Friday, February 7, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 28 . . .

 
Padma Bhushan Shobana - Autographed Sketch
Classical Dancer & Indian Actress 
Pencil on paper (11" x 14")

గిర్రున తిరగే కాలం ఎవరికోసమూ ఒక్క క్షణం కూడా ఆగదు. కాలంతో అనుక్షణమూ అలుపెరుగని పరుగే జీవితం. ఆగని కాలం పరుగు లాగే మన పరుగు నీ ఆపలేం, కానీ కొన్ని క్షణాలని మాత్రం పట్టి మన మదిలో బంధించి ఆపుకోగలం. మదిలో బంధీ అయిన అలాంటి క్షణాలే కాలక్రమేణా జ్ఞాపకాలై గాలుల్లా వీస్తూ అప్పుడప్పుడూ మదిలో సడి, సందడి చేస్తూ, ఒక్కొకప్పుడు అలజడి రేపుతూ ఉంటాయి. కాలంలో కలిసి కరిగి కనుమరుగయినా ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటాయి.

చికాగో లో ఐదేళ్ళున్నాం. సిటీ నుంచి అరగంట దూరంలో సబర్బ్స్, నేపర్ విల్ టవున్ లో ఉన్న ఒక సంవత్సరం లో ఎప్పటికీ మర్చిపోలేని మూడు అద్భుత జ్ఞాపకాలు మదిలో ఇప్పటికీ అద్భుతంగా నిలబడి పోయాయి. అందులో ఒకటి "శోభన" గారు అరోరా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో "సాంప్రదాయ" అన్న టైటిల్ తో చేసిన మూడు గంటల నృత్య రూపకం. నేపర్ విల్ లో మేముంటున్న అపార్ట్మెంట్స్ నుంచి పదిహేను నిమిషాల డ్రైవింగ్ దూరంలోనే ఉండేది టెంపుల్. కాబట్టి తరచూ వెళ్ళేవాళ్ళం. చాలా ప్రశాంతమైన ప్రాంగణం, విశాలంగా చూడ చక్కని టెంపుల్. అక్కడి పూజార్లు ఎక్కువగా తమిళం వాళ్ళు. హారతి, పూజలు, అర్చనలు అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా చేసేవాళ్ళు. మా రెండవ అబ్బాయి "భువన్" అన్నప్రాసన కూడా అక్కడే చేయించాం. "భువన్" పుట్టినపుడు అమ్మ వచ్చి మాతో ఉన్న కొద్ది నెలలు అమ్మని తీసుకెళ్ళిన అతి కొద్ది ప్రదేశాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. అలా ఆ టెంపుల్ లో చాలా జ్ఞాపకాలున్నాయి.

దీపావళి సెలెబ్రేషన్స్ ఆ టెంపుల్ లో బాగా చేసేవాళ్ళు. ప్రత్యేక పూజలతోబాటు సాయంత్రం చీకటి పడ్డాక టెంపుల్ బయట ఫైర్ వర్క్స్ కూడా ఉండేవి. అంతే కాకుండా ఆ ప్రాంగణంలో  "దీపావళి టపాసులు" కొని కూడా కాల్చుకోవచ్చు. 2003 దీపావళి సాయంత్రం "శోభన" గారి ప్రత్యేక సాంప్రదాయ నృత్యం ఉందని తెలిసి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం. నిజానికి నాకప్పుడు "శోభన" గారు కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ గా మాత్రమే తెలుసు. గొప్ప డ్యాన్సర్ అని తెలీదు. డ్యాన్స్ అంటే నాకున్న ఇష్టంతో హైదరబాద్ లో DGP (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఆఫీస్ లో పని చేస్తున్నపుడు ఎదురుగానే ఉండే "రవీంద్ర భారతి" లో అప్పుడప్పుడూ ఆఫీస్ అయ్యాక సాయంత్రం ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూస్తుండేవాడిని. అంతకు మించి ప్రొఫెషనల్ కళాకారుల డ్యాన్స్ ఎపుడూ చూడ్లేదు.

