Showing posts with label Celebrities. Show all posts
Showing posts with label Celebrities. Show all posts

Saturday, October 3, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 40 . . .

"భాను ప్రియ"
Poster colors on Paper (3" x 5")

రంగులు అంటే చిన్నప్పట్నుంచీ భలే ఇష్టం. చిన్నప్పుడు తొడుక్కున్న చొక్కాల డిజైన్ రంగులు, ఆడిన ప్రతి బొమ్మ మీదా ఉన్న రంగులు, కుడి చేతి మధ్య వేలుకు ఎడమ చేతి మూడేళ్ళతో పట్టి వెనక్కి లాగి పెట్టి గురి చూసి కొట్టిన రంగు రంగుల గోళీ కాయల్లో లోపల తళ తళ మెరిసిపోయే రంగులు, బొంగరాల తల పైన వృత్తాకారం లో పెయింట్ వేసి ఉన్న లేత, ముదురు రంగులు, రంగు రంగుల కాగితాలతో చేసి మిద్దెపైన ఎగరేసిన గాలిపటాలు, మా పాత ఇంటి పెరట్లో, పొలాల్లోని రంగు రంగుల పువ్వులు...ఇలా చుట్టూ ఏ రంగు కనపడినా మనసు తన్మయత్వంతో పులకరించి పోయేది.

మొదటి అనుభవాల పులకింతలు జీవితాంతం గుర్తొచ్చినపుడల్లా పులకింతలుగానే పులకిస్తూ, పులకరిస్తూ, పలకరిస్తూ ఉంటాయి. అలా ఇప్పటికీ పులకింపజేసేవి నా ఆటల్లో వాడిన గోళీలు, దామరమడుగు మా పాత ఇంట్లోని మా పెరట్లో అమ్మ వేసిన రంగు రంగుల బంతి, ముద్ద బంతి, రెక్కబంతి, చేమంతి, సన్నజాజి, కనకాంబరం పూలు ఆ పూల పరిమళాలు, అప్పుడప్పుడే రంగుల్లో వస్తున్న తెలుగు సినిమాలు. నలుపు తెలుపుల్నుంచి "ఈస్ట్ మన్ కలర్" లోకి మారుతున్న సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎప్పుడూ ముదురు రంగుల దుస్తులే వేసేవాళ్ళు. హీరో ప్యాంటులు కూడా రంగులవే, పసుపు, ఎరుపు, బులుగు ఆకుపచ్చ, ముదురు వంగపండు - ఇలాంటి రంగులు. ఈ ప్యాంటులు బయట వెయ్యాలంటే చాలా ధైర్యసాహసాలు కావాలి. తెర మీద "ఈస్ట్ మన్ కలర్" ని ఇంకా బాగా అందరి కళ్లల్లో పండించాలనేమో అప్పటి సినిమా డ్రెస్ డిజైనర్స్ సెలెక్షన్స్ లో అన్నీ కాంట్రాస్ట్ గా ఉండే ముదురు రంగులే. ఇంకా గుర్తుంది "అన్నదమ్ముల అనుబంధం" యన్.టీ.ఆర్, మురళీ మోహన్, బాలకృష్ణ వేసుకుని క్లైమాక్స్ లోని రైలు పట్టాల మధ్యన నిలబడిన ఫోజు లోని రంగులు పసుపు రంగు మురళీ మోహన్, వంగ పండు రంగు బాలకృష్ణ, బులుగు రంగు యన్.టీ.ఆర్. చొక్క ప్యాంటూ రెండూ ఒకే కలర్ తో వేసుకుని ఉన్న ముగ్గురు హీరోలు, మూడు రంగులు, చూడ ముచ్చటగా అనిపించేది కళ్లకి.

ఇక తిరునాళ్ళల్లో అమ్మే బొమ్మలైతే అదిరిపోయే రంగులే, పిలకాయల కళ్ళకీ మనసులకీ రంగుల పండగే. పుల్లైసు, పిప్పరమింట్లు, పీచు మిఠాయిల్తో సహా అన్నిట్లోనూ రంగుల వాడకం విపరీతంగా ఉండేది. బయట బండ్ల మీదా బంకుల్లో అమ్మే రంగులున్న చిరుతిళ్ళు ఆరోగ్యానికి హానికరం అని నాన్న రంగులున్నవేవీ కొననిచ్చేవాడు కాదు, తిననిచ్చేవాడు కాదు. స్కూలుకి కూడా జేబులో న్యూట్రిన్ చాక్లెట్టో, బ్రిటానియా బిస్కెట్లో పెట్టి ఇంటర్వల్ లో తినండి అని చెప్పి పంపించేవారు తప్ప, అందరి పిలకాయల్లా ఐసు బండి దగ్గరకి కూడా వెళ్ళాలంటే భయమే, ఎవరైనా చూసి నాన్నకి చెబితే తన్నులు తప్పవని. పుల్లైసు తినలేకున్నా వాటికున్న ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్ని చూస్తే మనసు రంగుల్లో మునిగి తేలి ఉబ్బి తబ్బిబ్బై పోయేది.

1975 లో మా ఊరు "దామరమడుగు" లో నాన్న తన స్వశక్తితో దగ్గరుండి మరీ కట్టించిన మా కొత్త ఇంటికి లోపలా, బయటా గోడలకి వేసిన రంగులు, ఇంటి లోపల సీలింగ్ నుంచి వేలాడే లైటు బల్బులని పైన కవర్ చేస్తూ షడ్భుజాకారంలో ఉన్న ప్లాస్టిక్ డోమ్ కవర్లూ ఆ రంగుల్ని చూస్తూ "నాన్న సెలెక్షన్ ఎప్పుడూ భలే ఉంటుంది" అని నేనూ అన్నా ఎన్ని సార్లు మురిసిపోయేవాళ్ళమో. అప్పట్లో ఇళ్ళకంతా తెల్లని సున్నం, ఒక్క రంగే వేసేవాళ్ళు. బహుశా మా ఊర్లో రంగుల ఇల్లు అప్పట్లో మాదేనేమో. ఇంకా పల్లెటూరు ప్రత్యేకతలన్నీ సహజమైన రంగుల్లో చాటిచెప్పే ముదిరిన తాటి పండు లోపలి ముదురు కాషాయం రంగూ, లేత ముంజె సిల్వర్ రంగూ, పచ్చి గుబ్బల పచ్చని, ముదురు గుబ్బల ఊదా రంగులూ, తాటి ముంజెల్ని బొటన వేలితో లోడి తినేశాక రెండు తాటి బుర్రల మధ్యన పుల్ల గుచ్చి దాన్ని పంగాలు కర్రతో పట్టి నడిపేందుకు సిద్ధం చేసుకునే ఆ తాటికాయ బుర్రలపైన ముదురు నలుపుతో కలుస్తూ చాలా అర్టిస్టిక్ గా ఉండే ఒక ప్రత్యేక పసుపు రంగు, లేత వరినారు చిలక పచ్చ రంగూ, పెరిగే వరిపైరు ముదురు పచ్చా, రెండెద్దుల బండి చక్రాల ఇరుసుని పట్టి పెట్టి ఉండే ఇనుప కమ్మీ రాపిడి తగ్గించేందుకు చుట్టూ పూసే కాలిన గడ్డి బూడిదలో నూనె కలిపి చేసిన "కందిన" అసలు సిసలైన నల్లని రంగూ, ఇంటి దగ్గర ఆంజనేయస్వామి రాయికి పూసిన పసుపు రంగు, పైన పెట్టిన ఎర్రని బొట్లు, ఇంటికెదురుగా ఉన్న టెంకాయ చెట్ల పైన సాయంత్రం అయితే గుంపులుగా వచ్చి వాలే తెల్లని కొంగల తెలుపు రంగూ...ఇలా ఎటు చూసినా రంగుల ప్రపంచమే.

అయితే చాలా ఏళ్ళు నా బొమ్మల సాధన పెన్సిల్, ఫౌంటెన్ పెన్ ఇంక్ తోనే సాగటంతో నలుపు తెలుపులు తప్ప నా బొమ్మల్లో రంగులే ఉండేవి కాదు. 1980 లలో ఇంకు పెన్నుల్తో పడే కష్టాల బారినుంచి గట్టెక్కిస్తూ బాల్ పాయింట్ పెన్నులు మార్కెట్ లోకి వచ్చి ఒక్కసారిగా అందరినీ తమవైపు ఆకర్షించి లాక్కునేశాయి. అప్పుడు నలుపు, బులుగు, ఆకుపచ్చ, ఎరుపు ఇలా నాలుగు రంగుల్లో దొరికే "రీఫిల్" - నిజానికి ఈ పదం సన్నని ప్లాస్టిక్ గొట్టంలో ఉండే ఇంకున్న దానికి సరిగ్గా వ్యతిరేకం, ఈ పదం ఇప్పుడు తల్చుకుంటుంటే తమాషా గా అనిపిస్తుంది, నిజానికి ఇంకు పెన్నులే అసలైన "రీఫిల్" పెన్నులు, ఇంగ్లిష్ పదాలు ఇతర భాషల్లోకి ఎంతగా చొచ్చుకు పోతాయో అంటానికి "బాల్ పాయింట్ పెన్ను" పెద్ద ఉదాహరణ. అలా నాలుగు రంగుల్లో దొరికే బాల్ పాయింట్ పెన్ను రీఫిల్ రంగుల్తో బొమ్మలు చాలా వేశా. తర్వాత రంగు రంగుల స్కెచ్ పెన్నులతోనూ మరిన్ని బొమ్మలు నా చేతిలో రూపు దిద్దుకున్నాయి. ఆర్టిస్ట్ కి ఎంత చేసినా పూర్తి సంతృప్తి అన్నది ఉండదు, ఇంకా ఏదో చెయ్యాలన్న తపనా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అలా అప్పట్లో రంగులపై ఉన్న మక్కువ సహజంగానే నన్ను రంగుల బొమ్మల వైపు మళ్ళించింది. రంగుల కోసం నేను పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. అప్పుడు హైస్కూల్ లో డ్రాయింగ్ క్లాస్ ఉండేది. అలా అన్న వాటర్ కలర్ రుంగుల డబ్బా ఒకటి ఇంట్లో ఉండేది, అయితే అవి చాలా పేలవమైన రంగులు. వాటితోనే నాలుగైదు పెయింటింగ్స్ ట్రై చేశా. తర్వాత మంచి వాటర్ కలర్స్ కోసం కావలి, విజయవాడల్లో తిరగని షాపే లేదు. విజయవాడ బీసెంట్ రోడ్డు ఒక చివర ఏలూరు రోడ్డుని కలిసే దగ్గర ఎడమవైపు కార్నర్ లో "పెన్ కార్నర్" ఉండేది, అదే ఆ షాపు పేరు కూడా అప్పట్లో. షాపు రెండు వైపులా పొడవాటి ఓపెన్ కౌంటర్, ఎప్పుడు చూసినా చుట్టూ పెన్నులు కొనే వాళ్ళే, రోజులో ఒక్క నిమిషం కూడా ఆ షాపు దగ్గర కస్టమర్ లేకుండా ఉండేదే కాదు. ఆ షాపులో ఏమన్నా వాటర్ కలర్ పెయింటింగ్ రంగులు దొరుకుతాయేమోనని, అక్కడి నుంచి మొదలు పెట్టి ఒన్ టవున్ గోడవునుల్దాకా  రంగుల కోసం నా ఒంటరి ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంలో సాధించి సంపాదించిన ఆరేడు రంగుల్తో మొదలు పెట్టిన ఒకానొక మొదటి రంగుల వాటర్ కలర్ పెయింటింగుల్లో అద్దంలో తనని చూసుకుంటూ మెరిసే "భాను ప్రియ" ఫొటో ఆధారంగా వేసిందే ఈ "భాను ప్రియ రంగుల బొమ్మ".

