Watercolors on Paper |
సినిమా అంటే ఇలానే ఉండాలి అన్న రూలేం లేదు. కానీ సినిమా ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా తియ్యొచ్చా అని ఆలోచింపజేసే సినిమా "కేరాఫ్ కంచరపాలెం".
"అనుభూతి" అన్న పదం తెలుగు సినిమా మర్చిపోయి చాలా కాలమే అయ్యింది. ఈమధ్య అడపా దడపా కొన్ని సినిమాలు వచ్చినా, అవీన్నీ పెద్ద పెద్ద నటులతోనో, పెద్ద పెద్ద డైరెక్టర్లతోనో ఇంకేవేవో కమర్షియల్ హంగులు దిద్దుకునే వచ్చాయి. కానీ "కేరాఫ్ కంచరపాలెం" మాత్రం ఇవేవీ ఇసుమంతైనా లేని, సినిమా ఫార్ములా ని తిరగరాసే సినిమాగా తెలుగులో నిలిచిపోయే "గొప్ప" సినిమా.
ఇలాంటి సినిమాలు తెలుగులో రాలేదని చెప్పలేం, వచ్చాయి, ఒకప్పుడు వస్తూ ఉండేవి, నిన్నమొన్నటి తరం డైరెక్టర్లు ఎందరో గొప్ప అనుభూతిని మిగిల్చే సినిమాలు తీశారు. కానీ ఈ సినిమా మాత్రం అన్నిటికన్నా ప్రత్యేకం. తీసుకున్న కధనం, దాన్ని తెరపైకెక్కించిన వైనం, నటీ నటులు, టెక్నీషియన్స్ ఇలా అన్నీ నిజంగానే అద్భుతం. అంతకు మించి 150 నిమిషాలపాటు ఒక ఊరిలో అన్ని పాత్రలచుట్టూ మనల్నీ పరిభ్రమింపజేస్తూ, ఆ పాత్రలతో ఆ ఊరిలో మనమూ ఒకరమైపోయేంతగా మనల్ని కట్టిపడేసి మామూలుగా మొదలై, మెల్లి మెల్లిగా ఎన్నో భావోద్వేగాలకి గురిచేస్తూ చివరికి ఒక గొప్ప అనుభూతితో మనల్ని బయటికి తీసుకురావటం ఈ సినిమా గొప్పతనం. వచ్చాకా కొన్ని రోజులవరకైనా అందులోని పాత్రలు మనల్నీ మన ఆలోచనల్నీ తమ చుట్టూనే తిప్పుకోవటం మరీ అద్భుతం.
"ఏయ్ సుందరం, నీ చొక్కా చాలా బావుంది, రాణీ రంగు నాకు చాలా ఇష్టం" లాంటి మాటలతో ఇద్దరి చిన్నపిల్లల మధ్య ప్రేమ నుంచీ, టీనేజి, మధ్య వయసూ, యాభై దగ్గరలో ప్రేమలలోని వ్యత్యాసాలనూ ఒక ఊరిలో జరిగిన నాలుగు జంటలమధ్య చూపిస్తూ మనల్ని కాసేపు ఒక్కో జంట వెంబడి నడిపిస్తూ వారితో ఆ ఊరిలోకి తీసుకెళ్ళి మనమూ వారందరితోనే ఉంటూ వారి భావోద్వేగాలు పంచుకుంటూ ఎన్నెన్నో అనుభూతులకి గురిచేస్తూ, రెండున్నర గంటల్లోనే ఒక జీవితాన్ని పూర్తిగా చూసిన అనుభూతినివ్వగలగటం ఈ సినిమా ప్రత్యేకత. ఎందరో చెప్పినట్టుగానే రెండు సార్లు చూసి, రెండు రాకాల అనుభూతుల్ని పొందటం ఈ సినిమా మరో ప్రత్యేకత. మన చుట్టూ ఉన్న మనుషులనే, మనం రోజూ చూసే లాంటి పరిసరాలనే ఈ సినిమాలో తెరపై చూస్తూ అందంగా, ఆనందంగా ఫీల్ అయ్యాక, ఒక సారి ఆలోచిస్తే మనం నిజంగానే సహజత్వాన్ని మరిచి జీవిస్తున్నామా అన్న ఆలోచనా ఈ సినిమాతో కలగక మానదు. చెప్పకనే ఎన్నో మానవ విలువల్నీ ఇందులో ఎంతో సహజంగానూ, మరెంతో గొప్పగానూ చెప్తూ చూపెట్టారు.
ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే, ప్రతి క్యారెక్టరూ ప్రశంశించదగ్గదే. డైరెక్టర్ ఆలోచనా ప్రతిభనీ, ముందుకొచ్చిన నిర్మాతనీ కొనియాడక తప్పదు. డైరెక్టర్ ఆలోచన్లని యధాతదంగా స్వేచ్ఛగా తీయనిస్తే ఇలాంటి సినిమాలు తప్పక వస్తాయి. సినిమా అనే గొప్ప కళని కొద్దిమంది కట్టడి చేస్తూ దాని దారీ తెన్నూ మార్చేసి, సినిమా గొప్పతనాన్ని కోట్లల్లో కొలిచే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా వచ్చి అందరి కళ్ళూ తెరిపించటం శుభపరిణామం. కానీ ఈ పరిణామం ఎంతవరకూ నిలుస్తుందీ అన్నది వేచి చూడాలి. నిస్సంకోచంగా ఇది డైరెక్టర్ సినిమా. కానీ ఆ డైరెక్టర్ ని ఇప్పుడే కోట్ల కొద్దీ ఆఫర్లిచ్చి క్యూలు కట్టి వేలిచూపుతో సుమోలూ, రైళ్ళూ, విమానాలూ, ర్యాకెట్లూ తిప్పే హీరోల్ని పెట్టి వారికున్న ట్యాలెంట్ ని మట్టిపాలు చేయరని ఆశిద్దాం.
సినిమా చివర్లో టైటిల్స్ తోబాటు వచ్చే, ఈ సినిమా లోని క్యారెక్టర్లనే ఓ ఆర్టిస్ట్ గీసిన బొమ్మలు కూడా అద్భుతం. కళని కళ్ళతోనే కాక మనసుతోనూ చూడగలిగే కళాస్ఫూర్తి ఉంటే నిస్సంకోచంగా "కేరాఫ్ కంచరపాలెం" ఒక అద్భుతమైన కళా చిత్రం!
Details
Title: C/O Kancherapalem
Mediums: Ink and Watercolors on Paper
Inspiration: A great Telugu Movie, Passion for Arts...
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper
పాప నవ్వును సజీవంగా వేసారు.
ReplyDeleteబావుందీ.
థ్యాంక్స్ అండీ. ఒక నిమిషం టైం వెచ్చించి మీ అభిప్రాయం చెప్పినందుకు మరో మారు ధన్యవాదాలు.
Deleteమీ కొటేషన్ కోసం చూస్తూంటాను ప్రతీ సారీ
ReplyDeleteబాగుంటాయి.
ఇలా ఒకరైనా నా బ్లాగుని చూసి అభిప్రాయం చెప్తున్నందుకు చాలా సంతోషం. ఈ పోస్ట్ పై "కొటేషన్" అవసరం లేకపోయింది...
Delete