సాయంత్రం 7 గంటల ప్రోగ్రామ్ కి ఆరోజు మధ్యాహ్నం 4 కల్లా రెడీ అయి కూర్చున్న నాకు మదిలో తళుక్కున మెదిలిన ఆలోచన- "శోభన" గారి బొమ్మ వేసి తీసుకెళ్ళి వీలైతే కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటేనో. ఆలోచనే తడవుగా అప్పటికప్పుడు కూర్చుని ఆ ప్రోగ్రామ్ పాంప్లెట్ మీద ప్రింట్ అయిన బ్లాక్ అండ్ వైట్ నృత్య భంగిమ నే చూసి ఈ బొమ్మ గబ గబా పెన్సిల్ తో వేశాను. కాలేజ్ డేస్ లో నా బొమ్మల ప్రస్థానం వాటర్ కలర్ పెయింటింగ్స్ దాకా వచ్చి, ప్రొఫెషనల్ లైఫ్ తో ఒక పదేళ్ళు బొమ్మలు వేయటంలో గ్యాప్ వచ్చి ఆగినా, అడపా దడపా అప్పుడప్పుడూ ఏవో బొమ్మలు గీస్తూనే ఉండేవాడిని. అయితే అప్పటికి గత కొన్నేళ్ళుగా సీరియస్ గా బొమ్మలు వేసిందయితే లేదు. పెయింటింగ్స్ లాంటివి వేసేందుకు నా దగ్గర సరయిన మెటీరియల్ కూడా అప్పుడు లేకపోవటంతో పెన్సిల్ తోనే అప్పుడప్పుడూ ఏవో గీసేవాడిని.

అలా వేసిన ఆ బొమ్మని మాతో తీసుకెళ్ళాను. టెంపుల్ కింద బేస్ మెంట్ లో ఉన్న హాల్ లో ప్రోగ్రామ్. అన్ని సీట్స్ ఫుల్ అయ్యాయి. లైట్స్ ఆఫ్ అయ్యాక "శోభన" గారు స్టేజ్ మీదికొచ్చి తను చేస్తున్న నృత్యం గురించి ఇంగ్లీష్ లోనే వివరిస్తూ చాలా చక్కగా మాట్లాడారు. మాట్లాడిన తీరు చాలా ఆకట్టుకుంది. ఇంకా డ్యాన్స్ చూడలేదు, ఒక సినిమా హీరోయిన్ గా నాకు తెలిసిన "శోభన" గారు అంతకన్నా ఇంకేదో ఎక్కువ అని మాత్రం అప్పుడే గ్రహించాను. ప్రోగ్రామ్ ముందు ఎవ్వరూ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తియ్యొద్దని చాలా స్ట్రిక్ట్ గా "శోభన" గారే నొక్కి మరీ మరీ  చెప్పారు, కారణం ఏకాగ్రత దెబ్బతింటుందనీ, చేస్తున్న నృత్యానికి న్యాయం చెయ్యలేమనీ వివరించి మరీ చెప్పారు. "సాగర సంగమం" లో "ఓం నమః శివాయ" పాట గుర్తొచ్చింది. ఫొటోస్ తియ్యాలని SLR కెమెరా, వీడియో కూడా తియ్యాలని క్యామ్ కార్డర్ తీసుకెళ్ళాను. అంతగా చెప్పాక ఇక వాటికి బయటికి తీసే సాహసం చెయ్యలేదు. నేనే కాదు ఎవ్వరూ చెయ్యలేదు.

