Showing posts with label Watercolors. Show all posts
Showing posts with label Watercolors. Show all posts

Monday, November 4, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 26 . . .

"నిరీక్షణ"
Watercolors on Paper (8" x 11")

గిరీ..కమాన్...గో...గో...గో...అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా "విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటికప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. "సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్" ఇచ్చిన చేటీ లో రాసింది మైక్ లో చదివాను. "నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు" అంటూ ఒక నిమిషం ఆగి, ఎలా మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తోచక "నేను చెయ్యలేను" అంటూ స్టేజి దిగేశాను, "లేదు నువ్వు చెయ్యగలవు, ఏదో ఒకటి చెయ్యి...కమాన్...డు...సమ్‌థింగ్" అంటూ మళ్ళీ బలవంతంగా నన్ను స్టేజి మీదికెక్కించారు. మరో నిమిషం పాటు తపటాయిస్తూనే మైక్ పట్టుకుని నిలబడ్డాను. "నా వల్లకాదు, ప్లీజ్" అంటూ నిరుత్సాహంగా దిగేశాను. తర్వాత నాతో పోటీలో నిలబడ్డ "ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజి, వాకాడు, నెల్లూరు" విద్యార్ధి ఉత్సాహంగా స్టేజి ఎక్కి అదే చీటీ తీసుకుని చదువుకుని తనకున్న స్టేజి అనుభవం, డ్రామా పోటీలు, ఇంకా తెలుగు కవితల పోటీల్లో నెగ్గిన ప్రతిభ అంతా రంగరించి సరదాగా జోకుల్తో, తెలుగు భాషా యాసా ఛలోక్తుల్తో రక్తి కట్టిస్తూ ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా మాట్లాడి ఆ పోటీ లో నెగ్గి "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్" గా నిలిచాడు.

ఈ పెయింటింగ్ "ఆంధ్ర భూమి" వార పత్రికలో "ఉత్తమ్ కుమార్" ఓ కథకి వేసిన ఇలస్ట్రేషన్ చూసి అలానే వెయ్యాలని చేసిన ప్రయత్నం. వదలి వెళ్ళిపోయిన ప్రియుడిని తలచుకుంటూ ఒక చెట్టుకింద నిలబడి తనలో తాను ఏదో ఆలోచిస్తున్న ప్రియురాలు. ఆ పెయింటింగ్ లో ఆమె ఆనుకుని ఉన్న పెద్ద చెట్టు మొదలుకి వేసిన డీటైల్స్ నన్నమితంగా ఆకర్షించాయి. అందులోని అమ్మాయికన్నా ఆ చెట్టుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దానిపైన ఫోకస్ పెట్టి వేసిన పెయింటింగ్ ఇది. అందుకే అందులో ఉన్నన్ని డీటైల్స్ ఆ అమ్మాయి బొమ్మలో కనిపించవు. "ఉత్తమ్" గారి పెయింటింగ్ కూడా అచ్చు ఇలానే ఉంటుంది. సాధారణంగా పెయింటింగ్ చూసే వాళ్ళ చూపు పెయింటింగ్ మొత్తంలో ఒక విభాగం వైపు వెళ్ళకనే వెళుతుంది, ఆ విభాగం ఎక్కడా అన్నదానికి నిర్దిష్టమైన రూల్ ఉంది. మనకి తెలియకుండానే మన చూపు ఆ విభాగం వైపే వెళ్తుంది. దాన్ని "ది రూల్ ఆఫ్ థర్డ్" అంటారు. మొత్తం పెయింటింగ్ ని 3 x 3 చతురస్రాలుగా విభజిస్తే ఆ నిలువు అడ్డ గీతలు కలిసే చోట మధ్యలో కాకుండా ఎడమ వైపు పైనుంచి రెండవ చతురస్రం కింది కుడి భాగం. చూపరుల చూపు ముందు వెళ్ళేది ఇక్కడికే. కనుక పెయింటింగ్ లో అది ఫోకల్ పాయింట్ అవుతుంది. పెయింటింగ్ లో "కంపోజిషన్" అనేది ఒక నిగూఢ ప్రక్రియ, దాన్ని విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తారు. పెయింటింగ్ ఎంత బాగున్నా ఆ "కంపోజిషన్ థియరీ" ఫాలో కాకుంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వరనీ, అసలిలాంటి థియరీ ఒకటుంటుందనీ ఈమధ్య తెలుసుకున్నాగానీ, అప్పట్లో ఇవేవీ తెలీవు. ఇందులో "కంపోజిషన్" లో, "ది రూల్ ఆఫ్ థర్డ్" నూటికి నూరు పాళ్ళూ కనిపిస్తుంది. డీటైల్స్ కనిపించే ఆ చెట్టు తొర్ర వైపు చూపరుల చూపు వెళ్ళిపోతుంది. అదే ఏ పెయింటింగ్ లోనైనా చూపరుల చూపు పడే విభాగం.

తడబడే అడుగుల్లో నిలకడగా అడుగులు పడటం అన్నది వెళ్ళే దారిలో మన మీద మనకి నమ్మకం కుదిరాకే మొదలౌతుంది. నా పెయింటింగ్ ప్రక్రియలో అలా నిలకడగా పడ్డ అడుగులకి ఒక నిదర్శనం ఈ పెయింటింగ్. అలా కలిగించిన నమ్మకమే నాకు "ఇంటర్ కాలేజియేట్ డెసెన్నియల్ డ్రాయింగ్ కాంపిటిషన్" లో పాల్గొనే కాన్ఫిడెన్స్ నీ ఇచ్చింది. 

"వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ, డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" వేడుకల్లో భాగంగా ఇండియాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆహ్వానించి, వచ్చిన ఇతర కాలేజి వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కల్పించి, వారం రోజుల పాటు మా కాలేజి లో వివిధ రకాల సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల్లో మా కాలేజి గెలిచిన "ఫుట్ బాల్" జట్టులో నేనూ ఉన్నాను. ఫైనల్స్ గెలిచి మేమే విజేతలుగా నిలిచాము. టీమ్ విజయానికి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 10 పాయింట్స్ వచ్చాయి. వ్యక్తిగత పోటీల్లో డ్రాయింగ్, కార్టూన్ విభాగాల్లో నేను పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి మరో 10, 5 పాయింట్స్ సాధించాను.

జీవితంలో స్టేజి ఎక్కి అందరి ముందు నిలబడటం అదే మొదటిసారి. ఎదురుగా అంతమంది స్టూడెంట్స్, ఇంకా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్, పైజ్ స్పాన్సరర్స్. ఎప్పుడూ అసలు మైక్ పట్టుకునిందీ లేదు, అందరి ఎదుట పెదవి విప్పి మాట్లాడిందీ లేదు. అలాంటిది అందరి ముందు నిలబడి "నా క్రియేటివ్ ఐడియాని వాళ్ళకి అమ్మే సేల్స్ మ్యాన్" గా ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడి అందర్నీ అలరించి ఆ పోటీలో నెగ్గాలి. నెగ్గితే "ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్" అవార్డ్ బహూకరిస్తారు. అసలలాంటి పోటీ ఒకటుందనీ ఎవరూ ఊహించ లేదు. చివరిరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముందు ఎవరూ ఊహించని విధంగా అది నిర్వహిస్తున్న "లిటరరీ క్లబ్ మెంబర్స్" అప్పటికప్పుడు "అత్యధికంగా పాయింట్స్ వచ్చిన ఒకరిని ఎంపికచేసి 'ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్' గా అనౌన్స్ చేస్తాం" అని చెప్పి, పాయింట్లు ట్యాలీ చేసి "ఎక్కువ పోటీల్లో నెగ్గి అత్యధిక పాయింట్స్ సాధించిన ఇద్దరికి సమానంగా అత్యధిక పాయింట్స్ వచ్చాయి, కానీ ఒక్కరే చాంపియన్ గా నిలుస్తారు. సరి సమానమైన పాయింట్స్ తో నిలిచిన ఆ ఇద్దరికీ ఇప్పుడు ఫైనల్ పోటీ పెడుతున్నాం" అంటూ ఐదు నిమిషాలు తర్జన భర్జనలు చేసి "ఒక టాపిక్ ఇస్తాం, అనర్గళంగా ఐదు నిమిషాల పాటు తడబడకుండా మాట్లాడాలి, నెగ్గిన వారిదే టైటిల్" అంటూ ప్రకటించటం చక చకా జరిగిపోయాయి. ఉత్కంఠంలో అందరి అరుపుల మధ్య రెండు పేర్లు అనౌన్స్ చేశారు. అందులో నాపేరుండటం చూసి ఆశ్చర్యపోయాను. నిర్వహించిన పోటీల్లన్నిటిల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ పాయింట్స్ వచ్చిన మా ఇద్దరికీ సమానంగా 25 పాయింట్లు చొప్పున వచ్చాయి. మా ఇద్దరి మధ్య పోటీ అప్పటికప్పుడు అందరి సమక్షంలో స్టేజి పైన ఎదుర్కునే ప్రక్రియకి మరి కొద్ది నిమిషాల్లోనే  తెర లేచింది. ఇద్దరి పేర్లు ప్రకటించే ముందు నాకూ ఆసక్తిగానే ఉన్నా, ప్రకటించాక అందులో నా పేరుండటం చూసి నీరుగారిపోయాను, ఎందుకంటే అనర్గళంగా మాట్లాడటం దేవుడెరుగు, అదీ స్టేజి మీద అంతమంది ముందా అని. 

ఏదో పోటీల్లో పాల్గొని రిజల్ట్స్ లో పాల్గొన్న మూడింట్లో నెగ్గిన నా పేరు చూసుకున్నా గానీ, అసలా రోజు మధ్యాహ్నం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందని కూడా నాకు తెలీదు. ఒక గంట ముందు నా క్లాస్ మేట్ "శ్రీధర్" నేను హాస్టల్ కి వెళుతుంటే దార్లో కనిపించి "గిరీ పైజ్ డిస్ట్రిబ్యూషన్, మెయిన్ బిల్డింగ్ పైన హాల్ లో ఉంది, వచ్చి నీ ప్రైజెస్ తీసుకోవాలి." అని చెప్తేనే ఆరోజు మధ్యాహ్నం ఆ ఈవెంట్ ఒకటుందని తెలిసింది. నిజానికి పోటీల్లో నెగ్గిన వాళ్ళకి ఆ సాయంత్రం జరిగే "కాలేజి డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" లో ఒక్కొక్కరినీ స్టేజి మీదికి పిలిచి ఇవ్వాల్సిన బహుమతులు ముందుగానే ఇచ్చెయ్యాలని "లిటరరీ క్లబ్ మెంబర్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్" డిసైడ్ చేశారని కూడా అప్పుడే తెలిసింది. విజయవాడ నగరంలో వివిధ వాణిజ్య రంగాల్లోని వ్యాపారవేత్తలు ఆ ప్రైజెస్ స్పాన్సరర్స్. సాయంత్రం బహుమతులు ఇచ్చేందుకు వాళ్ళకి వీలు కాదని మధ్యాహ్నం ఇచ్చేస్తున్నట్టు ఆరోజు ఉదయం నోటీస్ బోర్డు లో పెట్టారని అక్కడికి వెళ్ళాక తెలిసింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ మధ్యాహ్నం ఈవెంట్ కి రాలేదు. నాకు పోటీల్లో గెలవటంతో వెళ్ళక తప్పలేదు.

అప్పటికే బొమ్మలువేస్తూ, కాలేజి మ్యాగజైన్స్ లో ప్రతి సంవత్సరం నా బొమ్మలు ప్రింట్ అవుతూ, కాలేజిలో అందరికీ నా పేరు తెలియటంతో సహజంగానే డ్రాయింగ్ పోటీలో నా పేరిచ్చాను. కార్టూన్లు ఎప్పుడూ వేసింది లేదు, అయినా మా జూనియర్స్ కొందరి ప్రోత్సాహంతో సరే అన్నాను, వాళ్ళే నా పేరిచ్చేశారు. రెండు పోటీలకీ ఒక పేపర్, పెన్సిల్స్ మాత్రమే ఇచ్చారు, టాపిక్ అప్పటికప్పుడు అనౌన్స్ చేసి డ్రాయింగ్ కి రెండు గంటలు, కార్టూను కి అర గంట సమయం ఇచ్చారు. పరీక్ష లాగా పోటీలో పాల్గొనే అందరూ ఒక రూమ్ లో కూర్చుని ఆన్ ది స్పాట్ ఇచ్చిన సమయంలో గీసి సబ్మిట్ చేసి రావాలి.

కార్టూను పోటీలకి మాత్రం ఒక గంట ముందు నా దగ్గరున్న "ఆర్.కె.లక్ష్మణ్" గారి కార్టూన్ల పుస్తకం తిరగేసుకుని వెళ్ళాను. "కరెప్షన్ ఇన్ పాలిటిక్స్" అనే టాపిక్ ఇచ్చారు. నేను గీసిన కార్టూను బొమ్మ ఇంకా గుర్తుంది. "ఆర్.కె.లక్ష్మణ్" ని అనుకరిస్తూ 3డి లోనే గీశాను. కొన్ని పూరి గుడిశెల మధ్య ఒక ఎత్తయిన భవనం, దార్లో మాట్లాడుకుంటూ ఇద్దరు ఆ భవనం వైపు చూస్తూ వెళ్తూ, ఒకాయన ఇంకొకాయనతో ఇలా అంటుంటాడు, "మొన్నటి దాకా అదీ పూరి గుడిశే, అందులో ఉండే ఆయన ఆ పక్కనున్న పూరి గుడిశె ఓట్లతోనే నెగ్గి రాజకీయ నాయకుడయ్యాడు." అదీ క్యాప్షన్. డ్రాయింగ్ లో గెలుస్తానో లేదో నమ్మకం లేకున్నా, ఇందులో మాత్రం ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఉండింది ఎందుకో. అయితే నాకు ఇందులో "ద్వితీయ బహుమతి" వచ్చింది.

డ్రాయింగ్ పోటీకి ప్రైజ్ స్పాన్సరర్ అప్పటి విజయవాడ, బీసెంట్ రోడ్డు లోని "ఇన్నొవేషన్స్" అని ఒక "ఎంటర్ ప్రైజ్ స్టోర్" వాళ్ళు. ఇచ్చిన టాపిక్ - ఒక "సూట్ కేస్ షో రూమ్" ని 50 "సూట్ కేస్" లతో అలంకరించాలి ఇంటీరియర్ డిజైన్స్ అవీ మీ ఇష్టం, ఒక్కటే రూల్ యాభై సూట్ కేసులు తప్పకుండా ఉండి తీరాలి, దానికి ఏదో ఒక క్యాప్షన్ కూడా రాయాలి". ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో నేను అమితంగా ఎంజాయ్ చేసిన టాపిక్ "పర్స్ పెక్టివ్ డ్రాయింగ్", 3D లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ని అర్ధం చేసుకుని గీయాలి. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్స్ గీసే డ్రాయింగ్స్ అవి, అందరికీ అర్ధం కావు ఆ ప్రిన్సిపుల్స్ అత సులభంగా. నేను అది ఫాలో అవుతూ 3D లో గీశాను, షాపు లోకి ఎంటర్ అవగానే మనకి కనిపించే వ్యూ - మూడు గోడలు, రూఫ్, ఫ్లోర్,  ఫ్లోర్ మీద కార్పెట్, రూఫ్ కి సీలింగ్ ఫ్యాన్స్, అందమైన లైట్స్, మధ్యలో షాన్డిలియర్, ఇంకా ఒకరిద్దరు  సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఇలా. ఇక్కడ ఒక తమాషా సంఘటన ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. సీరియస్ గా డ్రాయింగ్ వేస్తూ ఉంటే, నా బెంచ్ మీద ఒక నలిపిన కాగితం ముక్కొచ్చి పడింది, చూస్తే పక్కనుంచి వెళ్తూ నా క్లాస్ మేట్ "U.V.H. ప్రసాద్", కాలేజి లో అందరూ "బాబాయ్" అని పిలుస్తుండేవాళ్ళం. ఏదో సైగ చేస్తూ వెళ్ళి ఆ పోటీ నిర్వహిస్తున్న స్టూడెంట్ వాలెంటీర్స్ ని మాటల్లో పెడుతున్నాడు. ఏంటా అని పేపర్ విప్పి చూస్తే అందులో ఇంగ్లిష్ లో మూడు క్యాప్షన్స్ రాసి ఉన్నాయి. నివ్వెరపోయాను, ఈ బాబాయ్ కి ఈ పోటీ ఒకటుందని, ఇక్కడ నేను పాల్గొంటున్నానని తెలిసి ఎవరినో అడిగి నాకోసం మూడు క్యాప్షన్స్ రాసి తెచ్చి చిట్టీ నాకందించి వెళ్ళాడని తెలిసి నివ్వెరపోయాను. "బాబాయ్" అంతే, ఎప్పుడు ఎలా ఎవరికి, ఎక్కడ కనిపించి ఆశ్చర్యపరిచేవాడో ఎవ్వరికీ తెలీదు. బాబాయ్ ఇచ్చిన క్యాప్షన్స్ లో ఒక నచ్చిన క్యాప్షన్ కొంచెం మార్చి రాశాను. కాపీ కొట్టానా అన్న ఆలోచన వేధించినా "కొంచెం మార్చి రాశా కదా, అయినా క్యాప్షన్ ఒక్కటి చూసి ఎంపిక చెయ్యర్లే" అని సరిపెట్టుకున్నా. నాకందులో "ప్రధమ బహుమతి" వచ్చింది. ప్రైజ్ గా "నమస్కారం" పెడుతున్న అమ్మాయి అవుట్ లైన్ చెక్కతో కార్వింగ్ చేసిన డెకరేటివ్ బొమ్మ ఇచ్చారు. అది చాలా రోజులు "కావలి, జనతాపేట" లో మా ఇంట్లో వాకిలిపైన నమస్కారం చెపుతూ కనిపించేది. ఆ సెలెబ్రేషన్స్ అయిన పక్క రోజు "ఈనాడు దిన పత్రిక" జిల్లా ఎడిషన్ లో న్యూస్ తోబాటు ప్రైజెస్ తీసుకున్న అందరం స్పాన్సర్స్ తో కలసి నిలబడి ఉన్న ఫొటో ప్రింట్ అయింది. అదే న్యూస్ పేపర్లో నా ఫొటో చూసుకోవటం, చాలా ఆనందం వేసింది, కత్తిరించుకుని దాచుకున్నాను. ఆ ఫొటోలో నా చేతిలో ఈ ప్రైజ్ బొమ్మ ఉంటుంది.

నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజి రెండవ సంవత్సరంలో మొదలుపెట్టిన పెయింటింగ్ ప్రక్రియ ఎడతెరిపి లేకుండా మూడేళ్ళు కొనసాగించాను. అప్పుడు వేసిన పెయింటింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ ఆనాటి కాలేజి సంఘటనలు, సరదాలు, ఫ్రెండ్స్ తో సినిమాలు, కబుర్లు, షికార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏదో తెలియని తపనతో కృషి చేస్తూ వేసిన అప్పటి బుడి బుడి అడుగుల బాటల్లో ఆనాటి తియ్యటి జ్ఞాపకాలని గుర్తుచేస్తూ అప్పటి కాలాన్ని ఇప్పుడు చూపించేవి నా బొమ్మలే. పక్కన కనిపించే స్నేహితులు, మనసులో దాగి ఒదిగి కనిపించని ఒక సున్నిత సన్నిహిత ప్రోత్సాహం, పత్రికలు, పుస్తకాలు తప్ప అప్పటి నా చిన్నిలోకంలో ఇంకేవీ లేదు. 

ప్రోత్సాహం మనిషికి ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది. ఉత్సాహం మనిషిని ముందుకి నడిపిస్తుంది. ఆనాటి నా బొమ్మల్లో ఉన్నవి అప్పటి ఉత్సాహాలే. ప్రోత్సాహ ఉత్సాహాలే అద్భుతాలకి పునాదులు. ఆ పునాదులపై కాలక్రమేణా వెలిసేవే అనుభవాల భవనాలు. ఆ అనుభవాల భవంతుల్లో నివశించిన అనుభూతులే తియ్యని జ్ఞాపకాలు. కదలే కాలం చెదిరినా చెరిగినా కరిగినా, చెదరని చెరగని కరగని జ్ఞాపకాలే జీవితం. ఆ జ్ఞాపకాల వెల్లువలో మునిగి తడిసి మురిసేదే మనసు. . .

"జ్ఞాపకాల వెల్లువలే జీవన సంధ్యా రాగాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, September 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 24 . . .

క్రిస్టొఫర్ రీవ్ - సూపర్ మ్యాన్
Watercolors on Paper (8" x 11")

హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా. జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తుపెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా కూడా ఆ విజువల్స్, ఆ అద్భుతమైన చిత్రీకరణ అనుభూతి కోసం వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అప్పుడు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసే ప్రక్రియ ఉండేది కాదు. నా చిన్నప్పటి హైస్కూల్ డేస్ లో అయితే "బ్రూస్ లీ" కరాటే స్టిల్స్ ఉన్న నోట్ బుక్స్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పటికీ బాగా గుర్తుంది. బ్రూస్ లీ "ఎంటర్ ది డ్రాగన్" ప్రపంచ సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ వరసలో ముందుగా వచ్చిన "సూపర్ మ్యాన్" కూడా అంతగా పాపులర్ అయ్యింది. "బ్రూస్ లీ" అంతలా ప్రతిఒక్కరికీ చేరువ కాకపోయినా సూపర్ మ్యాన్ సినిమాలో హీరో "క్రిస్టొఫర్ రీవ్" పేరు చాలా మందికి బాగా గుర్తుండేలా. క్రిస్టొఫర్ రీవ్ సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న స్టిల్స్ నాకైతే పోర్ట్రెయిట్ డైమన్షన్స్ కి ఒక కొలమానంగా అనిపించేవి.

అప్పుడప్పుడే కొలిచి గీసినట్టు, అచ్చుగుద్దినట్టు తెలుగు సినిమా హీరో, హీరోయిన్ల పోర్ట్రెయిట్స్ పెన్సిల్ తో  వేస్తూ కొంచెం కొంచెం నాసిరకం వాటర్ రంగుల బిళ్ళలతో పెయింటింగ్స్ మొదలు పెట్టిన నా ఇంటర్మీడియట్ కాలేజి రోజులవి. ఏదో ఆదివారం దినపత్రికలో నాకు దొరికిన సూపర్ మ్యాన్ స్టిల్ ఇది. ఆంధ్ర లొయోలా కాలేజ్, విజయవాడ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సమ్మర్ శలవులకి "కావలి" వచ్చినపుడు వేసింది. పరీక్షలు కూడా రాసి ఇంటికి రావటంతో రెండు నెలలు ఖాళీ సమయం. బొమ్మలు వెయ్యటం, పత్రికలు తిరగెయ్యటం, నవలలు దొరికితే చదవటం, రోజూ పొద్దున కావలిలో ఉన్న మూడు లైబ్రరీ లకి వెళ్ళి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తిరగెయ్యటం, పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకెళ్ళి కాసేపు అక్కడ ప్రింట్ అవుతున్న మెటీరియల్స్, పాంప్లెట్స్, పెళ్ళి పత్రికలు గమనించటం, అప్పుడప్పుడూ సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్ళటం ఇవే శలవుల్లో నా వ్యాపకాలు. పొద్దున్నే లేచి రోజంతా ఈ వ్యాపకాలన్నీ చేసినా ఒక్కొకరోజు సాయంత్రం అయ్యేసరికి ఏమీ తోచేది కాదు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నేలమీద కూర్చుని ప్యాడ్ పెట్టుకుని బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాసిరకం వాటర్ కలర్ బిళ్ళల పెట్టె ఒకటి, అన్న కొన్నది ఇంట్లో వాడకుండా పడిఉండేది. వాడి విశ్వోదయ హై స్కూలులో ఆర్ట్ క్లాస్ కోసమని కొన్నది. నాకు పెన్సిల్ తో వెయటం బాగా వచ్చాక, పెన్ను తో కొంత కాలం బొమ్మలేశాక, రంగుల మీదికి మనసు మళ్ళింది. వాడక అలా పడున్న ఆ వాటర్ రంగుబిళ్ళల పెట్టె నేను వాడటం మొదలుపెట్టాను, ఒక డజను దాగా వాటితో చిన్న చిన్న వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశాను. వాటిల్లో ఈ "సూపర్ మ్యాన్" ఒకటి. రంగులు పేపర్ మీద వేస్తుంటే బాగా పాలిపోయినట్టుగా ఉండేవి . మిక్సింగ్ కి సరిగా సహకరించేవి కాదు. అయినా వాటిల్తోనే కొద్ది కాలం కుస్తీలు పట్టేవాడిని.

ఒక్కొకసారి ఏమీ తోచని నాకు తన స్కూల్ రికార్డ్స్ నన్ను రాయమని అమ్మ పని కల్పించేది. అమ్మ ఎప్పుడు అడిగినా రాయను అనకుండా శ్రద్ధగా అన్నీ రాసి పెట్టేవాడిని. అమ్మ కావలి "జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల" లో జూనియర్ అసిస్టంట్ గా, అంటే క్లర్క్ గా పని చేస్తుండేది. గర్ల్స్ హైస్కూల్ కి ఆనుకునే, పక్కన బాయ్స్ హైస్కూలు లో టీచర్ గా నాన్న పనిచేశారు. ఊహించని విధంగా మమ్మల్నీ ఈ లోకాన్నీ వీడి నాన్న పోయిన ఒక్క నెలకే అమ్మ జాబ్ లో చేరవలసిన పరిస్థితి ఎదురైంది. ధైర్యం చెప్పి అమ్మకి అన్నీ తనే అయ్యి మా తాతయ్య, అంటే అమ్మ నాన్న అమ్మతో తొలి అడుగులు వేయించారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అమ్మ ఉద్యోగం చెయ్యకపోతే మా మనుగడ చాలా కష్టం అయ్యేది. అమ్మ చదివిన పి.యు.సి (అంటే ఇంటర్మీడియట్) క్వాలిఫికేషన్ కి అమ్మకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గర్ల్స్ హై స్కూలు మొత్తానికి అమ్మ ఒకటే క్లర్క్, స్కూలు రికార్డ్స్, నెల నెలా జీతాలు, పరీక్షల ఫీజులు, మార్కుల లిస్టులు, అన్నీ అమ్మ ఒక్కటే చూసుకునేది. నెల మొదటి వారం జీతభత్యాల లెక్కలు రాసి స్టాఫ్ అందరికీ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే పని కూడా అమ్మదే. స్టూడెంట్స్ పరీక్షల ఫీజులు కట్టించుకుని ఆ డబ్బులు బ్యాంక్ లో వెళ్ళి జమ చేసే పనీ అమ్మదే. ఇలా నెల మొత్తం చాలా పని ఉండేది. పెళ్ళయ్యాక గృహిణిగా ఉంటూ ఇల్లు, సంసారం నాన్ననీ మమ్మల్నీ చూసుకుంటున్న అమ్మకి ఒక్క సారిగా జాబ్ చెయ్యాటానికి కావలసిన చదువున్నా ఆ పని బొత్తిగా తెలీదు, అనుభవం లేదు. స్కూల్ లో క్లరికల్, రికార్డ్స్ పని అస్సలు తెలీదు. ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలలు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ అమ్మకి ఎంతో ధైర్యం చెప్పి చాలా సపోర్టివ్ గా ఉండి నేర్పించింది అని అమ్మ చెప్పేది.

శలవులకి నేను వచ్చినపుడల్లా ఆ రికార్డులు రాసే పని కొంతవరకూ నేనూ చేసిపెట్టేవాడిని. ఒక్కొక నెల పని భారంతో అమ్మ పడే టెన్షన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి. పొద్దున 5 గంటలకి ముందే నిద్రలేచి కసువూ, కళ్ళాపి, ముగ్గుల పనులు ముగించి పాలు తీసుకుని రావటం, ఇంటి ఎదురుగా మున్సిపల్ కుళాయి దగ్గర బిందె లైన్లో పెట్టి నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం, రోజుకి సరిపడా నీళ్ళు పట్టి తొట్టెలకీ, బకెట్లకీ పోసిపెట్టటం, మాకు కాఫీలు, టిఫెన్లూ చేసి పెట్టటం, అంట్లు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, మాకు మధ్యాహ్నానికి అన్నం, పచ్చడీ, కూరా వండి, అన్నీ వంటింట్లో సర్ది పెట్టి, తయారయ్యి తొమ్మిది గంటలకల్లా ఇంటికి తెచ్చుకున్న రికార్డు బుక్కులన్నీ పట్టుకుని నడచి స్కూలు కి వెళ్ళటం...ఇది రోజూ అమ్మ పొద్దున పని. ఆ పనుల్లో బయల్దేరే టైమ్ కొద్దిగా ఆలశ్యం అయితే పడే టెన్షన్ చాలా ఉండేది. అలాగే లంచ్ టైమ్ ఎర్రటి ఎండలో నడచుకుంటూ ఇంటికి వచ్చి గబగబా మాకు భోజనాలు పెట్టి, తనూ తిని స్కూలుకి పరుగులు పెట్టటం. సాయంత్రం నాలుగున్నరకి రాగానే బిందె పట్టుకుని నీళ్ళకోసం వెళ్ళటం, చీకటి పడే వేళకి మళ్ళీ వంటా, వార్పూ, పనులతో అలా అలసిపోతున్నా అలసట తెలియని మిషన్ లా తిరిగి తిరిగి అరిగిపోతూ కరిగిపోయిన కాలం తాలూకు రోజులవి.

ఇప్పటికీ గుర్తుంది, ఆ సంవత్సరం సమ్మర్లో నేనే ఒక నెల రికార్డులు అన్నీ రాసి పెట్టాను. వాటిల్లో సంతకాలు పెడుతూ హెడ్మిస్ట్రెస్ చూసి చాలా మెచ్చుకున్నారంట. నా చేతివ్రాత గుండ్రంగా ఉండేది. "విజయలక్ష్మీ ఎవరు రాశారు ఈ నెల రికార్డ్స్?" అని హెడ్మిస్ట్రెస్ అడిగితే, "మా చిన్నబ్బాయి గిరి, కాలేజి నుంచి శలవులకొచ్చాడు" అని చెప్పిందంట. సమ్మర్ లో స్కూలుకి శలవులు, అయినా అమ్మకి మాత్రం నెల మొదటివారం, చివరివారం రికార్డుల పని ఉండేది. అలా సమ్మర్ శలవుల్లో స్టాఫ్ అంతా పని చేయ్యకున్నా జీతాలు ఇవ్వాలి, క్లరికల్ పని తప్పదు కాబట్టి అమ్మకి సమ్మర్ శలవుల్లో నెల జీతంతో బాటు స్పెషల్ గా మరో 20 రూపాయలు వచ్చేది. ఆ సంవత్సరం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ ఆ స్పెషల్ డబ్బులు అమ్మకి ఇస్తూ "ఈ 20 రూపాయలు మాత్రం మీ చిన్నబ్బాయికి ఇవ్వు" అని చెప్పిందంట. అమ్మ వచ్చి ఎంతో సంతోషంగా నాకు చెప్తే నేనూ ఎంతగానో పొంగిపోయాను. ఆ డబ్బులు నేను తీసుకోలేదు కానీ, ఒక రకంగా నా మొదటి సంపాదన అని చెప్పుకోవాలంటే మాత్రం అమ్మ కష్టార్జితంలో నా వంతుగా నేను సాయం చేసి సంపాదిచిన మొదటి సంపాదన అదే. అదే శలవుల్లో అమ్మతో ఒకసారి పొద్దున్నే తోడుగా స్కూలుకి వెళ్ళి ఒక రెండు గంటలు నేనూ అన్నా ఇద్దరం అక్కడ ఉన్నాం. అప్పుడు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ రూముకి అమ్మ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. నా గురించి, నా చదువు గురించీ హెడ్మిస్ట్రెస్ అడిగి తెలుసుకుంది. తర్వాత అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా గురించి కూడా చెప్పిందని అమ్మ చెబితే గుర్తుంది. సరిగ్గా పదేళ్ళ తర్వాత మొదటిసారి నేను TCS లో జాబ్ చేస్తూ లండన్ వెళ్ళినపుడు అమ్మ స్కూల్ లో ఆ విషయం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి చెప్తే చాలా సంతోషపడిందని, వాళ్ళ స్టాఫ్ అందరికీ "విజయలక్స్మి చూడండి పిల్లల్ని ఎంత గొప్పగా చదివించి వృద్ధిలోకి తెచ్చిందో" అంటూ చెప్పిందని తెలిసి నేనూ చాలా పొంగి పోయాను. మా చెల్లెలు లక్ష్మి కూడా అదే స్కూలు లో చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆటల్లో, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ అన్నీ తనకే వచ్చేవి. అలా మా గురించీ, అప్పటి మా ఫ్యామిలీ పరిస్థితి గురించీ బాగా తెలిసిన వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి, అమ్మంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 

ఈ బొమ్మలో కనిపించే "సూపర్ మ్యాన్" ఆ సినిమాలో సాదా సీదా మనిషే. కానీ తన ఎదురుగా ఏదైనా విపత్తు వస్తే అనుకోకుండా దివ్య శక్తి వచ్చి అతన్ని సూపర్ మ్యాన్ గా మార్చేస్తుంది. నయాగారా జలపాతంలో పడిపోతున్న చిన్న పిల్లని సైతం అందరూ అశ్చర్యంగా చూస్తుండగా గాలిలో ఎగురుతూ వెళ్ళి రక్షించి తీసుకుని వస్తాడు. ఇలా ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలిగించే సాహసాలు చేస్తుంటాడు. మా జీవితాల్లో అమ్మ నిత్యం చిన్న పిల్లలమైన మాకోసం మా కళ్ళ ఎదుటే రోజూ జీవితంతోనే సాహసాలు చేసింది. సినిమా మూడు గంటలే కాబట్టి ఆ సాహసం ఫలితం వెంటనే కనబడేలా తియ్యాలి. నిజ జీవితంలో ఇలాంటి అమ్మలు చేసే సాహసాల ఫలితాలు పిల్లలు పెద్దయ్యి ఎదిగి వృద్ధిలోకి వచ్చాక మాత్రమే కనిపిస్తాయి.

