Showing posts with label Sketch. Show all posts
Showing posts with label Sketch. Show all posts

Saturday, November 1, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 34 . . .

Ravi Sastry - Indian Cricketer, All-rounder 
Ink & Sketch pens on Paper
 
ట పాటలతో, బామ్మ బొమ్మల కథలతో హాయిగా సంతోషంగా గడిచి పోయే కాలం బాల్యం. జీవితంలో ఏ చీకూ చింతా లేని అందమైన, ఆనందమైన, అమరమైన అతి చిన్నదైన భాగం. ఎప్పుడు పెద్దవుతామా అనుకునేలోపే పెరిగి పెద్దయిపోతాం. ఆటలు పాటలు తగ్గుతూ, చదువు సంధ్యలు పెరుగుతూ, బడి, పుస్తకాలు, హోమ్ వర్కులు, పరీక్షలు ఇలా ఒక్కో క్లాస్ పైకెళ్ళే కొద్దీ చదువు బాధ్యతలే రోజులో ఎక్కువ భాగం ఆక్రమించేస్తాయి.

బాల్యం నాకూ అందరి లాగే ఐదవ క్లాసు దాకా ఆటపాటలతో హాయిగా గడిచిపోయింది. మా ఊరు "దామరమడుగు" లో స్నేహితుల్తో కలిసి ఆడుతూ పరుగులు పెట్టిన రోడ్లూ, ఎక్కి దూకిన గోడలు, ఆటలాడిన గుడి గోపురాలూ , చేలమ్మిట నడిచిన గెనేలూ అన్నీ కళ్ళముందు నిన్నే కదా అన్నట్టున్నాయి. పెద్ద వర్షం వచ్చి తగ్గగానే బయట పడి, పారే పిల్ల కాలువల నీళ్ళల్లో వదిలిన కాగితపు పడవలు, అవి ఆ నీళ్ళ తాకిడి చిన్న చిన్న అలలపై ఊగుతూ పయినిస్తుంటే వాటి వెంబడే తీసిన పరుగులు, తిప్పిన గానుగ బళ్ళు, జాలీ చుట్టి బొంగరాలతో కొట్టిన కుక్కజాలీలు గుమ్మాలు, గురి చూసి వేలు అంచున పెట్టి రెండేళ్ళతో పట్టి గిరికీలు తిప్పుతూ కొట్టిన రంగురంగుల గోళీలు, ఎగరేసిన పొడుగు తోక గాలిపటాలు, పొట్టి తోక సరాలూ, లాగి పెట్టి కొడితే గాల్లో గిరగిరా తిరిగిన కోడింబిళ్లలూ, పంగాలు కర్ర తో నడిపిన తాటి బుర్రల బళ్ళు, ఇసుక రాశులపై నడిపిన ఇటుకరాళ్ళ బస్సులు, డిమిండాల్, బాల్ ఆట, వంగుళ్ళు దూకుడ్లు, దారినపోయే ప్రతి ఎద్దుల బండి వెనకా పడి పొడవుగా ఉండే దృఢమైన రెండు కొయ్యల్లో ఒకదానిని రెండు చేతులతో పట్టి ఉయ్యాలలూగిన కోతి చేష్టలూ...ఇలా ఆడని ఆటా లేదు, పాడని పాటా లేదు. అప్పట్లో ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో అందరితో కలిసి ఎప్పుడైనా సినిమాలకో, లేదంటే ఎవరివైనా పెళ్ళిళ్లకో, ఎండాకాలం శలవులకి అమ్మమ్మ వాళ్ళ దగ్గరకో తప్ప మిగతా కాలం అంతా స్నేహితులతోనే. పొద్దున నిద్దర లేస్తే కలిసి ఊరి బయట వలకల దిబ్బ, కోవూరు కాలవ, పొలాల వైపు ఒక చుట్టు కొట్టి రావటం, బడి, సాయంత్రం మళ్ళీ చీకటి పడే దాకా ఒకటే ఆటలు. ఎంత అందమైందో కదా బాల్యం!

అలా "నెల్లూరు" కి కూతవేటు దూరంలోనే ఉండే అందమైన అసలు సిసలు పల్లెటూరు మా "దామరమడుగు" లో హాయిగా గడిచిన రెండు మూడేళ్ళు కే నేను రెసిడెన్షియల్ స్కూలు బాట పట్టాల్సి రావటం నా జీవితంలో అతిపెద్ద మలుపు. తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉండి చదువుకుంటూ శలవులకి మాత్రం ఇంటికి వస్తుండటంతో ఆ చిన్ననాటి ఆటలన్నీ నన్నొదిలి వెళ్ళిపోయాయి. రెసిడెన్షియల్ స్కూల్ లో క్రికెట్, హాకీ, ఖో ఖో, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, వాలీ బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఈ ఆటలన్నీ వచ్చి చేరాయి. అప్పట్లో టీవీ లు ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులోకి రాలా. మా స్కూల్ లో క్రికెట్ గేమ్ కామెంటరీ కోసం డైనింగ్ హాల్ కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఒక క్రికెట్ పిచ్చి వంట స్వామి ట్రాన్సిస్టర్ రేడియోలో వినే కామెంటరీ పిచ్చి మాకూ స్కూల్ లోనే వంట పట్టేసింది. ప్రతి పది నిమిషాలకీ క్లాస్ లో నుంచి ఎవరో ఒకరు సార్ ని ఒంటేలుకని అడిగి ఆ వంటగది కిటికీ దగ్గరకెళ్ళి కిటికీ చువ్వలు పట్టుకుని జంప్ చేసి మోకాళ్ళతో గోడ ని కరుచుకుని స్కోర్ కనుక్కుని రావటం, వచ్చి అందరికీ చెప్పటం...సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్  ల బ్యాటింగ్ అయినా,  కపిల్ దేవ్, మదన్ లాల్ ల బౌలింగ్ అయినా, కిర్మానీ వికెట్ కీపింగ్ అయినా, ఫీల్డింగ్, బ్యాటింగ్, ఫోర్, సిక్స్, వికెట్, రన్ అవుట్...ఇలా ఆటంతా ఊహే. క్రికెట్ ఆటగాళ్ళ  ఫొటోలు న్యూస్ పేపర్లో చూసీ చూసీ కామెంటరీ తో వాళ్ళ ఆట తీరుని బ్రహ్మాండంగా ఊహించుకునే తీరు చెప్పనలవి కాదు, వర్ణనాతీతం. ఇప్పుడు "అల్ట్రా క్లారిటీ హై డెఫినిషన్ స్క్రీన్" ల పై చూసే ప్రత్యక్ష ప్రసారం అప్పటి రేడియో కామెంటరీ విని మదిలో ముద్ర పడ్డ ఆటగాడి బొమ్మతో ఆ ఆటగాడు ఆడే ఆటని ఊహించుకునే ఆట ముందు బలదూర్, అంతే!

చిన్నప్పటి నుంచీ బొమ్మల లోకంలో విహరించే వ్యాపకం ఉండడంతో కనపడినవన్నీ గియ్యటమే నాకు నేను సృష్టించుకునే నా పని. అలా చిన్నపుడు గీ(సే)సిన బొమ్మల్లో దేవుళ్ళూ, సినిమా హీరోలు, బ్రూస్ లీ, క్రికెట్ స్టార్లూ వీళ్ళే ఎక్కువ. ఈ బొమ్మ అప్పటి స్టార్ క్రికెటర్ "రవి శాస్త్రి" ది. చాలా క్యాజువల్ గా ఏదో పత్రిక తిరగేస్తూ చూసిన వెంటనే పేపర్ పెన్ను కోసం చూసి, పేపర్ దొరక్క, ఏదో దొరికిన పెళ్ళి పత్రిక కార్డు వెనక అలా కొద్ది పాటి గీతలు గీసి స్కెచ్ పెన్ రంగులు అద్దింది. వేసిన కొద్దిపాటి క్రికెట్ స్టార్ల బొమ్మల్లో ఇది ఒకటి, భిన్నమైనది. పెద్దగా శ్రద్ధ పెట్టి వేసిన బొమ్మ కాకపోయినా, అ గీతల్లో ఉన్న పట్టు, వెయ్యగలనన్న ధీమా, రెండూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సంతకం తెలుగులో "గిరి" అని పెట్టటంలో అప్పటి తెలుగు గవర్నమెంట్ పథకాలకి ఆస్థాన ఆర్టిస్ట్ గా పనిచేసిన "గోపి" గారి సంతకం శైలి అనుకరణ కనిపిస్తుంది. గోపి గారి బొమ్మలు బాపు గారి ని అనుకరిస్తూనే ఒక ప్రత్యేకమైన వంకరలతో అదో ప్రత్యేకంగా ఉండేవి. ఎందుకో బాగా నచ్చేవి.

సంతకం కింద ఉన్న తేది చూసి వెనక్కి తిరిగి చూసుకుంటే, గీతల్లో కొంచెం పట్టు పెరిగి పెయింటింగ్ అధ్యయనం వైపు, అన్వేషణ మొదలు పెడుతున్న సంవత్సరం అది. సహజంగానే వేసవి శలవులకి "కావలి" ఇంటికి వచ్చినపుడే ఎక్కువగా బొమ్మలు వేసేవాడిని. ఇదీ అలా "కావలి" లో మేముంటున్న మా "నారాయణవ్వ పెంకుటింట్లో" వేసిందే. నా బొమ్మలకి పునాది అక్కడే. శలవులకి "విజయవాడ" నుంచి వస్తే కలిసి తిరిగేందుకు స్నేహితులెవరూ ఉండకపోవటం, ఊరికే కాలయాపనం చెయ్యటం నాకు అలవాటు లేకపోవటం తో, పొద్దున్నే లేచి లైబ్రరీ తెరిచే సమయానికి వెళ్ళి న్యూస్ పేపర్స్, పుస్తకాలు తిరగేసి రావటం, వచ్చాక, అమ్మ స్కూల్ కి, అన్న ఫ్రెండ్స్ తో బయటికి పోవటంతో ఏమీ తోచక పుస్తకాలు తిరగేస్తూనో, బొమ్మలు వేస్తూనో గడపటం ఇలానే నా శలవులన్నీ గడచిపోయేవి. అలా ఏమీ తోచని సమయంలో సరదాగా పట్టిన పెన్నూ పేపర్ సృష్టించిన బొమ్మలు నాతో పెరిగి పెరిగి చాలా చాలా అయ్యి అదొక లోకం లా అయ్యి అందులో విహారం చేసెయ్యటం అలవాటుగా మారింది. విహారం లేనప్పుడు విరహమూ ఉండేది. నేర్చుకునే మార్గాల కోసం అన్వేషణ చేసీ చేసీ అలసి, విసిగి వేసారి పోయి చివరికి కొన్నేళ్ళు "ఇంజనీరింగ్" కాలేజి లో "ఏకలవ్య" సాధన (కొన)సాగించా.

సాధన తో సాధ్యం కానిది, అసాధ్యమైనది ఏదీ లేదన్న జీవిత సత్యాన్ని నాకు నేర్పింది నా బొమ్మలే. ఏ పనికైనా దీక్షా, సాధనే మూల స్థంభాలు. అలా సాగించిన పయనమే తిరిగి ఎప్పుడు చూసుకున్నా తృప్తినీ హాయినీ ఇచ్చే నా కృషి ఫలితం, నా బొమ్మల ప్రతిసృష్టి లోకం. జీవరాశులు సలిపే ఆ కృషే ఈ సృష్టి కి మూలం. ప్రకృతిలో ప్రతి ప్రాణీ నిరంతరం తన మనుగడకై కృషి చేస్తూనే ఉంటుంది. గాలీ నీరూ, చెట్టూ చేమా, చీమా దోమా, ప్రాణమున్న ఏ జీవీ కృషి మానదు. కనీసం ఆర్ట్ మెటీరియల్ కూడా సరిగ్గా ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునే అవకాశాలు లేని ఆ వయసూ ఆ కాలం నుంచి ఏది కావాలన్నా నిమిషాల్లో దొరికిపోయే ఈ కాలం చేరుకోటానికి, చేరువవటానికీ ఒక జెనరేషన్ కాలం పట్టిందేమో. అయితే జరిగిన మార్పు మాత్రం విపరీతం. బాల్యం లో కథలు చెప్పే బామ్మలు లేరు, చెట్లూ చేమల వెంట పరిగెత్తి ఆటలాడే ప్రకృతీ చుట్టూ లేదు. అందరి చేతుల్లోకి వచ్చి చేరిన "స్మార్ట్ ఫోన్" అనే చిన్న సాధనం అన్నిటినీ అమాంతం(గా) మింగేసింది. న్యాచురల్ ఇంటెలిజెన్స్ నుంచి మాత్రమే కాదు, న్యాచురల్ ట్యాలెంట్ నుంచి ఆర్టిఫిషియల్ ట్యాలెంట్ వైపు కాలం అందనంత వేగంతో పరుగులు పెడుతోంది, సహజం నుంచి అసహజం వైపు మార్పు సహజమేనా - అన్న ప్రశ్న కి కూడా సమయం లేనంత వేగంతో. సమాధానం తెలుసుకునే సమయం ఇప్పుడు లేకున్నా, ముందున్న కాలం లోనే ఆ ప్రశ్నకీ సమాధానం ఉంది...దాగుంది...

"సమాధానం లేని ఏ ప్రశ్నా కాలంలో లేదు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Thursday, August 7, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 32 . . .

"భాను ప్రియ"
Ballpoint Pen on paper

గీసే ప్రతి గీత లో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీత లో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ - చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందునా వేసేది పోర్ట్రెయిట్ అయితే ఆ పొర, తడబాట్ల పరిమితి పరిధి మరింత ఎక్కువవుతుంది. ఇలా అన్ని విధాలుగా డ్రాయింగ్ అనేది ఒక ఛాలెంజ్ ప్రక్రియ. ఈ బొమ్మ నేరుగా బాల్ పాయింట్ పెన్ తో వేసింది. అంటే ఇంకెంత సవాలో ఊహించుకోవచ్చు. కళ్ళు, చూపు, ముక్కూ, ముక్కు పుడక, పెదవులు, ఆ పెదవులపై తళుక్కుమనే సన్నని వెలుగు, జుట్టూ, బొట్టూ, కట్టూ ఇలా అన్నీ కొలిచినట్టు ఉంటే తప్ప పూర్తి అయిన బొమ్మ ఆ బొమ్మ తాలూకు వ్యక్తి(ది)గా అనిపించదు. ఇవన్నీ ఒకే బొమ్మలో ఒడిసి పట్టుకో(గలగ)టమే పోర్ట్రెయిట్ స్పెషాలిటీ.

పోర్ట్రెయిట్ - బొమ్మల్లో ఇదొక ప్రత్యేక విభాగం, అందరు ఆర్టిస్టులు దీని జోలికి పోరు. పోయినవాళ్ళు ఇది బాగా ఇష్టపడతారు, బాగా ఆనందిస్తారు కూడ. ప్రతి మనిషి ముఖంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రత్యేకతల్ని గమనించి పట్టుకోగలిగితే ఆ వ్యక్తి ముఖకవళికలు దగ్గరగా వస్తాయి. ఒక్క చిన్న పొరబాటు చాలు, ఆ వ్యక్తి రూపురేఖలు వేసే బొమ్మలో పూర్తిగా మారిపోయి ఇంకెవరిదో అనిపించటానికి.