అలా మొదలు పెట్టిన రంగుల ప్రయణంలో రంగుల్తో చాలా గంటలు పేపర్ మీద కుస్తీ పట్టేవాడిని. కాటా కుస్తీలో అయితే పోటీలు పూర్తయ్యాక ఆ కుస్తీల్లో పడ్డ కష్టం అంతా వస్తాదుల్లో కనిపించదు. కానీ పూర్తయిన బొమ్మలోనే ఆ బొమ్మ వెయ్యటంలో ఆర్టిస్ట్ పట్టిన కుస్తీ, అందులో పడ్డ కష్టం అంతా కొట్టొచ్చినట్టు కనిపించేది. ఈ బొమ్మలో నా(టి) కుస్తీ పోటీ అంతా అణువణువునా నేటికీ చూడొచ్చు. నేను వాడిన పేపర్ కీ, ఆ పేపర్ మీద వేసిన రంగులకీ పొత్తు అస్సలు కుదరదు. చేసిన శ్రమ అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బొమ్మ పరిమాణం, ఆ కళ్ళు, ఆ ముఖవచస్సు, అన్నిటినీ మించి ఏ మాత్రం ఒకదానితో ఒకటి కలవని పేపర్ పైన కలవని రంగులతో కలపాలని చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రంగు బొమ్మలతో సమస్య అంతా మెటీరీయల్ లోనే ఉంది. ఎంచుకున్న పేపర్ సరికాదు, వాడిన రంగులు ఆ పేపర్ కి సరయినవి కావు. సంతకం గమనిస్తే వాడిన బ్రష్ పరిస్థితి కూడా పూర్తిగా ఇట్టే తెలిసి పోతుంది. సన్నని కుంచె గల ఆ ఒక్క బ్రష్ తోనే ఇలాంటి బొమ్మ పూర్తిగా, అదీ అద్దంలోని ప్రతిబింబం...వెయ్యాలంటే మాటలు కాదు. మాటల్లోనే కాదంటే ఇంక చేతల్లో చెప్పాలా? అయినా ఇంత సాహసం తో బరిలోకి దిగాలా? పట్టు తెలీదు, రూల్స్ తెలీవు, బరిలో వాడాలసిన సరంజామా సాంకేతిక పరిజ్ఞానమూ బొత్తిగా లేదు, సరైన పరికరాలు అసలే లేవు...అయినా కుస్తీ పట్టి గెలిచిపోవాలన్న తపన ఒక్కటే గంటల తరబడి ఏకాగ్రతతో నన్ను ఆ బొమ్మ చుట్టూ రంగులతో కట్టిపడేసేది. 

ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే ఆ పట్టిన కుస్తీలో ఓడిపోయాను అని ఇట్టే గ్రహించగలిగినా, అప్పట్లో గెలిచానన్న ఆనందం ఉండేది. ఆ ఆనందం వెనుక వెన్నుదట్టి నిటారుగా నిలబడి ఉండేది నా పట్టుదల. ఆ పట్టుదలే తర్వాత క్రమేపీ అదే పేపర్, అదే మాట వినని రంగులతో ఔరా అనిపించే అద్భుతాలనీ సృష్టించ గలిగాయి.

"ఓటమే విజయానికి తొలిమెట్టు" అంటారు. అప్పట్లో నేనది ఓటమి అని భావించక పోయినా, దాన్నే పెద్ద విజయంగా మాత్రం అనుకోలా. ఇంకా పెద్ద విజయాలకై సాగిన నా బొమ్మల జైత్ర యాత్ర ఆ తరువాతి క్రమంలో వేసిన అప్పటి బొమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బొమ్మ బొమ్మ కీ సాధనలో సాధనతోనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. వాటిల్లో ఎలా వెయ్యాలో అనే పాఠాలకన్నా ఎలా వెయ్యకూడదో అన్న పాఠాలే ఎక్కువ. ఒక చిన్న మెళకువ పట్టుకోవటానికి ఎన్నో బొమ్మల యుద్ధం చెయ్యవలసి వచ్చేది. ఢక్కముక్కీలు తినాల్సి వచ్చేది. కిందామీదా పడుతూ లేస్తూనే మెల్లిగా అడుగులేస్తూ, క్రమేపీ ఉరకలెట్టవలసివచ్చేది. అయినా ఆపకుండా పరిగెట్టా, రంగులమీద మక్కువతోనే.

అప్పుడు నేను వాడుతున్నవి పోస్టర్ కలర్స్ అని మాత్రమే తెలుసు. కానీ వాటినే వాటర్ కలర్స్ అనుకున్నా. వాటర్ కలర్స్ అనేవి వేరే ఉంటాయనీ, వాటర్ కలర్ పెయింటింగ్స్ కి ప్రత్యేకమైన పేపర్ ఉంటుందనీ ఇవేవీ తెలీవు. అసలు వాటికోసం తిరిగిన షాపుల్లోనైనా ఎవరికన్నా వీటి గురించి తెలిస్తేగదా నాకు తెలిసే అవకాశం కి. విజయవాడ అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివార సాయంత్రం ఫుట్ పాత్ ల మీద పెట్టే పాత పుస్తకాల్లో కనపడే ఆర్ట్ మ్యాగజైన్స్ కొనేవాడిని, అందులో వివరించిన వాటర్ కలర్స్, బ్రషులు అప్పటి మార్కెట్లో దొరికేవి కాదు. అలా పోస్టర్ కలర్స్ తోనే, కొంచెం మందపాటి మామూలు పేపర్ పైనే వాటర్ కలర్స్ లా కొన్ని, ఆయిల్ పెయింట్స్ లా కొన్ని వేస్తూ విన్యాసాలు చేసేవాడిని. అంటే దొరికిన వెదురు పుల్లని విల్లుగా చేసి దాంతోనే బాణాల యుద్ధం, గదా యుద్ధం, కత్తి యుద్ధం చెయ్యటం అనమాట. అలా చేసిన యుద్ధ విన్యాసాల ప్రక్రియల్లో కొన్ని మాత్రం ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆ ఆశ్చర్యాల వెనుక ఓడిన ఈ "భాను ప్రియ" బొమ్మలాంటి బొమ్మలనేకం నాతో ఎన్ని వందల గంటలు ఎలా యుద్ధం చేయించాయో నా గతంలోనికి తొంగిచూస్తే, అందులోని అలుపు ఎరుగని నా రంగుల ప్రపంచంకే ఎరుక...
 
"విజయ పథంలో ఓటమి పాఠాలే గొప్పవి."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" చదివి, అవి నచ్చి, ఆపకుండా ఎందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...


Friday, June 5, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 39 . . .

Portrait of Telugu Cine Hero Chiranjeevi from the movie Chiranjeevi
Ink and Pen on Paper 8" x 11"

<--  నా "బొమ్మలు చెప్పే కథలు" - 38 
చిరంజీవి - ఈ పేరులోనే ఒక మహత్తు దాగుంది. ఈ పదం తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదం కి ప్రతీక. వయసులో తమకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ పలికే ఒక అద్భుతమైన సంస్కృత పదం ఇది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో ఈ పదం యుగ యుగాలుగా మరణం లేక జీవించి ఉండే మహానుభావులకి మాత్రమే ఉపయోగించటం తెలిసిందే. అందులో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది "అంజనీ దేవి" పుత్రుడు "ఆంజనేయుడు". కాకతాళీయంగా ఈ చిరంజీవీ అంజనీ దేవి పుత్రుడే! కాకతాళీయం అనేకంటే "విధి విలాసం" లేదా "దైవ నిర్ణయం" అనుకోవచ్చేమో! లేదంటే "శివ శంకర వర ప్రసాదు"డు పెరిగి పెద్దయ్యాక "చిరంజీవి" గా లోకానికి పరిచయం అవటం, ఆ మార్చుకున్న పేరు మహత్తు ఇంత బలీయంగా ఉండటం...అందరి జీవితాలకీ సాధ్యం కాదు.

నా టీనేజ్ నాటి బొమ్మల్లో సినీ తారలదే ప్రధమ స్థానం. అప్పట్లో సినిమా పత్రికలు విరివిగా వస్తూ ప్రత్యేక ఆకర్షణ గా నిలవటం, అందరికీ అందుబాటులో ఉండటం అందుకు కారణం ఒకటైతే, కొత్త తరం కథానాయకులతో తీరూ తెన్నూ, రంగూ రూపూ, మాటా పాటా, నడకా నటనా మార్చుకుంటున్న తెలుగు వెండితెర మరో కారణం. శలవుల్లో ఇంటికొస్తే రోజూ మా ఊరు "కావలి" లో ఏ థియేటర్ లో ఏం  సినిమా ఆడుతుంది అని వాల్ పోస్టర్ల ద్వారా ఇట్టే తెలిసి పోయేది. అట్టా బజారు కెళ్ళి "పెండెం సోడా ఫ్యాక్టరీ", "సింగ్ స్వీట్ స్టాల్" దగ్గరకెళ్ళి చూస్తే చాలు, ప్రతి థియేటర్ హోర్డింగ్ ప్యానెల్స్ వరసగా వాల్ పోస్టర్లతో కనువిందు చేసేవి. ట్రంకు రోడ్డు పక్కన "సింగ్ స్వీట్స్ షాప్" ముందు ఒక్కొక్క హోర్డింగ్ కీ భూమిలో నాటిన రెండు  సవక చెట్టు స్థంభాలు కి (కావలి సవక చెట్లకీ, బొంత రాళ్ళకీ పుట్టిల్లు) పైన కట్టిన వెదురు తడికె, దానిపైన మైదాతో అంటించిన వాల్ పోస్టర్లు. అప్పట్లో సినిమాలకి ఊర్లో ఇదే ప్రముఖమైన మార్కెటింగ్ సాధనం. కేవలం వాల్ పోస్టర్ చూసే సినిమాలకెళ్ళే వాళ్ళం. అంటే ఆ పోస్టర్లు డిజైన్ చేసే ఆర్టిస్ట్ కి అది ఎంత పెద్ద ఛాలెంజ్ నో ఊహించుకోవచ్చు. "ఈశ్వర్", "గంగాధర్" అప్పట్లో బాగా ప్రాచుర్యం పొంది ఎక్కువమందికి తెలిసిన పబ్లిసిటీ డిజైనర్ ఆర్టిస్టులు. సినిమా టైటిల్, పోస్టర్స్ చాలా ఆకర్షణీయంగా తీర్చి దిద్దే వారు. అందమైన పోస్టర్లున్న సినిమాలు థియేటర్ లో ఆడగలిగినన్ని రోజులాడి వెళ్ళిపోయాక ఆ సినిమా పోస్టర్లపైన అతికించిన కొత్త సినిమా పోస్టర్లు చూసి, అయ్యో అంత మంచి పోస్టర్ ఇంక చూడలేమా అని నా మనసు వాపోయేది. అలా "దాన వీర శూర కర్ణ" సూపర్ సైజ్ వాల్ పోస్టర్ కనిపించని రోజైతే నా మనసు విలవిల్లాడిపోయింది.

