Showing posts with label neccheli. Show all posts
Showing posts with label neccheli. Show all posts

Saturday, January 4, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 27 . . .

Portrait of a Businessman
Sketch Pens on paper 3" x 4"

ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటిలో సైతం కనిపించే నల్లదనం...ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయమే.

బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు రంగులతోనే ఉండేవి. పిల్లలు రంగులపట్ల అంతగా ఆకర్షితులవటం ప్రకృతి సహజం.

నా మొదటి రంగుల గురుతులు మదిలో తరగని చెరగని నా బాల్యం నాటివే. నల్లని పలకపై బలపంతో దిద్దిన తెల్లని అక్షరాలు, ఆటల్లో వేళ్ళ కొసలన పట్టి వదిలిన గిర్రున తిరిగిన రంగు రంగుల గాజు గోళీలు, సన్నని పేనిన తాడుతో చుట్టి సంధించి లాగి విసిరితే సర్రున తిరిగిన రంగుల బొంగరాలు, ఉపరితలంపై రెపరెపలాడిన రంగు రంగుల కాయితపు గాలిపటాలు, మండుటెండలో పెదవుల మధ్య జిల్లుమనిపిస్తున్నా జుర్రిన రంగుల పుల్ల ఐసులు, పెరట్లో పూసిన పసుపు పచ్చ, నారింజ రంగు ముద్దబంతి పువ్వులు, ఎండాకాలపు తెల్లని మల్లెమొగ్గలు, సంక్రాంతి పండుగ ముగ్గుల వర్ణాలు, మా ఊర్లో నాన్న కట్టించిన మా కొత్తింటికి వేసిన రంగులు...ఇలా ఆటపాటల బాల్యం అంతా రంగుల మయం. ఎంతమందికి మొట్టమొదటి రంగుల అనుభూతులు ఎంతో కొంత మదిలో అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటాయో తెలీదు కానీ నా మటుకు నాకు మాత్రం ఇప్పటికీ కొన్ని ముదురు రంగులు చూస్తే మనసు బాల్యంలోకి పరిగెడుతుంది.

పలక పై తెల్లని అక్షరాలు దాటి కాగితంపైన రాయటం మొదలు పెట్టాక, బులుగు, నలుపు, ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో ఇంకులు ఉండేవి అప్పటి రోజుల్లో. ఎక్కువగా బులుగు రంగు ఇంకే అందరూ వాడేవాళ్ళు. నాన్న టీచింగ్ నోట్స్ లో నాలుగు రంగులూ కనపడేవి. ఆకు పచ్చ, ఎరుపు రంగులతో నీటిపై అలల్లా అక్షరాల కింద చేసిన అండర్ లైన్లు ఎప్పటికీ మరువలేను. ఎర్రని ఇంక్ తో నాన్న దిద్ది మార్కులు వేసి నిలువుకి సగం మడిచి దారం కట్టిన ఆన్సర్ పేపర్స్ కట్టల గురుతులూ ఇంకా మదిలో చెక్కు చెదరనే లేదు. నాన్న తనే డిజైన్ చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీసి తన ప్లాన్ తో కట్టుకున్న ఇంటికి వాడిన ఆహ్లాదకరమైన పచ్చ, ఆరెంజ్, బ్లూ, లేత వంగపండు రంగులూ అంతే కొత్తగా ఇప్పటికీ మదిలో గూడు కట్టుకునే ఉన్నాయి. రంగులపై ఏర్పడ్డ మొదటి మక్కువ అంటే ఆడిన గోళీలే. రంగురంగుల గోళీల్లో కొన్ని రంగుల గోళీలు అరుదుగా వచ్చేవి. ఆ రంగుల గోళీల్ని ఆడకుండా వాడకుండా ప్రత్యేకంగా దాచుకుని పదే పదే చూసుకున్న గురుతులు ఎన్నో. తిరిగే బంగరాల ఉపరితలంపై రెండు మూడు రంగుల తిరిగే వృత్తాలు ఇప్పటికీ తలపుల్లో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.

ఇంకు పెన్ను తర్వాత స్కెచ్ పెన్ను వాడిన మొదటి అనుభవం స్కూల్ లో నా పదవ తరగతి నాటిది. పదవ తరగతిలో మా సైన్స్ టీచన్ "రామస్వామి సార్" స్కెచ్ పెన్నులు కొనిపించి అవి ఎంత ఎక్కువ వాడి పరీక్షలు రాస్తే అంత అదనంగా మార్కులు వేస్తూ ప్రోత్సహించేవారు. అలా సైన్సు బొమ్మలకి రంగులేయటం, బయాలజీ నోట్ బుక్ లో నోట్స్ కి హెడింగ్స్, సబ్ హెడింగ్స్ రాయటం, ఇంపార్టెంట్ పాయింట్స్ స్కెచ్ పెన్నుల్తో అండర్లైన్లు చెయ్యటం...ఇవి స్కెచ్ పెన్నుల్తో నా మొదటి అనుభవాలు. 

నా బొమ్మల్లో రంగుల స్కెచ్ పెన్ను లు అడపాదడపా వాడినా వాటితోనే పూర్తిగా వేసిన బొమ్మలు మాత్రం చాలా తక్కువ. అలా వేసిన అతికొద్ది బొమ్మల్లో ఈ బొమ్మ ఒకటి. మామూలుగా ఏ బొమ్మ అయినా ఎంతకాలం తర్వాత అయినా అది వేసిన ప్రదేశం, ఆ సమయం మరపురాని నాకు ఈ బొమ్మ కూడా అంత ఖచ్చితంగానే గుర్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. "కావలి" లో మేమప్పుడు అద్దెకుంటున్న మా నారాయణవ్వ పెంకుటిల్లు.అదే నా బొమ్మలకి పుట్టిల్లు. సమయం చీకటి పడ్డ సాయంత్రం. ట్యూబ్ లైట్ వెలుతురులో మధ్య గదిలో నేలమీద కూర్చుని నాన్న కలెక్షన్ లో మిగిలున్న కొద్ది "రీడర్స్ డైజెస్ట్" బుక్స్ తిరగేస్తున్న నన్ను ఒక "బిజినెస్ మ్యాన్" టై కట్టుకుని తల వంచుకుని కొంచెం పక్కకు తిరిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంది. అప్పటికప్పుడు గియ్యలన్న కోరికతో దగ్గరున్న స్కెచ్ పెన్నుల సెట్ తీసుకుని ఉన్న నాలుగైదు రంగులతో చకచకా పేపర్ పైన గీసిన స్కెచ్ బొమ్మ ఇది. సంతకం మాత్రం ఇంకు పెన్ తో పెట్టాను. అపటికింకా పూర్తిగా నాదంటూ ఒక ప్రత్యేకంగా తేలని సంతకం, బొమ్మ బొమ్మలో ఇంకా వింత వింత పోకడలు పోతూనే ఉండేది.