నా బొమ్మల్లో ఎక్కువగా వేసింది పోర్ట్రెయిట్స్ నే. చిన్నపుడు చందమామ బొమ్మల మాస పత్రిక చూస్తూ అందులో ఆఖరి పేజీల్లో చిన్నపిల్లల కోసం ఉండే వ్యాపార ప్రకటన "పాపిన్స్ పిప్పరమింట్స్" లో పిల్లాడి బొమ్మని చూసి, ఆ పిల్లాడి క్రాఫు ముందుకి తిరిగిన చిన్న రింగు, గుండ్రటి చుక్కల్లాంటి రెండు కళ్ళు, ఇంగ్లీషు అక్షరం యల్ షేపులో ఉండే ముక్కు, చేప లాంటి నోరు వేసి మొదలు పెట్టిందే నాకు తెలిసి మొట్టమొదట నేను వేసిన పోర్ట్రెయిట్. తర్వాత రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇలా దేవుళ్ళ బొమ్మలు వేస్తూ, కొద్దికాలంలోనే యన్.టీ.రామారావు, కృష్ణ, ఏ.యన్.ఆర్. ల బొమ్మలు వెయటంలో భలే సంతోషంగా అనిపిస్తూ ముందుకి సాగింది పోర్ట్రెయిట్స్ తో నా ప్రయాణం. అలా సినిమా హీరోల్ని అచ్చుగుద్దినట్టు వేస్తూ, చూడకుండా కూడా కొన్ని గీసే స్థాయి కి చేరుకున్నా. "నేరం నాది కాదు ఆకలిది" లో పెద్ద టోపీ పెట్టుకుని నోట్లో సిగరెట్ తో ఉన్న యన్.టీ.ఆర్. బొమ్మైతే చక చకా దొరికిన చోటల్లా గీసేసే వాడ్ని.

చిన్నపుడు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి బొమ్మని వెయ్యాలని ట్రై చేసే ఉంటారు. చాలా మంది ముక్కుని వేసే దగ్గర మాత్రం చాలా కష్టపడే వాళ్ళు. అప్పుడు మేముంటున్న మా ఊరు "కావలి". సినిమా థియేటర్స్ లో ఇంటర్వల్ తర్వాత సినిమా మొదలయ్యే ముందు బయట క్యాంటీన్ లో వేడి వేడి పులిబంగరాలు, మసాలా వడలు తిని, చల్లని సోడానో, వేడి వేడి టీ నో, సిగిరెట్టో తాగొచ్చి సెటిల్ అయ్యే ప్రేక్షకులు వచ్చి కుర్చీల్లో కూర్చునేలోపు తెరపై వేసే, గ్లాస్ పలక మీద వేసిన స్లైడ్స్ లో "పొగ త్రాగరాదు", "ముందు సీట్లపై కాళ్ళూ పెట్ట రాదు" అన్న స్లైడ్స్ తప్పనిసరిగా ఉండేది. ఎవరితో వేయించేవాళ్ళో తెలీదు గానీ, అప్పుడున్న సినిమాల ట్రెండు ని బట్టి "పొగ త్రాగరాదు" అన్న స్లైడ్ కి ఏదో ఒక హీరో సిగిరెట్ తాగుతూ ఆ సిగిరెట్ మీద పెద్ద ఇంటూ మార్కు తో అంతా బానే వేసే వాళ్ళు, ఒక్క ముక్కు తప్ప. ముక్కు దగ్గర మాత్రం సునాయాసంగా అనిపిస్తూనే పడ్డ కష్టమంతా కొట్టొచ్చినట్టు కనపడేది. సునాయాసంగా విచిత్రంగా వేసి పారేసే వాళ్ళు, ముక్కు ముక్కే కాకుండా పోయినా చూడగానే ఫలానా హీరో అని తెలిసిపోయేలా. నాకెప్పుడు థియేటర్లో అవి చూసినా నేనైతే ఇంకా బాగేద్దును అనుకునేవాడ్ని, కానీ అవి ఎవరేస్తారో ఎలా వేస్తారో మాత్రం తెలిసేది కాదు. మా అన్న ఫ్రెండ్స్ నా బొమ్మలు చూసి నువ్వెయ్యొచ్చు కదా గిరీ, బొమ్మలు సరిగ్గా వెయటం రానోళ్ళే వేస్తున్నారు అనేవాళ్ళు. అవెలా వేస్తారో తెలుసుకుని వెయ్యాలని ఉన్నా, ఎవర్ని సంప్రదించాలో తెలిస్తే కదా. చొరవ తీసుకుని థియేటర్ యజమానిని కలిసేంత వయసూ లేదు, ఆ పిల్ల వయసులో అంత పెద్ద సాహసమూ చెయటం తెలీదు. "సాహసం శాయరా ఢింబకా" అని పలికే మాంత్రికుడూ లేడప్పుడు పక్కన. అందుకే ఇంట్లో నాలుగు గోడల మధ్యనే నా పోర్ట్రెయిట్ బొమ్మలు క్రమేపీ కుదురుగా ఎదగ సాగాయి.

ఇంటర్మీడియట్ కాలేజి రోజుల్లో హీరోల్ని దాటి హీరోయిన్ బొమ్మలు అడపా దడపా వేసేవాడ్ని. బాపు, చంద్ర గార్లు వేసిన అందమైన వయ్యారాల అమ్మాయిల బొమ్మలూ వెయటం మొదలుపెట్టాను. ఆడవాళ్ళ ముఖం లో సహజంగానే ఉండే సున్నితత్వాన్ని, కళ్ళల్లో, నవ్వులో ఉండే అందాన్ని, జుట్టులోని హొయల్నీ బొమ్మల్లో పట్టుకో గలగటం నాకేమీ కష్టంగా అనిపించలేదు. యన్.టీ.ఆర్ ని పట్టినంత తేలిగ్గానే పట్టేశా. తర్వాత శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల హాసన్ ఇలా వేస్తూ వేస్తూ ముఖకవళికలు అచ్చు పోసినట్టు గీయటంలో పట్టు సాధించా. అలా వేస్తూ వేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో చాలా కాలం అలనాటి అందాల తార "భాను ప్రియ" బొమ్మల్ల దగ్గర ఆగిపోయా.

"భాను ప్రియ" కళ్ళల్లో పలికే భావాలని, అమాయకత్వాన్ని బొమ్మల్లో పట్టాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఆ నాలుగేళ్ళలోనే. దాదాపు రెండు డజన్ల దాకా రకరకాల పోర్ట్రెయిట్స్ వేసుంటా. ఈ బొమ్మ బహుశా "శ్రావణ మేఘాలు" అన్న సినిమా లోని స్టిల్ అనుకుంటా. ఇందులో ఏదో తెలియని అమాయకత్వం తొణికిసలాడుతున్న ఒక పల్లెటూరి పిల్ల ముఖంలో సహజమైన అమాయకత్వంలో దాగిన ఒకింత సిగ్గు, ఒకింత బిడియం, ఒకింత మురిపెం కలిపిన ఆ చూపుల భావాల్ని వెయ్యాలని చేసిన ప్రయత్నమిది. నేరుగా బాల్ పాయింట్ పెన్ను తోనే వేసిన బొమ్మ కనుక తప్పుల తడికలకి తావే లేదు, ఉన్నా సరిదిద్దటం వీలే కాదు. నిజానికి నేరుగా బాల్ పెన్ తో మొదలు పెట్టేంత సాహసం చెయ్యవసరం లేదు గానీ, కొన్ని కొన్ని అలా అనుకోకుండా వేసి బాగా కుదరటంతో చాలా వరకు అలాగే మొదలుపెట్టి వేసేసేవాడ్ని. ఇప్పుడు వెను దిరిగి చూస్తే అంత కాన్ఫిడెన్స్, అంత నైపుణ్యం ఎట్టొచ్చిందా ఆ రోజుల్లో అనిపిస్తూ ఉంటుంది.

అప్పట్లో వేసిన చాలా బొమ్మలకి చుట్టూ రకరకాల బార్డర్స్ వేసేవాడ్ని. ఈ బొమ్మకి మాత్రం ఒక సర్కిల్ గీశా. దాని వల్ల ఈ పోర్ట్రెయిట్ మరింతగా ఎలివేట్ అయ్యిందనిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి అమెరికా వచ్చాక తెలుసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్ "నార్మన్ రాక్వెల్" పోర్ట్రెయిట్స్ లో ఎక్కువగా కనిపించేది ఇలా బొమ్మ చుట్టూ సర్కిల్. బహుశా అప్పటికి ఎక్కడైనా "నార్మన్ రాక్వెల్" వేసిన బొమ్మలు ఎప్పుడైనా చూశానా అంటే ఆ ఛాన్సే లేదు. అప్పట్లో మనకి "రవి వర్మ" పేరు, చందమామ, నవలలు, వారపత్రికల్లో బొమ్మలు వేసే తెలుగు ఆర్టిస్టుల పేర్లు, బొమ్మలూ తప్ప ఇంకెవరివీ తెలీవు.

కాలేజి లో నా రూమ్ కి వచ్చి నేనేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకున్న ఫ్రెండ్స్ కొద్ది మందే అయినా నేనప్పుడు వేసిన "భానుప్రియ" పోర్ట్రెయిట్స్ ద్వారా అందరికీ నేను "భానుప్రియ" అభిమానిగా ఎప్పటికీ గుర్తుండిపోయా. అమెరికా వచ్చిన కొత్తల్లో "లాస్ ఏంజలస్" లో ఉండే ఒక ఫ్రెండ్ "ఏం గిరీ, మీ భానుప్రియ ఉండేది ఇక్కడే తెలుసా" అన్నపుడు మాత్రం అయ్యో అక్కడుంటే ఎప్పుడైనా కనిపిస్తే నేను వేసిన బొమ్మలు చూపెట్టే వాడిని అని మాత్రం అనుకున్నా. 1997 లో "Giri's Home" అని నా వెబ్సైట్ లో నేనప్పటికి వేసిన బొమ్మలన్నీ ఉండేవి. ఎప్పుడో ఒకప్పుడు "భానుప్రియ" కంటపడకపోతుందా అనుకునేవాడ్ని.

ఆర్ట్ నా హాబీనే అయినా, దాంతో నా సుదీర్ఘ ప్రయాణం లో నా బొమ్మలు మెచ్చిన మనుషులు అతి కొద్దిమందే, నేనూ, నా బొమ్మలూ వాళ్ళకి గుర్తున్నా లేకున్నా నాకు మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తే. చాలా ఏళ్లకి మళ్ళీ టచ్ లోకి వచ్చిన నా ఇంజనీరింగ్ కాలేజి నాటి మిత్రులు మాటల్లో "ఎప్పుడు టీవీ లో భానుప్రియ ని చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి గిరీ" అన్న మాటల్లో చెప్పలేని సంతోషం మాత్రం నా పోర్ట్రెయిట్స్ లో అంతగా ఒదిగి పోయిన అలనాటి అందాల నటి ఆ "భానుప్రియ" బొమ్మల దే...

"గీసే గీత లో నింపే ఇష్టమే బొమ్మకు ప్రాణమై జీవం పోసేది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, July 5, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 31 . . .

Ink and Sketch pens on Paper (8.5" x 11")

జీవితం లో ప్రతిదీ సహజత్వం కోల్పోయి కృత్రిమత్వం సంతరించుకునే కాలం వచ్చేసింది, మెల్లి మెల్లిగా అందరి జీవితాల్నీ మబ్బుల్లా కమ్ము కుంటోంది. ఆ మబ్బుల మసకల్లోకి కొంచెం కొంచెం గా ప్రవేశిస్తున్నాం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా, అందులో ప్రవేశం తప్పనిసరి అవుతున్న పరిస్థితి. అమ్మమ్మలు, తాతయ్యలు, తాత, బామ్మల్ని సైతం అందులోకి తోసేస్తూ ఆ మబ్బులు కమ్ముకుని జీవితాల్ని కప్పేస్తున్నాయి. నిద్దర లేచాక గుడ్ మార్నింగ్ నుంచి పడుకోబోయే ముందు గుడ్ నైట్ ల దాకా అంతా సెల్ ఫోన్ లో డిజిటల్ మెసేజ్ లే. పేరు కి ఫోనే కానీ అది తప్ప మిగతావన్నీ అదే అయిపోయింది. స్మార్ట్ ఫోన్లో నోరారా మాటలూ, పలకరింపులూ పోయి మూగబోయిన మెసేజ్ లొచ్చి చుట్టు ముట్టేశాయి. కనీసం మెసేజ్ అయినా ఏదో నాలుగు మాటల ముక్కలు చేత్తో టైప్ చెయ్యటం కూడా పోయి, ఎక్కడో ఏవరో ఏదో పంపిస్తే అది తోచిన అందరికీ టక టక టక మని ఫార్వర్డ్ చేసి వేళ్ళు దులిపేసుకోటం అంతే. మరీ వింతగా పుట్టినరోజులకి మనకి గుర్తుండే ముఖ్యమైన ఫ్రెండ్స్ కో, ఫ్యామిలీ మెంబర్స్ కో పర్సనల్ గా విషెస్ చెప్పటం పోయి గుంపులో చెప్పటం, ఇంకా విడ్డూరంగా గుంపుల్లో మనకి కొందరు పరిచయమున్నా లేకున్నా, తీరికున్నా లేకున్నా, మిస్ అవకుండా గుంపులో గోయిందా కొట్టితీరాల్సిందే, లేకుంటే గుంపులో ఎవరేం ఫీల్ అవుతారో అనే ఒక ఎబ్బెట్టు ఫీలింగ్ మెసేజ్ పంపే దాకా, పంపించాకా కూడా ఖాయం. ఇక పండగలకీ పబ్బాలకీ అయితే పొలోమని డిజిటల్ గ్రీటింగ్ ఇమేజ్ లు లెక్కలేనన్ని ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటినే గ్రీటింగ్ కార్డులు గా భావించాల్సిన దయనీయ స్థితి. ఎవరికి ఏ గ్రీటింగ్ ఇమేజ్ ఎక్కడికి ఫార్వర్డ్ కొట్టింది కూడా గుర్తుండదు చాలా మందికి. నువు ఫార్వర్డ్ చేసింది నీకే తిప్పి ఫార్వర్డ్ కొట్టే వాళ్ళూ ఉన్నారు, దీన్ని "రివర్స్ ఫార్వర్డ్" అనాలేమో. ఈ జంక్ ఫార్వర్డ్ మెసేజ్ లు అన్నీ ఎల్లకాలం పదిలంగా సేవ్ చేసిపెట్టి, వాటి మీద స్టాటిస్టిక్స్ కట్టి, పెట్టుబడి పెట్టి వాటితో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేసే ప్రపంచ స్థాయి కంపెనీలు ఈ యుగం లో వెలిగి పోవటం మొదలయిపోయింది. సహజ మేధస్సు కూడా కృత్రిమ మేధస్సుమీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన కాలం వచ్చేసింది - "ది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎరా" కి అందరం స్వాగతం చెప్పక తప్ప(ట్లే)దు.

చేత్తో కష్టపడి వేసే బొమ్మలూ చాలా మంది ఆర్టిస్ట్ లు సునాయాసంగా ఇప్పుడు డిజిటల్ లో వేసేస్తున్నారు. నాకీ బొమ్మ కావాలి అని అడిగితే క్షణాల మీద వేసిచ్చే వెబ్ సైట్సూ అనేకం ఉన్నాయి. అయితే ఆ బొమ్మల రూపు రేఖలింకా సహజత్వానికి దగ్గరగా రాలేకున్నాయి. దగ్గరగా వచ్చి చేరే రోజూ దగ్గరలోనే ఉండొచ్చు. ఏ రోజుకైనా వాటిని ఒక్క సారి "బాపు" లా ఒక్క గీత గియ్యమని అడిగి చూడండి, వాటి సత్తా మేధస్సూ అంతా ఇట్టే తేలి పోతుంది. "బాపు" ని సృష్టించగల శక్తి ఒక్క ఈ జగతికి మాత్రమే ఉంది. అంతటి మహత్తయిన గీతల్ని సృష్టించగల శక్తి ఒక్క "బాపు" కే దక్కింది.

