Sunday, May 6, 2018

శ్రీ చెల్వ పిళ్ళ బుక్ సెంటర్, ట్రంక్ రోడ్, కావలి...

కావలి "చెల్వపిళ్ళ" బుక్ షాపు, అప్పుడూ ఇప్పుడూ అదే లుక్కు 

చెల్వ పిళ్ళ - "కావలి" పట్టణంలో లో ఈ పేరు తెలీని వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వుంటే గింటే ఆ కొద్ది మందీ ఎప్పుడూ పుస్తకమో పెన్నో పట్టని వాళ్ళై ఉంటారు.

1976 లో నాన్న ఉద్యోగరీత్యా కావలి పట్టణాని కి తరలి వచ్చిన కొత్తల్లో గోపాల్రావు సార్, పద్మావతి మేడమ్ ల బడి "విద్యాభారతి(పేరుకు తగ్గట్టు నిజంగానే ఎందరో కావలి విద్యార్ధుల్ని తీర్చిదిద్దిన సరస్వతి నిజ స్వరూపం)" లో శేషమ్మ అయ్యవారమ్మ క్లాస్ లో అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ మార్కుల్తో రోజూ "రీము"ల కొద్దీ పేపర్ల పై పరీక్షలు రాసే రోజుల్లో నాకూ చెల్వపిళ్ళ అంటే బొత్తిగా తెలీదు. ఎందుకంటే పెన్నూ, పేపరూ వగైరాలన్నీ నాన్న, అమ్మే చూసుకునే (చూసి కొనే) వారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే తాలూకా, జిల్లా లెవెల్ లో జరిగిన రెండు పోటీ పరీక్షల్లోనూ నేను నెగ్గటం, నెగ్గిన వెంటనే "ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయం, కొడిగెనహళ్ళి, హిందూపురం, అనంతపురం జిల్లా" అనే మారుమూల సుదూర ప్రాంతానికి కి ఓ చిన్న సూట్కేస్ లో నా చిన్ని ప్రపంచాన్నంతా నీట్ గా మడతలు పెట్టి, అక్కడ నా కాట్ నాకే ఉంటుందనీ, నా అన్నం గిన్నె నేనే కడుక్కోవాలనీ, పుస్తకాలూ, బట్టలూ, వస్తువులన్నీ ఎప్పుడూ నీట్ గా జాగ్రత్తగా సర్ది పెట్టుకోవాలనీ, అన్నం మెత్తగా అయితే తినకుండా ఉండొద్దనీ, ఒకవేళ మెత్తగా అయినా తినే అలవాటు చేసుకోవాలనీ, రోజూ శుభ్రంగా స్నానం చేసి కొబ్బరినూనె పెట్టుకుని తల దువ్వుకుని పౌడర్ రాసుకోవాలనీ, ఇంటిమీద దిగులు పెట్టుకోకూడదనీ... ఇంకా ఎన్నెన్నో జాగ్రత్తలు నేర్పించి మరీ నన్ను పంపించిన నాన్న, తొమ్మిదేళ్ళ తెలిసీ తెలియని వయసులో చేరేది ఐదవ తరగతే అయినా అదేదో కలక్టర్ కోర్స్ లో చేరుతున్నంత సంబరంతో ఎరుగుకుంటూ వెళ్ళిన నేనూ...ఆ వెను వెంటనే అందర్నీ కాకున్నా, నన్నొక్కడ్నీ లైఫ్ లో అప్పుడే సెటిల్ చేసేసి ఏదో అర్జంట్ పని ఉందంటూ మా జీవితాల్లో పెనుతుఫాను సృష్టించి నాన్న ని దేవుడు తనతో తీసుకెళ్ళి పోవటం అన్నీ చక చకా జరిగి పోవటంతో, ఆ తర్వాత శలవులకి వచ్చినప్పుడల్లా నా పెన్నూ, నా పుస్తకం నాకన్నా ఒక్క సంవత్సరమే పెద్ద అయిన అన్న సాయంతో నేనే చూసుకోవాల్సిన టైమ్ పదకొండేళ్ళ ప్రాయంలోనే ముంచుకొచ్చేసింది. మొదటిసారెపుడెళ్ళానో సరిగా గుర్తులేకున్నా అప్పుడే బహుశా ఎప్పుడోకప్పుడు "చెల్వ పిళ్ళ" కి ఏ పెన్నో, పెన్సిలో, రబ్బరో కొనుక్కోటానికనెళ్ళుంటా.