రీడర్స్ డైజెస్ట్ - అప్పట్లో చాలా అరుదుగా కొంతమంది దగ్గర మాత్రమే కనిపించేది. అదీ సంవత్సరం డబ్బులు కట్టి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెల నెలా పోస్ట్ లో వచ్చే ఒక చక్కని జనరల్ ఫ్యామిలీ ఇంగ్లిష్ మాస పత్రిక. చిన్న నోట్ బుక్ అంత సైజ్ లోనే ఉండేది. మంచి క్వాలిటీ పేపర్ పై, క్వాలిటీ రంగుల ప్రింట్ తో చాలా విషయాల మీద అవగాహన పెంచే ఒక మంచి మ్యాగజైన్. నాన్న కొన్ని సంవత్సరాలు ఈ బుక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంట్లో చాలా ఉండేవి. అప్పుడప్పుడూ ఏమీ పాలుపోకపోతే అటకెక్కిన గంపలోని ఈ పుస్తకాలు దించి వాటిని తిరగేయటం నాకలవాటుగా ఉండేది. అలా దించిన ప్రతిసారీ కొద్ది గంటల సమయం తెలియకుండానే గడిచిపోయేది. చిన్నప్పుడు కేవలం అందులోని బొమ్మలు మాత్రమే చూసేవాడిని. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్టికిల్స్ చదివేవాడిని. ప్రతి ఎడిషన్లో మొదటి పేజీల్లో ఇంగ్లిష్ కొటేషన్స్ ఉండేవి, అవి మాత్రం ఆసక్తిగా అన్నీ చదివి వాటిని అర్ధం చేసుకుని విశ్లేషించుకునేవాడిని.

గమ్మత్తుగా నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ లో ఇంటర్మీడియట్ చేస్తున్నపుడు నా హాస్టల్ అడ్రెస్ కి "రీడర్స్ డైజెస్ట్" పబ్లిషర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది, ప్రాంతాల వారీగా సెలెక్టెడ్ లిస్ట్ లో నా పేరు ఉందనీ, అందుకని నాకు డిస్కౌంటెడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాం అంటూ. చాలా థ్రిల్ తోఅయిపోయి డబ్బులు డ్రాఫ్ట్ ద్వారా కట్టి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను. అప్పుడు వాళ్ళకి నా పేరూ అడ్రెస్ ఎలా దొరికిందో తెలీదు. తర్వాతా చాలా యేళ్ళకి ఆలోచిస్తే తట్టింది. నా పేరు మీద నా పదవ తరగతి మార్కుల సర్టిఫికేట్ పెట్టి ఒక నార్త్ ఇండియన్ (నాకు ఫ్రెండ్ కూడా కాదు) IIT మెటీరియల్ ఫ్రీ గా తెప్పించుకున్నాడు. ఎక్కువ మార్కులు వచ్చిన  స్టూడెంట్స్ కి ఫ్రీగా IIT మెటీరియల్ ఇచ్చే ఒక కోచింగ్ సెంటర్ ఢిల్లీ లో ఉందనీ నాకు తెలీదు. కేవలం నా ద్వారా అది వాడుకోవటానికి మాత్రమే నా దగ్గరకి వచ్చి అడిగిన ఆ అబ్బాయికి "నో" చెప్పొచ్చనీ తెలీదు. తర్వాత ఆ అబ్బాయి ఆ మెటీరియల్ వచ్చాక నా దగ్గరి నుంచి తీసుకెళ్ళటం తప్ప, ఒక థ్యాంక్స్ గానీ, కనిపించినపుడు పలకరించటం కానీ లేకపోయినా, అలా కూడా అవకాశం తీసుకుంటారా అన్నదీ తెలీదు. అది తెలిసిన నా ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం నీ మార్కుల లిస్ట్ కాపీ అతనికి ఇవ్వకుండా ఉండాల్సింది అన్నారు. కొద్ది రోజులు మనసు భారంగా అనిపించింది. అప్పటి రోజుల్లో మన చుట్టూ ఉన్న సోషల్ (సామాజిక) వాతావరణం ఇలానే ఉండేది. బహుశా వాళ్ళ ద్వారా "రీడర్స్ డైజెస్ట్" కి నా అడ్రెస్  దొరికిందేమో.

అలా రీడర్స్ డైజెస్ట్ తో నా అనుబంధం ని గుర్తు చేస్తూ అందులో ఒక ఫొటో చూసి వేసింది ఈ బొమ్మ. ఇలా ఈ స్టైల్ లో అంత త్వరగా అప్పటిదాకా ఏ బొమ్మా వెయ్యలేదు. చక చకా ఉన్న కొద్దిపాటి స్కెచ్ పెన్నుల్తో కొద్ది నిమిషాల్లోనే గీశాను. గీశాక ఇలా కూడా బొమ్మలు గియ్యొచ్చా అనిపించింది. అప్పట్లో నేరుగా పెన్ తోనే ఎ బొమ్మ వేసినా ఎక్కువగా ఏ బొమ్మలోనూ డైమన్షన్స్ తప్పేవాడిని కాదు. కారణం తపన, ఫోకస్, ఆ వయసులో వేరే లెవల్లో ఉన్న ఆసక్తి లెవెల్స్, అవే కారణం. 

రంగులతో అలా పేపర్ మీద స్కెచ్చులతో మొదలయిన అనుభవాలు తర్వాత వాటర్ కలర్స్, అదీ దాటి క్యాన్వాస్ మీద ఆయిల్ దాకా వెళ్ళినా, అప్పటి బొమ్మల్లోని పూర్తి సంతృప్తి ఇప్పుడు కొరవైందా అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ, కాలంతో జీవితంలో ముందుకి నడిచే కొద్దీ వెనకటి కాలం అనుభవాలూ, గురుతులూ, తలపులూ ఇష్టంగా అనిపిస్తూ అపుడే చూసిన కొత్త వన్నె తగ్గని రంగుల అనుభూతుల్లా మనః ఫలకం పై ప్రతిబింబిస్తూనే ఉంటాయి...

"జ్ఞాపకాల రంగులు ఎన్నటికీ మాయవు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, September 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 24 . . .

క్రిస్టొఫర్ రీవ్ - సూపర్ మ్యాన్
Watercolors on Paper (8" x 11")

హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా. జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తుపెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా కూడా ఆ విజువల్స్, ఆ అద్భుతమైన చిత్రీకరణ అనుభూతి కోసం వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అప్పుడు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసే ప్రక్రియ ఉండేది కాదు. నా చిన్నప్పటి హైస్కూల్ డేస్ లో అయితే "బ్రూస్ లీ" కరాటే స్టిల్స్ ఉన్న నోట్ బుక్స్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పటికీ బాగా గుర్తుంది. బ్రూస్ లీ "ఎంటర్ ది డ్రాగన్" ప్రపంచ సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ వరసలో ముందుగా వచ్చిన "సూపర్ మ్యాన్" కూడా అంతగా పాపులర్ అయ్యింది. "బ్రూస్ లీ" అంతలా ప్రతిఒక్కరికీ చేరువ కాకపోయినా సూపర్ మ్యాన్ సినిమాలో హీరో "క్రిస్టొఫర్ రీవ్" పేరు చాలా మందికి బాగా గుర్తుండేలా. క్రిస్టొఫర్ రీవ్ సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న స్టిల్స్ నాకైతే పోర్ట్రెయిట్ డైమన్షన్స్ కి ఒక కొలమానంగా అనిపించేవి.

