"శ్రీ రామ చంద్రుడు"
Oil on Canvas - 24" x36" (2' x 3')
ఊహ తెలిశాక నాన్న వేసిన మూడు శ్రీరామ చంద్రుని బొమ్మలు రోజూ మా ఇంట్లో చూస్తూనే పెరిగాను. తన పన్నెండేళ్ళ వయసులో నాన్న పుట్టిన ఊరు "దామరమడుగు" లో పెరిగిన ఇంట్లో మిద్దెమీద నున్నటి తెల్లని సున్నపు గోడమీద రంగులతో చిత్రించిన బాణం పట్టుకుని ఫ్రేమ్ లో ఇమిడి చక్కగా నిలబడి ఉన్న "కోదండ రాముడు" మొదటిది. అదే గోడపైన పక్కనే రెండవది రంగుల చిత్రం, చెట్టుకింద "సీతారాములు", ఎదురుగా బంగారు లేడి ని చూపిస్తూ పట్టి తెచ్చి ఇమ్మని చెయ్యి చూపెట్టి అడుగుతున్న సీత. మూడవది నాన్న B.Ed Training చేసిన కాలేజి "Vijaya Teachers College, Bangalore" లో ఉన్నపుడు ఆ కాలేజి మ్యాగజైన్ ముఖచిత్రం కోసం వేసిన ఇంట్లో ఫ్రేమ్ కట్టించి ఉన్న "సీతారాములు" పోర్ట్రెయిట్. ఈ మూడు బొమ్మల ప్రభావం పోర్ట్రెయిట్ అంటే ఇలానే వెయ్యాలి అనేంతగా నా బొమ్మల్లో ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది.
ఆధునిక భావాలున్న నాన్న కి దేవుడంటే నమ్మకం ఉండేది కాదు. అయినా వేసిన కొద్ది బొమ్మల్లో "శ్రీరాముడు" బొమ్మలే ఎక్కువ ఉండటం విశేషం. నాన్న పేరు "రామచంద్రయ్య", బహుశా ఆ పేరు ప్రభావం నాన్న మీద ఉండి ఉండొచ్చు.
చిన్నపుడు "బుచ్చిరెడ్డిపాళెం" లో నాన్న హైస్కూలు టీచర్ గా ఉన్నపుడు మేము ఎక్కువగా వెళ్ళిన చాలా సువిశాలమైన పెద్ద దేవాలయం "శ్రీ కోదండ రామాలయం". ఆ దేవాలయం తిరునాళ్ళు అప్పట్లో చాలా గొప్పగా జరిగేవి. నా నాలుగేళ్ళ వయసులో చూసిన "తెప్పోత్సవం" రాత్రి కోనేరు చుట్టూ చేరిన ఆ జనం మధ్య కోనేటి నీళ్ళల్లో "తెప్ప" మీద ఉత్సవం ఇంకా గుర్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలప్పుడు పది రోజులపాటు రోజూ వేకువ ఝామున ఊరేగింపు వచ్చే రాముడి ని మా చిన్నపుడు మమ్మల్ని నిద్రలేపి రోడ్డు మీదికి తీసుకెళ్ళి చూపించి మా కళ్ళకి హారతి అద్దిన మా "బామ్మ" చేతి మీద "శ్రీ రాములు" అన్న పచ్చబొట్టు అక్షరాలూ ఇంకా గుర్తున్నాయి. చిన్నపుడు ఎప్పుడూ బామ్మ చెయ్యి చూసి, బామ్మా నీకు కృష్ణుడంటే ఇష్టం కదా అయితే "శ్రీ రాములు" అని ఎందుకు పచ్చబొట్టు వెయ్యించుకున్నావ్ అని అడిగేవాళ్ళం. రామాయణ ఇతిహాసం "బామ్మ" చెప్పిన కథల్లో ఊ కొడుతూ విన్నాం. ఇప్పటి తరం కి ఆ ఇతిహాసాలు తెలీవు, కథలుగా చెప్పే బామ్మలూ లేరు, ఉన్నా వాళ్ళ దగ్గర పెరిగే వీలూ లేదు. భారతీయ ఇతిహాసాల్లోని మహావీరులకన్నా పాశ్చాత్య కామిక్ బొమ్మల వీరులే బాగా పరిచయమైపోయారు.
భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో "శ్రీ రాముడు" ని ఆదిపురుషుడు గానూ పిలుస్తారు, కొలుస్తారు. ఈమధ్య వచ్చిన పాశ్చాత్య కామిక్ ప్రభావంతో వచ్చి మెప్పించలేకపోయిన "ఆదిపురుష్" సినిమా ప్రభావంతో వేసిన పెయింటింగ్ మాత్రం కాదిది. దాదాపు రెండేళ్ళ క్రితం ఒక పేరు తెలియని శిల్పి చేతిలో చెక్కబడ్డ "శ్రీరాముడు" చెక్క శిల్పం బొమ్మ ఆధారంగా మొదలుపెట్టిన ఈ "శ్రీ రామ చంద్రుడు" ని ఇప్పటికి పూర్తి చెయ్యగలిగాను.
అన్నిటికన్నా మిన్నగా ఈ పెయింటింగ్ కి నేను పెట్టుకున్న పేరు, నాన్న పేరూ రెండూ ఒక్కటే - "శ్రీ రామ చంద్రుడు"!
No comments:
Post a Comment