ఈ బొమ్మ "చిరంజీవి" సినిమాలో "చిరంజీవి" ఫొటో ఆధారంగా వేసింది. అప్పటి నా బొమ్మలన్నీ క్యాజువల్ గా ఏ (సినిమా) పత్రికో, న్యూస్ పేపరో తిరగేస్తున్నపుడు చూస్తే ఆకర్షించిన మరు క్షణమే పెన్నూ, పేపరూ పట్టుకుని గీసినవే. ప్లానింగ్, కంపోజిషన్, అవుట్ లైనింగ్...ఇలాంటి ప్రత్యేకమైన ప్రక్రియలేం లేవు, ఉన్నా మనకవేమీ తెలీవు. ఇంటర్ మీడియట్ అయ్యాక ఎండాకాలం శలవుల్లో ఇంటికొచ్చినపుడు వేసింది ఈ బొమ్మ. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులేమో. మే నెల, మాంచి ఎండాకాలం. మేము అద్దెకుంటున్నది మా తాతయ్య చెల్లెలు "నారాయణవ్వ" పెంకుటింట్లోనే, ఒంగోల్ బస్టాండు సందులో కాస్త దూరం వెళ్తే "కోటి లింగం" హాస్పిటల్ అంటే రిక్షా వాళ్లందరికీ తెలుసు. అక్కడి "పోలువారి వీధి" లో రెండో ఇల్లు, పడమటి వాకిలి ఇల్లు అవటంతో మధ్యాహ్నం ఎండ వేడి ని తట్టుకుని సాయంత్రం దాకా ఇంట్లో మనగలగటం కత్తిమీద సామే. అమ్మ అయితే ఎండ సూటిగా రాకుండా వరండా కటకటాలకి దుప్పట్లు కూడా కట్టేది. అయినా లోపలికి దూరే సూర్యుడి వేడి తాకిడిని తట్టుకోవటం ఏ జీవి వల్లా అయ్యేది కాదు. పొద్దున వరండాలో కూర్చుని చదవటమో లేదా బొమ్మలేయటమో. మధ్యాహ్నం అయితే పక్కన సందులో పక్కింటి తురాయి చెట్టు నీడ న ఒక కుర్చీ వేసుకుని ఆ వేడి గాలుల మధ్యన కూచుని మళ్ళీ చదవటం, లేదా మళ్ళీ బొమ్మలెయ్యటం. సాయంత్రం అయితే కొంచెం తగ్గిన వేడి తాకిడి నుంచి ఉపశమనం కోసం అలా కాసేపు బయటికెళ్ళి తిరిగి రావటమో లేదా తోచిన బొమ్మ గియ్యటమో, ఇంతకన్నా పెద్ద షెడ్యూల్ ఏమీ ఉండేది కాదు నాకైతే. "చిరంజీవి" కి అప్పటికే రెండూళ్ళుగా పెద్ద అభిమానిని. "చిరంజీవి" సినిమానీ "కావలి" లోనే చూసిన గుర్తు. కొత్తగా ప్రయోగం చేసి ప్రేక్షకులని మెప్పించలేకపోయిన క్యారెక్టర్ లో నాకైతే ఈ సినిమా లో "చిరంజీవి" నటన బాగా నచ్చింది. "రాజా లా వెలుగు...మారాజై బ్రతుకు" అంటూ సినిమా మొదట్లోనే వచ్చే పాట భలే నచ్చేసింది. ఇందులో అంత పెద్ద పెద్ద అందమైన కళ్ళతోనే హావభావాలు ఒలికించగల నటి "భానుప్రియ" కి  కళ్ళుండీ చూపులేని గుడ్డి అమ్మాయి వేషం ఇవ్వటం ఒక్కటే నచ్చలేదు. ఆ సినిమా నిర్మాత నీ, డైరెక్టర్ నీ తిట్టుకున్నా.

ఇక ఈ బొమ్మ లోగిలి లోనికి తొంగి చూస్తే, ఎక్కువగా కనిపించేది ఫౌంటెన్ పెన్ తో గీసిన బ్లాక్ ఇంక్  గీతలు. అక్కడక్కడా పేపర్ కనపడకుండా పూర్తి బ్లాక్ బ్లాక్స్ ఉన్న చోట బ్లాక్ స్కెచ్ పెన్ను తో గీసిన లావు పాటి స్ట్రోక్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అప్పట్లో నాకు ఇంట్లో అందుబాటులో ఉన్న నాసి రకం నోట్ బుక్ పేపర్ మీద వేసిందే ఇది. ఏ పోర్ట్రెయిట్ అయినా ఎడమ కనుబొమ్మతో మొదలు పెట్టి అలా వేసుకుంటూ పోయేవాడిని. ఈ బొమ్మ వేస్తూ పోతే నడుము, మోచెయ్యి సగం వరకే పేపర్ లో పట్టి ఆ తర్వాత పేపర్ సరిపోక నన్ను పట్టి ఆపింది.  అయినా నేనాగలా. ఆ వేసుకున్న జాకెట్, చెయ్యి కింది భాగం వరకూ వేసి బొమ్మ పూర్తిచెయ్యాలని నా సంకల్పం. ఆ బొమ్మ వేసిన పేపర్ ని ఇంకొంచెం పెద్ద పేపర్ మీద డయాగనల్ గా అంటించి, మిగిలిన భాగం పూర్తి చేశా. సంతకం మోచెయ్యి కింది భాగం కొంత, నడుము నుంచి కింది దాకా ఇంకో పేపర్ మీద వేసింది. అలా ఒక్కొకసారి వింత ప్రక్రియలు చేసేవాడిని. "Necessity is the mother of invention" అన్న నానుడి బహుశా ఇలా పుట్టిందే! అలా రెండు వేరు వేరు పేపర్స్ పైన ఆవిష్కరించిన బొమ్మ ఇదొక్కటే అనుకుంటా. అప్పటి దాకా ఒక్క వెంట్రుక కూడా చెదరని క్రాఫుతో కనిపించే యన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల (చిన్న రింగు మినహా) విగ్గులు వెయ్యటంలో ఏ మాత్రం థ్రిల్ ఉండేదే కాదు. "చిరంజీవి" రేగిన సొంత క్రాఫ్ లో ఉండడంతో ఆ హైర్ స్టైల్ ని ఇందులో ఆసక్తిగా వేశా. అప్పట్లో వేసిన బొమ్మల్లో జుట్టు వెయ్యటంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేసే వాడిని. తర్వాత "ఇంజనీరింగ్ కాలేజి" లో నా బొమ్మలు అభిమానించే ఫ్రెండ్ "వాసు" ఒకసారి నేను వేసిన "భాను ప్రియ" బొమ్మ చూసి, "హెయిర్ వెయ్యటం లో స్పెషలిస్ట్ గిరీ నువ్వు" అంటూ కితాబిచ్చాడు. అప్పటి దాకా నన్ను నేనే గమనించుకోలా, నిజంగానే హెయిర్ వెయ్యటం లో మరి కాస్త శ్రద్ధ పెడుతుంటానని. అదే శ్రద్ధ ఇప్పటికీ వేసే బొమ్మల్లో కనిపిస్తూనే ఉంటుంది.

తెలుగు హీరోల్లో "చిరంజీవి" ని ఎక్కువగా, ఎక్కువ కాలం అభిమానించా. కావలి "లత థియేటర్" లో ఇంటర్వల్ ముందు వేసిన "యమకింకరుడు" ట్రెయిలర్ చూసిన క్షణం నుంచీ మొన్నటి "సైరా నరశింహా రెడ్డి" దాకా. ఆ మధ్య ఆయన రాజకీయ "రంగ ప్రవేశం" చేస్తుంటే, మృదు భాషి, ఎవ్వరినీ నొప్పించని మనస్తత్వం కల వ్యక్తి, నిజంగా ప్రజలకి ఏదో మంచి చెయ్యలన్న తాపత్రయంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాడనీ, "రాజకీయ రంగం" పైనా అప్పటి రాజకీయ నాయకుల్ని "సినిమా రంగం" పై ఎదుర్కొన్నట్టు సమర్ధంగా ఎదుర్కొని నిలబడగలడనీ "ప్రజా సేవ" అంటే ఏంటో కులమతాలకతీతంగా చూపించి సత్తా చాటగలడనీ, "చిరంజీవి" గా అందరి హృదయాల్లో నిలిచిపోగలడనీ, నిలిచిపోవాలనీ ఆశించా, ఆకాంక్షించా. కానీ భిన్నంగా "యూ టర్న్" కొట్టి "మళ్ళీ రాననుకున్నారా, రాలేననుకున్నారా" అంటూ వెండి తెర మీద కుర్రకారు స్టెప్పులకే పరిమితం అయిపోయాడు. డెబ్భయ్యవ వడిలోనూ కష్టపడి కుర్రోడిలా కనపడాలని మేకప్పుతో కుర్ర హీరోయిన్లతో ఎగరటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంటే - చిన్నపుడు యన్.టి.ఆర్, ఏయన్నార్ ని తిట్టుకునే వాళ్ళం, ఇపుడు నువ్వు కూడానా? నువ్వు చెయ్యని ఫైట్లూ, వెయ్యని స్టెప్పులూ ఇంకేం మిగిలాయని? ఈ తరం కి నువ్వేంటో ఈ వయసులో నిరూపించాలా? అది సాధ్యమా? వయసుకి మించిన పాత్రలు వేసి అప్పట్లోనే మెప్పించావ్, వయసుకి తగ్గ పాత్రలు వేసి ఇప్పుడు మెప్పించలేవా? అలా చేస్తే నాలాంటి అప్పటి నీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ "చిరంజీవి" గా మిగిలిపోవా? అని అనుకుంటూ ఉంటా.

"చిరంజీవి" - హీరో కాక ముందే "కావలి" లో ఒంగోల్ బస్టాండు దగ్గర ఒక పాత ఇంటి పై ఒక రూములో వెలసిన "చిరంజీవి అభిమాన సంఘం" కి ఆయనే స్వయంగా నెల్లూరు నుంచి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఓపన్ చేశాడనీ, బూజు పట్టి, మాడి పోయిన కరెంట్ బల్బ్ తో ఉన్న రూముని కొంచెం శుభ్రం చెయ్యించి బల్బు కొనుక్కోమని డబ్బులిచ్చాడనీ, హీరో అయ్యాక "కావలి" లో చాలా మంది నోట విన్నా. చిరంజీవి పై నా అభిమానానికి పడ్డ "పునాది రాళ్ళు" లో నేను విన్న ఈ "సంఘటన" కూడా ఒకటి.

ఒక "చిరంజీవి" అభిమాని గా నా "నీ బొమ్మల" హృదయాల్లోని మాటలివి - ఈ సమాజం నీ "స్వయం కృషి" ని, నీ ప్రతిభనీ మెచ్చి "విజేత" గా నిన్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన "ఆలయ శిఖరం" పైన "మగ మహారాజు" లా కూర్చోబెట్టింది. ఎవరికీ అందని ఆ ఎత్తున ఉన్నా, "అందరి వాడు" గా తిరిగొచ్చి సమాజానికి పెద్ద ఎత్తున నీ వంతు సహాయం చెయ్యగల మార్గం నీ బాటలో ఎదురొస్తే, అలా తొంగి చూసి మాత్రమే వెనక్కి తిరిగి "అందని వాడు" గా రానని వెళ్ళిపోయావ్. అప్పటి నీ స్థాయికి మించి కావలి లో "నీ అభిమాన సంఘం" కి నువు చేసిన సాయం గుర్తెరిగి, ఇప్పటి నీ స్థాయికి తగ్గ సాయం చెయ్యగలవన్న "అభిలాష" తో ఆ దేవుడే అవకాశం ఇచ్చినా వద్దనుకున్నావ్. "ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా?" అని ఎందరడిగినా వెనుదిరిగి చూడకుండా గుర్తించకనే వెళ్ళి పోయావ్. నీకన్నీ ఇచ్చిన ఈ సమాజానికి తిరిగిచ్చే అవకాశం వద్దని, ఆ సమాజం గుండెల్లో "చిరంజీవి"వి కాలేకపోయినా, పరిమితమయిన "తెలుగు వెండి తెర" వరకే నీ పేరుని పరిమితం చేసుకున్నా, తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ "చిరంజీవి" వే! సార్ధక నామధేయుడవే!

"చిరంజీవి చిరంజీవ"!

"అన్నీ ఇచ్చిన సమాజానికి తన వంతు తిరిగి ఇవ్వగలిగిన ప్రతి జీవీ చిరంజీవే."
~ గిరిధర్ పొట్టేపాళెం

Thursday, June 4, 2026

డియర్ బాలు . . .

Sri. S. P. Balasubramanyam
Watercolors on Paper (8" x 10")

ప్రియమైన "బాలు" కి
పుట్టినరోజు శుభాకాంక్షలు! 💙

The making video...






Sunday, May 31, 2026

Happy Birthday my Childhood Superstar...

 
Ink and Watercolors on Paper (5" x 7")


Happy Birthday Dear Krishna
My childhood Superstar of Telugu Silver screen ❤️💐

My Tribute to Krishna
Evergreen Superstar of Tollywood

Saturday, August 23, 2025

మెగా శిల్పి...

Portrait of Chiranjeevi
Pen on paper 8.5" x 11"

"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు" అన్న మాటలకి నిలువెత్తు నిదర్శనం "చిరంజీవి". ఏ రంగంలో అయినా రాణించాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు, కృషీ, పట్టుదలతోబాటు క్రమశిక్షణ కూడా అవసరం. ఇవన్నీ కూడగట్టుకుని ఒక్కొక్క మెట్టూ ఎక్కి శిఖరం చేరిన "చిరంజీవి". 

"చిరంజీవి చిరంజీవ!"