అప్పుడప్పుడే కొలిచి గీసినట్టు, అచ్చుగుద్దినట్టు తెలుగు సినిమా హీరో, హీరోయిన్ల పోర్ట్రెయిట్స్ పెన్సిల్ తో  వేస్తూ కొంచెం కొంచెం నాసిరకం వాటర్ రంగుల బిళ్ళలతో పెయింటింగ్స్ మొదలు పెట్టిన నా ఇంటర్మీడియట్ కాలేజి రోజులవి. ఏదో ఆదివారం దినపత్రికలో నాకు దొరికిన సూపర్ మ్యాన్ స్టిల్ ఇది. ఆంధ్ర లొయోలా కాలేజ్, విజయవాడ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సమ్మర్ శలవులకి "కావలి" వచ్చినపుడు వేసింది. పరీక్షలు కూడా రాసి ఇంటికి రావటంతో రెండు నెలలు ఖాళీ సమయం. బొమ్మలు వెయ్యటం, పత్రికలు తిరగెయ్యటం, నవలలు దొరికితే చదవటం, రోజూ పొద్దున కావలిలో ఉన్న మూడు లైబ్రరీ లకి వెళ్ళి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తిరగెయ్యటం, పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకెళ్ళి కాసేపు అక్కడ ప్రింట్ అవుతున్న మెటీరియల్స్, పాంప్లెట్స్, పెళ్ళి పత్రికలు గమనించటం, అప్పుడప్పుడూ సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్ళటం ఇవే శలవుల్లో నా వ్యాపకాలు. పొద్దున్నే లేచి రోజంతా ఈ వ్యాపకాలన్నీ చేసినా ఒక్కొకరోజు సాయంత్రం అయ్యేసరికి ఏమీ తోచేది కాదు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నేలమీద కూర్చుని ప్యాడ్ పెట్టుకుని బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాసిరకం వాటర్ కలర్ బిళ్ళల పెట్టె ఒకటి, అన్న కొన్నది ఇంట్లో వాడకుండా పడిఉండేది. వాడి విశ్వోదయ హై స్కూలులో ఆర్ట్ క్లాస్ కోసమని కొన్నది. నాకు పెన్సిల్ తో వెయటం బాగా వచ్చాక, పెన్ను తో కొంత కాలం బొమ్మలేశాక, రంగుల మీదికి మనసు మళ్ళింది. వాడక అలా పడున్న ఆ వాటర్ రంగుబిళ్ళల పెట్టె నేను వాడటం మొదలుపెట్టాను, ఒక డజను దాగా వాటితో చిన్న చిన్న వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశాను. వాటిల్లో ఈ "సూపర్ మ్యాన్" ఒకటి. రంగులు పేపర్ మీద వేస్తుంటే బాగా పాలిపోయినట్టుగా ఉండేవి . మిక్సింగ్ కి సరిగా సహకరించేవి కాదు. అయినా వాటిల్తోనే కొద్ది కాలం కుస్తీలు పట్టేవాడిని.

ఒక్కొకసారి ఏమీ తోచని నాకు తన స్కూల్ రికార్డ్స్ నన్ను రాయమని అమ్మ పని కల్పించేది. అమ్మ ఎప్పుడు అడిగినా రాయను అనకుండా శ్రద్ధగా అన్నీ రాసి పెట్టేవాడిని. అమ్మ కావలి "జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల" లో జూనియర్ అసిస్టంట్ గా, అంటే క్లర్క్ గా పని చేస్తుండేది. గర్ల్స్ హైస్కూల్ కి ఆనుకునే, పక్కన బాయ్స్ హైస్కూలు లో టీచర్ గా నాన్న పనిచేశారు. ఊహించని విధంగా మమ్మల్నీ ఈ లోకాన్నీ వీడి నాన్న పోయిన ఒక్క నెలకే అమ్మ జాబ్ లో చేరవలసిన పరిస్థితి ఎదురైంది. ధైర్యం చెప్పి అమ్మకి అన్నీ తనే అయ్యి మా తాతయ్య, అంటే అమ్మ నాన్న అమ్మతో తొలి అడుగులు వేయించారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అమ్మ ఉద్యోగం చెయ్యకపోతే మా మనుగడ చాలా కష్టం అయ్యేది. అమ్మ చదివిన పి.యు.సి (అంటే ఇంటర్మీడియట్) క్వాలిఫికేషన్ కి అమ్మకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గర్ల్స్ హై స్కూలు మొత్తానికి అమ్మ ఒకటే క్లర్క్, స్కూలు రికార్డ్స్, నెల నెలా జీతాలు, పరీక్షల ఫీజులు, మార్కుల లిస్టులు, అన్నీ అమ్మ ఒక్కటే చూసుకునేది. నెల మొదటి వారం జీతభత్యాల లెక్కలు రాసి స్టాఫ్ అందరికీ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే పని కూడా అమ్మదే. స్టూడెంట్స్ పరీక్షల ఫీజులు కట్టించుకుని ఆ డబ్బులు బ్యాంక్ లో వెళ్ళి జమ చేసే పనీ అమ్మదే. ఇలా నెల మొత్తం చాలా పని ఉండేది. పెళ్ళయ్యాక గృహిణిగా ఉంటూ ఇల్లు, సంసారం నాన్ననీ మమ్మల్నీ చూసుకుంటున్న అమ్మకి ఒక్క సారిగా జాబ్ చెయ్యాటానికి కావలసిన చదువున్నా ఆ పని బొత్తిగా తెలీదు, అనుభవం లేదు. స్కూల్ లో క్లరికల్, రికార్డ్స్ పని అస్సలు తెలీదు. ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలలు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ అమ్మకి ఎంతో ధైర్యం చెప్పి చాలా సపోర్టివ్ గా ఉండి నేర్పించింది అని అమ్మ చెప్పేది.

శలవులకి నేను వచ్చినపుడల్లా ఆ రికార్డులు రాసే పని కొంతవరకూ నేనూ చేసిపెట్టేవాడిని. ఒక్కొక నెల పని భారంతో అమ్మ పడే టెన్షన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి. పొద్దున 5 గంటలకి ముందే నిద్రలేచి కసువూ, కళ్ళాపి, ముగ్గుల పనులు ముగించి పాలు తీసుకుని రావటం, ఇంటి ఎదురుగా మున్సిపల్ కుళాయి దగ్గర బిందె లైన్లో పెట్టి నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం, రోజుకి సరిపడా నీళ్ళు పట్టి తొట్టెలకీ, బకెట్లకీ పోసిపెట్టటం, మాకు కాఫీలు, టిఫెన్లూ చేసి పెట్టటం, అంట్లు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, మాకు మధ్యాహ్నానికి అన్నం, పచ్చడీ, కూరా వండి, అన్నీ వంటింట్లో సర్ది పెట్టి, తయారయ్యి తొమ్మిది గంటలకల్లా ఇంటికి తెచ్చుకున్న రికార్డు బుక్కులన్నీ పట్టుకుని నడచి స్కూలు కి వెళ్ళటం...ఇది రోజూ అమ్మ పొద్దున పని. ఆ పనుల్లో బయల్దేరే టైమ్ కొద్దిగా ఆలశ్యం అయితే పడే టెన్షన్ చాలా ఉండేది. అలాగే లంచ్ టైమ్ ఎర్రటి ఎండలో నడచుకుంటూ ఇంటికి వచ్చి గబగబా మాకు భోజనాలు పెట్టి, తనూ తిని స్కూలుకి పరుగులు పెట్టటం. సాయంత్రం నాలుగున్నరకి రాగానే బిందె పట్టుకుని నీళ్ళకోసం వెళ్ళటం, చీకటి పడే వేళకి మళ్ళీ వంటా, వార్పూ, పనులతో అలా అలసిపోతున్నా అలసట తెలియని మిషన్ లా తిరిగి తిరిగి అరిగిపోతూ కరిగిపోయిన కాలం తాలూకు రోజులవి.

