Saturday, February 19, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 6 ...

Portrait of Suhasini from the Telugu movie "మంచు పల్లకి"
Free hand Pencil on Paper ()


"తార"లనంటిన నా బొమ్మలు - "స్వర్ణ యుగం"

స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి "భారతదేశ స్వర్ణయుగం" గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో "మన స్వర్ణ యుగం". నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ బొమ్మకీ రెట్టించిన ఉత్సాహంతో ఆగకుండా పరుగులేస్తూ పైపైకి దూసుకెళ్ళిన కాలమది.

అవి నా ఇంటర్మీడియట్ కాలేజ్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. ఎప్పటిలానే పరీక్షలు రాసి కావలి మా ఇంటికి రావటంతో ఆ రెండు నెలలూ ఖాళీనే. రెండవ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముందే చదివెయ్యాలని టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా అవి తెరిచే ఉత్సాహం అస్సలుండేది కాదు. దేనికైనా ప్రేరణ అవసరం. శలవుల్లో చదువుకి మాత్రం అది దొరకటం చాలా కష్టం. చదువు పక్కనబెట్టి ఏం చేద్దామా అని  చూస్తుంటే ఇదుగో మేమున్నామంటూ ముందుకొచ్చేసేవి నా బొమ్మలు. ఇక వాటితో కూర్చుంటే రోజంతా తెలియకుండానే గడిచిపోయేది. ప్రతిరోజూ ఏం సాధించానో తెలీకపోయినా ఏదో సాధించేశానని సంతృప్తిగానే ఉండేది.

దానికి ముందు పదవ తరగతి వరకూ శలవులకి వచ్చినపుడు అడపా దడపా బొమ్మలేస్తూ వచ్చినా వరసగా బొమ్మలు వేసిన కాలం మాత్రం ఈ రెండు నెలలే. వేసినవన్నీ పోర్ట్రేయిట్సే, అవన్నీ నాటి తెలుగు తారాలోకంలో ప్రముఖులవే, అన్నీ పెన్సిల్ తో వేసినవే. కానీ రేఖా చిత్రాలు కాదు. పెన్సిల్ తో వేసిన పెయింటింగ్స్. కొన్ని ఫ్రీహ్యాండ్ తో వేసినవి, కొన్ని అప్పుడే తెలుసుకున్న రహస్య చిట్కాతో వేసినవి. ఆశ్చర్యం ఏంటంటే పరిశీలించి చూస్తే రెండిట్లోనూ పట్టూ, పట్టు వదలని (విక్ర)మార్కూ కనిపిస్తాయి.

అది తెలుగు వారపత్రికలకు "స్వర్ణ యుగ కాలం". అందులో సినిమా పత్రికలూ వచ్చిచేరాయి. సినీతారల ముఖచిత్రాలతో, సెంటర్ స్ప్రెడ్ విశ్వరూపాలతో వారం వారం అందంగా ముస్తాబై వచ్చి పత్రికలన్నీ ఊరూరా బంకుల్లో తోరణాలు కట్టేవి. ఆ తారాతోరణాళ్ళోంచి కొందరు తారలు నా బొమ్మల్లోకి దిగివచ్చిన గురుతులే ఆనాటి నా బొమ్మలన్నీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ కి వేరు వేరు పెన్సిల్స్ అంటూ ఏవీ వాడింది లేదు, వాడింది కేవలం HB పెన్సిల్ మాత్రమే. లైట్ షేడ్ 6H తో మొదలయ్యి 5H, 4H, 3H, 2H, H ఇలా సంఖ్య తగ్గుతూ తర్వాత వచ్చి చేరే HB, అక్కడి నుండి డార్క్ షేడ్ B తో మొదలయ్యి, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B ఇలా సంఖ్య పెరుగుతూ ఇన్ని రకాల లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పెన్సిళ్ళు ఉంటాయని అప్పుడు తెలిసినా అన్ని ఊర్లల్లో అవి దొరకని కాలం, దొరికినా అన్నీ కొనే స్థోమత లేని కాలం.   