ఓ నలభై యేళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కృత్రిమం కాని అందమైన సహజ మానవ యుగం కళ్ళ ముందు స్పష్టంగా  కదుల్తుంది. గ్రీటింగ్స్ ని కేవలం విషెస్ రూపంలో చెప్పేసి హమ్మయ్య ఒక పని అయిపోయింది అని ఊపిరి తీసుకునే రోజులు కానే కావవి. పండగలు, పుట్టినరోజులు, ఇష్టంగా, ఆప్యాయంగా అంతా కలసి చేసుకోవటమే తెలిసిన రోజులు. ఏ చిన్న పని చెయ్యాలన్నా కష్టపడి, ఇష్టంగా, సొంతగానో ఇంకొకరిని అడిగో నేర్చుకుని సమయం వెచ్చించి చేసి తృప్తిని పొంద గలిగిన రోజులు. ప్రతి పండక్కీ, సంబంధం లేని ప్రతి విషయాలకీ వెల్లువలా గ్రీటింగులూ, విషెస్ చెప్తూ పోకుండా, తమకి ముఖ్యమైన రోజులకి ముందుగానే ఆ రోజుని గుర్తుపెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాలుగు చోట్ల తిరిగి, నాలుగు షాపుల్లో వెతికి, నచ్చిన గ్రీటింగ్ కార్డులు కొని, స్వహస్తాలతో అందులో విషెస్ రాసి, ఎన్వలప్ లో భద్రంగా పెట్టి పోస్ట్ చేసే రోజులవి. ఆ పోస్ట్ లో గ్రీటింగ్ కార్డు తోబాటు అక్షర రూపంలో పదిలపరచిన మనసు భావాలూ భద్రంగా కొద్ది రోజుల తర్వాత అవతలి వ్యక్తులకి  అంతే పదిలంగా అందేవి. ఎన్వలప్ చూడగనే విప్పారే మనసు, విప్పి చూసుకున్నా క మరింతగా మురిసిపోయే క్షణాన ఆ మనసు పడే సంతోషం, పొందే ఆనందం డిజిటల్ మెసేజుల్లో ఎప్పటికీ రానే రాదు. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్ కీ ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, పొలిటీషియన్ ఇలా ఒక రోజు సృష్టించేసి లెక్కలేననన్ని ఇమేజ్ లు మెసేజ్ లుగా ఫార్వర్డ్ కొట్టటం జీవితంలో భాగమై పోయింది.

"గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అని నన్నయ రచించిన మహాభారతంలో నే ఎప్పటికీ గడిచిన రోజులే మేలన్న సత్యం చెప్పబడింది. ఓ ముప్పై నలభై ఏళ్ళనాటి కాలం, కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఒక నెల ముందు నుంచే న్యూ ఇయర్, సంక్రాంతి కి గ్రీటింగ్ కార్డులు అమ్మే చిన్నపాటి దుకాణాలు బజారుల్లో ప్రత్యేకంగా వెలిసేవి. కొత్త సంవత్సరం రోజూ, సంక్రాంతి పండగ రోజులూ బయటికెళ్తే కొత్త బట్టలు తొడుక్కుని అందరూ ఇంటా బయటా కళకళలాడుతూ కనిపించేవాళ్ళు. పూలూ పళ్ళూ కూడా గ్రీటింగ్స్ లో పాలు పంచుకొనేవి.

అప్పటి గ్రీటింగ్ కార్డుల్లో "బాపు" కార్డులకి ఓ ప్రత్యేకత ఉండేది. "బాపు గ్రీటింగ్ కార్డులు" ఎంత పాపులర్ అంటే ఆర్ట్ అన్నా, బాపు అన్నా తెలియని వాళ్ళైనా అందరూ ఆయన వేసిన బొమ్మల కార్డులు చూసి మురుసిపోయేవాళ్ళు. తెలుగుదనం ఉట్టిపడుతూ చూసి వాటికి ఆకర్షితం కాని మనిషే ఉండేవాడు కాదు. ఇంకా ఎందరో మంచి ఫొటోగ్రాఫర్లు తీసిన అందమైన చిత్రాలు - ప్రదేశాలు, పువ్వులూ, పక్షులూ, జంతువులూ, ఇవన్నీ గ్రీటింగ్ కార్డులపైన ప్రింట్ అయిన సహజ సిద్ధమైన ప్రకృతి రూపాలే. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఏరి కోరి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని వాటి మీద అక్షరాలు రాసి, కవర్ లో పెట్టి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి పోస్ట్ చేసి రావటం లో దూరంగా ఉన్న తమ ఆప్తులకి పంపించే ఆ శుభాకాంక్షల్లో తమ మనసునే కాక కొంత జీవితాన్నీ చేర్చి పంపటం, అటువైపు అందిన ఆ కార్డులోని జీవత్వాన్ని తెరిచి చూడటం లో పొందిన ఆనందం... ఈ ప్రక్రియలోని సహజమైన ప్రేమా ఆప్యాయతల విలువ - అది పొందితేనే తప్ప ఎంత చెప్పినా అర్ధం కాదు. 

బాపు గ్రీటింగ్ కార్డుల్ని చూసి అచ్చం అలానే నేను వేసిన బొమ్మల్లోని(ది/ధి), సంతకం లేని అతి కొద్ది నా బొమ్మల్లో ఇదీ ఒకటి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో శలవుల్లో వేసింది. వేసిన ఇల్లూ, ఆ సమయం ఇంకా మదిలో పదిలం. నా బొమ్మల ప్రయాణం మొదలయిన టీనేజ్ లో "కావలి" లో మేం అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటింట్లో వేసింది. నా గ్రీటింగ్ కార్డుల సేకరణలో ఉన్న బాపు గారి గ్రీటింగ్ కార్డు ని చూసి, అచ్చం అలానే గీసిన గీతలవి. "బాపు" బొమ్మ ఒక్క "బాపు" కే సాధ్యం. ఈ ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు. అయినా అచ్చం అలాగే వెయ్యాలని పట్టిన పట్టు విడవని ఆ పట్టుదల ప్రతి గీత వంపులోనూ కనిపిస్తుంది. ఒక్కో గీతని ఎన్ని సార్లు చెరిపి గీసుంటానో నాకే తెలీదు. ఒక్క దెబ్బకి బాపు గారి ఏ గీతని అయినా అచ్చం అలాగే గీయగలిన ఆర్టిస్ట్ ఎవరూ లేరు, ఉండ(లే)రు కూడా. అంత దైవత్వం సంతరించుకున్న గీతలవి. బహుశా బాపు గారు డెభ్భై, యనభయ్యవ దశకాల్లో కేవలం గ్రీటింగ్ కార్డుల కోసమే కొన్ని బొమ్మలు వేసి ఉండొచ్చు. నాట్య భంగిమ లో నిలబడి ఉన్న ఈ విఘ్నేశ్వరుని బొమ్మ కూడా అలాంటిదే. గీతలనైతే ఎలాగో కష్టపడి అటూ ఇటుగా సాధించా, కానీ రంగులు అద్దటంలో తడబడిపోయా. కారణం అప్పటికి మన ఆర్ట్ ఇంకా గీతల దగ్గరే ఉంది, అది దాటి రంగులు అద్దే దాకా ఎదగలేదు. అప్పుడున్న కొన్ని స్కెచ్ పెన్నుల్తో రంగులు అద్దినా మెయిన్ బొమ్మ వెనక భాగం బ్లూ ఇంకు నీళ్ళల్లో కలిపి పూయటం, అందులోనూ పేపర్ సాదా సీదా పేపర్ కావటంతో ముద్దలు ముద్దలు గా అయిపోవటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పడ్డ కష్టమంతా ఈ బ్యాక్ గ్రౌండ్ రంగుల ముద్దల్లో కరిగి చెరిగిపోయి చెందిన మనస్తాపం ఛాయలూ ఇంకా మదిలో ఉన్నాయి. ఎప్పుడు ఈ బొమ్మ చూసుకున్నా ఆ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం కలవర పెడుతూనే ఉంటుంది. మామూలుగా అప్పట్లో ఒక బొమ్మ సంతృప్తిని ఇవ్వకుంటే మళ్ళీ అదే అంతకన్నా బాగా వేసి తృప్తిపొందే వాడిని. ఈ బొమ్మ గీతల్లో పడ్డ కష్టం మళ్ళీ పడటం సాధ్యం కాలేదు. రంగులు రాకున్నా, గీతలు బానే వచ్చాయి అన్న తృప్తి సరిపెట్టు కోవలసి వచ్చింది.

గ్రీటింగ్ - పలకరింపు అన్నది రెండు జీవాలను ఆప్యాయతతో కలిపే స్పందన. అది కార్డుల రూపంలో అందుకున్నా అందులో రాసిన అక్షరాల్లో ఆ జీవ స్పందన కలిసుండేది. ఆ స్పందన కూడా కృత్రిమం గా మారితే మనిషి మనుగడకి అర్ధమే మారిపోతుంది. మాట మనిషికి దేవుడిచ్చిన ఒక వరం. మాట మాత్రమైనా లేకుండా మనుషులు దూరమై పోతున్నారు. వాళ్లలోని మమతలూ దూరమైపోతున్నాయి. ఆప్యాయంగా "ప్రియమైన గిరికి" అని ఉత్తరం అందుకుని కొన్ని దశాబ్దాలు గడచి పోయాయి. "ఎలా ఉన్నావు గిరీ" అన్న పిలుపూ వినబడే రోజులు కాలంలో వెనక్కి దొర్లి పోయాయి. మిగిలింది మాత్రం వెనుకటి కాలంలో దాగిన జ్ఞాపకాలే...

"కాలం దూరం చెయ్యలేనివి జ్ఞాపకాలు మాత్రమే."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, January 4, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 27 . . .

Portrait of a Businessman
Sketch Pens on paper 3" x 4"

ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటిలో సైతం కనిపించే నల్లదనం...ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయమే.

బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు రంగులతోనే ఉండేవి. పిల్లలు రంగులపట్ల అంతగా ఆకర్షితులవటం ప్రకృతి సహజం.

నా మొదటి రంగుల గురుతులు మదిలో తరగని చెరగని నా బాల్యం నాటివే. నల్లని పలకపై బలపంతో దిద్దిన తెల్లని అక్షరాలు, ఆటల్లో వేళ్ళ కొసలన పట్టి వదిలిన గిర్రున తిరిగిన రంగు రంగుల గాజు గోళీలు, సన్నని పేనిన తాడుతో చుట్టి సంధించి లాగి విసిరితే సర్రున తిరిగిన రంగుల బొంగరాలు, ఉపరితలంపై రెపరెపలాడిన రంగు రంగుల కాయితపు గాలిపటాలు, మండుటెండలో పెదవుల మధ్య జిల్లుమనిపిస్తున్నా జుర్రిన రంగుల పుల్ల ఐసులు, పెరట్లో పూసిన పసుపు పచ్చ, నారింజ రంగు ముద్దబంతి పువ్వులు, ఎండాకాలపు తెల్లని మల్లెమొగ్గలు, సంక్రాంతి పండుగ ముగ్గుల వర్ణాలు, మా ఊర్లో నాన్న కట్టించిన మా కొత్తింటికి వేసిన రంగులు...ఇలా ఆటపాటల బాల్యం అంతా రంగుల మయం. ఎంతమందికి మొట్టమొదటి రంగుల అనుభూతులు ఎంతో కొంత మదిలో అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటాయో తెలీదు కానీ నా మటుకు నాకు మాత్రం ఇప్పటికీ కొన్ని ముదురు రంగులు చూస్తే మనసు బాల్యంలోకి పరిగెడుతుంది.

పలక పై తెల్లని అక్షరాలు దాటి కాగితంపైన రాయటం మొదలు పెట్టాక, బులుగు, నలుపు, ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో ఇంకులు ఉండేవి అప్పటి రోజుల్లో. ఎక్కువగా బులుగు రంగు ఇంకే అందరూ వాడేవాళ్ళు. నాన్న టీచింగ్ నోట్స్ లో నాలుగు రంగులూ కనపడేవి. ఆకు పచ్చ, ఎరుపు రంగులతో నీటిపై అలల్లా అక్షరాల కింద చేసిన అండర్ లైన్లు ఎప్పటికీ మరువలేను. ఎర్రని ఇంక్ తో నాన్న దిద్ది మార్కులు వేసి నిలువుకి సగం మడిచి దారం కట్టిన ఆన్సర్ పేపర్స్ కట్టల గురుతులూ ఇంకా మదిలో చెక్కు చెదరనే లేదు. నాన్న తనే డిజైన్ చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీసి తన ప్లాన్ తో కట్టుకున్న ఇంటికి వాడిన ఆహ్లాదకరమైన పచ్చ, ఆరెంజ్, బ్లూ, లేత వంగపండు రంగులూ అంతే కొత్తగా ఇప్పటికీ మదిలో గూడు కట్టుకునే ఉన్నాయి. రంగులపై ఏర్పడ్డ మొదటి మక్కువ అంటే ఆడిన గోళీలే. రంగురంగుల గోళీల్లో కొన్ని రంగుల గోళీలు అరుదుగా వచ్చేవి. ఆ రంగుల గోళీల్ని ఆడకుండా వాడకుండా ప్రత్యేకంగా దాచుకుని పదే పదే చూసుకున్న గురుతులు ఎన్నో. తిరిగే బంగరాల ఉపరితలంపై రెండు మూడు రంగుల తిరిగే వృత్తాలు ఇప్పటికీ తలపుల్లో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.

ఇంకు పెన్ను తర్వాత స్కెచ్ పెన్ను వాడిన మొదటి అనుభవం స్కూల్ లో నా పదవ తరగతి నాటిది. పదవ తరగతిలో మా సైన్స్ టీచన్ "రామస్వామి సార్" స్కెచ్ పెన్నులు కొనిపించి అవి ఎంత ఎక్కువ వాడి పరీక్షలు రాస్తే అంత అదనంగా మార్కులు వేస్తూ ప్రోత్సహించేవారు. అలా సైన్సు బొమ్మలకి రంగులేయటం, బయాలజీ నోట్ బుక్ లో నోట్స్ కి హెడింగ్స్, సబ్ హెడింగ్స్ రాయటం, ఇంపార్టెంట్ పాయింట్స్ స్కెచ్ పెన్నుల్తో అండర్లైన్లు చెయ్యటం...ఇవి స్కెచ్ పెన్నుల్తో నా మొదటి అనుభవాలు. 

నా బొమ్మల్లో రంగుల స్కెచ్ పెన్ను లు అడపాదడపా వాడినా వాటితోనే పూర్తిగా వేసిన బొమ్మలు మాత్రం చాలా తక్కువ. అలా వేసిన అతికొద్ది బొమ్మల్లో ఈ బొమ్మ ఒకటి. మామూలుగా ఏ బొమ్మ అయినా ఎంతకాలం తర్వాత అయినా అది వేసిన ప్రదేశం, ఆ సమయం మరపురాని నాకు ఈ బొమ్మ కూడా అంత ఖచ్చితంగానే గుర్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. "కావలి" లో మేమప్పుడు అద్దెకుంటున్న మా నారాయణవ్వ పెంకుటిల్లు.అదే నా బొమ్మలకి పుట్టిల్లు. సమయం చీకటి పడ్డ సాయంత్రం. ట్యూబ్ లైట్ వెలుతురులో మధ్య గదిలో నేలమీద కూర్చుని నాన్న కలెక్షన్ లో మిగిలున్న కొద్ది "రీడర్స్ డైజెస్ట్" బుక్స్ తిరగేస్తున్న నన్ను ఒక "బిజినెస్ మ్యాన్" టై కట్టుకుని తల వంచుకుని కొంచెం పక్కకు తిరిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంది. అప్పటికప్పుడు గియ్యలన్న కోరికతో దగ్గరున్న స్కెచ్ పెన్నుల సెట్ తీసుకుని ఉన్న నాలుగైదు రంగులతో చకచకా పేపర్ పైన గీసిన స్కెచ్ బొమ్మ ఇది. సంతకం మాత్రం ఇంకు పెన్ తో పెట్టాను. అపటికింకా పూర్తిగా నాదంటూ ఒక ప్రత్యేకంగా తేలని సంతకం, బొమ్మ బొమ్మలో ఇంకా వింత వింత పోకడలు పోతూనే ఉండేది.