ఇప్పటికీ గుర్తుంది, ఆ సంవత్సరం సమ్మర్లో నేనే ఒక నెల రికార్డులు అన్నీ రాసి పెట్టాను. వాటిల్లో సంతకాలు పెడుతూ హెడ్మిస్ట్రెస్ చూసి చాలా మెచ్చుకున్నారంట. నా చేతివ్రాత గుండ్రంగా ఉండేది. "విజయలక్ష్మీ ఎవరు రాశారు ఈ నెల రికార్డ్స్?" అని హెడ్మిస్ట్రెస్ అడిగితే, "మా చిన్నబ్బాయి గిరి, కాలేజి నుంచి శలవులకొచ్చాడు" అని చెప్పిందంట. సమ్మర్ లో స్కూలుకి శలవులు, అయినా అమ్మకి మాత్రం నెల మొదటివారం, చివరివారం రికార్డుల పని ఉండేది. అలా సమ్మర్ శలవుల్లో స్టాఫ్ అంతా పని చేయ్యకున్నా జీతాలు ఇవ్వాలి, క్లరికల్ పని తప్పదు కాబట్టి అమ్మకి సమ్మర్ శలవుల్లో నెల జీతంతో బాటు స్పెషల్ గా మరో 20 రూపాయలు వచ్చేది. ఆ సంవత్సరం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ ఆ స్పెషల్ డబ్బులు అమ్మకి ఇస్తూ "ఈ 20 రూపాయలు మాత్రం మీ చిన్నబ్బాయికి ఇవ్వు" అని చెప్పిందంట. అమ్మ వచ్చి ఎంతో సంతోషంగా నాకు చెప్తే నేనూ ఎంతగానో పొంగిపోయాను. ఆ డబ్బులు నేను తీసుకోలేదు కానీ, ఒక రకంగా నా మొదటి సంపాదన అని చెప్పుకోవాలంటే మాత్రం అమ్మ కష్టార్జితంలో నా వంతుగా నేను సాయం చేసి సంపాదిచిన మొదటి సంపాదన అదే. అదే శలవుల్లో అమ్మతో ఒకసారి పొద్దున్నే తోడుగా స్కూలుకి వెళ్ళి ఒక రెండు గంటలు నేనూ అన్నా ఇద్దరం అక్కడ ఉన్నాం. అప్పుడు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ రూముకి అమ్మ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. నా గురించి, నా చదువు గురించీ హెడ్మిస్ట్రెస్ అడిగి తెలుసుకుంది. తర్వాత అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా గురించి కూడా చెప్పిందని అమ్మ చెబితే గుర్తుంది. సరిగ్గా పదేళ్ళ తర్వాత మొదటిసారి నేను TCS లో జాబ్ చేస్తూ లండన్ వెళ్ళినపుడు అమ్మ స్కూల్ లో ఆ విషయం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి చెప్తే చాలా సంతోషపడిందని, వాళ్ళ స్టాఫ్ అందరికీ "విజయలక్స్మి చూడండి పిల్లల్ని ఎంత గొప్పగా చదివించి వృద్ధిలోకి తెచ్చిందో" అంటూ చెప్పిందని తెలిసి నేనూ చాలా పొంగి పోయాను. మా చెల్లెలు లక్ష్మి కూడా అదే స్కూలు లో చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆటల్లో, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ అన్నీ తనకే వచ్చేవి. అలా మా గురించీ, అప్పటి మా ఫ్యామిలీ పరిస్థితి గురించీ బాగా తెలిసిన వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి, అమ్మంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 

ఈ బొమ్మలో కనిపించే "సూపర్ మ్యాన్" ఆ సినిమాలో సాదా సీదా మనిషే. కానీ తన ఎదురుగా ఏదైనా విపత్తు వస్తే అనుకోకుండా దివ్య శక్తి వచ్చి అతన్ని సూపర్ మ్యాన్ గా మార్చేస్తుంది. నయాగారా జలపాతంలో పడిపోతున్న చిన్న పిల్లని సైతం అందరూ అశ్చర్యంగా చూస్తుండగా గాలిలో ఎగురుతూ వెళ్ళి రక్షించి తీసుకుని వస్తాడు. ఇలా ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలిగించే సాహసాలు చేస్తుంటాడు. మా జీవితాల్లో అమ్మ నిత్యం చిన్న పిల్లలమైన మాకోసం మా కళ్ళ ఎదుటే రోజూ జీవితంతోనే సాహసాలు చేసింది. సినిమా మూడు గంటలే కాబట్టి ఆ సాహసం ఫలితం వెంటనే కనబడేలా తియ్యాలి. నిజ జీవితంలో ఇలాంటి అమ్మలు చేసే సాహసాల ఫలితాలు పిల్లలు పెద్దయ్యి ఎదిగి వృద్ధిలోకి వచ్చాక మాత్రమే కనిపిస్తాయి.

ఏ శక్తీ అండగా లేకున్నా సరే ఒంటరిగా జీవితంతో పోరాటం చేసి పిల్లల జీవితాల్ని తీర్చిదిద్ది వాళ్ళని గెలిపించి తను గెలిచే ప్రతి అమ్మ ఒక సూపర్ వుమన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే అదృశ్య శక్తులూ, దివ్య శక్తులూ తోడవ్వాలేమో. సూపర్ అమ్మ అవ్వాలంటే ఏ శక్తీ తోడు అవసరం లేదు. భూమిపై అమ్మ సూపర్ మ్యాన్ ని మించిన పెద్ద సూపర్ శక్తి...

"మానవాళికి దేవుడిచ్చిన దివ్య శక్తి అమ్మ."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, May 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 20 ...

Poster colors on Paper 8" x 11"


పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది "వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాలం, ఆ కాలేజి లో "కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్" డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో "పెయింటింగ్" మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.

తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఏ. పి. రెసిడెన్షియల్ హైస్కూల్, కొడిగెనహళ్ళి, హిందూపురం లో విద్యాభ్యాసం. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ జూనియర్ కాలేజికి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉన్నా నిర్ణయాలు తీసుకోగలిగే బలం వయసుకింకా రాకపోవటంతో, మళ్ళీ దూరంగా రెండేళ్ళ ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ" లో చేరటం. ఆ తర్వాత ఇంజనీరింగ్ తప్పనిసరి అయి ఇంటికి దూరంగా వెళ్ళాల్సి రావటం. కొంచెం అయినా మా ఊరు "కావలి" కి దగ్గరగా ఉంటానని హైదరాబాద్ వద్దని విజయవాడ "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" ఎంచుకుని అక్కడ మొదలుపెట్టిన కాలేజి లైఫ్. ఇంజనీరింగ్ కాలేజి అనగానే ఒక్క సారిగా స్వతంత్రం, స్వేచ్ఛా వాతావరణం, కొత్త ఫ్రెండ్ షిప్స్, తక్కువ క్లాసుల సమయం, ఎక్కువ తీరిక సమయం, ఇలా ఒక్కసారిగా పెద్ద మార్పుల్లో ప్రవేశించి నిర్దేశం తెలిసీ తెలియకనే తెలుసుకునే దిశగా ఆఖరి స్టూడెంట్ దశ అది. మార్నింగ్ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్, వారంలో కొన్ని రోజులు ప్రాక్టికల్స్ ఉండవు, ఖాళీ టైమ్ ఎక్కువగా ఉండేది. వీలైతే సినిమాలు షికార్లు, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆటలు, టీవీ చూట్టం, ఇలా మొదటి సంవత్సరం కొత్త ఫ్రెండ్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాలేజి లైఫ్ తో అంతా కొత్త కొత్తగా గడచి పోయింది.