ఏ శక్తీ అండగా లేకున్నా సరే ఒంటరిగా జీవితంతో పోరాటం చేసి పిల్లల జీవితాల్ని తీర్చిదిద్ది వాళ్ళని గెలిపించి తను గెలిచే ప్రతి అమ్మ ఒక సూపర్ వుమన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే అదృశ్య శక్తులూ, దివ్య శక్తులూ తోడవ్వాలేమో. సూపర్ అమ్మ అవ్వాలంటే ఏ శక్తీ తోడు అవసరం లేదు. భూమిపై అమ్మ సూపర్ మ్యాన్ ని మించిన పెద్ద సూపర్ శక్తి...

"మానవాళికి దేవుడిచ్చిన దివ్య శక్తి అమ్మ."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Friday, June 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 21 . . .

"తెలుగు వన్నెల రంగుల వెన్నెల"
Poster Colors on Paper (10" x 12")


పెయింటింగ్ లోని నిండైన "తెలుగుదనం" తెలుగు వారిట్టే గుర్తుపట్టేయగలరు. ఆ చీరకట్టు, నుదుటిన గుండ్రని బొట్టు, చందమామ వెన్నెల పడి ఆ చందమామకన్నా నిండుగ మెరిసిపోతున్న పెద్ద కళ్ళతో అందమైన "వెలుగు" లాంటి తెలుగమ్మాయి. ఈ పెయింటింగ్ కి మూలం గా నేను తీసుకున్న పెయింటింగ్ వేసిన చిత్రకారుడు "ఉత్తమ్ కుమార్". అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం స్పెషల్ సంచికల్లో విరివిగా ఇలస్ట్రేషన్స్ వేసేవారు. ఇలస్ట్రేషన్స్ అనేకన్నా "పెయింటింగ్స్" అంటేనే బెటర్. వారపత్రికలకి పూర్తి స్థాయి పెయింటింగ్స్ ఈయనకన్నా ముందు బహుశా తెలుగు లో ఒక్క "వడ్డాది పాపయ్య" గారే వేసి ఉంటారు. ఆయన తరువాత నాకు తెలిసి "ఉత్తమ్ గారు" ఆ ట్రెండ్ కొనసాగించారు. ఆయన స్ఫూర్తి గా అప్పట్లో ఆధ్రభూమి వారపత్రికలో అలా వేసిన ఇంకొక ఆర్టిస్ట్ "కళా భాస్కర్" గారు. "ఎంకి" శీర్షికన వారం వారం వేసే వారు. అవన్నీ కూడా పూర్తి స్థాయి పోస్టర్ కలర్ పెయింటింగ్సే.

ఈ పెయింటింగ్ నాకైతే చూసినపుడల్లా "ఉత్తమ్ గారు" వేసిన "బాపు ఎంకి" అనిపిస్తుంది. నిజానికి బాపు లైన్ డ్రాయింగ్స్ ఎక్కువగా వేశారు. వాటిని పెయింటింగ్స్ అని అనలేము. కానీ బాపు బొమ్మ అంత అందంగా ఒక తెలుగు అందం ఇందులో కనిపిస్తుంది.

అవి విజయవాడలో నా ఇంజనీరింగ్ కాలేజి రోజులు. పెయింటింగ్ ప్రయాణం మొదలుపెట్టి ముందుకి సాగుతూ ఉన్నాను. సాధనకై "ఆంధ్రభూమి" వారపత్రిక లోని "ఉత్తమ్ కుమార్" గారి బొమ్మలు నాకు పాఠాలయ్యాయి. నాకు "ఉత్తమ్ కుమార్" గారు ద్రోణాచార్యుడయారు. అంటే ఆయన బొమ్మల్ని చూసి శిష్యరికం మొదలుపెట్టిన "ఏకలవ్యుడిని". దొరికిన పోస్టర్ కలర్స్ తో ఒకటొకటీ వేసుకుంటూ కొంచెం కొంచెం ప్రావీణ్యం సంపాదించుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ పోతున్నాను.

ఈ బొమ్మపై సంతకం పెట్టిన తేదీ జనవరి 14, 1988. అంటే సంక్రాంతి రోజు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఉన్నాను. వేసిన చోటు, సమయం దాని వెనకున్న జ్ఞాపకాలూ ఇంకా చెక్కుచెదరకుండా మదిలో పదిలంగా అలానే ఉన్నాయి. "కావలి" లో మేము అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటిల్లు ముందు కటకటాల వరండా. అదే అప్పటి నా ఆర్ట్ స్టుడియో. ఉదయం పూట ఇంటికి ఎవరొచ్చినా నేను బహుశా బొమ్మలు వేస్తూనే ఎక్కువగా కనిపించేవాడిని. పడమర ముఖం ఇల్లు అవటంతో ఉదయం పూట చల్లగా ఉండేది. ఉదయాన్నే లేచే అలవాటుతో తొందరగా తయారయ్యి, టిఫిన్ చేసి బొమ్మలు వేస్తూ కూర్చునే వాడిని. ప్లాస్టిక్ వైర్ తో అల్లిన ఒక అల్యూమినియం ఫోల్డింగ్ కుర్చీ, ఒక పెద్ద అట్ట, ఒక మగ్గుతో నీళ్ళు, ఆరు గుండ్రటి గుంటల అరలు గా ఉన్న ప్లాస్టిక్ ప్యాలెట్, క్యామెల్ పోస్టర్ కలర్ సెట్ రంగుల బాటిల్స్...ఇదీ నా ఆర్ట్ స్టుడియో సెటప్. పెయింటింగ్స్ వేసే ముందు సెట్ చేసుకునే వాడిని. పక్కనే వాల్చిన ప్లాస్టిక్ వైర్ ఫ్రేమ్ ఫోల్డింగ్ మంచం ఎప్పుడూ వేసే ఉండేది. మధ్యలో బ్రేక్ తీసుకోవాలనిపిస్తే కాసేపు ఆ మంచంపై వాలే వాడిని.

మామూలుగా ఏ పెయింటింగ్ అయినా మొదలు పెడితే ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేసే వాడిని. ఈ పెయింటింగ్ వెయటానికి కొంచెం టైమ్ ఎక్కువ తీసుకున్నా. బహుశా మూడు నాలుగు రోజులు పట్టిందేమో. ఈ పెయింటింగ్ చూసినపుడల్లా దీని వెనుక ఒక చిన్న సంఘటన తళుక్కున మెరుస్తుంది. మొదటిరోజు ఉత్సాహం ఉరకలువేస్తూ మొదలుపెట్టాను. కొద్ది గంటల్లో ముఖం, తల, చుట్టు పక్కల కొంత భాగం వరకూ పూర్తయింది. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని వేస్తున్న పెయింటింగ్ అట్టతో సహా పక్కనున్న మంచం మీద పెట్టి లోపలికెళ్ళి నీళ్ళు తాగి వచ్చాను. వచ్చేసరికి మా పెద్దమామయ్య మూడో కూతురు, బహుశా ఐదేళ్ళ వయసుండొచ్చేమో, వచ్చి నిలబడి అక్కడున్న బాల్ పాయింట్ పెన్నుతో గీస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికెళ్ళి చూస్తే సరిగ్గా ముఖం మీద పిచ్చి సున్నాలు చుడుతూ ఉంది. అప్పటికే ఒక ఇంచ్ స్పేస్ లో ముక్కు పైన గజి బిజి సున్నాలు నాలుగైదు సార్లు గీకేసింది. ఒక్కసారిగా చూసి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను చూడగానే తుర్రున మెట్లు దిగి పక్కన ఆనుకునే ఉన్న పోర్షన్లోనే ఉండేవాళ్ళ ఇంట్లోకి పరిగెత్తి లోపలికెళ్ళి వాళ్ళమ్మ వెనక దాక్కుంది. కొట్టేంత కోపంతో అరుస్తూ వెనక పడ్డా చిక్కకుండా తప్పించుకుంది. వాళ్ళింట్లో దూరే లోపల నాకొచ్చిన కోపానికి చిక్కుంటే దెబ్బలు తప్పకుండా తినుండేది. భయపడేలా మాత్రం చాలా అరిచా. ఆ భయంకి కొద్ది రోజులు మెల్లిగా మెట్లెక్కి మా ఇంట్లో అడుగుపెట్టే ముందు నక్కి నక్కి చూసేది, నేను కనపడితే వెనక్కి తిరిగి పరిగెత్తేది. నాలుగైదు రోజుల దాకా నన్ను చూస్తే అంతే, అదే తంతు.

అప్పటికే అచ్చం ఇలాగే ఒకసారి "ఇందిరాగాంధి" గారి బొమ్మ వేస్తూ ఆపి లోపలికి వెళ్ళి వచ్చేసరికి, పెన్సిల్ తో అవుట్ లైన్ గీసుకుని బాల్ పాయింట్ పెన్నుతో నేనేస్తూ సగంలో ఆగిన బొమ్మ, మిగిలిన అవుట్ లైన్ మీద అన్న ఫ్రెండ్ "సంజీవరెడ్డి" బాల్ పాయింట్ పెన్నుతో గీసిన గీతలతో పాడయి పొయింది. దాన్నింక సరిదిద్దటం సాధ్యం కాక, అప్పటికే అదే "ఇందిరాగాంధి" గారి బొమ్మ రెండవసారి వేస్తుండటంతో బాధ, ఆక్రోశం కలిసిన కోపంలో ముక్కలుగా చించివెయ్యటం, మళ్ళీ సరిగ్గా అదే ఘటన ఈ పెయింటింగ్ కీ ఎదురవటం చాలా బాధించింది. బాధని దిగమింగి చింపేసి మళ్ళీ వేద్దామా అన్న సందిగ్ధంలో ఎందుకో మనసు మార్చుకుని పెయింటింగ్ కాబట్టి సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చెయ్యొచ్చేమో అన్న ఆలోచన రావటంతో, ప్రయోగం చేసి చూద్దామని ఆ గీసిన ముక్కు భాగం మీద వైట్ పెయింట్ వేసి మళ్ళీ దాని మీద సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చేమోనని చేసి చూశాను, పనిచేసింది. అయితే రెండు మూడు లేయర్స్ వైట్ పెయింట్ వేస్తేనే కానీ ఆ నల్లని బాల్ పెన్ గీతలు కనపడకుండా చెయ్యలేకపోయాను. పోస్టర్ కలర్స్ నిజానికి వాటర్ కలర్స్ లాగా పారదర్శకంగా ఉండవు. వాటర్ కలర్స్ అయితే ఈ ప్రయోగం సాధ్యం కాదు. అప్పుడు నాకలాంటివేవీ తెలీవు. అసలు పోస్టర్ కలర్స్ నే వాటర్ కలర్స్ అనుకుంటూ వేసుకుంటూ నేర్చుకుంటున్న రోజులు. అలా సరిదిద్దిన తర్వాత ఇంకో రెండు రోజుల్లో ఈ పెయింటింగ్ పూర్తిచెయ్యగలిగాను.

ఆ రెండు మూడేళ్ళ సాధనలో వేసిన ప్రతీ పెయింటింగ్ నాకు సరికొత్త మెళకువల పాఠాలు నేర్పింది. ఇందులో నేర్చుకున్న మొదటి మెళకువ, పెయింటింగ్ లో ఏ భాగమైనా రంగులు మార్చి సరిదిద్దాల్సి వస్తే, వైట్ పెయింట్ తో కవర్ చేసి మళ్ళీ దానిపైన సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చని. అయితే ఇది పారదర్శకం కాని పోస్టర్ కలర్స్ కనుక సాధ్యం అయ్యింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో వేసిన ఆ పసుపు ఆకాశం, ఆరెంజ్ రంగు నీళ్ళతో బ్లెండ్ అవుతూ నీళ్ళపై మెరుస్తున్న వెలుగు, నీళ్ళపై దగ్గరగా ఎగురుతున్న పక్షులు, ఫోర్ గ్రౌండ్ లో ఆ పసుపు రంగు ఆకుల కొమ్మలపై సీతాకోకచిలుకలు, ఆకాశంలో గుండ్రని నిండు చందమామ, ఇందులో రంగులన్నీ డ్రమాటిక్ గా ఉన్నవే. ఈ రంగులు అచ్చంగా "ఉత్తమ్ కుమార్" గారు వేసిన ఒరిగినల్ పెయింటింగ్ లోవే. నేనేమీ సొంతగా మార్చింది లేదు. అయితే ప్రకృతిని వేసే రంగులు సహజంగా లేకున్నా ఆ అనుభూతిని మాత్రం పెయింటింగ్ లో తెప్పించొచ్చు అన్న మరో మెళకువ నేర్చుకున్నాను. నిజానికి ఇందులో ప్రకృతి రంగులు అసహజం, అయినా చూస్తుంటే అలాంటి ఫీలింగ్ కలగదు. ఏదో వెన్నెల్లో విహరిస్తున్నట్టే అనిపిస్తుంది.

పూర్తి అయిన తర్వాత మా ఇంటికి దగ్గరే "ఒంగోల్ బస్టాండ్" దగ్గర ఫ్రేములు కట్టే షాప్ కెళ్ళి దీన్ని ఫ్రేమ్ చెయ్యమని ఇచ్చాను. అది వరకూ ఒక పెయింటింగ్ ఇక్కడే ఇస్తే బాగా చేసిచ్చాడు, గ్లాస్ ఫ్రేమ్ లోపల వెల్వెట్ క్లాత్ మీద భద్రంగా అతికించి. అయితే ఇది మాత్రం ఒక హార్డ్ అట్ట, స్కూల్ పిల్లలు క్లిప్ తో ఉండి వాడే అట్ట లాంటిది, దాని మీద అతికించి, వెనక వైపు చుట్టూ ఒక ఇంచ్ బోర్డర్ చెక్క కొట్టి గోడకి తగిలించేలా చేసిచ్చాడు. ఇది కొంచెం పెద్ద సైజ్ అందుకని అలా చేశాడేమో. నా అన్ని బొమ్మల్లాగే ఈ బొమ్మా నాతోనే ఉండేది. నాతో అమెరికా కి తెచ్చుకున్నాను. కొన్నేళ్ళ తర్వాత మంచి ఫ్రేమ్ లో పెడదామని వెనకున్న చెక్క బోర్డర్ తొలగించాను. అయితే పేపర్ మీద వేసిన పెయింటింగ్ అవటం, అదీ అట్ట మీద అతికించెయటం తో అట్ట మీది నుంచి పేపర్ ని వేరుచేయటం కుదర్లా. కాల క్రమంలో పాతబడి పై భాగం అక్కడక్కడా కాగితం కొంచెం చిరిగి పెచ్చులు గా ఊడింది. అయినా ఆ రంగుల వెన్నెల, తెలుగు వన్నెల వెలుగు మాత్రం అలానే ఉంది.