తర్వాత పరీక్షలు రాసేసి శలవులకి వచ్చినప్పుడల్లా కావలి లో మేముండే పెంకుటింట్లో కుర్చీ లో కూర్చునో, మరీ ఏండ ఎక్కువైతే పైన కూర్చుంటే తలకి తగిలే నారాయణవ్వ తాటాకుల వసారాలో చల్లని నాపరాయి అరుగు మీద కూర్చునో, లేదా అక్కడే ఎప్పుడూ ఎత్తి పెట్టి ఉండే నులక మంచం వాల్చుకుని దానిపైన  కూర్చునో గంటల కొద్దీ బొమ్మలేసుకుంటూ నాకంటూ ఓ బొమ్మల లోకం మెల్లిగా రూపుదిద్దుకోసాగింది. పోను పోనూ నా బొమ్మల నాణ్యత పెరుగుతూ నాసిరకం నోటు పుస్తకాల కాగితాలు దాటి అన్న "బయాలజీ" రికార్డుల్లో ఒకవైపు వాడగా రెండో వైపు ఖాళీగా ఉండే కొంచెం మందమైన పేపర్ ని కూడా ఎక్కి దాటేసి ఇంకాస్త మంచి పేపర్ పైకెక్కాలని చూస్తున్న రోజుల్లోనే ఒకసారి- "మంచి డ్రాయింగ్ పేపర్ కావాలండీ" అంటూ చెల్వపిళ్ళ షాప్ కెళ్ళిన ఆరోజింకా గుర్తే. ఆ షాపు ఓనర్ ఎంతో నెమ్మదస్తుడు.

"ఇదుగో బాబూ...ఇది చూడు బాబూ...ఇదుగో ఇదీ...మరిదీ..." అంటూ ఎన్ని చూపెట్టినా నచ్చని నేను చివరికి
"మా పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ లో ఒకటి చూశా అండీ...అలాంటిది కావాలి" అంటే
"ప్రింటింగ్ ప్రెస్ లోనా, దేనికి వాడ్తారదీ"
"పెళ్ళి కార్డులకి...తిక్ గా... చాలా తెల్లగా ఉంటుంది"
"ఓ అదా...దాన్ని ఐవరీ బోర్డ్ అంటారు బాబూ, చాలా మంచి పేపర్"  అంటూ లోపల్నుంచి ఓ పేపర్ చుట్ట తెచ్చి అందులోంచి ఓ షీట్ తీసి బల్లపై పరిస్తే, ఆ బల్లంత వెడల్పాటి ఆ పేపర్ చూసి విప్పారిన నా మొహం...
"ఆ ఇదేనండీ" అంటూ కొని ఆనందంగా ఇంటికెళ్ళిన నాకు ఆరోజే ఎందుకో నాకా షాప్ ఓనర్ పైన భలే గురి కుదిరిపోయింది. ఇంకెప్పుడు ఏ డ్రాయింగ్ మెటీరియల్ కావాలన్నా వెళ్ళిపోయి ఆయన్నడిగి అన్నీ కొనుక్కుని తెచ్చుకుని నా లోకంలోకెళ్ళిపోయే వాడిని.

ఇంకాస్త పెద్దయ్యాక ఇంజనీరింగ్ చేసే రోజుల్లో డ్రాయింగ్ దాటి "పెయింటింగ్" పైకెళ్ళిపోయింది మనసు. విజయవాడ లో పటమట లోని ఎన్ని బుక్ షాపుల్లో అడిగినా దొరకని వాటర్ కలర్ రంగులు, ఎట్టా అని దిగులు పెట్టేసుకున్న మనసూ...