లొయోలా కాలేజి లో మంచి లైబ్రరీ ఉన్నా చాలా తక్కువగా వెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ మత్రమే ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజి లోనూ మంచి లైబ్రరీ ఉండేది. లైబ్రరీ లో హిస్టరీ, ఆర్ట్స్ పుస్తకాలున్న ఒక రూమ్ ఉండేది. వెళ్ళిన ప్రతిసారీ నేరుగా దాన్లోకే వెళ్ళి ఆర్ట్ మ్యాగజైన్స్, బుక్స్ తిరగేసి వచ్చేసేవాడిని. కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ కూడా ఉండేవి. అందులో చూసిన కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. అయితే బుక్స్ లాగా ఆ మ్యాగజైన్స్ లైబ్రరీ కార్డ్ మీద కొద్ది రోజులు తీసుకోవటానికి ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో అవి ఎక్కడ దొరుకుతాయి, వీళ్ళు ఎక్కడినించి ఎలా తెప్పించి ఉంటారు అన్న ఆలోచనతో, పుస్తకాల షాపుల వెంట వాటి కోసం నా వెదుకులాట ప్రారంభం అయ్యింది. బీసెంట్ రోడ్డు దగ్గర ఏలూరు రోడ్డు లో ఉండే "నవోదయ పబ్లికేషన్స్" బుక్ షాపులో వెతగ్గా వెతగ్గా ఒక్క రష్యన్ ఆర్ట్ పుస్తకం దొరికింది. ఈ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. అందులో చాలా గొప్ప ఆర్టిస్టులు, వాళ్ళ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అమ్మ కష్టంతో చదువుతున్న అప్పటి నా స్టూడెంట్ స్థోమతకి ఆ పుస్తకం వెల చాలా ఎక్కువ, కొనాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి చివరికి కొనేశాను. ఆ పుస్తకంలోని పెయింటింగ్స్ ని తదేకంగా పరిశీలించటంతో ఏన్ని గంటలు గడిపుంటానో లెక్కే లేదు.

ఒకసారి న్యూస్ పేపర్ లో "పింగాణి ప్లేట్స్" మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసిన ఒక విజయవాడ ఆర్టిస్ట్, ఆవిడ ఆర్ట్ షో ఒకటి ఆదివారం "ఒన్ టవున్" దగ్గర  ప్రారంభం అవుతుందని చూసి, ఆ రోజు రాగానే ఉదయాన్నే బస్సెక్కి వెళ్ళిపోయాను. గొప్ప గొప్ప యూరోపీయన్ మాస్టర్ పెయింటింగ్స్ ని అచ్చు అలాగే పింగాణి ప్లేట్స్ మీద వేశారు ఆవిడ. వేలల్లో ధర, ఏ వందో అయితే ఒకటన్నా కొనేసేవాడినేమో. చాలా దగ్గరగా పరిశీలించాను, అంత కరెక్ట్ గా ఎలా వేసి ఉంటారో అర్ధం కాలా. ఆవిడ్ని అడిగి మెటీరియల్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అక్కడే ఉండి చాలాసేపు అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ షో ప్రారంభం టైమ్ కే నేను వెళ్ళటంతో  వచ్చిన చీఫ్ గెస్ట్, మిగతా గెస్ట్స్ తోనే ఆవిడ ఉండటంతో అవకాశం రాక బస్సెక్కి నిరాశగా కాలేజీ వెళ్తున్న ఆ క్షణాలింకా గుర్తున్నాయి. అలా నా ఒంటరి ప్రయాణంలో సంగతీ సమాచారం తెలుసుకోలేని నిరాశలెన్ని ఎదురైనా "పెయింటింగ్స్" వెయ్యాలన్న ఆశ మాత్రం తగ్గలా.

రెండవ సంవత్సరంలో బుక్ షాపులన్నీ తిరిగి వెతగ్గా వెతగ్గా దొరికిన చిన్న "కేమెల్ పోస్టర్ కలర్స్" ని అవే వాటర్ కలర్ పెయింటింగ్స్ అనుకుని వాటితోనే వెయ్యటం మొదలు పెట్టాను. బహుశా ఈ పెయింటింగ్ అప్పటికి నా మూడోదో, నాలుగోదో అయి ఉండొచ్చు. నేనున్న హాస్టల్ D-14 రూమ్ లో నా పెయింటింగ్ సాధనకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టాను. ఆదివారం మధ్యాహ్నం కూర్చుని ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తూ ఉండే వాడిని. 

అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివారం సాయంత్రం నిర్మానుష్యంగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు ఫుట్ పాత్ పై పాత బుక్స్, మ్యాగజైన్స్ పెట్టి అమ్మే వాళ్ళు అని తెలిసి చాలా ఆదివారాలు పనిగట్టుకుని అంత దూరం వెళ్ళి వెతికే వాడిని. అక్కడ కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ దొరికాయి, కొన్ని కొనేశాను. వాటిల్లో ఒక మ్యాగజైన్ అట్ట వెనక పేజీ మీద అచ్చయిన ఆయిల్ పెయింటింగ్ చాలా నచ్చింది. ఆ మ్యాగజైన్ ముందు పెట్టుకుని అచ్చంగా అవే రంగుల షేడ్స్, నాకున్న ఆ ఆరు రంగులతో ఎలా తెప్పించానో నాకూ ఇప్పటికీ మిస్టరీ. ఏ రంగులో ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుందో ప్రాధమిక అవగాహన బొత్తిగా లేదు, అడిగినా చెప్పలేను, కానీ నాకు తెలీకుండానే ఏ రంగు షేడ్ చూసినా రెండు మూడు రంగులు కలిపి అచ్చం అదే షేడ్ వచ్చేసేది, అదే నాకిప్పటికీ అప్పటి మిస్టరీ. అలా దీక్షగా కూర్చుని పెయింటింగ్ వేస్తుంటే, మధ్య మధ్యలో బొమ్మలంటే కొంచెం ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, కొంత మంది మాత్రం "భలే వేస్తున్నావ్ గిరీ" అని మెచ్చుకునేవాళ్ళు.

బయట కమర్షియల్ ఆర్టిస్టులు ఎలా వేస్తారో ఏం మెటీరియల్ వాడతారో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కష్టం, వాళ్ళెక్కడుంటారో తెలుసుకునే వీలులేని రోజులవి. కనీసం కాలేజి లో సీనియర్స్, జూనియర్స్ లో ఒక్కరన్నా పెయింటింగ్స్ వేసే వాళ్ళుండకపోతారా అని కూడా చూశాను. నాలుగేళ్ళు ఏడు బాచ్ ల్లో ఒక్కరూ తారసపడలా. అప్పటికింకా ఏ మాత్రం అనుభవం లేక, సరయిన మెటీరియల్ కూడా లేక, తడబడుతూనే దొరికిన రంగులు, బ్రషులు, పేపర్ లతో మొదలుపెట్టి ముందుకి పోతూ వేస్తున్నవి నా మొదటి అడుగులే. అయినా, ఈ ఒక్క పెయింటింగ్ తో వచ్చిన స్వీయ అనుభవం మాత్రం నాకు చాలా చాలా ధైర్యాన్నిచ్చింది. పెయింటింగ్స్ ఎలా వెయ్యాలా అంటూ నాలో ఆవహిస్తున్న నిరాశనీ, అసలు వెయ్యగలనా అని చెలరేగుతున్న అనుమానాల్నీ, ఒక్కడినే నేర్చుకోగలనా అంటూ ప్రశ్నిస్తున్న అధైర్యాన్నీ పక్కకి తోసి నన్ను పట్టుకుని ముందుకి నడిపించింది కేవలం నా పట్టుదల, పట్టు వదలని దీక్ష మాత్రమే. వేసిన తర్వాత నా రూమ్ లో గోడపైన మిగిలిన వాటితో బాటు దీన్నీ అతికించాను, వెనుక నాలుగు కార్నర్స్ లో గమ్ పూసి. మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం "న్యూ హాస్టల్" లో నేనున్న రెండు రూముల్లోనూ ఈ పెయింటింగ్ గోడమీదే ఉండేది. తర్వాత ఆ కాలేజి హాస్టల్ గోడలు దాటి బయటి ప్రపంచంలోకి వచ్చిన నాతోనే ఉంటూ, నాతో బాటు ఇండియా వదిలి భద్రంగా ఇంతదూరం నాతో వచ్చేసింది. వస్తూ ఆ కాలం గురుతుల్నీ, జ్ఞాపకాలనూ మోసుకుని తెచ్చింది.

