Showing posts with label GiriQuotes. Show all posts
Showing posts with label GiriQuotes. Show all posts

Saturday, January 4, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 27 . . .

Portrait of a Businessman
Sketch Pens on paper 3" x 4"

ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటిలో సైతం కనిపించే నల్లదనం...ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయమే.

బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు రంగులతోనే ఉండేవి. పిల్లలు రంగులపట్ల అంతగా ఆకర్షితులవటం ప్రకృతి సహజం.

నా మొదటి రంగుల గురుతులు మదిలో తరగని చెరగని నా బాల్యం నాటివే. నల్లని పలకపై బలపంతో దిద్దిన తెల్లని అక్షరాలు, ఆటల్లో వేళ్ళ కొసలన పట్టి వదిలిన గిర్రున తిరిగిన రంగు రంగుల గాజు గోళీలు, సన్నని పేనిన తాడుతో చుట్టి సంధించి లాగి విసిరితే సర్రున తిరిగిన రంగుల బొంగరాలు, ఉపరితలంపై రెపరెపలాడిన రంగు రంగుల కాయితపు గాలిపటాలు, మండుటెండలో పెదవుల మధ్య జిల్లుమనిపిస్తున్నా జుర్రిన రంగుల పుల్ల ఐసులు, పెరట్లో పూసిన పసుపు పచ్చ, నారింజ రంగు ముద్దబంతి పువ్వులు, ఎండాకాలపు తెల్లని మల్లెమొగ్గలు, సంక్రాంతి పండుగ ముగ్గుల వర్ణాలు, మా ఊర్లో నాన్న కట్టించిన మా కొత్తింటికి వేసిన రంగులు...ఇలా ఆటపాటల బాల్యం అంతా రంగుల మయం. ఎంతమందికి మొట్టమొదటి రంగుల అనుభూతులు ఎంతో కొంత మదిలో అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటాయో తెలీదు కానీ నా మటుకు నాకు మాత్రం ఇప్పటికీ కొన్ని ముదురు రంగులు చూస్తే మనసు బాల్యంలోకి పరిగెడుతుంది.

పలక పై తెల్లని అక్షరాలు దాటి కాగితంపైన రాయటం మొదలు పెట్టాక, బులుగు, నలుపు, ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో ఇంకులు ఉండేవి అప్పటి రోజుల్లో. ఎక్కువగా బులుగు రంగు ఇంకే అందరూ వాడేవాళ్ళు. నాన్న టీచింగ్ నోట్స్ లో నాలుగు రంగులూ కనపడేవి. ఆకు పచ్చ, ఎరుపు రంగులతో నీటిపై అలల్లా అక్షరాల కింద చేసిన అండర్ లైన్లు ఎప్పటికీ మరువలేను. ఎర్రని ఇంక్ తో నాన్న దిద్ది మార్కులు వేసి నిలువుకి సగం మడిచి దారం కట్టిన ఆన్సర్ పేపర్స్ కట్టల గురుతులూ ఇంకా మదిలో చెక్కు చెదరనే లేదు. నాన్న తనే డిజైన్ చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీసి తన ప్లాన్ తో కట్టుకున్న ఇంటికి వాడిన ఆహ్లాదకరమైన పచ్చ, ఆరెంజ్, బ్లూ, లేత వంగపండు రంగులూ అంతే కొత్తగా ఇప్పటికీ మదిలో గూడు కట్టుకునే ఉన్నాయి. రంగులపై ఏర్పడ్డ మొదటి మక్కువ అంటే ఆడిన గోళీలే. రంగురంగుల గోళీల్లో కొన్ని రంగుల గోళీలు అరుదుగా వచ్చేవి. ఆ రంగుల గోళీల్ని ఆడకుండా వాడకుండా ప్రత్యేకంగా దాచుకుని పదే పదే చూసుకున్న గురుతులు ఎన్నో. తిరిగే బంగరాల ఉపరితలంపై రెండు మూడు రంగుల తిరిగే వృత్తాలు ఇప్పటికీ తలపుల్లో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.

ఇంకు పెన్ను తర్వాత స్కెచ్ పెన్ను వాడిన మొదటి అనుభవం స్కూల్ లో నా పదవ తరగతి నాటిది. పదవ తరగతిలో మా సైన్స్ టీచన్ "రామస్వామి సార్" స్కెచ్ పెన్నులు కొనిపించి అవి ఎంత ఎక్కువ వాడి పరీక్షలు రాస్తే అంత అదనంగా మార్కులు వేస్తూ ప్రోత్సహించేవారు. అలా సైన్సు బొమ్మలకి రంగులేయటం, బయాలజీ నోట్ బుక్ లో నోట్స్ కి హెడింగ్స్, సబ్ హెడింగ్స్ రాయటం, ఇంపార్టెంట్ పాయింట్స్ స్కెచ్ పెన్నుల్తో అండర్లైన్లు చెయ్యటం...ఇవి స్కెచ్ పెన్నుల్తో నా మొదటి అనుభవాలు. 

నా బొమ్మల్లో రంగుల స్కెచ్ పెన్ను లు అడపాదడపా వాడినా వాటితోనే పూర్తిగా వేసిన బొమ్మలు మాత్రం చాలా తక్కువ. అలా వేసిన అతికొద్ది బొమ్మల్లో ఈ బొమ్మ ఒకటి. మామూలుగా ఏ బొమ్మ అయినా ఎంతకాలం తర్వాత అయినా అది వేసిన ప్రదేశం, ఆ సమయం మరపురాని నాకు ఈ బొమ్మ కూడా అంత ఖచ్చితంగానే గుర్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. "కావలి" లో మేమప్పుడు అద్దెకుంటున్న మా నారాయణవ్వ పెంకుటిల్లు.అదే నా బొమ్మలకి పుట్టిల్లు. సమయం చీకటి పడ్డ సాయంత్రం. ట్యూబ్ లైట్ వెలుతురులో మధ్య గదిలో నేలమీద కూర్చుని నాన్న కలెక్షన్ లో మిగిలున్న కొద్ది "రీడర్స్ డైజెస్ట్" బుక్స్ తిరగేస్తున్న నన్ను ఒక "బిజినెస్ మ్యాన్" టై కట్టుకుని తల వంచుకుని కొంచెం పక్కకు తిరిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంది. అప్పటికప్పుడు గియ్యలన్న కోరికతో దగ్గరున్న స్కెచ్ పెన్నుల సెట్ తీసుకుని ఉన్న నాలుగైదు రంగులతో చకచకా పేపర్ పైన గీసిన స్కెచ్ బొమ్మ ఇది. సంతకం మాత్రం ఇంకు పెన్ తో పెట్టాను. అపటికింకా పూర్తిగా నాదంటూ ఒక ప్రత్యేకంగా తేలని సంతకం, బొమ్మ బొమ్మలో ఇంకా వింత వింత పోకడలు పోతూనే ఉండేది.

రీడర్స్ డైజెస్ట్ - అప్పట్లో చాలా అరుదుగా కొంతమంది దగ్గర మాత్రమే కనిపించేది. అదీ సంవత్సరం డబ్బులు కట్టి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెల నెలా పోస్ట్ లో వచ్చే ఒక చక్కని జనరల్ ఫ్యామిలీ ఇంగ్లిష్ మాస పత్రిక. చిన్న నోట్ బుక్ అంత సైజ్ లోనే ఉండేది. మంచి క్వాలిటీ పేపర్ పై, క్వాలిటీ రంగుల ప్రింట్ తో చాలా విషయాల మీద అవగాహన పెంచే ఒక మంచి మ్యాగజైన్. నాన్న కొన్ని సంవత్సరాలు ఈ బుక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంట్లో చాలా ఉండేవి. అప్పుడప్పుడూ ఏమీ పాలుపోకపోతే అటకెక్కిన గంపలోని ఈ పుస్తకాలు దించి వాటిని తిరగేయటం నాకలవాటుగా ఉండేది. అలా దించిన ప్రతిసారీ కొద్ది గంటల సమయం తెలియకుండానే గడిచిపోయేది. చిన్నప్పుడు కేవలం అందులోని బొమ్మలు మాత్రమే చూసేవాడిని. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్టికిల్స్ చదివేవాడిని. ప్రతి ఎడిషన్లో మొదటి పేజీల్లో ఇంగ్లిష్ కొటేషన్స్ ఉండేవి, అవి మాత్రం ఆసక్తిగా అన్నీ చదివి వాటిని అర్ధం చేసుకుని విశ్లేషించుకునేవాడిని.

గమ్మత్తుగా నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ లో ఇంటర్మీడియట్ చేస్తున్నపుడు నా హాస్టల్ అడ్రెస్ కి "రీడర్స్ డైజెస్ట్" పబ్లిషర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది, ప్రాంతాల వారీగా సెలెక్టెడ్ లిస్ట్ లో నా పేరు ఉందనీ, అందుకని నాకు డిస్కౌంటెడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాం అంటూ. చాలా థ్రిల్ తోఅయిపోయి డబ్బులు డ్రాఫ్ట్ ద్వారా కట్టి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను. అప్పుడు వాళ్ళకి నా పేరూ అడ్రెస్ ఎలా దొరికిందో తెలీదు. తర్వాతా చాలా యేళ్ళకి ఆలోచిస్తే తట్టింది. నా పేరు మీద నా పదవ తరగతి మార్కుల సర్టిఫికేట్ పెట్టి ఒక నార్త్ ఇండియన్ (నాకు ఫ్రెండ్ కూడా కాదు) IIT మెటీరియల్ ఫ్రీ గా తెప్పించుకున్నాడు. ఎక్కువ మార్కులు వచ్చిన  స్టూడెంట్స్ కి ఫ్రీగా IIT మెటీరియల్ ఇచ్చే ఒక కోచింగ్ సెంటర్ ఢిల్లీ లో ఉందనీ నాకు తెలీదు. కేవలం నా ద్వారా అది వాడుకోవటానికి మాత్రమే నా దగ్గరకి వచ్చి అడిగిన ఆ అబ్బాయికి "నో" చెప్పొచ్చనీ తెలీదు. తర్వాత ఆ అబ్బాయి ఆ మెటీరియల్ వచ్చాక నా దగ్గరి నుంచి తీసుకెళ్ళటం తప్ప, ఒక థ్యాంక్స్ గానీ, కనిపించినపుడు పలకరించటం కానీ లేకపోయినా, అలా కూడా అవకాశం తీసుకుంటారా అన్నదీ తెలీదు. అది తెలిసిన నా ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం నీ మార్కుల లిస్ట్ కాపీ అతనికి ఇవ్వకుండా ఉండాల్సింది అన్నారు. కొద్ది రోజులు మనసు భారంగా అనిపించింది. అప్పటి రోజుల్లో మన చుట్టూ ఉన్న సోషల్ (సామాజిక) వాతావరణం ఇలానే ఉండేది. బహుశా వాళ్ళ ద్వారా "రీడర్స్ డైజెస్ట్" కి నా అడ్రెస్  దొరికిందేమో.

అలా రీడర్స్ డైజెస్ట్ తో నా అనుబంధం ని గుర్తు చేస్తూ అందులో ఒక ఫొటో చూసి వేసింది ఈ బొమ్మ. ఇలా ఈ స్టైల్ లో అంత త్వరగా అప్పటిదాకా ఏ బొమ్మా వెయ్యలేదు. చక చకా ఉన్న కొద్దిపాటి స్కెచ్ పెన్నుల్తో కొద్ది నిమిషాల్లోనే గీశాను. గీశాక ఇలా కూడా బొమ్మలు గియ్యొచ్చా అనిపించింది. అప్పట్లో నేరుగా పెన్ తోనే ఎ బొమ్మ వేసినా ఎక్కువగా ఏ బొమ్మలోనూ డైమన్షన్స్ తప్పేవాడిని కాదు. కారణం తపన, ఫోకస్, ఆ వయసులో వేరే లెవల్లో ఉన్న ఆసక్తి లెవెల్స్, అవే కారణం. 

రంగులతో అలా పేపర్ మీద స్కెచ్చులతో మొదలయిన అనుభవాలు తర్వాత వాటర్ కలర్స్, అదీ దాటి క్యాన్వాస్ మీద ఆయిల్ దాకా వెళ్ళినా, అప్పటి బొమ్మల్లోని పూర్తి సంతృప్తి ఇప్పుడు కొరవైందా అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ, కాలంతో జీవితంలో ముందుకి నడిచే కొద్దీ వెనకటి కాలం అనుభవాలూ, గురుతులూ, తలపులూ ఇష్టంగా అనిపిస్తూ అపుడే చూసిన కొత్త వన్నె తగ్గని రంగుల అనుభూతుల్లా మనః ఫలకం పై ప్రతిబింబిస్తూనే ఉంటాయి...

"జ్ఞాపకాల రంగులు ఎన్నటికీ మాయవు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Monday, November 4, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 26 . . .

"నిరీక్షణ"
Watercolors on Paper (8" x 11")

గిరీ..కమాన్...గో...గో...గో...అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా "విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటికప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. "సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్" ఇచ్చిన చేటీ లో రాసింది మైక్ లో చదివాను. "నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు" అంటూ ఒక నిమిషం ఆగి, ఎలా మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తోచక "నేను చెయ్యలేను" అంటూ స్టేజి దిగేశాను, "లేదు నువ్వు చెయ్యగలవు, ఏదో ఒకటి చెయ్యి...కమాన్...డు...సమ్‌థింగ్" అంటూ మళ్ళీ బలవంతంగా నన్ను స్టేజి మీదికెక్కించారు. మరో నిమిషం పాటు తపటాయిస్తూనే మైక్ పట్టుకుని నిలబడ్డాను. "నా వల్లకాదు, ప్లీజ్" అంటూ నిరుత్సాహంగా దిగేశాను. తర్వాత నాతో పోటీలో నిలబడ్డ "ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజి, వాకాడు, నెల్లూరు" విద్యార్ధి ఉత్సాహంగా స్టేజి ఎక్కి అదే చీటీ తీసుకుని చదువుకుని తనకున్న స్టేజి అనుభవం, డ్రామా పోటీలు, ఇంకా తెలుగు కవితల పోటీల్లో నెగ్గిన ప్రతిభ అంతా రంగరించి సరదాగా జోకుల్తో, తెలుగు భాషా యాసా ఛలోక్తుల్తో రక్తి కట్టిస్తూ ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా మాట్లాడి ఆ పోటీ లో నెగ్గి "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్" గా నిలిచాడు.

ఈ పెయింటింగ్ "ఆంధ్ర భూమి" వార పత్రికలో "ఉత్తమ్ కుమార్" ఓ కథకి వేసిన ఇలస్ట్రేషన్ చూసి అలానే వెయ్యాలని చేసిన ప్రయత్నం. వదలి వెళ్ళిపోయిన ప్రియుడిని తలచుకుంటూ ఒక చెట్టుకింద నిలబడి తనలో తాను ఏదో ఆలోచిస్తున్న ప్రియురాలు. ఆ పెయింటింగ్ లో ఆమె ఆనుకుని ఉన్న పెద్ద చెట్టు మొదలుకి వేసిన డీటైల్స్ నన్నమితంగా ఆకర్షించాయి. అందులోని అమ్మాయికన్నా ఆ చెట్టుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దానిపైన ఫోకస్ పెట్టి వేసిన పెయింటింగ్ ఇది. అందుకే అందులో ఉన్నన్ని డీటైల్స్ ఆ అమ్మాయి బొమ్మలో కనిపించవు. "ఉత్తమ్" గారి పెయింటింగ్ కూడా అచ్చు ఇలానే ఉంటుంది. సాధారణంగా పెయింటింగ్ చూసే వాళ్ళ చూపు పెయింటింగ్ మొత్తంలో ఒక విభాగం వైపు వెళ్ళకనే వెళుతుంది, ఆ విభాగం ఎక్కడా అన్నదానికి నిర్దిష్టమైన రూల్ ఉంది. మనకి తెలియకుండానే మన చూపు ఆ విభాగం వైపే వెళ్తుంది. దాన్ని "ది రూల్ ఆఫ్ థర్డ్" అంటారు. మొత్తం పెయింటింగ్ ని 3 x 3 చతురస్రాలుగా విభజిస్తే ఆ నిలువు అడ్డ గీతలు కలిసే చోట మధ్యలో కాకుండా ఎడమ వైపు పైనుంచి రెండవ చతురస్రం కింది కుడి భాగం. చూపరుల చూపు ముందు వెళ్ళేది ఇక్కడికే. కనుక పెయింటింగ్ లో అది ఫోకల్ పాయింట్ అవుతుంది. పెయింటింగ్ లో "కంపోజిషన్" అనేది ఒక నిగూఢ ప్రక్రియ, దాన్ని విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తారు. పెయింటింగ్ ఎంత బాగున్నా ఆ "కంపోజిషన్ థియరీ" ఫాలో కాకుంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వరనీ, అసలిలాంటి థియరీ ఒకటుంటుందనీ ఈమధ్య తెలుసుకున్నాగానీ, అప్పట్లో ఇవేవీ తెలీవు. ఇందులో "కంపోజిషన్" లో, "ది రూల్ ఆఫ్ థర్డ్" నూటికి నూరు పాళ్ళూ కనిపిస్తుంది. డీటైల్స్ కనిపించే ఆ చెట్టు తొర్ర వైపు చూపరుల చూపు వెళ్ళిపోతుంది. అదే ఏ పెయింటింగ్ లోనైనా చూపరుల చూపు పడే విభాగం.

