(బాలల దినోత్సవం సందర్భంగా తెలుగు పై తెలుగు'వాడి' గా నా భావాలు కొన్ని...)
|
అందమైన "బాపు" తెలుగు అక్షరాలు, అ ఆ లు... |
నాకు ఊహ తెలిశాక ప్రభుత్వ పాఠశాలలని పట్టించుకునే ప్రయత్న దిశగా అడుగులేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఊహ తెలీక ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడూ శ్రీ
పి.వి.నరసింహారావు గారి హయాం లో రాయలసీమలో వెలిసి, పల్లెల్లోని బీద, మధ్యతరగతి పిల్లల్ని మాత్రమే ఎంచుకుని వాళ్ళని రత్నాలుగా తీర్చిదిద్ది, మన రాష్ట్రంలోనే ఓ గొప్ప పాఠశాలగా రెండు దశాబ్దాలపాటు తెలుగు వెలుగుల్ని ప్రపంచం అన్నిదిశలా విరజిల్లి, విరాజిల్లిన పాఠశాల "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం" విద్యార్ధి గా నాకు ఈనాటికీ ఒకింత గర్వంగానే ఉంటుంది.
పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివి, తరువాత ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయొలా కాలేజ్, విజయవాడ" లో ఇంగ్లిష్ మీడియం లో ఉత్సాహంగా చేరినప్పుడు మొదటి సంవత్సరం మార్కులకై చేసిన కృషి అంతా ఇంతా కాదు. Physics, Chemistry లో ప్రతి పాఠం ఒకటికి పది సార్లు చదవాల్సి వచ్చేది, ఐదు సార్లు అర్ధం చేసుకోవటానికి, మరో ఐదు సార్లు అర్ధం అయ్యిన వాక్యాల్ని ఇంగ్లీష్ లో అలాగే గుర్తుపెట్టుకోవటానికి. రెండవ సంవత్సరం వచ్చేసరికి ఇంగ్లీష్ లో అలవాటయిపోయి చాలా సులభంగా అనిపించేది. ఇక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ లో Physics, Chemistry నల్లేరు మీద నత్త నడకే అయిపోయింది. కానీ ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం లో చదివి, ఇంజనీరింగ్ కి వచ్చిన మిత్రులు నేను ఇంటర్ లో పడ్డ కష్టం మొదటి సంవత్సరంలో పడటం చూశాను. ఒక గంట చదివి నేను పరీక్షకి సిద్ధం అయితే, పాపం పది గంటల కష్టం వాళ్ళు పడేవాళ్ళు.
మాతృభాష గొప్పతనం, ఆ భాష ని నేర్చుకుని దాన్ని మాట్లాడుతూ, చదువుతూ, వీలైనంతలో రాస్తూ దాన్ని ప్రేమించటంలో, గౌరవించటంలోనూ ఉంది. నేర్చుకునే ప్రతి విషయమూ ఆ భాషలోనే నేర్చుకుంటేనే క్షుణ్ణంగా వస్తుంది అనుకోవటం ఉత్త "అవివేకం". ప్రతి వ్యక్తీ పెద్దచదువులు చదివి ప్రపంచంలో అందరితో ధీటుగా ముందుకెళ్ళాలి, లేదంటే మనుగడ కష్టం అన్న కాలమిది. దీనికి పునాది పాఠశాలల్లోనే గట్టిగా పడాలి. ఈ పునాదికి భాషా బేధం లేదు, భాష అడ్డూ కాదు. కానీ పై చదువులు ఒక్కసారిగా వేరే భాషలో చదవాల్సి వచ్చినపుడు తప్పకుండా ఆ పునాదికి "భాష" అడ్డుపడుతుంది, కష్టపెడుతుంది. ఈ కష్టం పునాది లోనే పడితే అది మరింతగా గట్టిగా ఉంటుంది. చైనా, జపానుల్తో మనల్నీ, మన పాఠశాలల్నీ పోల్చుకోవద్దు, బ్రిటీషువాళ్ళ ఏలుబడిలో 200 యేళ్ళు వాళ్ళూ ఉండి ఉంటే, వారి భాషాపరిస్థితీ ఈరోజు భిన్నంగా ఉండేది.
ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు "నిరుపేద"ల పాఠశాలలుగా మాత్రమే మిగిలిపోయాయి. వాటిని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో వచ్చే మంచి మార్పులని ఆహ్వానిద్దాం. మధ్యతరగతి, దిగువమధ్య తరగతి, పేదవాళ్ళు సైతం బోలెడు డబ్బులు పోసి తెలుగుని పూర్తిగా వదిలేసిన ప్రైవేటు పాఠశాలల్లో విద్యని "కొనుక్కుని" ఇంగ్లీష్ లో నేర్చుకుంటున్నారు. తెలుగు ని బ్రతికించాల్సింది పేదవాడి గుడిశల్లో కాదు. తెలుగు అనే సబ్జక్ట్ లేకుండా చేసి, అది మాటలాడితేనే ఫైన్లు వేస్తూ, భావితరాలకి అందకుండా చేసి చంపేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లోనే దాన్ని బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆలోచించి సరైనా మార్పులు, చేర్పులు సూచిద్దాం. భాషాభి వృద్ధికై సూచనలు చేయటానికి మేధావులు, అనుభవం లేని "రాజకీయ" నాయకులూ అఖ్ఖరలేదు. ఆలోచనాపరులు, అనుభవజ్ఞులూ కావాలి. తెలుగు మీడియం లో ప్రాధమిక విద్య చదివి, నేర్చిన జ్ఞానం ఇంగ్లీష్ భాషలో పై చదువులు చదివాక ఎంతగా, మరింతగా వృద్ధి చెందిందో...అదే ఇంగ్లీష్ జ్ఞానం, ఆ భాషపైన పట్టూ ప్రాధమిక విద్యలోనూ పొంది ఉంటే, పై చదువుల్లో ఇంకెంతగా రాణించి ఉండేవారో అనుభవంతో నేర్చుకున్న వ్యక్తులందరూ అర్హులే.
నా అలోచనల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే, అభివృద్ధి బాటవైపు (మరి)కొన్ని సూచనలు:
- ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ పాఠశాల్ల్లోనూ ఒకటవ తరగతి నుంచి, పదవతరగతి వరకూ "తెలుగు" సబ్జెక్ట్ ని తప్పనిసరి చెయ్యండి.
- తెలుగు ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తూనే దాని అభివృద్ధి పైనా దృష్టి ని మరింతగా పెంచండి. తెలుగు భాషపైన పట్టు వచ్చేలా పాఠాలని సంస్కరించండి. వీలైతే ఒక్క తెలుగు సబ్జెక్ట్ లోనే పాస్ మార్కులు 35 నుంచి 50 కి పెంచుతూ దాని ప్రాముఖ్యాన్నీ, ప్రమాణాన్నీ పెంచండి.
- పదవ తరగతి లో 95 కి పైగా తెలుగు లో మార్కులు సాధించిన విద్యార్ధి ఇంటర్మీడియట్ లోనూ తెలుగు భాషని సబ్జెక్ట్ గా ఎంచుకుంటే, ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఏ కాలేజి లో చేరినా ఫీజ్ లేకుండా చెయ్యండి. ఇంకా దరిదాపుల్లో కూడా ఉండనంత ఎక్కువ మోతాదులో స్కాలర్ షిప్ లాంటివి ప్రవేశ పెట్టండి. 99 పైగా మార్కులు వస్తే ఆ గుర్తింపు ఏ డిగ్రీ లో చేరినా వర్తించేలా విస్తరించండి.