కాలేజి ఫ్రెండ్స్, అక్కడ చదివిన చదువూ, నేర్చుకున్న విజ్ఞానం, పొందిన డిగ్రీ, గడిపిన జీవితం, ఆ అనుభవాలూ ఎవరికైనా జీవితంలో ఒక మలుపు తిరిగే మైలురాయి. కాలేజి లైఫ్ లో చదువు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అందరికీ ఉండేవే. అవి పక్కన పెడితే నా "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" రోజులు మాత్రం ఎక్కువగా నిండింది బొమ్మలతోనే. ఇప్పటికీ అప్పుడప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మెయిన్ బిల్డింగ్ లో, ఇంజనీరింగ్ కాలేజి అడ్మిషన్స్ జరిగినప్పుడు, నా కొచ్చిన EAMCET ర్యాంక్ కి నా వంతు వచ్చినపుడు గవర్న్ మెంట్ కాలేజీల్లో నేనెంచుకోవటానికి మిగిలింది REC వరంగల్ లో సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. నాకు తీసుకోవటం ఇష్టంలేదు. ఇష్టంలేనపుడు వద్దు, ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా ఏ బ్రాంచ్ లోనైనా సీట్ వస్తుంది, అయితే ఫీజ్ ఎక్కువ అంటూ చెప్పారు. అప్పటికే ఇంటర్మీడియట్ లొయోలా లో చాలా డబ్బులయ్యాయి, అమ్మకి కష్టం అవుతుందని తీసుకోవటానికి సిద్ధపడ్డాను. వద్దని చిన్నమామయ్య తీసుకుని వచ్చేశాడు. తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్స్ కి అక్కడికే మళ్ళీ వచ్చిన రోజు నాకు అన్ని కాలేజీల్లో అన్ని బ్రాంచ్ ల్లోనూ ఎక్కడకావాలంటే అక్కడ తీసుకునే ఆప్షన్ ఉండింది. చిన్నమామయ్య "ఇక్కడైతే నేను దగ్గరుంటాను, చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్ తీసుకో" అని ఎంతగానో అడిగినా వద్దని "విజయవాడ" అయితే "కావలి" కి దగ్గర, రెండేళ్ళు ఇంటర్మీడియట్ అక్కడ అలవాటయ్యింది. అక్కడే కావాలని పట్టుబట్టి "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" లో కంప్యూటర్ సైన్స్ చేరాను. అప్పుడా కాలేజిలో కంప్యూటర్ సైన్స్ మాదే మొట్ట మొదటి బ్యాచ్.

గతం తల్చుకున్నప్పుడల్లా ఇప్పటికీ అప్పుడప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది, ఒకవేళ అప్పుడు నాకున్న కాలేజి ఆప్షన్స్ లో "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాకుండా చిన్నమామయ్య ఎంతగానో తీసుకోమని అడిగిన "చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్" లేదా "గీతం ఇంజనీరింగ్ కాలేజి, విశాఖపట్నం" లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరి ఉంటే ఇంజనీరింగ్ కాలేజి అనుభవం ఎలా ఉండేదో, ఎవరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళో, నా జీవితం ఎలా మలుపు తిరిగి ఉండేదో, ఆ మలుపుల్లో నా బొమ్మలు, నా పెయింటింగ్స్ అసలుండేవో లేవో, ఉండి ఉంటే ఎలా ఉండేవో అని...

"జీవిత మలుపుల్లో మనం వేసే ప్రతి అడుగూ కనపడని మన గమ్యం వైపే పడుతుంది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, November 5, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 14 ...

Based on Artist Sankar's illustration published in
"చందమామ" 1978 - తెలుగు పిల్లల మాస పత్రిక
Ink and ballpoint pen on paper

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 13                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 15 -->

మొట్ట మొదటి అనుభూతి, తీపైనా, చేదైనా, ఏదైనా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేము, ఎప్పటికీ మదిలో పదిలంగా ఉండిపోతుంది. చిన్నప్పడు తిరిగిన పరిసరాలు, మసలిన మనుషులు అయితే మరింత బలంగా మదిలో ముద్ర పడిపోతాయి. నేను పుట్టిన ఊరు "కావలి", నెల్లూరు జిల్లా, చిన్న పట్టణం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ కూడా అక్కడే పుట్టింది. కానీ నా ఊహ తెలిసే నాటికి నాన్న "బుచ్చి రెడ్డిపాళెం" హైస్కూలు లో టీచర్, అక్కడే ఉండేవాళ్ళం. ఒకటవ తరగతి అక్కడే కోనేరు బళ్ళో చదివాను, ఒక రెండేళ్ళున్నామేమో అక్కడ. మరో మూడేళ్ళు పక్కనే నాన్న పుట్టి పెరిగిన పల్లెటూరు "దామరమడుగు" లో ఉన్నాం. నాలుగవ తరగతి వరకూ అక్కడే ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో ఆడుతూ పాడుతూ పెరిగాను. తరువాత నాన్న కి ట్రాన్స్ఫర్ కావటంతో "కావలి" కి వచ్చేశాం.

"కావలి" నెల్లూరు జిల్లాలో, నెల్లూరు తరువాత పెద్ద పట్టణం. రెండుగా విభజిస్తూ, సరళరేఖ గీసినట్టు ఊరి మధ్యలో వెళ్ళే నేషనల్ హైవే రోడ్దు. "ట్రంకు రోడ్డు" అని పిలిచేవారు. రోడ్డుకిరువైపులా ఆ చివరి నుండి ఈ చివరి వరకూ రద్దీ షాపులు, పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్, కోర్టు, తాలూకా ఆఫీస్, జె.బి.యం.కాలేజి, ఆర్.టి.సి బస్ స్టేషన్, హోల్ సేల్ క్లాత్ షాపులు, వచ్చే పోయే వాహనాల్తో, మనుషుల్తో ఎప్పుడూ రద్దీగానే ఉండేది. అప్పటిదాకా చిన్నపాటి వీధుల్లో తిరుగాడిన అనుభవమే. కావలి లోనే పెద్ద రోడ్లు, ట్రాఫిక్, షాపులూ, సినిమాహాళ్ళు...ఇలా పెరుగుతున్న వయసుతోబాటు మొదటిసారిగా తిరిగిన పెద్ద ప్రదేశాల గురుతులు అక్కడ్నే. 

అప్పటిదాకా బొమ్మలు చాక్ పీస్ తో నేలపైనో, బలపం తో పలకపైనో, బొగ్గుతో గోడపైనో వేసిన గుర్తులే తప్ప కుదురుగ్గా కూర్చుని కాగితంపైన వేసిన గురుతులు లేవు. అయినా కావలిలో నన్ను కట్టిపడేసిన కొన్ని బొమ్మల స్ఫూర్తి జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి.