"ఎక్కిన ప్రతి మెట్టు గుర్తున్నపుడే శిఖరం పై విలువ." ~ గిరిధర్ పొట్టేపాళెం

~~~ *** ~~~


Friday, February 7, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 28 . . .

 
Padma Bhushan Shobana - Autographed Sketch
Classical Dancer & Indian Actress 
Pencil on paper (11" x 14")

గిర్రున తిరగే కాలం ఎవరికోసమూ ఒక్క క్షణం కూడా ఆగదు. కాలంతో అనుక్షణమూ అలుపెరుగని పరుగే జీవితం. ఆగని కాలం పరుగు లాగే మన పరుగు నీ ఆపలేం, కానీ కొన్ని క్షణాలని మాత్రం పట్టి మన మదిలో బంధించి ఆపుకోగలం. మదిలో బంధీ అయిన అలాంటి క్షణాలే కాలక్రమేణా జ్ఞాపకాలై గాలుల్లా వీస్తూ అప్పుడప్పుడూ మదిలో సడి, సందడి చేస్తూ, ఒక్కొకప్పుడు అలజడి రేపుతూ ఉంటాయి. కాలంలో కలిసి కరిగి కనుమరుగయినా ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటాయి.

చికాగో లో ఐదేళ్ళున్నాం. సిటీ నుంచి అరగంట దూరంలో సబర్బ్స్, నేపర్ విల్ టవున్ లో ఉన్న ఒక సంవత్సరం లో ఎప్పటికీ మర్చిపోలేని మూడు అద్భుత జ్ఞాపకాలు మదిలో ఇప్పటికీ అద్భుతంగా నిలబడి పోయాయి. అందులో ఒకటి "శోభన" గారు అరోరా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో "సాంప్రదాయ" అన్న టైటిల్ తో చేసిన మూడు గంటల నృత్య రూపకం. నేపర్ విల్ లో మేముంటున్న అపార్ట్మెంట్స్ నుంచి పదిహేను నిమిషాల డ్రైవింగ్ దూరంలోనే ఉండేది టెంపుల్. కాబట్టి తరచూ వెళ్ళేవాళ్ళం. చాలా ప్రశాంతమైన ప్రాంగణం, విశాలంగా చూడ చక్కని టెంపుల్. అక్కడి పూజార్లు ఎక్కువగా తమిళం వాళ్ళు. హారతి, పూజలు, అర్చనలు అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా చేసేవాళ్ళు. మా రెండవ అబ్బాయి "భువన్" అన్నప్రాసన కూడా అక్కడే చేయించాం. "భువన్" పుట్టినపుడు అమ్మ వచ్చి మాతో ఉన్న కొద్ది నెలలు అమ్మని తీసుకెళ్ళిన అతి కొద్ది ప్రదేశాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. అలా ఆ టెంపుల్ లో చాలా జ్ఞాపకాలున్నాయి.

దీపావళి సెలెబ్రేషన్స్ ఆ టెంపుల్ లో బాగా చేసేవాళ్ళు. ప్రత్యేక పూజలతోబాటు సాయంత్రం చీకటి పడ్డాక టెంపుల్ బయట ఫైర్ వర్క్స్ కూడా ఉండేవి. అంతే కాకుండా ఆ ప్రాంగణంలో  "దీపావళి టపాసులు" కొని కూడా కాల్చుకోవచ్చు. 2003 దీపావళి సాయంత్రం "శోభన" గారి ప్రత్యేక సాంప్రదాయ నృత్యం ఉందని తెలిసి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం. నిజానికి నాకప్పుడు "శోభన" గారు కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ గా మాత్రమే తెలుసు. గొప్ప డ్యాన్సర్ అని తెలీదు. డ్యాన్స్ అంటే నాకున్న ఇష్టంతో హైదరబాద్ లో DGP (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఆఫీస్ లో పని చేస్తున్నపుడు ఎదురుగానే ఉండే "రవీంద్ర భారతి" లో అప్పుడప్పుడూ ఆఫీస్ అయ్యాక సాయంత్రం ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూస్తుండేవాడిని. అంతకు మించి ప్రొఫెషనల్ కళాకారుల డ్యాన్స్ ఎపుడూ చూడ్లేదు.

సాయంత్రం 7 గంటల ప్రోగ్రామ్ కి ఆరోజు మధ్యాహ్నం 4 కల్లా రెడీ అయి కూర్చున్న నాకు మదిలో తళుక్కున మెదిలిన ఆలోచన- "శోభన" గారి బొమ్మ వేసి తీసుకెళ్ళి వీలైతే కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటేనో. ఆలోచనే తడవుగా అప్పటికప్పుడు కూర్చుని ఆ ప్రోగ్రామ్ పాంప్లెట్ మీద ప్రింట్ అయిన బ్లాక్ అండ్ వైట్ నృత్య భంగిమ నే చూసి ఈ బొమ్మ గబ గబా పెన్సిల్ తో వేశాను. కాలేజ్ డేస్ లో నా బొమ్మల ప్రస్థానం వాటర్ కలర్ పెయింటింగ్స్ దాకా వచ్చి, ప్రొఫెషనల్ లైఫ్ తో ఒక పదేళ్ళు బొమ్మలు వేయటంలో గ్యాప్ వచ్చి ఆగినా, అడపా దడపా అప్పుడప్పుడూ ఏవో బొమ్మలు గీస్తూనే ఉండేవాడిని. అయితే అప్పటికి గత కొన్నేళ్ళుగా సీరియస్ గా బొమ్మలు వేసిందయితే లేదు. పెయింటింగ్స్ లాంటివి వేసేందుకు నా దగ్గర సరయిన మెటీరియల్ కూడా అప్పుడు లేకపోవటంతో పెన్సిల్ తోనే అప్పుడప్పుడూ ఏవో గీసేవాడిని.

అలా వేసిన ఆ బొమ్మని మాతో తీసుకెళ్ళాను. టెంపుల్ కింద బేస్ మెంట్ లో ఉన్న హాల్ లో ప్రోగ్రామ్. అన్ని సీట్స్ ఫుల్ అయ్యాయి. లైట్స్ ఆఫ్ అయ్యాక "శోభన" గారు స్టేజ్ మీదికొచ్చి తను చేస్తున్న నృత్యం గురించి ఇంగ్లీష్ లోనే వివరిస్తూ చాలా చక్కగా మాట్లాడారు. మాట్లాడిన తీరు చాలా ఆకట్టుకుంది. ఇంకా డ్యాన్స్ చూడలేదు, ఒక సినిమా హీరోయిన్ గా నాకు తెలిసిన "శోభన" గారు అంతకన్నా ఇంకేదో ఎక్కువ అని మాత్రం అప్పుడే గ్రహించాను. ప్రోగ్రామ్ ముందు ఎవ్వరూ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తియ్యొద్దని చాలా స్ట్రిక్ట్ గా "శోభన" గారే నొక్కి మరీ మరీ  చెప్పారు, కారణం ఏకాగ్రత దెబ్బతింటుందనీ, చేస్తున్న నృత్యానికి న్యాయం చెయ్యలేమనీ వివరించి మరీ చెప్పారు. "సాగర సంగమం" లో "ఓం నమః శివాయ" పాట గుర్తొచ్చింది. ఫొటోస్ తియ్యాలని SLR కెమెరా, వీడియో కూడా తియ్యాలని క్యామ్ కార్డర్ తీసుకెళ్ళాను. అంతగా చెప్పాక ఇక వాటికి బయటికి తీసే సాహసం చెయ్యలేదు. నేనే కాదు ఎవ్వరూ చెయ్యలేదు.

మూడు గంటల పాటు ఏకధాటిన మధ్యలో నాలుగైదు నృత్యం బ్రేక్స్ లో తరువాతి రూపకం ని వివరిస్తూ, ఆ ప్రోగ్రామ్ లో ప్రధాన నృత్యకారిణీ ఆమే అయిన "శోభన" గారే స్టేజి మీద వక్త, అంతా తనే అయ్యి నిశ్శబ్ధ వాతావణం సృష్టించి ఎంతో గొప్పగా చేసి అలరించి, చివర్లో అందరి కరతాళధ్వనులతో  మెప్పించారు. ఆఖర్న ఆ నృత్యరూపకం డిజైన్ చేసింది కూడా తనే అని చెప్పటం తో, "ఇంత గొప్ప నృత్య కళాకారిణి యా" అన్న నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఒక్క "రుద్రవీణ" లో తప్ప ఇంకే సినిమాలో "శోభన" గారు నృత్యం పెద్దగా చూసిన గుర్తులేదు. ఏ తెలుగు సినిమాలో కూడా చెయ్యలేదు. కమెర్షియల్ సినిమాలపైపు పరుగెడుతున్న 1980 దశకం లో ఆమె నటించిన సినిమాలు, బహుశా ఏ డైరెక్టర్ ఆ కోణంలో ఆమెతో సబ్జెక్ట్ చెయ్యలేదు, చేసుంటే బాగుండేది అనిపించింది. ప్రోగ్రామ్ అయ్యాక అప్పటికే రాత్రి 10 కావటంతో హాల్ అంతా ఖాళీ అయిపోయింది. స్టేజి మీద "శోభన" గారు, తనతో నృత్యం చేసిన డ్యాన్సర్స్ ట్రూప్ మాత్రమే మిగిలారు. అంతా మూడు గంటల నృత్యంతో చాలా అలసిపోయి ఉన్నారు, "ఆకలి గా ఉంది" అని తోటి కళాకారిణులతో "శోభన" గారు మాట్లాడటం వినిపించింది. తపటాయిస్తూనే బొమ్మ తీసుకుని స్టేజి మీదికెళ్ళి పలకరించి, బొమ్మ చూపించి ఆటోగ్రాఫ్ కోసం అడిగాను. చూసి "ఇది నేనేనా, చాలా బాగుంది" అంటూ పెన్ తో ఆటోగ్రాఫ్ చేశారు. మా ఆవిడ, పిల్లల్తో ఒక ఫొటో కూడా తీశాను. ఆ రోజలా చేసిన నృత్యరూపకం తో "శోభన" గారు "సినీ హీరోయిన్" గా కాక "ఒక గొప్ప నృత్య కళాకారిణి" గానే నాకెప్పటికీ గుర్తుండిపోయారు.

తర్వాత అదే టెంపుల్ లో ఒకసారి గాన కోకిల "సుశీల" గారి ప్రోగ్రామ్ ఉందంటే టికెట్స్ కొనుక్కుని వెళ్ళాం. లైవ్ లో "సుశీల" గారి కంఠం వినటం చాలా బాగా అనిపించినా, ఒకటీ అరా తప్ప ఎక్కువ తమిళం పాటలే పాడి తమిళం లోనే మాట్లాడ్టం నాకెందుకో కొంచెం మనసుకి కష్టంగా అనిపించింది. ప్రోగ్రామ్ అయ్యాక కలిసి పలకరించాము, అయితే "సుశీల" గారి బొమ్మ వేసి తీసుకెళ్ళలేకపోయాను, అయినా బయట కార్ లో నా స్కెచ్ బుక్ ఉండటం గుర్తొచ్చి, వెళ్ళి తీసుకొచ్చి అందులో ఒక ఖాళీ పేజి లో ఆటోగ్రాఫ్ అడిగాను. బుక్, పెన్ కూడా చేతిలోకి తీసుకుని "తెల్ల కాగితం మీద నేను పెట్టను" అని ఇచ్చేశారు. బిత్తరపోయి "వేరే పేజీలు చూపించి, ఇది నేను బొమ్మలు వేసే స్కెచ్ బుక్, మీ బొమ్మ వెయ్యలేకపోయాను, ఈ పేజి లో పెడితే ఆటోగ్రాఫ్ తో ఉండే మీ బొమ్మ వేద్దామని" అన్నాను. "భలే వారే మీరు, తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకుని నా అస్తి అంతా రాయించేసుకుందామనా, నేను పెట్టను గాక పెట్టను" అని మరింత కఠినంగా అన్నారు. ఆ మాటతో నా మనసు మూగబోయింది, మది చిన్నబోయింది. అయినా, అప్పుడు జేబులో ఉన్న ప్రోగ్రామ్ టికెట్ ముక్క తీసి దాని మీద పెట్టమని అడిగితే పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజి లో ఉన్నపుడు మేము అనుకునే ఒక మాట జ్ఞాపం గుర్తొచ్చింది- ఎక్కడో ఎప్పుడో ఇలానే ఇళయరాజా గారిని కొంచెం కఠినంగా ఏదో అన్నారని అందుకే తర్వాత సుశీల గారితో పాడించటం మానేశారనీ - జ్ఞాపకం వచ్చి నిట్టూర్పు నవ్వుతో వెనుదిరిగాను. ఆ టికెట్ ముక్క మీద పెట్టిన ఆమె సంతకం ఎక్కడ పడి పోయిందో, నా దగ్గరైతే ని(వి)లువ లేదు.