ఎండా కాలం, ఇంటా బయటా మండే కాలం. పడమర ముఖం పెంకుటిల్లు, భగ భగ మండే ఎండ వేడి, మధ్యాహ్నం నుంచి పొద్దుగూకే దాకా రోజంతా ప్రతి నిమిషమూ పెద్ద పరీక్షే. బొమ్మ పొద్దునే మొదలుపెట్టినా పూర్తిచెయ్యాలనే దీక్ష మధ్యాహ్నం కొనసాగించక తప్పేది కాదు. మధ్యాహ్నం అయితే పెంకుల కప్పు వేడికి తాళలేక కుర్చీ, అట్టా ఎత్తుకుని సందులో గోడకింద నీడలో చేరేవాడిని. మా ఇంటి గోడకీ, పక్కింటి ప్రహరీ గోడకీ మధ్య సరిగ్గా కుర్చీ పట్టేంత సందు. పక్కింట్లోని తురాయి చెట్టు నీడ కూడా కలిపి ఇంట్లో కన్నా కొంచెం బెటర్ గా ఉండేదక్కడ. అదే ఎక్కువగా మధ్యాహ్నం నా మల్టీ పర్పస్ ఎయిర్ కండిషనింగ్ ఏరియా; స్టడీ రూమ్ + ఆర్ట్ స్టుడియో. ఇంజనీరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్ లోనూ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కూర్చునే చదివాను. డిస్టింక్షన్ మార్కుల ప్రభావం ఆ స్థల మహిమే :)

ఆనాడు "తార"ల లోకాన్నంటిన నా బొమ్మలలోకం లోకి ఈనాడు తొంగిచూస్తే తృప్తిగా అనిపించేవీ, కళ్ళకి కట్టినట్టు మనసుకి కనిపించేవీ:
   . గమ్ముగా అస్సలు కూర్చోలేని స్వభావం
   . ఏదో చెయ్యాలన్న తపన
   . ఎందుకేస్తున్నానో కూడా తెలీకుండానే వేస్తూ పదునెక్కుతున్న బొమ్మలు
   . బొమ్మ బొమ్మకీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
   . ఆ బొమ్మల వెనక పడ్డ కష్టం
   . పడ్డ కష్టం లోంచి లేచి ఎప్పటికీ పదిలంగా మదిలో నిలబడిపోయిన సంతృప్తి
   . ప్రతి బొమ్మలో నిక్షిప్తమైన అలనాటి జ్ఞాపకా(లా)లు

ఎన్నో జ్ఞాపకాల మూటల్ని తమలో కలుపుకుని, నన్ను వదలక నాతోనే ఉంటూ, తెరిచి చూసిన ప్రతిసారీ నా  గతంలోకి నన్ను మళ్ళీ మళ్ళీ లాక్కెళ్ళే నా బొమ్మలు, ఇవే నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ "నిజమైన నా నేస్తాలు", తృప్తిగా నేను తరచూ తలుచుకునే "మధుర క్షణాలు"...

"కళాకారుడు తన కళని పూర్తిగా ఆశ్వాదించేది చుట్టూ ప్రేక్షకులు లేనప్పుడే."
- గిరిధర్ పొట్టేపాళెం

 
"దాసరి నారాయణ రావు"

"రాధ"

 "చిరంజీవి ఖైది"

 "శ్రీదేవి"

"శ్రీదేవి"

 "జయసుధ"

 "జయసుధ"

 "జయసుధ"

"సుహాసిని"

Sunday, February 6, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 5 ...

Ink and Ballpoint Pen on Paper (6" x 8.5")


కట్టిపడేసిన కదలిపోయిన కాలం...

ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలు గా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే ఎంతో గొప్ప గా అనిపిస్తుంది.

ప్రతి సంక్రాంతి, దసరా, వేసవి శలవులకీ "కావలి" నుంచి "నెల్లూరు" మీదుగా మా సొంత ఊరు "దామరమడుగు" కి వెళ్ళటం మాకు తప్పనిసరి. అలా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అక్కడికి లాక్కెళ్ళే బంధమే మా "బామ్మ". ('సొంత ఊరు' అన్న మాట ఎలా పుట్టిందో...బహుశా అప్పట్లో తమ ఊరు వదలి జీవనభృతి కోసం ఎక్కడికీ పోయి ఉండేవాళ్ళు కాదు, అందుకేనేమో!)