తారు రోడ్డు మీద చాక్ పీస్ బొమ్మలు - మొదటిది కూరగాయల మార్కెట్ కి ఎదురుగా "ట్రంకు రోడ్డు" మీద ఒక అంచున మట్టి అంతా శుభ్రంగా ఊడ్చి ఆ తారు రోడ్డు మీద రంగుల చాక్ పీస్ లతో ఎంతో గొప్పగా వేసిన "ఆంజనేయ స్వామి", "యేసు ప్రభు" లాంటి దేవతామూర్తుల బొమ్మలు. చుట్టూ ఫ్రేమ్ చేసినట్టు బోర్డర్ కూడా వేసేవాళ్ళు. కొన్ని బొమ్మలకు రంగులతో తళుకులు కూడా అద్ది ఉండేవి. బహుశా సాయంత్రం వేసే వాళ్ళేమో, చీకటి పడి రద్దీ అయ్యే సమయానికి మధ్యలో ఒక కిరసనాయిలు దీపం వెలుగుతూ ఉండేది. ఆ బొమ్మలపైన ఐదు, పది, పావలా బిళ్లలు కొన్ని ఎప్పుడూ వేసే ఉండేవి. అప్పుడనుకునే వాడిని వీళ్ళకి ఎన్ని డబ్బులో కదా అని. కానీ నాకా వయసులో తెలీదు - వెలకట్టలేని వాళ్ళ ప్రతిభకి దయకలిగిన వాళ్ళ జేబులు దాటి చేతుల్లోంచి గలగల రాలి పడే ఆ కొద్దిపాటి చిల్లర డబ్బులు...పాపం కనీసం ఒక్క పూటైనా వాళ్ల కడుపులు నింప(లే)వు అని. ఎంత కష్టపడి వేసే వాళ్ళో, ఎప్పుడూ వేస్తుంటే చూడలేదు. ఒక్కసారన్నా చూడాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఆ బొమ్మల లైఫ్ మహా అంటే ఒక్క రోజే, అదీ సాయంత్రం నుంచి రాత్రి దాకా కొద్ది గంటలు మాత్రమే. అర్ధరాత్రి నిర్మానుష్యం అయ్యాక కూడా తిరిగే బస్సులు, లారీలు, లేదా ఏ గాలో, వానో వచ్చి తుడిచిపెట్టేసేవి. ఇప్పుడా కళ బహుశా అంతరించిపోయిందేమో. అప్పుడప్పుడూ ఏవో ముగ్గులతో గొప్ప బొమ్మలని వాట్స్ అప్ మెసేజెస్ లో చూస్తుంటాను, ఏ ఆడిటోరియం లాంటి నేలపైనో వేసినవి. ఎన్ని చూసినా వాటితో మాత్రం సరికాలేవు, చిన్న నాటి మొట్టమొదటి జ్ఞాపకాల అనుభూతుల స్థాయి అలానే ఉంటుందేమో ఎవరికైనా.

సినిమా వాల్ పోస్టర్లు - తర్వాత అమితంగా ఆకట్టుకున్నవి అప్పటి సినిమా వాల్ పోస్టర్లు. నేనూ అన్నా రోడ్ల వెంట వెళ్తూ ఆ పోస్టర్ల మీద కింద ఆర్టిస్టుల సైన్ చూడకుండానే ఇది ఈశ్వర్, ఇది గంగాధర్ అని ఇట్టే గుర్తుపట్టేసేవాళ్లం. ప్రతి సినిమా పేరు కూడా విభిన్నంగా ఎంతో కళాత్మకంగా రూపకల్పన చేసేవాళ్ళు అప్పట్లో. ప్రత్యేకించి అడవి రాముడు, దాన వీర శూర కర్ణ, ప్రేమ సింహాసనం, జగ్గు, యమకింకరుడు ఇలాంటి విభిన్నమైన టైటిల్స్ అయితే ఇప్పటికీ గుర్తే. ప్రతి పోస్టర్ లో ఆర్టిస్ట్ కంపోజిషన్, ఎక్కువగా గీతలతో గీసిన హీరో, హీరోయిన్ల బొమ్మలు నన్నెక్కువగా ఆకట్టుకునేవి. నన్నమితంగా ఆకర్షించిన ఒకానొక వాల్ పోస్టర్ అయితే మాత్రం "దానవీరశూరకర్ణ" ది. అందులో మధ్యలో కర్ణుడు బాణం వేస్తూ ఉన్న ముఖం చెయ్యి వరకూ చుట్టూ కురుక్షేత్ర సమరసైన్యం, పక్కన దుర్యోధనుడు, కృష్ణుడు, కింద పెద్ద అక్షరాలతో ఒక కొండని చెక్కినట్టు తలపించేలా రూపొందించిన టైటిల్. శ్రీరామ్ థియేటర్ కి కావలిలో ఇంకే థియేటర్ కీ లేనంత ఎత్తులో మూడు వీధుల్లో నుంచీ కనిపించేలా వాల్ పోస్టర్ కోసమే ప్రత్యేకంగా కట్టిన ఎత్తైన గోడపైన చూసిన ఆ పోస్టర్ గుర్తు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తర్వాత ఆ సినిమా పోయి వేరే సినిమా వచ్చాక అటువెళ్ళిన ప్రతిసారీ అనుకునే వాడిని. అయ్యో ఆ పోస్టర్ అలానే ఉంచేయాల్సింది కదా అని. తెలీదింకా అప్పట్లో వాల్ పోస్టర్ అతి పెద్ద మార్కెటింగ్ చానెల్ అని.

న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు - ఇంకా డిసెంబర్ నెలలో రాబోయే కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మార్కెట్ లో రెలీజ్ అయ్యే గ్రీటింగ్ కార్డులు. కావలి మెయిన్ రోడ్ బజార్ లో కేవలం గ్రీటింగ్ కార్డులే అమ్మే వాళ్ళు నాలుగు చక్రాల బళ్ళు పైన పెట్టి, ఆ నెలంతా. అందమైన ప్రకృతిని తీసిన ఫొటోలు, సినిమా స్టార్ లు, ఫ్లవర్స్ ఇలా రకరకాల కార్డులు ఉండేవి. అయితే కొత్తగా అప్పుడే మార్కెట్ లోకి రావటం మొదలయిన "బాపు గారి బొమ్మల గ్రీటింగ్ కార్డులు" మాత్రం నాకమితంగా నచ్చేవి. అప్పట్లో తాతయ్యకి తరచూ ఉత్తరాలు పోస్ట్ లో వస్తూ ఉండేవి. కొత్త సంవత్సరంకి గ్రీటింగ్ కార్డ్స్ కూడా చాలా వచ్చేవి. అవన్నీ నేనూ అన్నా కలసి కలెక్ట్ చేసి ఉంచుకునేవాళ్ళం. నా స్కూలుకి అన్న మంచి గ్రీటింగ్ కార్డ్ ప్రతి సంవత్సరం కొని పోస్ట్ చేసేవాడు. అది కూడా శలవులకి వస్తూ తెచ్చి ఇంట్లో మా కలెక్షన్ లో దాచుకునేవాళ్ళాం. ఒకటి రెండు బాపు గారి గ్రీటింగ్ కార్డు లు చూసి అచ్చం అలాగే వేశాను కూడా. అలా కొత్త సంవత్సరం నాటి మొదటి కొత్త అనుభూతులు "కావలి" లోవే.