మళ్ళీ శలవులకి ఇంటికి వ్చచ్చినప్పుడు మన "చెల్వపిళ్ళ" కెళ్ళి "వాటర్ కలర్స్ ఉన్నాయాండీ" అంటూ నిలబడితే "బిళ్ళలు, బాటిల్స్ ఈ రెండిట్లో ఏది కావాలో చూడు"  అంటూ ఒక బిళ్ళల పెట్టె, చిన్న క్యామెల్ పోస్టర్ కలర్స్ బాటిల్స్ (6 కలర్స్) సెట్టూ తెచ్చి నా ముందు పెట్టిన ఆ షాప్ ఓనర్ ఆ సమయంలో సరిగ్గా...ఎంతో కాలం గా తపస్సు చేస్తే ప్రత్యక్షమై "ఏం వరం కావాలి కోరుకో భక్తా!" అంటే "మంచి వాటర్ కలర్స్ సెట్ కావాలి, స్వామీ" అనగానే తథాస్తు అంటూ చేతిలో పెట్టే దేవుడి లా కనిపించాడు. తర్వాత నేను ఇండియా లో ఉన్నంత కాలం ఆ షాపూ, ఆ షాపు ఓనరూ నా బొమ్మల లోకానికి ఎంతో దగ్గరయ్యారు. ఆయన చేతులమీదుగా ఆ షాప్ లో కొన్న పేపర్ లూ, కొన్ని క్యామెల్ వాటర్ కలర్సూ, కొద్దిగంటే కొద్దిగానే అక్కడే దొరికిన బ్రష్ లూ వీటితో ఎన్ని బొమ్మలు వేసుకున్నానో...అన్నీ పదిలంగా దాచుకుని నాతో US కీ తెచ్చుకున్నాను.

పదిహేనేళ్ళ క్రితం కావలి నుండి అమ్మ వాళ్ళు నెల్లూరు కెళ్ళిపోవటం, నేనూ ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ కావలికి వెళ్ళినా ఆ షాప్ కి వెళ్ళలేకపోవటం చాలా కాలం గా నా జీవితం లో కొరతగానే ఉండిపోయింది.

అనుకోకుండా ఈ మధ్య పెళ్ళికి నెల్లూరు వెళ్ళటం, పెళ్ళికి ముందు "మ్యూజికల్ నైట్" కావలిలో పెట్టుకోటం, ఆ హోటల్ "చెల్వపిళ్ళ" షాపుకి దగ్గరే కావటం, నేను ఆరోజు ఆ ఫంక్షన్ కి వెళ్తే ఇంకా అందరూ రావటానికి కాస్త టైమ్ ఉండటం, ఆ కాస్త సమయంలో "చెల్వపిళ్ళ" షాప్ చూడాలని నా మనస తహ తహలాడటం తో, ఒక్కడినే నడుచుకుంటూ ఆ షాప్ చూడాలని బయల్దేరా.

వెళ్తుంటే..."షాప్ ఇంకా ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుందీ? ఆ ఓనర్ ఇంకా ఉంటాడా? లేదా ఆయన పిల్లలు షాప్ నడుపుతుంటారా?" ఇలా రకరకాలుగా ప్రశ్నించే నా మది...ఏదో తెలీని ఫీలింగ్ తో  ఆ షాపు చేరిన నాకు, అప్పటిలానే ఎప్పుడూ నలుగురైదుగురితోనే కిటకిటలాడే అదే షాపూ(బయట నలుగురైదుగురికన్నా ముందు వరసలో పట్టరు), అందరికీ ఎంతో ఓపిగ్గా అడిగినవి లోపలి నుంచి ఒకరిద్దరు అక్కడ పనిచేసే అబ్బాయిల్తో తెప్పించి ఇచ్చే అదే షాపు ఓనరూ కనిపించటంతో భావోద్వేగాల్లో మునిగిన నా మనసు...