- తెలుగు భాషని బోధించే అధ్యాపకులకి, మాతృభాష ని బ్రతికిస్తూ భావితరాలకి అందిస్తున్నందుకు అందరి ఉపాధ్యాయులకన్నా ఎక్కువ జీతం ఇచ్చి భాషతోబాటుగా, బోధకులనీ గౌరవించండీ, ప్రోత్సహించండీ. మాతృభాష బోధించేందుకు మంచి ఉపాధ్యాయులు పోటీ పడేలా ఉత్సాహభరితమైన వాతావరణం కల్పించండి.
- తెలుగు భాషా దినోత్సవాన్ని ఒక వారం కి పొడిగిస్తూ, "తెలుగు వారోత్సవ పండుగ" గా ప్రకటిస్తూ, మరే ప్రభుత్వమూ ఇక ఆ వారాన్ని మార్చే వీలు లేకుండా చట్టం చెయ్యండి. ఆ వారమంతా బడిబడి లోనూ, ఇంటింటా, ఊరూరా "తెలుగు వారోత్సవాలు" నడపండి. తెలుగు భాష ఉనికి దశదిశలా విస్తరించేలా ప్రతి తెలుగువాడూ గర్వపడేలా "భాషా పండుగ" అన్న కొత్త ఒరవడికి నాంది పలకండి, మనం ఇతరుల్ని చూసి నేర్చుకున్న మదర్స్ డే, ఫాదర్శ్ డే లాగా, ఇతరులు మనల్ని చూసి నేర్చుకునేలాగా. భాషాసంస్కృతుల్లో సంస్కృతికెలాగూ వీధి వీధినా గుళ్ళూ, సంవత్సరంలో బోలెడు పండుగలు ఉండనే ఉన్నాయి. భాష ని బ్రతికించేందుకు అలాటి పండుగ అవసరం ఆసన్నమయ్యింది.
తెలుగు భాషని బ్రతికించాలని తాపత్రయపడే భాషాభిమానులంతా మంచి సూచనలూ, సలహాలూ చెయ్యండి. తెలుగులో నే బయాలజీ చదువుకోవాలని ఉన్న విద్యార్ధికి ఆ వెసులుబాటు కల్పించండి అన్న అర్ధం లేని వాదన వ్యర్ధం. మనం జీవిస్తున్నది 2019 లో, 1919 కాదన్నది గుర్తించాలి. మేము తెలుగులోనే చదివాం, మేమెదగలేదా అన్న వాదనలోనూ 2019 లో పసలేదు. ఒకప్పుడున్న పోరాట వేదిక ఇప్పుడున్న అంతర్జాతీయ వేదికంత విశాలంగా లేదు. అప్పుడు ఆ వేదికనెక్కిన అందరూ ఆ వేదికపై రాణించారు. ఇప్పుడు ఆ వేదిక చేరాలంటేనే ఆ ప్రమాణాలతో పోటీ పడదగ్గ పునాది పడాలి, అది మరింత గట్టిగా పడాలి. ఆ పునాది ప్రాధమిక పాఠశాలల్లోనే సాధ్యం. దీనికి "అంతర్జాతీయ భాష" దోహదమైతే, మార్గం మరింత సులభం.
మాతృభాషని బ్రతికిస్తూనే, ప్రభుత్వ కళాశాలల్లానే అందరూ ప్రభుత్వ పాఠశాలల కై పోటీ పడేలా వాటిని తీర్చిదిద్దే ఏ చిన్న ప్రయత్నాన్నైనా స్వాగతించండి, హర్షించండి.
పేదల బ్రతుకుల్లో నింపాల్సింది "తెలుగు" ని కాదు, "వెలుగు" ని. ఆ "వెలుగు" ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వం ఉచితంగా అందించే "చదువు" మాత్రమే.
"వివేకంతో కూడిన చదువును మించిన 'వెలుగు' లేదీలోకంలో!" - గిరిధర్ పొట్టేపాళెం