ఇప్పటికి ఎన్ని బొమ్మలేసినా, ఇంకెన్నెన్నో పెయింటింగ్స్ వేసినా మొదటి రోజుల్లో నేర్చుకుంటూ, విహరిస్తూ వేసిన ఆనాటి గతం మాత్రం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ కాలం నాటి జ్ఞాపకాల తాలూకాలూ మదిలో మెదులుతూనే ఉంటాయి. ఒక్కోక్క బొమ్మలో ఒక్కోక్క అనుభూతి, ఒక్కొక్క అనుభూతిలో ఒక్కొక్క అనుభవం. అప్పటి ఆ బొమ్మలు చూసినపుడల్లా ఆ అనుభవం, అనుభూతులతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మాత్రం వెన్నెలలో పారే సెలయేటి నీటి అలలపై దగ్గరగా వచ్చి తాకకుండా విహరించి వెళ్ళిపోయే పక్షుల్లా వచ్చి అందకుండా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయ్...

"హృదయ సాగర అలలపై ఎగిరే అందని పక్షులే అందమైన జ్ఞాపకాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, May 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 20 ...

Poster colors on Paper 8" x 11"


పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది "వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాలం, ఆ కాలేజి లో "కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్" డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో "పెయింటింగ్" మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.

తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఏ. పి. రెసిడెన్షియల్ హైస్కూల్, కొడిగెనహళ్ళి, హిందూపురం లో విద్యాభ్యాసం. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ జూనియర్ కాలేజికి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉన్నా నిర్ణయాలు తీసుకోగలిగే బలం వయసుకింకా రాకపోవటంతో, మళ్ళీ దూరంగా రెండేళ్ళ ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ" లో చేరటం. ఆ తర్వాత ఇంజనీరింగ్ తప్పనిసరి అయి ఇంటికి దూరంగా వెళ్ళాల్సి రావటం. కొంచెం అయినా మా ఊరు "కావలి" కి దగ్గరగా ఉంటానని హైదరాబాద్ వద్దని విజయవాడ "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" ఎంచుకుని అక్కడ మొదలుపెట్టిన కాలేజి లైఫ్. ఇంజనీరింగ్ కాలేజి అనగానే ఒక్క సారిగా స్వతంత్రం, స్వేచ్ఛా వాతావరణం, కొత్త ఫ్రెండ్ షిప్స్, తక్కువ క్లాసుల సమయం, ఎక్కువ తీరిక సమయం, ఇలా ఒక్కసారిగా పెద్ద మార్పుల్లో ప్రవేశించి నిర్దేశం తెలిసీ తెలియకనే తెలుసుకునే దిశగా ఆఖరి స్టూడెంట్ దశ అది. మార్నింగ్ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్, వారంలో కొన్ని రోజులు ప్రాక్టికల్స్ ఉండవు, ఖాళీ టైమ్ ఎక్కువగా ఉండేది. వీలైతే సినిమాలు షికార్లు, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆటలు, టీవీ చూట్టం, ఇలా మొదటి సంవత్సరం కొత్త ఫ్రెండ్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాలేజి లైఫ్ తో అంతా కొత్త కొత్తగా గడచి పోయింది.

లొయోలా కాలేజి లో మంచి లైబ్రరీ ఉన్నా చాలా తక్కువగా వెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ మత్రమే ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజి లోనూ మంచి లైబ్రరీ ఉండేది. లైబ్రరీ లో హిస్టరీ, ఆర్ట్స్ పుస్తకాలున్న ఒక రూమ్ ఉండేది. వెళ్ళిన ప్రతిసారీ నేరుగా దాన్లోకే వెళ్ళి ఆర్ట్ మ్యాగజైన్స్, బుక్స్ తిరగేసి వచ్చేసేవాడిని. కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ కూడా ఉండేవి. అందులో చూసిన కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. అయితే బుక్స్ లాగా ఆ మ్యాగజైన్స్ లైబ్రరీ కార్డ్ మీద కొద్ది రోజులు తీసుకోవటానికి ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో అవి ఎక్కడ దొరుకుతాయి, వీళ్ళు ఎక్కడినించి ఎలా తెప్పించి ఉంటారు అన్న ఆలోచనతో, పుస్తకాల షాపుల వెంట వాటి కోసం నా వెదుకులాట ప్రారంభం అయ్యింది. బీసెంట్ రోడ్డు దగ్గర ఏలూరు రోడ్డు లో ఉండే "నవోదయ పబ్లికేషన్స్" బుక్ షాపులో వెతగ్గా వెతగ్గా ఒక్క రష్యన్ ఆర్ట్ పుస్తకం దొరికింది. ఈ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. అందులో చాలా గొప్ప ఆర్టిస్టులు, వాళ్ళ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అమ్మ కష్టంతో చదువుతున్న అప్పటి నా స్టూడెంట్ స్థోమతకి ఆ పుస్తకం వెల చాలా ఎక్కువ, కొనాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి చివరికి కొనేశాను. ఆ పుస్తకంలోని పెయింటింగ్స్ ని తదేకంగా పరిశీలించటంతో ఏన్ని గంటలు గడిపుంటానో లెక్కే లేదు.

ఒకసారి న్యూస్ పేపర్ లో "పింగాణి ప్లేట్స్" మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసిన ఒక విజయవాడ ఆర్టిస్ట్, ఆవిడ ఆర్ట్ షో ఒకటి ఆదివారం "ఒన్ టవున్" దగ్గర  ప్రారంభం అవుతుందని చూసి, ఆ రోజు రాగానే ఉదయాన్నే బస్సెక్కి వెళ్ళిపోయాను. గొప్ప గొప్ప యూరోపీయన్ మాస్టర్ పెయింటింగ్స్ ని అచ్చు అలాగే పింగాణి ప్లేట్స్ మీద వేశారు ఆవిడ. వేలల్లో ధర, ఏ వందో అయితే ఒకటన్నా కొనేసేవాడినేమో. చాలా దగ్గరగా పరిశీలించాను, అంత కరెక్ట్ గా ఎలా వేసి ఉంటారో అర్ధం కాలా. ఆవిడ్ని అడిగి మెటీరియల్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అక్కడే ఉండి చాలాసేపు అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ షో ప్రారంభం టైమ్ కే నేను వెళ్ళటంతో  వచ్చిన చీఫ్ గెస్ట్, మిగతా గెస్ట్స్ తోనే ఆవిడ ఉండటంతో అవకాశం రాక బస్సెక్కి నిరాశగా కాలేజీ వెళ్తున్న ఆ క్షణాలింకా గుర్తున్నాయి. అలా నా ఒంటరి ప్రయాణంలో సంగతీ సమాచారం తెలుసుకోలేని నిరాశలెన్ని ఎదురైనా "పెయింటింగ్స్" వెయ్యాలన్న ఆశ మాత్రం తగ్గలా.

రెండవ సంవత్సరంలో బుక్ షాపులన్నీ తిరిగి వెతగ్గా వెతగ్గా దొరికిన చిన్న "కేమెల్ పోస్టర్ కలర్స్" ని అవే వాటర్ కలర్ పెయింటింగ్స్ అనుకుని వాటితోనే వెయ్యటం మొదలు పెట్టాను. బహుశా ఈ పెయింటింగ్ అప్పటికి నా మూడోదో, నాలుగోదో అయి ఉండొచ్చు. నేనున్న హాస్టల్ D-14 రూమ్ లో నా పెయింటింగ్ సాధనకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టాను. ఆదివారం మధ్యాహ్నం కూర్చుని ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తూ ఉండే వాడిని. 

అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివారం సాయంత్రం నిర్మానుష్యంగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు ఫుట్ పాత్ పై పాత బుక్స్, మ్యాగజైన్స్ పెట్టి అమ్మే వాళ్ళు అని తెలిసి చాలా ఆదివారాలు పనిగట్టుకుని అంత దూరం వెళ్ళి వెతికే వాడిని. అక్కడ కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ దొరికాయి, కొన్ని కొనేశాను. వాటిల్లో ఒక మ్యాగజైన్ అట్ట వెనక పేజీ మీద అచ్చయిన ఆయిల్ పెయింటింగ్ చాలా నచ్చింది. ఆ మ్యాగజైన్ ముందు పెట్టుకుని అచ్చంగా అవే రంగుల షేడ్స్, నాకున్న ఆ ఆరు రంగులతో ఎలా తెప్పించానో నాకూ ఇప్పటికీ మిస్టరీ. ఏ రంగులో ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుందో ప్రాధమిక అవగాహన బొత్తిగా లేదు, అడిగినా చెప్పలేను, కానీ నాకు తెలీకుండానే ఏ రంగు షేడ్ చూసినా రెండు మూడు రంగులు కలిపి అచ్చం అదే షేడ్ వచ్చేసేది, అదే నాకిప్పటికీ అప్పటి మిస్టరీ. అలా దీక్షగా కూర్చుని పెయింటింగ్ వేస్తుంటే, మధ్య మధ్యలో బొమ్మలంటే కొంచెం ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, కొంత మంది మాత్రం "భలే వేస్తున్నావ్ గిరీ" అని మెచ్చుకునేవాళ్ళు.

బయట కమర్షియల్ ఆర్టిస్టులు ఎలా వేస్తారో ఏం మెటీరియల్ వాడతారో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కష్టం, వాళ్ళెక్కడుంటారో తెలుసుకునే వీలులేని రోజులవి. కనీసం కాలేజి లో సీనియర్స్, జూనియర్స్ లో ఒక్కరన్నా పెయింటింగ్స్ వేసే వాళ్ళుండకపోతారా అని కూడా చూశాను. నాలుగేళ్ళు ఏడు బాచ్ ల్లో ఒక్కరూ తారసపడలా. అప్పటికింకా ఏ మాత్రం అనుభవం లేక, సరయిన మెటీరియల్ కూడా లేక, తడబడుతూనే దొరికిన రంగులు, బ్రషులు, పేపర్ లతో మొదలుపెట్టి ముందుకి పోతూ వేస్తున్నవి నా మొదటి అడుగులే. అయినా, ఈ ఒక్క పెయింటింగ్ తో వచ్చిన స్వీయ అనుభవం మాత్రం నాకు చాలా చాలా ధైర్యాన్నిచ్చింది. పెయింటింగ్స్ ఎలా వెయ్యాలా అంటూ నాలో ఆవహిస్తున్న నిరాశనీ, అసలు వెయ్యగలనా అని చెలరేగుతున్న అనుమానాల్నీ, ఒక్కడినే నేర్చుకోగలనా అంటూ ప్రశ్నిస్తున్న అధైర్యాన్నీ పక్కకి తోసి నన్ను పట్టుకుని ముందుకి నడిపించింది కేవలం నా పట్టుదల, పట్టు వదలని దీక్ష మాత్రమే. వేసిన తర్వాత నా రూమ్ లో గోడపైన మిగిలిన వాటితో బాటు దీన్నీ అతికించాను, వెనుక నాలుగు కార్నర్స్ లో గమ్ పూసి. మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం "న్యూ హాస్టల్" లో నేనున్న రెండు రూముల్లోనూ ఈ పెయింటింగ్ గోడమీదే ఉండేది. తర్వాత ఆ కాలేజి హాస్టల్ గోడలు దాటి బయటి ప్రపంచంలోకి వచ్చిన నాతోనే ఉంటూ, నాతో బాటు ఇండియా వదిలి భద్రంగా ఇంతదూరం నాతో వచ్చేసింది. వస్తూ ఆ కాలం గురుతుల్నీ, జ్ఞాపకాలనూ మోసుకుని తెచ్చింది.

కాలేజి ఫ్రెండ్స్, అక్కడ చదివిన చదువూ, నేర్చుకున్న విజ్ఞానం, పొందిన డిగ్రీ, గడిపిన జీవితం, ఆ అనుభవాలూ ఎవరికైనా జీవితంలో ఒక మలుపు తిరిగే మైలురాయి. కాలేజి లైఫ్ లో చదువు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అందరికీ ఉండేవే. అవి పక్కన పెడితే నా "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" రోజులు మాత్రం ఎక్కువగా నిండింది బొమ్మలతోనే. ఇప్పటికీ అప్పుడప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మెయిన్ బిల్డింగ్ లో, ఇంజనీరింగ్ కాలేజి అడ్మిషన్స్ జరిగినప్పుడు, నా కొచ్చిన EAMCET ర్యాంక్ కి నా వంతు వచ్చినపుడు గవర్న్ మెంట్ కాలేజీల్లో నేనెంచుకోవటానికి మిగిలింది REC వరంగల్ లో సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. నాకు తీసుకోవటం ఇష్టంలేదు. ఇష్టంలేనపుడు వద్దు, ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా ఏ బ్రాంచ్ లోనైనా సీట్ వస్తుంది, అయితే ఫీజ్ ఎక్కువ అంటూ చెప్పారు. అప్పటికే ఇంటర్మీడియట్ లొయోలా లో చాలా డబ్బులయ్యాయి, అమ్మకి కష్టం అవుతుందని తీసుకోవటానికి సిద్ధపడ్డాను. వద్దని చిన్నమామయ్య తీసుకుని వచ్చేశాడు. తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్స్ కి అక్కడికే మళ్ళీ వచ్చిన రోజు నాకు అన్ని కాలేజీల్లో అన్ని బ్రాంచ్ ల్లోనూ ఎక్కడకావాలంటే అక్కడ తీసుకునే ఆప్షన్ ఉండింది. చిన్నమామయ్య "ఇక్కడైతే నేను దగ్గరుంటాను, చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్ తీసుకో" అని ఎంతగానో అడిగినా వద్దని "విజయవాడ" అయితే "కావలి" కి దగ్గర, రెండేళ్ళు ఇంటర్మీడియట్ అక్కడ అలవాటయ్యింది. అక్కడే కావాలని పట్టుబట్టి "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" లో కంప్యూటర్ సైన్స్ చేరాను. అప్పుడా కాలేజిలో కంప్యూటర్ సైన్స్ మాదే మొట్ట మొదటి బ్యాచ్.

గతం తల్చుకున్నప్పుడల్లా ఇప్పటికీ అప్పుడప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది, ఒకవేళ అప్పుడు నాకున్న కాలేజి ఆప్షన్స్ లో "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాకుండా చిన్నమామయ్య ఎంతగానో తీసుకోమని అడిగిన "చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్" లేదా "గీతం ఇంజనీరింగ్ కాలేజి, విశాఖపట్నం" లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరి ఉంటే ఇంజనీరింగ్ కాలేజి అనుభవం ఎలా ఉండేదో, ఎవరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళో, నా జీవితం ఎలా మలుపు తిరిగి ఉండేదో, ఆ మలుపుల్లో నా బొమ్మలు, నా పెయింటింగ్స్ అసలుండేవో లేవో, ఉండి ఉంటే ఎలా ఉండేవో అని...

"జీవిత మలుపుల్లో మనం వేసే ప్రతి అడుగూ కనపడని మన గమ్యం వైపే పడుతుంది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Friday, April 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 19 ...

 
"Kashmir Lake"
Poster colors on Paper (7" x 10")


ప్రతి మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో తనకి తెలియని దాన్ని శోధించి తెలుసుకుని సాధించాలని పడే తపనా, చేసే ప్రయత్నాల వెంట కృషి తోడై తాననుకున్న దానికన్నా ఎక్కువగా సాధించిన సందర్భాలు కొన్నైనా ఉండి ఉంటాయి. వెనుదిరిగి చూసినపుడల్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇది నేనే చేశానా అని అనిపిస్తూ అబ్బురపరుస్తూ ఆ సందర్భాలు గుర్తొచ్చినపుడల్లా మదిలో మళ్ళీ మళ్ళీ అద్భుతంగా సందడి చేస్తూనే ఉంటాయి.

పెయింటింగ్ వెయ్యాలన్న ఆలోచనాతపనల తపస్సు చాలించి కృషి మొదలుపెట్టిన నా టీనేజి రోజులవి. ఎక్కడా ఎవరినీ అడిగి తెలుసుకునే అవకాశం లేకున్నా పట్టువదలక, అప్పుడు మేముంటున్న "కావలి" లో, నేను చదువుతున్న "విజయవాడ" లో  పుస్తకాల షాపుల వెంటపడి అడిగి, వెతికి పట్టుకోగలిగిన ఒక అర డజను రంగుల "క్యామెల్" పోస్టర్ కలర్స్ సెట్, ఒకటీ రెండు బ్రషులు తప్ప ఇంకేమీ పెద్దగా ఆర్ట్ మెటీరియల్ లేకుండానే పయనం సాగించిన రోజులవి. ఒక్కొకసారి అడిగిన షాపుకే మళ్ళీ వెళ్ళి అదే మెటీరియల్ కోసం అడిగిన సందర్భాలూ ఉన్నాయి. "నిన్ననే అడిగావు, లేవని చెప్పా కదా" అన్నా, మళ్ళీ వెళ్ళి నిన్న అడిగిన అతను కాకుండా ఇంకో అతను ఉన్నాడేమో చూసి అక్కడే అవే మెటీరియల్ ఉన్నాయా అని అడిగిన సందర్భాలూ అనేకం.