మూడు గంటల పాటు ఏకధాటిన మధ్యలో నాలుగైదు నృత్యం బ్రేక్స్ లో తరువాతి రూపకం ని వివరిస్తూ, ఆ ప్రోగ్రామ్ లో ప్రధాన నృత్యకారిణీ ఆమే అయిన "శోభన" గారే స్టేజి మీద వక్త, అంతా తనే అయ్యి నిశ్శబ్ధ వాతావణం సృష్టించి ఎంతో గొప్పగా చేసి అలరించి, చివర్లో అందరి కరతాళధ్వనులతో  మెప్పించారు. ఆఖర్న ఆ నృత్యరూపకం డిజైన్ చేసింది కూడా తనే అని చెప్పటం తో, "ఇంత గొప్ప నృత్య కళాకారిణి యా" అన్న నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఒక్క "రుద్రవీణ" లో తప్ప ఇంకే సినిమాలో "శోభన" గారు నృత్యం పెద్దగా చూసిన గుర్తులేదు. ఏ తెలుగు సినిమాలో కూడా చెయ్యలేదు. కమెర్షియల్ సినిమాలపైపు పరుగెడుతున్న 1980 దశకం లో ఆమె నటించిన సినిమాలు, బహుశా ఏ డైరెక్టర్ ఆ కోణంలో ఆమెతో సబ్జెక్ట్ చెయ్యలేదు, చేసుంటే బాగుండేది అనిపించింది. ప్రోగ్రామ్ అయ్యాక అప్పటికే రాత్రి 10 కావటంతో హాల్ అంతా ఖాళీ అయిపోయింది. స్టేజి మీద "శోభన" గారు, తనతో నృత్యం చేసిన డ్యాన్సర్స్ ట్రూప్ మాత్రమే మిగిలారు. అంతా మూడు గంటల నృత్యంతో చాలా అలసిపోయి ఉన్నారు, "ఆకలి గా ఉంది" అని తోటి కళాకారిణులతో "శోభన" గారు మాట్లాడటం వినిపించింది. తపటాయిస్తూనే బొమ్మ తీసుకుని స్టేజి మీదికెళ్ళి పలకరించి, బొమ్మ చూపించి ఆటోగ్రాఫ్ కోసం అడిగాను. చూసి "ఇది నేనేనా, చాలా బాగుంది" అంటూ పెన్ తో ఆటోగ్రాఫ్ చేశారు. మా ఆవిడ, పిల్లల్తో ఒక ఫొటో కూడా తీశాను. ఆ రోజలా చేసిన నృత్యరూపకం తో "శోభన" గారు "సినీ హీరోయిన్" గా కాక "ఒక గొప్ప నృత్య కళాకారిణి" గానే నాకెప్పటికీ గుర్తుండిపోయారు.

తర్వాత అదే టెంపుల్ లో ఒకసారి గాన కోకిల "సుశీల" గారి ప్రోగ్రామ్ ఉందంటే టికెట్స్ కొనుక్కుని వెళ్ళాం. లైవ్ లో "సుశీల" గారి కంఠం వినటం చాలా బాగా అనిపించినా, ఒకటీ అరా తప్ప ఎక్కువ తమిళం పాటలే పాడి తమిళం లోనే మాట్లాడ్టం నాకెందుకో కొంచెం మనసుకి కష్టంగా అనిపించింది. ప్రోగ్రామ్ అయ్యాక కలిసి పలకరించాము, అయితే "సుశీల" గారి బొమ్మ వేసి తీసుకెళ్ళలేకపోయాను, అయినా బయట కార్ లో నా స్కెచ్ బుక్ ఉండటం గుర్తొచ్చి, వెళ్ళి తీసుకొచ్చి అందులో ఒక ఖాళీ పేజి లో ఆటోగ్రాఫ్ అడిగాను. బుక్, పెన్ కూడా చేతిలోకి తీసుకుని "తెల్ల కాగితం మీద నేను పెట్టను" అని ఇచ్చేశారు. బిత్తరపోయి "వేరే పేజీలు చూపించి, ఇది నేను బొమ్మలు వేసే స్కెచ్ బుక్, మీ బొమ్మ వెయ్యలేకపోయాను, ఈ పేజి లో పెడితే ఆటోగ్రాఫ్ తో ఉండే మీ బొమ్మ వేద్దామని" అన్నాను. "భలే వారే మీరు, తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకుని నా అస్తి అంతా రాయించేసుకుందామనా, నేను పెట్టను గాక పెట్టను" అని మరింత కఠినంగా అన్నారు. ఆ మాటతో నా మనసు మూగబోయింది, మది చిన్నబోయింది. అయినా, అప్పుడు జేబులో ఉన్న ప్రోగ్రామ్ టికెట్ ముక్క తీసి దాని మీద పెట్టమని అడిగితే పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజి లో ఉన్నపుడు మేము అనుకునే ఒక మాట జ్ఞాపం గుర్తొచ్చింది- ఎక్కడో ఎప్పుడో ఇలానే ఇళయరాజా గారిని కొంచెం కఠినంగా ఏదో అన్నారని అందుకే తర్వాత సుశీల గారితో పాడించటం మానేశారనీ - జ్ఞాపకం వచ్చి నిట్టూర్పు నవ్వుతో వెనుదిరిగాను. ఆ టికెట్ ముక్క మీద పెట్టిన ఆమె సంతకం ఎక్కడ పడి పోయిందో, నా దగ్గరైతే ని(వి)లువ లేదు.