రీడర్స్ డైజెస్ట్ - అప్పట్లో చాలా అరుదుగా కొంతమంది దగ్గర మాత్రమే కనిపించేది. అదీ సంవత్సరం డబ్బులు కట్టి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెల నెలా పోస్ట్ లో వచ్చే ఒక చక్కని జనరల్ ఫ్యామిలీ ఇంగ్లిష్ మాస పత్రిక. చిన్న నోట్ బుక్ అంత సైజ్ లోనే ఉండేది. మంచి క్వాలిటీ పేపర్ పై, క్వాలిటీ రంగుల ప్రింట్ తో చాలా విషయాల మీద అవగాహన పెంచే ఒక మంచి మ్యాగజైన్. నాన్న కొన్ని సంవత్సరాలు ఈ బుక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంట్లో చాలా ఉండేవి. అప్పుడప్పుడూ ఏమీ పాలుపోకపోతే అటకెక్కిన గంపలోని ఈ పుస్తకాలు దించి వాటిని తిరగేయటం నాకలవాటుగా ఉండేది. అలా దించిన ప్రతిసారీ కొద్ది గంటల సమయం తెలియకుండానే గడిచిపోయేది. చిన్నప్పుడు కేవలం అందులోని బొమ్మలు మాత్రమే చూసేవాడిని. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్టికిల్స్ చదివేవాడిని. ప్రతి ఎడిషన్లో మొదటి పేజీల్లో ఇంగ్లిష్ కొటేషన్స్ ఉండేవి, అవి మాత్రం ఆసక్తిగా అన్నీ చదివి వాటిని అర్ధం చేసుకుని విశ్లేషించుకునేవాడిని.

గమ్మత్తుగా నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ లో ఇంటర్మీడియట్ చేస్తున్నపుడు నా హాస్టల్ అడ్రెస్ కి "రీడర్స్ డైజెస్ట్" పబ్లిషర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది, ప్రాంతాల వారీగా సెలెక్టెడ్ లిస్ట్ లో నా పేరు ఉందనీ, అందుకని నాకు డిస్కౌంటెడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాం అంటూ. చాలా థ్రిల్ తోఅయిపోయి డబ్బులు డ్రాఫ్ట్ ద్వారా కట్టి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను. అప్పుడు వాళ్ళకి నా పేరూ అడ్రెస్ ఎలా దొరికిందో తెలీదు. తర్వాతా చాలా యేళ్ళకి ఆలోచిస్తే తట్టింది. నా పేరు మీద నా పదవ తరగతి మార్కుల సర్టిఫికేట్ పెట్టి ఒక నార్త్ ఇండియన్ (నాకు ఫ్రెండ్ కూడా కాదు) IIT మెటీరియల్ ఫ్రీ గా తెప్పించుకున్నాడు. ఎక్కువ మార్కులు వచ్చిన  స్టూడెంట్స్ కి ఫ్రీగా IIT మెటీరియల్ ఇచ్చే ఒక కోచింగ్ సెంటర్ ఢిల్లీ లో ఉందనీ నాకు తెలీదు. కేవలం నా ద్వారా అది వాడుకోవటానికి మాత్రమే నా దగ్గరకి వచ్చి అడిగిన ఆ అబ్బాయికి "నో" చెప్పొచ్చనీ తెలీదు. తర్వాత ఆ అబ్బాయి ఆ మెటీరియల్ వచ్చాక నా దగ్గరి నుంచి తీసుకెళ్ళటం తప్ప, ఒక థ్యాంక్స్ గానీ, కనిపించినపుడు పలకరించటం కానీ లేకపోయినా, అలా కూడా అవకాశం తీసుకుంటారా అన్నదీ తెలీదు. అది తెలిసిన నా ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం నీ మార్కుల లిస్ట్ కాపీ అతనికి ఇవ్వకుండా ఉండాల్సింది అన్నారు. కొద్ది రోజులు మనసు భారంగా అనిపించింది. అప్పటి రోజుల్లో మన చుట్టూ ఉన్న సోషల్ (సామాజిక) వాతావరణం ఇలానే ఉండేది. బహుశా వాళ్ళ ద్వారా "రీడర్స్ డైజెస్ట్" కి నా అడ్రెస్  దొరికిందేమో.

అలా రీడర్స్ డైజెస్ట్ తో నా అనుబంధం ని గుర్తు చేస్తూ అందులో ఒక ఫొటో చూసి వేసింది ఈ బొమ్మ. ఇలా ఈ స్టైల్ లో అంత త్వరగా అప్పటిదాకా ఏ బొమ్మా వెయ్యలేదు. చక చకా ఉన్న కొద్దిపాటి స్కెచ్ పెన్నుల్తో కొద్ది నిమిషాల్లోనే గీశాను. గీశాక ఇలా కూడా బొమ్మలు గియ్యొచ్చా అనిపించింది. అప్పట్లో నేరుగా పెన్ తోనే ఎ బొమ్మ వేసినా ఎక్కువగా ఏ బొమ్మలోనూ డైమన్షన్స్ తప్పేవాడిని కాదు. కారణం తపన, ఫోకస్, ఆ వయసులో వేరే లెవల్లో ఉన్న ఆసక్తి లెవెల్స్, అవే కారణం. 

రంగులతో అలా పేపర్ మీద స్కెచ్చులతో మొదలయిన అనుభవాలు తర్వాత వాటర్ కలర్స్, అదీ దాటి క్యాన్వాస్ మీద ఆయిల్ దాకా వెళ్ళినా, అప్పటి బొమ్మల్లోని పూర్తి సంతృప్తి ఇప్పుడు కొరవైందా అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ, కాలంతో జీవితంలో ముందుకి నడిచే కొద్దీ వెనకటి కాలం అనుభవాలూ, గురుతులూ, తలపులూ ఇష్టంగా అనిపిస్తూ అపుడే చూసిన కొత్త వన్నె తగ్గని రంగుల అనుభూతుల్లా మనః ఫలకం పై ప్రతిబింబిస్తూనే ఉంటాయి...

"జ్ఞాపకాల రంగులు ఎన్నటికీ మాయవు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, September 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 24 . . .

క్రిస్టొఫర్ రీవ్ - సూపర్ మ్యాన్
Watercolors on Paper (8" x 11")

హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా. జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తుపెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా కూడా ఆ విజువల్స్, ఆ అద్భుతమైన చిత్రీకరణ అనుభూతి కోసం వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అప్పుడు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసే ప్రక్రియ ఉండేది కాదు. నా చిన్నప్పటి హైస్కూల్ డేస్ లో అయితే "బ్రూస్ లీ" కరాటే స్టిల్స్ ఉన్న నోట్ బుక్స్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పటికీ బాగా గుర్తుంది. బ్రూస్ లీ "ఎంటర్ ది డ్రాగన్" ప్రపంచ సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ వరసలో ముందుగా వచ్చిన "సూపర్ మ్యాన్" కూడా అంతగా పాపులర్ అయ్యింది. "బ్రూస్ లీ" అంతలా ప్రతిఒక్కరికీ చేరువ కాకపోయినా సూపర్ మ్యాన్ సినిమాలో హీరో "క్రిస్టొఫర్ రీవ్" పేరు చాలా మందికి బాగా గుర్తుండేలా. క్రిస్టొఫర్ రీవ్ సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న స్టిల్స్ నాకైతే పోర్ట్రెయిట్ డైమన్షన్స్ కి ఒక కొలమానంగా అనిపించేవి.

అప్పుడప్పుడే కొలిచి గీసినట్టు, అచ్చుగుద్దినట్టు తెలుగు సినిమా హీరో, హీరోయిన్ల పోర్ట్రెయిట్స్ పెన్సిల్ తో  వేస్తూ కొంచెం కొంచెం నాసిరకం వాటర్ రంగుల బిళ్ళలతో పెయింటింగ్స్ మొదలు పెట్టిన నా ఇంటర్మీడియట్ కాలేజి రోజులవి. ఏదో ఆదివారం దినపత్రికలో నాకు దొరికిన సూపర్ మ్యాన్ స్టిల్ ఇది. ఆంధ్ర లొయోలా కాలేజ్, విజయవాడ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సమ్మర్ శలవులకి "కావలి" వచ్చినపుడు వేసింది. పరీక్షలు కూడా రాసి ఇంటికి రావటంతో రెండు నెలలు ఖాళీ సమయం. బొమ్మలు వెయ్యటం, పత్రికలు తిరగెయ్యటం, నవలలు దొరికితే చదవటం, రోజూ పొద్దున కావలిలో ఉన్న మూడు లైబ్రరీ లకి వెళ్ళి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తిరగెయ్యటం, పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకెళ్ళి కాసేపు అక్కడ ప్రింట్ అవుతున్న మెటీరియల్స్, పాంప్లెట్స్, పెళ్ళి పత్రికలు గమనించటం, అప్పుడప్పుడూ సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్ళటం ఇవే శలవుల్లో నా వ్యాపకాలు. పొద్దున్నే లేచి రోజంతా ఈ వ్యాపకాలన్నీ చేసినా ఒక్కొకరోజు సాయంత్రం అయ్యేసరికి ఏమీ తోచేది కాదు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నేలమీద కూర్చుని ప్యాడ్ పెట్టుకుని బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాసిరకం వాటర్ కలర్ బిళ్ళల పెట్టె ఒకటి, అన్న కొన్నది ఇంట్లో వాడకుండా పడిఉండేది. వాడి విశ్వోదయ హై స్కూలులో ఆర్ట్ క్లాస్ కోసమని కొన్నది. నాకు పెన్సిల్ తో వెయటం బాగా వచ్చాక, పెన్ను తో కొంత కాలం బొమ్మలేశాక, రంగుల మీదికి మనసు మళ్ళింది. వాడక అలా పడున్న ఆ వాటర్ రంగుబిళ్ళల పెట్టె నేను వాడటం మొదలుపెట్టాను, ఒక డజను దాగా వాటితో చిన్న చిన్న వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశాను. వాటిల్లో ఈ "సూపర్ మ్యాన్" ఒకటి. రంగులు పేపర్ మీద వేస్తుంటే బాగా పాలిపోయినట్టుగా ఉండేవి . మిక్సింగ్ కి సరిగా సహకరించేవి కాదు. అయినా వాటిల్తోనే కొద్ది కాలం కుస్తీలు పట్టేవాడిని.

ఒక్కొకసారి ఏమీ తోచని నాకు తన స్కూల్ రికార్డ్స్ నన్ను రాయమని అమ్మ పని కల్పించేది. అమ్మ ఎప్పుడు అడిగినా రాయను అనకుండా శ్రద్ధగా అన్నీ రాసి పెట్టేవాడిని. అమ్మ కావలి "జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల" లో జూనియర్ అసిస్టంట్ గా, అంటే క్లర్క్ గా పని చేస్తుండేది. గర్ల్స్ హైస్కూల్ కి ఆనుకునే, పక్కన బాయ్స్ హైస్కూలు లో టీచర్ గా నాన్న పనిచేశారు. ఊహించని విధంగా మమ్మల్నీ ఈ లోకాన్నీ వీడి నాన్న పోయిన ఒక్క నెలకే అమ్మ జాబ్ లో చేరవలసిన పరిస్థితి ఎదురైంది. ధైర్యం చెప్పి అమ్మకి అన్నీ తనే అయ్యి మా తాతయ్య, అంటే అమ్మ నాన్న అమ్మతో తొలి అడుగులు వేయించారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అమ్మ ఉద్యోగం చెయ్యకపోతే మా మనుగడ చాలా కష్టం అయ్యేది. అమ్మ చదివిన పి.యు.సి (అంటే ఇంటర్మీడియట్) క్వాలిఫికేషన్ కి అమ్మకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గర్ల్స్ హై స్కూలు మొత్తానికి అమ్మ ఒకటే క్లర్క్, స్కూలు రికార్డ్స్, నెల నెలా జీతాలు, పరీక్షల ఫీజులు, మార్కుల లిస్టులు, అన్నీ అమ్మ ఒక్కటే చూసుకునేది. నెల మొదటి వారం జీతభత్యాల లెక్కలు రాసి స్టాఫ్ అందరికీ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే పని కూడా అమ్మదే. స్టూడెంట్స్ పరీక్షల ఫీజులు కట్టించుకుని ఆ డబ్బులు బ్యాంక్ లో వెళ్ళి జమ చేసే పనీ అమ్మదే. ఇలా నెల మొత్తం చాలా పని ఉండేది. పెళ్ళయ్యాక గృహిణిగా ఉంటూ ఇల్లు, సంసారం నాన్ననీ మమ్మల్నీ చూసుకుంటున్న అమ్మకి ఒక్క సారిగా జాబ్ చెయ్యాటానికి కావలసిన చదువున్నా ఆ పని బొత్తిగా తెలీదు, అనుభవం లేదు. స్కూల్ లో క్లరికల్, రికార్డ్స్ పని అస్సలు తెలీదు. ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలలు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ అమ్మకి ఎంతో ధైర్యం చెప్పి చాలా సపోర్టివ్ గా ఉండి నేర్పించింది అని అమ్మ చెప్పేది.

శలవులకి నేను వచ్చినపుడల్లా ఆ రికార్డులు రాసే పని కొంతవరకూ నేనూ చేసిపెట్టేవాడిని. ఒక్కొక నెల పని భారంతో అమ్మ పడే టెన్షన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి. పొద్దున 5 గంటలకి ముందే నిద్రలేచి కసువూ, కళ్ళాపి, ముగ్గుల పనులు ముగించి పాలు తీసుకుని రావటం, ఇంటి ఎదురుగా మున్సిపల్ కుళాయి దగ్గర బిందె లైన్లో పెట్టి నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం, రోజుకి సరిపడా నీళ్ళు పట్టి తొట్టెలకీ, బకెట్లకీ పోసిపెట్టటం, మాకు కాఫీలు, టిఫెన్లూ చేసి పెట్టటం, అంట్లు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, మాకు మధ్యాహ్నానికి అన్నం, పచ్చడీ, కూరా వండి, అన్నీ వంటింట్లో సర్ది పెట్టి, తయారయ్యి తొమ్మిది గంటలకల్లా ఇంటికి తెచ్చుకున్న రికార్డు బుక్కులన్నీ పట్టుకుని నడచి స్కూలు కి వెళ్ళటం...ఇది రోజూ అమ్మ పొద్దున పని. ఆ పనుల్లో బయల్దేరే టైమ్ కొద్దిగా ఆలశ్యం అయితే పడే టెన్షన్ చాలా ఉండేది. అలాగే లంచ్ టైమ్ ఎర్రటి ఎండలో నడచుకుంటూ ఇంటికి వచ్చి గబగబా మాకు భోజనాలు పెట్టి, తనూ తిని స్కూలుకి పరుగులు పెట్టటం. సాయంత్రం నాలుగున్నరకి రాగానే బిందె పట్టుకుని నీళ్ళకోసం వెళ్ళటం, చీకటి పడే వేళకి మళ్ళీ వంటా, వార్పూ, పనులతో అలా అలసిపోతున్నా అలసట తెలియని మిషన్ లా తిరిగి తిరిగి అరిగిపోతూ కరిగిపోయిన కాలం తాలూకు రోజులవి.