ఏదైనా మంచి బొమ్మ చూసినా, గ్రీటింగ్ కార్డు లేదా పత్రికల్లో ప్రింట్ అయిన మంచి ఫొటో చూసినా ఎప్పటికైనా వాటిని పెయింటింగ్స్ వెయ్యాలి అని సేకరించి దాచుకునే అలవాటు చిన్నప్పట్నుంచీ ఉండేది. ఒకసారి చిన్నమామయ్య దగ్గరున్న ఫొటో క్యాలెండర్ లో ప్రింట్ అయిన ఫొటోలు చూడగనే తెగ నచ్చేసి మళ్ళీ తెచ్చిస్తాను అని అడిగి ఇంటికి తెచ్చుకున్నా. అందులో ప్రింట్ అయిన రెండు ఫొటోలు "కాశ్మీర్" లో తీసినవి. ఒకటి వింటర్ లో పగటిపూట ఎండలో మంచు, ఇంకొకటి సమ్మర్ సాయంత్రం పూట అందమైన సరస్సు. రెండిటి మీదా మనసు పారేసుకున్నా. అడిగి తెచ్చుకున్నాను కనుక కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేయాలి. ఇప్పట్లా క్లిక్ మనిపించి పాకెట్లో పెట్టుకునే ఫోన్ కెమెరాల్లేవు. ఆ క్యాలెండర్ ముందుపెట్టుకుని చూసి పెయింటింగ్ మొదలు పెట్టటం ఒక్కటే మార్గం, అంతే, మొదలుపెట్టేశాను. మూడు రోజుల వ్యవధిలో రెండు ఫోటోలనీ పెయింటింగ్స్ వేసేశాను. మూడు రోజుల్లోనే వేశానన్న విషయం నిజానికి గుర్తులేకున్నా పెయింటింగ్ కింద సంతకం పెట్టిన డేట్లు ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలప్పట్లో అలా ఎలా వేశానన్న ఆశ్చర్యం ఒక పక్కైతే, మూడు రోజుల్లోనే మళ్ళీ ఇంకొకటా అన్న ఆశ్చర్యం మరో పక్క, ఇవి రెండూ పక్కపక్కన చూసినపుడల్లా పక్కా పొందే ఆ అనుభూతిని మాటల్లోనే కాదు లెక్కల్లోనూ చెప్పలేను.

అప్పటి దాకా రంగుల్లో చిత్రీకరించిన ఆకాశం నా బొమ్మల్లో లేదు, నీళ్ళూ లేవు. అలాంటిది రెండూ కలిపి ఒకే పెయింటింగ్ లో వెయ్యటం చాలా పెద్ద సవాల్ నాకపుడు. ఇప్పటికీ అప్పటిలానే ఏ బొమ్మైనా వేసే ముందు వెయ్యగలనా అన్న సంశయంలాంటి చీకటిలో సందేహంతోనే  నా పయనం మొదలవుతుంది, ఎక్కడో వెయ్యగలను అన్న చిన్న మెరుపు తళుక్కుమని మెరిసి నన్ను పట్టి ముందుకి లాగి నడిపిస్తుంది. అప్పుడపుడూ ఆ మెరుపు ఉరుమై గర్జించి మేఘమై వర్షించి తుఫాను లా అలజడి సృష్టిస్తూ ఇబ్బంది పెడుతుంది. అయినా పట్టు సడలక నేను వేసే అడుగుల్తో చివరికి తనే ప్రశాంతించి వెలిసి వెలుగునిచ్చి, వర్షం వెలిశాక వెలిసే సూర్యకాంతిలో మెరిసే ప్రకృతిలా నా మనసుని ఉరకలు వేయిస్తూ నాతో ఆ బొమ్మని పూర్తి చేయిస్తుంది. వేసే ప్రతి బొమ్మ పయనమూ ఇలాగే ముందుకి సాగుతుంది.

అలా సందేహిస్తూనే మొదలు పెట్టిన ఆ క్షణాలింకా గుర్తున్నాయి. దీనికి రెండ్రోజుల ముందు వేసిన "కాశ్మీర్ మంచు" పెయింటింగ్ ఒకింత ధైర్యాన్నిచ్చినా, వెను వెంటనే విభిన్నమైన రంగుల్లో మరో కాశ్మీర్ పెయింటింగ్, ఈసారి ముందున్న ఛాలెంజ్ - ఆ ఆకాశం, సాయంసంధ్యాకిరణాలు పడి ఆ సరస్సు నీళ్ళు సంతరించుకున్న బంగారు వన్నెలు, అక్కడక్కడా పిల్లగాలికి నీటిలో చిన్నపాటి కదలికలు, ఆ కదలికలపై ఆహ్లాదంగా విహరిస్తున్న పడవలూ, సరస్సు చుట్టూ ఉన్న పచ్చని చెట్లూ, వాటి ప్రతిబింబాలూ... ఇలా ఇందులో ప్రతిదీ సవాలే. తడబడకుండా ఓపిగ్గా వేసుకుంటూ పోయానంతే. వాటర్ కలర్ కి ముందు పెన్సిల్ తో స్కెచ్ గీసుకోవచ్చన్న టెక్నిక్ నాకప్పుడు తెలీదు. బ్రష్ తో రంగులు వేస్తూ పోవటమొక్కటే తెలుసు. అన్ని లిమిటేషన్స్ నీ అధిగమించి వేసింది నేనేనా అనిప్పుడున్న ఆశ్చర్యం వెనుక అప్పుడున్న తపనా, దీక్షా గుర్తుకొస్తుంటాయి.

అప్పటి నా పెయింటింగ్స్ లో ఈ రెండు "కాశ్మీర్ పెయింటింగ్స్" చాలా చాలా ప్రత్యేకం. పోర్ట్రెయిట్స్ మాత్రమే కాదు, ప్రకృతినీ బానే చిత్రీకరించగలననే ధైర్యాన్నిచ్చాయి. ఆ రోజుల్లో వెసిన ప్రతి పెయింటింగ్ నీ మా ఇంట్లో బీరువా పక్కనుండే ఒక టేబుల్ పైన గోడకానించి పెట్టేవాడిని. అదే నా ఆర్ట్ గ్యాలరీ, అమ్మ అన్న ఇద్దరే వీక్షకులు. అలా అలా నా ఆర్ట్ గ్యాలరీలో వేసిన ప్రతి బొమ్మా ఒకటి రెండు రోజులుంచి మళ్ళీ మళ్ళీ చూసుకుని పొంగిపోయేవాడిని. తర్వాత నాతో వీటినీ అమెరికా కి తెచ్చుకుని ఫ్రేముల్లో పెట్టి వాల్ పైన కొన్ని సంవత్సారాలు గా పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫ్రేముల్లోంచి బయటికొచ్చి నా ఆర్ట్ పోర్ట్ ఫోలియో లో భద్రంగా ఉన్నాయి. ఏప్పుడన్నా అది తిప్పుతుంటే ఎదురై సున్నితంగా నన్ను పలకరిస్తాయి. అప్పుడప్పుడూ బయటికి తీసి మాసిన పేపర్ అక్కడక్కడా కొంచెం నలిగిన మడతలు అరిచేతితో తాకితే, కాలంతో నలిగిన ఆ మడతల్లో ఉన్నది మాత్రం తడి ఆరిన ఆ రంగులూ, తడి ఆరని నా జ్ఞాపకాలూ... 

"తడి ఆరిన రంగుల్లో ఆరని జ్ఞాపకాలే జీవన చిత్రాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, March 2, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 18 ...

Kashmir Winter
Poster colors on Paper (7" x 10")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 17                                                        నా "బొమ్మలు చెప్పే కథలు" - 19 -->

ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు, అప్పుడే మహాగ్రంధం రాసెయ్యలన్న తపన అన్నట్టుగా ఉండే రోజులవి, నా బొమ్మల జీవితంలో. ఒక అందమైన దృశ్యం ఏదైనా పత్రిక లోనో, క్యాలెండర్ లోనో కనిపిస్తే చూసి పరవశించిపోవటమే కాదు, దాన్ని నా చేత్తో అచ్చం అలాగే అచ్చుగుద్ది మరింతగా మైమరచిపోవాలనే తపన. గ్రాఫైట్ పెన్సిల్ తో బూడిద రంగు బొమ్మల నుంచి, ఇంక్ తో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు చేరి, అక్కడి నుంచి రంగుల లోకం వైపు పయనిస్తున్నా నా బొమ్మల బాటన. నేర్చుకోవాలన్న "తపన" ఒక్కటే నాకు "గురువు" అయ్యింది. అపుడప్పుడూ నన్ను తోస్తున్నా పడుతూ, చెయ్యిస్తే మళ్ళీ లేస్తూ, లేచిన ప్రతిసారీ తడబాటు తెలుసుకుని సరిచేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో పైపైకెగురుతూ ఒంటరిగా నా బొమ్మలతో సాహసంగా సావాసంగా సాగుతున్న నా పయనమది.

ఇప్పట్లా చేతిలో మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే చాలు అద్భుతమైన ఫొటో ఇమేజ్ లు వచ్చేసి, అరచేతిలో అద్భుతాలు జరిగిపోయే రోజులు కావవి. ఒక అందమైన ప్రకృతి దృశ్యాన్ని తదేకంగా చూడాలన్నా, చూసి పరవశించి పోవాలన్నా ఎదురుగుండా కళ్ళతోనైనా చూడాలి, లేదా ఏ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫరో తన కళ్ళతో చూసి కెమెరాలో బంధించిన ఫొటో డార్క్ రూమ్ లో డెవలప్ చేసి, ఏ పత్రికలోనో, పుస్తకంలోనో, లేకుంటే ఏ క్యాలెండర్ పేజీ గానో అచ్చయితే తప్ప చూట్టం సాధ్యం కాదు. ఒక సంవత్సర క్యాలెండర్ లో నెలకొక దృశ్యం ఫొటో చొప్పున పన్నెండు ఫొటోలు అచ్చు వేస్తే అందులో ప్రతి ఫొటో అద్భుతంగానే ఉండేది. ఇప్పుడు గూగుల్ ఒక్క క్లిక్ తో ప్రపంచాన్నంతా చుట్టేసొచ్చి, వెతికి వెతికి ఎన్ని ఫొటోలు చూపెట్టినా ఒక్కటీ నచ్చదు. మితం ఎప్పుడూ రుచికరమే, అమితం ఎప్పుడూ అజీర్ణమే.

టీనేజి వయసే నాదింకా ఈ పెయింటింగ్ వేసినపుడు. బహుశా ఆ వయసులో మనసుకుండే వేగం, వేసే ఉరకలు మరే వయసులోనూ ఉండవనేనేమో మనిషి జీవితంలో ఆ ఏడేళ్ళనీ ప్రత్యేకంగా గుర్తించి ప్రతి భాషలోనూ దానికి ఒక పదం కనిపెట్టారు, తెలుగులో యుక్త వయసది. కనపడ్డ మనసుకి నచ్చిన బొమ్మనల్లా ఉరకలు వేస్తూ అలా వేసుకుంటూ ముందుకి సాగి పోతూనే ఉన్నా.

కావలి - నా జీవితంలో మరచిపోలేని మధురమైన పట్టణం. ఎనిమిదేళ్ళ వయసులో హైస్కూలు టీచర్ గా ఉన్న నాన్నకి ట్రాన్స్ఫర్ అవటంతో, తను పుట్టి పెరిగిన నెల్లూరు దగ్గర పల్లెటూరు "దామరమడుగు" లోనే స్థిరపడాలని కొత్త ఇల్లు కట్టుకుని పక్కనే ఉన్న చిన్న పట్టణం బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్ లో పనిచేస్తూ రోజూ సైకిల్ మీద వెళ్ళి వస్తుండే నాన్న. ఎన్నో ఆశలతో ఎంతో అందంగా తనే డిజైన్ చేసుకుని కష్టపడి దగ్గరుండి కట్టించిన కొత్త ఇంట్లో బామ్మ ని ఒక్కదాన్నే పెట్టి, "ఒక్క సంవత్సరం ఓపిక పట్టు మళ్ళీ ట్రాన్స్ఫర్ చెయించుకుని వెనక్కి వచ్చేస్తాం" అని బామ్మకి మాటిచ్చి అమ్మా, అన్నా, నేనూ, చెల్లెలుతో కావలికి వచ్చాడు. తర్వాత ఒక్క సంవత్సరం తిరక్కుండానే అనూహ్యమైన మార్పులు, అందరమూ చెల్లా చెదురయ్యాం. నేనేమో దూరంగా రెసిడెన్షియల్ స్కూల్, అమ్మేమో నాన్న దగ్గర మద్రాస్ విజయా నర్సింగ్ హోమ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాన్న ని చూసుకుంటూ, బామ్మ ఒక్కటే మా ఊర్లో, అన్న ఎక్కడో కందుకూరులో పెద్దమామయ్య దగ్గర, చెల్లెలు అటూ ఇటూ బామ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో. ఒక సంవత్సరం లోనే ఊహించ(లే)ని మార్పులతో నాన్నని దేవుడు మా నుంచి దూరం చెయ్యటం, తర్వాత అమ్మ జాబ్ చెయ్యాల్సిరావటం, అక్కడ బామ్మ బాగోగుల్నీ, ఇక్కడ మమ్మల్నీ చూసుకుంటూ కావలి లోనే ఉండిపోవటం, అలా దాదాపు పద్దెనిమిదేళ్ళు బామ్మ ఒక్కటే మాకోసం ఆ ఊర్లోనే ఉండిపోయింది.

నిరాశా నిస్పృహల్లో విధి ముంచేసినా నెమ్మదిగా కొంచెం కొంచెం తేరుకుంటూ, ఎంతో పొదుపైన జీవితం, గర్ల్స్ హైస్కూల్ లో క్లర్క్ గా జాబ్ చేసుకుంటూ, మమ్మల్ని చదివిస్తూ, మాకన్నీ చూసుకుంటూ అమ్మ, ఆ పల్లెటూర్లో మా ఇంటికీ, మాకూ అండగా, మా రవ్వంత ఆస్తికి కొండంత తోడు గా బామ్మా, అలా  మళ్ళీ జీవితంలో మేము నిలదొక్కుకున్నదీ ఆ కావలిలో నివాసముంటూనే. నాన్నతో కలిసి చిన్నప్పుడు వెళ్ళిన రైల్వేస్టేషన్ రోడ్డులోని "గీతా మందిరం", చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళిన బజార్లు, చూసిన కొద్ది సినిమాలు, ఇవే ఎప్పటికీ చెరగని, తరగని జ్ఞాపకాలు. అలా నేను స్కూలూ, కాలేజీ అన్నీ దూరంగానే ఉండి చదువుకోవటంతో, శలవులకి వస్తే బయటికి వెళ్ళి కలిసే ఒక్క మిత్రుడూ లేకపోవటంతో పుస్తకాలు, బొమ్మలే నాకు నేస్తాలయ్యాయి. అమ్మ జాబ్ కీ, అన్న కాలేజీకో, ఫ్రెండ్స్ తోనో వెళ్తే ఒక్కడినే కూర్చుని గంటల కొద్దీ బొమ్మలు వేస్తూ గడిపేవాడిని. ఒకవేళ బయటికి ఒక్కడినే వెళ్తే అది ఒక్క లైబ్రరీకి మాత్రమే. ఇంకెక్కడికైనా అన్న తోడు లేనిదే పొయ్యేవాడిని కాదు.