అదే టెంపుల్ లో ఒకసారి NTR కాలం నాటి నటీమణి "రాజసులోచన" గారినీ కలిశాం. పక్కనే నిలబడ్డ మమ్మల్ని ఆవిడే పలకరించి మాట్లాడారు. నేనైతే గుర్తు పట్టలేదు, ఆవిడ చెప్పేదాకా. ఇప్పుడు చికాగోలోనే వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉంటున్నానని చెప్పారు. తర్వాత రెండు మూడు సార్లు అలానే టెంపుల్ లోనే కలిశారు, కలిసినప్పుడల్లా మమ్మల్ని గుర్తుపెట్టుకుని చాలా ఆప్యాయంగా పలకరించేవారు.

అలానే ఒకసారి మరో టెంపుల్ లో సినీ హీరో "సుమన్" గారిని ఒక తెలుగు పండగ ఫంక్షన్ లో కలిశాం. పిల్లల్ని దగ్గరికి తీస్తూ చాలా బాగా మాట్లాడారు. ఇంకా "S.P. బాలు" గారినీ, "S.P. శైలజ" గారినీ, "మల్లిఖార్జున్, పూర్ణిమ" గార్లనూ చికాగో లో వాళ్ళు నిర్వహించిన ఒక మ్యూజికల్ కన్సర్ట్ లో కలిసిన అనుభూతి చాలా తియ్యనిది. ఆ తియ్యని భావాలన్నీ "బాలు" గారి దీవెనలతో సంతకం పెట్టిన, అప్పటి బాలు గారి బొమ్మ వెలుగుని చూస్తూ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడితేనే బాగుంటుంది. ఇలా సెలెబ్రిటీస్ ని ఇండియా లో కలవాలంటే అంత సులభం కాదు. అక్కడి అధిక జనాభా తో అంత అందుబాటులోకి రారు.

చికాగో లో ఉన్న ఆ కొద్ది కాలంలో మూడు అనుభూతులు మాత్రం ముచ్చటగా ఎంతో గొప్పగా మదిలో అలానే నిలిచి పోయాయి. ఒకటి "బాలు గారి మ్యూజికల్ కన్సర్ట్", రెండు "శోభన గారి నృత్యం",  మూడు అపుడే ఆవిష్కరించిన అద్భుతమైన శిల్పకళా కట్టడం, ప్రపంచ ఎనిమిదవ వింత అని చిచాగో న్యూస్ పేపర్స్ సైతం కొనియాడిన "BAPS, శ్రీ స్వామి నారాయణ టెంపుల్". ఈ మూడు కళ్ళారా చూసి స్వయానా పొందిన అనుభూతులు కలకాలం తియ్యగా, నా మదిలో అద్భుతాలుగా మిలిగి పోయాయి.