తడబడే అడుగుల్లో నిలకడగా అడుగులు పడటం అన్నది వెళ్ళే దారిలో మన మీద మనకి నమ్మకం కుదిరాకే మొదలౌతుంది. నా పెయింటింగ్ ప్రక్రియలో అలా నిలకడగా పడ్డ అడుగులకి ఒక నిదర్శనం ఈ పెయింటింగ్. అలా కలిగించిన నమ్మకమే నాకు "ఇంటర్ కాలేజియేట్ డెసెన్నియల్ డ్రాయింగ్ కాంపిటిషన్" లో పాల్గొనే కాన్ఫిడెన్స్ నీ ఇచ్చింది. 

"వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ, డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" వేడుకల్లో భాగంగా ఇండియాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆహ్వానించి, వచ్చిన ఇతర కాలేజి వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కల్పించి, వారం రోజుల పాటు మా కాలేజి లో వివిధ రకాల సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల్లో మా కాలేజి గెలిచిన "ఫుట్ బాల్" జట్టులో నేనూ ఉన్నాను. ఫైనల్స్ గెలిచి మేమే విజేతలుగా నిలిచాము. టీమ్ విజయానికి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 10 పాయింట్స్ వచ్చాయి. వ్యక్తిగత పోటీల్లో డ్రాయింగ్, కార్టూన్ విభాగాల్లో నేను పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి మరో 10, 5 పాయింట్స్ సాధించాను.

జీవితంలో స్టేజి ఎక్కి అందరి ముందు నిలబడటం అదే మొదటిసారి. ఎదురుగా అంతమంది స్టూడెంట్స్, ఇంకా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్, పైజ్ స్పాన్సరర్స్. ఎప్పుడూ అసలు మైక్ పట్టుకునిందీ లేదు, అందరి ఎదుట పెదవి విప్పి మాట్లాడిందీ లేదు. అలాంటిది అందరి ముందు నిలబడి "నా క్రియేటివ్ ఐడియాని వాళ్ళకి అమ్మే సేల్స్ మ్యాన్" గా ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడి అందర్నీ అలరించి ఆ పోటీలో నెగ్గాలి. నెగ్గితే "ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్" అవార్డ్ బహూకరిస్తారు. అసలలాంటి పోటీ ఒకటుందనీ ఎవరూ ఊహించ లేదు. చివరిరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముందు ఎవరూ ఊహించని విధంగా అది నిర్వహిస్తున్న "లిటరరీ క్లబ్ మెంబర్స్" అప్పటికప్పుడు "అత్యధికంగా పాయింట్స్ వచ్చిన ఒకరిని ఎంపికచేసి 'ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్' గా అనౌన్స్ చేస్తాం" అని చెప్పి, పాయింట్లు ట్యాలీ చేసి "ఎక్కువ పోటీల్లో నెగ్గి అత్యధిక పాయింట్స్ సాధించిన ఇద్దరికి సమానంగా అత్యధిక పాయింట్స్ వచ్చాయి, కానీ ఒక్కరే చాంపియన్ గా నిలుస్తారు. సరి సమానమైన పాయింట్స్ తో నిలిచిన ఆ ఇద్దరికీ ఇప్పుడు ఫైనల్ పోటీ పెడుతున్నాం" అంటూ ఐదు నిమిషాలు తర్జన భర్జనలు చేసి "ఒక టాపిక్ ఇస్తాం, అనర్గళంగా ఐదు నిమిషాల పాటు తడబడకుండా మాట్లాడాలి, నెగ్గిన వారిదే టైటిల్" అంటూ ప్రకటించటం చక చకా జరిగిపోయాయి. ఉత్కంఠంలో అందరి అరుపుల మధ్య రెండు పేర్లు అనౌన్స్ చేశారు. అందులో నాపేరుండటం చూసి ఆశ్చర్యపోయాను. నిర్వహించిన పోటీల్లన్నిటిల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ పాయింట్స్ వచ్చిన మా ఇద్దరికీ సమానంగా 25 పాయింట్లు చొప్పున వచ్చాయి. మా ఇద్దరి మధ్య పోటీ అప్పటికప్పుడు అందరి సమక్షంలో స్టేజి పైన ఎదుర్కునే ప్రక్రియకి మరి కొద్ది నిమిషాల్లోనే  తెర లేచింది. ఇద్దరి పేర్లు ప్రకటించే ముందు నాకూ ఆసక్తిగానే ఉన్నా, ప్రకటించాక అందులో నా పేరుండటం చూసి నీరుగారిపోయాను, ఎందుకంటే అనర్గళంగా మాట్లాడటం దేవుడెరుగు, అదీ స్టేజి మీద అంతమంది ముందా అని. 

ఏదో పోటీల్లో పాల్గొని రిజల్ట్స్ లో పాల్గొన్న మూడింట్లో నెగ్గిన నా పేరు చూసుకున్నా గానీ, అసలా రోజు మధ్యాహ్నం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందని కూడా నాకు తెలీదు. ఒక గంట ముందు నా క్లాస్ మేట్ "శ్రీధర్" నేను హాస్టల్ కి వెళుతుంటే దార్లో కనిపించి "గిరీ పైజ్ డిస్ట్రిబ్యూషన్, మెయిన్ బిల్డింగ్ పైన హాల్ లో ఉంది, వచ్చి నీ ప్రైజెస్ తీసుకోవాలి." అని చెప్తేనే ఆరోజు మధ్యాహ్నం ఆ ఈవెంట్ ఒకటుందని తెలిసింది. నిజానికి పోటీల్లో నెగ్గిన వాళ్ళకి ఆ సాయంత్రం జరిగే "కాలేజి డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" లో ఒక్కొక్కరినీ స్టేజి మీదికి పిలిచి ఇవ్వాల్సిన బహుమతులు ముందుగానే ఇచ్చెయ్యాలని "లిటరరీ క్లబ్ మెంబర్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్" డిసైడ్ చేశారని కూడా అప్పుడే తెలిసింది. విజయవాడ నగరంలో వివిధ వాణిజ్య రంగాల్లోని వ్యాపారవేత్తలు ఆ ప్రైజెస్ స్పాన్సరర్స్. సాయంత్రం బహుమతులు ఇచ్చేందుకు వాళ్ళకి వీలు కాదని మధ్యాహ్నం ఇచ్చేస్తున్నట్టు ఆరోజు ఉదయం నోటీస్ బోర్డు లో పెట్టారని అక్కడికి వెళ్ళాక తెలిసింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ మధ్యాహ్నం ఈవెంట్ కి రాలేదు. నాకు పోటీల్లో గెలవటంతో వెళ్ళక తప్పలేదు.

అప్పటికే బొమ్మలువేస్తూ, కాలేజి మ్యాగజైన్స్ లో ప్రతి సంవత్సరం నా బొమ్మలు ప్రింట్ అవుతూ, కాలేజిలో అందరికీ నా పేరు తెలియటంతో సహజంగానే డ్రాయింగ్ పోటీలో నా పేరిచ్చాను. కార్టూన్లు ఎప్పుడూ వేసింది లేదు, అయినా మా జూనియర్స్ కొందరి ప్రోత్సాహంతో సరే అన్నాను, వాళ్ళే నా పేరిచ్చేశారు. రెండు పోటీలకీ ఒక పేపర్, పెన్సిల్స్ మాత్రమే ఇచ్చారు, టాపిక్ అప్పటికప్పుడు అనౌన్స్ చేసి డ్రాయింగ్ కి రెండు గంటలు, కార్టూను కి అర గంట సమయం ఇచ్చారు. పరీక్ష లాగా పోటీలో పాల్గొనే అందరూ ఒక రూమ్ లో కూర్చుని ఆన్ ది స్పాట్ ఇచ్చిన సమయంలో గీసి సబ్మిట్ చేసి రావాలి.

కార్టూను పోటీలకి మాత్రం ఒక గంట ముందు నా దగ్గరున్న "ఆర్.కె.లక్ష్మణ్" గారి కార్టూన్ల పుస్తకం తిరగేసుకుని వెళ్ళాను. "కరెప్షన్ ఇన్ పాలిటిక్స్" అనే టాపిక్ ఇచ్చారు. నేను గీసిన కార్టూను బొమ్మ ఇంకా గుర్తుంది. "ఆర్.కె.లక్ష్మణ్" ని అనుకరిస్తూ 3డి లోనే గీశాను. కొన్ని పూరి గుడిశెల మధ్య ఒక ఎత్తయిన భవనం, దార్లో మాట్లాడుకుంటూ ఇద్దరు ఆ భవనం వైపు చూస్తూ వెళ్తూ, ఒకాయన ఇంకొకాయనతో ఇలా అంటుంటాడు, "మొన్నటి దాకా అదీ పూరి గుడిశే, అందులో ఉండే ఆయన ఆ పక్కనున్న పూరి గుడిశె ఓట్లతోనే నెగ్గి రాజకీయ నాయకుడయ్యాడు." అదీ క్యాప్షన్. డ్రాయింగ్ లో గెలుస్తానో లేదో నమ్మకం లేకున్నా, ఇందులో మాత్రం ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఉండింది ఎందుకో. అయితే నాకు ఇందులో "ద్వితీయ బహుమతి" వచ్చింది.

డ్రాయింగ్ పోటీకి ప్రైజ్ స్పాన్సరర్ అప్పటి విజయవాడ, బీసెంట్ రోడ్డు లోని "ఇన్నొవేషన్స్" అని ఒక "ఎంటర్ ప్రైజ్ స్టోర్" వాళ్ళు. ఇచ్చిన టాపిక్ - ఒక "సూట్ కేస్ షో రూమ్" ని 50 "సూట్ కేస్" లతో అలంకరించాలి ఇంటీరియర్ డిజైన్స్ అవీ మీ ఇష్టం, ఒక్కటే రూల్ యాభై సూట్ కేసులు తప్పకుండా ఉండి తీరాలి, దానికి ఏదో ఒక క్యాప్షన్ కూడా రాయాలి". ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో నేను అమితంగా ఎంజాయ్ చేసిన టాపిక్ "పర్స్ పెక్టివ్ డ్రాయింగ్", 3D లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ని అర్ధం చేసుకుని గీయాలి. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్స్ గీసే డ్రాయింగ్స్ అవి, అందరికీ అర్ధం కావు ఆ ప్రిన్సిపుల్స్ అత సులభంగా. నేను అది ఫాలో అవుతూ 3D లో గీశాను, షాపు లోకి ఎంటర్ అవగానే మనకి కనిపించే వ్యూ - మూడు గోడలు, రూఫ్, ఫ్లోర్,  ఫ్లోర్ మీద కార్పెట్, రూఫ్ కి సీలింగ్ ఫ్యాన్స్, అందమైన లైట్స్, మధ్యలో షాన్డిలియర్, ఇంకా ఒకరిద్దరు  సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఇలా. ఇక్కడ ఒక తమాషా సంఘటన ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. సీరియస్ గా డ్రాయింగ్ వేస్తూ ఉంటే, నా బెంచ్ మీద ఒక నలిపిన కాగితం ముక్కొచ్చి పడింది, చూస్తే పక్కనుంచి వెళ్తూ నా క్లాస్ మేట్ "U.V.H. ప్రసాద్", కాలేజి లో అందరూ "బాబాయ్" అని పిలుస్తుండేవాళ్ళం. ఏదో సైగ చేస్తూ వెళ్ళి ఆ పోటీ నిర్వహిస్తున్న స్టూడెంట్ వాలెంటీర్స్ ని మాటల్లో పెడుతున్నాడు. ఏంటా అని పేపర్ విప్పి చూస్తే అందులో ఇంగ్లిష్ లో మూడు క్యాప్షన్స్ రాసి ఉన్నాయి. నివ్వెరపోయాను, ఈ బాబాయ్ కి ఈ పోటీ ఒకటుందని, ఇక్కడ నేను పాల్గొంటున్నానని తెలిసి ఎవరినో అడిగి నాకోసం మూడు క్యాప్షన్స్ రాసి తెచ్చి చిట్టీ నాకందించి వెళ్ళాడని తెలిసి నివ్వెరపోయాను. "బాబాయ్" అంతే, ఎప్పుడు ఎలా ఎవరికి, ఎక్కడ కనిపించి ఆశ్చర్యపరిచేవాడో ఎవ్వరికీ తెలీదు. బాబాయ్ ఇచ్చిన క్యాప్షన్స్ లో ఒక నచ్చిన క్యాప్షన్ కొంచెం మార్చి రాశాను. కాపీ కొట్టానా అన్న ఆలోచన వేధించినా "కొంచెం మార్చి రాశా కదా, అయినా క్యాప్షన్ ఒక్కటి చూసి ఎంపిక చెయ్యర్లే" అని సరిపెట్టుకున్నా. నాకందులో "ప్రధమ బహుమతి" వచ్చింది. ప్రైజ్ గా "నమస్కారం" పెడుతున్న అమ్మాయి అవుట్ లైన్ చెక్కతో కార్వింగ్ చేసిన డెకరేటివ్ బొమ్మ ఇచ్చారు. అది చాలా రోజులు "కావలి, జనతాపేట" లో మా ఇంట్లో వాకిలిపైన నమస్కారం చెపుతూ కనిపించేది. ఆ సెలెబ్రేషన్స్ అయిన పక్క రోజు "ఈనాడు దిన పత్రిక" జిల్లా ఎడిషన్ లో న్యూస్ తోబాటు ప్రైజెస్ తీసుకున్న అందరం స్పాన్సర్స్ తో కలసి నిలబడి ఉన్న ఫొటో ప్రింట్ అయింది. అదే న్యూస్ పేపర్లో నా ఫొటో చూసుకోవటం, చాలా ఆనందం వేసింది, కత్తిరించుకుని దాచుకున్నాను. ఆ ఫొటోలో నా చేతిలో ఈ ప్రైజ్ బొమ్మ ఉంటుంది.

నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజి రెండవ సంవత్సరంలో మొదలుపెట్టిన పెయింటింగ్ ప్రక్రియ ఎడతెరిపి లేకుండా మూడేళ్ళు కొనసాగించాను. అప్పుడు వేసిన పెయింటింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ ఆనాటి కాలేజి సంఘటనలు, సరదాలు, ఫ్రెండ్స్ తో సినిమాలు, కబుర్లు, షికార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏదో తెలియని తపనతో కృషి చేస్తూ వేసిన అప్పటి బుడి బుడి అడుగుల బాటల్లో ఆనాటి తియ్యటి జ్ఞాపకాలని గుర్తుచేస్తూ అప్పటి కాలాన్ని ఇప్పుడు చూపించేవి నా బొమ్మలే. పక్కన కనిపించే స్నేహితులు, మనసులో దాగి ఒదిగి కనిపించని ఒక సున్నిత సన్నిహిత ప్రోత్సాహం, పత్రికలు, పుస్తకాలు తప్ప అప్పటి నా చిన్నిలోకంలో ఇంకేవీ లేదు. 

ప్రోత్సాహం మనిషికి ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది. ఉత్సాహం మనిషిని ముందుకి నడిపిస్తుంది. ఆనాటి నా బొమ్మల్లో ఉన్నవి అప్పటి ఉత్సాహాలే. ప్రోత్సాహ ఉత్సాహాలే అద్భుతాలకి పునాదులు. ఆ పునాదులపై కాలక్రమేణా వెలిసేవే అనుభవాల భవనాలు. ఆ అనుభవాల భవంతుల్లో నివశించిన అనుభూతులే తియ్యని జ్ఞాపకాలు. కదలే కాలం చెదిరినా చెరిగినా కరిగినా, చెదరని చెరగని కరగని జ్ఞాపకాలే జీవితం. ఆ జ్ఞాపకాల వెల్లువలో మునిగి తడిసి మురిసేదే మనసు. . .

"జ్ఞాపకాల వెల్లువలే జీవన సంధ్యా రాగాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, October 6, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 25 . . .

 
Statue of Liberty - Ink on Paper (8" x 11")

నా బొమ్మల బాటలో "ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రిక కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా "చందమామ" కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్లకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు చదివే అలవాటు లేదు. అయితే "ఆంధ్రభూమి" సచిత్ర  వారపత్రికతో మాత్రం ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. 

"ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రిక - నాకు పరిచయం "కావలి" లో మా తాతయ్య వల్లనే. "డిప్యూటీ కలెక్టర్" గా రిటైర్ అయిన తాతయ్య అంతకు ముందు తాసిల్దారు గా పనిచేస్తున్నపుడు రోజూ పొద్దున్నే జీప్ లో బిళ్ళ బంట్రోతులు వచ్చి ఫైల్స్ పట్టుకుని తాతయ్యని జీప్ ఎక్కించుకుని ఆఫీస్ కి తీసుకెళ్ళటం, ఆఫీస్ లో ఉండే పెద్ద పెద్ద ఫైల్స్ టేబుల్ మీద పెట్టుకుని ఎప్పుడూ వాటిల్లో సంతకాలు పెడుతూనో, లేదా జీప్ లో క్యాంప్ లకి వెళ్తూనో నిత్యం పనిలో తలమునకలై ఉండే తాతయ్యని చాలా దగ్గరగా చూశాను. తాతయ్య రిటైర్ అయ్యాక ఏమీ తోచక పొద్దునే రెడీ అయ్యి కుర్చీలో కూర్చుని పెద్ద ప్యాడ్ పెట్టుకుని ఏవో కాగితాలు, పుస్తకాలు, లెక్కలు చూసుకుంటూనే ఉండేవాడు. "మీ తాతయ్యకి ఇన్నేళ్ళూ ఫైల్స్ రాసీ రాసీ ఇప్పుడేం పొద్దుపోవటంలేదు, అవే ముందేసుకుని కూర్చుంటాడు." అని అమ్మమ్మ అంటుండేది. ఉద్యోగం లో అన్నేళ్ళూ పని చేసి చేసి రిటైర్ అయ్యాక తోచని పరిస్థితి తాతయ్యది. అదే సమయంలో "పెద్దమామయ్య" రకరకాల బిజినెస్ లు చెయ్యాలని ఏవేవో మొదలు పెట్టటం అవన్నీ చివరికి తాతయ్య భుజాల మీద పడటం అయ్యేది. అందులో భాగంగా "కావలి" ప్రాంతానికి "డెక్కన్ క్రానికిల్, ఆంధ్రభూమి దిన, వార పత్రిక, ఎన్ కౌంటర్ పత్రిక లు" ఏజన్సీ తీసుకోవటంతో వాటి పనులూ తాతయ్యేకే తప్పలేదు. వారం వారం "ఆంధ్ర భూమి" వార పత్రిక కట్టలు "హైదరాబాద్" నుంచి రైల్లో "కావలి" స్టేషన్ కి వచ్చి పడేవి. అవి వచ్చే టైమ్ కి వెళ్ళి తేవటం నుంచీ "కావలి" లో అన్ని బంకులకీ, సుబ్ స్క్రైబర్స్ ఇళ్ళకీ డెలివరీ బోయ్ లతో పంపటం, తర్వాత నెల నెలా వసూళ్ళూ లెక్కలూ ఇలా బోలెడు పనులు. తాతయ్య మళ్ళీ బిజీ అయిపోయాడలా, కొన్నేళ్ళకి పూర్తిగా అలసి పోయే దాకా.

అలా వారం వారం వచ్చే "ఆంధ్ర భూమి" వార పత్రికతో మెల్లిగా నా పరిచయం మొదలయ్యింది. ఏ పత్రికలోనూ లేని విశేషం ఈ పత్రికలో ఉండేది. అది ఏంటంటే ఇలస్ట్రేషన్స్. కథలకి వేసే ఇలస్ట్రేషన్స్ ఎంత గొప్పగా ఉండేవంటే ఒక్కొక్కటీ ఒక్కొక పెయింటింగ్, అంతే. అన్ని పత్రికల్లోలా మామూలు గీతల బొమ్మలు కాదు. వాటిల్లో ఆర్టిస్ట్ "ఉత్తమ్ కుమార్" గారు ధారావాహిక కథలకి వేసిన పెయింటింగ్ ఇలస్ట్రేషన్స్ కి నేను కట్టుబడిపోయాను. "ఉత్తమ్" గారిది ఓ ప్రత్యేకమైన శైలి. అదే కోవలో "కళా భాస్కర్" గారు మొదలు పెట్టిన "ఎంకి బొమ్మలు" కు కూడా పెయింటింగ్సే. ఆ పరిచయం ఎంతగా బలపడిందంటే వారం వారం పత్రిక చూడందే నా మనసు మనసులో ఉండేది కాదు. విజయవాడ "సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" లోనూ వారం వారం "పటమట" వెళ్ళి "ఆంధ్రభూమి వారపత్రిక" కొనుక్కునేవాడిని, కేవలం అందులోని పెయింటింగ్ ఇలస్ట్రేషన్స్ కోసమే.

స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ - "ఆంధ్ర భూమి సండే స్పెషల్ పేపర్" లో "న్యూయార్క్" నగరం మీద ప్రచురించిన ఓ వ్యాసం లోని ఫొటో. అప్పట్లో నా బొమ్మలకి ఆధారాలన్నీ ఇలాంటి ఫొటోలే. చాలా క్లిష్టమైన ఫొటో అది. ఎత్తైన స్టాచ్యూ పైనుంచి తీసిన ఆ ఫొటోలో వెనక లిబర్టీ పార్క్, హడ్సన్ రివర్ ఇవన్నీ అస్పష్టంగానే ఉన్నాయి. నేనేమో నాసి రకం నోట్ బుక్ పేపర్, బ్రిల్ ఇంకు బుడ్డీ, జగ్గులో నీళ్ళు ఒక బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వెయ్యటానికి సిద్ధమయిపోయాను. ఇప్పుడు చూస్తే ఎలా వేశానా అంత ఛాలెంజింగ్ ఫొటోని అంతకన్నా ఛాలెంజింగ్ మెటీరియల్తో ఏ రఫ్ స్కెచ్ కూడా లేకుండా డైరెక్టుగా అని. ఇప్పుడైతే హై క్వాలిటీ వాటర్ కలర్ పేపర్, టాప్ మోస్ట్ క్వాలిటీ వాటర్ కలర్స్, కట్టలకొద్దీ బ్రషులూ, ముందుగా రఫ్ స్కెచ్, ఆ తర్వాత పేపర్ టేపింగ్ ప్రక్రియ ఇలా ఎన్నో ప్రక్రియలతో కానీ బొమ్మ మొదలయ్యి పూర్తి కాదు. అప్పటి బొమ్మల్లో ప్రక్రియంతా నేర్చుకోవాలన్న తపనా, పట్టుదలా, దీక్షా...ఇవే.

తాతయ్యతో నా అనుబధం ఇరవైతొమ్మిదేళ్ళు. చిన్నపుడు వేసవి శలవులకి మా ఊరు "దామరమడుగు" నుంచి తాతయ్య తాసిల్దారుగా పనిచేస్తున్న "చీరాల" వెళ్ళాలంటే ఎక్కడలేని సంబరం. "నెల్లూరు" నుంచి "చీరాల" కి రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం. అక్కడున్నన్ని రోజులూ ఇల్లంతా ఎప్పుడూ మనుషులే. మధ్యాహ్నం జీప్ లో సముద్రం బీచ్ లకీ, సాయంత్రం అయితే సినిమాలకీ, షికార్లకీ తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా జీప్, జవాన్ లు ఉండేవాళ్ళు. తాతయ్యకి ఇవి నచ్చేవి కాదు. కానీ శలవులే కదాని పెద్దవాళ్ళతో సహా పిల్లలం అని మమ్మల్ని ఏమీ అనేవాడు కాదు. అలా తాతయ్య పని చేసిన చీరాల, తెనాలి, ఒంగోలు, పొన్నూరు, మార్కాపురం అన్ని ఊర్లూ శలవులకెళ్ళాం. అలా ఎనిమిదేళ్ళుదాకా నా బాల్యం ఆడుతూ పాడుతూ సాగిపోయింది.

నా తొమ్మిదేళ్ళపుడు తాలూకా, జిల్లా లెవెల్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయిన "ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి" లో నన్ను చేర్పించటానికి నాన్నకి స్కూల్ లో శలవు దొరక్క తాతయ్యతో నన్ను స్కూల్ అడ్మిషన్ కి పంపించాడు. అప్పుడు తాతయ్యతో కలసి చేసిన ప్రయాణం, ఆ స్కూల్ లో నన్ను చేర్చిన ఆ రోజూ ఇంకా నిన్నే అన్నట్టు గుర్తున్నాయి, హిందూపూర్ కి తాతయ్య నన్ను తీసుకెళ్ళి కొనిచ్చిన ప్లేటూ, గ్లాసుతో సహా.

నాన్నని నా 6 తరగతిలోనే దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోవటంతో తాతయ్యే నాకు గార్డియన్ అయ్యాడు. అన్ని అప్లికేషన్స్ లోనూ "Guardian జలదంకి మల్లిఖార్జునం" అని తాతయ్య పేరే రాసే వాడిని. టెన్త్ అయ్యాక హిందూ పేపర్ లో "హైదరాబాద్ రావూస్ ట్యుటోరియల్" లో "నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి" కి కోచింగ్ అన్న ప్రకటన చూసి నన్ను "హైదరాబాద్" తీసుకెళ్ళి ఒక నెల అక్కడా చేర్పించాడు. తాతయ్య రిటైర్ అయ్యాక కూడా తరచూ "హైదరాబాద్" వెళ్తుండేవాడు. ఎప్పుడు వెళ్ళి వచ్చినా మా ఇంటికి చిన్న "పుల్లారెడ్డి స్వీట్స్" ప్యాకెట్ తెచ్చిచ్చేవాడు. తాతయ్య "హైదరాబాద్" నుంచి వచ్చాడు అంటే నాకు ఆ స్వీట్స్ తియ్యని రుచులు గుర్తుకొచ్చేవి అప్పట్లో.

తర్వాత నన్ను ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ" లో చేర్చటానికీ అమ్మని తీసుకుని తాతయ్యే నాతో వచ్చాడు. పదవ తరగతి పరిక్షల్లో మంచి మార్కులు రావటంతో కాలేజి సీట్ వచ్చేసినా హాస్టల్ సీట్ దగ్గర మాత్రం అప్పటి వార్డెన్ "ఫాదర్ ఇన్నయ్య" చాలా ఇబ్బంది పెట్టారు. హాస్టల్ అప్లికేషన్ లో విజయవాడలో ఎవరైనా బంధువులున్నారా అన్న కాలమ్ దగ్గర తాతయ్య అక్కడున్న బంధువుల పేరు రాయటం, అది ఆసరాగా తీసుకుని హాస్టల్ సీట్ ఇవ్వం, మీ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంచి కాలేజి కి పంపండి అని వార్డన్ "నౌ, యు కెన్ గో" అని రూమ్ లోనుంచి మమ్మల్ని బయటికి పొమ్మనటం. వాళ్ళు మా అబ్బాయికి అంతగా తెలీదు, వాళ్ళుండే సత్యనారాయణపురం ఇక్కడికి చాలా దూరం, అంత దూరం నుంచి రోజూ ఇక్కడిదాకా రావాలంటే బసులు కూడా సరిగ్గా లేవు, చాలా కష్టం అవుతుంది అని ఎంత ప్రాధేయపడినా ససేమిరా వినకుండా మమ్మల్ని బయటికి పంపేయటంతో ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో బయట చెట్టు కింది కొన్ని గంటలు నిలబడ్డాం. తాతయ్య అంతలా ప్రాధేయపడటం నచ్చని నేను "కాలేజి ఫీజ్ పోతే పోయింది తాతయ్యా, కావలి జవహర్ భారతి లో నా మార్కులకి నాకే ఫస్ట్ సీట్ వచ్చింది, అక్కడే చేరతా" అని నేనన్నా నాకు సర్ది చెప్పి అందరి అడ్మిషన్స్ అయ్యే దాకా వేచి చూసి మళ్ళీ హాస్టల్ ప్యూన్ "సెగైరాజ్" ని బ్రతిమాలుకొని వార్డన్ రూములోకి వెళ్ళి తాతయ్య ప్రాధేయపడ్డ తీరు నన్నిప్పటికీ కలవర పెడుతూనే ఉంటుంది. "తండ్రి లేని బిడ్డ, బాగా తెలివైనవాడు, మంచి మార్కులొచ్చాయి, మంచి కాలేజి అని ఇంతదూరం వచ్చాము, భర్త లేని తల్లి, కనీసం ఆమెని చూసైనా సీట్ ఇవ్వండి, మీరే కరుణించాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను." అని ఆయన కాళ్ళు పట్టుకునే దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ క్షణాల్లో "డిప్యూటీ కలెక్టర్" గా చేసిన తాతయ్య ఆ "హాస్టల్ల్ వార్డన్" ని నాకోసం అంతలా బ్రతిమాడాల్సి రావటం నన్నెంతగానో కలవరపెట్టింది. అక్కడ చదివిన రెండేళ్ళూ "గొగినేని హాస్టల్" లో "ఫాదర్ ఇన్నయ్య" తెల్ల గౌన్ వేసుకున్న పులిలా గంభీరంగా అడుగులేస్తూ నడిచి వస్తుంటే ఎక్కడ నన్ను చూసి గుర్తుపడతాడో అన్న భయంతో గుండె వేగం పెరిగేది. ఎదురైతే "గుడ్ మార్నింగ్ ఫాదర్" అనో "గుడ్ ఈవినింగ్ ఫాదర్" అనో చెప్తూ ఆయన కళ్ళల్లోకి చూడాలన్నా భయం వేసేది.

చివరిగా నన్ను "సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" లోనూ చేర్చటానికి తాతయ్యే వచ్చాడు. ఆరోజు "కావలి" లో బస్టాండు కి వస్తే "విజయవాడ" వెళ్ళే ప్రతి బస్సూ క్రిక్కిరిసే వచ్చాయి. కొన్ని గంటలు అలాగే వచ్చే పోయే బస్సులే తప్ప ఎక్కేందుకు చోటే లేని పరిస్థితి. చివరికి రేపు పొద్దున కాలేజి అడ్మిషన్ కి వెళ్ళగలమా, లేకుంటే కాలేజి సీట్ పోతుంది అన్నంత ఆందోళనలో పడ్డాం. అప్పుడొక బస్సు ఖాళీగా వస్తే తోసుకుంటూ ఎక్కి చివరికెలాగో ఆఖరి సీట్ లో అందరి మధ్య ఇద్దరం ఇరుక్కుని కూర్చోగలిగాం. తర్వాత ఒకాయనెక్కి ఈ సీట్ లో టవల్ వేశాను అంటూ తాతయ్యని నిర్దాక్షిణ్యంగా లాగే ప్రయత్నం చేశాడు. ఎన్నడూ తాతయ్య కోప్పడగా చూడనేలేదు. ఆరోజు గట్టిగా అరిచి ఆయన చెయ్యి విదిలించిన తాతయ్యని చూసి నాకూ భయం వేసింది, తాతయ్య చెయ్యికూడా వణుకుతూ ఉంది, అంటే అంత కోపం వచ్చింది. పక్కన అందరూ "పెద్దాయన్ని పట్టుకొని అలా లాగుతావా" అని ఆయన్ని తిట్టి పంపించారు. ఆ ప్రయాణం అంతా తాతయ్య చాలా అసహనంగానే ఉన్నాడు. నన్ను కాలేజి లోనూ, హాస్టల్ లోనూ చేర్పించి వెళ్ళాడు. అలా నా జీవితంలో నేను చదివిన ప్రతి స్కూలూ, కాలేజి అడ్మిషన్ కి తాతయ్యే వచ్చి నన్ను చేర్చాడు. నేను M.Tech చేశాక "మీ నాన్న కోరిక నాయనా అది, నెరవేర్చావు" అంటూ ఎంతో సంబరపడ్డాడు. నేను ఎప్పుడు శలవులకి వచ్చినా అన్నతో కలిసి ముందుగా వెళ్ళి దర్శించుకునేది తాతయ్యనే. నన్ను చూడగానే ఎంతో పొంగిపోయేవాడు. "అబ్బా...నా ముద్దుల మనవడు వచ్చాడయ్యా" అంటూ సంబరంతో ఆ నవ్వూ సంతోషం పసిపిల్లవాడు కేరింతలు కొట్టినట్టు అనిపించేది.  ఇంజనీరింగ్ అయ్యాక నన్ను IAS Exams రాయమని చాలా అడిగేవాడు. మా స్కూల్ లో చదివిన నా సీనియర్స్, జూనియర్స్ ఇప్పుడు IAS చీఫ్ సెక్రెటరీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, IPS డీజి, డీఐజి, యస్పీలుగా వింటుంటే అప్పుడు తాతయ్య మాట ఎందుకు పెడచెవిన పెట్టానా అని అప్పుడప్పుడూ ఇప్పుడనిపిస్తుంటుంది.

అలా నేను పెద్దయ్యాక తాతయ్యతో చాలా దగ్గరగా మెలిగాను. చివరిరోజుల్లో తాతయ్య, అమ్మమ్మ ఒంటరిగా మిగిలారు. ఎప్పుడు నేను వెళ్ళినా తలుపు తెరవగనే అదే కుర్చీలో కూచుని ఏవో పేపర్స్ మీద రాసుకుంటూనే కనిపించేవాడు. నేను నా మొదటి సంపాదనతో తాతయ్యకి 1990 లో "HMT Wrist వాచ్" హైదరాబాద్ నుంచి కొని తెచ్చాను. చాలా సంబరపడ్డాడు. తర్వాత TCS లో నా మొదటి London Trip లో Parker Ballpoint Pen తెచ్చిచ్చాను. తాతయ్యకి బ్రిటీష్ వాళ్ళ దగ్గరా పనిచేసిన అనుభవం ఉంది, "అబ్బా...చాలా రోజులయ్యిందయ్యా ఈ పెన్ వాడి" అంటూ ఎంతో సంబరపడ్డాడు అప్పటి రోజులు గుర్తుచేసుకుని. నేనిచ్చిన ఆ Pen నే ఇష్టంగా వాడేవాడు. తాతయ్య  "కావలి పెన్షనర్స్ అసోసియేషన్" కి ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ పెన్షనర్స్ అందరూ ఇంటికొచ్చి ఏవో సంతకాలు పెట్టాక వాళ్ళల్లో ఎవరో ఆ Pen పట్టుకెళ్ళిపోయారని వాళ్ళకోసం పరిగెత్తి వెళ్ళినా అందులో ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలీలేదని చెప్తూ తాతయ్య ఆ Pen పోయిందని ఎంతో బాధ పడ్డాడు. తర్వాత నేను తెచ్చిచ్చిన HMT Wrist వాచీ కూడా తాతయ్య చేతికి లేకుండా పోయింది. నీతిగా నిజాయితీగా గొప్ప ఉద్యోగాలు చేసి ఎందరికో సహాయపడ్డ తాతయ్య రిటైర్ అయ్యాక మాత్రం చాలా సాదా సీదా జీవితం గడిపాడు. నాన్న లేని మాకూ అమ్మకు మాత్రం పెద్ద దిక్కయ్యాడు. ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చుని, మాతో కాసేపు గడిపి వెళ్ళేవాడు. ఏవన్నా చిన్న పనులున్నా "నా పెద్ద మనవడు నాకు చేస్తాడయ్యా" అంటూ అన్నకే చెప్పేవాడు, ఇంకెవ్వరినీ అడిగేవాడు కాదు.

ఎంత కష్టం వచ్చినా ఎవ్వరితోనూ చెప్పుకోని తాతయ్య ఒక్కసారి మాత్రం నేను శలవులకి వచ్చాక తరువాతిరోజు ఉదయం నేనూ అన్నా ఎప్పటిలానే నా మొదటి దర్శనం తాతయ్య దగ్గరికి వెళ్ళి కాసేపుండి వెళ్తుంటే "ఉండండి నాయనా మీతో బజారు దాకా నేనూ వస్తాను" అని గబగబా చొక్కా ప్యాంటూ వేసుకుని మా ఇద్దరి మధ్య చెరో భుజంపై చేతులు వేసి మౌనంగా నడుస్తూ ఇంటి రోడ్డు "పోలేరమ్మ రాయి" దగ్గర ఒక్క సారిగా ఏడ్చేశాడు. "ఏమైంది తాతయ్యా, ఊరుకో" అని అడిగితే "సంక్రాంతి పండగ, అరిశెలక్కూడా డబ్బుల్లేవు" అంటూ బావురుమన్నాడు. మా జేబుల్లోనూ అప్పట్లో పెద్దగా డబ్బులుండేవి కాదు. తాతయ్యకి నచ్చచెప్పి ఇంట్లో దిగబెట్టి ఇంటికెళ్ళి అమ్మనడిగి డబ్బులు తీసుకెళ్ళి తాతయ్యకి ఇచ్చి వచ్చాము. ఇప్పటికీ గుర్తొచ్చినపుడల్లా గుండె బరువెక్కుతుంది. తాతయ్యకొచ్చే పెన్షన్ తో దర్జాగా నెలంతా అమ్మమ్మ, తాతయ్య హాయిగా గడపొచ్చు, కానీ పరిస్థితులవల్ల ఆయన నెల మధ్యకొచ్చేసరికల్లా వచ్చే నెల మొదటి వారం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితిలో ఆయన జీవితం పడింది. తాతయ్య పరిస్థితి అర్ధం అయ్యీ కాని పరిస్థితి నాది. తర్వాత TCS లో ఉండి 1997 లో నేను Tokyo, Japan లో ఉన్నపుడు నాకు Email ద్వారా తాతయ్య కూడా నాన్న దగ్గరికెళ్ళిపోయాడని తెలిసింది. మౌనంగా అంత దూరం నుంచే రాలేని స్థితిలో ఎంతో రోదించాను. "తాతయ్య శకం" ముగిసింది. ఆయన ఆఖరి చూపుకి నేను నోచుకోలేదు.

మా ఫ్యామిలీలో ఇప్పటికీ ఎవ్వరూ వెళ్ళని ఉన్నత స్థాయికి తాతయ్య వెళ్ళాడు. మంచీ, నీతీ, నిజాయితీ తో ఉన్నతంగా జీవించాడు. "మీ నాన్న ఉండి ఉంటే నాకెంతో అండగా ఉండేదయ్యా" అని నాతోనూ, అన్నతోనూ చాలాసార్లు అంటూనే ఉండేవాడు. నాన్న తాతయ్యకి అల్లుడే, అయినా ఎందుకలా అనేవాడో మాకు సరిగా అర్ధం అయ్యేది కాదు. తర్వాత అర్ధమయ్యింది, నాన్న ఉన్నంతవరకూ నాన్నతో తాతయ్యకి ఉన్న అనుబంధం తెలిసి. ఏ తండ్రికి అయినా రిటైర్ అయ్యాక ఆలోచనలన్నీ ఎదిగిన తన కొడుకుల పైనే ఉంటాయనీ, పెద్ద వయసులో ప్రతి మనిషీ ఒక అండ కోరుకుంటాడనీ, తాతయ్యకి అలా అండగా ఉండే మనిషే లేకుండాపోయారనీ మాత్రమే అర్ధం అయ్యింది.

చిన్న వయసులోనే నాన్న పోయాక అమ్మకి అన్నీ తానే అయి అమ్మ జీవితాన్ని ఒక దారిలో పెట్టి ఎవ్వరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలదొక్కుకుని ముందుకి నడిచే బాట తాతయ్యే దగ్గరుండి మరీ వేసి అమ్మని ముందుకి ధైర్యంగా నడిపించాడు. నా చదువు, విజయాల బాటలో తాతయ్య కి ప్రత్యేకమైన చోటుంది. ఎప్పటికీ ఉన్నతంగా తాతయ్య నా మదిలోనే ప్రముఖంగా కొలువై ఉన్నాడు. తాతయ్యని రోజూ నా ప్రేయర్స్ లో తల్చుకుంటూ నిత్య దర్శనం చేసుకుంటూనే ఉన్నాను. నా చిన్నప్పటినుంచీ ఎన్నో ఉత్తరాల్లో "My Dear Giri" అని మొదలుపెట్టి, "Yours affectionately" అంటూ తన సంతకంతో ముగించిన తాతయ్య, నా జీవితంలో, నా ఎదుగుదలలో నాకు దేవుడు ప్రసాదించిన ఎప్పటికీ ముగియని "మహానుభావుడు"... 🙏

"పుట్టిన ప్రతి మనిషి జీవితమూ ఎందరో మహానుభావులు తీర్చి దిద్దినదే."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, September 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 24 . . .

క్రిస్టొఫర్ రీవ్ - సూపర్ మ్యాన్
Watercolors on Paper (8" x 11")

హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా. జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తుపెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా కూడా ఆ విజువల్స్, ఆ అద్భుతమైన చిత్రీకరణ అనుభూతి కోసం వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అప్పుడు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసే ప్రక్రియ ఉండేది కాదు. నా చిన్నప్పటి హైస్కూల్ డేస్ లో అయితే "బ్రూస్ లీ" కరాటే స్టిల్స్ ఉన్న నోట్ బుక్స్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పటికీ బాగా గుర్తుంది. బ్రూస్ లీ "ఎంటర్ ది డ్రాగన్" ప్రపంచ సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ వరసలో ముందుగా వచ్చిన "సూపర్ మ్యాన్" కూడా అంతగా పాపులర్ అయ్యింది. "బ్రూస్ లీ" అంతలా ప్రతిఒక్కరికీ చేరువ కాకపోయినా సూపర్ మ్యాన్ సినిమాలో హీరో "క్రిస్టొఫర్ రీవ్" పేరు చాలా మందికి బాగా గుర్తుండేలా. క్రిస్టొఫర్ రీవ్ సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న స్టిల్స్ నాకైతే పోర్ట్రెయిట్ డైమన్షన్స్ కి ఒక కొలమానంగా అనిపించేవి.

అప్పుడప్పుడే కొలిచి గీసినట్టు, అచ్చుగుద్దినట్టు తెలుగు సినిమా హీరో, హీరోయిన్ల పోర్ట్రెయిట్స్ పెన్సిల్ తో  వేస్తూ కొంచెం కొంచెం నాసిరకం వాటర్ రంగుల బిళ్ళలతో పెయింటింగ్స్ మొదలు పెట్టిన నా ఇంటర్మీడియట్ కాలేజి రోజులవి. ఏదో ఆదివారం దినపత్రికలో నాకు దొరికిన సూపర్ మ్యాన్ స్టిల్ ఇది. ఆంధ్ర లొయోలా కాలేజ్, విజయవాడ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సమ్మర్ శలవులకి "కావలి" వచ్చినపుడు వేసింది. పరీక్షలు కూడా రాసి ఇంటికి రావటంతో రెండు నెలలు ఖాళీ సమయం. బొమ్మలు వెయ్యటం, పత్రికలు తిరగెయ్యటం, నవలలు దొరికితే చదవటం, రోజూ పొద్దున కావలిలో ఉన్న మూడు లైబ్రరీ లకి వెళ్ళి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తిరగెయ్యటం, పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకెళ్ళి కాసేపు అక్కడ ప్రింట్ అవుతున్న మెటీరియల్స్, పాంప్లెట్స్, పెళ్ళి పత్రికలు గమనించటం, అప్పుడప్పుడూ సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్ళటం ఇవే శలవుల్లో నా వ్యాపకాలు. పొద్దున్నే లేచి రోజంతా ఈ వ్యాపకాలన్నీ చేసినా ఒక్కొకరోజు సాయంత్రం అయ్యేసరికి ఏమీ తోచేది కాదు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నేలమీద కూర్చుని ప్యాడ్ పెట్టుకుని బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాసిరకం వాటర్ కలర్ బిళ్ళల పెట్టె ఒకటి, అన్న కొన్నది ఇంట్లో వాడకుండా పడిఉండేది. వాడి విశ్వోదయ హై స్కూలులో ఆర్ట్ క్లాస్ కోసమని కొన్నది. నాకు పెన్సిల్ తో వెయటం బాగా వచ్చాక, పెన్ను తో కొంత కాలం బొమ్మలేశాక, రంగుల మీదికి మనసు మళ్ళింది. వాడక అలా పడున్న ఆ వాటర్ రంగుబిళ్ళల పెట్టె నేను వాడటం మొదలుపెట్టాను, ఒక డజను దాగా వాటితో చిన్న చిన్న వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశాను. వాటిల్లో ఈ "సూపర్ మ్యాన్" ఒకటి. రంగులు పేపర్ మీద వేస్తుంటే బాగా పాలిపోయినట్టుగా ఉండేవి . మిక్సింగ్ కి సరిగా సహకరించేవి కాదు. అయినా వాటిల్తోనే కొద్ది కాలం కుస్తీలు పట్టేవాడిని.

ఒక్కొకసారి ఏమీ తోచని నాకు తన స్కూల్ రికార్డ్స్ నన్ను రాయమని అమ్మ పని కల్పించేది. అమ్మ ఎప్పుడు అడిగినా రాయను అనకుండా శ్రద్ధగా అన్నీ రాసి పెట్టేవాడిని. అమ్మ కావలి "జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల" లో జూనియర్ అసిస్టంట్ గా, అంటే క్లర్క్ గా పని చేస్తుండేది. గర్ల్స్ హైస్కూల్ కి ఆనుకునే, పక్కన బాయ్స్ హైస్కూలు లో టీచర్ గా నాన్న పనిచేశారు. ఊహించని విధంగా మమ్మల్నీ ఈ లోకాన్నీ వీడి నాన్న పోయిన ఒక్క నెలకే అమ్మ జాబ్ లో చేరవలసిన పరిస్థితి ఎదురైంది. ధైర్యం చెప్పి అమ్మకి అన్నీ తనే అయ్యి మా తాతయ్య, అంటే అమ్మ నాన్న అమ్మతో తొలి అడుగులు వేయించారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అమ్మ ఉద్యోగం చెయ్యకపోతే మా మనుగడ చాలా కష్టం అయ్యేది. అమ్మ చదివిన పి.యు.సి (అంటే ఇంటర్మీడియట్) క్వాలిఫికేషన్ కి అమ్మకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గర్ల్స్ హై స్కూలు మొత్తానికి అమ్మ ఒకటే క్లర్క్, స్కూలు రికార్డ్స్, నెల నెలా జీతాలు, పరీక్షల ఫీజులు, మార్కుల లిస్టులు, అన్నీ అమ్మ ఒక్కటే చూసుకునేది. నెల మొదటి వారం జీతభత్యాల లెక్కలు రాసి స్టాఫ్ అందరికీ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే పని కూడా అమ్మదే. స్టూడెంట్స్ పరీక్షల ఫీజులు కట్టించుకుని ఆ డబ్బులు బ్యాంక్ లో వెళ్ళి జమ చేసే పనీ అమ్మదే. ఇలా నెల మొత్తం చాలా పని ఉండేది. పెళ్ళయ్యాక గృహిణిగా ఉంటూ ఇల్లు, సంసారం నాన్ననీ మమ్మల్నీ చూసుకుంటున్న అమ్మకి ఒక్క సారిగా జాబ్ చెయ్యాటానికి కావలసిన చదువున్నా ఆ పని బొత్తిగా తెలీదు, అనుభవం లేదు. స్కూల్ లో క్లరికల్, రికార్డ్స్ పని అస్సలు తెలీదు. ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలలు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ అమ్మకి ఎంతో ధైర్యం చెప్పి చాలా సపోర్టివ్ గా ఉండి నేర్పించింది అని అమ్మ చెప్పేది.

శలవులకి నేను వచ్చినపుడల్లా ఆ రికార్డులు రాసే పని కొంతవరకూ నేనూ చేసిపెట్టేవాడిని. ఒక్కొక నెల పని భారంతో అమ్మ పడే టెన్షన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి. పొద్దున 5 గంటలకి ముందే నిద్రలేచి కసువూ, కళ్ళాపి, ముగ్గుల పనులు ముగించి పాలు తీసుకుని రావటం, ఇంటి ఎదురుగా మున్సిపల్ కుళాయి దగ్గర బిందె లైన్లో పెట్టి నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం, రోజుకి సరిపడా నీళ్ళు పట్టి తొట్టెలకీ, బకెట్లకీ పోసిపెట్టటం, మాకు కాఫీలు, టిఫెన్లూ చేసి పెట్టటం, అంట్లు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, మాకు మధ్యాహ్నానికి అన్నం, పచ్చడీ, కూరా వండి, అన్నీ వంటింట్లో సర్ది పెట్టి, తయారయ్యి తొమ్మిది గంటలకల్లా ఇంటికి తెచ్చుకున్న రికార్డు బుక్కులన్నీ పట్టుకుని నడచి స్కూలు కి వెళ్ళటం...ఇది రోజూ అమ్మ పొద్దున పని. ఆ పనుల్లో బయల్దేరే టైమ్ కొద్దిగా ఆలశ్యం అయితే పడే టెన్షన్ చాలా ఉండేది. అలాగే లంచ్ టైమ్ ఎర్రటి ఎండలో నడచుకుంటూ ఇంటికి వచ్చి గబగబా మాకు భోజనాలు పెట్టి, తనూ తిని స్కూలుకి పరుగులు పెట్టటం. సాయంత్రం నాలుగున్నరకి రాగానే బిందె పట్టుకుని నీళ్ళకోసం వెళ్ళటం, చీకటి పడే వేళకి మళ్ళీ వంటా, వార్పూ, పనులతో అలా అలసిపోతున్నా అలసట తెలియని మిషన్ లా తిరిగి తిరిగి అరిగిపోతూ కరిగిపోయిన కాలం తాలూకు రోజులవి.

ఇప్పటికీ గుర్తుంది, ఆ సంవత్సరం సమ్మర్లో నేనే ఒక నెల రికార్డులు అన్నీ రాసి పెట్టాను. వాటిల్లో సంతకాలు పెడుతూ హెడ్మిస్ట్రెస్ చూసి చాలా మెచ్చుకున్నారంట. నా చేతివ్రాత గుండ్రంగా ఉండేది. "విజయలక్ష్మీ ఎవరు రాశారు ఈ నెల రికార్డ్స్?" అని హెడ్మిస్ట్రెస్ అడిగితే, "మా చిన్నబ్బాయి గిరి, కాలేజి నుంచి శలవులకొచ్చాడు" అని చెప్పిందంట. సమ్మర్ లో స్కూలుకి శలవులు, అయినా అమ్మకి మాత్రం నెల మొదటివారం, చివరివారం రికార్డుల పని ఉండేది. అలా సమ్మర్ శలవుల్లో స్టాఫ్ అంతా పని చేయ్యకున్నా జీతాలు ఇవ్వాలి, క్లరికల్ పని తప్పదు కాబట్టి అమ్మకి సమ్మర్ శలవుల్లో నెల జీతంతో బాటు స్పెషల్ గా మరో 20 రూపాయలు వచ్చేది. ఆ సంవత్సరం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ ఆ స్పెషల్ డబ్బులు అమ్మకి ఇస్తూ "ఈ 20 రూపాయలు మాత్రం మీ చిన్నబ్బాయికి ఇవ్వు" అని చెప్పిందంట. అమ్మ వచ్చి ఎంతో సంతోషంగా నాకు చెప్తే నేనూ ఎంతగానో పొంగిపోయాను. ఆ డబ్బులు నేను తీసుకోలేదు కానీ, ఒక రకంగా నా మొదటి సంపాదన అని చెప్పుకోవాలంటే మాత్రం అమ్మ కష్టార్జితంలో నా వంతుగా నేను సాయం చేసి సంపాదిచిన మొదటి సంపాదన అదే. అదే శలవుల్లో అమ్మతో ఒకసారి పొద్దున్నే తోడుగా స్కూలుకి వెళ్ళి ఒక రెండు గంటలు నేనూ అన్నా ఇద్దరం అక్కడ ఉన్నాం. అప్పుడు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ రూముకి అమ్మ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. నా గురించి, నా చదువు గురించీ హెడ్మిస్ట్రెస్ అడిగి తెలుసుకుంది. తర్వాత అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా గురించి కూడా చెప్పిందని అమ్మ చెబితే గుర్తుంది. సరిగ్గా పదేళ్ళ తర్వాత మొదటిసారి నేను TCS లో జాబ్ చేస్తూ లండన్ వెళ్ళినపుడు అమ్మ స్కూల్ లో ఆ విషయం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి చెప్తే చాలా సంతోషపడిందని, వాళ్ళ స్టాఫ్ అందరికీ "విజయలక్స్మి చూడండి పిల్లల్ని ఎంత గొప్పగా చదివించి వృద్ధిలోకి తెచ్చిందో" అంటూ చెప్పిందని తెలిసి నేనూ చాలా పొంగి పోయాను. మా చెల్లెలు లక్ష్మి కూడా అదే స్కూలు లో చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆటల్లో, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ అన్నీ తనకే వచ్చేవి. అలా మా గురించీ, అప్పటి మా ఫ్యామిలీ పరిస్థితి గురించీ బాగా తెలిసిన వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి, అమ్మంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 

ఈ బొమ్మలో కనిపించే "సూపర్ మ్యాన్" ఆ సినిమాలో సాదా సీదా మనిషే. కానీ తన ఎదురుగా ఏదైనా విపత్తు వస్తే అనుకోకుండా దివ్య శక్తి వచ్చి అతన్ని సూపర్ మ్యాన్ గా మార్చేస్తుంది. నయాగారా జలపాతంలో పడిపోతున్న చిన్న పిల్లని సైతం అందరూ అశ్చర్యంగా చూస్తుండగా గాలిలో ఎగురుతూ వెళ్ళి రక్షించి తీసుకుని వస్తాడు. ఇలా ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలిగించే సాహసాలు చేస్తుంటాడు. మా జీవితాల్లో అమ్మ నిత్యం చిన్న పిల్లలమైన మాకోసం మా కళ్ళ ఎదుటే రోజూ జీవితంతోనే సాహసాలు చేసింది. సినిమా మూడు గంటలే కాబట్టి ఆ సాహసం ఫలితం వెంటనే కనబడేలా తియ్యాలి. నిజ జీవితంలో ఇలాంటి అమ్మలు చేసే సాహసాల ఫలితాలు పిల్లలు పెద్దయ్యి ఎదిగి వృద్ధిలోకి వచ్చాక మాత్రమే కనిపిస్తాయి.

ఏ శక్తీ అండగా లేకున్నా సరే ఒంటరిగా జీవితంతో పోరాటం చేసి పిల్లల జీవితాల్ని తీర్చిదిద్ది వాళ్ళని గెలిపించి తను గెలిచే ప్రతి అమ్మ ఒక సూపర్ వుమన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే అదృశ్య శక్తులూ, దివ్య శక్తులూ తోడవ్వాలేమో. సూపర్ అమ్మ అవ్వాలంటే ఏ శక్తీ తోడు అవసరం లేదు. భూమిపై అమ్మ సూపర్ మ్యాన్ ని మించిన పెద్ద సూపర్ శక్తి...

"మానవాళికి దేవుడిచ్చిన దివ్య శక్తి అమ్మ."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Monday, August 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 23 . . .


Ballpoint pen on Paper (8.5" x 11")

నుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంతబాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.

సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి కూడా. హాస్టల్ లో సెకండ్ ఇయర్ లో నా పక్క రూమ్ లో ఉండే "వాసు" (శ్రీనివాస్ నీలగిరి, మెకానికల్ ఇంజనీరింగ్) నాకు పరిచయమయ్యి మంచి మిత్రుడయ్యాడు. వాసు దగ్గర ఏదో మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక ఫుల్ పేజి కలర్ ఫొటో చూశాను. ఒక చిన్న పాప సముద్రం లోని నీళ్ళన్నీ తోడి తన బకెట్ లో నింపాలన్నట్టు ఆ నీళ్లల్లో దిగి చూస్తుండటం, చూడగానే నన్నెంతో ఆకట్టుకుంది. ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ చాలా గొప్పగా తీశాడు. అప్పట్లో మంచి ఫొటో చూస్తే దాని బొమ్మగా గియ్యాలనో, పెయింటింగ్ గా ట్రై చెయ్యాలనో అనిపించేది. ఈ బొమ్మ చూడగానే తీసుకుని బాల్ పాయింట్ పెన్ను తో వెయ్యటం మొదలు పెట్టాను. కళాదృష్టి కలిగిన వాసు కూడా అప్పట్లో నా బొమ్మలకు అభిమాని. వేసిన ప్రతి బొమ్మా పరికించి చూసేవాడు. నా బొమ్మల స్ఫూర్తి తో తనూ క్యారికేచర్స్ ట్రై చేస్తుండేవాడు. వాసు ది గుంటూరు, విజయవాడకి దగ్గరే కావటంతో నెలకి రెండుసార్లన్నా ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు. ఒకసారి దీపావళి కి నలుగురు ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకెళ్ళాడు, రెండ్రోజులు సరదాగా గుంటూరు తిరిగాం. వెంకటేష్ "వారసుడొచ్చాడు" సినిమా కూడా చూశాం. అప్పట్లో తెలుగు వారపత్రికలు, సినిమాల్లో కొంచెం భిన్నంగా పబ్లిసిటీ డిజైన్ చేసే ఆర్టిస్ట్ లు వీళ్ళే నా బొమ్మల సాధనానికి గురువులు. చిరంజీవి "రుద్రవీణ" సినిమాలో "లంక భాస్కర్ గారు" సినిమా టైటిల్స్ లో కొత్తగా రాసిన ఇంగ్లిష్ ఫాంట్ కి ఆ సినిమా న్యూస్ పేపర్స్ పబ్లిసిటీ లో గీసిన చిరంజీవి బొమ్మలకీ చాలా ఆకర్షితుడ్నయ్యాను. ఆ ఇంగ్లీష్ ఫాంట్ ని అనుకరిస్తూ నోట్ బుక్స్ లో హెడింగ్స్, నా పేరూ రాసుకునే వాడిని.

నాలుగేళ్ళ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తయ్యి, మూడవ సంవత్సరంలోకి అప్పుడే అడుగుపెట్టాం. నాలుగేళ్ళూ క్యాంపస్ లో హాస్టల్స్ లోనే ఉన్నాను. కాలేజి లో రెండు హాస్టల్స్ ఉండేవి. మొదటి రెండేళ్ళు ఓల్డ్ హాస్టల్ అని ఒకటి, చివరి రెండేళ్ళు న్యూ హాస్టల్ అని ఇంకోటి ఉండేది. న్యూ హాస్టల్ మంచి ఆర్కిటెక్చర్ తో కట్టిన బిల్డింగ్, మా కాలేజి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిజైన్ చేశారు అని అనేవాళ్ళు. ట్రైయాంగిల్ ఆకారంలో ఆర్కిటెక్చర్ కొత్తగా ఉండేది. పక్కనే ఆనుకుని పొలాలు, కొద్ది దూరంలోనే కనిపిస్తూ ఉండే కానూరులోని "విజయలక్ష్మి సినిమా థియేటర్". మా హాస్టల్ నుంచి పెద్ద పొలం గట్టుమీద పది నిమిషాల్లో నడచి వెళ్ళొచ్చు, అక్కడే చాలా సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఎక్కువగా శనివారం సెకండ్ షోలకి, అప్పుడప్పుడూ మ్యాట్నీలకి. కొత్త సినిమాలు వస్తే మొదటిరోజు మ్యాట్నీకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్తే టికెట్స్ ఇచ్చేవాళ్ళు, క్యూ లో వెళ్ళే పనిలేదు, అయితే అలా వెళ్ళి నేర్పుగా చెప్పి టికెట్స్ తీసుకురాగల సత్తా అందరికీ ఉండేది కాదు, కానీ ప్రతి ఫ్రెండ్ సర్కిల్ లో అలాంటి వాడొకడుండేవాడు. మా ఫ్రెండ్స్ లో "బాలసుబ్రమణ్యం" అని తిరుపతి ఫ్రెండ్ విజయవాడలో ఏ థియేటర్ కెళ్ళినా మేనేజర్ రూమ్ కెళ్ళి కాలేజి పేరు చెప్పి తమాషాగా టికెట్స్ సంపాదించుకొచ్చేవాడు.

మూడవ సంవత్సరం వచ్చేసరికి పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలుపెట్టి వేస్తూ ఉన్నాను. అప్పటికి రెండేళ్ళు కాలేజ్ మ్యాగజైన్ లో నా బొమ్మలు ప్రింట్ అవటంతో చాలామందికి "గిరిధర్" అన్న పేరు స్టూడెంట్ గానే కాదు ఆర్టిస్ట్ గానూ సుపరిచయం అయ్యింది. ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు ఆర్ట్ మీద మక్కువ ఉన్న ఒకరిద్దరు జూనియర్స్ ఆదివారం మధ్యాహ్నం పనిగట్టుకుని నా రూమ్ కి వచ్చేవాళ్ళు ఏం పెయింటింగ్ వేస్తున్నానో చూట్టానికి. కాలేజి మ్యాగజైన్ అంటే గుర్తుకొచ్చే ఒక తమాషా సంఘటన. మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కాలేజి మ్యాగజైన్ కి బొమ్మలు, కవితలు, ఆర్టికిల్స్, ఫొటోస్ సబ్మిట్ చెయ్యొచ్చు అని లిటరరీ క్లబ్ న్యూస్ బోర్డ్ లో నోటీస్ పెట్టారు. అది చూసి నేను వేసిన మూడు బొమ్మలు సబ్మిట్ చేస్తే మూడూ తీసుకున్నారు. అది తెలిసి నా ఫ్రెండ్ ఒకతను ఒక బొమ్మ తెచ్చిచ్చి నాతో వెయ్యించుకుని కింద తన పేరు కూడా నేనే రాసిస్తే సబ్మిట్ చేశాడు. అది తెలిసిన ఇంకో అతను నాకు పరిచయం కూడా లేదు, ఏదో వారపత్రిక పట్టుకొచ్చి అందులో ఒక బొమ్మ వేసి తన పేరు రాయమని ఇబ్బంది పెట్టి మరీ వేయించుకున్నాడు. తర్వాత ప్రింట్ అయిన మ్యాగజైన్ లో వాళ్ళిద్దరూ వాళ్ళ పేరు చూసుకుని మురిసిపోయారు గొప్పగా. నాకు మాత్రం నా మూడు బొమ్మలు, ఆ రెండు బొమ్మలూ కలిసి ఐదు బొమ్మలు ఏకంగా నా ఒక్కడివే ప్రింట్ అవటం చూసుకుని మురిసిపోయాను. తర్వాత ఆ ఇద్దరూ కొంచెం ఆందోళనకూడా పడ్డారు పాపం, ఎవరైనా వచ్చి బొమ్మ వేసివ్వమంటే ఏం చెయ్యాలా అని. కాలేజి తమాషాలు అలా(నే) ఉంటాయి.

న్యూ హాస్టల్ లో ఉన్న రెండేళ్ల కాలేజ్ లైఫ్ భలే ఉండేది. సీనియర్స్ అయ్యాం, ఇంకో ఒకటి రెండేళ్ళలో కాలేజి అయిపోతుంది. ఒక పూట మాత్రమే క్లాసులు. ప్రాక్టికల్స్ కంప్యూటర్ ల్యాబ్ కి పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు. ఎపుడన్నా వెళ్ళి అందరం ఒక్క సారి "మిని కంప్యూటర్ డంబ్ టర్మినల్స్" ముందు కూర్చుని లాగిన్ అయ్యి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏదోటి రాద్దామని మొదలు పెట్టేసరికి లోడ్ ఎక్కువయ్యింది, సిస్టమ్ రీబూట్ చెయ్యాలి అరగంట పడుతుంది అని చెప్పేవాళ్ళు, హ్యాపీ గా హాస్టల్ కి వెళ్ళిపొయేవాళ్ళం, ఇంక మళ్ళీ వచ్చే పనిలేదు. అలా మధ్యాహ్నం పరీక్షలు లేకుంటే, సినిమాకి వెళ్ళకుంటే ఎక్కువగా బొమ్మలు వేస్తుండేవాడిని. ఫైనల్ ఇయర్ లో "సోవనీర్" అని ఒక బుక్ ప్రింట్ చేసి బ్యాచ్ లో అందరికీ ఇచ్చేవాళ్ళు. అందులో ఒక్కో పేజీకి ఒక్కొక్కరి చొప్పున ఆ ఇయర్ బ్యాచ్ లో అన్ని బ్రాంచ్ ల వాళ్లవీ పాస్ పోర్ట్ ఫొటో, అడ్రెస్స్, ఫొటో కింద ఒక తమాషా క్యాప్షన్, క్లాస్ మేట్స్ సెలెక్ట్ చేసిందే. క్యాప్షన్స్ సరదాగా ఉండేవి. నాకు నా క్లాస్ మేట్స్ అందరూ కలసి పెట్టిన క్యాప్షన్ "రవివర్మ ఆఫ్ ది కాలేజ్" అని. తమాషాగా అనిపించింది, నన్ను రవివర్మ తో పోల్చటం ఏంటి అని. అప్పట్లో ఇండియా మొత్తం మీద బ్రిటీష్ కాలం నాటి "రాజా రవివర్మ" అంత పాపులర్ పెయింటర్.

అప్పట్లో చాలా బొమ్మలు ఈ బొమ్మలాగే క్యాజువల్ గా గియ్యటంతోనే మొదలయ్యేవి. ముందుగా అవుట్ లైన్ వేసుకోవటం, పేపర్ మీద కంపోజిషన్ చేసుకోవటం ఇలాంటివేవీ ఉండేదికాదు. అలా పెన్నుతో గీస్తూ పూర్తిచేశాక చుట్టూ బార్డర్ ఇండియన్ ఇంక్ తో వేసేవాడిని. అప్పటికి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ బొమ్మల్లో కమాండ్ వచ్చేసుంది కనుక ఈ బొమ్మలో గమనిస్తే షేడ్స్ సులభంగా వెయ్యగలిగాను. ఆ హెయిర్, హ్యాట్, బాడీ వెనుక భాగం నీడల ఛాయల్లో ఇది కనిపిస్తుంది. ఎదురుగా సముద్రపు నీళ్ళ ని అంత శ్రద్ధగా వెయ్యకపోయినా సముద్రం అనిపించేలా గీసిన సన్నని గీతల షేడ్స్ రియలిస్టిక్ గా లేకున్నా సముద్రాన్ని మాత్రం తలపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు వేసే బొమ్మల్లో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయేమో కానే, అప్పటి పోర్ట్రెయిట్స్ బాడీ ప్రొపోర్షన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసేవాడిని, అంటే అంత ఎక్కువగా శ్రద్ధ ఉండేదన్నమాట ;)

కాలేజి లో ఫ్రెండ్స్ ఇచ్చిన ఉత్సాహం, ప్రోత్సాహం తో నా బొమ్మల ప్రయాణం నాలుగేళ్ళు కొత్త కొత్త ప్రక్రియలు చేస్తూ, మెళకువలు నేర్చుకుంటూ, మెటీరియల్ కోసం విజయవాడ నగరం అంతా గాలిస్తూ, ఆంధ్ర భూమి వారపత్రికలో వచ్చే ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి సాధన చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా, ఆనందంగా సాగిపోయింది. కాలేజి అయ్యాక ఉద్యోగ వేటలో మా అందరి బాటలూ వేరయ్యాయి. ఎవరి విజయబాటల్లో వాళ్ళు పయనిస్తూ అన్ని దిక్కులకీ అందనంత దూరాలకి అందరం వెళ్ళిపోయాం. అస్థిరంగా మొదలుపెట్టిన కాలేజి బయట జీవిత ప్రయాణాలు స్థిరంగా కుదుటపడి జీవితాల్లో స్థిరపడ్డాం. విజయవాడ లో ఒక్కరూ లేరు, కొందరు వాళ్ళ స్వస్థలాల్లో ఇంజనీర్స్ గా, కొందరు హైదరాబాద్, సింగపూర్, కువైట్, అమెరికాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చాలాకాలం ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండానే ఉండిపోయాం. త్వరత్వరగా మారిపోతున్న ఇప్పటి కాలం లో మళ్ళీ అందరం ఈమధ్యనే వెలుగులోకి వచ్చేశాం. మాట్లాడుకున్నపుడల్లా నా బొమ్మల ప్రస్థావన రాకుండా ఉండదు. నేను అప్పట్లో ఎక్కువగా వేసిన నా అభిమాన నటి "భానుప్రియ" ని గుర్తుచేసుకోకుండా ఉండరు. అమెరికాలో భానుప్రియ ఉండేది, నీ బొమ్మలు ఎప్పుడూ చూడ్లేదా అని కూడా అడుగుతుంటారు. లేదు, చూసుండదు. నా బొమ్మలు చూసినవాళ్ళు అతి కొద్దిమందే. ఆ కొద్ది మందిలో "భానుప్రియ" ఉండే ఛాన్స్ లేనే లేదు. ఎప్పుడూ ఎక్కడా వెలుగు చూడని నా కాలేజి రోజుల బొమ్మలు అవన్నీ. అవి చూసిన కాస్త వెలుగల్లా నా చుట్టూ ఉన్న మిత్రుల ముఖాల్లో సరదా, తామాషాల నవ్వులు, ఆ నవ్వులతోబాటు వాళ్ళ కళ్ళల్లో స్నేహ కాంతులు చిందిన అప్పటి వెలుగులే...

"ఆనాటి వెలుగులో ఈనాడు కదలాడే నీడలే జ్ఞాపకాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Saturday, July 6, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 22 . . .


భానుప్రియ - శ్రావణ మేఘాలు, 1986
Ballpoint Pen on Paper 14" x 8"

చూట్టానికి పూర్తయినట్టే కనిపిస్తున్నా నేను కింద సంతకం పెట్టి, డేట్ వెయ్యలేదు అంటే ఆ బొమ్మ ఇంకా పూర్తి కాలేదనే. అలాంటి సంతకం చెయ్యని అరుదైన ఒకటి రెండు బొమ్మల్లో ఇది ఒకటి. ఈ బొమ్మ వేసినపుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ఉన్నాను. కానీ కాలేజి హాస్టల్లో వేసింది కాదు. నా చిన్ననాటి మా ఊరు "దామరమడుగు" లో శలవులకి "బామ్మ" దగ్గరికి వెళ్ళి ఉన్నపుడు వేసింది. నాన్న పుట్టి పెరిగిన ఊరు "దామరమడుగు".

అప్పటికి పదేళ్ళు వెనక్కి వెళ్తే అక్కడే స్థిరపడాలని నాన్న ఇష్టంగా కష్టపడి కట్టుకున్న మా కొత్త ఇంట్లో నాన్న, అమ్మ, బామ్మ, అన్న, చెల్లి, నేను అందరం కలిసి ఉన్నాము. అందమైన అసలు సిసలు తెలుగు పల్లె వాతావరణం సంతరించుకున్న ఊరు. చుట్టూ ఎటు వెళ్ళినా, ఎటు చూసినా పచ్చని పైరుపొలాలు, చల్లని పైరగాలులు. ఊరికి ఒక చివర శివాలయం, చాలా పెద్ద గాలిగోపురం, విశాలమైన మండపాలతో తమిళనాడు దేవాలయ కట్టడాల మాదిరిగానే ఉండేది. ఎదురుగా మూడు రోడ్ల కూడలి, మధ్యలో పాతిన ఆంజనేయస్వామిని చెక్కిన రాయి, ఎప్పుడూ పసుపు పూసి కుంకుమ బొట్లుతో ఉండేది. ఊరి మొదట్లో కూడా అచ్చం ఇలాంటిదే ఇంకొక రాయి ఉండేది. అప్పట్లో గ్రామ దేవతగా ఆ ఊరికి ఆంజనేయస్వామి ని పెట్టుకుని ఉంటారు. శివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకి ఒక పక్కన మా ఇల్లు. మిద్దె మీదకెక్కితే ఇంటికెదురుగా పక్కనే ఉన్న మూడంతస్తుల మిద్దెకన్నా ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆ చెట్లపైన గుంపులు గుంపులుగా తెల్లటి కొంగలు, కుడిపక్కన గాలిగోపురం, దూరంగా పచ్చని వరిపొలాలు, ఇంకా దూరంగా "కోవూరు థర్మల్ పవర్ స్టేషన్" లోని చాలా వెడలు, ఎత్తైన పేద్ద  సిమెంట్ గొట్టం, అందులోంచి లేచి మేఘాల్లో కలసిపోతున్న సన్నని పొగ, ఎంతో ఆహ్లాదంగా ఉండేది.

గట్టిగా మూడేళ్ళున్నామేమో ఆ ఊర్లో. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం కి మధ్యలో ఉంటుంది. మహాభారతం ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు దిగ్గజ కవుల్లో ఒకరైన "తిక్కన సోమయాజి" పుట్టిన ఊరు "పాటూరు" కి వెళ్ళాలంటే మా ఊరు దగ్గర బస్సు దిగి రెండు మైళ్ళు మా ఇంటిమీదుగానే పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్డులో నడచి వెళ్ళాలి. సారవంతమైన వ్యవసాయ భూమితో "మొలగొలుకులు" అనే ఒక ప్రత్యేకమైన వరి వంగడం పైరుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడ ఎక్కువమంది ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కలిసి మెలిసి జీవించే చిన్న ఊరు, అందరికీ అందరూ తెలుసు. ఊరిలో ఎక్కువగా కమ్యునిస్ట్ భావజాలం నిండి ఉండేది. ప్రాచీన కులాల ప్రాతిపదికగా హెచ్చుతగ్గులు ఇప్పటికీ ఉగ్గుపాలతో నూరిపోస్తున్న (అ)నాగరిక సమాజంలో అప్పుడే అవి లేకుండా రూపు మాపారు. బడుగు బలహీన వర్గాలనీ, చదువునీ, చదువుకున్న వాళ్ళనీ గౌరవంగా చూసేవాళ్ళు. భూస్వాముల, సంపన్నుల ఆధిపత్యం అస్సలంటే అస్సలుండేది కాదు. ఒకరకంగా పేదవాడి మాటే ఎక్కువగా చెల్లుబాటయ్యేది. ఊరి కట్టుబాట్లు అలానే పెట్టుకున్నారు. ఎవరి మధ్యనయినా వివాదాలు తలెత్తితే పోలీసులకి ఊర్లో ప్రవేశం లేదు, ఊర్లో పెద్దమనుషులే కలిసి పరిష్కరించేవాళ్ళు. ఒకరకంగా అప్పటి సమాజంలో ఆ ఊరొక "ఆధునిక మైన పల్లె". అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ "సుజాతా రావు" గారికి అందుకనే ఆ ఊరంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

నా చదువు రెండవ తరగతి నుంచి నాలుగవ తరగతి దాకా ఆ ఊరి బళ్ళోనే సాగింది. మా ఊరు నుంచి మూడు మైళ్ళు దూరం "బుచ్చిరెడ్డిపాళెం". అక్కడి హైస్కూలులో నాన్న టీచర్. రోజూ సైకిల్ మీద స్కూలుకి వెళ్ళి వస్తుండేవాడు. "జక్కా వెంకయ్య" అని అప్పట్లో కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఊరే, నాన్నకి చిన్నప్పటి ఫ్రెండ్ కూడా. ఆయన కుటుంబం వాళ్ళు కట్టించిన బడి అప్పుడు ఆ ఊర్లో ఉన్న "ప్రాధమిక పాఠశాల". ఒకటి నుంచి ఏడు తరగతుల దాకా ఉండేది. వరుసగా ఏడు రూములు, పొడుగ్గా వరండా, ప్రతి రూముకీ తలుపు, రెండు కిటికీలు, ప్రతి రెండు రూములకీ మధ్యన తలుపులేని ద్వారం. అది బడికోసమని కట్టినది కాదు, వడ్లు నిల్వచేసేందుకు కట్టిన రూములు కానీ బడికోసం ఇచ్చేశారు అనేవారు. బడి ఎదురుగా వడ్లుని బియ్యం గా ఆడించే మిషన్. మిషన్ అంటే చిన్నది కాదు మూడంతస్తుల ఎత్తులో ఒక ఫ్యాక్టరీ అంతుండేది. ఊర్లో ఉన్న రెండు వడ్ల మిషన్లలో ఇది చాలా పెద్దది. చుట్టూ ప్రహరీ గోడ, ఆనుకునే పచ్చని పొలాలు. బడి వెనకనే మల్లెపూల తోట, స్కూల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సపోటా చెట్టు, ఆ పక్కనే ఇటుకరాళ్ళ బట్టీలు. ఇవన్నీ ఇప్పుడు తల్చుకుంటే అచ్చం చందమామ పుస్తకంలోని గ్రామాల బొమ్మాల్లోలా ఉండేవి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ.

సాయంత్రం బడి అయ్యాక మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు, ఆ చుట్టు పక్కలున్న అన్ని రోడ్లూ మా పిలకాయలవే. శిరి, గిరి (అంటే శ్రీధర్, గిరిధర్...అన్న, నేను), శీనయ్య, శివకుమార్ (వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మా ఇంటి వెనకే ఇల్లు), మల్లిఖార్జున్ (ఈ మధ్యనే చనిపోయాడు), శీనడు, ప్రభాకర్ (మా చిన్నాన్న కొడుకు) మేము ఏడుగురం కలిసి ఆడని ఆట లేదు, పాడని పాటా లేదు. తెగ ఆడేవాళ్ళం. గోళీలు, బొంగరాలు, బిళ్ళంగోడు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ళలు, దొంగా పోలీస్, డిమిండాల్, గాన్లు, టైర్లు, తాటి బుర్రలు కి పుల్ల గుచ్చి పంగాలు కర్ర తో తిప్పే బళ్ళు, సబ్బు పెట్టెకి దారం కట్టి లాగే బళ్ళు, చివరికి ఇళ్ళు కట్టేందుకు తోలి పెట్టిన ఇసుక కుప్పలు తిరుపతి కొండలుగా, ఇటుక రాళ్ళని ఎక్కుతున్న బస్సులుగా వాటిపైన తిప్పేవాళ్లం. దారిలో వస్తూ పోయే ఎద్దుల బండి వెనక పట్టుకుని కాళ్ళు పైకెత్తి కోతిలా వేళ్ళాడుతూ ఆ బండాయన వెనక్కి చూసి అరిచేదాకా చాలా దూరం పోయేవాళ్లం. వర్షాకాలంలో పెద్ద వర్షం వస్తే మా ఇంటి ఎదురుగా పొంగి పొర్లే కాలువ ఊరి చివరిదాకా పారి అక్కడి పొలాల మధ్య పారే "కోవూరు కాలువ" లో కలిసేది. ఆ కాలువల వెంట కాగితం పడవలు చేసి వాటితో పరుగులు తీసేవాళ్ళం. ఇక మా ఇంటి దగ్గరున్న దేవాలయంలో అయితే చెట్లూ, మండపాలూ, గోపురాలూ, గోడలూ అన్నీ మావే. అయితే ఆ దేవాలయం గోడలు ఎక్కి ఆడే ఆటల్లోమాత్రం నాకూ అన్నకీ మిగతా పిల్లలకన్నా కొంచెం స్వేచ్ఛ తక్కువ. ఎవరైనా చూస్తే నాన్నకి చెప్తారనే భయం. కొంచెం చీకటి పడబోయే దాకా చూసి మేము ఇంటికి రాకుంటే మెల్లిగా బామ్మ బయల్దేరేది నన్నూ అన్నని వెతుక్కుంటూ, "నాయనా శిరీ, గిరీ" అని పెద్దగా పిలుస్తూ. ఆ పిలుపు వినబడితే ఇంక ఎక్కడి ఆటలు అక్కడ కట్టు, ఎక్కడి వాళ్ళం అక్కడ ఆగి ఇళ్లకి బయల్దేరేవాళ్ళం. సాయంత్రం అయితే ప్రతి ఇంట్లోనూ "దాలి" అని వేసే వాళ్ళు. దాలి అంటే ఇంటి వెనక ఒక మూల చిన్న గుంట, అందులో ఒక పెద్ద కుండ ఎప్పుడూ పెట్టే ఉండేది. సాయంత్రం అయితే చుట్టూ గడ్డి పెట్టి మంట పెడితే నీళ్ళు కాగుతూ ఉండేవి. ఊర్లో సాయంత్రం అయితే దాదాపు ప్రతి ఇంటి వెనకనుంచీ పొగ పైకి లేస్తూ ఉండేది. వేడి నీళ్ల స్నానం చేసి, ఇంట్లో వోల్టేజి తక్కువగా ఉన్న లైట్ల వెలుగులో కాసేపు చదివి, భోజనం చేసి నిద్రపోయేవాళ్లం. ఎండా కాలం అయితే మిద్దెమీద పరుపుల పక్కలు, చుక్కలు చూస్తూ బామ్మ కథలు వింటూ నిద్ర పోయేవాళ్లం. చలికాలం అయినా, లేదా వర్షం వచ్చినా వరండాలో దోమతెర కట్టిన మంచాల మీద పక్కలు.

పండగలప్పుడైతే వాతావరణం భలే ఉండేది. వినాయక చవితి అయితే పొద్దున్నే లేచి పిలకాయలం ఊరి పొలాల గట్ల వెంట వెళ్ళి తిరిగి పత్రి, గరికె, పూలూ కోసుకుని వచ్చే వాళ్ళం. అందరివీ వరి పొలాలు కావడంతో ముఖ్యంగా "సంక్రాంతి పండగ" బాగా జరుపుకునే వాళ్ళు. పొద్దున్నే నెత్తిన రాగి గిన్నె, కాషాయం బట్టలతో, విభూది, నామం దిద్దుకుని, పూల దండ వేసుకుని నారదుడి అలంకరణతో భజన చేస్తూ బియ్యం కోసం వచ్చే హరిదాసులు. బియ్యం దోసిట్లో తీసుకెళ్ళి వేసేటపుడు కిందికి వంగి కూర్చుంటే ఆ గిన్నెలో బియ్యం వెయ్యటం భలే తమాషాగా ఉండేది. ఇంకా బుట్టలు పట్టుకుని గుంపులు గుంపులుగా ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో చాలా మంది వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలుకూడా. అందరికీ ఒక బుట్టలో రెడీగా పెట్టుకున్న వడ్లు వేసే వాళ్ళం. సాయంత్రం అయితే వేషాలు వేసుకుని పాటలు, డ్యాన్సులు వేస్తూ ఇంటింటికీ వేషగాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళకి మాత్రం నిప్పట్లు (అంటే అరిసెలు), ఉప్పు చెక్కలు, బెల్లం చెక్కలు ఇవి మాత్రమే ఇవ్వాలి, ఇంకేం తీసుకోరు. రాత్రి కొంచెం పొద్దుబోయాక పెట్రొమాక్స్ లైట్స్ వెలుగు లో "కీలు గుర్రాల" ఆటలు, మా ఇల్లు దేవాలయం దగ్గర ఉండడంతో ఆ కూడలిలో వచ్చి చాలా సేపు ఆడేవాళ్ళు. వీళ్ళు ఏమీ ఆశించరు, కేవలం ప్రజలకి ఎంటర్టెయిన్మెంట్ కోసం అంతే. ఆ మూడు పండుగ రోజుల్లో  ఒకరోజు మాత్రం పొద్దు పోయాక దేవాలయం బయట స్టేజీ కట్టి డ్రామా వేసేవాళ్ళు. బాల నాగమ్మ, దుర్యోధన ఏకపాత్రాభినయం, గయోపాఖ్యానం ఇలాంటి నాటకాలు ప్రసిద్ధి. అప్పుడు మా ఇంటి ప్రహరీ గోడమీద,  మిద్దెపైనా కొంత మంది చేరేవాళ్ళు చూట్టానికి. ఎవర్నంటే వాళ్ళని బామ్మ చేరనిచ్చేది కాదు.

"బామ్మ" - దామరమడుగు అంటే గుర్తుకొచ్చే మొట్ట మొదటి వ్యక్తి బామ్మ. బామ్మ లేని మా జీవితం లేదు. మా జీవితాల్లో, ఆ ఊరితో, ఆ ఇల్లుతో అంతగా పెనవేసుకుపోయింది బామ్మ. మాకే కాదు ఊర్లో అందరికీ ఆమె బామ్మే. చిన్నా, చితకా, పిల్లా, పెద్దా అంతా "బామ్మా" అనే పిలిచేవాళ్ళు. సాయంత్రం అయితే మా ఇంటి వాకిట మెట్లమీద చేరేది. వచ్చే పోయే పిల్లా జెల్లా ఒక్కరినీ వదలకుండా, ప్రతి ఒక్కరినీ పలకరించాల్సిందే, అందర్నీ విచారించాల్సిందే. బామ్మకి గిట్టని వాళ్ళని మాత్రం పలకరించకుండా అట్టే తేరపారి చూసేది. ఎవర్నైనా పలకరిస్తే పలక్కుంటే మాత్రం విసిరే మాటల చురకలూ, ఛలోక్తులూ వాళ్ళకి సూటిగా తగలాల్సిందే. ఎవరైనా పలక్కుండా గమ్ముగా దగ్గరికొస్తే మాత్రం, "ఎవురయ్యా నువ్వా" అంటా తెలిసినా తెలియనట్టే పలకరించేది. అలా ఆ ఊర్లో అందరూ బామ్మకి పరిచయస్తులే.

ఆ ఊరు వచ్చిన రెండు మూడేళ్ళకే నాన్నకి "కావలి" ట్రాన్స్ఫర్ కావటంతో ఇల్లు, పొలం చూసుకునే పన్లు బామ్మకి అప్పగించి మేమంతా "కావలి" కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కావలికెళ్ళిన రెండేళ్ళకే అనూహ్యమైన మార్పులు జరిగి, పరీక్షలు రాసి సెలెక్ట్ అయి తొమ్మిదేళ్ళకే "ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి" లో నన్ను చేర్పించటం, ఎలాంటి దురలవాట్లూ లేని నాన్నకి గొంతు క్యాన్సర్ వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళి పోవటంతో, అందరూ ఉన్నా మాకే అండా లేని ఆ ఊర్లో, బామ్మ మా ఇల్లూ, పొలం చూసుకుంటూ వాటిని మాకోసం మా భవిష్యత్తు కోసం కాపాడుకుంటూ, చాలా ఏళ్ళు పాతబడే దాకా మా కొత్త ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది. అందుకనే మేము ప్రతి శలవులకీ "దామరమడుగు" వచ్చి కొద్ది రోజులు బామ్మ దగ్గరుండి వెళ్ళే వాళ్ళం. అప్పుడప్పుడూ బామ్మ "కావలి" వచ్చి మాతో కొద్ది రోజులు గడిపి వెళ్ళేది. 

అలా ఇంజనీరింగ్ చేస్తున్నపుడూ శలవుల్లో బామ్మ దగ్గరికి  వెళ్ళేవాడిని. అప్పటి చిన్ననాటి స్నేహితులంతా చదువుల్లోనో, ఊర్లల్లో వ్యవసాయాల్లోనో చేరి దూరమయిపోయారు. వెళ్తే ఒకరో ఇద్దరో ఇంటికొచ్చి పలకరించేవాళ్ళు. మిగిలిన రోజంతా నేనూ, అన్నా, బామ్మ, అమ్మా, సమయం ఒక మాత్రాన ముందుకి సాగేదే కాదు. రోజులు చాలా పెద్దవిగా అనిపించేవి. నేనూ అన్నా "క్యారమ్స్" ఆడే వాళ్ళం, పొలాల్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళం, రేడియోలో పాటలు వినేవాళ్ళం, బీరువా తెరిచి మా చిన్నప్పటి నాన్న గురుతులు చూసుకునే వాళ్ళం. ఎంత చేసినా ఏం చేసినా రోజు మాత్రం ముందుకి కదిలేది కాదు. అలాంటప్పుడు ఒక్కోసారి కాగితం పెన్నూ తీసుకుని బొమ్మలు మొదలుపెట్టేవాడిని. అన్న ఆ ఊరికి వచ్చే ప్రతిసారీ నెల్లూరు బస్టాండులో "సితార" లేదా "జ్యోతిచిత్ర" సినీ వారపత్రిక కొనేవాడు. దాన్నే రోజూ అటూ ఇటూ తిరగేసే వాడు. అలా అప్పటి ఒక "సితార" పత్రిక ముఖచిత్రం మీద అచ్చయిన ఇంకో సితార "భానుప్రియ" నాట్య భంగిమని చూసి వేసిన బొమ్మ ఇది. నేను బొమ్మలు వేస్తానని తెలిసి ఆ ఊర్లో ఒక పిండి మిషన్ ద్వారం గడపకీ నన్ను అడిగి ఎర్రని బొట్లు, పువ్వులు పెయింట్ వేయించుకున్నారు. మా చిన్నాన్న ఇంటి సింహద్వారానికి పసుపు రంగు మీద నాన్న వేసిన ఎర్రని తామరపువ్వులు రంగు వెలిస్తే వాటిపైన నాతో మళ్ళీ అలాగే రంగులు వేయించుకున్నారు. అప్పటికి మనం బొమ్మలు బాగా వేస్తాం అని ఊర్లో ఫ్రెండ్స్ కి, కొంతమంది బంధువులకీ తెలుసు. వాళ్ళెవరైనా వస్తే నేను వేసిన బొమ్మలు చూసేవాళ్ళు, లేదంటే మనకి మనమే ప్రేక్షకులం, అంతే.

ఈ బొమ్మ వేసిన క్షణాలూ గుర్తున్నాయి. ఊరికే సరదాగా టైమ్ పాస్ కోసం బాల్ పాయింట్ పెన్నుతో మొదలు పెట్టిన బొమ్మ. కొంచెం వేశాక బాగా వస్తుంది అనిపించటంతో అలా మొత్తం వేసుకుంటూ వెళ్ళాను, బహుశా రెండురోజులు సమయం తీస్కునుంటానేమో, కానీ కావలి కి వెళ్ళాల్సిన రోజు రావడంతో పూర్తి చెయ్యకుండా నాతో తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత పాదాల కింది భాగం పూర్తి చెయ్యనేలేదు. కొన్నేళ్ళ తర్వాత ఎప్పుడో ఒకసారి కింద పచ్చ గడ్డిలా గీసి అక్కడ మాత్రమే పచ్చని రంగు వేశాను. ఇప్పటికీ సంపూర్ణం అయ్యీ కానీ అసంపూర్ణమయిన బొమ్మ ఇది.

అయితే ఇందులో అప్పటికి కొంత పదునెక్కిన నా పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమాత్రం పెన్సిల్ వాడకుండా నేరుగా పెన్నుతో సరిదిద్దేందుకు తావు లేకుండా వేసిన బొమ్మ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి. హావభావాలే కాదు, బాడీ ప్రపోర్షన్స్ కొలిచినట్టుండాలి, అందులోనూ నాట్య భంగిమ, ఏ మాత్రం పొల్లుపోయినా విభిన్నంగా అనిపిస్తుంది. అప్పటికే పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలు పెట్టి కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాను. అందుకనేనేమో ఈ బొమ్మలోనూ ఆ చీరా షేడ్స్ కూడా పెన్నుతోనే అయినా పెయింటింగ్ ఛాయల్లోనే వేశాను.

మామూలుగా నా బొమ్మల్లో హెయిర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని. ఇందులో కూడా పెట్టాను, కానీ ఇంకా పూర్తి కాలా, ఇంకొక రౌండ్ వేస్తే కానీ పూర్తి కాదు. ఇన్నేళ్ళు పూర్తి కానిది ఇక ఎప్పటికీ కాదు. ప్రతి ఆర్టిస్ట్ వేసే బొమ్మల్లో కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతుంటాయి. కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు, కొన్ని పూర్తి కావంతే. ఈ బొమ్మ పూర్తికాకపోవటానికి కారణమేమీ లేకున్నా పూర్తి కాని అసంపూర్ణమైన ఈ బొమ్మ నాకు మాత్రం సంపూర్ణ మైనదే. ఎందుకంటే - నా చిన్ననాటి మా పల్లెటూరి వాతావరణం, మేమందరం కలిసి ఉన్న మా ఇల్లు, ఆ గాలీ, ఆ నేలా, ఆ కాలం, కాలం మోసుకెళ్ళి పోయిన ఆనాటి జ్ఞాపకాలూ, వీటన్నిటినీ ప్రతి గీతలో పదిలంగా పది కాలాలపాటు సంపూర్ణంగా పదిలపరచుకుని, దాచుకుని, చూసిన ప్రతిసారీ కొద్ది క్షణ్ణాలైనా నాకు "పునర్జన్మ" ని ప్రసాదించి కరిగి పోయిన కాలంలో ఘనీభవించి పోయిన అప్పటి తియ్యని జ్ఞాపకాలని మళ్ళీ కదిలిస్తూ, మనసుని తాకి ద్రవిస్తూ...

"అసంపూర్ణమైన పనిలోనైనా ఒదిగిన జ్ఞాపకాలు మాత్రం సంపూర్ణమే." 
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Friday, June 7, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 21 . . .

"తెలుగు వన్నెల రంగుల వెన్నెల"
Poster Colors on Paper (10" x 12")


పెయింటింగ్ లోని నిండైన "తెలుగుదనం" తెలుగు వారిట్టే గుర్తుపట్టేయగలరు. ఆ చీరకట్టు, నుదుటిన గుండ్రని బొట్టు, చందమామ వెన్నెల పడి ఆ చందమామకన్నా నిండుగ మెరిసిపోతున్న పెద్ద కళ్ళతో అందమైన "వెలుగు" లాంటి తెలుగమ్మాయి. ఈ పెయింటింగ్ కి మూలం గా నేను తీసుకున్న పెయింటింగ్ వేసిన చిత్రకారుడు "ఉత్తమ్ కుమార్". అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం స్పెషల్ సంచికల్లో విరివిగా ఇలస్ట్రేషన్స్ వేసేవారు. ఇలస్ట్రేషన్స్ అనేకన్నా "పెయింటింగ్స్" అంటేనే బెటర్. వారపత్రికలకి పూర్తి స్థాయి పెయింటింగ్స్ ఈయనకన్నా ముందు బహుశా తెలుగు లో ఒక్క "వడ్డాది పాపయ్య" గారే వేసి ఉంటారు. ఆయన తరువాత నాకు తెలిసి "ఉత్తమ్ గారు" ఆ ట్రెండ్ కొనసాగించారు. ఆయన స్ఫూర్తి గా అప్పట్లో ఆధ్రభూమి వారపత్రికలో అలా వేసిన ఇంకొక ఆర్టిస్ట్ "కళా భాస్కర్" గారు. "ఎంకి" శీర్షికన వారం వారం వేసే వారు. అవన్నీ కూడా పూర్తి స్థాయి పోస్టర్ కలర్ పెయింటింగ్సే.

ఈ పెయింటింగ్ నాకైతే చూసినపుడల్లా "ఉత్తమ్ గారు" వేసిన "బాపు ఎంకి" అనిపిస్తుంది. నిజానికి బాపు లైన్ డ్రాయింగ్స్ ఎక్కువగా వేశారు. వాటిని పెయింటింగ్స్ అని అనలేము. కానీ బాపు బొమ్మ అంత అందంగా ఒక తెలుగు అందం ఇందులో కనిపిస్తుంది.

అవి విజయవాడలో నా ఇంజనీరింగ్ కాలేజి రోజులు. పెయింటింగ్ ప్రయాణం మొదలుపెట్టి ముందుకి సాగుతూ ఉన్నాను. సాధనకై "ఆంధ్రభూమి" వారపత్రిక లోని "ఉత్తమ్ కుమార్" గారి బొమ్మలు నాకు పాఠాలయ్యాయి. నాకు "ఉత్తమ్ కుమార్" గారు ద్రోణాచార్యుడయారు. అంటే ఆయన బొమ్మల్ని చూసి శిష్యరికం మొదలుపెట్టిన "ఏకలవ్యుడిని". దొరికిన పోస్టర్ కలర్స్ తో ఒకటొకటీ వేసుకుంటూ కొంచెం కొంచెం ప్రావీణ్యం సంపాదించుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ పోతున్నాను.

ఈ బొమ్మపై సంతకం పెట్టిన తేదీ జనవరి 14, 1988. అంటే సంక్రాంతి రోజు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఉన్నాను. వేసిన చోటు, సమయం దాని వెనకున్న జ్ఞాపకాలూ ఇంకా చెక్కుచెదరకుండా మదిలో పదిలంగా అలానే ఉన్నాయి. "కావలి" లో మేము అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటిల్లు ముందు కటకటాల వరండా. అదే అప్పటి నా ఆర్ట్ స్టుడియో. ఉదయం పూట ఇంటికి ఎవరొచ్చినా నేను బహుశా బొమ్మలు వేస్తూనే ఎక్కువగా కనిపించేవాడిని. పడమర ముఖం ఇల్లు అవటంతో ఉదయం పూట చల్లగా ఉండేది. ఉదయాన్నే లేచే అలవాటుతో తొందరగా తయారయ్యి, టిఫిన్ చేసి బొమ్మలు వేస్తూ కూర్చునే వాడిని. ప్లాస్టిక్ వైర్ తో అల్లిన ఒక అల్యూమినియం ఫోల్డింగ్ కుర్చీ, ఒక పెద్ద అట్ట, ఒక మగ్గుతో నీళ్ళు, ఆరు గుండ్రటి గుంటల అరలు గా ఉన్న ప్లాస్టిక్ ప్యాలెట్, క్యామెల్ పోస్టర్ కలర్ సెట్ రంగుల బాటిల్స్...ఇదీ నా ఆర్ట్ స్టుడియో సెటప్. పెయింటింగ్స్ వేసే ముందు సెట్ చేసుకునే వాడిని. పక్కనే వాల్చిన ప్లాస్టిక్ వైర్ ఫ్రేమ్ ఫోల్డింగ్ మంచం ఎప్పుడూ వేసే ఉండేది. మధ్యలో బ్రేక్ తీసుకోవాలనిపిస్తే కాసేపు ఆ మంచంపై వాలే వాడిని.

మామూలుగా ఏ పెయింటింగ్ అయినా మొదలు పెడితే ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేసే వాడిని. ఈ పెయింటింగ్ వెయటానికి కొంచెం టైమ్ ఎక్కువ తీసుకున్నా. బహుశా మూడు నాలుగు రోజులు పట్టిందేమో. ఈ పెయింటింగ్ చూసినపుడల్లా దీని వెనుక ఒక చిన్న సంఘటన తళుక్కున మెరుస్తుంది. మొదటిరోజు ఉత్సాహం ఉరకలువేస్తూ మొదలుపెట్టాను. కొద్ది గంటల్లో ముఖం, తల, చుట్టు పక్కల కొంత భాగం వరకూ పూర్తయింది. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని వేస్తున్న పెయింటింగ్ అట్టతో సహా పక్కనున్న మంచం మీద పెట్టి లోపలికెళ్ళి నీళ్ళు తాగి వచ్చాను. వచ్చేసరికి మా పెద్దమామయ్య మూడో కూతురు, బహుశా ఐదేళ్ళ వయసుండొచ్చేమో, వచ్చి నిలబడి అక్కడున్న బాల్ పాయింట్ పెన్నుతో గీస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికెళ్ళి చూస్తే సరిగ్గా ముఖం మీద పిచ్చి సున్నాలు చుడుతూ ఉంది. అప్పటికే ఒక ఇంచ్ స్పేస్ లో ముక్కు పైన గజి బిజి సున్నాలు నాలుగైదు సార్లు గీకేసింది. ఒక్కసారిగా చూసి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను చూడగానే తుర్రున మెట్లు దిగి పక్కన ఆనుకునే ఉన్న పోర్షన్లోనే ఉండేవాళ్ళ ఇంట్లోకి పరిగెత్తి లోపలికెళ్ళి వాళ్ళమ్మ వెనక దాక్కుంది. కొట్టేంత కోపంతో అరుస్తూ వెనక పడ్డా చిక్కకుండా తప్పించుకుంది. వాళ్ళింట్లో దూరే లోపల నాకొచ్చిన కోపానికి చిక్కుంటే దెబ్బలు తప్పకుండా తినుండేది. భయపడేలా మాత్రం చాలా అరిచా. ఆ భయంకి కొద్ది రోజులు మెల్లిగా మెట్లెక్కి మా ఇంట్లో అడుగుపెట్టే ముందు నక్కి నక్కి చూసేది, నేను కనపడితే వెనక్కి తిరిగి పరిగెత్తేది. నాలుగైదు రోజుల దాకా నన్ను చూస్తే అంతే, అదే తంతు.

అప్పటికే అచ్చం ఇలాగే ఒకసారి "ఇందిరాగాంధి" గారి బొమ్మ వేస్తూ ఆపి లోపలికి వెళ్ళి వచ్చేసరికి, పెన్సిల్ తో అవుట్ లైన్ గీసుకుని బాల్ పాయింట్ పెన్నుతో నేనేస్తూ సగంలో ఆగిన బొమ్మ, మిగిలిన అవుట్ లైన్ మీద అన్న ఫ్రెండ్ "సంజీవరెడ్డి" బాల్ పాయింట్ పెన్నుతో గీసిన గీతలతో పాడయి పొయింది. దాన్నింక సరిదిద్దటం సాధ్యం కాక, అప్పటికే అదే "ఇందిరాగాంధి" గారి బొమ్మ రెండవసారి వేస్తుండటంతో బాధ, ఆక్రోశం కలిసిన కోపంలో ముక్కలుగా చించివెయ్యటం, మళ్ళీ సరిగ్గా అదే ఘటన ఈ పెయింటింగ్ కీ ఎదురవటం చాలా బాధించింది. బాధని దిగమింగి చింపేసి మళ్ళీ వేద్దామా అన్న సందిగ్ధంలో ఎందుకో మనసు మార్చుకుని పెయింటింగ్ కాబట్టి సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చెయ్యొచ్చేమో అన్న ఆలోచన రావటంతో, ప్రయోగం చేసి చూద్దామని ఆ గీసిన ముక్కు భాగం మీద వైట్ పెయింట్ వేసి మళ్ళీ దాని మీద సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చేమోనని చేసి చూశాను, పనిచేసింది. అయితే రెండు మూడు లేయర్స్ వైట్ పెయింట్ వేస్తేనే కానీ ఆ నల్లని బాల్ పెన్ గీతలు కనపడకుండా చెయ్యలేకపోయాను. పోస్టర్ కలర్స్ నిజానికి వాటర్ కలర్స్ లాగా పారదర్శకంగా ఉండవు. వాటర్ కలర్స్ అయితే ఈ ప్రయోగం సాధ్యం కాదు. అప్పుడు నాకలాంటివేవీ తెలీవు. అసలు పోస్టర్ కలర్స్ నే వాటర్ కలర్స్ అనుకుంటూ వేసుకుంటూ నేర్చుకుంటున్న రోజులు. అలా సరిదిద్దిన తర్వాత ఇంకో రెండు రోజుల్లో ఈ పెయింటింగ్ పూర్తిచెయ్యగలిగాను.

ఆ రెండు మూడేళ్ళ సాధనలో వేసిన ప్రతీ పెయింటింగ్ నాకు సరికొత్త మెళకువల పాఠాలు నేర్పింది. ఇందులో నేర్చుకున్న మొదటి మెళకువ, పెయింటింగ్ లో ఏ భాగమైనా రంగులు మార్చి సరిదిద్దాల్సి వస్తే, వైట్ పెయింట్ తో కవర్ చేసి మళ్ళీ దానిపైన సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చని. అయితే ఇది పారదర్శకం కాని పోస్టర్ కలర్స్ కనుక సాధ్యం అయ్యింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో వేసిన ఆ పసుపు ఆకాశం, ఆరెంజ్ రంగు నీళ్ళతో బ్లెండ్ అవుతూ నీళ్ళపై మెరుస్తున్న వెలుగు, నీళ్ళపై దగ్గరగా ఎగురుతున్న పక్షులు, ఫోర్ గ్రౌండ్ లో ఆ పసుపు రంగు ఆకుల కొమ్మలపై సీతాకోకచిలుకలు, ఆకాశంలో గుండ్రని నిండు చందమామ, ఇందులో రంగులన్నీ డ్రమాటిక్ గా ఉన్నవే. ఈ రంగులు అచ్చంగా "ఉత్తమ్ కుమార్" గారు వేసిన ఒరిగినల్ పెయింటింగ్ లోవే. నేనేమీ సొంతగా మార్చింది లేదు. అయితే ప్రకృతిని వేసే రంగులు సహజంగా లేకున్నా ఆ అనుభూతిని మాత్రం పెయింటింగ్ లో తెప్పించొచ్చు అన్న మరో మెళకువ నేర్చుకున్నాను. నిజానికి ఇందులో ప్రకృతి రంగులు అసహజం, అయినా చూస్తుంటే అలాంటి ఫీలింగ్ కలగదు. ఏదో వెన్నెల్లో విహరిస్తున్నట్టే అనిపిస్తుంది.