కావలి, అమ్మమ్మ అమ్మ కూడా పుట్టి పెరిగిన ఊరది. ఒక చిన్న పెంకుటింట్లో నెలకి యాభై రూపాయల అద్దెకి. అదీ తన ఆదాయం అతితక్కువ అయినా, మా కుంటుంబ పరిస్థితులు తెలిసి, పెద్దమనసు చేసుకుని వంద అద్దెని యాభైకి తగ్గించి ఇచ్చిన తాతయ్య చెల్లెలు "నారాయణవ్వ" ఇల్లది, ఒప్పించి ఇప్పించింది మా తాతయ్య. ఆ పెంకుటింట్లోనే నా బొమ్మలు అద్భుతాల దారులవెంట నడిచాయి. నా మట్టుకు నేనక్కడ వేసిన బొమ్మలన్నీ నాకు ఇప్పటికీ అద్భుతాలే. ఒక అట్ట, ఒక పేపర్, నాలుగైదు కేమెల్ రంగుల సీసాలు, ఆ రంగుల సెట్ తో వచ్చిన ఒక చిన్న రంగులు కలుపుకునే ప్యాలెట్, ఒక బ్రష్, చిన్న మగ్ లో నీళ్ళు, ఎదురుగా ప్రింట్ అయిన బొమ్మ పెట్టుకుని నేను సాగించిన నా దీక్షలు ఎన్నో. ఆ దీక్షల్లో సృష్టించిన బొమ్మలు మరెన్నో.

చిన్నమామయ్య నాకప్పట్లో పుస్తకాలకీ, బొమ్మలకీ పెద్ద ఇన్స్పిరేషన్. చిన్నమామయ్య దగ్గర చాలా పుస్తకాలుండేవి. చాలా మంచి ఆర్టిస్ట్ అండ్ రైటర్ కూడ. కాన్పూర్ లో యమ్మెస్సీ అయ్యి కావలికి వచ్చి తాతయ్య వాళ్ళింట్లో మిద్దెమీద తన రూమ్ లో సగం పైగా పుస్తకాలే ఉండేవి. వెళ్ళినప్పుడల్లా అక్కడ కూర్చుని గంటలకొద్దీ పుస్తకాలు తిరగేసేవాడిని. అలా ఒకసారి స్పైరల్ టేబుల్ క్యాలెండర్ కనిపించింది. పన్నెండు నెలలు, నెలకొకటి చొప్పున పన్నెండు హార్డ్ పేపర్స్ మీద పన్నెండు అందమైన ఫొటోలు. అది తెచ్చుకుని అందులో రెండు ఫొటోలని వాటర్ కలర్ పెయింటింగులు గా వేశాను. ఆ రెండిట్లో ఇది మొదటిది.

కాశ్మీర్ లోయల మంచు, ఎత్తు పల్లంగా ఉన్న ఓ ప్రదేశం, ఎత్తున మంచుతో పూర్తిగా కప్పబడ్డ రోడ్డు, దిగువన కుటీరం లాంటి చిన్న ఇల్లు, కొంచెం కనిపిస్తూ మిగతా మంచుతో కప్పబడ్డ పై కప్పు, వరండా లో ఒక పేము కుర్చి, ఇంకేదో చెక్క ఫర్నీచర్, ఇంటి మెట్లు ఎక్కుతూ ఒక పెద్దాయన, వెనక చలికి శాలువా కప్పుకుని కర్ర పట్టుకుని మంచులో నడుస్తూ లోపలికెళ్తున్న ఒక పెద్దావిడ, ఆ మంచులో జాకెట్ కప్పుకుని ఆడుకుంటున్న ఒక పిల్లాడు, చుట్టూ అలాంటి ప్రదేశాల్లో పెరిగే ఎత్తయిన చెట్లు, వాటి వెనక నీలాకాశం, అక్కడక్కడా మంచుతో పూర్తిగా కప్పబడని నేలా, ఇన్నిటినీ ఒక 7 x 10 ఇంచ్ పేపర్ మీద పోస్టర్ కలర్స్ తో ఫొటో అనిపించేలా దించాలి. అప్పూడప్పుడే చిన్న చిన్న పెయింటింగ్స్ తడబడుతూ వేస్తూ కొంచెం కొంచెం మెళకువలు నేర్చుకుంటున్న నాకు అది చాలా పెద్ద సాహసం. అంత సాహసోపేతం ఇప్పుడైతే ససేమిరా చెయ్య(లే)నేమో. అంత ఓపికా, ఆ పట్టుదలా, ఆ దీక్షా, ఆ శక్తీ ఇవేవీ ఇప్పుడు ఉన్నాయో లేవో, ఉన్నా రమ్మన్నా రావేమో. ఏ పనినైనా అద్భుతంగా చెయ్యటానికి ఉండాల్సిన తపనకి పక్కన ఉత్సాహం, సాహసం, ఓపికా, పట్టుదలా, దీక్షా, శక్తీ కూడా తోడవ్వాలి అనటానికి నిదర్శనం ఈ పెయింటింగ్.

నా టీనేజి వయసులో వేసిన ఈ పెయింటింగ్ అప్పటి వయసుకి నాకు అద్భుతం అయితే ఈ వయసుకి మాత్రం అది మహాద్భుతం. ఓనమాలు దిద్దుతున్నపుడే ఒక మహా గ్రంధం రాయటం ఎవరికైనా సాధ్యమా? తపనకి తోడుగా ఉత్సాహం, సాహసం, ఓపిక, పట్టుదల, దీక్ష, శక్తి, ఆసక్తి కలసి వచ్చి మనల్ని ముందుకి నడిపిస్తే సాధ్యమే. ఆ దీక్షల్లో ఓనమాలు దిద్దుతూ సృష్టించేవి పెద్ద పెద్ద గ్రంధాలే...

"ఒకప్పటి అద్భుతాలే కాలంలో మహాద్భుతాలుగా నిలుస్తాయి."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...


Saturday, February 10, 2024

భగవంతుడు . . .

 
భగవంతుడు
Ink & Watercolors on Paper

ఎవరే రూపంలో కొలిచినా
ఏ పేరు పెట్టి పిలిచినా
భగవంతుడు ఒక్కడే
కొలువైనది నీ మదిలోనే

నీలోనో ఇంకొకరిలోనో
ఏదో ఒకరూపంలో
ఎప్పుడో ఒకప్పుడు
కనిపించక పోడు

Saturday, January 27, 2024

ఇంకా ఇచ్చిన మాటలెన్నో . . .

"ఝాన్సి లక్ష్మి భాయి" గా మా "శ్రావణి" పాప - "లక్ష్మి హృదయ" 
Pen and watercolors on Paper (8.5" x 11")

దాదాపు రెండేళ్ళ తర్వాత ఈరోజు ఉదయం, "గిరీ, ఒక చిన్న బొమ్మ వెయ్యవా" అని నా మనసు నన్నడిగింది. ఈమధ్యనే చూసిన ఫొటో - కత్తి డాలు పట్టుకుని కదనరంగానికి సిద్ధం అయిన ఝాన్సి లక్ష్మి భాయి గా "మా శ్రావణి" కూతురు "లక్ష్మి హృదయ" రూపంలో నా మనసు మాట మన్నించా.

దాదాపు పదేళ్ళ క్రితం వాళ్ళబ్బాయి బొమ్మ వేసివ్వమని శ్రావణి అడిగితే అలానే అని మాటిచ్చా, ఆ మాట ఇన్నాళ్ళకిలా తీర్చా. "శ్రావణి" - మా చిన్నమామయ్య కూతురు, చిన్నపుడు హైదరాబాద్, విద్యానగర్ లో "గిరిమావయ్యా" అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ నా దగ్గరికి రోజూ వస్తూ ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో దేనికైనా ఏడుస్తుంటే ఎత్తుకుని వెళ్ళి శంకర్ మఠ్ దగ్గర బజార్ లో చాక్లెట్లు కొనిస్తే బుగ్గలపై కారుతున్న ఆ కన్నీళ్ళు ఒక్కసారి ఆనంద తాండవం చేసేవి. పసి పిల్లల దుఃఖాన్ని మరిపించి, మనసుల్ని మురిపించటం ఇంత సులభమా అనిపిస్తుంటుంది గుర్తుకొచ్చినపుడల్లా...

ఇంకా ఇచ్చిన మాటలెన్నో...
ఆ బాకీలన్నీ తీరేదెప్పటికో...
 

Tuesday, December 5, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 15 ...

"ప్రియబాంధవి"
Camel Poster Colors on Ivory Board, 8" x 10"

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 14                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 16 -->
నిషి పుట్టుకతోనే చుట్టూ ఉన్న పరిసరాల్నీ, మనుషుల్నీ, జీవుల్నీ చూసి అర్ధం చేసుకోవటం, చదవటం, నేర్చుకోవటం మొదలవుతుంది. మాటా, నడవడికా, ఆచరణా ఇవన్నీ పరిసర ప్రభావాలతోనే మొదలయ్యి నిత్యం ప్రభావితమవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూనే ముందుకి సాగి పోతూ ఉంటాయి. ఎంత నేర్చుకున్నా, ప్రతిరోజూ ఏదో ఒకటి, ఎంతో కొంత, కొత్తదనం ఎదురు కాకుండా ఉండదు. రోజూ ఉదయించే సూర్యుడూ ఆకాశంలో ప్రతి దినం ఒకేలా కనపడడు. చుట్టూ ఉన్న ప్రకృతి అయినా అంతే. దిన దిన ప్రవర్ధమానమే ప్రకృతి జీవం లోని పరమార్ధం.

విద్యని బోధించే సరైన గురువుండి అభ్యసించాలన్న అభిలాష ఉంటే ఆ విద్యాభ్యాసం "నల్లేరుపై బండి నడక" లా సులభసాధ్యం కాక తప్పదు. కానీ ఒక్కొకప్పుడు నేర్చుకొవాలన్న ఆసక్తి ఉన్నా కొన్ని విషయాల్లో బోధించే గురువులు అందరికీ దొరకరు. అలాంటి స్థితిలో నేర్చుకోవాలంటే శోధించాలి. ఆ విషయ శోధన ప్రక్రియలో కొందరు నిష్ణాతులు చేసిన పనులు, ఆ పనుల్లోని నైపుణ్యం పరిశీలించి అధ్యనం చేసి నేర్చుకోవలసి వస్తుంది. అదే పరిశోధన, nothing but research.

పెయింటింగ్ లో నా అభ్యాసం సరిగ్గా ఇలానే ఒక రీసెర్చ్ లా మొదలయ్యింది. పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఇంక్ పెన్, ఇంక్ బ్రష్ ల బొమ్మలు దాటి పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన "విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" లో ఇంజనీరింగ్ చేస్తున్న రోజుల్లో మొదలయ్యింది. పెయింటింగ్ మెటీరియల్ కోసం అక్కడ తిరగని స్థలం లేదు, వెదకని షాపుల్లేవు. నేర్పించే గురువులు దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేదు. కానీ ఎలాగైనా నేర్చుకోవాలన్న తపనొక్కటే ఉండేది. అదే నా శోధనకి పునాది అయ్యి నన్ను ముందుకి నడిపించింది. ఎలాగోలా కష్టపడి కావలసిన మెటీరియల్ కనుక్కుని కొనుక్కోగలిగాను. ఒక ఐదారు క్యామెల్ పోస్టర్ కలర్స్, రెండు మూడు బ్రష్ లు, అసలు వాటర్ కలర్స్ వెయ్యటానికి అదో కాదో కూడా తెలియని నాణ్యమైనదే అనిపించిన Ivory Board అని బుక్ షాప్స్, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు పిలిచే ఒక రకం పేపర్. ఇవే నాకున్న పెయింటింగ్ మెటీరీయల్.

అప్పట్లో "ఆంధ్రభూమి" వారపత్రికలో విశేషాదరణ పొందుతున్న ప్రముఖ రచయిత్రుల సీరియల్స్ కి, ఉత్తమ్ కుమార్ గారు వెస్తున్న ఇలస్ట్రేషన్స్, కళా భాస్కర్ గారి "ఎంకి బొమ్మలు" ఆ పత్రికకే ఆకర్షణగా, ప్రత్యేకంగా ఉండేవి, కారణం అవి పూర్తి స్థాయి వాటర్/పోస్టర్ కలర్స్ తో వేసిన పెయింటింగ్స్ కావటం. అలా పెయింటింగ్స్ వెయ్యాలన్న తపనా, ప్రయత్నంలో నేనూ ఉండడంతో నా రీసెర్చ్ కి సరిగ్గా సరిపడ గురువు "ఉత్తమ్ కుమార్" గారి బొమ్మల రూపంలో దొరికాడు. వారం వారం క్రమం తప్పక ఒక్కడినే హాస్టల్ నుంచి బస్ లో "పటమట" కి కేవలం ఆంధ్రభూమి కోసమే వెళ్ళి, కొని తెచ్చుకున్న వారాలెన్నో ఉన్నాయి. అలా ఆ బొమ్మలు ఆధారంగా అచ్చం అలానే వేస్తూ రంగుల కలయికా, బ్రష్ వర్క్స్ ఇవన్నీ ఆ ప్రింటెడ్ బొమ్మల్లో శోధిస్తూ సాధన మొదలుపెట్టాను. శనివారం ఒక పూట కాలేజ్, ఆదివారం హాలిడే. సెకండ్ యియర్ లో సీరియస్ గా ప్రతి శని, ఆదివారాలూ పెయింటింగ్స్ వేసే ప్రక్రియ క్రమం మొదలయ్యింది. సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువూ, సినిమాలూ, షికార్లూ తప్ప ఆటలకీ, ఇతర హాబీలకీ పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నాం, చదువయ్యాక ఇంజనీర్స్ అన్న మైండ్ సెట్ తో ఎక్కువ వీకెండ్స్ చదువుల్లోనో, లేదా ఫ్రెండ్స్ తో సినిమాలకి, షికార్లకి, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో టీవీ చూట్టం, క్యారమ్ బోర్డ్, టేబుల్ టెన్నిస్ ఆట్టమో...ఇలానే ఎక్కువగా గడిచిపోయేవి.

నా పెయింటింగ్స్ సాధన ప్రక్రియలో మొట్టమొదటి రంగుల పెయింటింగ్స్ కొంచెం సులభం అనిపించిన వాటితోనే మొదలుపెట్టాను. ఇంకా గుర్తుంది, మొట్టమొదటిది టేకాఫ్ అవుతున్న ఒక Boeing 747 Airplain. దానికి "Fly High. Your aim the sky, your goal the star." అని క్యాప్షన్ కూడా రాశాను. అలా మెల్లిగా పెయింటింగ్స్ లోకి ప్రవేశించి ఒక రెండుమూడు పెయింటింగ్స్ వేశాక "ఉత్తమ్" గారి బొమ్మలు చూసి అచ్చం అలానే పొల్లుపోకుండా వేసే ప్రయత్నం కొంతకాలం చేశాను. అలా వేసిన కొన్ని పెయింటింగ్స్ లో ఇది ఒకటి. అయితే అప్పటిదాకా, ఆ తరువాతా వేసిన అన్నిటి కన్నా ఇది మాత్రం నాకెంతో ప్రత్యేకంగా ఉండేది. "ఉత్తమ నాయికలు" అన్న శీర్షికన "ఉత్తమ్" గారు వేయటం మొదలుపెట్టిన సిరీస్ లో బహుశా మొదటి పెయింటింగ్ ఇదే అనుకుంటా. దీని తరువాత ఆ సిరీస్ అలా కొనసాగించారన్న గుర్తు లేదు కానీ, ఆగింది అని మాత్రం గుర్తుంది.

"ఉత్తమ్" గారు వేసిన అన్ని బొమ్మల్లో ఈ బొమ్మ నాకెంతో ఇష్టం. ఇంజనీరింగ్ ఫైనల్ యియర్ లో ఉన్నపుడు శని, ఆది వారాలు ఏకబిగిన కూర్చుని పూర్తిచేసిన పెయింటింగ్ ఇది. అయితే అప్పటికి నేను చేసిన అతికొద్ది పెయింటింగ్స్ సాధనతో ఈ పెయింటింగ్ వెయ్యాలని మొదలు పెట్టటం నాకప్పుడు "కత్తి మీద సాము" లాంటిదే. ఉన్న ఐదారు రంగుల కలయికలతో కావలసి రంగుల్ని తీసుకు రావటం, పెయింటింగ్ లో ఉండవలసిన షేడ్స్, మెళకువలూ ఇవేవీ సరిగా తెలియకపోవడం, అయినా కింద మీదా పడి కసరత్తులు చేస్తూ వెయ్యటం అంటే ఒక రంకంగా నడవడం పూర్తిగా రాకుండానే పరిగెత్తడం లాంటిది. ఇంకా గుర్తుంది, సగం పూర్తయిన పెయింటింగ్ బాగా వస్తుందన్న సంతోషంలో ఒక చిన్న నలుపు రంగు చుక్క పొరబాటున ముఖం మీద చిందటం. అసలే ది వాటర్ కలర్స్ కోసం వాడే పేపర్ కాకపోవటం, రంగులు కూడా పోస్టర్ కలర్స్ అవటం తో, అది చెరపటం సాధ్యం కాని పని. ఆ చుక్కని కవర్ చేస్తూ వైట్ రంగుని అద్దీ అద్దీ మళ్ళీ దానిపైన రంగుల షేడ్స్ అద్ది ఇలా ఎన్నెన్నో ప్రయాసలతో పూర్తి చేశా. అన్ని ప్రయాసల్లోనూ తగ్గక వెయటం వల్లేమో ఇప్పటికీ చూసిన ప్రతి సారీ సంతృప్తిని ఇచ్చే పెయింటింగ్ అవటంతో మరింత అభిమానం అన్నిటికన్నా మిన్నగా.