ఈ మధ్య "శోభన" గారిని భారత ప్రభుత్వం ఏటా కొందరిని ఎంపిక జేసి రిపబ్లిక్ డే నాడు ప్రకటించి బహూకరించే అతున్నత పురస్కారాల్లో ఒకటైన "పద్మ భూషణ్" వరించిందని తెలిసి చాలా సంతోషం వేసింది. నాట్య కళకే అంకితం అయిన ఆవిడ ఇప్పుడు డ్యాన్స్ స్కూల్ నడుపుతూ ప్రపంచం అంతటా వివిధ నృత్యరూపకాల ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. అలాంటి "నాట్య మయూరి" కి "పద్మ భూషణ్" పురస్కారం వచ్చి ఆ పురస్కారాని కే వన్నె తెచ్చినట్టయ్యింది. అంత గొప్ప కళాకారిణి బొమ్మ వెయ్యటం, ఆమెని కలవటం, ఆ బొమ్మ మీద ఆటోగ్రాఫ్ అంతా ఒక గొప్ప వరం. తర్వాత పన్నెండేళ్ళకి "శోభన" గారి నృత్యం ఫొటో ఆధారంగా ఒక వాటర్ కలర్ పెయింటింగ్ వేశాను. "బోస్టన్" లో ఒక "ఇండియన్ క్లాసికల్ మ్యూజికల్ ఫెస్టివల్" లో కొంతమంది ఇండియన్ ఆర్టిస్ట్ లము కలసి పెట్టిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ఒక కళాభిమాని చూసిందే తడవుగా మెచ్చుకుని "చెక్ బుక్" తీసి, పెట్టిన వెల రాసి, భద్రంగా ప్యాక్ చెయించుకుని పట్టుకుపోయారు.

ఐదేళ్ళపాటు చికాగో నుంచి బోస్టన్ వచ్చేయవలసి వచ్చింది. వచ్చే ముందు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పెద్దదిగా విస్తరణ చేస్తూ చేపట్టిన విరాళాల సమీకరణలో, రెండొందల డాలర్స్ డొనేషన్ కి ఒక ఇటుక రాయిపైన మనం ఇచ్చిన పేర్లు రాసి ఒక చోట చిరస్థాయిగా నిలబడి ఉండే కట్టడంలో నా వంతు భాగం అయ్యాను. మా చిన్నపుడే మమ్మల్ని వీడి వెళ్ళిపోయిన "నాన్న రామచంద్రయ్య, చెల్లెలు లక్ష్మి" ల తోబాటు, మాకోసమే పుట్టి తన జీవితం మాకోసమే అంకితం చేసిన "బామ్మ" పేర్ల మీద ఇచ్చి "బోస్టన్" వచ్చేశాము.

ఇప్పటికి 20 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడచిపోయింది, మళ్ళీ ఇంతవరకూ "చికాగో" కి వెళ్ళనే లేదు, వెళ్తే టెంపుల్ కి వెళ్ళి ఆ రాయి మీద అక్షరాలు చేతుల్తో తాకి చూడాలనీ, అక్కడే "శోభన" గారి డ్యాన్స్ చూసిన ఆ అనుభూతిని, ఇప్పుడు మన మధ్య లేని "రాజ సులోచన" గారి పలకరింపుల్నీ, మళ్ళీ ఆ నేలపైన గుర్తుచేసుకోవాలనీ మాత్రం బలంగా మదిలో చాలా కాలంగా ఉంది. కాలం ఆ అవకాశం ఎప్పుడు ఇస్తుందో అని ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా ఇవ్వలేదు, కానీ ఇస్తుంది అని మాత్రం తెలుసు. ఎప్పుడో, ఎలాగో అన్నది మాత్రం ఆ కాలానికే తెలుసు...

"మనోనిశ్చయం ముందు కాలం తలవంచక తప్పదు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

అప్పటి "శోభన" గారి ప్రోగ్రామ్ ప్రకటన...
----------------------------------------------------------------------------------------------------------------
Sri Venkateswara Swami (Balaji) temple, Aurora, IL & The Chicago Tamil Sangam 
Jointly Present
A Grand Diwali Program
"SAMPRADAYA"
A Live Musical Dance Ballet
By
SHOBANA
Saturday, Oct 25 At 7:00 PM
At the Temple Auditorium
Donors & Patrons : $100, $50 (Seats Closer to the Stage)
General Seating: $25 and $15
----------------------------------------------------------------------------------------------------------------

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

No comments:

Post a Comment