"ఒక్క సంవత్సరం ఇక్కడే ఉంటూ ఈ ఇల్లు చూసుకోమ్మా, ట్రాన్స్ఫర్ చేయంచుకుని బుచ్చి కి వచ్చేస్తాను" అంటూ "బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్" నుంచి "కావలి హైస్కూల్" కి ట్రాన్స్ఫర్ అయిన నాన్న తప్పని పరిస్థితిలో తనతో ఫ్యామిలీని తీసుకువెళ్తూ, తన ఇష్టం, కష్టం కలిపి కట్టుకున్న "కొత్త ఇల్లు" బామ్మ చేతిలో పెట్టి "బామ్మకిచ్చిన మాట". తర్వాత సంవత్సరానికే ఊహించని పరిణామాలు, మాకు ఎప్పటికీ అందనంత దూరంగా నాన్నని దేవుడు తనదగ్గరికి తీసుకెళ్ళిపోవటం.

"ఒక్క సంవత్సరం, వచ్చేస్తా అని మాటిచ్చి వెళ్ళాడు నాయనా, నాకు విముక్తి లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది" అంటూ నాన్న గుర్తుకొచ్చినపుడల్లా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ మాటనే తల్చుకుంటూ బాధపడేది బామ్మ. మేము పెద్దయ్యి జీవితంలో స్థిరపడే దాకా అక్కడే ఉండిపోయి మా ఇల్లుని కాపాడుతూ, మమ్మల్ని మా అదే జీవనబాటలో ముందుకి నడిపించింది "బామ్మ".

అలా ఆ ఊరితో బంధం తెగని సంబంధం "బామ్మ" దగ్గరికి ప్రతి శలవులకూ అమ్మా, అన్నా, చెల్లీ, నేనూ వెళ్ళే వాళ్ళం. సంక్రాంతి, దసరా పండగలూ చాలా ఏళ్ళు అక్కడే జరుపుకున్నాం. మేము వెళ్ళిన ప్రతిసారీ "బామ్మ" సంబరానికి అవధులు ఉండేవికాదు. శలవులు అయ్యి తిరికి కావలికి వెళ్ళిపోయే రోజు మాత్రం బామ్మ చాలా భిన్నంగా అనిపించేది, కొంచెం చిరాకు చూపించేది, ముభావంగా పనులు చేసుకుంటూ ఉండిపోయేది. బామ్మ బాధకవే సంకేతాలు. ఓంటరి బామ్మ ఇంకొక్క రోజు మాతో గడిపే సంతోషం కోసం, రేపెళ్ళకూడదా అంటూ ఆపిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తిరిగి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చేది. వెళ్ళే సమయం దగ్గర పడేకొద్దీ ఆ బాధ బామ్మలో ఎక్కువయ్యేది. వెళ్తున్నపుడు మెట్లు దిగి వచ్చి నిలబడి వీధి చివర మేము కనపడే దాక చూస్తూ ఉండిపోయేది. ఒక్కొకసారి మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి ఏదో మర్చిపోయి తిరిగి వచ్చిన సందర్భాల్లో ఆ రెండు మూడు నిమిషాలు ఎక్కడలేని సంతోషం బామ్మలో కనిపించేది, మళ్ళీ అది మాయం అయ్యేది. బామ్మ ఒక్కటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ తిరుగు ప్రయాణం నాకెప్పుడూ బాధగానే అనిపించేది. నెల్లూరు నుంచి కావలి బస్ లో కిటికీ పక్క సీట్ లో కూర్చుని వెనక్కి కదిలిపోతున్న చెట్లు, ప్రదేశాలూ చూస్తూ ఆ ఆలోచనల్తోనే కావలి చేరుకునే వాడిని.

ఆ ఊర్లో రెండేళ్ళు పెరిగిన జ్ఞాపకాలతో కలిసి ఆడుకున్న స్నేహితులు కాలంతో దూరమవటం, సొంత మనుషులకి సఖ్యత లేకపోవటంతో, క్రమేపీ సొంత ఊరైనా ఆ ఊరికి వెళ్ళినపుడు చుట్టాల్లా మాత్రమే మెలగవలసి వచ్చేది. బస్సు దిగి ఇంటికి నడిచెళ్ళే దారిలో ఎదురయ్యే ప్రతి మనిషీ ఆగి మరీ మమ్మల్ని తేరపారి చూట్టం, ఒకరో ఇద్దరో ఎవరోకూడ తెలీని వాళ్ళు "ఏం అబయా (నెల్లూరు యాసలో అబ్బాయి అని) ఇప్పుడేనా రావటం" అని పలకరించటం, ఆగి "ఊ" అనేలోపు "సరే పదండయితే" అనటం, సొంత బంధువులు మాత్రం ఎదురైనా పలకరించకపోవటం, వాకిట్లో కూర్చున్న ముసలీముతకా, ఆడామగా, పిల్లాజెల్లా కళ్ళప్పగించి చూస్తుండటం తో, గమ్ముగా తల దించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్లం.

అక్కడ శలవుల్లో ఉన్న కొద్ది రోజులూ, ప్రతి రోజూ కొంత టైమ్ పొద్దునో, సాయంత్రమో అలా పొలం దాకా వెళ్ళిరావటంతో గడిచిపోయేది. మిగిలిన టైమ్ లో ఇంట్లో కూర్చుని క్యారమ్ బోర్డ్ ఆడటం, నాన్న ఆ ఇంట్లో చేరాక కొన్న టేబుల్ మీద ఉండే PHILIPS రేడియోలో సినిమా పాటలు వినటం, లేదా Godrej బీరువా తెరిచి అందులో నాన్న గురుతులు చూసుకోవటం ఇలా కాస్త సమయం గడిచిపోయేది. అలా ఎంతలా సమయంతో ముందుకి నడిచినా అది మాత్రం ముందుకి కదిలేదే కాదు, ఏం చెయ్యాలో అస్సలు తోచేది కాదు. నాన్న దగ్గర చాలా ఇంగ్లీష్ పుస్తకాల కలెక్షన్ ఉండేది. అటకెక్కిన వాటికోసం నేనైతే పైకెక్కి బుట్టల్లో మగ్గుతున్న ఆ పుస్తకాల్ని ఒక్కొక్కటీ కిందికి దించి, బూజూ దుమ్మూ దులిపి తిరగేసేవాడిని. అయినా సరే ఆ పల్లెటూళ్ళో ఇంకా చాలా సమయం మిగిలిపోయేది. 

అలాంటి వేళల్లో నాకు తోచే ఏకైక మార్గం- కూర్చుని బొమ్మలు గీసుకోవటం, అవి చూసుకుని సంబరపడిపోవటం. అలా అక్కడ ఆ ఊర్లో, మా ఇంట్లో ఏమీ పాలుపోక వేసిన బొమ్మలే ఈ "గుఱ్ఱం బొమ్మలు". సంతకం కింద వేసిన తేదీలు చూస్తే వరసగా నాలుగు రోజులు ముందుకి నడవని కాలాన్ని నా(బొమ్మల)తో నడిపించాను. అప్పట్లో మా చిన్నప్పటి ఒక "అమెరికన్ ఇంగ్లీష్ కథల పుస్తకం" మా ఇంట్లో ఉండేది. ఆ పుస్తకానికి అన్న పెట్టిన పేరు "గుఱ్ఱాం పుస్తకం" (అవును, దీర్ఘం ఉంది, నెల్లూరు యాస ప్రత్యేకతే అది). ఈ పేరుతోనే ఇప్పటికీ ఆ పుస్తకాన్ని గుర్తుచేసుకుంటుంటాం. ఆ పుస్తకంలో ప్రతి పేజీ లోనూ మా బాల్యం గురుతులెన్నో దాగున్నాయి. దాదాపు ఆరేడొందల పేజీలుండి ప్రతి పేజీలోనూ అద్భుతమైన అప్పటి అమెరికన్ జీవన శైలిని పిల్లల కథలుగా రంగు రంగుల అందమైన పెయింటింగ్స్ తో ప్రతిబింబిస్తూ ఉండేది.  పచ్చని పచ్చిక బయళ్ళలో అందంగా ఉన్న ఇళ్ళు, అక్కడి జీవన విధానం, ఇంటి ముందు పోస్ట్ బాక్స్, రోజూ ఇంటికి జాబులు తెచ్చే పోస్ట్ మ్యాన్, ఉత్తరాల కోసం ఎదురుచూసే పిల్లలు, పారే చిన్న పిల్ల కాలువ, అందులో గేలం వేసి చేపలు పట్టటం, అవి ఇంటికి తెచ్చి వండుతున్న బొమ్మలూ, ఇంట్లో పెంపుడు పిల్లులూ, కుక్కలూ, గుర్రాల మీద చెట్లల్లో వెళ్తున్న పిల్లా పెద్దా బొమ్మలూ, స్టీమ్ ఇంజన్ తెచ్చిన రెవొల్యూషన్ తో స్టీమ్ నుంచి, ఎలెక్ట్రిక్ వరకూ రకరకాల రైలు బొమ్మలూ, ఫ్యాక్టరీల్లో పనిచేసే వర్కర్స్ జీవనశలీ, రకరకాల విమానాలూ, హెలికాప్టర్ల తో...ఇలా మొత్తం అమెరికానే కళ్ళకి కట్టి చూపెట్టిన గొప్ప "పిల్లల కథల పుస్తకం". బొమ్మలు చూట్టం తప్ప, ఇంగ్లీష్ లో ఆ కథలని చదివి అర్ధం చేసుకునేంత విద్య, అవగాహన, జ్ఞానం లేని మా బాల్యం నాటి "మా గుఱ్ఱాం పుస్తకం" అది.  