ఇది కలా నిజమా అనుకుంటూ ఒక పక్కగా నిలబడ్డ నన్ను చూసి ఆ ఓనర్ "మీకేం కావాలీ" అనగానే "వాళ్ళకేం కావాలో చూడండి, నాకు కొంచెం మీ టైమ్ కావాలి" అని కొంచెం రద్దీ తగ్గాక దగ్గరికెళ్ళి నవ్వుతూ నావైపుకేసి చూసిన ఆ ఓనర్ తో...
"ముప్పై ఏళ్ళ క్రితం రెగ్యులర్ గా మీ షాప్ లో డ్రాయింగ్ మెటీరియల్ కొంటుండే వాడిని. మళ్ళీ చాలా కాలానికి ఇటువైపు వచ్చాను. నాకు మీ చేతుల మీదుగా ఒక మంచి పెన్ను కావాలండీ, అది మీ చేత్తో మీరే తీసి నాకివ్వాలి" అన్నా.
వెంటనే "తప్పకుండా, మీరిప్పుడెక్కడుంటారు సార్" అంటూ ఎంతో వినయం గా ప్రశ్న.
"అయ్యో నన్ను సార్ అనకండి, బాబూ అంటే చాలు, నేనిప్పుడు US లో ఉంటానండీ"
"అనుకోకుండా ఇటొచ్చాను, మిమ్మల్నీ మీ షాపు నీ చూడాలనే కోరికతో ఇక్కడికొచ్చా, మీరు అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అదే చిరునవ్వు, అంతే వినయం అలానే ఉన్నారు. ఏం మారలేదు. అప్పట్లో యంగ్ గా ఉండేవారు, ఇప్పుడు పెద్దవాళ్ళయి పోయారు."
మళ్ళీ వినయంతో కూడిన చిరునవ్వే సమాధానం.
ఇంతలో ఆ పక్కనే ఉన్న ఒకాయన, "మీరు ముప్పై ఏళ్ళ క్రితమే, నేనాయన్ని నలభై ఐదేళ్ళుగా ఎరుగుదును, ఆయన అప్పుడూ ఇప్పుడూ అలానే ఉన్నారు" అనగా మళ్ళీ అటువైపునుంచి చిరునవ్వే.
"అవునండీ ఆయనేం మారలేదు" అని నేను...
"అప్పుడు రేనాల్డ్స్ పెన్ను ఎక్కువగా మీదగ్గర కొనే వాడిని, ఇప్పుడు ఏం ఉన్నాయో తెలీదు మీరే చూసి మంచి పెన్ను ఇవ్వండి" అన్నా.
"అలాగే, మంచి పెన్నే ఇస్తానండీ" అంటూ ఒక చిన్న ప్యాక్ లోంచి ఓ పెన్ను తీసి, దాని క్యాప్ తీసి, ఓ పేపర్ పైన "శ్రీ రామ జయం" అని రాసి టెస్ట్ చేసి మరీ నా చేతికిస్తుంటే...
"చాలా సంతోషం అండీ" మీ చేత్తో రాసిన ఆ "శ్రీ రామ జయం" ఫొటో తీసుకుంటాను.
"అలాగే అండీ, అందిరికీ అయనే కదండీ ఎప్పుడూ రక్ష" అని నవ్వుతూ ఆయన...
"మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్నీ ఒక ఫొటో తీసుకుంటానండీ, గుర్తుగా" అన్నా.
"అలాగే" అంటూ (వయసు పైబడి, కొద్దిగా వంగిన భుజంతో ఎంతో వినయంగా నవ్వుతూ) నిలబడ్డ ఆయన్ని ఫొటో తీసుకుని...
"అలాగే మీ చేత్తో ఒక మంచి పెన్సిల్ కూడా కావాలండీ" అన్నా.
"తప్పకుండా అండీ" అంటూ ఆయన వెనక్కి తిరిగి పెన్సిల్ తీస్తుంటే....
"అప్పుడు అప్సర, నటరాజ్ అని రెండు పెన్సిల్స్ ఉండేవి, బ్లూ రెడ్ కలర్స్ లో" అన్నా.
"ఇప్పుడూ అవే ఉన్నాయండీ, అవే మంచి క్వాలిటీ కూడా. అయితే వేరే రంగులో వస్తున్నాయి" అంటూ ఒక పెన్సిల్ కూడా తీసిచ్చిన ఆయన చేతుల మీదుగా అవి తీసుకున్న ఆ మధుర క్షణాలు ఎప్పటికీ నా మదిలో పదిలం!

"మీ పేరు అప్పుడు నాకు తెలీదండీ, తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు, ఇప్పుడు తెలుసుకోవాలనుంది" అన్నా.
"లక్ష్మీ నారాయణ అండీ" అంటూ ఎంతో వినయమైన మాట.

