మహా నటి" సావిత్రి వెండితెర సామ్రాగ్ని ...
Size: 8 1/2" x 11" (21.5 cm x 28 cm)
Surface: Sketchbook, Acid Free Paper

Saturday, February 24, 2018

My Tribute to Legendary Talent of Indian Silver Screen - Sridevi...




Deeply saddened by the news about Tollywood and Bollywood Actress Sridevi. I never thought I would share my Pencil sketches of Sridevi on the news like this.

This is my tribute to one of the great Legendary Talents of Indian Silver Screen!