కొల్లేరు సరస్సు
Ink on cheap Notebook Paper (11" x 14")
అప్పట్లో వెయ్యలన్న తపనే నా "పెయింటింగ్ స్టుడియో"! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే నా పెయింటింగ్ ఫర్నీచర్లు. Bril ఇంకు బుడ్డి, అదే ఇంకు బుడ్డీ మూత (ఇదే నా ప్యాలెట్టు), మగ్గుతో నీళ్ళు...ఇవి పక్కన పెట్టుకుని కూర్చుని బ్రష్షు పట్టుకుంటే గంటలకొద్దీ దీక్షలోకెళ్ళినట్టే, ఇక లేచే పనేలేదు.
అప్పుడిలా ఎక్కువగా వేసిన పెయింటింగ్స్ అన్నీ పొద్దున 9గం నుంచి మధ్యాహ్నం 2గం లోపు వేసినవే. అమ్మ స్కూలుకి, అన్నేమో కాలేజి కో లేదా ఫ్రెండ్స్ అనో వెళ్లటం...ఎప్పుడన్నా మధ్యాహ్నం కొనసాగించాల్సి వస్తే నేనూ, నా పెయింటింగ్ స్టుడియో "నారాయణవ్వ తాటాకుల పూరి గుడిశ" కి షిఫ్ట్ అయ్యేవాళ్లం.
ఈ పెయింటింగ్ "ఆంధ్రభూమి న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ సంచిక" లో వచ్చిన "కొల్లేరు సరస్సు కలర్ ఫొటో" ఆధారంగా వేసింది. పెన్సిల్ గానీ, స్కేలు గానీ వాడకూడదు, అవి వాడితే ఆర్టిస్ట్ కాదు అన్న "పెద్ద అపోహ" ప్రస్ఫుటంగా ఇందులో కనిపిస్తుంది. బోర్డర్ లైన్స్ కూడా ఏ స్కేలో, రూళ్లకర్రో ఆధారం లేకుండా బ్రష్ తోనే వెయ్యాలన్న అర్ధం లేనిదే అయినా, వృధా కా(రా)ని ప్రయత్నం.
ఇక ఇందులో చెప్పుకోటానికి ఒక్కటంటే ఒక్క టెక్నిక్ కూడా లేదు, అప్పుడు టెక్నిక్కులే తెలీవు, తెలిసినా అసలా నాసిరకం పేపరు మీద టెక్నిక్కులకి తావేలేదు. మధ్య మధ్యలో లేచి దూరం నుంచి ఒక చూపు చూస్తే ఎలా వస్తుందో కరెక్ట్ గా తెలిసిపోతుంది, సవరణలేమైనా ఉంటే చేసుకోవచ్చు లాంటి "టాప్ సీక్రెట్ లు" కూడా ఉంటాయనీ తెలీదు. తెలిసిందల్లా కింది పెదవిని పంటితో నొక్కి పెట్టి, చెరిపే వీలు లేని ఒక్కొక్క బ్రష్ స్ట్రోక్ జాగ్రత్తగా వేసుకుంటూ పోటమే. బొమ్మయ్యాక అందులో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కొలతా కొలిచినట్టు కరెక్ట్ గా ఉండాలి, పక్కవాటితో చక్కగా ఇమడాలి, లేదంటే పూర్తి బొమ్మ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుందీ అని సరిపెట్టుకోటానికి మనమంత మాడ్రన్ ఆర్టిస్ట్ కాదు, మనది మాడ్రన్ ఆర్టూ కాదు ;)
ఏదేమైనా అప్పట్లో మాత్రం "భలే ఏసేన్రా" అని నాకు నన్ను వెన్నుతట్టుకుని ప్రోత్సహించుకుని ముందుకి అడుగులేసిన నా పెయింటింగ్ బొమ్మల్లో చాలా సంతృప్తిని ఇచ్చిన వాటిలో ఇదీ ఒకటి. ఈ పెయింటింగ్ నాకెంతగా నచ్చిందంటే, తర్వాత మళ్ళీ దీన్నే కొంచెం బెటర్ అనిపించే మందమైన పేపర్ మీద వేశాను. అయితే పేపర్ కాస్త మెరుగే అయినా నాసిరకం రంగుల్లో మళ్ళీ ఈ బొమ్మనే రిపీట్ చేశాను.
అలా నేను వేసేది పెయింటింగో కాదో కూడా తెలీకుండానే వేసుకుంటూ వెళ్ళిన బాటలో ఒంటరిగా నడుచుకుంటూ ముందుకెళ్ళాను. అందుకేనేమో ఇన్నేళ్ళయినా వెనక్కితిరిగి చూస్తే వేసిన ప్రతి అడుగూ చెక్కుచెదకుండా స్పష్టంగా మనసుకి కనిపిస్తుంది.
"మనం చేసే పనిపైన ధ్యాసే ముఖ్యమైతే దాని ఫలితం ఎప్పటికీ అబ్బురమే."
- గిరిధర్ పొట్టేపాళెం
Details
Reference: A color photo published in Andhra Bhoomi Newspaper Sunday special
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 11" x 14" (28 cm x 36 cm)
Signed & Dated: Jan 7, 1986