"మళ్ళీ ఇన్నిరోజుల తర్వాత మీ చేతుల మీదుగా ఒక పెన్, ఒక పెన్సిల్ తీసుకోవటం ఎంతో సంతోషంగా ఉందండీ, మీరెప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, ఉంటానండీ" అన్నా.
"తప్పకుండానండీ" అంటూ నవ్వుతూ నిలబడ్డ ఆయన ముఖం లోని ఆ నవ్వు తృప్తిగా చూసుకుని ఆనందంగా బయల్దేరిన నా మది నాతో...

"చాలా సంతోషం రా, ఇంత కాలానికి నీ కోరిక తీరింది. కాలంతోపాటు ఎంతో మారిపోయిన ఈ ప్రపంచంలో మారని నీ మనసే కాదు, చెల్వపిళ్ళ ఓనరూ, అదే ఆ లక్ష్మీ నారాయణ గారూ, ఇదే నీ చిన్నప్పటి కావలి లో అలానే ఉన్నారు, ధన్యం" అని లోపల అంటుంటే తృప్తిగా ఫంక్షన్ హాల్ వైపు నడిచిన ఆ మధురక్షాణాల్నీ, ఆ సాయంత్రాన్నీ ఎప్పటికీ నా మదిలో పదిలం గా దాచుకుంటాను...

"చెల్వపిళ్ళ లక్ష్మీ నారాయణ గారు" పది కాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఆయన చేతుల్తో ఇచ్చిన డ్రాయింగ్ మెటీరీయల్ తో రూపుదిద్దుకున్న నా చిన్ననాటి బొమ్మలూ, నేనూ ఎప్పటికీ ఆ(యన) వినయానికీ, ఆ చిరునవ్వుకీ కట్టుబడే ఉంటాం.

"మారిన కాలంతో మనుషులు మారిపోయినా, దూరమైపోయినా, వేరైపోయినా, వారు మిగిల్చిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ జీవించే మనసులు మానవత్వానికి ప్రతిరూపాలు" - గిరిధర్ పొట్టేపాళెం

* * * *

కాలం మరినా మారని అదే వినయం, అదే చిరునవ్వూ...
కావలి "చెల్వపిళ్ళ షాపు ఓనరు" శ్రీ లక్ష్మీ నారాయణ గారు

"శీ రామ జయం" అంటూ పెన్ను టెస్ట్ చేస్తూ రాసిన
"లక్ష్మీ నారాయణ" గారి చేతి వ్రాత...నాకోసం...నాకెంతో ప్రత్యేకం 

కావలి "చెల్వపిళ్ళ" బుక్ షాపు ఓనరు "లక్ష్మి నారాయణ గారి" చేతులమీదగా
ముచ్చటపడి ఇన్నేళ్ళకి మళ్ళీ కొనుక్కున్న పెన్నూ, పెన్సిలూ...అపురూపం

నా బొమ్మలు ఊపిరి పోసుకున్న స్థలం
ఈ పెంకుటిల్లుని ఆనుకుని రైట్ సైడ్ అదే లుక్ తో ఉండే ఇల్లు
(ఇప్పుడు సపరేట్ అయి పోయి కొద్దిగా Sun Light పడుతూ
Photo లో కొంచెం కనిపిస్తున్న మిద్దె గా మారిపోయింది)

9 comments:

  1. Very well written

    ReplyDelete
  2. నేను కూడా కావలిలో రెండేళ్లు చదువుకున్నాను. కానీ మీరు చెప్పిన షాపు స్మృతిపథంలో లేదు. మంచి హృదయమున్న మనిషిని, ఆయన నడిపే షాపు పరిచయం అద్భుతంగా చేశారు. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. కావలి లో ఉన్నది రెండేళ్ళే అన్నారు కదా, బహుశా ఇంకో బుక్ షాప్ కి వెళ్తుండేవారేమో. చల్వపిళ్ళ ఒంగోల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. అటు ఊరి చివర ఉండేవారు కొందరు ఇక్కడి దాకా రారేమో. ధన్యవాదాలు!

      Delete
  3. స్మ్రుతి పధంలో ఉన్న వెలుగులు. పోస్ట్ బాగుంది.

    ReplyDelete
  4. థ్యాంక్ యూ అండీ!

    ReplyDelete
  5. Very nice presentation about bookshop. In those days people are very affectionate, helping nature and loving.
    Finished you stealed our hearts.
    Thank you.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for reading and sharing your feelings with me. I truly appreciate your time.

      Delete