పూర్తిచేశాక ఆదివారం "విజయవాడ పటమట" వెళ్ళి కొన్ని జిరాక్స్ కాపీలు తీయించాను, బ్లూ, బ్రౌన్, గ్రీన్ రంగుల్లో. తర్వాత నాతో శలవులకి మా ఊరు  "కావలి" కి తీసుకెళ్ళి అన్నతో కలిసి కావలి ట్రంక్ రోడ్డు పక్కన, ఒంగోలు బస్టాండుకి దగ్గరలో ఉన్న ఒక ఫ్రేములు చేసే షాపు ఆయన దగ్గరికెళ్ళి చుట్టూ నల్లని బార్డర్ తో ఫ్రేము చెయ్యమని చెప్పాను. అలాగే చేసిస్తా అని తీసుకున్నాడు. కానీ ఇంటికొచ్చాక మనసు మాత్రం బిక్కు బిక్కు మంటూనే ఉండేది. ఎలా చేస్తాడో ఏమో, ఒకవేళ ఏమన్నా మరకలు అయితేనో, లేదా అసలు పోగొట్టేస్తేనో ఇలా రకరకాలుగా ఆలోచనలు మెదిలేవి. మధ్యలో ఒకసారి వెళ్ళి మొదలుపెట్టారా, పెట్టుంటే ఎలా వస్తుందో చూస్తాను అన్నాను, ఇంకా లేదని చెప్తూ, ఏం ఫరవాలేదు ఎలాకావాలని చెప్పావో గుర్తుంది, బాగా చేసిస్తాను అని చెప్పాడు. నాలుగైదు రోజుల తర్వాత అయ్యాక వెళ్ళి తీసుకుని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. చాలా బాగా చేసిచ్చాడు. వెనక నల్లని వెల్వెట్ లాంటి క్లాత్, ఒక ఇంచ్ బోర్డర్ కనపడేలా, కార్నర్స్ షార్ప్ కాకుండా ఒక ఇంచ్ ట్రయాంగిల్ కట్ అవుతూ, టేబిల్ మీద పెట్టుకోటానికీ, గోడకి తగిలించటానికీ రెంటికీ అనువుగా ఎంతో బాగా చేశాడు. ఇప్పటికీ అదే ఫ్రేమ్ లో నా వద్దే అలాగే భద్రంగా ఉంది.

ఇదే బొమ్మని ఈ పెయింటింగ్ కన్నా ముందు బ్లాక్ ఇంక్ పెన్ తో మా కాలేజి యాన్యువల్ మ్యాగజైన్ కి వేశాను. మ్యాగజైన్ లో ప్రింట్ కూడా అయ్యింది. అప్పుడు కొన్న మ్యాగజైన్స్ ఇప్పుడు నాతో లేకున్నా వాటిల్లో ఉత్తమ్ గారి బొమ్మలూ, ఆయనే రాసి బొమ్మ కూడా వేసిన ఒక కవితా, కొన్ని కార్టూన్లూ, కొన్ని పంచతంత్రం బొమ్మల కతలూ, మైటీ హనుమాన్ అని మొదలుపెట్టి రెలీజ్ చేసిన మొదటి అండ్ ఒకేఒక్క అద్భుతమైన పెయింటింగ్స్ ఇంగ్లీష్ కామిక్ బుక్, ఒకటి రెండు "కళా భాస్కర్" గారి "ఎంకి" బొమ్మల పేపర్ కటింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఇదివరకు నా బొమ్మల మాటల్లో హైదరాబాద్ లో ఉత్తమ్ గారిని కలవాలని చేసిన ప్రయత్నం, కలిసిన కళా భాస్కర్ గారి జ్ఞాపకం పంచుకున్నాను. "కళా భాస్కర్" గారు ఇపుడు లేరనీ, స్వర్గస్తులయ్యారనీ తెలిసి బాధ పడ్డాను. ఉత్తమ్ గారితో మాత్రం ఒక పదేళ్ళ క్రితం ఫోన్ లో ఇండియా వెళ్ళినపుడు రెండు సార్లు మాట్లాడగలిగాను.

"ఉత్తమ నాయికలు" అన్న శీర్షికన "ఉత్తమ్" గారి బొమ్మ చూసి వేసిన ఈ బొమ్మకి నేనిచ్చుకున్న టైటిల్ "ప్రియబాంధవి". అప్పటి నవలా రచయిత్రి "శ్రీమతి బొమ్మదేవర నాగ కుమారి" గారు రాసిన "పయనమయే ప్రియతమా" అన్న నవలలో చదివిన, అందులో ఆమె వాడిన ఒక తియ్యని తెలుగు పదం ఇది. ఈ పదం అంత వరకూ తెలీదు, ఎప్పుడన్నా మదిలో మెదిలితే గుర్తుకొచ్చేది మాత్రం ఇదే పెయింటింగ్, వెన్నంటే ఆనాటి జ్ఞాపకాలూ.

ఈ పెయింటింగ్ లో వేసిన తేదీ చూస్తే ఈ మాట్లాడే రంగుల గుర్తులన్నీ ముప్పైఐదేళ్ళ నాటి చెదరని జ్ఞాపకాలు. కాలం గిర్రున తిరిగిందో, లేదా కాలంకన్నా జీవితమే ఇంకా వేగంగా తిరిగిపోయిందో తెలీదు కానీ, జ్ఞాపకాలు మాత్రం ఇంకా నిన్నటివే అన్నట్టు ఇందులో పదిలంగా దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ ఇలా బయటికి తొంగి చూస్తూనే ఉంటాయి...

"దిన దిన ప్రవర్ధమానమే జీవిత పరమార్ధం!"
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Monday, September 4, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 12 ...

Portrait of Pooja Bedi
Camel Poster Colors on Paper (11" x 14")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 11                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 13 -->
ర్ట్ పై ఉన్న ఇష్టం, నేర్చుకునే వీలు లేక, పత్రికల్లో ఆర్టిస్ట్ లు వేసే ఇల్లస్ట్రేషన్స్ బొమ్మల్నీ, ఫొటోల్నీ చూసి వేస్తూ, స్వీయ సాధనలో ఒక్కొక్క అడుగూ పడుతూ లేస్తూనే ముందుకి వేస్తూ, అలా పెన్సిల్ డ్రాయింగ్స్, బాల్ పాయింట్ పెన్ స్కెచెస్ దాటి, ఫౌంటెన్ పెన్ ఇంక్, వాటర్ కలిపి బ్రష్ తో బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ లా అనిపించే బొమ్మలూ దాటి, కేమెల్ పోస్టర్ కలర్స్ నే వాటర్ కలర్స్ అని కొని, అనుకుని పత్రికల్లో వస్తున్న ఫొటోలు చూసి వాటిని పెయింటింగ్స్ లా వెయ్యాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న రోజులవి. నాలుగైదేళ్ళు, 1987-91 సంవత్సరాల మధ్య నేను పెయింటింగ్స్ వెయ్యాలని పడ్డ తపనా, మెటీరియల్ కోసం తిరిగిన ఊర్లూ, వెతికిన షాపులూ, పెయింటింగ్స్ వెయ్యాలని చేసిన కృషి, ఒక్క ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని అయినా కలిసి వాళ్ళు బొమ్మలు వేస్తుంటే చూడాలని, చూసి మెళకువలు నేర్చుకోవాలనీ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు.

ఇంజనీరింగ్ చదువు పూర్తి అవగానే హైదరాబాద్ వెళ్ళి మొదటి జాబ్ చేస్తున్న రోజుల్లోనూ బొమ్మలు వెయ్యటం మాత్రం ఆపలేదు. ఏ పండగకో ఆఫీస్ కి నాల్రోజులు శలవు పెట్టి హైదరాబాద్ నుంచి కావలి ఇంటికి వస్తూ కూడా రంగులూ బ్రష్ లూ నాతో తెచ్చుకోవటం, ఇంట్లో ఉన్న వారం రోజుల్లో కూడా గంటల కొద్దీ కూర్చుని పెయింటింగ్స్ వేసుకోవటం, పూర్తి చేసిన ప్రతి బొమ్మని చూసుకుని సంతృప్తి పడిపోవటం, ఇలా నా బొమ్మలు నా వెన్నంటే ఎప్పుడూ ఉన్నాయి.

అప్పట్లో ప్రతి సంవత్సరం మొదట్లో, చివర్లో గ్రీటింగ్ కార్డులూ, క్యాలండర్లూ ఊరూరా సందడి చేసేవి. కొత్త సంవత్సరం షాపుల్లో కొత్త క్యాలండర్లు తగిలించేవాళ్ళు. McDowell's అనే wine కంపెనీ ఒకటి ప్రతి సంవత్సరం అందమైన క్యాలెండర్ ప్రింట్ చేసి రిలీజ్ చేసేది. అది కొంచెం పెద్ద సైజ్ లో చాలా మంచి క్వాలిటీ పేపర్ పై ఎవరో ఒక ప్రముఖ సెలెబ్రిటీ ఫొటోలతో చూపరులను ఆకట్టుకునేలా చాలా అందంగా ఉండేది. అక్కడక్కడా కొన్ని షాపుల్లో అలాంటి క్యాలెండర్స్ అప్పటికి చాలా సార్లు చూశాను. ఆ సంవత్సరం సంక్రాంతి శలవులకి ఇంటికొస్తే ఆ క్యాలెండర్ ఒకటి నా చేతికి చిక్కింది. అన్నకి ఫ్రెండ్ ఎవరో ఒక క్యాలెండర్ ఇచ్చారు. అప్పటి దాకా పత్రికల్లో చిన్న చిన్న ఫొటోలు చూసి వేసిన పోర్ట్రెయిట్స్ తో ఒక్కసారి బ్యూటిఫుల్ పెద్ద సైజ్ క్యాలెండర్ చూసే సరికి అందులో ఒక బొమ్మని రంగుల్లో పెయింటింగ్ వెయ్యాలన్న ఆలోచన మదిలో మెదిలింది. అంతే ఒక రోజు పొద్దున్నే దీక్ష మొదలైపోయింది.

ఆ సంవత్సరం క్యాలెండర్ పేజీల్లో మోడల్ "పూజా బేడి". చాలా అర్టిస్టిక్ గా అనిపించిన ఒక పేజీలోని ఈ పోజ్ ని నా పెయింటింగ్ కోసం ఎంచుకున్నా. ఆ ఫొటోలో ఉన్న రంగులూ అందులోని కొన్ని షేడ్స్, నా దగ్గరున్న నాలుగైదు క్యామెల్ పోస్టర్ కలర్స్ తో కొంచెం కష్టమే. అయినా ఏదో తెలీని తపన, అచ్చం అలానే వేసెయ్యాలని. ఒక రెండు రోజులు రోజూ కొన్ని గంటలు కూర్చుని పూర్తి చేసిన ఈ పెయింటింగ్ లో బ్యాక్ డ్రాప్ అప్పటి నా బొమ్మల్లో ఒక చిన్న ప్రత్యేకత.

ఆ క్యాలెండర్ పేజీ లో పెరట్లో ఒక తలుపు ముందు నేలపై కూర్చున్న మోడల్, పక్కన చెట్టు కొమ్మలూ, చేతికి ఒక బుట్టా, బుట్టలో కుండ, అరిటాకులు, పక్కన ఇంకా రెండు మూడు కుండలు, బుట్టలూ ఇలా కొన్ని వస్తువులూ ఉన్న చిత్రం అది. అందులోంచి నా పెయింటింగ్ కి మాత్రం మోడల్, పట్టుకున్న బుట్టా, ఒక కుండా ఇంతవరకే తీసుకున్నాను. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా డార్క్ లో భిన్నంగా వెయ్యాలని అనుకున్నాను. ఆ డార్క్ బ్యాక్ డ్రాప్ లో పోర్ట్రెయిట్ ఎలివేట్ చెయ్యాలని అలా స్ట్రైప్స్ తో ఉన్న నల్లని బ్యాక్ డ్రాప్ వేశాను. ఆ ఒకటి రెండేళ్ళు 1990, 91 సంవత్సరాల్లో నేనేసిన పెయింటింగ్స్ లో ఇంచు మించు గా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లే ఎక్కువగా వేశాను. ప్రతి ఆర్టిస్ట్ కీ ఒక ట్రెండ్ లాంటిది కొద్ది రోజులు కొన్ని బొమ్మల్లో రిపీట్ అవటం అనేది ఉంటుంది. అలా స్ట్రైప్స్ బ్యాక్ డ్రాప్ ఆ రెండు మూడేళ్ళ నా బొమ్మల్లో ట్రెండ్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటుంటే. అప్పట్లో ఇలా ఇంకో రెండు మూడు పెయింటింగ్స్ కీ ఇలాంటి బ్యాక్ డ్రాప్ వేశాను.

రంగులు ఎలా కలపాలి, ప్రైమరీ రంగులు అంటే ఎన్ని, ఆ రంగులు ఏవేవి, సెకండరీ రంగులెన్ని, ఏ ఏ ప్రైమరీ రంగులు కలిపితే సెకండరీ రంగులొస్తాయి, అక్కడి నుండి మరిన్ని రంగుల షేడ్స్ ఎలా వస్తాయి...ఇలాంటి పాఠాలేవీ బొత్తిగా తెలీదు, తెలుసుకునేందుకు కావల్సిన పుస్తకాలూ దొరికేవి కావు. తెలిసిందల్లా - ఒక రంగు, దాని షేడ్ చూస్తే తెలీకుండానే రెండు మూడు రంగులు కలపటం ఆ రంగు కి దగ్గరగా ఉన్న షేడ్ తీసుకురావటం అంతే. అంతా అలా ఆటోమ్యాటిక్ గా జరిగిపోయేది. ఇందులో నా దగ్గరున్న రెండు మూడు రంగులు, వైట్, రెడ్, యెల్లో, గ్రీన్ అక్కడక్కడా స్ట్రెయిట్ గా వాడినవి అలానే కనిపిస్తాయి. ఆ నాలుగు రంగులే అటూ ఇటూ కలిపి మిగిలిన షేడ్స్ తెచ్చేవాడిని. ఇందులో ఇప్పుడు గమనిస్తే సిల్వర్, గోల్డ్ రంగుల్ని పెయింటింగ్ ఆభరణాల్లో వేసే మెళకువ అప్పటికి ఇంకా తెలీదు. దాని కోసం తర్వాత గోల్డ్, సిల్వర్ క్యామెల్ల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లు కొని వాటిని కొన్ని పెయింటింగ్స్ లోనూ వాడాను. మెరుస్తూ కొంచెం గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్ ఇచ్చేవి. ఇందులో బ్యాక్ డ్రాప్ బ్లాక్ మాత్రం ఇండియన్ ఇంక్ తో వేసిందే.

అప్పుడు నా మొట్టమొదటి జాబ్ "సంగారెడ్డి", మెదక్ జిల్లా District Treasury Office, Computer Centre లో "Data Processing Officer" గా. చిన్న టవున్. National Informatics Centre (NIC) Office, Computer Centre లో, District Rural Development Agency (DRDA) Office, Computer Centre లో బిమల్ కుమార్, రాంబాబు, సోమేశ్వర రావు, వ్యాఘ్రేశ్వర రావు ఇలా నలుగురైదుగురు ఫ్రెండ్స్ తో చిన్న ఆఫీస్ ప్రపంచం, నా బొమ్మలు చూసి మెచ్చుకునేవాళ్ళు. District Collector Office కూడా కలిసి అన్నీ ఒకే కాంపౌండ్ లో ఉండేవి. దగ్గర్లోనే ఆంధ్ర బ్యాంక్, టైప్ ఇన్స్టిట్యూట్, ఒక జిరాక్స్ షాప్ ఉండేది. ఈ పెయింటింగ్ ని ఆ జిరాక్స్ షాప్ లో ల్యామినేషన్ చెయించాను. అప్పుడు ప్రతి టవున్ లోనూ ఫొటో ఫ్రేములు కట్టే షాపులు మాత్రం తప్పనిసరిగా ఉండేవి. ఎక్కువగా దేవుడి ఫొటో లు ఫ్రేమ్ చేసేవాళ్ళు. దీనికి ముందు ఒకటి రెండు పెయింటింగ్స్ ని "కావలి" లో అలాంటి షాప్ లో ఫ్రేమ్ చెయ్యించాను. చాలా టైమ్ తీసుకుని చక్కగా ఫ్రేమ్ చేసేవాళ్ళు. హైదరాబాద్ అబిడ్స్ దగ్గర ఒక ఫ్రేమ్ షాప్ ఉండేది, అక్కడ రెడీ మేడ్ ఫ్రేమ్స్ కూడా దొరికేవి. ఒకటి రెండు నా బొమ్మలు అలా ఫ్రేమ్స్ చేయించాను. ఇదొక్కటి మాత్రం ల్యామినేషన్ చెయ్యించి చూద్దాం అని ట్రై చేశా. నచ్చలేదు, తర్వాత ఏ బొమ్మా ల్యామినేషన్ చెయ్యించలేదు.

ప్రతి బొమ్మలోనూ అప్పటి జ్ఞాపకాలు, ఆ రోజులూ, ఆ పరిస్థితులూ, ఒంటరిగా కూర్చుని రంగులతో ఆ కుస్తీలు, ఇలా ఎన్నెన్నో అనుభవాలూ అనుభూతులూ దాగి ఉంటాయి. బొమ్మలోకి తొంగి చూస్తే ఒక్కొక్కటీ మళ్ళీ కళ్ళముందు జరుగుతున్నట్టే కనిపిస్తాయి. కాలం ఎంత ముందుకెళ్ళిపోయినా అన్నీ గుర్తుకి తెస్తూ నిన్ననే జరిగినట్టు అనిపిస్తాయి. మనసుని కొంచెం నొప్పిస్తాయి...

"కాలంతో కలిసి ముందుకి నడిచేది జీవితం, వెనక్కి నడిచేది మనసు."
~ గిరిధర్ పొట్టేపాళెం

Sunday, July 30, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 11 ...

"నీ నును పైటను తాకిన చాలు"
Poster colors & Indian Ink on Paper
 
<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 10                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 12 -->
"నీ నును పైటను తాకిన చాలు...గాలికి గిలిగింత కలుగునులే..."

ఈ తెలుగు పాటలోని సి.నా.రె. గారి పదాలతో అప్పుడు నేను చదువుతున్న "విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్" లో రెండురోజులు మెరిసి మురిసిన ఈ పెయింటింగ్ నా బొమ్మల్లో ఓ ప్రత్యేకం.

ఈ పెయింటింగ్ లో కనిపించే నలుపుతెలుపుల్లోకి తొంగి చూస్తే అప్పుడే 34 యేళ్ళ జీవితం గిర్రున తిరిగిపోయిందా అనిపిస్తూ అప్పటి కాలేజీ రోజుల స్మృతుల్నీ, గడచిన కాలం రంగులపరిమళాల్నీ గుర్తుకి తెస్తూ సుతిమెత్తగా మనసుని తాకి వెళ్తుంది.

పెయింటింగ్ వెయ్యాలన్న తపన ఉన్నా, ఎలా వెయ్యాలి, ఏ మెటీరియల్ కావాలి, అవెక్కడ దొరుకుతాయి అని తెలుసుకోవాలంటే ఎంతో "స్వయంకృషి" చెయ్యాల్సిన రోజులు. ఎవరైనా ఆర్టిస్ట్ లు వేసిన బొమ్మలు చూడాలంటే పత్రికలే సులభమైన మార్గం. చిన్న చిన్న టౌనుల్లో ఆర్ట్ గ్యాలరీలుండేవి కాదు, లోకల్ ఆర్టిస్ట్ లు ఎవరికీ తెలిసేది కాదు. ఒకవేళ ప్రయాసపడి తెలుసుకుని కలిసి వివరాలడిగినా సరిగా చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పేవాళ్ళు కాదో ఆ "ట్రేడ్ సీక్రెట్స్" ఏంటో ఎందుకో అప్పట్లో అర్ధమయ్యేది కాదు. ఇక విజయవాడ లాంటి నగరంలో ఆర్టిస్ట్ ల వివరాలు కనుక్కోవటం ఇంకా కష్టం.

సినిమా కట్ అవుట్ లకి అప్పుడు విజయవాడ పుట్టిల్లు. సినిమాలకెళ్తూ బీసెంట్ రోడ్ దాటి అలంకార్ థియేటర్ వెళ్ళే దారిలో కాలువలపై వంతెనల చుట్టూ పెద్ద పెద్ద కటవుట్లుండేవి. అవి ఎక్కడేస్తారు, అంతంత పెద్దవి ఎలా వేస్తారు తెలుసుకోవాలన్న ఉత్సాహం చాలా ఉండేది. ఒకసారి రైల్వేస్టేషన్ నుంచి ఎప్పుడూ వెళ్ళని ఒక రోడ్ లో వెళ్తుంటే ఆ దారంతా ఒకవైపు సగం వేసిన ఇంకా పూర్తికాని సినిమా కట్ అవుట్ లు చూశాను. ఓహో ఇక్కడనమాట ఇవి సృష్టింపబడేది అని మాత్రం తెలిసింది గానీ సగం పూర్తయిన అవి వేస్తూ అక్కడ ఒక్కరూ కనబడ్లేదు. ఎవరినో అడిగితే వాటి వర్క్ అంతా రాత్రిపూట చేస్తారని తెలిసింది. అర్ధమయ్యింది, విజయవాడ ఎండల్లో పగటిపూట, ఆరుబయట, అదీ రోడ్డు పక్కన అవి వెయ్యటం అసాధ్యం. ఒకసారి మాత్రమే సాయంత్రం చీకటిపడే వేళ ట్రెయిన్ అందుకునే హడావుడిలో రిక్షాలో వెళ్తూ కొంచెం చూడగలిగాను, ఎలా వేస్తారో తెలిసింది.

పెయింటింగ్స్ ఎలా వెయ్యాలి అనే పరిశోధనలో పడి, కనపడిన ప్రతి మార్గమూ అన్వేషించాను. చివరికి కాలేజి కి దగ్గర్లో రద్దీ గా చాలా చిన్నా పెద్దా షాపులుండే "పటమట" లో నాలుగైదు బుక్ షాపులుండేవి. ఆ షాపుల్లో వదలకుండా అందరినీ అడిగితే ఒకాయన "ఒన్ టవున్" లో ట్రై చెయ్యమని ఇచ్చిన సలహా పట్టుకుని అతిశయం అనుకోకుండా "ఆశ,  ఆశయమే ఆయుధాలు" గా అన్వేషణ అనే యుద్ధం మొదలు పెట్టాను. అక్కడ వాళ్ళనీ వీళ్ళనీ అడిగి చివరికి లోపలికి వెళ్తే బయటికి రావటం కష్టతరం అన్నట్టుండే "పద్మవ్యూహం లాంటి ఒన్ టవున్" ఇరుకు సందుల్లో "అనుభవమే లేని అభిమన్యుడిలా" ప్రవేశించి ఒక ఆరు రంగుల "క్యామెల్ పోస్టర్ కలర్ బాటిల్ సెట్" సంపాదించాను. అదీ చాలా విచిత్రంగా. అక్కడ అన్నీ హోల్ సేల్ షాపులే, అసలవి షాపుల్లా కూడా ఉండవు. ఇరుకు గోడవునుల్లా ఉంటాయి. రీటెయిల్ గా అమ్మరు. ఒక బుక్ మెటీరియల్ హోల్ సేల్ షాపు అక్కడెక్కడో ఉందని ఎవరో చెప్తే వెతికి వెతికి పట్టుకుని వెళ్ళా. ఓనర్, ఇద్దరు వర్కర్లు ఏదో లోడ్ వ్యాన్లోకెక్కిస్తూ ఉన్నారు. అప్పటికే సాయంత్రం, చీకటి పడింది. ఇక్కడ దొరకవులే అని అనిపించినా, "ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చి ఇప్పుడు ఉసూరుమంటూ వెనక్కిపోవడమా?" అని మనసు ప్రశ్నిస్తే, సరేలే అని ధైర్యం చేసి, అసలు అడగొచ్చా లేదా అని తపటాయిస్తూనే అడిగా, "ఏమండీ మీదగ్గర క్యామెల్ పోస్టర్ కలర్స్ దొరుకుతాయా" అని. అంతే అడిగీ అడగ్గానే  ఆయన లోపలికెళ్ళాడు. ఒకపక్క ఆశ, దొరుతాయేమో అని. మరోపక్క నిరాశ, వచ్చి ఏం చెప్తాడో అని. కొద్ది క్షణాల తర్వాత  ఆయన ఆరు రంగుల బాటిల్స్ ఉండే ఒక సెట్ పట్టుకొచ్చాడు. సరిగ్గా అదే నాకు కావల్సింది. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవంతే! తర్వాత ఇంకో రెండుమూడుసార్లు కూడా వెళ్ళి నాకు కావల్సిన సెలెక్టెడ్ రంగులు అడిగి మరీ అక్కడ తెచ్చుకున్నాను. బహుశా ఆ హోల్ సేల్ షాపు కి పోస్టర్ కలర్స్ కోసం వెళ్ళిన ఒకే ఒక్క రీటెయిల్ కస్టమర్ ని నేనేనేమో!

అప్పట్లో వార పత్రికలు విరివిగా చదివేవాళ్ళు, కొన్ని పత్రికలకి చాలా డిమాండ్ ఉండేది. వచ్చిన కొద్ది గంటల్లోనే అన్ని కాపీలూ అమ్ముడయిపోయేవి. ఎందరో రచయితలూ, ఆర్టిస్ట్ లూ వాటి ద్వారా వెలుగులోకొచ్చిన రోజులవి. అన్నిటిల్లో ఆంధ్రభూమి వారపత్రిక నాకు ప్రత్యేకంగా కనిపించేది. అందులో కథలకీ సీరియల్స్ కీ వేసే ఇలస్ట్రేషన్స్ అన్నీ పెయింటింగ్స్ నే. "ఉత్తమ్ కుమార్" అనే ఆర్టిస్ట్ ఇలస్ట్రేషన్స్ లో పూర్తి స్థాయి పెయింటింగ్ లు వేస్తూ ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్ తో వేసే ఆ పెయింటింగ్స్ చాలా గొప్పగానూ, అందంగానూ ఉండేవి. ఇక అవే నాకు పెయింటింగ్ నేర్చుకునేందుకు మార్గదర్శకాలయ్యాయి. ఆంధ్రభూమి లో అచ్చయిన ఒక్కొక్క ఉత్తమ్ గారి పెయింటింగ్ ఒక పాఠ్యగ్రంధంలా ముందు పెట్టుకుని, శోధించి సాధించి, కనుక్కుని కొనుక్కున్న పోస్టర్ కలర్స్ తో కష్టమైనా కుస్తీ బరిలో దిగి అలాగే వెయ్యాలని దీక్షతో గంటలకొద్దీ కూర్చుని "సాధన" అనే పోరాటం చేసేవాడిని. పట్టు వదలని పోరాటం, పట్టు సడలని ఆరాటం తో వేసిన ప్రతి బొమ్మలోనూ సక్సెస్ అయ్యేవాడిని. అసలు మెళకువలు తెలీదు, రంగుల మిశ్రమం గురించి తెలీదు, ప్రైమరీ-కలర్స్ సెకండరీ-కలర్స్ లాంటి పదలూ తెలీవు, బ్రషులూ ఒకటో రెండో ఉండేవి. "కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేస్తే దక్కనిదంటూ ఉండదు." అన్న మాటలకి నిదర్శనం నా అనుభవాల్లో ఇది ఒకటి.

ఈ పెయింటింగ్ కూడా మక్కీ కి మక్కీ "ఆంధ్రభూమి వారపత్రిక" లో అచ్చయిన "ఉత్తమ్" గారి పెయింటింగ్ ని చూసి నేర్చుకునే మార్గంలో వేసిందే. కాలేజి రోజుల్లో నేను వేసే బొమ్మలకి కొద్ది మంది ఫ్రెండ్స్, జూనియర్స్ అభిమానులుండేవాళ్ళు. అడిగి నా రూముకి వచ్చి మరీ చూసి పొయ్యేవాళ్ళు.

అలా నా బొమ్మలు చూసి మెచ్చుకునే నా క్లాస్ మేట్, ఒక మంచి ఫ్రెండ్ "కిరణ్". ఇది చూసి, "నీ పెయింటింగ్ కాలేజి మొత్తం చూడాలి గిరీ" అంటూ "భువనేశ్వరి" అనే తెలుగు సినిమాలో కవి శ్రీ సి.నారాయణ రెడ్డి గారు రాసిన "ఏమని పిలవాలీ, నిన్నేమని పిలవాలి..." అన్న పాటలోని ఈ కింది లైన్స్ రాసి జతచేసి కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్ లో పెట్టించాడు.

"నీ చిరునవ్వులు సోకిన చాలు
సూర్యుడు వెన్నెల కాయునులే...

నీ నునుపైటను తాకిన చాలు
గాలికి గిలిగింత కలుగునులే...

నీ పాదాలూ మోపిన చాలు
శిలలైనా విరబూయునులే..."

తర్వాత రెండ్రోజులకి మా జూనియర్ ఎవరో నాకా పెయింటింగ్ ని తెచ్చి ఇస్తూ, ఇది చూసి కొందరు అమ్మాయిలు అభ్యంతరం చెబుతూ ఆ క్లబ్ హెడ్ ఇంగ్లీష్ మాష్టారుకి కంప్లెయింట్ చేశారని అందుకే తీసెయ్యాల్సి వచ్చిందనీ చెప్పాడు. అభ్యంతరం చెప్పేంత కారణాలు ఇందులో లేకున్నా, చూసే కళ్ళు అన్నీ ఒక్కలా ఉండవు అనుకున్నాను. అలా కాలేజి లో నా ఈ పెయింటింగ్ ని అందరూ చూడ(లే)కపోయినా ప్రతి సంవత్సరం ప్రింట్ చేసే కాలేజి మ్యాగజైన్లో క్రమం తప్పక ప్రింట్ అయ్యి ఆకట్టుకున్న నా బొమ్మలు అందరూ చూశారు, అందరికీ నేనెవరో తెలిసింది. ఫైనల్ యియర్ అయ్యి వెళ్ళేపుడు ఒకరికొకరం ఆటోగ్రాఫ్ బుక్స్ లో అడ్రెస్ తోబాటు రాసుకున్న సందేశాల్లో నా ఆటోగ్రాఫ్ బుక్ నిండా ప్రతి ఒక్కరూ నా బొమ్మలనే ప్రస్తావిస్తూ మెసేజ్ లు రాశారు.

అప్పటి నా పెయింటింగ్ "స్వయం కృషి" సాధన లో "ఉత్తమ్ గారు" కి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పెయింటింగ్స్ నాకు పాఠ్యగ్రంధాలు! ఆ సాధనలో వేసిన పెయింటింగ్స్ లో బ్లాక్ అండ్ వైట్ లో వేసిన ఈ పెయింటింగ్ ఫలితం నాకు చాలా తృప్తిని ఇచ్చింది. స్వయం సాధనతో నేరుచుకున్న తపనలోని ఆ తృప్తి ఎప్పటికీ తరగని ఘని.

"స్వయంకృషి తో సాధించి ఎక్కిన ప్రతి మెట్టూ ఎవరెస్టు శిఖరమే."
~ గిరిధర్ పొట్టేపాళెం

Saturday, September 25, 2021

బాలు గారి దివ్య స్మృతిలో...

 
Ink & Watercolors on Paper

అమృతం మాత్రం తమవద్దుంచుకుని 
బాలు గానామృతాన్ని మనకొదిలేశారు
అ దేవతలూ దేవుళ్ళూ.....పాపం!

బాలు గారి దివ్య స్మృతిలో ఒక సంవత్సరం...

Details 
Mediums: Ink Pen & Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB