Indian Ink & water with brush on Paper, 10" x 3"
ఈ అనంత విశ్వంలో మన ప్రమేయం లేకుండా సాగిపోయే ఒక అద్భుతం - కాలం. ఇందులో "మారనిది ఇది" అంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇందులో ఇమిడిపోవాల్సిందే. ముందుకి పోతూ వెనకటితో పోలిస్తే ఎంతో కొంత మారి తీరాల్సిందే. అది జీవమైనా, సజీవమైనా, నిర్జీవమైనా. చెక్కు చెదరవు అనిపించే మనిషి జ్ఞాపకాలైనా, కాలంతో ఎంతో కొంత మారుతూ ముందుకి పోవాల్సిందే.
నిన్నటి జ్ఞాపకం ఓ పదేళ్ళ తర్వాత నిన్నటిలా అనిపించదు. పాతబడే కొద్దీ తియ్యని జ్ఞాపకం మరింత తియ్యగా అనిపించొచ్చు, చేదు జ్ఞాపకం లో చేదు కాస్తయినా తగ్గిపోనూవచ్చు. మొన్న, నిన్నటి కొత్త, సరికొత్త అనుభవాల జ్ఞాపకాల ప్రభావం పరస్పరం ఒకదానిపై ఒకటి ఎంతో కొంత తప్పకుండా ఉండే తీరుతుంది.
నిశ్చల నీటిలో పయనించే పడవ ముందుకి సాగుతూ పోయే కొద్దీ, ఆ పడవ తాకిడికి కొత్తగా పుట్టే అలలు ఆ పడవని తోస్తూ, ముందుకి పోనిస్తూ అవి వెనక్కి పోతూ పాత అలలతో కలిసి కనుమరుగవుతూ నిశ్చలమయిపోతూ ఉంటాయి. అలాగే ముందుకి సాగే జీవితం అనే పడవలో ప్రతి అనుభవం ఒక అల లాంటి అనుభూతి అయి మనల్ని ముందుకి నడిపి అది వెనక్కి వెళ్ళి నిశ్చలమైపోయి ఒక జ్ఞాపకంగా మిగిలి పోతుంది. మనల్ని ముందుకి నడిపించే ప్రతి అనుభూతీ, కాలంలో మరుగై ఒక జ్ఞాపకమై కనుమరుగై పోయినా, కొన్ని జ్ఞాపకాల ఉనికి మాత్రం కళ్ళముందు సజీవంగా ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళముందున్నా, కనుమరుగైనా మనసులో మాత్రం అప్పుడప్పుడూ అలల్లా మెదులుతూ కనిపించకనే కనిపించే జ్ఞాపకాలే జీవితం తిరిగుతూ చేరే తీరాలకి తిరిగిన మలుపులు. ఈ విశ్వం అనే మహాసాగరంలో పయనించే ఒక పడవ మన జీవితం అయితే, ఆ పడవలో సుదూర తీరాలకి పయనించేది మనం, మనతో ప్రయాణించే మన అనుభవాలూ, మన జ్ఞాపకాలూ.
నా బొమ్మల నదీ ప్రవాహంలో నేను సాగించిన పయనం, ఆ పయనంలో పుట్టిన ప్రతి బొమ్మా నను ముందుకి నడిపిన అలలా కనుమరుగైనా, నా కళ్ళముందు ఇప్పటికీ సజీవంగా నిలిచిన మరిచిపో(లే)ని ఒక తియ్యని జ్ఞాపకమే. నేను వేసిన అన్ని బొమ్మల్లో ఇలాంటి బొమ్మ ఇదొక్కటే కావటం ఈ బొమ్మ ప్రత్యేకత.
సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ఉన్నపుడు మొదలయ్యింది నా సరికొత్త బొమ్మల ఉత్సాహాల ప్రవాహం. ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మల ప్రవాహంలో పయనిస్తూనే ఉన్నా, ఇక్కడ ఉత్సాహంగా మొదలు పెట్టిన ఆ ప్రవాహం మాత్రం కొత్త నదీ ప్రవాహంలో సరికొత్త పడవలా కొత్త కొత్త పుంతలు తొక్కింది. ఆ బొమ్మల ప్రవాహంలో నను ముందుకి నడిపిన అలల్లో ఒకానొక మొదటి అల(జడి) తాకిడి జ్ఞాపకం ఈ బొమ్మ.
అప్పటిదాకా ఇలా కూడా బ్రష్ తో బొమ్మలు వెయ్యొచ్చు అని తెలీదు. కాలేజి లైబ్రరీ లో ఒక బుక్ రాక్ లో ఒక్క అర లో మాత్రం కొద్దిపాటి ఆర్ట్ బుక్స్, మ్యాగజైన్స్ ఉండేవి. ఇంజనీరింగ్ కాలేజి లైబ్రరీలో ఆర్ట్ పుస్తకాలుండటం నాకప్పట్లో కొంచెం ఆశ్చర్యం అనిపించినా, ఆ పుస్తకాల్ని ఎవరూ కదిలించిన దాఖలాలు లేకపోవటం ఆశ్చర్యం అనిపించ లేదు. లైబ్రరీకి ఎప్పుడెళ్ళినా ఎవరూ కదిలించని ఆ బుక్ రాక్ దగ్గరికెళ్ళి ఆ పుస్తకాలు తిరగేసేవాడిని. అందులో ఒక బుక్ నా రూముకి తెచ్చుకున్నా. అందులో ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్, బహుశా చార్ కోల్ తో వేసింది అనుకుంటా, సరిగా గుర్తు లేదు, ఆ బొమ్మ బాగా ఆకట్టుకుంది. చాలా ఫాస్ట్ స్ట్రోక్స్ తో వేసిన బొమ్మ అది. ఒక లేక్ మధ్యలో చిన్న దీవిలా అనిపించే చోట ఒక చిన్న ఇల్లు, పక్కన పెద్ద చెట్లు, పొదలు తో తక్కువ గీతల్లో ఎక్కువ ఊహల్ని రేకెత్తించే బొమ్మది. దాన్ని చూసి ఇండియన్ ఇంక్ లో ముంచిన బ్రష్ తో సాగిన పడవ ప్రయాణమే ఈ పెయింటింగ్. ఇది పెయింటింగ్ లా అనిపించకున్నా దీన్ని పెయింటింగ్ అనే అనాలి. ఎందుకంటే పూర్తిగా బ్రష్ తోనే వేసింది కాబట్టి. ఇండియన్ ఇంక్ కి నీళ్ళు కలిపి పలుచబడ్డ రంగుని ఆకాశం కీ నీటి కీ పెయింటింగ్ లో లా అద్దిన తీరూ ఇందులో గమనించొచ్చు.
ఈ బొమ్మని నిశితంగా పరిశీలిస్తే అందులోని ప్రతి చిన్న గీతా, కాలంలో ఒదిగి చలించే పెద్ద పెద్ద నిశ్చల జీవాల్ని తనలో ఒదిగేలా చేసుకుంది. ముక్కలు ముక్కలుగా అంటీ అంటనట్టున్న గీతలు ఒకదాని పక్కన ఒకటి కలిసి అవి కలిగించే చలనంలో కదిలే చెట్లూ, వాటి ప్రతిబింబాలను తమపై కదిలించే అలలూ, ఆ అలలపై పయనించే పడవా, ఆ పడవలో ముందుకి సాగే ప్రయాణం. ఇవన్నీ కలిసి ఒక్కటైన దృశ్యం.
ఈ ప్రక్రియంతా ఒక రెండు మూడు మైళ్ళ కనుచూపు మేర కనిపించే దృశ్యాన్ని ఐదారు ఇంచిల సైజ్ పేపర్ మీద సన్నని బ్రష్ ని కొద్ది పాటి ఇంక్ లో ముంచి, చేతి వేళ్ళ చలనం నింపుకున్న రేఖల్తో వేసి పరిగెత్తే కాలాన్ని బొమ్మగా కట్టి బంధించ(గలగ)టం. అందుకేనేమో దీన్ని "చిత్రకళ" అన్నారు. అయితే అది కలో, కళో కూడా తెలియని అప్పటి నా బొమ్మల పయనం లో ఒంటరిగా సాగించిన ప్రయాణం నాది. ఆ బొమ్మల ప్రయాణంలో సునాయాసంగా సరస్సుల పై ఆహ్లాదంగా సాగే పయనం లా కొన్ని బొమ్మలు అలవోకగా వెయ్యగలిగిన అందమైన అనుభూతులూ, గిర్రున తిరిగే సుడిగుండాల లోతుల్లో చిక్కుకుని కొట్టుకులాడి గంటలకొద్దీ పడ్డ కష్టానికి ఫలితం రాక ముందుకి పోలేక అక్కడనే నిలబడిపోయిన పరిస్థితులూ, వేగంగా ప్రవహించే నదీ ప్రవాహంలో మరింత వేగంగా ముందుకి నడిచిన అనుభూతులూ, ఒక్కోసారి ప్రవాహానికి ఎదురీదలేక అలసి ఓడి వెనక్కి తోసివేయబడ్డి విసుగూ నిరాశా ఆవహించిన క్షణాలూ అనేకానేకం.
వేసే ప్రతి బొమ్మా ఉత్సాహంగా ఒక ప్రవాహాన మొదలయే పడవ ప్రయాణమే. మొదలుపెట్టినపుడు ఆ పడవ ప్రయాణం ఎలా ముందుకి సాగుతుందో తెలియని సందిగ్ధమే. ముగిశాకే అర్ధమయ్యేది అది సునాయాసమో, ప్రయాసో, నిరాసో, నిస్పృహో. ముప్పైఎనిమిదేళ్ళనాటి ఆ(నాటి) ప్రయాణం లో నేను చేరిన ఒక అందమైన తీరం ఈ బొమ్మ.
గీత గీశాక అది నిశ్చలనంగా మారినా అది గీసే ప్రక్రియలో ఆర్టిస్ట్ చేతి చలనం మారబోయే ఆ నిశ్చలనంలో ఇమిడిపోయి ఎప్పటికీ చలిస్తూ కనిపిస్తూ చూపరులను కదిలిస్తూ ఉండటం గమనార్హం. ఈ బొమ్మలో అలాంటి నిశ్చల చలనాలు ప్రతి బ్రష్ స్ట్రోకులోనూ, ప్రతి రేఖలోనూ ఉన్నాయి.
శక్తిని సృష్టించలేం, అలాగే నాశనం కూడా చేయలేం, కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మాత్రమే మార్చగలం. ఇది భౌతిక శాస్త్ర నియమం. ఈ శాస్త్రీయ సృష్టి నియమం ఒక కళాకారుడి చేతివేళ్ళ కొసల నుంచి పుట్టే శక్తికీ వర్తిస్తుంది. హృదయంలో పుట్టే అతి సున్నితమైన ఆ శక్తిని చేతి వేళ్ళ కొసలదాకా పట్టి తీసుకునొచ్చి తనదైన రీతిలో కదలాడే ఊహల అలలపై సాగించే పడవ యానమే బొమ్మల ప్రయాణం. తీరం కానరాని ఆ పడవ ప్రయాణంలో ఒక కళాకారుడు చేరుకున్న కళా తీరాలే కదిలించే కదలని బొమ్మలు...
"తీరం కానరాని పడవ ప్రయాణంలో ఒక కళాకారుడు చేరుకున్న తీరాలే కదిలించే కదలని బొమ్మలు."
~ గిరిధర్ పొట్టేపాళెం
~~ ** ~~ ** ~~
("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)
నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...