అదే టెంపుల్ లో ఒకసారి NTR కాలం నాటి నటీమణి "రాజసులోచన" గారినీ కలిశాం. పక్కనే నిలబడ్డ మమ్మల్ని ఆవిడే పలకరించి మాట్లాడారు. నేనైతే గుర్తు పట్టలేదు, ఆవిడ చెప్పేదాకా. ఇప్పుడు చికాగోలోనే వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉంటున్నానని చెప్పారు. తర్వాత రెండు మూడు సార్లు అలానే టెంపుల్ లోనే కలిశారు, కలిసినప్పుడల్లా మమ్మల్ని గుర్తుపెట్టుకుని చాలా ఆప్యాయంగా పలకరించేవారు.

అలానే ఒకసారి మరో టెంపుల్ లో సినీ హీరో "సుమన్" గారిని ఒక తెలుగు పండగ ఫంక్షన్ లో కలిశాం. పిల్లల్ని దగ్గరికి తీస్తూ చాలా బాగా మాట్లాడారు. ఇంకా "S.P. బాలు" గారినీ, "S.P. శైలజ" గారినీ, "మల్లిఖార్జున్, పూర్ణిమ" గార్లనూ చికాగో లో వాళ్ళు నిర్వహించిన ఒక మ్యూజికల్ కన్సర్ట్ లో కలిసిన అనుభూతి చాలా తియ్యనిది. ఆ తియ్యని భావాలన్నీ "బాలు" గారి దీవెనలతో సంతకం పెట్టిన, అప్పటి బాలు గారి బొమ్మ వెలుగుని చూస్తూ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడితేనే బాగుంటుంది. ఇలా సెలెబ్రిటీస్ ని ఇండియా లో కలవాలంటే అంత సులభం కాదు. అక్కడి అధిక జనాభా తో అంత అందుబాటులోకి రారు.

చికాగో లో ఉన్న ఆ కొద్ది కాలంలో మూడు అనుభూతులు మాత్రం ముచ్చటగా ఎంతో గొప్పగా మదిలో అలానే నిలిచి పోయాయి. ఒకటి "బాలు గారి మ్యూజికల్ కన్సర్ట్", రెండు "శోభన గారి నృత్యం",  మూడు అపుడే ఆవిష్కరించిన అద్భుతమైన శిల్పకళా కట్టడం, ప్రపంచ ఎనిమిదవ వింత అని చిచాగో న్యూస్ పేపర్స్ సైతం కొనియాడిన "BAPS, శ్రీ స్వామి నారాయణ టెంపుల్". ఈ మూడు కళ్ళారా చూసి స్వయానా పొందిన అనుభూతులు కలకాలం తియ్యగా, నా మదిలో అద్భుతాలుగా మిలిగి పోయాయి.

ఈ మధ్య "శోభన" గారిని భారత ప్రభుత్వం ఏటా కొందరిని ఎంపిక జేసి రిపబ్లిక్ డే నాడు ప్రకటించి బహూకరించే అతున్నత పురస్కారాల్లో ఒకటైన "పద్మ భూషణ్" వరించిందని తెలిసి చాలా సంతోషం వేసింది. నాట్య కళకే అంకితం అయిన ఆవిడ ఇప్పుడు డ్యాన్స్ స్కూల్ నడుపుతూ ప్రపంచం అంతటా వివిధ నృత్యరూపకాల ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. అలాంటి "నాట్య మయూరి" కి "పద్మ భూషణ్" పురస్కారం వచ్చి ఆ పురస్కారాని కే వన్నె తెచ్చినట్టయ్యింది. అంత గొప్ప కళాకారిణి బొమ్మ వెయ్యటం, ఆమెని కలవటం, ఆ బొమ్మ మీద ఆటోగ్రాఫ్ అంతా ఒక గొప్ప వరం. తర్వాత పన్నెండేళ్ళకి "శోభన" గారి నృత్యం ఫొటో ఆధారంగా ఒక వాటర్ కలర్ పెయింటింగ్ వేశాను. "బోస్టన్" లో ఒక "ఇండియన్ క్లాసికల్ మ్యూజికల్ ఫెస్టివల్" లో కొంతమంది ఇండియన్ ఆర్టిస్ట్ లము కలసి పెట్టిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ఒక కళాభిమాని చూసిందే తడవుగా మెచ్చుకుని "చెక్ బుక్" తీసి, పెట్టిన వెల రాసి, భద్రంగా ప్యాక్ చెయించుకుని పట్టుకుపోయారు.

ఐదేళ్ళపాటు చికాగో నుంచి బోస్టన్ వచ్చేయవలసి వచ్చింది. వచ్చే ముందు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పెద్దదిగా విస్తరణ చేస్తూ చేపట్టిన విరాళాల సమీకరణలో, రెండొందల డాలర్స్ డొనేషన్ కి ఒక ఇటుక రాయిపైన మనం ఇచ్చిన పేర్లు రాసి ఒక చోట చిరస్థాయిగా నిలబడి ఉండే కట్టడంలో నా వంతు భాగం అయ్యాను. మా చిన్నపుడే మమ్మల్ని వీడి వెళ్ళిపోయిన "నాన్న రామచంద్రయ్య, చెల్లెలు లక్ష్మి" ల తోబాటు, మాకోసమే పుట్టి తన జీవితం మాకోసమే అంకితం చేసిన "బామ్మ" పేర్ల మీద ఇచ్చి "బోస్టన్" వచ్చేశాము.

ఇప్పటికి 20 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడచిపోయింది, మళ్ళీ ఇంతవరకూ "చికాగో" కి వెళ్ళనే లేదు, వెళ్తే టెంపుల్ కి వెళ్ళి ఆ రాయి మీద అక్షరాలు చేతుల్తో తాకి చూడాలనీ, అక్కడే "శోభన" గారి డ్యాన్స్ చూసిన ఆ అనుభూతిని, ఇప్పుడు మన మధ్య లేని "రాజ సులోచన" గారి పలకరింపుల్నీ, మళ్ళీ ఆ నేలపైన గుర్తుచేసుకోవాలనీ మాత్రం బలంగా మదిలో చాలా కాలంగా ఉంది. కాలం ఆ అవకాశం ఎప్పుడు ఇస్తుందో అని ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా ఇవ్వలేదు, కానీ ఇస్తుంది అని మాత్రం తెలుసు. ఎప్పుడో, ఎలాగో అన్నది మాత్రం ఆ కాలానికే తెలుసు...

"మనోనిశ్చయం ముందు కాలం తలవంచక తప్పదు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

అప్పటి "శోభన" గారి ప్రోగ్రామ్ ప్రకటన...
----------------------------------------------------------------------------------------------------------------
Sri Venkateswara Swami (Balaji) temple, Aurora, IL & The Chicago Tamil Sangam 
Jointly Present
A Grand Diwali Program
"SAMPRADAYA"
A Live Musical Dance Ballet
By
SHOBANA
Saturday, Oct 25 At 7:00 PM
At the Temple Auditorium
Donors & Patrons : $100, $50 (Seats Closer to the Stage)
General Seating: $25 and $15
----------------------------------------------------------------------------------------------------------------

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, August 3, 2024

కళాభినేత్రి...

కళాభినేత్రి వాణిశ్రీ
ballpoint Pen on Paper (8.5" x 11")
 
చాలా కాలం నాటి కోరిక, నా చిన్నప్పటి అభిమాన నటి "వాణిశ్రీ" గారి బొమ్మ వెయ్యాలని. ఈరోజు సోషల్ మీడియా లో వాణిశ్రీ గారి పుట్టినరోజని తెలిసి, నాకిష్టమైన "ప్రేమ్ నగర్" సినిమా లోని "తేటతేట తెలుగులా..." పాటలో ఒక ఫ్రేమ్ ఎంచుకుని వేశాను, a quick line drawing with ballpoint pen.

💐   వాణిశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు!

Saturday, June 3, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 9 ...

The beautiful Divya Bharati - 1993
Ballpoint Pen on Paper (8.5" x 11")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 8                                                          నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 -->

దివ్య భారతి - ఒక్క పేరులోనే కాదు ఆమె అందం లోనూ దివ్యం ఉండేది, చూడ చక్కని రూపం. వెండి తెరపై అతికొద్ది కాలంలోనే దివ్యమైన వెలుగు వెలిగి 19 ఏళ్ళకే చుక్కల్లోకెగసిన తార. ఇప్పుడెందరికి గుర్తుందో, 1990 దశకంలో అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో వెండితెరపైకి స్పీడుగా దూసుకొచ్చిన సి(నీ)తార. వచ్చినంత స్పీడుగానే జీవితం తెరపై నుంచీ నిష్క్రమించింది. అప్పటి వార్తాపత్రికల్లో  ఆ(మె) ఆకస్మిక నిష్క్రమణంకి అనేక కథనాలు కూడా రాశారు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు. ప్రింట్ అయి చేతికందిందే న్యూస్. న్యూస్ పేపర్ లో రాసి నమ్మిస్తే ఏదైనా నమ్మక తప్పదంతే!

కాలచక్రంలో ముప్పై ఏళ్ళు వెనక్కి  - 1993...

"దివ్య భారతి" ని సినిమాల్లో చూసిన ఎవ్వరూ జీర్ణించుకోలేని "ఆమె ఇకలేరు" అన్న వార్త - ఆ బాధాకరమైన వార్త తర్వాతి రోజు సాయంత్రం హైదరాబాద్‌ TCS ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి, "డక్కన్ క్రానికల్" దినపత్రిక, ఈవెనింగ్ ఎడిషన్‌లో ఆమె గురించి ప్రచురితమైన శీర్షికాకథనం చదువుతూ, మా రూమ్‌మేట్స్ అందరం ఆమె గురించి మాట్లాడుకోవడం ఇంకా గుర్తుంది. "అయ్యో, She is still young!" అని అందరం బాధపడ్డాం. ఆ శీర్షికలో అచ్చయిన "దివ్య భారతి" బ్లాక్ అండ్ వైట్ ఫొటో చూసి స్ట్రెయిట్ బాల్ పాయింట్ పెన్ తో వేసిన లైఫ్ (లైన్) స్కెచ్ ఇది.

చాలా క్యాజువల్ గా పేపర్ లో ఫొటో చూడగనే అప్పటికప్పుడు నా పుస్తకాలపై దొరికిన కంప్యూటర్ ప్రింటవుట్ కి వాడిన పేపర్. ఒక వైపు నా Resume ప్రింట్ కూడా అయ్యుంది. న్యూస్ పేపర్ చూస్తూ పెన్ తీసుకుని కొద్ది నిమిషాల్లో ఆ పేపర్ వెనుకవైపు వేసిన ఈ బొమ్మ నా బొమ్మల్లో అన్ని విధాలా ఎప్పటికీ ప్రత్యేకమే.

ఒక్కొకసారి ఆ క్షణంలోనే బొమ్మ వేసెయ్యాలన్న 'స్పార్క్' లాంటి కోరికకి కార్యరూపం ఇస్తే ఫలితం చాలావరకూ అద్భుతంగానే ఉంటుంది. ఒక్కొకసారి అలాంటి ఆ 'స్పార్క్' ని ఆ క్షణంలోనే పట్టుకుని మరికొద్ది క్షణాల్లో కార్యరూపం దాల్చి అది జరగకపోతే ఆ పని ఇంకెప్పటికీ జరగదు. అలాంటి క్షణాన్ని జారిపోకుండా పట్టుకుని వేసిన బొమ్మే ఈ "దివ్యమైన దివ్య భారతి" బొమ్మ. సహజంగా అలాంటి ఆ క్షణాల్లో నైపుణ్యం మరియు ఏకాగ్రత స్థాయిలు రెండూ ఉత్తమోత్తమంగా ఉంటాయి. ఆర్ట్ లో ఉన్న ప్రత్యేక మహత్యం ఏంటంటే గీసిన బొమ్మలో లేదా వేసిన పెయింటింగ్ లో ఫొటో లో కన్నా అందంగా ఉంటారు, అందులోని వ్యక్తులు. అదే ఆర్ట్ లోనూ, ఆర్టిస్టుల్లోనూ ఉన్న ప్రత్యేకత. చాలా క్యాజువల్ గా వేసిన ఈ బొమ్మలోనూ ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. అలా అప్పటికప్పుడు అనుకుని నేను వేసిన కొద్దిపాటి బొమ్మల్లో ఇదీ ఒకటి.