ఇప్పటికీ గుర్తుంది, ఆ సంవత్సరం సమ్మర్లో నేనే ఒక నెల రికార్డులు అన్నీ రాసి పెట్టాను. వాటిల్లో సంతకాలు పెడుతూ హెడ్మిస్ట్రెస్ చూసి చాలా మెచ్చుకున్నారంట. నా చేతివ్రాత గుండ్రంగా ఉండేది. "విజయలక్ష్మీ ఎవరు రాశారు ఈ నెల రికార్డ్స్?" అని హెడ్మిస్ట్రెస్ అడిగితే, "మా చిన్నబ్బాయి గిరి, కాలేజి నుంచి శలవులకొచ్చాడు" అని చెప్పిందంట. సమ్మర్ లో స్కూలుకి శలవులు, అయినా అమ్మకి మాత్రం నెల మొదటివారం, చివరివారం రికార్డుల పని ఉండేది. అలా సమ్మర్ శలవుల్లో స్టాఫ్ అంతా పని చేయ్యకున్నా జీతాలు ఇవ్వాలి, క్లరికల్ పని తప్పదు కాబట్టి అమ్మకి సమ్మర్ శలవుల్లో నెల జీతంతో బాటు స్పెషల్ గా మరో 20 రూపాయలు వచ్చేది. ఆ సంవత్సరం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ ఆ స్పెషల్ డబ్బులు అమ్మకి ఇస్తూ "ఈ 20 రూపాయలు మాత్రం మీ చిన్నబ్బాయికి ఇవ్వు" అని చెప్పిందంట. అమ్మ వచ్చి ఎంతో సంతోషంగా నాకు చెప్తే నేనూ ఎంతగానో పొంగిపోయాను. ఆ డబ్బులు నేను తీసుకోలేదు కానీ, ఒక రకంగా నా మొదటి సంపాదన అని చెప్పుకోవాలంటే మాత్రం అమ్మ కష్టార్జితంలో నా వంతుగా నేను సాయం చేసి సంపాదిచిన మొదటి సంపాదన అదే. అదే శలవుల్లో అమ్మతో ఒకసారి పొద్దున్నే తోడుగా స్కూలుకి వెళ్ళి ఒక రెండు గంటలు నేనూ అన్నా ఇద్దరం అక్కడ ఉన్నాం. అప్పుడు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ రూముకి అమ్మ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. నా గురించి, నా చదువు గురించీ హెడ్మిస్ట్రెస్ అడిగి తెలుసుకుంది. తర్వాత అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా గురించి కూడా చెప్పిందని అమ్మ చెబితే గుర్తుంది. సరిగ్గా పదేళ్ళ తర్వాత మొదటిసారి నేను TCS లో జాబ్ చేస్తూ లండన్ వెళ్ళినపుడు అమ్మ స్కూల్ లో ఆ విషయం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి చెప్తే చాలా సంతోషపడిందని, వాళ్ళ స్టాఫ్ అందరికీ "విజయలక్స్మి చూడండి పిల్లల్ని ఎంత గొప్పగా చదివించి వృద్ధిలోకి తెచ్చిందో" అంటూ చెప్పిందని తెలిసి నేనూ చాలా పొంగి పోయాను. మా చెల్లెలు లక్ష్మి కూడా అదే స్కూలు లో చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆటల్లో, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ అన్నీ తనకే వచ్చేవి. అలా మా గురించీ, అప్పటి మా ఫ్యామిలీ పరిస్థితి గురించీ బాగా తెలిసిన వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి, అమ్మంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 

ఈ బొమ్మలో కనిపించే "సూపర్ మ్యాన్" ఆ సినిమాలో సాదా సీదా మనిషే. కానీ తన ఎదురుగా ఏదైనా విపత్తు వస్తే అనుకోకుండా దివ్య శక్తి వచ్చి అతన్ని సూపర్ మ్యాన్ గా మార్చేస్తుంది. నయాగారా జలపాతంలో పడిపోతున్న చిన్న పిల్లని సైతం అందరూ అశ్చర్యంగా చూస్తుండగా గాలిలో ఎగురుతూ వెళ్ళి రక్షించి తీసుకుని వస్తాడు. ఇలా ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలిగించే సాహసాలు చేస్తుంటాడు. మా జీవితాల్లో అమ్మ నిత్యం చిన్న పిల్లలమైన మాకోసం మా కళ్ళ ఎదుటే రోజూ జీవితంతోనే సాహసాలు చేసింది. సినిమా మూడు గంటలే కాబట్టి ఆ సాహసం ఫలితం వెంటనే కనబడేలా తియ్యాలి. నిజ జీవితంలో ఇలాంటి అమ్మలు చేసే సాహసాల ఫలితాలు పిల్లలు పెద్దయ్యి ఎదిగి వృద్ధిలోకి వచ్చాక మాత్రమే కనిపిస్తాయి.

ఏ శక్తీ అండగా లేకున్నా సరే ఒంటరిగా జీవితంతో పోరాటం చేసి పిల్లల జీవితాల్ని తీర్చిదిద్ది వాళ్ళని గెలిపించి తను గెలిచే ప్రతి అమ్మ ఒక సూపర్ వుమన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే అదృశ్య శక్తులూ, దివ్య శక్తులూ తోడవ్వాలేమో. సూపర్ అమ్మ అవ్వాలంటే ఏ శక్తీ తోడు అవసరం లేదు. భూమిపై అమ్మ సూపర్ మ్యాన్ ని మించిన పెద్ద సూపర్ శక్తి...

"మానవాళికి దేవుడిచ్చిన దివ్య శక్తి అమ్మ."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, July 2, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 ...

 
Portrait of the First Female Indian Prime Minister - Smt. Indira Gandhi
Ballpoint pen on paper 8" x 9"

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 9                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 11 -->
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్ గా, ఇంగ్లీష్, సంస్కృతం లాంగ్వేజెస్ గా ఇంటర్మీడియట్ (11th & 12th Grade) విజయవాడ "ఆంధ్ర లొయోలా కాలేజి" లో ఉత్సాహంగా చేరా. అప్పట్లో లొయోలా కాలేజి లో సీట్ రావటం కష్టం. పదవ తరగతిలో చాలా మంచి మార్కులు తెచ్చుకోవటంతో, నాన్ లోకల్ అయినా నాకు  సులభంగా నే సీట్ వచ్చింది, చేరిపోయాను. ఆ కాలేజి లో చదివింది రెండేళ్ళే. కాలేజి ఆఫర్ చేయ్యని ఇంకో సబ్జెక్ట్ లో కూడా అక్కడ నాకు నేనుగా చేరిపోయాను. అదే "ఆర్ట్ సబ్జెక్ట్". చదవే మూడ్ లేని, ఏమీ తోచని సమయాల్లో ఒక్కడినే "గోగినేని హాస్టల్ రూమ్" లో కూర్చుని "ఆర్ట్ సబ్జెక్ట్" లో దూరి బొమ్మలు వేసుకునేవాడిని. ఆ రెండు సంవత్సరాల్లో అలా ఒక పదీ పన్నెండు దాకా బొమ్మలు వేసి ఉంటానేమో. ఆ బొమ్మల్లో అప్పుడావయసుకుకి నైపుణ్యం చాలానే ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. వేసిన బొమ్మలన్నీ పుస్తకాల్లోనే దాగి భద్రంగా ఉండేవి. బొమ్మలన్నీ ఒకదగ్గర చేర్చిపెట్టుకునే ఫైల్ లాంటిదేదీ ఉండేదికాదు. కొన్ని అప్పటి పుస్తకాల్లోనే ఉండిపోయి వాటితో పోగొట్టుకున్నాను. అయినా వేసిన ప్రతి బొమ్మా గుర్తుందింకా. అప్పుడు వేసిన బొమ్మల్లో ప్రముఖమైంది ఈ అప్పటి భారత ప్రధాని "శ్రీమతి ఇందిరా గాంధి" గారిది.

గతం లోకి - 1983-85, విజయవాడ "ఆంధ్ర లొయోలా కాలేజి"

గుణదల "మేరీమాత" కొండల క్రింద, ఆహ్లాదంగా ఎటుచూసినా పచ్చదనం, అత్యుత్తమమైన క్లాస్ రూమ్ లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆట స్థలాలతో అందమైన క్యాంపస్. ప్రవేశం పొందగలిగే ప్రతి హాస్టలర్‌ కు సింగిల్ రూములతో ఉత్తమ కళాశాల భవనాలు. కాలేజీలో అడ్మిషన్ పొందడం ఎంత కష్టమో, హాస్టల్‌లో అడ్మిషన్ పొందడం కూడా అంతే కష్టం. ఓవల్ ఆకారంలో ఉన్న మూడంతస్తుల హాస్టల్ భవనాలు, ఒక్కో అంతస్తులో వంద చొప్పున మొత్తం మూడొందల సింగిల్ రూమ్ లు అన్ని రకాల సౌకర్యాలను కలిగి, సెంటర్ గార్డెన్‌లు, రుచికరమైన ఆంధ్ర ఫుడ్ వండి వడ్డించే విశాలమైన డైనింగ్ హాళ్లు ఉండేవి.

అక్కడి లెక్చరర్స్ కూడా వాళ్ళ సబ్జక్ట్స్ లో నిష్ణాతులు, కొందరు టెక్స్ట్ బుక్స్ ఆథర్స్ కూడా. అలా ఆ కళాశాల విద్యార్థులకు ఉత్తమమైన క్యాంపస్ అనుభవాన్ని అందించి ఇచ్చింది. వాస్తవానికి, మధ్యతరగతి కుటుంబాలకు ఆ కాలేజ్ లో చదవటం ఆర్ధికంగా అప్పట్లో చాలా భారం. కానీ మా అమ్మ "కావలి" లో గర్ల్స్ హైస్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తూ వచ్చే కొద్దిపాటి జీతంలో సగానికి పైగా నా నెలవారీ హాస్టల్ బిల్లుకే పంపించేది. అక్కడి క్రమశిక్షణ కూడా అంత ఉత్తమంగానే ఉండేది. హిందీ, ఇంగ్లీషు మాట్లాడే నార్త్ ఇండియా నుంచి వచ్చిన విద్యార్థులే సగం మంది ఉండేవాళ్ళు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జక్ట్స్ లో పర్ఫెక్ట్ స్కోర్లు సాధించాలనే ఒత్తిడి చాలా ఉండేది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి రావడం తో నాలాంటి విద్యార్థులపై అది మరింత ఎక్కువగా ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకునేందుకు మంచి స్నేహితులు ఇద్దరు ఎప్పుడూ పక్కనే ఉన్నా, అప్పుడప్పుడూ ఒంటరిగా హాస్టల్ రూమ్ లో ఉన్నపుడు నాకు నాతో తోడై ఉండే నేస్తాలు "నా బొమ్మలు".

నా కొత్త డ్రాయింగ్ నేస్తం - బాల్‌పాయింట్ పెన్

ఎక్కడ ఉన్నా బొమ్మలు గీయటం మానని నాకు "ఆంధ్ర లయోలా కాలేజి" క్యాంపస్‌లోనూ బొమ్మల జ్ఞాపకాలున్నాయి. నా బొమ్మల్లో గీతలు అక్కడే చాలా మెరుగయ్యాయి. అప్పటిదాకా పెన్సిల్ తో బొమ్మలేసే నేను, ఇంకొకడుగు ముందుకేసి బాల్ పాయింట్ పెన్ను తో వెయటం మొదలు పెట్టాను. పెన్సిల్ లా చెరపటం కుదరదు కాబట్టి ప్రతి గీతా ఖచ్చితంగా అనుకున్నట్టే పడి తీరాలి. అంటే ఎంతో ఓపికా, నేర్పూ కావాలి.

శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ, భారత ప్రధాని

అప్పటి ఆ జ్ఞాపకాలని గుర్తుచేస్తూ మనసు తలుపులు తట్టే నా బాల్ పాయింట్ పెన్ను బొమ్మ భారత ప్రధాని "శ్రీమతి ఇందిరా గాంధీ" గారిది. నేను ఆ కాలేజి లో ఉన్నపుడే అక్టోబర్ 1984 లో హత్యకు గురయ్యారు. ఒకటి రెండు రోజులు క్లాసులు లేవు, హాస్టల్ నుంచి కూడా మమ్మల్ని బయటికి రానివ్వలేదు. విజయవాడ లో సిక్కులు కొంచెం ఎక్కువగానే ఉండేవాళ్ళు, మా కాలేజి లో కూడా స్టూడెంట్స్ ఉండడంతో హై అలర్ట్‌ ప్రభావం మా కాలేజి క్యాంపస్ లోనూ ఉండింది కొద్ది రోజులు.

ఆ దురదృష్టకర సంఘటన తర్వాత కొన్ని నెలలపాటు ప్రతి పత్రిక ముఖ చిత్రం పైనా "ఇందిరా గాంధి" గారి ఫొటోనే ఉండింది. ఆ సంవత్సరం సంక్రాంతి శలవులకు "కావలి" ఇంటికి వచ్చినప్పుడు మా పక్కింటి కల్లయ్య మామ దగ్గర "న్యూస్ వీక్ (ఇంగ్లీషు)" వారపత్రిక ఉంటే చదవాలని తీసుకున్నాను. కవర్ పేజీ పై "ఇందిరా గాంధి" గారి ఫొటో చూసి, ఆమె బొమ్మ వెయ్యాలనిపించింది. ఆ పోర్ట్రెయిట్ ఫొటో చాలా ఆర్టిస్టిక్ గా అనిపించింది. ఆ ముఖచిత్రం ఆధారంగా వేసిందే ఈ బొమ్మ. ఇవన్నీ ఆ బొమ్మ వెనకున్న జ్ఞాపకాలు. అయితే ఈ బొమ్మ చూసినప్పుడల్లా ఇప్పటికీ గుర్తుకొచ్చే మర్చిపోలేని జ్ఞాపకం ఇంకొకటుంది. 

నా చేతుల్లోనే ముక్కలై చిరిగి పోయిన పూర్తికాని అదే "ఇందిరా గాంధి" గారి బొమ్మ

వేసిన ప్రతి చిన్న బొమ్మనీ ఎంతో భద్రంగా చూసుకుంటూ దాచుకునే అలవాటు చిన్నప్పటినుంచీ ఉంది. మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడిని. అప్పటి నా అతిచిన్న లోకంలో నా బొమ్మలే నా ఆస్తులూ, నా నేస్తాలూ.

ఈ బొమ్మ నాకెంతో సంతృప్తిని ఇచ్చినా ఎందుకో కొంచెం అసంతృప్తి మాత్రం ఉండిపోయింది. కారణం, ఏదో సాదా సీదా నాసిరకం నోట్ బుక్ పేపర్ మీద క్యాజువల్ గా మొదలు పెట్టి పూర్తి చేసేశాను. అక్కడక్కడా నేను వేస్తున్నపుడే గుర్తించినా సరిదిద్దలేని కొన్ని లోపాలు ఉండిపోయాయి. మొదటిసారి బ్లాక్ అండ్ రెడ్ రెండు బాల్ పాయింట్ పెన్స్ తో ప్రయోగాత్మకంగా వేసినా, బానే ఉంది అనిపించినా, ఎందుకో ఇంకాస్త పెద్దదిగా జస్ట్ బ్లాక్ పెన్ తో వేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తూఉండేది, చూసిన ప్రతిసారీ. కానీ వేసిన బొమ్మని మళ్ళీ రిపీట్ చెయ్యాలంటే ఏ ఆర్టిస్ట్ కి అయినా చాలా కష్టం. అలా వేద్దామా వద్దా అన్న సందిగ్ధానికి ఒకరోజు మా పెద్దమామయ్య "ప్రజ" (ప్రభాకర్ జలదంకి) ప్రోత్సాహం తోడయ్యింది. ఈ బొమ్మ చూసి "అబ్బా గిరీ ఏం వేశావ్ రా. ఇది గాని "పెండెం సోడా ఫ్యాక్టరీ" (కావలి సెంటర్ లో చాలా పేరున్న ఇంకెక్కడా అలాంటి సోడా, సుగంధ పాల్ దొరకని ఏకైక షాప్) ఓనర్ కి ఇస్తే (ఓనర్ పేరు తెలీదు) ఫ్రేం కట్టించి షాప్ లో పెట్టుకుంటాడు. వాళ్ళకి నెహ్రూ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. కావలి టౌన్ మొత్తం నీ బొమ్మని చూస్తారు." అంటూ వాళ్ళకిద్దామని అడిగేవాడు. కష్టపడి వేసిన బొమ్మ ఇవ్వాలంటే నాకు మనస్కరించలా. అయినా మళ్ళీ మళ్ళీ అడిగేవాడు - "నువు నీ బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే ఏం వస్తుంది రా? వాళ్ళకిస్తే అందరూ చూసి నీ బొమ్మని మెచ్చుకుంటారు. అంతా ఎవర్రా ఈ గిరి అని మాట్లాడుకుంటారు." అని ఇంత గొప్పగా చెప్పేసరికి నేనూ ఆ ఆలోచనతో చాలా థ్రిల్ అయ్యాను, నా ఆర్ట్ వర్క్ "టాక్ ఆఫ్ ది టౌన్" అవుతుందని ఊహించి సంతోషించాను. అయినా సరే, ఇది మాత్రం ససేమిరా ఇవ్వదల్చుకోలేదు.