పూర్తి అయిన తర్వాత మా ఇంటికి దగ్గరే "ఒంగోల్ బస్టాండ్" దగ్గర ఫ్రేములు కట్టే షాప్ కెళ్ళి దీన్ని ఫ్రేమ్ చెయ్యమని ఇచ్చాను. అది వరకూ ఒక పెయింటింగ్ ఇక్కడే ఇస్తే బాగా చేసిచ్చాడు, గ్లాస్ ఫ్రేమ్ లోపల వెల్వెట్ క్లాత్ మీద భద్రంగా అతికించి. అయితే ఇది మాత్రం ఒక హార్డ్ అట్ట, స్కూల్ పిల్లలు క్లిప్ తో ఉండి వాడే అట్ట లాంటిది, దాని మీద అతికించి, వెనక వైపు చుట్టూ ఒక ఇంచ్ బోర్డర్ చెక్క కొట్టి గోడకి తగిలించేలా చేసిచ్చాడు. ఇది కొంచెం పెద్ద సైజ్ అందుకని అలా చేశాడేమో. నా అన్ని బొమ్మల్లాగే ఈ బొమ్మా నాతోనే ఉండేది. నాతో అమెరికా కి తెచ్చుకున్నాను. కొన్నేళ్ళ తర్వాత మంచి ఫ్రేమ్ లో పెడదామని వెనకున్న చెక్క బోర్డర్ తొలగించాను. అయితే పేపర్ మీద వేసిన పెయింటింగ్ అవటం, అదీ అట్ట మీద అతికించెయటం తో అట్ట మీది నుంచి పేపర్ ని వేరుచేయటం కుదర్లా. కాల క్రమంలో పాతబడి పై భాగం అక్కడక్కడా కాగితం కొంచెం చిరిగి పెచ్చులు గా ఊడింది. అయినా ఆ రంగుల వెన్నెల, తెలుగు వన్నెల వెలుగు మాత్రం అలానే ఉంది.

ఇప్పటికి ఎన్ని బొమ్మలేసినా, ఇంకెన్నెన్నో పెయింటింగ్స్ వేసినా మొదటి రోజుల్లో నేర్చుకుంటూ, విహరిస్తూ వేసిన ఆనాటి గతం మాత్రం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ కాలం నాటి జ్ఞాపకాల తాలూకాలూ మదిలో మెదులుతూనే ఉంటాయి. ఒక్కోక్క బొమ్మలో ఒక్కోక్క అనుభూతి, ఒక్కొక్క అనుభూతిలో ఒక్కొక్క అనుభవం. అప్పటి ఆ బొమ్మలు చూసినపుడల్లా ఆ అనుభవం, అనుభూతులతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మాత్రం వెన్నెలలో పారే సెలయేటి నీటి అలలపై దగ్గరగా వచ్చి తాకకుండా విహరించి వెళ్ళిపోయే పక్షుల్లా వచ్చి అందకుండా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయ్...

"హృదయ సాగర అలలపై ఎగిరే అందని పక్షులే అందమైన జ్ఞాపకాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

Sunday, May 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 20 ...

Poster colors on Paper 8" x 11"


పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది "వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాలం, ఆ కాలేజి లో "కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్" డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో "పెయింటింగ్" మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.

తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఏ. పి. రెసిడెన్షియల్ హైస్కూల్, కొడిగెనహళ్ళి, హిందూపురం లో విద్యాభ్యాసం. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ జూనియర్ కాలేజికి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉన్నా నిర్ణయాలు తీసుకోగలిగే బలం వయసుకింకా రాకపోవటంతో, మళ్ళీ దూరంగా రెండేళ్ళ ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ" లో చేరటం. ఆ తర్వాత ఇంజనీరింగ్ తప్పనిసరి అయి ఇంటికి దూరంగా వెళ్ళాల్సి రావటం. కొంచెం అయినా మా ఊరు "కావలి" కి దగ్గరగా ఉంటానని హైదరాబాద్ వద్దని విజయవాడ "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" ఎంచుకుని అక్కడ మొదలుపెట్టిన కాలేజి లైఫ్. ఇంజనీరింగ్ కాలేజి అనగానే ఒక్క సారిగా స్వతంత్రం, స్వేచ్ఛా వాతావరణం, కొత్త ఫ్రెండ్ షిప్స్, తక్కువ క్లాసుల సమయం, ఎక్కువ తీరిక సమయం, ఇలా ఒక్కసారిగా పెద్ద మార్పుల్లో ప్రవేశించి నిర్దేశం తెలిసీ తెలియకనే తెలుసుకునే దిశగా ఆఖరి స్టూడెంట్ దశ అది. మార్నింగ్ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్, వారంలో కొన్ని రోజులు ప్రాక్టికల్స్ ఉండవు, ఖాళీ టైమ్ ఎక్కువగా ఉండేది. వీలైతే సినిమాలు షికార్లు, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆటలు, టీవీ చూట్టం, ఇలా మొదటి సంవత్సరం కొత్త ఫ్రెండ్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాలేజి లైఫ్ తో అంతా కొత్త కొత్తగా గడచి పోయింది.

లొయోలా కాలేజి లో మంచి లైబ్రరీ ఉన్నా చాలా తక్కువగా వెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ మత్రమే ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజి లోనూ మంచి లైబ్రరీ ఉండేది. లైబ్రరీ లో హిస్టరీ, ఆర్ట్స్ పుస్తకాలున్న ఒక రూమ్ ఉండేది. వెళ్ళిన ప్రతిసారీ నేరుగా దాన్లోకే వెళ్ళి ఆర్ట్ మ్యాగజైన్స్, బుక్స్ తిరగేసి వచ్చేసేవాడిని. కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ కూడా ఉండేవి. అందులో చూసిన కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. అయితే బుక్స్ లాగా ఆ మ్యాగజైన్స్ లైబ్రరీ కార్డ్ మీద కొద్ది రోజులు తీసుకోవటానికి ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో అవి ఎక్కడ దొరుకుతాయి, వీళ్ళు ఎక్కడినించి ఎలా తెప్పించి ఉంటారు అన్న ఆలోచనతో, పుస్తకాల షాపుల వెంట వాటి కోసం నా వెదుకులాట ప్రారంభం అయ్యింది. బీసెంట్ రోడ్డు దగ్గర ఏలూరు రోడ్డు లో ఉండే "నవోదయ పబ్లికేషన్స్" బుక్ షాపులో వెతగ్గా వెతగ్గా ఒక్క రష్యన్ ఆర్ట్ పుస్తకం దొరికింది. ఈ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. అందులో చాలా గొప్ప ఆర్టిస్టులు, వాళ్ళ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అమ్మ కష్టంతో చదువుతున్న అప్పటి నా స్టూడెంట్ స్థోమతకి ఆ పుస్తకం వెల చాలా ఎక్కువ, కొనాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి చివరికి కొనేశాను. ఆ పుస్తకంలోని పెయింటింగ్స్ ని తదేకంగా పరిశీలించటంతో ఏన్ని గంటలు గడిపుంటానో లెక్కే లేదు.

ఒకసారి న్యూస్ పేపర్ లో "పింగాణి ప్లేట్స్" మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసిన ఒక విజయవాడ ఆర్టిస్ట్, ఆవిడ ఆర్ట్ షో ఒకటి ఆదివారం "ఒన్ టవున్" దగ్గర  ప్రారంభం అవుతుందని చూసి, ఆ రోజు రాగానే ఉదయాన్నే బస్సెక్కి వెళ్ళిపోయాను. గొప్ప గొప్ప యూరోపీయన్ మాస్టర్ పెయింటింగ్స్ ని అచ్చు అలాగే పింగాణి ప్లేట్స్ మీద వేశారు ఆవిడ. వేలల్లో ధర, ఏ వందో అయితే ఒకటన్నా కొనేసేవాడినేమో. చాలా దగ్గరగా పరిశీలించాను, అంత కరెక్ట్ గా ఎలా వేసి ఉంటారో అర్ధం కాలా. ఆవిడ్ని అడిగి మెటీరియల్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అక్కడే ఉండి చాలాసేపు అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ షో ప్రారంభం టైమ్ కే నేను వెళ్ళటంతో  వచ్చిన చీఫ్ గెస్ట్, మిగతా గెస్ట్స్ తోనే ఆవిడ ఉండటంతో అవకాశం రాక బస్సెక్కి నిరాశగా కాలేజీ వెళ్తున్న ఆ క్షణాలింకా గుర్తున్నాయి. అలా నా ఒంటరి ప్రయాణంలో సంగతీ సమాచారం తెలుసుకోలేని నిరాశలెన్ని ఎదురైనా "పెయింటింగ్స్" వెయ్యాలన్న ఆశ మాత్రం తగ్గలా.

రెండవ సంవత్సరంలో బుక్ షాపులన్నీ తిరిగి వెతగ్గా వెతగ్గా దొరికిన చిన్న "కేమెల్ పోస్టర్ కలర్స్" ని అవే వాటర్ కలర్ పెయింటింగ్స్ అనుకుని వాటితోనే వెయ్యటం మొదలు పెట్టాను. బహుశా ఈ పెయింటింగ్ అప్పటికి నా మూడోదో, నాలుగోదో అయి ఉండొచ్చు. నేనున్న హాస్టల్ D-14 రూమ్ లో నా పెయింటింగ్ సాధనకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టాను. ఆదివారం మధ్యాహ్నం కూర్చుని ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తూ ఉండే వాడిని. 

అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివారం సాయంత్రం నిర్మానుష్యంగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు ఫుట్ పాత్ పై పాత బుక్స్, మ్యాగజైన్స్ పెట్టి అమ్మే వాళ్ళు అని తెలిసి చాలా ఆదివారాలు పనిగట్టుకుని అంత దూరం వెళ్ళి వెతికే వాడిని. అక్కడ కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ దొరికాయి, కొన్ని కొనేశాను. వాటిల్లో ఒక మ్యాగజైన్ అట్ట వెనక పేజీ మీద అచ్చయిన ఆయిల్ పెయింటింగ్ చాలా నచ్చింది. ఆ మ్యాగజైన్ ముందు పెట్టుకుని అచ్చంగా అవే రంగుల షేడ్స్, నాకున్న ఆ ఆరు రంగులతో ఎలా తెప్పించానో నాకూ ఇప్పటికీ మిస్టరీ. ఏ రంగులో ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుందో ప్రాధమిక అవగాహన బొత్తిగా లేదు, అడిగినా చెప్పలేను, కానీ నాకు తెలీకుండానే ఏ రంగు షేడ్ చూసినా రెండు మూడు రంగులు కలిపి అచ్చం అదే షేడ్ వచ్చేసేది, అదే నాకిప్పటికీ అప్పటి మిస్టరీ. అలా దీక్షగా కూర్చుని పెయింటింగ్ వేస్తుంటే, మధ్య మధ్యలో బొమ్మలంటే కొంచెం ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, కొంత మంది మాత్రం "భలే వేస్తున్నావ్ గిరీ" అని మెచ్చుకునేవాళ్ళు.

బయట కమర్షియల్ ఆర్టిస్టులు ఎలా వేస్తారో ఏం మెటీరియల్ వాడతారో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కష్టం, వాళ్ళెక్కడుంటారో తెలుసుకునే వీలులేని రోజులవి. కనీసం కాలేజి లో సీనియర్స్, జూనియర్స్ లో ఒక్కరన్నా పెయింటింగ్స్ వేసే వాళ్ళుండకపోతారా అని కూడా చూశాను. నాలుగేళ్ళు ఏడు బాచ్ ల్లో ఒక్కరూ తారసపడలా. అప్పటికింకా ఏ మాత్రం అనుభవం లేక, సరయిన మెటీరియల్ కూడా లేక, తడబడుతూనే దొరికిన రంగులు, బ్రషులు, పేపర్ లతో మొదలుపెట్టి ముందుకి పోతూ వేస్తున్నవి నా మొదటి అడుగులే. అయినా, ఈ ఒక్క పెయింటింగ్ తో వచ్చిన స్వీయ అనుభవం మాత్రం నాకు చాలా చాలా ధైర్యాన్నిచ్చింది. పెయింటింగ్స్ ఎలా వెయ్యాలా అంటూ నాలో ఆవహిస్తున్న నిరాశనీ, అసలు వెయ్యగలనా అని చెలరేగుతున్న అనుమానాల్నీ, ఒక్కడినే నేర్చుకోగలనా అంటూ ప్రశ్నిస్తున్న అధైర్యాన్నీ పక్కకి తోసి నన్ను పట్టుకుని ముందుకి నడిపించింది కేవలం నా పట్టుదల, పట్టు వదలని దీక్ష మాత్రమే. వేసిన తర్వాత నా రూమ్ లో గోడపైన మిగిలిన వాటితో బాటు దీన్నీ అతికించాను, వెనుక నాలుగు కార్నర్స్ లో గమ్ పూసి. మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం "న్యూ హాస్టల్" లో నేనున్న రెండు రూముల్లోనూ ఈ పెయింటింగ్ గోడమీదే ఉండేది. తర్వాత ఆ కాలేజి హాస్టల్ గోడలు దాటి బయటి ప్రపంచంలోకి వచ్చిన నాతోనే ఉంటూ, నాతో బాటు ఇండియా వదిలి భద్రంగా ఇంతదూరం నాతో వచ్చేసింది. వస్తూ ఆ కాలం గురుతుల్నీ, జ్ఞాపకాలనూ మోసుకుని తెచ్చింది.

కాలేజి ఫ్రెండ్స్, అక్కడ చదివిన చదువూ, నేర్చుకున్న విజ్ఞానం, పొందిన డిగ్రీ, గడిపిన జీవితం, ఆ అనుభవాలూ ఎవరికైనా జీవితంలో ఒక మలుపు తిరిగే మైలురాయి. కాలేజి లైఫ్ లో చదువు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అందరికీ ఉండేవే. అవి పక్కన పెడితే నా "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" రోజులు మాత్రం ఎక్కువగా నిండింది బొమ్మలతోనే. ఇప్పటికీ అప్పుడప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మెయిన్ బిల్డింగ్ లో, ఇంజనీరింగ్ కాలేజి అడ్మిషన్స్ జరిగినప్పుడు, నా కొచ్చిన EAMCET ర్యాంక్ కి నా వంతు వచ్చినపుడు గవర్న్ మెంట్ కాలేజీల్లో నేనెంచుకోవటానికి మిగిలింది REC వరంగల్ లో సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. నాకు తీసుకోవటం ఇష్టంలేదు. ఇష్టంలేనపుడు వద్దు, ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా ఏ బ్రాంచ్ లోనైనా సీట్ వస్తుంది, అయితే ఫీజ్ ఎక్కువ అంటూ చెప్పారు. అప్పటికే ఇంటర్మీడియట్ లొయోలా లో చాలా డబ్బులయ్యాయి, అమ్మకి కష్టం అవుతుందని తీసుకోవటానికి సిద్ధపడ్డాను. వద్దని చిన్నమామయ్య తీసుకుని వచ్చేశాడు. తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్స్ కి అక్కడికే మళ్ళీ వచ్చిన రోజు నాకు అన్ని కాలేజీల్లో అన్ని బ్రాంచ్ ల్లోనూ ఎక్కడకావాలంటే అక్కడ తీసుకునే ఆప్షన్ ఉండింది. చిన్నమామయ్య "ఇక్కడైతే నేను దగ్గరుంటాను, చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్ తీసుకో" అని ఎంతగానో అడిగినా వద్దని "విజయవాడ" అయితే "కావలి" కి దగ్గర, రెండేళ్ళు ఇంటర్మీడియట్ అక్కడ అలవాటయ్యింది. అక్కడే కావాలని పట్టుబట్టి "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి" లో కంప్యూటర్ సైన్స్ చేరాను. అప్పుడా కాలేజిలో కంప్యూటర్ సైన్స్ మాదే మొట్ట మొదటి బ్యాచ్.

గతం తల్చుకున్నప్పుడల్లా ఇప్పటికీ అప్పుడప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది, ఒకవేళ అప్పుడు నాకున్న కాలేజి ఆప్షన్స్ లో "సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" కాకుండా చిన్నమామయ్య ఎంతగానో తీసుకోమని అడిగిన "చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్" లేదా "గీతం ఇంజనీరింగ్ కాలేజి, విశాఖపట్నం" లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరి ఉంటే ఇంజనీరింగ్ కాలేజి అనుభవం ఎలా ఉండేదో, ఎవరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళో, నా జీవితం ఎలా మలుపు తిరిగి ఉండేదో, ఆ మలుపుల్లో నా బొమ్మలు, నా పెయింటింగ్స్ అసలుండేవో లేవో, ఉండి ఉంటే ఎలా ఉండేవో అని...

"జీవిత మలుపుల్లో మనం వేసే ప్రతి అడుగూ కనపడని మన గమ్యం వైపే పడుతుంది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...