అలా కాలం ఎంత ప్రయత్నించినా ముందుకి కదలని ఒక రోజు మధ్యాహ్నం ఆ "గుఱ్ఱాం పుస్తకం" లోని గుఱ్ఱం బొమ్మలు ఒక నోట్ బుక్కులో వెయ్యటం మొదలు పెట్టాను. ఎలాంటి సవరణలకీ తావులేని పెన్నుతోనే నేరుగా వేసుకుంటూ పోవటం ఈ బొమ్మల్లో ఉన్న విశేషం. వాడిన పెన్నులు కూడా అక్కడ ఇంట్లో బామ్మ ఎప్పుడైనా పుస్తకాల్లో ఏవైనా రాసుకోడానికి టేబుల్ డెస్కులో పడుండే పెన్నులే, ఒక్కోసారి అవీ రాయనని మొరాయిస్తే పక్కన "రమణయ్య బంకు" లో రీఫిల్ కొని తెచ్చుకున్న గురుతులూ ఉన్నాయి. ఇక పేపర్ అయితే పాతబడ్డ ఆ డెస్కులోనే పడుండి, వెలుగు చూడక, కొంచం మాసి, రంగు మారిన తెల్ల పుస్తకంలో మరింత తెల్లబోయిన తెల్ల కాయితాలే. అప్పుడేమున్నా లేకున్నా ఉన్నదల్లా "ముందుకి నడవని సమయం", ఆ సమయాన్ని నడిపించాలని పట్టుదలగా కూర్చుని పట్టుకున్న పెన్నూ పేపరూ, లోపల ఉత్సాహం. ఏ పనికైనా ఇంతకన్నా ఇంకేం కావాలి?

ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే ఖచ్చితమైన కొలతలతో తప్పులు పోని ఆనాటి ఆ నా గీతలు. ఆ గీతల్లో దాగి ఆగిన ఘని, 'ఆగని అప్పటి కాలం', ఆ కాలంతో నడిచిన నా బాల్య స్మృతులు, ఆ స్మృతుల్లో దాగిన చెక్కు చెదరని అందమైన అపురూప జ్ఞాపకాలు!

ఇప్పుడు కాలంతోపాటు మారినా మా ఊరు 'దామరమడుగు' అక్కడే ఉంది. అక్కడ మా ఇల్లూ అలానే ఉంది. లేనిది మాత్రం అక్కడే స్థిరపడాలని ఇష్టపడి తన కష్టంతో ఇల్లు కట్టుకున్న నాన్న, మా రాక కోసం ఎదురు చూస్తూ మాటకి కట్టుబడి అక్కడే చాలా ఏళ్ళు ఉండి వెళ్ళి పోయిన బామ్మ, మాతో ఆ ఇంట్లో ఆడి పాడి నడయాడిన మా చెల్లి, కదిలిపోయిన అప్పటి కాలం. ఇవన్నీ జ్ఞాపకాలుగా తనతో మోసుకుని కదిలిపోయిన కాలం, ఇప్పటికీ ఎప్పటికీ నా బొమ్మల్లో కట్టిపడేసిన కదలని సజీవం.




"ఆగని కాలం ఆగి దాగేది మన జ్ఞాపకాల్లోనే." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: An American children stories book on American Daily Life.
Location: Damaramadulu - my native place in Nellore, AP, India
Mediums: Fountain pen ink, Ballpoint pen on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: May 15-18, 1984