సరే ఎలాగూ లోపాలేవీ లేకుండా ఇంకోటీ వేద్దామా అని అనుకుంటున్నా, వేసి అదే ఇద్దాంలే అనుకుని ఈసారి అనుకున్నట్టే పెద్ద సైజ్ చార్ట్ పేపర్ (డ్రాయింగ్ పేపర్) పై ముందుగానే పెన్సిల్ తో సరిదిద్దుకుంటూ లోపాలు లేకుండా స్కెచ్ వేసుకుని, తర్వాత బాల్ పాయింట్ పెన్ తో అసలు బొమ్మ వేస్తూ ఫినిష్ చెయటం మొదలు పెట్టాను. పోర్ట్రెయిట్ లలో హెయిర్ వెయ్యటం అంటే నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది మొదటి నుంచీ. మొదట వేసిన ఈ బొమ్మ క్యాజువల్ గా మొదలెట్టి పూర్తి చేసింది గనుక హెయిర్ మీద అంత శ్రద్ధ పెట్టినట్టు అనిపించదు. కానీ రెండవసారి వేస్తున్న బొమ్మ మాత్రం లో హెయిర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వేశాను. ప్రతి గీతా ఎంతో ఫోకస్ తో చిన్న లోపం కూడా లేకుండా వేసుకుంటూ తల పైభాగం పూర్తి చేసి, ముఖం పైనుంచి కిందికి ముక్కు దాకా సగ భాగం పూర్తి చేశాను. మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం గర్వంగానూ అనిపించేది, బాగా చాలా వేస్తున్నానని.

అలా ఉదయాన్నే ప్రతిరోజులానే అమ్మ, తను అప్పట్లో పనిచేస్తున్న "గర్ల్స్ హైస్కూల్" కీ, అన్నేమో బజారుకీ వెళ్ళటంతో ఒక్కడినే ముందు వరండాలో దీక్షగా కూర్చుని బొమ్మ వేస్తూ ఉన్నా. బహుశా అప్పటిదాకా ఒక నాలుగు గంటలు కూర్చుని వేస్తూ ఉన్నాను. ఇంతలో అన్న తన ఫ్రెండ్ "సంజీవ రెడ్డి" తో కలిసి ఇంటికి వచ్చాడు. సంజీవ్ ఈ లోకంలో ఏదైనా ఇట్టే మాటల్లో చేసిపారెయ్యగల గొప్ప మాటకారి. వచ్చీ రాగానే వేస్తున్న నా బొమ్మ చూసి మొదలుపెట్టాడు. "ఏం గిర్యా...నేంగూడా...చిన్నపుడు బొమ్మలు బలే ఏసేవోడ్నయా...ఇప్పుడు కొంచెం తప్పొయిందిగాన్యా... కూసున్నాంటే...యేశాస్తా ఎంత పెద్ద బొమ్మైనా...అంతే" ఇలా మాటలలోకం లో మమ్మల్ని తిప్పుతూ పోతున్నాడు. నాకేమో దీక్షగా కూర్చుని వేసుకుంటుంటే వచ్చి వేసుకోనీకుండా ఆపి ఆ మాటల కోటలు చుట్టూ తిప్పుతుంటే, తిరగాలంటే కొంచెం అసహనంగానే ఉన్నా, గబుక్కున మంచినీళ్ళు తాగొద్దమని లేచి రెండు నిమిషాలు గీస్తున్న బొమ్మ పక్కన బెట్టి లోపలికెళ్ళా. వచ్చి చూసే సరికి చూసి షాక్ తిన్నా. నాకింక ఏడుపొక్కటే తక్కువ. అలా నేనక్కడ లేని ఆ రెండు నిమిషాల్లో కూర్చుని ఇంకా వెయ్యాల్సిన ముఖం కింది భాగం పెన్సిల్ అవుట్ లైన్ మీద, పెన్ను తో వంకర టింకర బండ లావు లావు గీతలు చెక్కుతూ ఉన్నాడు. నన్ను చూసి "ఏం గిర్యా...ఎట్టేశా...చూడు...నీ అంత టైం పట్టదులేవయా నాకా...బొమ్మెయటానిక్యా... మనవంతా...శానా ఫాస్టులే..." అంటూ ఇంకా పిచ్చి గీతలు బరుకుతూనే ఉన్నాడు. నా గుండె ఒక్కసారిగా చెరువై కన్నీళ్లతో నిండిపోయింది. కష్టపడి ఒక్కొక్క గీతా శ్రద్ధగా గీస్తూ నిర్మిస్తున్న ఆశల సౌధం కళ్లముందే ఒక్కసారిగా కూలిపోయింది. అకస్మాత్తుగా ఆశల వెలుగు శిఖరం పైనుంచి చీకటి అగాధంలో నిరాశ లోయల్లోకి బలవంతంగా తోసేసినట్టనిపించింది. కానీ అన్న ఫ్రెండ్, నా కోపమో, బాధో వెళ్ళగక్కేంత ఇదీ లేదు. మౌనంగా  లోపలే రోదిస్తూ ఆ క్షణాల్ని దిగమింగక తప్పలేదు.

తర్వాత అమ్మ ఇంటికి వచ్చాక అమ్మకి చూపించి కష్టపడి వేసుకుంటున్న బొమ్మని పాడుచేశాడని ఏడ్చా. కన్నీళ్లతో నిండిన బాధా, కోపంతో ఆ బొమ్మని ముక్కలుగా చించి పడేశా. అప్పట్లో ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో నా కోపం అమ్మ మీద, అన్నం మీద చూపెట్టేవాడిని. అలిగి అన్నం తినటం మానేసే వాడిని. ఎంత మొరపెట్టుకున్నా అమ్మ మాత్రం ఏం చెయ్యగలదు. "సంజీవ్ వస్తే నేను అడుగుతాన్లే. మళ్ళీ వేసుకుందువులే నాయనా." అంటూ నన్ను ఓదార్చటం తప్ప. అయితే అన్నకి మాత్రం అమ్మ తిట్లు పడ్డాయ్, ఫ్రెండ్స్ తో తిరుగుడ్లు ఎక్కువయ్యాయని, ఆ టైమ్ లో ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చాడనీ. అయినా అన్న మాత్రం ఏం చేస్తాడు పాపం. వాడూ జరిగినదానికి బాధ పడ్డాడు. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు మాత్రం చాలా రోజులు పట్టింది. అసలు ఉన్నట్టుండి వేస్తున్న బొమ్మ వదిలి ఎందుకు లేచి లోపలికెళ్ళానా, వెళ్ళకుండా ఉంటే అలా జరిగేదికాదని తల్చుకుని తల్చుకుని మరీ బాధపడ్డ క్షణాలెన్నో...

రెండవసారి అదే "ఇందిరా గాంధి" గారి బొమ్మ కష్టం అనిపించినా "కావలి టాక్ ఆఫ్ ది టవున్" అవుతుందన్న ఆశతో మొదలుపెట్టా. మళ్ళీ మూడవసారి వేద్దామా అన్న ఆలోచన మాత్రం అస్సలు రాలా. మొదటేసిన ఈ బొమ్మని మాత్రం పెద్దమామయ్య అడిగినట్టు "పెండెం సోడా ఫ్యాక్టరీ" వాళ్ళకి ఇవ్వదల్చుకోలా. ఏదేమైనా "టాక్ ఆఫ్ ది టవున్" అవుతాననుకున్న చిన్న మెరుపులాంటి చిగురాశ అలా మెరిసినట్టే మెరిసి చటుక్కున మాయమయ్యింది. అలా నేనేసిన ఒకేఒక్క "ఇందిరా గాంధి" గారి బొమ్మగా నా బొమ్మల్లో ఇప్పటికీ నా దగ్గర భద్రంగానే ఉంది, చూసిన ప్రతిసారీ ఆ జ్ఞాపకాల్నీ, ఇంకా బాగా వెయ్యాలని పడ్ద తపననీ, ఆ కష్టాన్నీ, తెచ్చిన రవ్వంత చిగురాశనీ, వెన్నంటే వచ్చిన కొండంత నిరాశనీ గుర్తుకి చేస్తూ...

"ప్రతి బొమ్మ వెనుకా ఖచ్చితంగా ఓ కథ ఉంటుంది, కొన్ని బొమ్మల్లో చిత్రకారుడి కన్నీటి చుక్కలూ దాగుంటాయి."
~ గిరిధర్ పొట్టేపాళెం

Saturday, June 3, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 9 ...

The beautiful Divya Bharati - 1993
Ballpoint Pen on Paper (8.5" x 11")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 8                                                          నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 -->

దివ్య భారతి - ఒక్క పేరులోనే కాదు ఆమె అందం లోనూ దివ్యం ఉండేది, చూడ చక్కని రూపం. వెండి తెరపై అతికొద్ది కాలంలోనే దివ్యమైన వెలుగు వెలిగి 19 ఏళ్ళకే చుక్కల్లోకెగసిన తార. ఇప్పుడెందరికి గుర్తుందో, 1990 దశకంలో అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో వెండితెరపైకి స్పీడుగా దూసుకొచ్చిన సి(నీ)తార. వచ్చినంత స్పీడుగానే జీవితం తెరపై నుంచీ నిష్క్రమించింది. అప్పటి వార్తాపత్రికల్లో  ఆ(మె) ఆకస్మిక నిష్క్రమణంకి అనేక కథనాలు కూడా రాశారు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు. ప్రింట్ అయి చేతికందిందే న్యూస్. న్యూస్ పేపర్ లో రాసి నమ్మిస్తే ఏదైనా నమ్మక తప్పదంతే!

కాలచక్రంలో ముప్పై ఏళ్ళు వెనక్కి  - 1993...

"దివ్య భారతి" ని సినిమాల్లో చూసిన ఎవ్వరూ జీర్ణించుకోలేని "ఆమె ఇకలేరు" అన్న వార్త - ఆ బాధాకరమైన వార్త తర్వాతి రోజు సాయంత్రం హైదరాబాద్‌ TCS ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి, "డక్కన్ క్రానికల్" దినపత్రిక, ఈవెనింగ్ ఎడిషన్‌లో ఆమె గురించి ప్రచురితమైన శీర్షికాకథనం చదువుతూ, మా రూమ్‌మేట్స్ అందరం ఆమె గురించి మాట్లాడుకోవడం ఇంకా గుర్తుంది. "అయ్యో, She is still young!" అని అందరం బాధపడ్డాం. ఆ శీర్షికలో అచ్చయిన "దివ్య భారతి" బ్లాక్ అండ్ వైట్ ఫొటో చూసి స్ట్రెయిట్ బాల్ పాయింట్ పెన్ తో వేసిన లైఫ్ (లైన్) స్కెచ్ ఇది.

చాలా క్యాజువల్ గా పేపర్ లో ఫొటో చూడగనే అప్పటికప్పుడు నా పుస్తకాలపై దొరికిన కంప్యూటర్ ప్రింటవుట్ కి వాడిన పేపర్. ఒక వైపు నా Resume ప్రింట్ కూడా అయ్యుంది. న్యూస్ పేపర్ చూస్తూ పెన్ తీసుకుని కొద్ది నిమిషాల్లో ఆ పేపర్ వెనుకవైపు వేసిన ఈ బొమ్మ నా బొమ్మల్లో అన్ని విధాలా ఎప్పటికీ ప్రత్యేకమే.

ఒక్కొకసారి ఆ క్షణంలోనే బొమ్మ వేసెయ్యాలన్న 'స్పార్క్' లాంటి కోరికకి కార్యరూపం ఇస్తే ఫలితం చాలావరకూ అద్భుతంగానే ఉంటుంది. ఒక్కొకసారి అలాంటి ఆ 'స్పార్క్' ని ఆ క్షణంలోనే పట్టుకుని మరికొద్ది క్షణాల్లో కార్యరూపం దాల్చి అది జరగకపోతే ఆ పని ఇంకెప్పటికీ జరగదు. అలాంటి క్షణాన్ని జారిపోకుండా పట్టుకుని వేసిన బొమ్మే ఈ "దివ్యమైన దివ్య భారతి" బొమ్మ. సహజంగా అలాంటి ఆ క్షణాల్లో నైపుణ్యం మరియు ఏకాగ్రత స్థాయిలు రెండూ ఉత్తమోత్తమంగా ఉంటాయి. ఆర్ట్ లో ఉన్న ప్రత్యేక మహత్యం ఏంటంటే గీసిన బొమ్మలో లేదా వేసిన పెయింటింగ్ లో ఫొటో లో కన్నా అందంగా ఉంటారు, అందులోని వ్యక్తులు. అదే ఆర్ట్ లోనూ, ఆర్టిస్టుల్లోనూ ఉన్న ప్రత్యేకత. చాలా క్యాజువల్ గా వేసిన ఈ బొమ్మలోనూ ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. అలా అప్పటికప్పుడు అనుకుని నేను వేసిన కొద్దిపాటి బొమ్మల్లో ఇదీ ఒకటి.

మామూలుగా అప్పటిదాకా బాల్ పాయింట్ పెన్ తో వేసిన  లైన్ స్కెచెస్ అన్నీ బ్లాక్ కలర్ తో వేసినవే. బ్లూ, గ్రీన్ కలర్ బాల్ పాయింట్ పెన్స్ తో వేసిన బొమ్మలు తక్కువే. బహుశా రెడ్ తో వేసిన రెండు మూడు బొమ్మల్లో అప్పటికి ఇది ఒకటి. తర్వాత experiment కోసం రెడ్ బాల్ పాయింట్ పెన్ తో మరికొన్ని వేశాను.

ఈ బొమ్మ వేసిన క్షణాలు ఇంకా బొమ్మలో అలా పదిలంగానే ఉన్నా, ఇప్పుడు పరీక్షించి చూస్తే అప్పుడు ఉన్న లైన్ స్ట్రోక్స్ లో స్పీడు కనిపిస్తుంది. ఆ స్పీడులో ఉన్న కాన్‌ఫిడెన్సూ కనిపిస్తుంది. బొమ్మలో సంతకం మాత్రం ఎప్పుడూ ఇంకా స్పీడుగానే పెట్టేవాడిని. కానీ ఈ బొమ్మలో గీతల్లోని స్ట్రోక్స్ అన్నీ అంతే స్పీడులో ఉండటం విశేషం.

ఆఫీస్ నుంచి వచ్చి బొమ్మ వేసిన ఆ సాయంత్రం ఇంకా గుర్తుంది. బొమ్మ గబ గబా పూర్తి చేసి, అయ్యాక ఫ్రెండ్స్ అందరం కలిసి నడుచుకుంటూ అప్పుడపుడూ వెళ్ళే "నాచారం" చెరువు ఆనుకుని కొత్తగా కట్టిన "వెంకటేశ్వర టెంపుల్" కి వెళ్ళాం. పూర్తి చేసిన  బొమ్మ ఇచ్చే సంతృప్తి లోంచి ఆర్టిస్ట్ అంత త్వరగా బయటికి రా(లే)డు. ఆ రోజు నేనూ అందులోంచి బయటికి రాలేకపోయాను. ఒకవైపు బొమ్మ వేసిన సంతృప్తిలో ఉన్నా, ఆమె ఆత్మ శాంతించాలని ఆ దేవుని ఎదుట నే కోరుకున్నా.

జీవితం అంటేనే రకరకాల సంఘటనల మిళితం. ఏ సంఘటనా ఎప్పుడూ చెప్పి రాదు. కొన్ని మనం అనుకున్నట్టే అవుతాయి, కొన్ని మనం ఎంతగా అనుకున్నా, ప్రయత్నించినా అవవు. కొన్ని జరిగిన సంఘటనలు అసలు చాలా గుర్తుకూడా ఉండవు. గుర్తున్నాయి అంటే ఆ క్షణాల్లో మనం జీవించి ఉన్నట్టే లెక్క. లేదంటే అప్పుడు జస్ట్ బ్రతికున్నాం అంతే. ఒక సినిమా పాటలో ఓ కవి రాసినట్టు "ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం...". పూర్తి కాలం జీవించినా చిన్నదే అనిపించేది జీవితం, కొందరికది చాలా ముందుగానే ముగిసి ఇంకా చిన్నదే అవుతుంది. చిన్నదే అయినా తళుక్కున మెరిసి వెళ్ళి పోయే తోకచుక్కలా కొందరు ప్రత్యేకంగా అలా వచ్చి మెరిసి వెళ్ళిపోతారు. అలా తళుక్కున మెరిసి రాలిన తారే "దివ్య భారతి". ఆ సాయంత్రం ఆమె బొమ్మ వెయ్యకపోయిఉంటే ఎప్పటికీ నా బొమ్మల్లో ఆమెకి స్థానం వచ్చి ఉండేది కాదు.

ఈ బొమ్మ వేసిన క్షణాలూ, అందులోని "దివ్యభారతి" జీవితం లా స్పీడుగా తక్కువే అయినా, నా బొమ్మల్లో ఈ బొమ్మ చూసిన ప్రతిసారీ ప్రత్యేకంగా ఆ సాయంత్రాన్ని, అప్పటి నా రూమ్ మేట్స్ నీ, హైదరాబాద్ లో గడచిన బ్యాచిలర్ జీవితాన్నీ గుర్తుకి తెస్తుంది, మదిలో మెరిసి మాయమవుతూ...తళుక్కుమని ఆకాశంలో మెరిసి మాయమయే "తోకచుక్క" లా...

"జీవితం రవ్వంతే కానీ అదిచ్చే అనుభూతులు కొండంత."
~ గిరిధర్ పొట్టేపాళెం

Sunday, August 21, 2022

పునాదిరాళ్ళు . . .

 
డియర్ చిరు, పుట్టినరోజు శుభాకాంక్షలు!
🌹🎂🌹

తెలుగు సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా మొదలయిన కాలం లో వచ్చిన కథానాయకులు తమ "ఉత్తమ ప్రతిభ" తో ప్రేక్షకుల్ని మెప్పించి, మెల్లిగా ఆదరణ పొంది, ఊపందుకుని, తారాపథానికి చేరి, కాలం మారినా వయసు మీదపడ్డా తాము మారక, వెండితెరపై కథానాయకుల పాత్రలని వీడక, మరెవ్వరికీ చోటివ్వక, పదోతరగతి పిల్లోడి పాత్ర అయినా, కాలేజి బుల్లోడి పాత్ర అయినా తామే అంటూ విగ్గులతో, ఎబ్బెట్టు డ్యాన్సులతో, డూపు పోరాటాలతో ప్రేక్షకుల్ని మభ్యపెడుతూనే వినోదం పంచుతున్న రోజుల్లో... మారిన కాలానికి మళ్ళీ వాస్తవికత తోడై వస్తున్న చిన్న సినిమాల్లో, ఇంకా చిన్న పాత్రలకి సైతం "పెద్ద న్యాయం" చేస్తూ "అత్యుత్తమ ప్రతిభ" కి నిత్య "స్వయంకృషి"నీ చేర్చి ఒక్కొక్కమెట్టూ ఎక్కుతూ, చేసే ప్రతి పాత్రలో రాణిస్తూ, మరెవ్వరూ అందుకోలేని శిఖరాగ్రాన్ని చేరిన తొలి తెలుగు సినిమా వెండి తెర కథానాయకుడు - "చిరంజీవి". 

చిరంజీవి - పేరుకి తగ్గట్టే అంత సత్తా, అంతే క్రమశిక్షణ, కృషీ, పట్టుదలా కలిగిన ప్రతిభావంతుడు. కనుకే అతి క్లిష్టమైన మార్గమైనా కాలానుగుణంగా పాత్రలకి తగ్గట్టు తననీ మలచుకుంటూ తిరుగులేని సుదీర్ఘ ప్రయాణం కొనసాగించగలిగాడు.

ప్రతిభ ఉన్న ఏ నటుడికైనా సహజత్వంతో పాత్రలో మరింత రాణించాలంటే మంచి కథ, అభిరుచి ఉన్న దర్శకుడితోబాటు "వయసుకి తగ్గ పాత్ర" అనే చిన్న అదృష్టమూ తోడవ్వాలి. కొన్నిసార్లు "వయసుకి మించిన" పాత్రలు చేయాల్సి వచ్చినా తపనతోబాటు ప్రతిభ గల నటులెప్పుడూ అందులో రాణిస్తారు. "బడిపంతులు లో NTR" అయినా, "ధర్మదాత లో ANR" అయినా, "సాగరసంగమంలో కమలహాసన్" అయినా, "ఇద్దరు మిత్రులు లో "చిరంజీవి" అయినా ఇలానే తమని నిరూపించుకున్నారు. అలా అని "వయసుకి సరిపడని" పాత్రల్లో రాణించాలంటే ఎంత ప్రతిభ ఉన్నా ఏ నటుడి తరమూ కాదు, వయసూ సహకరించదు. "అరవై లో ఇరవై" పాత్రలు ఇలాంటివే. వీటిల్లో ఒదగాలంటే సహజత్వం తీసి పక్కనబెట్టాలి. అసహజత్వంతో కూడిన మేకప్పుల్నీ, విగ్గుల్నీ, డూపుల్నీ, కెమెరా విన్యాసాల్నీ నమ్ముకోవాలి. ఎబ్బెట్టు అనిపించినా ఇంకా ప్రేక్షకుల్ని మభ్యపెట్టగలం అన్న ధీమానీ తలకెక్కించుకొవాలి. ఇంకెవ్వరినీ వెండి తెరపైకి రానివ్వని ఆ "ఆక్రమణ" కాలంలో ఆ ఆటలు చెల్లాయి, కానీ కాల భ్రమణంలో ఆ ఆటలు కాలం చెల్లాయి. ఇది వాస్తవం!

అనుభవంతో ప్రతిభకి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ కాలానుగుణంగా ముందుకి వెళితేనే ఏ రంగంలో అయినా వరస విజయాలెదురౌతాయి. వాస్తవాన్ని మభ్యపెట్టి స్క్రిప్టులెంత పగడ్బంధీగా రాసుకున్నా, తమ ఇమేజ్ తో ప్రమోషన్స్ చేసుకున్నా, కధనంలో ఎమోషన్స్ తగ్గి అసహజత్వం ఎక్కువై వాస్తవానికి దూరమైతే సాధారణ ప్రేక్షకుడ్ని మభ్యపెట్టి మెప్పించటం ఈకాలంలో అసాధ్యం. ఎంత తన్నినా బూరెలు లేని ఆ ఖాళీ బుట్టలో వాళ్ళు బోల్తాపడరు. సాధారణ ప్రేక్షకుడి నాడి ఎప్పుడూ సింపులే, ఆ సింప్లిసిటీ ని మెప్పించటంలోనే ఉంది "విజేత"  విజయరహస్యమంతా.

ఈరోజుల్లో కష్టం ఎరగకుండా "ఒక్క హిట్టు"తోనే ఎగిరి చుక్కలెక్కికూర్చుంటున్న నటీనటుల్ని "ఒక్క ఫట్టు"తో నేలమీదికి దించి పడేసే శక్తి - ప్రేక్షకుల్ది. కష్టపడి తారాపథం చేరిన నటీనటుల్ని మాత్రం అంచనాల్ని తలకిందులుచేసినా తరవాతి సినిమాకోసం మళ్ళీ అదే అంచనాలతో ఎదురు చూస్తారు. హిట్టా, ఫట్టా అన్నది వాళ్ళు నిర్ణయించేదే. అందుకే వాళ్లని "ప్రేక్షక దేవుళ్ళు" అని తారలు సైతం పైకెత్తుతుంటారు. దేవుళ్ళని శతవిధాలైన నామాలతో కొలిచి మభ్యపెట్టినట్టు వీళ్ళని మభ్యపెట్టటం కుదరదు, నచ్చని సినిమా వీళ్ళచేతుల్లో ఫట్టే. 

సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తే ఒక సినిమా ఫట్టు అన్నా, ఇంకో మూడుంటాయి, ఆ వరసలో జాగ్రత్త పడటానికి. నాలుగేళ్ళకోసారి అలా తెరపై కనిపించి, వందలకోట్లు అనవసరంగా కుమ్మరించి దానికి రెట్టింపు లాగాలన్న ధ్యాస పక్కనబెట్టకుంటే కెరీర్ చివరి దశాబ్ధంలో వచ్చే రెండు మూడు సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ఏమాత్రం మెరుగవ్వదు. కెరీర్ లో మొదటి దశాబ్దం ఎంత ముఖ్యమో ఆఖరి దశాబ్దమూ అంతే ముఖ్యం. అలాంటివాళ్ళే "బిగ్ బి" లా గుర్తుండిపోతారు. దక్షినాది సూపర్ స్టార్ లు ఇప్పటికైనా మారాలి. ఆ బాటలో ప్రయాణించి, యాభై దాటిన వయసులో ఎలాంటి పాత్రలు చెయ్యాలి అన్న మార్గనికి "పునాదిరాళ్ళు" వెయ్యాలి.

విజయాన్ని డబ్బుతో కొలిచే కాలం. సినిమారంగంలో అయితే డబ్బు వలిచి మరీ కొలిచే కాలం. వందల కోట్లు గుమ్మరించి, రెండింతలు ఆశించేకన్నా, అతి తక్కువలో సహజత్వంతో ఆకట్టుకునే మంచి సినిమా తీసి పదిరెట్లు వచ్చేలా చేసుకోగలగటం ఇప్పుడున్న సినిమా లోకంలో నిజమైన హిట్ అంటే. అభిమానగణం ఉన్న పెద్ద హీరోలకిది మరింత సులభం. చెయ్యాల్సిందల్లా చిన్న సినిమా, అంతే! బడ్జెట్ తగ్గించి, మంచి అభిరుచి ఉన్న దర్శకులతో కలిసి మంచి సినిమాలు తీసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తే రాబడితోబాటు, ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్కు గాడిలోపడి తిరుగుతూ పోతే తట్టదు, పట్టదు.

"సినిమా" మళ్ళీ వాస్తవానికి దూరంగా పరుగులు పెట్టకుండా వెనక్కి మళ్ళించే "పునాది రాళ్ళు" గట్టిగా పడాలి. ప్రచారం మీద కృషి తగ్గి ప్రాచుర్యం మీద పెరగాలి. దీనికీ మళ్ళీ చిరంజీవే శ్రీకారం చుట్టాలి. మళ్ళీ ఒక "పునాది రాయి" గట్టిగా వెయ్యాలి. ఈసారి మరింత గట్టిగా, ఒక కొత్త ఒరవడికి నాంది పలికేలా, అందరు స్టార్ లూ ఆ "మెగా దిశ" గా పయనించేలా.

ఒకప్పటి తెలుగు సినిమా ట్రెండ్ ని మార్చిన "చిరంజీవి" మళ్ళీ మార్చగలడనీ, మారుస్తాడనీ ఆశిస్తూ...

డియర్ చిరు,
పుట్టినరోజు శుభాకాంక్షలు! !
🌹🎂🌹

"ప్రతిభకి కృషి తోడైతే విజయాల బాటని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు." - గిరిధర్ పొట్టేపాళెం

Sunday, February 6, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 5 ...

Ink and Ballpoint Pen on Paper (6" x 8.5")


కట్టిపడేసిన కదలిపోయిన కాలం...

ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలు గా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే ఎంతో గొప్ప గా అనిపిస్తుంది.

ప్రతి సంక్రాంతి, దసరా, వేసవి శలవులకీ "కావలి" నుంచి "నెల్లూరు" మీదుగా మా సొంత ఊరు "దామరమడుగు" కి వెళ్ళటం మాకు తప్పనిసరి. అలా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అక్కడికి లాక్కెళ్ళే బంధమే మా "బామ్మ". ('సొంత ఊరు' అన్న మాట ఎలా పుట్టిందో...బహుశా అప్పట్లో తమ ఊరు వదలి జీవనభృతి కోసం ఎక్కడికీ పోయి ఉండేవాళ్ళు కాదు, అందుకేనేమో!)

"ఒక్క సంవత్సరం ఇక్కడే ఉంటూ ఈ ఇల్లు చూసుకోమ్మా, ట్రాన్స్ఫర్ చేయంచుకుని బుచ్చి కి వచ్చేస్తాను" అంటూ "బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్" నుంచి "కావలి హైస్కూల్" కి ట్రాన్స్ఫర్ అయిన నాన్న తప్పని పరిస్థితిలో తనతో ఫ్యామిలీని తీసుకువెళ్తూ, తన ఇష్టం, కష్టం కలిపి కట్టుకున్న "కొత్త ఇల్లు" బామ్మ చేతిలో పెట్టి "బామ్మకిచ్చిన మాట". తర్వాత సంవత్సరానికే ఊహించని పరిణామాలు, మాకు ఎప్పటికీ అందనంత దూరంగా నాన్నని దేవుడు తనదగ్గరికి తీసుకెళ్ళిపోవటం.

"ఒక్క సంవత్సరం, వచ్చేస్తా అని మాటిచ్చి వెళ్ళాడు నాయనా, నాకు విముక్తి లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది" అంటూ నాన్న గుర్తుకొచ్చినపుడల్లా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ మాటనే తల్చుకుంటూ బాధపడేది బామ్మ. మేము పెద్దయ్యి జీవితంలో స్థిరపడే దాకా అక్కడే ఉండిపోయి మా ఇల్లుని కాపాడుతూ, మమ్మల్ని మా అదే జీవనబాటలో ముందుకి నడిపించింది "బామ్మ".

అలా ఆ ఊరితో బంధం తెగని సంబంధం "బామ్మ" దగ్గరికి ప్రతి శలవులకూ అమ్మా, అన్నా, చెల్లీ, నేనూ వెళ్ళే వాళ్ళం. సంక్రాంతి, దసరా పండగలూ చాలా ఏళ్ళు అక్కడే జరుపుకున్నాం. మేము వెళ్ళిన ప్రతిసారీ "బామ్మ" సంబరానికి అవధులు ఉండేవికాదు. శలవులు అయ్యి తిరికి కావలికి వెళ్ళిపోయే రోజు మాత్రం బామ్మ చాలా భిన్నంగా అనిపించేది, కొంచెం చిరాకు చూపించేది, ముభావంగా పనులు చేసుకుంటూ ఉండిపోయేది. బామ్మ బాధకవే సంకేతాలు. ఓంటరి బామ్మ ఇంకొక్క రోజు మాతో గడిపే సంతోషం కోసం, రేపెళ్ళకూడదా అంటూ ఆపిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తిరిగి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చేది. వెళ్ళే సమయం దగ్గర పడేకొద్దీ ఆ బాధ బామ్మలో ఎక్కువయ్యేది. వెళ్తున్నపుడు మెట్లు దిగి వచ్చి నిలబడి వీధి చివర మేము కనపడే దాక చూస్తూ ఉండిపోయేది. ఒక్కొకసారి మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి ఏదో మర్చిపోయి తిరిగి వచ్చిన సందర్భాల్లో ఆ రెండు మూడు నిమిషాలు ఎక్కడలేని సంతోషం బామ్మలో కనిపించేది, మళ్ళీ అది మాయం అయ్యేది. బామ్మ ఒక్కటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ తిరుగు ప్రయాణం నాకెప్పుడూ బాధగానే అనిపించేది. నెల్లూరు నుంచి కావలి బస్ లో కిటికీ పక్క సీట్ లో కూర్చుని వెనక్కి కదిలిపోతున్న చెట్లు, ప్రదేశాలూ చూస్తూ ఆ ఆలోచనల్తోనే కావలి చేరుకునే వాడిని.