సంక్రాంతి ముగ్గులు - ప్రత్యేకించి సంక్రాంతి ముగ్గులు. పండగ వస్తుందంటే ఒక నెల ముందు నుంచీ చలిలో పొద్దున్నే రోజూ లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు. అప్పటిదాకా ముగ్గులు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మా ఇంటి పక్కనే "జయక్క" అని ఒక అక్క ఉండేది, అమ్మకీ మాకూ ఎంతో ఆదరణగా గా ఉండేది. ఆమె వేసే ముగ్గులు మాత్రం చాలా గొప్పగా ఉండేవి. ఎంత గొప్పగా అంటే అసలు అలా పేపర్ పైన ఏ గొప్ప ఆర్టిస్ట్ కైనా వెయ్యటం సాధ్యం కాదు అన్నంత గొప్పగా. రోజూ పొద్దున్నే నిద్రలేచి ఏం ముగ్గు వేసిందా అని వెళ్ళి నిలబడి తదేకంగా చూసే వాడిని. చాలా నచ్చేవి, ముగ్గుల్లో రంగులు అద్దినా కూడా అలానే తీర్చిదిద్దినట్టు, క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేసినట్టే. ప్రతి గీతా, వంపూ కొలిచి గీసినట్టు, ప్రతి రంగూ గీత అంచుని తాకి కొంచెం కూడా గీతపైకి రాకుండా, చుట్టూ బోర్డర్ వేసినా స్కేలు పెట్టి కొట్టినట్టు ఉండేవి. ముగ్గుల్లో ఆ సిమ్మెట్రీ తల్చుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. సంక్రాంతి పండుగ మూడు రోజులూ అయితే మా "పోలువారి వీధి" ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి ఎవరు ముగ్గులు బాగా వేశారా అని చూసి వచ్చేవాడిని. అలా వెళ్ళిన ప్రతిసారీ "జయక్క" వేసిన ముగ్గుని కొట్టే ముగ్గు ఎక్కడా ఎప్పుడూ చూడ్లేదంతే. అలా ముగ్గులు వెయటం ఒక కళ అని "జయక్క" వేసిన ముగ్గుల ద్వారా "కావలి"లోనే, అప్పుడే అర్ధం అయ్యింది.

"చందమామ" బొమ్మల పుస్తకం - ఇంకా, నెల నెలా తాతయ్యనడిగి కొనిపిచ్చుకున్న "చందమామ" బొమ్మల పుస్తకాల అనుభూతులు కూడా "కావలి" లోనే. ఆ పుస్తకాలే, బాల్యం లో బామ్మ చెప్పిన కథలకి ప్రతిరూపంగా నిలిచాయి. రామాయణం, మహాభారతం గాధలన్నీ బామ్మ చెప్తుంటే ఊహించుకున్న వాటికి అప్పటి కొన్ని పౌరాణిక  సినిమాలు మనసుల్లో రూపాలు ఇచ్చినా, "చందమామ" లో శంకర్, జయ, రాజి లాంటి ఆర్టిస్టులు వేసిన బొమ్మల ముందు ఆ సినిమాలన్నీ బలాదూర్ అంతే. పిల్లల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్ళి విహరింపజేసేవి. ప్రతి నెలా "కావలి పెండెం సోడా ఫ్యాక్టరీ" కి ఎదురుగా ఉండే బంకులో టెంకాయ తాడు పైన వేళాడే పత్రికల్లో "చందామామ" కొత్త సంచిక వచ్చిందా అని చూసుకునేవాళ్ళం. నాకూ అన్నకీ ప్రతి నెలా తాతయ్య కొనిచ్చేవాడు. ఇంటికి రాగానే ముందు మా ఇద్దరికీ బొమ్మల పోటీ ఉండేది. ఇద్దరం ఒకటనుకుని నీవి కుడి వైపు, నావి ఎడమ వైపు అని ఇలా ఒక తీర్మానం చేసుకుని, పుస్తకం తెరిచి కుడి వైపు పేజీల్లో ఎన్ని బొమ్మలున్నాయి, ఎడం వైపు పేజీల్లో ఎన్నున్నాయి అని లెక్కబెట్టే వాళ్ళం. ఎటువైపు బొమ్మలు ఎక్కువ ఉంటే అటు వైపు కోరుకున్న వాడు గెలుస్తాడనమాట. ఇలా బొమ్మలతోనే ముందు మా చందమామ చదవటం మొదలయ్యేది. ఇద్దరం వంతుల వారీగా పుస్తకం చదివేవాళ్ళం. అయ్యాక మళ్ళీ ప్రతి బొమ్మనీ లోతుగా విశ్లేషణ కూడా చేసేవాళ్ళం. అప్పట్లో పుస్తకం చివర ధారా వాహికగా వస్తున్న "వీర హనుమాన్" ఆర్టిస్ట్ శంకర్ రంగుల బొమ్మలతో అద్భుతంగా ఉండేది. ప్రతి సంచిక లోనూ ఒక ఫుల్ పేజీ బొమ్మ తప్పనిసరిగా ఉండేది.

ఈ బొమ్మ "అశ్వమేధ యాగం" చేసి వదలిన అశ్వాన్ని లవకుశులు పట్టుకునే ఘట్టం కి ఫుల్ పేజీ లో "ఆర్టిస్ట్ శంకర్ గారు" వేసిన బొమ్మ ఆధారంగా వేశాను. అప్పుడు నేను ఆరవ క్లాస్ లో ఉన్నాను. శలవులకి "కావలి" వచ్చినపుడు అమ్మమ్మ వాళ్ళింట్లో మధ్యలో హాల్ లో నేలపైన కూర్చుని బొమ్మ పూర్తి చేశాను. "ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్", అయినా కొలతలు కొలిచి గీసినట్టే వచ్చాయి. నా అభిమాన చందమామ చిత్రకారుడు "శంకర్ గారి" బొమ్మని అచ్చు గుద్దినట్టు వేశానని నేను పొందిన ఆనందానికి అవధుల్లేవు. అప్పటి దాకా అడపా దడపా గీస్తున్నా, ఒక దాచుకోదగ్గ బొమ్మ అంటూ మొట్టమొదటిసారి వేసింది అదే. తర్వాత "చిన్నమామయ్య (ఆర్టిస్ట్)" ఆ బొమ్మకి షేడింగ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అని రెడ్ బాల్ పాయింట్ పెన్ తో కొంచెం వేసి చూపించాడు. ఇంకొంచెం షేడ్స్ వేసి వేసి అదే పెన్ తో నేను సంతకం చేసి మురిసిపోయిన క్షణాలు నేనెప్పటికీ గర్వించే క్షణాలే.

తర్వాత బ్లూ కలర్ ఇంకు కన్నా బ్లాక్ ఇంకు తో వేసుంటే బాగుండేది అని మనసు తొలుస్తూ ఉండేది, సరే ఏమైంది బ్లూ ఇంకు మీద బ్లాక్ ఇంకు తో గీద్దాం అని మొదలు పెట్టాను, కానీ పేపర్ సాదా సీదా రకం, ఒక గీత గియ్యగానే ఇంకు పీల్చి పక్కకి వ్యాపించటం మొదలయ్యింది. ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

అలా నా మొట్టమొదటి బొమ్మ "కావలి" లోనే పుట్టింది. ఇప్పటికీ నాతోనే ఉంది. ఈ బొమ్మకిప్పుడు 44 యేళ్ళు. నాతోనే పెరిగి పెద్దయ్యింది. బొమ్మ చిన్నదే అయినా నా మదిలో మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఈ విశ్వం కన్నా పెద్దది, అంతే...!

"విశ్వంనైనా తనలో దాయగల శక్తి మానవ హృదయం లో దాగుంది."
~ గిరిధర్ పొట్టేపాళెం