మామూలుగా అప్పటిదాకా బాల్ పాయింట్ పెన్ తో వేసిన  లైన్ స్కెచెస్ అన్నీ బ్లాక్ కలర్ తో వేసినవే. బ్లూ, గ్రీన్ కలర్ బాల్ పాయింట్ పెన్స్ తో వేసిన బొమ్మలు తక్కువే. బహుశా రెడ్ తో వేసిన రెండు మూడు బొమ్మల్లో అప్పటికి ఇది ఒకటి. తర్వాత experiment కోసం రెడ్ బాల్ పాయింట్ పెన్ తో మరికొన్ని వేశాను.

ఈ బొమ్మ వేసిన క్షణాలు ఇంకా బొమ్మలో అలా పదిలంగానే ఉన్నా, ఇప్పుడు పరీక్షించి చూస్తే అప్పుడు ఉన్న లైన్ స్ట్రోక్స్ లో స్పీడు కనిపిస్తుంది. ఆ స్పీడులో ఉన్న కాన్‌ఫిడెన్సూ కనిపిస్తుంది. బొమ్మలో సంతకం మాత్రం ఎప్పుడూ ఇంకా స్పీడుగానే పెట్టేవాడిని. కానీ ఈ బొమ్మలో గీతల్లోని స్ట్రోక్స్ అన్నీ అంతే స్పీడులో ఉండటం విశేషం.

ఆఫీస్ నుంచి వచ్చి బొమ్మ వేసిన ఆ సాయంత్రం ఇంకా గుర్తుంది. బొమ్మ గబ గబా పూర్తి చేసి, అయ్యాక ఫ్రెండ్స్ అందరం కలిసి నడుచుకుంటూ అప్పుడపుడూ వెళ్ళే "నాచారం" చెరువు ఆనుకుని కొత్తగా కట్టిన "వెంకటేశ్వర టెంపుల్" కి వెళ్ళాం. పూర్తి చేసిన  బొమ్మ ఇచ్చే సంతృప్తి లోంచి ఆర్టిస్ట్ అంత త్వరగా బయటికి రా(లే)డు. ఆ రోజు నేనూ అందులోంచి బయటికి రాలేకపోయాను. ఒకవైపు బొమ్మ వేసిన సంతృప్తిలో ఉన్నా, ఆమె ఆత్మ శాంతించాలని ఆ దేవుని ఎదుట నే కోరుకున్నా.

జీవితం అంటేనే రకరకాల సంఘటనల మిళితం. ఏ సంఘటనా ఎప్పుడూ చెప్పి రాదు. కొన్ని మనం అనుకున్నట్టే అవుతాయి, కొన్ని మనం ఎంతగా అనుకున్నా, ప్రయత్నించినా అవవు. కొన్ని జరిగిన సంఘటనలు అసలు చాలా గుర్తుకూడా ఉండవు. గుర్తున్నాయి అంటే ఆ క్షణాల్లో మనం జీవించి ఉన్నట్టే లెక్క. లేదంటే అప్పుడు జస్ట్ బ్రతికున్నాం అంతే. ఒక సినిమా పాటలో ఓ కవి రాసినట్టు "ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం...". పూర్తి కాలం జీవించినా చిన్నదే అనిపించేది జీవితం, కొందరికది చాలా ముందుగానే ముగిసి ఇంకా చిన్నదే అవుతుంది. చిన్నదే అయినా తళుక్కున మెరిసి వెళ్ళి పోయే తోకచుక్కలా కొందరు ప్రత్యేకంగా అలా వచ్చి మెరిసి వెళ్ళిపోతారు. అలా తళుక్కున మెరిసి రాలిన తారే "దివ్య భారతి". ఆ సాయంత్రం ఆమె బొమ్మ వెయ్యకపోయిఉంటే ఎప్పటికీ నా బొమ్మల్లో ఆమెకి స్థానం వచ్చి ఉండేది కాదు.

ఈ బొమ్మ వేసిన క్షణాలూ, అందులోని "దివ్యభారతి" జీవితం లా స్పీడుగా తక్కువే అయినా, నా బొమ్మల్లో ఈ బొమ్మ చూసిన ప్రతిసారీ ప్రత్యేకంగా ఆ సాయంత్రాన్ని, అప్పటి నా రూమ్ మేట్స్ నీ, హైదరాబాద్ లో గడచిన బ్యాచిలర్ జీవితాన్నీ గుర్తుకి తెస్తుంది, మదిలో మెరిసి మాయమవుతూ...తళుక్కుమని ఆకాశంలో మెరిసి మాయమయే "తోకచుక్క" లా...

"జీవితం రవ్వంతే కానీ అదిచ్చే అనుభూతులు కొండంత."
~ గిరిధర్ పొట్టేపాళెం

Sunday, March 26, 2023

"జీవిత రంగం" లోని "జీవి తరంగం" ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రరాజం - "రంగమార్తాండ"...

 

ఇద్దరు ధీటైన నటుల "రంగమార్తాండ"

"జీవిత రంగం" పై ప్రతి ఒక్కరూ నటులే. ఇది అందరూ అనేదే, ఒప్పుకునేదే. రకరకాల పాత్రల్లో ఎవరిశైలిలో వాళ్ళు జీవించేస్తారు, కానీ అందర్నీ మెప్పించలేరు. అదే, "రంగస్థలం" పై నటీనటులు నటనలో జీవించేస్తే ప్రతి ఒక్కరి మనసునీ దోచి అందర్నీ మెప్పించేస్తారు. అక్షరాలా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ తమ "నటనా ప్రతిభ" తో  దోచేసుకునే చిత్ర రాజమే - "రంగమార్తాండ".

చాలా రోజుల తర్వాత ధీటైన నటులనుంచి ఇంకా ధీటైన మంచి అద్భుత నటన తోబాటు, విలువలు కూడిన జీవితాన్ని వెండితెరపైనే కాదు మన కళ్ళముందే ఆవిష్కరించిన అనుభూతిని మిగిల్చే సినిమా ఇది.

అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు అనేకన్నా దర్శకుడు "కృష్ణ వంశీ గారు" వాళ్ళందరి నటనలోని జీవాన్ని వెలికితీసి విలువలు కలిగిన, ఎప్పటికీ కాలం చెల్లని కుటుంబ కథాజీవం తో కలిపి అద్భుతంగా ఆవిష్కరించారు అనొచ్చేమో. నటనలో పూర్తిగా పండిన నటీనటులు తలపండిన దర్శకుడి చేతిలో మంచి కధతో కలిసి నడిస్తే ఒక జీవితమే కళ్ళ ముందు ఆవిర్భవిస్తుంది. ఖచ్ఛితంగా ఈ సినిమాలో ఇదే జరిగింది.

"ప్రకాష్ రాజ్" గారు తన విశ్వరూపాన్ని చూపించగల సత్తా ఉన్న పాత్ర లభిస్తే చూపించకుండా ఉండగలరా, ఉంటారా...అచ్చంగా అదే చేశారు. "బ్రహ్మానందం గారు" స్వచ్ఛమైన నవ్వులనే కాదు, నవ్వులంత స్వచ్ఛంగానే ఆర్ద్రతనీ, విషాదాన్ని చేసి చూపించగరని అందరికీ తెలిసినా ఆ సత్తా చాటగల పాత్ర రావటానికి ఇంత కాలం పట్టింది, అంతే...ఇద్దరూ కలిసి హృదయాన్ని పిండేస్తారంతే!

"ఇళయరాజా గారు" ఇచ్చిన సంగీతం మళ్ళీ చాలా కాలానికి వీనులవిందు చేసి వదిలేస్తుంది. ఒకప్పటి, ఎప్పటికీ వినగలిగే స్థాయి సంగీతం మళ్ళీ చాలా కాలానికి.

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు "ఆస్కార్" ని తాకింది. కానీ ఆకాశాన్నైనా తాకగల ప్రతిభ మనకెప్పుడూ ఉంది. ఇలా అప్పుడప్పుడూ వచ్చే "రంగమార్తాండ" లాంటి సినిమాలే అందుకు నిదర్శనం!

ఇప్పటి కాలం, మన చుట్టూనే కాదు మన జీవితాల్లోనూ ఎన్నెన్నో మార్పుల్ని త్వరత్వరగా తెస్తూ అందర్నీ తనతో పరుగులు పెట్టిస్తున్నా...కుటుంబం, బంధాలూ, బాంధవ్యాలూ, మనసులూ, మమతలూ ఎక్కడికీ పోవు, అలానే చెదరకుండా ఎప్పటికీ ఉంటాయి అని ఈ చిత్రం చూస్తే తప్పకుండా నమ్మకం వస్తుంది అనిపిస్తుంది.

తల్లీ, తండ్రి హృదయాలు ఏకాలంలో అయినా ఒకటే. ఇది పిల్లలు ఆకాలంలోనూ, ఈకాలంలోనూ, ఏకాలంలోనూ గ్రహించలేరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయి తల్లీ తండ్రీ పాత్రలు పోషించే కాలం రాక తప్పదు, అప్పుడు ఆ పాత్రల్లో వాళ్ళూ జీవించకా తప్పదు. అలా తరతరాలు ఆ విలువల్ని కాపాడకా తప్పదు...ఇదే "జీవిత రంగం" లోని "జీవి తరంగం"!

Sunday, August 21, 2022

పునాదిరాళ్ళు . . .

 
డియర్ చిరు, పుట్టినరోజు శుభాకాంక్షలు!
🌹🎂🌹

తెలుగు సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా మొదలయిన కాలం లో వచ్చిన కథానాయకులు తమ "ఉత్తమ ప్రతిభ" తో ప్రేక్షకుల్ని మెప్పించి, మెల్లిగా ఆదరణ పొంది, ఊపందుకుని, తారాపథానికి చేరి, కాలం మారినా వయసు మీదపడ్డా తాము మారక, వెండితెరపై కథానాయకుల పాత్రలని వీడక, మరెవ్వరికీ చోటివ్వక, పదోతరగతి పిల్లోడి పాత్ర అయినా, కాలేజి బుల్లోడి పాత్ర అయినా తామే అంటూ విగ్గులతో, ఎబ్బెట్టు డ్యాన్సులతో, డూపు పోరాటాలతో ప్రేక్షకుల్ని మభ్యపెడుతూనే వినోదం పంచుతున్న రోజుల్లో... మారిన కాలానికి మళ్ళీ వాస్తవికత తోడై వస్తున్న చిన్న సినిమాల్లో, ఇంకా చిన్న పాత్రలకి సైతం "పెద్ద న్యాయం" చేస్తూ "అత్యుత్తమ ప్రతిభ" కి నిత్య "స్వయంకృషి"నీ చేర్చి ఒక్కొక్కమెట్టూ ఎక్కుతూ, చేసే ప్రతి పాత్రలో రాణిస్తూ, మరెవ్వరూ అందుకోలేని శిఖరాగ్రాన్ని చేరిన తొలి తెలుగు సినిమా వెండి తెర కథానాయకుడు - "చిరంజీవి". 

చిరంజీవి - పేరుకి తగ్గట్టే అంత సత్తా, అంతే క్రమశిక్షణ, కృషీ, పట్టుదలా కలిగిన ప్రతిభావంతుడు. కనుకే అతి క్లిష్టమైన మార్గమైనా కాలానుగుణంగా పాత్రలకి తగ్గట్టు తననీ మలచుకుంటూ తిరుగులేని సుదీర్ఘ ప్రయాణం కొనసాగించగలిగాడు.

ప్రతిభ ఉన్న ఏ నటుడికైనా సహజత్వంతో పాత్రలో మరింత రాణించాలంటే మంచి కథ, అభిరుచి ఉన్న దర్శకుడితోబాటు "వయసుకి తగ్గ పాత్ర" అనే చిన్న అదృష్టమూ తోడవ్వాలి. కొన్నిసార్లు "వయసుకి మించిన" పాత్రలు చేయాల్సి వచ్చినా తపనతోబాటు ప్రతిభ గల నటులెప్పుడూ అందులో రాణిస్తారు. "బడిపంతులు లో NTR" అయినా, "ధర్మదాత లో ANR" అయినా, "సాగరసంగమంలో కమలహాసన్" అయినా, "ఇద్దరు మిత్రులు లో "చిరంజీవి" అయినా ఇలానే తమని నిరూపించుకున్నారు. అలా అని "వయసుకి సరిపడని" పాత్రల్లో రాణించాలంటే ఎంత ప్రతిభ ఉన్నా ఏ నటుడి తరమూ కాదు, వయసూ సహకరించదు. "అరవై లో ఇరవై" పాత్రలు ఇలాంటివే. వీటిల్లో ఒదగాలంటే సహజత్వం తీసి పక్కనబెట్టాలి. అసహజత్వంతో కూడిన మేకప్పుల్నీ, విగ్గుల్నీ, డూపుల్నీ, కెమెరా విన్యాసాల్నీ నమ్ముకోవాలి. ఎబ్బెట్టు అనిపించినా ఇంకా ప్రేక్షకుల్ని మభ్యపెట్టగలం అన్న ధీమానీ తలకెక్కించుకొవాలి. ఇంకెవ్వరినీ వెండి తెరపైకి రానివ్వని ఆ "ఆక్రమణ" కాలంలో ఆ ఆటలు చెల్లాయి, కానీ కాల భ్రమణంలో ఆ ఆటలు కాలం చెల్లాయి. ఇది వాస్తవం!