ఆ ఊర్లో రెండేళ్ళు పెరిగిన జ్ఞాపకాలతో కలిసి ఆడుకున్న స్నేహితులు కాలంతో దూరమవటం, సొంత మనుషులకి సఖ్యత లేకపోవటంతో, క్రమేపీ సొంత ఊరైనా ఆ ఊరికి వెళ్ళినపుడు చుట్టాల్లా మాత్రమే మెలగవలసి వచ్చేది. బస్సు దిగి ఇంటికి నడిచెళ్ళే దారిలో ఎదురయ్యే ప్రతి మనిషీ ఆగి మరీ మమ్మల్ని తేరపారి చూట్టం, ఒకరో ఇద్దరో ఎవరోకూడ తెలీని వాళ్ళు "ఏం అబయా (నెల్లూరు యాసలో అబ్బాయి అని) ఇప్పుడేనా రావటం" అని పలకరించటం, ఆగి "ఊ" అనేలోపు "సరే పదండయితే" అనటం, సొంత బంధువులు మాత్రం ఎదురైనా పలకరించకపోవటం, వాకిట్లో కూర్చున్న ముసలీముతకా, ఆడామగా, పిల్లాజెల్లా కళ్ళప్పగించి చూస్తుండటం తో, గమ్ముగా తల దించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్లం.

అక్కడ శలవుల్లో ఉన్న కొద్ది రోజులూ, ప్రతి రోజూ కొంత టైమ్ పొద్దునో, సాయంత్రమో అలా పొలం దాకా వెళ్ళిరావటంతో గడిచిపోయేది. మిగిలిన టైమ్ లో ఇంట్లో కూర్చుని క్యారమ్ బోర్డ్ ఆడటం, నాన్న ఆ ఇంట్లో చేరాక కొన్న టేబుల్ మీద ఉండే PHILIPS రేడియోలో సినిమా పాటలు వినటం, లేదా Godrej బీరువా తెరిచి అందులో నాన్న గురుతులు చూసుకోవటం ఇలా కాస్త సమయం గడిచిపోయేది. అలా ఎంతలా సమయంతో ముందుకి నడిచినా అది మాత్రం ముందుకి కదిలేదే కాదు, ఏం చెయ్యాలో అస్సలు తోచేది కాదు. నాన్న దగ్గర చాలా ఇంగ్లీష్ పుస్తకాల కలెక్షన్ ఉండేది. అటకెక్కిన వాటికోసం నేనైతే పైకెక్కి బుట్టల్లో మగ్గుతున్న ఆ పుస్తకాల్ని ఒక్కొక్కటీ కిందికి దించి, బూజూ దుమ్మూ దులిపి తిరగేసేవాడిని. అయినా సరే ఆ పల్లెటూళ్ళో ఇంకా చాలా సమయం మిగిలిపోయేది. 

అలాంటి వేళల్లో నాకు తోచే ఏకైక మార్గం- కూర్చుని బొమ్మలు గీసుకోవటం, అవి చూసుకుని సంబరపడిపోవటం. అలా అక్కడ ఆ ఊర్లో, మా ఇంట్లో ఏమీ పాలుపోక వేసిన బొమ్మలే ఈ "గుఱ్ఱం బొమ్మలు". సంతకం కింద వేసిన తేదీలు చూస్తే వరసగా నాలుగు రోజులు ముందుకి నడవని కాలాన్ని నా(బొమ్మల)తో నడిపించాను. అప్పట్లో మా చిన్నప్పటి ఒక "అమెరికన్ ఇంగ్లీష్ కథల పుస్తకం" మా ఇంట్లో ఉండేది. ఆ పుస్తకానికి అన్న పెట్టిన పేరు "గుఱ్ఱాం పుస్తకం" (అవును, దీర్ఘం ఉంది, నెల్లూరు యాస ప్రత్యేకతే అది). ఈ పేరుతోనే ఇప్పటికీ ఆ పుస్తకాన్ని గుర్తుచేసుకుంటుంటాం. ఆ పుస్తకంలో ప్రతి పేజీ లోనూ మా బాల్యం గురుతులెన్నో దాగున్నాయి. దాదాపు ఆరేడొందల పేజీలుండి ప్రతి పేజీలోనూ అద్భుతమైన అప్పటి అమెరికన్ జీవన శైలిని పిల్లల కథలుగా రంగు రంగుల అందమైన పెయింటింగ్స్ తో ప్రతిబింబిస్తూ ఉండేది.  పచ్చని పచ్చిక బయళ్ళలో అందంగా ఉన్న ఇళ్ళు, అక్కడి జీవన విధానం, ఇంటి ముందు పోస్ట్ బాక్స్, రోజూ ఇంటికి జాబులు తెచ్చే పోస్ట్ మ్యాన్, ఉత్తరాల కోసం ఎదురుచూసే పిల్లలు, పారే చిన్న పిల్ల కాలువ, అందులో గేలం వేసి చేపలు పట్టటం, అవి ఇంటికి తెచ్చి వండుతున్న బొమ్మలూ, ఇంట్లో పెంపుడు పిల్లులూ, కుక్కలూ, గుర్రాల మీద చెట్లల్లో వెళ్తున్న పిల్లా పెద్దా బొమ్మలూ, స్టీమ్ ఇంజన్ తెచ్చిన రెవొల్యూషన్ తో స్టీమ్ నుంచి, ఎలెక్ట్రిక్ వరకూ రకరకాల రైలు బొమ్మలూ, ఫ్యాక్టరీల్లో పనిచేసే వర్కర్స్ జీవనశలీ, రకరకాల విమానాలూ, హెలికాప్టర్ల తో...ఇలా మొత్తం అమెరికానే కళ్ళకి కట్టి చూపెట్టిన గొప్ప "పిల్లల కథల పుస్తకం". బొమ్మలు చూట్టం తప్ప, ఇంగ్లీష్ లో ఆ కథలని చదివి అర్ధం చేసుకునేంత విద్య, అవగాహన, జ్ఞానం లేని మా బాల్యం నాటి "మా గుఱ్ఱాం పుస్తకం" అది.  

అలా కాలం ఎంత ప్రయత్నించినా ముందుకి కదలని ఒక రోజు మధ్యాహ్నం ఆ "గుఱ్ఱాం పుస్తకం" లోని గుఱ్ఱం బొమ్మలు ఒక నోట్ బుక్కులో వెయ్యటం మొదలు పెట్టాను. ఎలాంటి సవరణలకీ తావులేని పెన్నుతోనే నేరుగా వేసుకుంటూ పోవటం ఈ బొమ్మల్లో ఉన్న విశేషం. వాడిన పెన్నులు కూడా అక్కడ ఇంట్లో బామ్మ ఎప్పుడైనా పుస్తకాల్లో ఏవైనా రాసుకోడానికి టేబుల్ డెస్కులో పడుండే పెన్నులే, ఒక్కోసారి అవీ రాయనని మొరాయిస్తే పక్కన "రమణయ్య బంకు" లో రీఫిల్ కొని తెచ్చుకున్న గురుతులూ ఉన్నాయి. ఇక పేపర్ అయితే పాతబడ్డ ఆ డెస్కులోనే పడుండి, వెలుగు చూడక, కొంచం మాసి, రంగు మారిన తెల్ల పుస్తకంలో మరింత తెల్లబోయిన తెల్ల కాయితాలే. అప్పుడేమున్నా లేకున్నా ఉన్నదల్లా "ముందుకి నడవని సమయం", ఆ సమయాన్ని నడిపించాలని పట్టుదలగా కూర్చుని పట్టుకున్న పెన్నూ పేపరూ, లోపల ఉత్సాహం. ఏ పనికైనా ఇంతకన్నా ఇంకేం కావాలి?

ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే ఖచ్చితమైన కొలతలతో తప్పులు పోని ఆనాటి ఆ నా గీతలు. ఆ గీతల్లో దాగి ఆగిన ఘని, 'ఆగని అప్పటి కాలం', ఆ కాలంతో నడిచిన నా బాల్య స్మృతులు, ఆ స్మృతుల్లో దాగిన చెక్కు చెదరని అందమైన అపురూప జ్ఞాపకాలు!

ఇప్పుడు కాలంతోపాటు మారినా మా ఊరు 'దామరమడుగు' అక్కడే ఉంది. అక్కడ మా ఇల్లూ అలానే ఉంది. లేనిది మాత్రం అక్కడే స్థిరపడాలని ఇష్టపడి తన కష్టంతో ఇల్లు కట్టుకున్న నాన్న, మా రాక కోసం ఎదురు చూస్తూ మాటకి కట్టుబడి అక్కడే చాలా ఏళ్ళు ఉండి వెళ్ళి పోయిన బామ్మ, మాతో ఆ ఇంట్లో ఆడి పాడి నడయాడిన మా చెల్లి, కదిలిపోయిన అప్పటి కాలం. ఇవన్నీ జ్ఞాపకాలుగా తనతో మోసుకుని కదిలిపోయిన కాలం, ఇప్పటికీ ఎప్పటికీ నా బొమ్మల్లో కట్టిపడేసిన కదలని సజీవం.




"ఆగని కాలం ఆగి దాగేది మన జ్ఞాపకాల్లోనే." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: An American children stories book on American Daily Life.
Location: Damaramadulu - my native place in Nellore, AP, India
Mediums: Fountain pen ink, Ballpoint pen on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: May 15-18, 1984

Saturday, September 25, 2021

బాలు గారి దివ్య స్మృతిలో...

 
Ink & Watercolors on Paper

అమృతం మాత్రం తమవద్దుంచుకుని 
బాలు గానామృతాన్ని మనకొదిలేశారు
అ దేవతలూ దేవుళ్ళూ.....పాపం!

బాలు గారి దివ్య స్మృతిలో ఒక సంవత్సరం...

Details 
Mediums: Ink Pen & Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, May 30, 2021

Keep smiling...

Keep smiling...(8.5" x 11")

Keep smiling !!

Details 
Reference: Picture of Karronya
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Saturday, December 19, 2020

Happy Mom and Son...

"Happy Mom and Son"
Watercolors on Paper (8.5" x 11") 
 
బొమ్మలని అభిమానించే రోజులు తగ్గిపోతున్న రోజుల్లో ఎవరో తెలీని అభిమాని "మా తమ్ముడి బొమ్మ వేసివ్వగలరా సార్" అంటూ అడిగితే "తప్పకుండా" అన్న మాటకి కట్టుబడి వేసిన ఈ బొమ్మ చూసి ఆ అభిమాని చెందిన సంతృప్తి కి వెలకట్టడం సాధ్యం కాదు. అందుకే అప్పుడప్పుడూ ఇలా తెలియని అభిమానులు అడిగితే వేసే బొమ్మలు "చాలా ప్రత్యేకమైనవి" నేనేసే బొమ్మల్లో...

"To a Child, mother is the first person, the first teacher, the first care, the first love, the first smile...the first and the best of everything in the world!"
~ Giri Pottepalem

Happy Painting!
Be kind to people around you like a mother to a child!!

Details 
Title: "Happy Mom and Son"
Mediums: Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Friday, September 25, 2020

"దివ్య స్మృతి" కి ప్రేమతో...

Sri S. P. Balasubrahmanyam, Legendary Indian Singer
Ballpoint Pen on Paper (8.5" x 11")    

నా అభిమాన "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో...

యావత్ భారతావనికీ తన పాటలలో స్వరమాధుర్యాన్ని జీవితాంతానికీ నిండా నింపి ఇచ్చి దివికేగిన "బాలు" గారు తెలుగు వాడిగా, మన వాడిగా పుట్టటం, "తెలుగు" తల్లికి ఎప్పుడో గంధర్వులిచ్చి తరించిన "దివ్య వరం".

తెలుగు పాటకే కాదు, తెలుగు మాటకూ, మాట నడవడికకూ వన్నె, గౌరవం తెచ్చిన స్వరం, వ్యక్తిత్వం "బాలు" గారిది.  సంగీతంతో గళం కలిపి లయబద్ధంగా చేసే స్వరవిన్యాసంలో, అక్షర ఉచ్ఛారణలో స్పష్టత తోబాటు, ప్రతి పదానికీ 'భావం', 'అనుభూతి' రెండూ జోడించి, పాడిన ప్రతి పాటకీ జీవం పోశారు మన "బాలు" గారు.

ఈ గాలీ, ఈ నేలా, ఈ ఊరూ, సెలయేరూ, "బాలు" గారిని కన్న ఈ తెలుగు నేలా, తెలుగు భాషా ఉన్నంత కాలం ఆ స్వరం వినబడుతూనే ఉంటుంది, అమృతాలొలికిస్తూనే ఉంటుంది.

కళాకారుడు వెళ్తూ ఇక్కడే వదలి వెళ్ళే ఆ కళ ఆనవాళ్లలో ఆ ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. అందుకేనేమో (కళాకారుడి) కళకి మరణం లేదు అంటారు.

నా బొమ్మలన్నింటిలోనూ "బాలు" గారి స్వరం మిళితమై ఉంటుంది. ఈ బొమ్మలోని ప్రతి గీతలోనూ ఒదిగిన నా "మనసు తడి" తో బాటు "బాలు" గారి "సుమధుర స్వరమూ" దాగి ఉంది.

అంతటి మహానుభావుడు "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో, భక్తితో ఈ చిత్రాన్ని సమర్పించుకుంటూ...

గత నలభై రోజులుగా "బాలు" గారు కోలుకుని నవ్వుతూ రావాలని 
ఆశిస్తూ తపించిపోయిన హృదయాలెన్నో...
మనల్ని వీడి దివికేగిన ఈరోజు బాధతో బరువెక్కిన గుండెలు ఇంకెన్నో...
కంట తడి పెట్టి చెమర్చిన కళ్ళు మరెన్నో...
తడిసి ముద్ద అయిన అభిమానుల మనసులు ఎన్నెన్నో...

"బాలు" గారిని అభిమానించే "ప్రతి మనసు" కీ
నా అభిమాన "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో
అంకిత భావంతో గీసిన
ఈ చిత్రం అంకితం!
🙏😢

~~~  ~~~ ~~~ 

"బాలు" గారితో, Chicago, USA, Sep 18, 2004

నా అభిమాన గాయకుడు "బాలు" గారిని ప్రత్యక్షంగా చూడటం జీవితంలో ఒక్కసారే Chicago లో వెళ్ళిన 3 గంటల Music Concert లో కలిగింది. కలవటానికి ఎవ్వరికీ అనుమతిలేని ఆ సాయంత్రం, నేను గీసిన "బాలు" గారి బొమ్మ, జయలక్ష్మి చూపిన చొరవతో నన్ను ఆయన దరి చేర్చింది. "బాలు" గారితో అలా ఓ పది నిమిషాలు గడపగలగటం నా జీవితంలో కలిగిన అదృష్టంగా, ఆ క్షణాలు మిగిల్చిన అనుభూతుల్ని "గొప్ప వరం" గా ఎప్పుడూ భావిస్తూనే ఉన్నాను, ఉంటాను...

నిన్న గాక మొన్నే "బాలు" గారి పుట్టినరోజని ఆనందం FB లో పంచుకున్నా...
మన అభిమాన "బాలు" గారినీ, ఆ మధుర క్షణాల్నీ మళ్ళీ తలచుకుంటూ....