అనుభవంతో ప్రతిభకి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ కాలానుగుణంగా ముందుకి వెళితేనే ఏ రంగంలో అయినా వరస విజయాలెదురౌతాయి. వాస్తవాన్ని మభ్యపెట్టి స్క్రిప్టులెంత పగడ్బంధీగా రాసుకున్నా, తమ ఇమేజ్ తో ప్రమోషన్స్ చేసుకున్నా, కధనంలో ఎమోషన్స్ తగ్గి అసహజత్వం ఎక్కువై వాస్తవానికి దూరమైతే సాధారణ ప్రేక్షకుడ్ని మభ్యపెట్టి మెప్పించటం ఈకాలంలో అసాధ్యం. ఎంత తన్నినా బూరెలు లేని ఆ ఖాళీ బుట్టలో వాళ్ళు బోల్తాపడరు. సాధారణ ప్రేక్షకుడి నాడి ఎప్పుడూ సింపులే, ఆ సింప్లిసిటీ ని మెప్పించటంలోనే ఉంది "విజేత"  విజయరహస్యమంతా.

ఈరోజుల్లో కష్టం ఎరగకుండా "ఒక్క హిట్టు"తోనే ఎగిరి చుక్కలెక్కికూర్చుంటున్న నటీనటుల్ని "ఒక్క ఫట్టు"తో నేలమీదికి దించి పడేసే శక్తి - ప్రేక్షకుల్ది. కష్టపడి తారాపథం చేరిన నటీనటుల్ని మాత్రం అంచనాల్ని తలకిందులుచేసినా తరవాతి సినిమాకోసం మళ్ళీ అదే అంచనాలతో ఎదురు చూస్తారు. హిట్టా, ఫట్టా అన్నది వాళ్ళు నిర్ణయించేదే. అందుకే వాళ్లని "ప్రేక్షక దేవుళ్ళు" అని తారలు సైతం పైకెత్తుతుంటారు. దేవుళ్ళని శతవిధాలైన నామాలతో కొలిచి మభ్యపెట్టినట్టు వీళ్ళని మభ్యపెట్టటం కుదరదు, నచ్చని సినిమా వీళ్ళచేతుల్లో ఫట్టే. 

సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తే ఒక సినిమా ఫట్టు అన్నా, ఇంకో మూడుంటాయి, ఆ వరసలో జాగ్రత్త పడటానికి. నాలుగేళ్ళకోసారి అలా తెరపై కనిపించి, వందలకోట్లు అనవసరంగా కుమ్మరించి దానికి రెట్టింపు లాగాలన్న ధ్యాస పక్కనబెట్టకుంటే కెరీర్ చివరి దశాబ్ధంలో వచ్చే రెండు మూడు సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ఏమాత్రం మెరుగవ్వదు. కెరీర్ లో మొదటి దశాబ్దం ఎంత ముఖ్యమో ఆఖరి దశాబ్దమూ అంతే ముఖ్యం. అలాంటివాళ్ళే "బిగ్ బి" లా గుర్తుండిపోతారు. దక్షినాది సూపర్ స్టార్ లు ఇప్పటికైనా మారాలి. ఆ బాటలో ప్రయాణించి, యాభై దాటిన వయసులో ఎలాంటి పాత్రలు చెయ్యాలి అన్న మార్గనికి "పునాదిరాళ్ళు" వెయ్యాలి.

విజయాన్ని డబ్బుతో కొలిచే కాలం. సినిమారంగంలో అయితే డబ్బు వలిచి మరీ కొలిచే కాలం. వందల కోట్లు గుమ్మరించి, రెండింతలు ఆశించేకన్నా, అతి తక్కువలో సహజత్వంతో ఆకట్టుకునే మంచి సినిమా తీసి పదిరెట్లు వచ్చేలా చేసుకోగలగటం ఇప్పుడున్న సినిమా లోకంలో నిజమైన హిట్ అంటే. అభిమానగణం ఉన్న పెద్ద హీరోలకిది మరింత సులభం. చెయ్యాల్సిందల్లా చిన్న సినిమా, అంతే! బడ్జెట్ తగ్గించి, మంచి అభిరుచి ఉన్న దర్శకులతో కలిసి మంచి సినిమాలు తీసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తే రాబడితోబాటు, ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్కు గాడిలోపడి తిరుగుతూ పోతే తట్టదు, పట్టదు.

"సినిమా" మళ్ళీ వాస్తవానికి దూరంగా పరుగులు పెట్టకుండా వెనక్కి మళ్ళించే "పునాది రాళ్ళు" గట్టిగా పడాలి. ప్రచారం మీద కృషి తగ్గి ప్రాచుర్యం మీద పెరగాలి. దీనికీ మళ్ళీ చిరంజీవే శ్రీకారం చుట్టాలి. మళ్ళీ ఒక "పునాది రాయి" గట్టిగా వెయ్యాలి. ఈసారి మరింత గట్టిగా, ఒక కొత్త ఒరవడికి నాంది పలికేలా, అందరు స్టార్ లూ ఆ "మెగా దిశ" గా పయనించేలా.

ఒకప్పటి తెలుగు సినిమా ట్రెండ్ ని మార్చిన "చిరంజీవి" మళ్ళీ మార్చగలడనీ, మారుస్తాడనీ ఆశిస్తూ...

డియర్ చిరు,
పుట్టినరోజు శుభాకాంక్షలు! !
🌹🎂🌹

"ప్రతిభకి కృషి తోడైతే విజయాల బాటని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు." - గిరిధర్ పొట్టేపాళెం

Saturday, May 28, 2022

వందేళ్ళ "యుగపురుషుడు"...

వందేళ్ళ "యుగపురుషుడు"...

N. T. R. ఈ మూడు ఇంగ్లీష్ అక్షరాలు పక్కపక్కన చేరితే పుట్టే ఫైర్ "తెలుగు తేజం"
సాక్షాత్తూ దైవం భువికి దిగెనా అన్నంతగా వెండితెరపై అవతరించిన "అవతారం"
తెలుగు ఉనికినీ, ఉన్నతినీ, భాషనీ ప్రపంచ దశదిశలా ప్రతిష్టించిన "విశ్వరూపం"
ఇక్కడ గర్జిస్తే ఎర్రకోట సైతం ప్రకంపిస్తుందని నిరూపించిన "రాజకీయ సింహం"

వందేళ్ళ నాటి కారణ జననం తెలుగువారి అరాధ్యం నందమూరి "తారక రామం"

Saturday, February 19, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 6 ...

Portrait of Suhasini from the Telugu movie "మంచు పల్లకి"
Free hand Pencil on Paper ()


"తార"లనంటిన నా బొమ్మలు - "స్వర్ణ యుగం"

స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి "భారతదేశ స్వర్ణయుగం" గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో "మన స్వర్ణ యుగం". నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ బొమ్మకీ రెట్టించిన ఉత్సాహంతో ఆగకుండా పరుగులేస్తూ పైపైకి దూసుకెళ్ళిన కాలమది.

అవి నా ఇంటర్మీడియట్ కాలేజ్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. ఎప్పటిలానే పరీక్షలు రాసి కావలి మా ఇంటికి రావటంతో ఆ రెండు నెలలూ ఖాళీనే. రెండవ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముందే చదివెయ్యాలని టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా అవి తెరిచే ఉత్సాహం అస్సలుండేది కాదు. దేనికైనా ప్రేరణ అవసరం. శలవుల్లో చదువుకి మాత్రం అది దొరకటం చాలా కష్టం. చదువు పక్కనబెట్టి ఏం చేద్దామా అని  చూస్తుంటే ఇదుగో మేమున్నామంటూ ముందుకొచ్చేసేవి నా బొమ్మలు. ఇక వాటితో కూర్చుంటే రోజంతా తెలియకుండానే గడిచిపోయేది. ప్రతిరోజూ ఏం సాధించానో తెలీకపోయినా ఏదో సాధించేశానని సంతృప్తిగానే ఉండేది.

దానికి ముందు పదవ తరగతి వరకూ శలవులకి వచ్చినపుడు అడపా దడపా బొమ్మలేస్తూ వచ్చినా వరసగా బొమ్మలు వేసిన కాలం మాత్రం ఈ రెండు నెలలే. వేసినవన్నీ పోర్ట్రేయిట్సే, అవన్నీ నాటి తెలుగు తారాలోకంలో ప్రముఖులవే, అన్నీ పెన్సిల్ తో వేసినవే. కానీ రేఖా చిత్రాలు కాదు. పెన్సిల్ తో వేసిన పెయింటింగ్స్. కొన్ని ఫ్రీహ్యాండ్ తో వేసినవి, కొన్ని అప్పుడే తెలుసుకున్న రహస్య చిట్కాతో వేసినవి. ఆశ్చర్యం ఏంటంటే పరిశీలించి చూస్తే రెండిట్లోనూ పట్టూ, పట్టు వదలని (విక్ర)మార్కూ కనిపిస్తాయి.

అది తెలుగు వారపత్రికలకు "స్వర్ణ యుగ కాలం". అందులో సినిమా పత్రికలూ వచ్చిచేరాయి. సినీతారల ముఖచిత్రాలతో, సెంటర్ స్ప్రెడ్ విశ్వరూపాలతో వారం వారం అందంగా ముస్తాబై వచ్చి పత్రికలన్నీ ఊరూరా బంకుల్లో తోరణాలు కట్టేవి. ఆ తారాతోరణాళ్ళోంచి కొందరు తారలు నా బొమ్మల్లోకి దిగివచ్చిన గురుతులే ఆనాటి నా బొమ్మలన్నీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ కి వేరు వేరు పెన్సిల్స్ అంటూ ఏవీ వాడింది లేదు, వాడింది కేవలం HB పెన్సిల్ మాత్రమే. లైట్ షేడ్ 6H తో మొదలయ్యి 5H, 4H, 3H, 2H, H ఇలా సంఖ్య తగ్గుతూ తర్వాత వచ్చి చేరే HB, అక్కడి నుండి డార్క్ షేడ్ B తో మొదలయ్యి, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B ఇలా సంఖ్య పెరుగుతూ ఇన్ని రకాల లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పెన్సిళ్ళు ఉంటాయని అప్పుడు తెలిసినా అన్ని ఊర్లల్లో అవి దొరకని కాలం, దొరికినా అన్నీ కొనే స్థోమత లేని కాలం.   

ఎండా కాలం, ఇంటా బయటా మండే కాలం. పడమర ముఖం పెంకుటిల్లు, భగ భగ మండే ఎండ వేడి, మధ్యాహ్నం నుంచి పొద్దుగూకే దాకా రోజంతా ప్రతి నిమిషమూ పెద్ద పరీక్షే. బొమ్మ పొద్దునే మొదలుపెట్టినా పూర్తిచెయ్యాలనే దీక్ష మధ్యాహ్నం కొనసాగించక తప్పేది కాదు. మధ్యాహ్నం అయితే పెంకుల కప్పు వేడికి తాళలేక కుర్చీ, అట్టా ఎత్తుకుని సందులో గోడకింద నీడలో చేరేవాడిని. మా ఇంటి గోడకీ, పక్కింటి ప్రహరీ గోడకీ మధ్య సరిగ్గా కుర్చీ పట్టేంత సందు. పక్కింట్లోని తురాయి చెట్టు నీడ కూడా కలిపి ఇంట్లో కన్నా కొంచెం బెటర్ గా ఉండేదక్కడ. అదే ఎక్కువగా మధ్యాహ్నం నా మల్టీ పర్పస్ ఎయిర్ కండిషనింగ్ ఏరియా; స్టడీ రూమ్ + ఆర్ట్ స్టుడియో. ఇంజనీరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్ లోనూ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కూర్చునే చదివాను. డిస్టింక్షన్ మార్కుల ప్రభావం ఆ స్థల మహిమే :)

ఆనాడు "తార"ల లోకాన్నంటిన నా బొమ్మలలోకం లోకి ఈనాడు తొంగిచూస్తే తృప్తిగా అనిపించేవీ, కళ్ళకి కట్టినట్టు మనసుకి కనిపించేవీ:
   . గమ్ముగా అస్సలు కూర్చోలేని స్వభావం
   . ఏదో చెయ్యాలన్న తపన
   . ఎందుకేస్తున్నానో కూడా తెలీకుండానే వేస్తూ పదునెక్కుతున్న బొమ్మలు
   . బొమ్మ బొమ్మకీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
   . ఆ బొమ్మల వెనక పడ్డ కష్టం
   . పడ్డ కష్టం లోంచి లేచి ఎప్పటికీ పదిలంగా మదిలో నిలబడిపోయిన సంతృప్తి
   . ప్రతి బొమ్మలో నిక్షిప్తమైన అలనాటి జ్ఞాపకా(లా)లు

ఎన్నో జ్ఞాపకాల మూటల్ని తమలో కలుపుకుని, నన్ను వదలక నాతోనే ఉంటూ, తెరిచి చూసిన ప్రతిసారీ నా  గతంలోకి నన్ను మళ్ళీ మళ్ళీ లాక్కెళ్ళే నా బొమ్మలు, ఇవే నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ "నిజమైన నా నేస్తాలు", తృప్తిగా నేను తరచూ తలుచుకునే "మధుర క్షణాలు"...

"కళాకారుడు తన కళని పూర్తిగా ఆశ్వాదించేది చుట్టూ ప్రేక్షకులు లేనప్పుడే."
- గిరిధర్ పొట్టేపాళెం

 
"దాసరి నారాయణ రావు"

"రాధ"

 "చిరంజీవి ఖైది"

 "శ్రీదేవి"

"శ్రీదేవి"

 "జయసుధ"

 "జయసుధ"

 "జయసుధ"

"సుహాసిని"

Sunday, December 5, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 1 ...

Suman, Telugu Cine Hero
Ink on Paper 7 1/2" x 5 1/2"


బొమ్మల్లో నా ఆనందం ఈనాటిది కాదు. వేసిన ప్రతి బొమ్మా ఆర్టిస్ట్ కి సంతృప్తిని ఇవ్వదేమో కానీ సంతోషాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది.

రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో "కావలి" అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా బొమ్మల్లోని మధుర జ్ఞాపకాలు.

ఎండాకాలం మధ్యాహ్నం 12 దాటితే మా ఇంటి  "మెష్ వరండా" లోకి సూటిగా దూసుకొచ్చే ఎండవేడికి తాళలేక పక్కనే ఉన్న నారాయణవ్వ పూరి గుడిసె కి షిఫ్ట్ అయ్యేవాడిని, నా బొమ్మల సరంజామా అంతా పట్టుకుని.

సరంజామా అంటే పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఒక పెద్ద అట్ట ప్లాంక్ (తాతయ్య దగ్గరినుంచి తెచ్చుకున్నది), బ్రిల్ బ్లాక్ ఇంకు బుడ్డి, ఒక మగ్గులో నీళ్ళు, ఒక్కటంటే ఒక్కటే బ్రష్ (బహుశా అన్న 6వ తరగతి పాత డ్రాయింగ్ బాక్సులోదయ్యుండాలి), ఒక నాసిరకం నోట్ బుక్ నుంచి చింపిన తెల్లకాయితం. అంతే. అలా అప్పుడు ఆ పెయింటింగ్ సరంజామాతో వేసిన నా "పెయింటింగ్" ల వెనక "పెన్సిల్ లైన్ స్కెచ్" అనే "సీక్రెట్ కాన్సెప్ట్" ఉండేది కాదు. అసలలా ప్రొఫెషనల్ గా పెన్సిల్ స్కెచ్ వేసుకుంటే పెయింటింగ్ బాగా వస్తుందన్న ఇంగితం కూడా లేదు, ఇంకా రాలా. ఆర్ట్ లో ప్రముఖ పాత్ర పెన్సిల్ దే అని నా పెన్సిల్ డ్రాయింగ్స్ తో తెలుసుకున్నా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవ్వరూ అసలు పెన్సిల్ వాడరనుకునే వాడిని. అలా వేస్తేనే అది పెయింటింగ్ అన్న భ్రమలోనే ఉండేవాడిని.

అసలు ఇంకుతో వేస్తే దాన్ని పెయింటింగ్ అంటారా, ఏమో అదీ తెలీదు. నాకున్న అపోహల్లా ఒక్కటే, పెయింటింగ్ అంటే బ్రష్ తోనే వెయ్యాలి. ఒక బ్రష్ ఎలాగూ నాదగ్గరుంది కాబట్టి దాంతో పెయింటింగ్ లు వెయ్యాలి. రంగుల ముఖచిత్రం తప్ప లోపలంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉండే పత్రికల్లో కథలకి కొందరు ఆర్టిస్ట్ లూ వేసే బొమ్మలు పెయింటింగుల్లా అనిపించేవి. అలా వెయ్యాలనీ, వేసిన ప్రతి ఇంకు బొమ్మా పెయింటింగ్ నే అని ఉప్పొంగిపోయేవాడిని. నీళ్ళు కలిపి ఇంకు ని పలుచన చేస్తే నలుపు తెలుపులో చాలా షేడ్స్ తెప్పించొచ్చన్న "రహస్యం" పట్టుకున్నా. ఆ రహస్య (పరి)శోధనే చిట్కాగా చాలా పెయింటింగ్ లు వేశాను. అలా వేసిన వాటిల్లో సినిమా స్టార్ లే ఎక్కువగా ఉన్నారు. వాటిల్లో "కొల్లేరు సరస్సు", "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" లాంటి అతి క్లిష్టమైన పెయింటింగులు కూడా ఉన్నాయి.

అప్పట్లో నేనే (పరి)శోధించి కనిపెట్టాననుకొంటూ, నాకై నేను తెలుసుకున్న, నాకు తెలిసిన ఒకే ఒక్క పెయింటింగ్ రహస్యం అదే- ఇంకు లో నీళ్ళు కలిపి వెయటం. ఇదే అనుకరిస్తూ రంగులతో "మంచిరకం ప్రొఫెషనల్ వాటర్ కలర్ పేపర్" మీద వేస్తే దాన్ని "వాటర్ కలర్ పెయింటింగ్" అంటారని చాలా లేట్ గా తెలుసుకున్నా ;)

Details 
Reference: Picture of Suman, Telugu Cine Hero
Mediums: Brill Ink on cheap notebook paper
Size: 7 1/2" x 5 1/2" (19.5 cm x 13.5 cm)
Signed & Dated: August 18, 1985

Saturday, September 25, 2021

బాలు గారి దివ్య స్మృతిలో...

 
Ink & Watercolors on Paper

అమృతం మాత్రం తమవద్దుంచుకుని 
బాలు గానామృతాన్ని మనకొదిలేశారు
అ దేవతలూ దేవుళ్ళూ.....పాపం!

బాలు గారి దివ్య స్మృతిలో ఒక సంవత్సరం...

Details 
Mediums: Ink Pen & Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, August 22, 2021

ఎంత ఎదిగిపోయావయ్యా...

Watercolors on Paper (8.5" x 11")

అభిమానానికి కొలమానమూ, కాలమానమూ రెండూ ఉండవు.
ఎవరినెప్పుడెంతగా అభిమానిస్తామో ఒక్కోసారి మనకే తెలీదు.
కొందరు మనకేమీకాకున్నా వారిపై అభిమానం చెక్కుచెదరదు.
చెదిరితే అది అభిమానం కానే కాదు!

మననభిమానించే ఒక్క మనసుని పొందగలిగినా మన జన్మ సార్ధకం అయినట్టే.
అలాంటిది కోట్లకొద్దీ అభిమానుల్ని పొందగలిగితే అతను "చిరంజీవి" గా ఉన్నట్టే.

"చిరంజీవి" స్వయంకృషి తో ఎక్కిన తొలిమెట్టు నుంచీ ప్రతిమెట్టునీ చూసిన అభిమాన తరం మాది.
ప్రతి స్టార్ కీ అభిమానులున్నా మంచి మనసున్న "మెగా స్టార్" కే మెగాభిమానులుంటారు.

"చిరంజీవి"...
ఎంత ఎదిగిపోయావయ్యా!
ఎందరి గుండెల్లో ఒదిగిపోయావయ్యా!!
దేవుడనే వాడొకడుంటే
దీవించక తప్పదు నిన్ను!!!

"మెగా చిరంజీవి" కి జన్మదిన శుభాకాంక్షలు!
 
Details 
Mediums: Ink Pen & Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, July 4, 2021

Discipline and Dedication...

 
Ballpoint Pen on Paper (8.5" x11")

"Discipline and Dedication" always go together. Talent should join these for its future.

మిత్రుడు మల్లయ్య ఈ బొమ్మకు తన మాటల్లో ఇచ్చిన భావ"స్వ"రూపం...

తన మదిలో
ఏవేవో భావాల
అనుభవాల
అనుభూతుల
జడివాన..
ప్రవహిస్తోంది
పెదవులగుండా
ముసి ముసి
నవ్వులలోన....

"Talent is nothing without dedication and discipline, and dedication and discipline is a talent in itself."
~ Luke Campbell

Details 
Reference: Picture of Karronya
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, June 13, 2021

Attitude of Talent...

 
Pen & Watercolors on Paper (8.5" x11")

Attitude of talent is creativity.

"Creativity is not talent but attitude." - Jenova Chen

Keep Creating!
Keep Painting!!

Details 
Reference: Picture of Baby Karronya
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Monday, May 31, 2021

డేరింగ్ & డాషింగ్ హీరో...

Portrait of Telugu Hero "Super Star Krishna" - on his Birthday!
Watercolors on Paper (8.5" x 11")

"హీరో" అంటే ఇలానే సాహసాలు చెయ్యాలి...అని "నాటి తరం" లో ఎన్నో సాహసాలు చేసి ఎవ్వరికీ అందని రికార్డులు, డేరింగ్, డాషింగ్ తో బాటు "అరుదుగా దేవుడిచ్చే మంచి మనసు" నీ తన సొంతం చేసుకున్న "హీరో కృష్ణ" అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ "సూపర్ స్టారే"!

అభిమానానికెప్పుడూ కొలతలు లేవు, ఎల్లలు అసలే లేవు.
నా చిన్ననాటి జ్ఞాపకం, అభిమానం రెండూ కలిపి వేసిన ఈ బొమ్మ "మన సూపర్ స్టార్" పుట్టినరోజు నాడు "హీరో కృష్ణ" కి అంకితం!

ఇన్నేళ్ళు పట్టిందా ఈ బొమ్మ వెయ్యటానికి అనుకుంటూ...
ఇన్నేళ్ళకి అయినా వేశానన్న సంతృప్తి...
వెలకట్టలేనిది, ఏ కొలతలకీ అందనిది!

Happy Birthday!
Long live with good health, "Super Start Krishna"!!

Details 
Reference: Picture of Super Star Krishna (movie: అన్నదమ్ముల సవాల్)
Mediums: Ink Pen and Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, May 30, 2021

Keep smiling...

Keep smiling...(8.5" x 11")

Keep smiling !!

Details 
Reference: Picture of Karronya
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, May 16, 2021

Practice Good...

 Ballpoint Pen on Paper (8.5" x 11") 

Be good, do good.
Get better at doing good.

"The only way Good can become Better is through constant practice of Good."
~ Giridhar Pottepalem

Happy Painting !
Happy doing Good!!

Details 
Reference: Picture of Karronya
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB