Showing posts with label GiriQuotes. Show all posts
Showing posts with label GiriQuotes. Show all posts

Saturday, March 5, 2022

"పిన్ని" - "అమ్మ" తర్వాత అంతటి కమ్మదనం, ఆప్యాయత నింపుకున్న తెలుగు పదం...

నా వాళ్లందరితో చాలా ఏళ్ళ తరువాత నేను జరుపుకున్న
నా పుట్టినరోజు కి "పిన్ని" శుభాకాంక్షలు, 2017

ఊహ తెలిసిన నాటి నుంచీ ఆ పిలుపూ ఆప్యాయతా మాకెంతో దగ్గరగానే ఉన్నాయి, పిన్ని రూపంలో. అప్పుడు నాకు బహుశా ఆరేళ్ళు. అయినా ఇంకా బాగా గుర్తుంది. "చీరాల" లో తాతయ్య తహసిల్దారు (అంటే ఒక తాలూకా కి హెడ్) గా ఉన్నారు. శలవులకి మేము దామరమడుగు నుంచి బయల్దేరి నెల్లూరులో రైలెక్కి సంబరంగా చీరాల చేరాం. "పిన్ని" ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరం కొద్ది గంటలు అటూ ఇటుగా చీరాల చేరుకున్నాం.

ఆ శలవులకి చీరాల చేరినరోజునే మధ్యాహ్నం, ఎప్పుడూ ఆటల్తో చలాకీగా ఉండే నేను కదలకుండా పడుకునే ఉన్నాను. నా వళ్ళు కాలిపోతుండటం చిన్నమామయ్య మొదటిగా గుర్తించాడు. ఇంట్లో అమ్మ, పిన్ని, అమ్మమ్మ, చిన్నమామయ్య, పిల్లలం మాత్రమే ఉన్నాం...ఇంతవరకే గుర్తుంది.

తర్వాతి రోజు కళ్ళుతెరిచి చూస్తే అమ్మ, పిన్ని ఇద్దరితో నేను హాస్పిటల్ లో ఒక రూమ్ లో, గంట గంటకీ వచ్చిపోయే డాక్టర్లు నర్సులు, బెడ్ దిగకూడదు. నాకిష్టం లేని పాలు గడగడా తాగెయ్యాలి, ఇంకెవరైనా అయితే ఈ ఒక్క మాట మాత్రం అస్సలు వినేవాడిని కాదు. కానీ చెప్పింది "పిన్ని". కాబట్టే గడగడా తాగేసేవాడిని. నాకు టైఫాయిడ్ జ్వరం అనీ, ఒక పదీఇరవై రోజులు చెప్పినట్టు వింటే తగ్గిపోయి ఇంటికెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చనీ "పిన్ని" చెప్తేనే తెలిసింది.

అప్పుడు అమ్మతో అన్నిరోజులూ అక్కడ మాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ త్వరగా కోలుకునేలా చూసుకుంది "పిన్ని". తర్వాత తెలిసింది నేను స్పృహలేకుండా వళ్ళు కాలిపోతూ పడుకుని మన స్మారకంలో లేకుండా ఉంటే అమ్మ ఏడుస్తూ దేవుడింట్లోకెళ్ళి పడిపోయిందని, అప్పుడు "పిన్ని" ఒక్కటే ధైర్యంగా పరుగున నన్ను భుజాన వేసుకుని ఇంట్లో ఉన్న ఒక జవాన్ (అప్పట్లో కనీసం ఒకరిద్దరు బంట్రోతులు తహసిల్దారు ఇంట్లో విధిగా రోజూ ఉండేవారు, ఏవైనా పనుల సాయంకోసం. ఒక జీప్ కూడా ఉండేది) సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి చేర్చిందని. ఆలశ్యం అయితే ఏమయ్యేదో ఊహకే అందని ఆలోచన అని. నా జ్ఞాపకాల్లో "పిన్ని" తో నా మొట్టమొదటి జ్ఞాపకం ఇదే. తన అక్కకే కే కాదు, మా ఫ్యామిలీ లో అక్కరకురాని ఎవరికి ఏ ఆపద వచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడేది "పిన్ని".

నాన్న పోయాక, నెల్లూరు లో ఉంటున్న "పిన్ని" శలవులకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతో బాగా చూసుకునేది. ఒకసారి పిల్లలనందరినీ రిక్షాల్లో నెల్లూరు , కనకమహల్ లో "రామదండు" సినిమా కి తీసుకెళ్ళింది. అప్పుడు పిల్లలం, మమ్మల్నందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. సినిమా చూసి రిక్షాల్లో ఇంటికి వెళ్తూ మేమూ పిన్ని తో "రామదండు" లోని పిల్లల్లా ఫీల్ అవుతూ సంబరపడిపోయిన ఆ రోజు ఇప్పటికీ కళ్ళకి కట్టిన అందని "అందని జ్ఞాపకమే".

నేను రెసిడెన్షియల్ స్కూల్ నుంచి శలవులకి వచ్చి వెళ్ళేప్పుడు ప్రతిసారీ కావలి నుంచి బస్ దిగి నెల్లూరులో సాయంత్రం పిన్ని దగ్గరికెళ్ళి కాసేపు ఉండి భోజనం చేసి రాత్రి బస్ అనంతపూర్ కి వెళ్ళటం పరిపాటి. ఇలా చాలా సార్లు వెళ్ళిన జ్ఞాపకం. నేను 8 వ తరగతికి వచ్చే సరికి పిన్ని వాళ్ళూ కావలికొచ్చి స్థిరపడిపోయారు. ఇక అప్పటి నుంచీ శలవుల్లో నాలుగైదురోజులకొకసారి పిన్ని దగ్గరికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. శలవుల్లో అందరం కలిసి అప్పుడప్పుడూ "దామరమడుగు" వెళ్ళి "బామ్మ" తో గడిపే వాళ్ళం. అలా "కావలి" లో ఒకే ఊర్లో అందరం కలీసి పెరిగిన జ్ఞాపకాల్లో "పిన్ని" లేని సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 

"పిన్ని" గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ వెనకే ఎక్కువగా గుర్తుకొచ్చే సంఘటన ఒకటి -
నేను "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5th క్లాస్ నుంచి 10th దాకా ఆరేళ్ళు చదివాను. కొంతమంది స్నేహితులకి వాళ్ళ తలిదండ్రులు అప్పుడప్పుడూ వచ్చి, బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చిచ్చి, ఒకపూట ఉండి, అన్నీ చూసుకుని మరీ వెళ్ళేవాళ్ళు. ఆ ఆరేళ్ళలో ఎప్పుడూ ఎవ్వరూ నన్ను చూట్టానికి రాలేదు. నాన్న బ్రతికుంటే ఎన్నోసార్లు తప్పకుండా వచ్చి ఉండేవాడు. అమ్మకి అంత అండదండలు లేవు, అన్న నాకన్నా ఒక్క సంవత్సరమే పెద్ద.

కానీ ఒకరోజు నాకోసం వెతుక్కుని మరీ ఒకాయనొచ్చాడు. ఆయనెవరో నాకు తెలీదు, ఎప్పుడూ చూడనైనాలేదు. అప్పుడు 9th క్లాస్ లో ఉన్నాననుకుంటా. సాయంత్రం గేమ్స్ పీరియడ్ అయ్యాక వాళ్ళనడిగీ వీళ్ళనడిగి నా రూమ్ కనుక్కుని వచ్చి నన్ను కలిశాడు. "నేను నీకు మామయ్యని అవుతాను. పిన్ని పంపింది, చూసి రమ్మని" అని రెండు "క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్" ఇచ్చాడు. నాకు అంతుబట్టలేదు. ఎవరైనా పొరబాటున ఇంకొక పిల్లోడి కోసం వచ్చి నాకిచ్చిపోయాడా ఈయనెవరో నేనెప్పుడూ చూడలేదు అన్న సందేహం ఆయన వెళ్ళాక కూడా ఉండిపోయింది. కానీ తెల్లమొహం వేసుకుని ఉలుకూ పలుకూ లేని నన్ను ఆయన "గిరిధర్ నువ్వేకదా" అని మళ్ళీ అడిగి మరీ ఖచ్చితంగా "నీకోసమే, పిన్ని ఇచ్చి నిన్ను చూసి రమ్మంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. మా స్కూల్ మొత్తానికి నా పేరుతో ఇంకెవ్వరూ లేరు, ఖచ్చితంగా నేనే. కానీ ఎక్కడో ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో హిందూపురం దగ్గర ఒక మారుమూల పల్లెటూరు పక్కన "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూలు". ఆ పేరింటేనే అలాంటి పేరుతో ఒక ఊరుంటుందా అన్న సందేహమే తప్ప దారి కనుక్కోవటమే కష్టం ఆరోజుల్లో. అసలు ఈ స్కూలు కి "కావలి" నుంచి ఎలా రావాలో తెలుసుకుని రావటం కూడా కష్టమే. ఇంత దూరం "పిన్ని" ఈయనెవర్నో ఎందుకు పంపుతుంది, ఆ ఏమోలే, అని నాలుగు రోజులు ఆ "క్రీమ్ బిస్కెట్లు" తినే సంతోషంలో ఉండిపోయాను. ఆరోజుల్లో జాబుజవాబులే కమ్యూనికేషన్. శలవులకి ఇంటికెళ్ళాక "పిన్ని" గుర్తుచేసింది ఆ విషయం. అప్పుడు అర్ధం అయ్యింది, నాకు తెలియని ఒక బంధువు పనిమీద "అనంతపురం" దగ్గరికి వెళ్తుంటే చూసి రమ్మని "పిన్ని" చెప్పిందనీ, వెళ్తూ "బిస్కెట్ ప్యాకెట్స్" తీసుకుని వెళ్ళమని మరీ చెప్పి పంపిందనీ. ఆ సంఘటన శిలపై చెక్కిన చెరగని గుర్తుగా నా పసిమనసు పై ముద్రపడిపోయింది. అన్నేళ్ళు దూరంగా ఉన్న నా దగ్గరికి ఒక్కరు చూట్టానికి వచ్చారు, ఆ ఒక్కరూ "పిన్ని" పంపితేనే అని. అప్పట్లో మామూలు బిస్కెట్లే అమృతంకన్నా మిన్న, ఇక "క్రీమ్ బిస్కెట్లు" అంటే అది దేవతలకి దక్కిన అమృతం కన్నా ఎక్కువే, దక్కనిదింకేదో. అది నాకు దక్కించింది మా "పిన్ని".

ఒకసారి ఇంజనీరింగ్ చేస్తున్నపుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి "తిరుపతి" లో. చూసుకుని  వెనక్కి "విజయవాడ" వెళ్తూ, అప్పటికప్పుడు అనుకుని "కావలి" లో ముగ్గురు ఫ్రెండ్స్ తో దిగిపోయాను, వాళ్ళకి మా ఊరుని, మా ఇంటినీ, అమ్మనీ, అన్ననీ పరిచయం చెయ్యాలని. ఇలాంటపుడు అమ్మకి "పిన్ని" నే కొండంత అండ. ఆ రెండ్రోజులూ వచ్చి అమ్మకి అండగా ఉండి, మాకు వంటలూ, వడ్డింపులూ చేసి వెళ్ళింది. 

ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి అయ్యాక జాబ్ కోసం "హైదరాబాద్" వచ్చాను. అప్పట్లో "కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్" కి సరయిన జాబ్స్ లేవు. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరికి అప్పుడే ఏదో ఒక జాబ్ వచ్చేసింది. రెండు నెలల కృషి, అయినా జాబ్ రాలా. ఒకరోజు దిగులుగా ఇంటికి ఉత్తరం రాశాను. దానికి జవాబుగా వచ్చిన ఉత్తరం నన్నెంతో ఉత్సాహపరిచింది. అది రాసింది "పిన్ని". "గిరీ నువ్వెళ్ళి రెండు నెలలు కూడా కాలేదు, నీకప్పుడే ఏం వయసయిపోయిందని రా జాబ్ కోసం అంతగా దిగులు పడుతున్నావ్. తప్పకుండా వస్తుంది, త్వరలోనే, ధైర్యంగా కృషి చెయ్యి." అంటూ రాసింది. ఆ ఉత్తరం కొండంత ధైర్యాన్నిచ్చింది. తర్వాత ఒక నెల లోపే మొదటి జాబ్ లో జాయిన్ అయ్యాను. "పిన్ని" రాసిన ఆ "ఒకే ఒక్క ఉత్తరం" ఎప్పటికీ మరచిపోలేను.

నా పెళ్ళికి దగ్గరుండి నలుగు పెట్టి నన్ను పెళ్ళికొడుకుని చేసింది మా "పిన్ని".

తర్వాత అమెరికా వచ్చి స్థిరపడిపోయాను. "పిన్ని" కూడా కొన్నేళ్ళు తన కూతురు "ఇందు" దగ్గర "కాలిఫోర్నియా" లో ఉండేది. ఒకసారి అందరూ "బోస్టన్" లో మా ఇంటికొచ్చి కొద్దిరోజులుండి వెళ్ళారు. అప్పుడు మొదటి డిన్నెర్ కి, వచ్చేముందే ఒక కూర మాత్రం నేనే చేశాను, "చికెన్ ఫ్రై". భోజనం దగ్గర "పిన్ని" కి చిన్న పజిల్ విసిరాను. "ఉన్న కూరలన్నింటిలో ఒక్క కూర నేను చేశా పిన్నీ, ఏదో చెప్పుకో చూద్దాం, నువు చెప్పలేవు" అని. మరీ అంత నిఖ్ఖచ్చిగా అడిగే సరికి తప్పు పోకూడదని అన్నీ రుచి చూసి కనిపెట్టేశా అని, చాలా సమయస్ఫూర్తిగా-  "ఏదో కరెక్ట్ గా చెప్పలేను కాని ఖచ్చితంగా చికెన్ మాత్రం కాదు" అంది. అదొక్కటే పిన్నీ నేను చేసింది అంటే నిజంగానే బిత్తరపోయింది. "ఇది చేసింది నువ్వా, ఇంక గొప్ప టేస్ట్ చికెన్ నేనెపుడూ తిన్లేదు" అంది. తర్వాత వెళ్ళేరోజు మళ్ళీ నాతో చేయించుకుని "కాలిఫోర్నియా" తీసుకెళ్ళింది. ఎన్నో సార్లు మాటల్లో "నువు చేసిన చికెన్ ఫ్రై టేస్ట్ అట్టనే నా నాలిక మీద నిలబడిపోయింది గిరీ" అనేది. బహుశా పిన్ని కి నేనిచ్చిన తియ్యని గురుతు ఇదేనేమో.

ఇక శలవుల్లో "పిన్ని" తో మేమంతా కలసి వెళ్ళిన తిరుమల ప్రయాణాలూ, రామాయపట్నం సముద్ర విహార భోజనాలూ, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని తియ్యని అనుభూతులే!

నెలన్నర క్రితం "పిన్ని" కి ఆఖరి "సంక్రాంతి". క్యాన్సర్ తో చివరి రోజులు. నేనూ ఇండియా లో ఉన్నాను. రాలేని పరిస్థితిలోనూ ఎంతో తపనపడి, ఎంతో కష్టపడి కూతురు "ఇందు" తో  "హైదరాబాదు" నుంచి "నెల్లూరు" వచ్చి కొద్దిరోజులుండి మాతో పండుగ జరుపుకుంది. సంక్రాంతి కి నాకూ, అన్నకీ బట్టలు పెట్టింది. "పిన్ని" చేతుల మీదుగా కొత్త బట్టలు అందుకుని సంక్రాంతి ని పిన్నితో అందరం కలసి జరుపుకున్నాం. ఆఖరిసారి "పిన్ని" పాదాలని తాకి మనసారా నమస్కరించుకున్నాను. మళ్ళీ తాకగలనో లేదో అన్న ఆలోచన ఎంత దిగమింగినా గుండెని తొలిచేసింది. తిరిగి హైదరాబాదు కి వెళ్తూ ఎక్కలేక ఎక్కి కారు లో పడుకుని చేతిలో చెయ్యి వేసి "సరే గిరీ, వెళ్ళొస్తా" అన్న ఆఖరి మాట, ఆఖరి చూపు అదే...

అందర్నీ వదిలి ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయింది "పిన్ని".

ఎన్ని కష్టాలున్నా తనలోనే దాచుకుని అందరికీ "ప్రేమ" ని మాత్రం పంచి, ఏన్నో అందమైన జ్ఞాపకాలని మిగిల్చి అందనంత దూరం వెళ్ళిపోయిన "పిన్ని" కి... 
ప్రేమతో 
ప్రేమాంజలి ఘటిస్తూ... 🙏

"ప్రేమ- ప్రేమించే మనసుకది వరం. ప్రేమించబడే మనసుకది అదృష్టం." - గిరిధర్ పొట్టేపాళెం


"చిన్నది కాని పిన్ని కానుక", నా పుట్టినరోజు  కి

చివరి కొన్ని సంవత్సరాలు "కావలి ఇస్కాన్ కృష్ణుని సన్నిధి" లో
"పిన్ని" గడిపిన ప్రశాంత జీవితం గురుతుగా నాకు దక్కిన కానుక

Saturday, February 19, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 6 ...

Portrait of Suhasini from the Telugu movie "మంచు పల్లకి"
Free hand Pencil on Paper ()


"తార"లనంటిన నా బొమ్మలు - "స్వర్ణ యుగం"

స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి "భారతదేశ స్వర్ణయుగం" గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో "మన స్వర్ణ యుగం". నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ బొమ్మకీ రెట్టించిన ఉత్సాహంతో ఆగకుండా పరుగులేస్తూ పైపైకి దూసుకెళ్ళిన కాలమది.

అవి నా ఇంటర్మీడియట్ కాలేజ్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. ఎప్పటిలానే పరీక్షలు రాసి కావలి మా ఇంటికి రావటంతో ఆ రెండు నెలలూ ఖాళీనే. రెండవ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముందే చదివెయ్యాలని టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా అవి తెరిచే ఉత్సాహం అస్సలుండేది కాదు. దేనికైనా ప్రేరణ అవసరం. శలవుల్లో చదువుకి మాత్రం అది దొరకటం చాలా కష్టం. చదువు పక్కనబెట్టి ఏం చేద్దామా అని  చూస్తుంటే ఇదుగో మేమున్నామంటూ ముందుకొచ్చేసేవి నా బొమ్మలు. ఇక వాటితో కూర్చుంటే రోజంతా తెలియకుండానే గడిచిపోయేది. ప్రతిరోజూ ఏం సాధించానో తెలీకపోయినా ఏదో సాధించేశానని సంతృప్తిగానే ఉండేది.

దానికి ముందు పదవ తరగతి వరకూ శలవులకి వచ్చినపుడు అడపా దడపా బొమ్మలేస్తూ వచ్చినా వరసగా బొమ్మలు వేసిన కాలం మాత్రం ఈ రెండు నెలలే. వేసినవన్నీ పోర్ట్రేయిట్సే, అవన్నీ నాటి తెలుగు తారాలోకంలో ప్రముఖులవే, అన్నీ పెన్సిల్ తో వేసినవే. కానీ రేఖా చిత్రాలు కాదు. పెన్సిల్ తో వేసిన పెయింటింగ్స్. కొన్ని ఫ్రీహ్యాండ్ తో వేసినవి, కొన్ని అప్పుడే తెలుసుకున్న రహస్య చిట్కాతో వేసినవి. ఆశ్చర్యం ఏంటంటే పరిశీలించి చూస్తే రెండిట్లోనూ పట్టూ, పట్టు వదలని (విక్ర)మార్కూ కనిపిస్తాయి.

అది తెలుగు వారపత్రికలకు "స్వర్ణ యుగ కాలం". అందులో సినిమా పత్రికలూ వచ్చిచేరాయి. సినీతారల ముఖచిత్రాలతో, సెంటర్ స్ప్రెడ్ విశ్వరూపాలతో వారం వారం అందంగా ముస్తాబై వచ్చి పత్రికలన్నీ ఊరూరా బంకుల్లో తోరణాలు కట్టేవి. ఆ తారాతోరణాళ్ళోంచి కొందరు తారలు నా బొమ్మల్లోకి దిగివచ్చిన గురుతులే ఆనాటి నా బొమ్మలన్నీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ కి వేరు వేరు పెన్సిల్స్ అంటూ ఏవీ వాడింది లేదు, వాడింది కేవలం HB పెన్సిల్ మాత్రమే. లైట్ షేడ్ 6H తో మొదలయ్యి 5H, 4H, 3H, 2H, H ఇలా సంఖ్య తగ్గుతూ తర్వాత వచ్చి చేరే HB, అక్కడి నుండి డార్క్ షేడ్ B తో మొదలయ్యి, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B ఇలా సంఖ్య పెరుగుతూ ఇన్ని రకాల లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పెన్సిళ్ళు ఉంటాయని అప్పుడు తెలిసినా అన్ని ఊర్లల్లో అవి దొరకని కాలం, దొరికినా అన్నీ కొనే స్థోమత లేని కాలం.   

ఎండా కాలం, ఇంటా బయటా మండే కాలం. పడమర ముఖం పెంకుటిల్లు, భగ భగ మండే ఎండ వేడి, మధ్యాహ్నం నుంచి పొద్దుగూకే దాకా రోజంతా ప్రతి నిమిషమూ పెద్ద పరీక్షే. బొమ్మ పొద్దునే మొదలుపెట్టినా పూర్తిచెయ్యాలనే దీక్ష మధ్యాహ్నం కొనసాగించక తప్పేది కాదు. మధ్యాహ్నం అయితే పెంకుల కప్పు వేడికి తాళలేక కుర్చీ, అట్టా ఎత్తుకుని సందులో గోడకింద నీడలో చేరేవాడిని. మా ఇంటి గోడకీ, పక్కింటి ప్రహరీ గోడకీ మధ్య సరిగ్గా కుర్చీ పట్టేంత సందు. పక్కింట్లోని తురాయి చెట్టు నీడ కూడా కలిపి ఇంట్లో కన్నా కొంచెం బెటర్ గా ఉండేదక్కడ. అదే ఎక్కువగా మధ్యాహ్నం నా మల్టీ పర్పస్ ఎయిర్ కండిషనింగ్ ఏరియా; స్టడీ రూమ్ + ఆర్ట్ స్టుడియో. ఇంజనీరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్ లోనూ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కూర్చునే చదివాను. డిస్టింక్షన్ మార్కుల ప్రభావం ఆ స్థల మహిమే :)

ఆనాడు "తార"ల లోకాన్నంటిన నా బొమ్మలలోకం లోకి ఈనాడు తొంగిచూస్తే తృప్తిగా అనిపించేవీ, కళ్ళకి కట్టినట్టు మనసుకి కనిపించేవీ:
   . గమ్ముగా అస్సలు కూర్చోలేని స్వభావం
   . ఏదో చెయ్యాలన్న తపన
   . ఎందుకేస్తున్నానో కూడా తెలీకుండానే వేస్తూ పదునెక్కుతున్న బొమ్మలు
   . బొమ్మ బొమ్మకీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
   . ఆ బొమ్మల వెనక పడ్డ కష్టం
   . పడ్డ కష్టం లోంచి లేచి ఎప్పటికీ పదిలంగా మదిలో నిలబడిపోయిన సంతృప్తి
   . ప్రతి బొమ్మలో నిక్షిప్తమైన అలనాటి జ్ఞాపకా(లా)లు

ఎన్నో జ్ఞాపకాల మూటల్ని తమలో కలుపుకుని, నన్ను వదలక నాతోనే ఉంటూ, తెరిచి చూసిన ప్రతిసారీ నా  గతంలోకి నన్ను మళ్ళీ మళ్ళీ లాక్కెళ్ళే నా బొమ్మలు, ఇవే నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ "నిజమైన నా నేస్తాలు", తృప్తిగా నేను తరచూ తలుచుకునే "మధుర క్షణాలు"...

"కళాకారుడు తన కళని పూర్తిగా ఆశ్వాదించేది చుట్టూ ప్రేక్షకులు లేనప్పుడే."
- గిరిధర్ పొట్టేపాళెం

 
"దాసరి నారాయణ రావు"

"రాధ"

 "చిరంజీవి ఖైది"

 "శ్రీదేవి"

"శ్రీదేవి"

 "జయసుధ"

 "జయసుధ"

 "జయసుధ"

"సుహాసిని"

Sunday, February 6, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 5 ...

Ink and Ballpoint Pen on Paper (6" x 8.5")


కట్టిపడేసిన కదలిపోయిన కాలం...

ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలు గా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే ఎంతో గొప్ప గా అనిపిస్తుంది.

ప్రతి సంక్రాంతి, దసరా, వేసవి శలవులకీ "కావలి" నుంచి "నెల్లూరు" మీదుగా మా సొంత ఊరు "దామరమడుగు" కి వెళ్ళటం మాకు తప్పనిసరి. అలా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అక్కడికి లాక్కెళ్ళే బంధమే మా "బామ్మ". ('సొంత ఊరు' అన్న మాట ఎలా పుట్టిందో...బహుశా అప్పట్లో తమ ఊరు వదలి జీవనభృతి కోసం ఎక్కడికీ పోయి ఉండేవాళ్ళు కాదు, అందుకేనేమో!)

"ఒక్క సంవత్సరం ఇక్కడే ఉంటూ ఈ ఇల్లు చూసుకోమ్మా, ట్రాన్స్ఫర్ చేయంచుకుని బుచ్చి కి వచ్చేస్తాను" అంటూ "బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్" నుంచి "కావలి హైస్కూల్" కి ట్రాన్స్ఫర్ అయిన నాన్న తప్పని పరిస్థితిలో తనతో ఫ్యామిలీని తీసుకువెళ్తూ, తన ఇష్టం, కష్టం కలిపి కట్టుకున్న "కొత్త ఇల్లు" బామ్మ చేతిలో పెట్టి "బామ్మకిచ్చిన మాట". తర్వాత సంవత్సరానికే ఊహించని పరిణామాలు, మాకు ఎప్పటికీ అందనంత దూరంగా నాన్నని దేవుడు తనదగ్గరికి తీసుకెళ్ళిపోవటం.

"ఒక్క సంవత్సరం, వచ్చేస్తా అని మాటిచ్చి వెళ్ళాడు నాయనా, నాకు విముక్తి లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది" అంటూ నాన్న గుర్తుకొచ్చినపుడల్లా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ మాటనే తల్చుకుంటూ బాధపడేది బామ్మ. మేము పెద్దయ్యి జీవితంలో స్థిరపడే దాకా అక్కడే ఉండిపోయి మా ఇల్లుని కాపాడుతూ, మమ్మల్ని మా అదే జీవనబాటలో ముందుకి నడిపించింది "బామ్మ".

అలా ఆ ఊరితో బంధం తెగని సంబంధం "బామ్మ" దగ్గరికి ప్రతి శలవులకూ అమ్మా, అన్నా, చెల్లీ, నేనూ వెళ్ళే వాళ్ళం. సంక్రాంతి, దసరా పండగలూ చాలా ఏళ్ళు అక్కడే జరుపుకున్నాం. మేము వెళ్ళిన ప్రతిసారీ "బామ్మ" సంబరానికి అవధులు ఉండేవికాదు. శలవులు అయ్యి తిరికి కావలికి వెళ్ళిపోయే రోజు మాత్రం బామ్మ చాలా భిన్నంగా అనిపించేది, కొంచెం చిరాకు చూపించేది, ముభావంగా పనులు చేసుకుంటూ ఉండిపోయేది. బామ్మ బాధకవే సంకేతాలు. ఓంటరి బామ్మ ఇంకొక్క రోజు మాతో గడిపే సంతోషం కోసం, రేపెళ్ళకూడదా అంటూ ఆపిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తిరిగి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చేది. వెళ్ళే సమయం దగ్గర పడేకొద్దీ ఆ బాధ బామ్మలో ఎక్కువయ్యేది. వెళ్తున్నపుడు మెట్లు దిగి వచ్చి నిలబడి వీధి చివర మేము కనపడే దాక చూస్తూ ఉండిపోయేది. ఒక్కొకసారి మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి ఏదో మర్చిపోయి తిరిగి వచ్చిన సందర్భాల్లో ఆ రెండు మూడు నిమిషాలు ఎక్కడలేని సంతోషం బామ్మలో కనిపించేది, మళ్ళీ అది మాయం అయ్యేది. బామ్మ ఒక్కటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ తిరుగు ప్రయాణం నాకెప్పుడూ బాధగానే అనిపించేది. నెల్లూరు నుంచి కావలి బస్ లో కిటికీ పక్క సీట్ లో కూర్చుని వెనక్కి కదిలిపోతున్న చెట్లు, ప్రదేశాలూ చూస్తూ ఆ ఆలోచనల్తోనే కావలి చేరుకునే వాడిని.

ఆ ఊర్లో రెండేళ్ళు పెరిగిన జ్ఞాపకాలతో కలిసి ఆడుకున్న స్నేహితులు కాలంతో దూరమవటం, సొంత మనుషులకి సఖ్యత లేకపోవటంతో, క్రమేపీ సొంత ఊరైనా ఆ ఊరికి వెళ్ళినపుడు చుట్టాల్లా మాత్రమే మెలగవలసి వచ్చేది. బస్సు దిగి ఇంటికి నడిచెళ్ళే దారిలో ఎదురయ్యే ప్రతి మనిషీ ఆగి మరీ మమ్మల్ని తేరపారి చూట్టం, ఒకరో ఇద్దరో ఎవరోకూడ తెలీని వాళ్ళు "ఏం అబయా (నెల్లూరు యాసలో అబ్బాయి అని) ఇప్పుడేనా రావటం" అని పలకరించటం, ఆగి "ఊ" అనేలోపు "సరే పదండయితే" అనటం, సొంత బంధువులు మాత్రం ఎదురైనా పలకరించకపోవటం, వాకిట్లో కూర్చున్న ముసలీముతకా, ఆడామగా, పిల్లాజెల్లా కళ్ళప్పగించి చూస్తుండటం తో, గమ్ముగా తల దించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్లం.

అక్కడ శలవుల్లో ఉన్న కొద్ది రోజులూ, ప్రతి రోజూ కొంత టైమ్ పొద్దునో, సాయంత్రమో అలా పొలం దాకా వెళ్ళిరావటంతో గడిచిపోయేది. మిగిలిన టైమ్ లో ఇంట్లో కూర్చుని క్యారమ్ బోర్డ్ ఆడటం, నాన్న ఆ ఇంట్లో చేరాక కొన్న టేబుల్ మీద ఉండే PHILIPS రేడియోలో సినిమా పాటలు వినటం, లేదా Godrej బీరువా తెరిచి అందులో నాన్న గురుతులు చూసుకోవటం ఇలా కాస్త సమయం గడిచిపోయేది. అలా ఎంతలా సమయంతో ముందుకి నడిచినా అది మాత్రం ముందుకి కదిలేదే కాదు, ఏం చెయ్యాలో అస్సలు తోచేది కాదు. నాన్న దగ్గర చాలా ఇంగ్లీష్ పుస్తకాల కలెక్షన్ ఉండేది. అటకెక్కిన వాటికోసం నేనైతే పైకెక్కి బుట్టల్లో మగ్గుతున్న ఆ పుస్తకాల్ని ఒక్కొక్కటీ కిందికి దించి, బూజూ దుమ్మూ దులిపి తిరగేసేవాడిని. అయినా సరే ఆ పల్లెటూళ్ళో ఇంకా చాలా సమయం మిగిలిపోయేది. 

అలాంటి వేళల్లో నాకు తోచే ఏకైక మార్గం- కూర్చుని బొమ్మలు గీసుకోవటం, అవి చూసుకుని సంబరపడిపోవటం. అలా అక్కడ ఆ ఊర్లో, మా ఇంట్లో ఏమీ పాలుపోక వేసిన బొమ్మలే ఈ "గుఱ్ఱం బొమ్మలు". సంతకం కింద వేసిన తేదీలు చూస్తే వరసగా నాలుగు రోజులు ముందుకి నడవని కాలాన్ని నా(బొమ్మల)తో నడిపించాను. అప్పట్లో మా చిన్నప్పటి ఒక "అమెరికన్ ఇంగ్లీష్ కథల పుస్తకం" మా ఇంట్లో ఉండేది. ఆ పుస్తకానికి అన్న పెట్టిన పేరు "గుఱ్ఱాం పుస్తకం" (అవును, దీర్ఘం ఉంది, నెల్లూరు యాస ప్రత్యేకతే అది). ఈ పేరుతోనే ఇప్పటికీ ఆ పుస్తకాన్ని గుర్తుచేసుకుంటుంటాం. ఆ పుస్తకంలో ప్రతి పేజీ లోనూ మా బాల్యం గురుతులెన్నో దాగున్నాయి. దాదాపు ఆరేడొందల పేజీలుండి ప్రతి పేజీలోనూ అద్భుతమైన అప్పటి అమెరికన్ జీవన శైలిని పిల్లల కథలుగా రంగు రంగుల అందమైన పెయింటింగ్స్ తో ప్రతిబింబిస్తూ ఉండేది.  పచ్చని పచ్చిక బయళ్ళలో అందంగా ఉన్న ఇళ్ళు, అక్కడి జీవన విధానం, ఇంటి ముందు పోస్ట్ బాక్స్, రోజూ ఇంటికి జాబులు తెచ్చే పోస్ట్ మ్యాన్, ఉత్తరాల కోసం ఎదురుచూసే పిల్లలు, పారే చిన్న పిల్ల కాలువ, అందులో గేలం వేసి చేపలు పట్టటం, అవి ఇంటికి తెచ్చి వండుతున్న బొమ్మలూ, ఇంట్లో పెంపుడు పిల్లులూ, కుక్కలూ, గుర్రాల మీద చెట్లల్లో వెళ్తున్న పిల్లా పెద్దా బొమ్మలూ, స్టీమ్ ఇంజన్ తెచ్చిన రెవొల్యూషన్ తో స్టీమ్ నుంచి, ఎలెక్ట్రిక్ వరకూ రకరకాల రైలు బొమ్మలూ, ఫ్యాక్టరీల్లో పనిచేసే వర్కర్స్ జీవనశలీ, రకరకాల విమానాలూ, హెలికాప్టర్ల తో...ఇలా మొత్తం అమెరికానే కళ్ళకి కట్టి చూపెట్టిన గొప్ప "పిల్లల కథల పుస్తకం". బొమ్మలు చూట్టం తప్ప, ఇంగ్లీష్ లో ఆ కథలని చదివి అర్ధం చేసుకునేంత విద్య, అవగాహన, జ్ఞానం లేని మా బాల్యం నాటి "మా గుఱ్ఱాం పుస్తకం" అది.  

అలా కాలం ఎంత ప్రయత్నించినా ముందుకి కదలని ఒక రోజు మధ్యాహ్నం ఆ "గుఱ్ఱాం పుస్తకం" లోని గుఱ్ఱం బొమ్మలు ఒక నోట్ బుక్కులో వెయ్యటం మొదలు పెట్టాను. ఎలాంటి సవరణలకీ తావులేని పెన్నుతోనే నేరుగా వేసుకుంటూ పోవటం ఈ బొమ్మల్లో ఉన్న విశేషం. వాడిన పెన్నులు కూడా అక్కడ ఇంట్లో బామ్మ ఎప్పుడైనా పుస్తకాల్లో ఏవైనా రాసుకోడానికి టేబుల్ డెస్కులో పడుండే పెన్నులే, ఒక్కోసారి అవీ రాయనని మొరాయిస్తే పక్కన "రమణయ్య బంకు" లో రీఫిల్ కొని తెచ్చుకున్న గురుతులూ ఉన్నాయి. ఇక పేపర్ అయితే పాతబడ్డ ఆ డెస్కులోనే పడుండి, వెలుగు చూడక, కొంచం మాసి, రంగు మారిన తెల్ల పుస్తకంలో మరింత తెల్లబోయిన తెల్ల కాయితాలే. అప్పుడేమున్నా లేకున్నా ఉన్నదల్లా "ముందుకి నడవని సమయం", ఆ సమయాన్ని నడిపించాలని పట్టుదలగా కూర్చుని పట్టుకున్న పెన్నూ పేపరూ, లోపల ఉత్సాహం. ఏ పనికైనా ఇంతకన్నా ఇంకేం కావాలి?

ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే ఖచ్చితమైన కొలతలతో తప్పులు పోని ఆనాటి ఆ నా గీతలు. ఆ గీతల్లో దాగి ఆగిన ఘని, 'ఆగని అప్పటి కాలం', ఆ కాలంతో నడిచిన నా బాల్య స్మృతులు, ఆ స్మృతుల్లో దాగిన చెక్కు చెదరని అందమైన అపురూప జ్ఞాపకాలు!

ఇప్పుడు కాలంతోపాటు మారినా మా ఊరు 'దామరమడుగు' అక్కడే ఉంది. అక్కడ మా ఇల్లూ అలానే ఉంది. లేనిది మాత్రం అక్కడే స్థిరపడాలని ఇష్టపడి తన కష్టంతో ఇల్లు కట్టుకున్న నాన్న, మా రాక కోసం ఎదురు చూస్తూ మాటకి కట్టుబడి అక్కడే చాలా ఏళ్ళు ఉండి వెళ్ళి పోయిన బామ్మ, మాతో ఆ ఇంట్లో ఆడి పాడి నడయాడిన మా చెల్లి, కదిలిపోయిన అప్పటి కాలం. ఇవన్నీ జ్ఞాపకాలుగా తనతో మోసుకుని కదిలిపోయిన కాలం, ఇప్పటికీ ఎప్పటికీ నా బొమ్మల్లో కట్టిపడేసిన కదలని సజీవం.




"ఆగని కాలం ఆగి దాగేది మన జ్ఞాపకాల్లోనే." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: An American children stories book on American Daily Life.
Location: Damaramadulu - my native place in Nellore, AP, India
Mediums: Fountain pen ink, Ballpoint pen on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: May 15-18, 1984

Saturday, December 18, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 4 ...

Ink on cheap Notebook Paper (6.5" x 8")
 

తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు "ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్" గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇలస్త్రేషనన్స్ స్ఫూర్తి గానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ కానూరు లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి నుండి బస్సెక్కి పటమట కెళ్ళి ఆంధ్రభూమి వారపత్రిక కొనుక్కుని తెచ్చుకునే వాడిని. అంతగా ఆయన పెయింటింగ్స్ అప్పట్లో నన్ను ప్రభావితం చేశాయి. బహుశా పూర్తి స్థాయి పెయింటింగ్ వారపత్రిక కథలకి వెయ్యటం అన్నది ఉత్తమ్ గారే మొదలుపెట్టిన ప్రక్రియ. నాకు తెలిసి ఆ స్థాయిలో వారపత్రిక లోపలి పేజీల్లొ కథలకి పెయింటింగులు అప్పటి ఏ ప్రముఖ ఆర్టిస్టూ వెయ్యలేదు. తర్వాత ఆంధ్రభూమి లో చాలా మంది ఆర్టిస్టులు ఆయన్ని అనుకరించటం గ్రహించాను. అలా పెయింటింగులు ఇలస్ట్రేషన్స్ గా కళకళలాడిన వారపత్రిక ఎప్పటికీ అప్పటి "ఆధ్రభూమి" ఒక్కటే తెలుగులో. 

తర్వాత ఓ ఐదారేళ్ళకి హైదరాబాదులో జాబ్ చేస్తున్నపుడు శోధించి, సాధించి, ఒకసారి పని గట్టుకుని ఎలాగోలా లోపలికి ఎంట్రీ సంపాదించి సికిందరాబాదు లో ఉన్న డెక్కన్ క్రానికిల్ పేపర్ ఆఫీసులో ఆర్టిస్టులు అందరూ కూర్చుని బొమ్మలు వేసే ఒక విశాలమైన హాలు లోపలికి కేవలం "ఉత్తమ్ గారి" ని కలవాలనే వెళ్ళాను. ఆరోజు ఒకరిద్దరు ఆర్టిస్టులు ఆ హాలులో ఉన్నారు, అయితే ఉత్తమ్ గారు లేరు. ఉత్తమ్ గారి టేబుల్ మాత్రమే చూపెట్టి ఆయన ఇక్కడే బొమ్మలు వేస్తారు, ఈమధ్యనే హాలీవుడ్ వెళ్ళారు అక్కడ వాల్ట్ డిస్నీ కంపెనీకి బొమ్మలు వేస్తున్నారు అని చెప్పారు. నిరాశతో వెనుదిరిగాను. కొద్ది రోజులకి నాలుగు పేజీల స్పెషల్ ఆర్టికిల్ ఆంధ్రభూమిలో వచ్చింది పూర్తి వివరాలతో ఉత్తమ్ గారి గురించి. తర్వాత 2008 లో ఉత్తమ్ గారితో ఫోన్ లో ముచ్చటించాను. నా కొడుకు "భువన్" ద్వారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన, మరో ఉత్తమ్ గారి పెయింటింగులో ముచ్చటిస్తాను ;)

అలా ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి వేస్తూ, అలానే అనుకరిస్తూ చాలానే వేశాను. అయితే ఈ పెయింటింగ్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి పెయింటింగ్ నేను మొదలుపెట్టటానికి మెటీరియల్ కూడా తెలియని, దొరకని రోజుల్లో కేవలం ఇంకు, వాటర్ కలిపి పెయింటింగులా మామూలు నోటుబుక్కు పేజీ మీద వెయ్యటం మొదలెట్టిన రోజుల్లోనిది. 

ఊరు: కావలి... సమయం: సాయంత్రం 7 గంటలు...
"కావలి" లో అప్పట్లో రోజులో సాయంత్రం చీకటిపడే వేళ మాత్రం చాలా బోరింగ్ గా ఉండేది. ఇంట్లో ఉంటే ఏమీ తోచని సమయం అది. అందుకేనేమో మగవాళ్ళందరూ అలా బజార్లో రోడ్లంబడి ఊరికే తిరిగైనా ఇంటికొస్తుండేవాళ్ళు. కావలి ట్రంకురోడ్డు కళకళలాడే సమయం అది. పనుండి బజారుకొచ్చే వాళ్ళకన్నా, స్నానం చేసి చక్కగా ముస్తాబై రోడ్లమీద తిరిగే మధ్యవయస్కులు, చల్లగాలికి నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగే పెద్దవారు, హుషారుగా ఫస్ట్ షో సినిమాలకెళ్ళే కుర్రకారు తోనే ట్రంకు రోడ్డు మొత్తం కళకళలాడేది. సాయంత్రం అయితే రోడ్డు పక్కన పెట్రొమాక్స్ లాంతర్లు సుయ్ మంటూ శబ్ధం చేస్తూ చిందించే వేడి వెలుగుల్లో వెలిసే దోశల బళ్లపక్కన నిలబడి వేడి రుచులు ఆరగిస్తున్న డైలీ కస్టమర్లతో ప్రతి దోశ బండీ క్రిక్కిరిసే ఉండేది. నాకెప్పుడూ ఆశ్చర్యం గానే ఉండేది, ఈ బళ్ళ దగ్గర ఒక్కొకరు ఒక ప్లేట్ ఇడ్లి, ఒక ప్లేట్ పులిబంగరాలు, ఒక ప్లేటు దోశా...ఎర్రకారం, పప్పుల చట్నీ, కారప్పొడి మూడూ కలిపి లాగించి, మళ్ళీ ఇంటికెళ్ళి రాత్రికి భోజనం ఎలా చేస్తారా అని. ఇది నిజం అక్కడ మూడు ప్లేట్ల ఫలహారం లాగించేవాళ్ళంతా ఒక అరగంటలో ఇంటికెళ్ళి మళ్ళీ భోజనం చేసేవాళ్ళే, ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు ;)

ఈ పెయింటింగ్ వేసిన సమయం సరిగ్గా ఏమీ తోచని అలాటి ఓ సాయంత్రమే. మామూలుగా అప్పుడూ, ఇప్పుడూ ఉదయమే నేను బొమ్మలు ఎక్కువగా వేసే సమయం. ఇంట్లో తక్కువ వోల్టేజి లోనూ అద్వితీయంగా వెలిగే ట్యూబు లైటు వెలుతురులో కూర్చుని ఏమీ తోచక, భిన్నంగా, ఒక సాయంత్రం ఇంట్లో గచ్చునేల మీద కూర్చుని వెయటం మొదలుపెట్టాను. చాలా త్వరగానే పూర్తిచేశాను, ఒక గంట పట్టిందేమో. ఏమాత్రం టెక్నిక్కుల్లేని నేరుగా కుంచె ఇంకులోనూ వాటర్లోనూ ముంచి వేసిన పెయింటింగ్ ఇది.

అప్పట్లో నాకున్న నైపుణ్యానికి, బొమ్మలు వెయ్యాలన్న పట్టుదలకి, పెయింటింగులో ఓ.నా.మా.లు రాకపోయినా ఎదురుగా ఏకలవ్యునికి ద్రోణాచార్యుని ప్రతిమ ఉన్నట్టు, ఉత్తమ్ గారి పెయింటింగ్ ఉంటే ఇక "బ్రష్ విద్య" కి ఎదురులేదన్నట్టు గచ్చునేలపై కూర్చుని ఏకబిగిన వేసుకుంటూ పోయానంతే. పూర్తి అయ్యాక చూసుకుని "భలే వేశాన్రా" అని  కాలర్ ఎగరేస్తూ చిందులు తొక్కిన సంబరమూ గుర్తుంది. అప్పట్లో నా బొమ్మల రాజ్యంలో మరి...బంటూ నేనే, సైన్యం నేనే, మంత్రీ నేనే, రాజూ నేనే...ప్రజ కూడా నేనే!

తర్వాత కొద్ది కాలానికి ఒక ఇంగ్లిష్ ఫిల్మ్ మ్యాగజైన్ లో, అప్పటి హింది సినిమా హీరోయిన్ "షబానా ఆజ్మీ" గారి ఒక హింది మూవీ స్టిల్ ఫొటో చూశాను, అచ్చు ఇలాగే ఉంది. అప్పుడనిపించింది బహుశా ఉత్తమ్ గారు ఆ స్టిల్ స్ఫూర్తిగా ఈ పెయింటింగ్ వేసుంటారేమోనని. ఏ ఫొటోని అయినా చూసి పెయింటింగు "లా" వెయ్యొచ్చు అన్న "టాప్ సీక్రెట్" అప్పుడే అవగతం అయ్యింది. అందరు ఆర్టిస్టులూ చేసేదిదే, ఎవ్వరూ ఆ రహస్యాన్ని పైకి చెప్పరంతే... ;)

ఏదేమైనా అలా నల్లని ఇంకు నిలువెల్లా పూసుకుని నాసిరకం పేపరు తో కుస్తీపట్లు పడుతూనే, చెయ్యి తిరగని నా చేతి బ్రష్ ఆ పేపర్ని ప్రతిసారీ ఎలాగోలా జయించే(తీరే)ది. ఇప్పుడైతే ఎన్ని టెక్కు, నిక్కులు తెలుసు(కు)న్నా మంచిరకం పేపర్ మీద కూడా పట్టే కుస్తీలో ఎప్పుడైనా పట్టుజారి ఓడిపోతుంటానేమో గానీ, అప్పట్లో మాత్రం బరిలోకి దిగితే...అసలు..."తగ్గెదే ల్యా" ;)

"చేసే పనిలో లీనమైతే ఎప్పటికీ ఆ పని ఛాయలు స్పష్టంగా మదిలో నిలిచి పోతాయి." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: Artist Uttam Painting published in Andhra Bhoomi, Telugu Magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: July 18, 1985

Sunday, December 12, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 3 ...

సితార - భానుప్రియ
Ink on cheap Notebook Paper (6.5" x 8")


కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా అప్పటి వెలుగు చూడని నా "ఇంకు పెయింటింగుల్లో" పరిపూర్ణంగా ప్రతి క్షణమూ గుర్తున్న వాటిల్లో ఇదొకటి.

సుర్రున మండిస్తూ ముందరి వరండాలోకి కటకటాలగుండా దూసుకొచ్చే సూరీడెండని ఆపగలిగే సాధనాలు అప్పట్లోనూ ఉన్నా, అంత ఆర్ధిక స్థోమత లేదు. దుప్పటి అడ్డం కడితే వెలుతురుని కొంత ఆపగలిగినా ఆ వేడితాకిడిని ఆపటం దుప్పటి తరం అయ్యేది కాదు. మధ్యాహ్నం వెయ్యాలని కూర్చున్న ఈ బొమ్మకి నారాయణవ్వ తాటాకుల వసారానే మళ్ళీ ఆసరా అయ్యింది. ఈ పెయింటింగు మొదలెట్టింది ఒక మధ్యాహ్నం అక్కడే, పూర్తి చేసిందీ ఆ మధ్యాహ్నమే, అక్కడే. అప్పటి నా "ఇంకు పెయింటింగుల్లో" ప్రతిసారీ తప్పక వస్తున్న ప్రస్తావన "నారాయణవ్వ పూరి గుడిశ".

అవును, "నారాయణవ్వ పూరి గుడిశ", అక్కడ కూర్చునే అప్పట్లో చాలా బొమ్మలేశాను. అసలు మేముంటున్న పెంకుటిల్లూ మా నారాయణవ్వదే. రెండు పెంకుటిళ్ళ జంట, ఆ ఇళ్ళ వెనుక ఉండేది చిన్న పూరి గుడిశ, ఆ గుడిశ ముందు ఒక వసారా, వసారాలో నాపరాళ్ళ అరుగు, ఆ అరుగు మీద లోపల దిండు తో సహా చుట్టచుట్టి పెట్టిన పరుపు, కింద ఎత్తిపెట్టిన ఒక నులకమంచం. రెండు పెంకుటిళ్ళూ అద్దెకిచ్చి తను మాత్రం పూరి గుడిశ లోనే ఒక్కటే నివాసముండేది. శ్రమ, కాయకష్టమే చివరిదాకా ఆమె నమ్ముకున్న జీవనం. ఒక్కొక్క ఇంటికీ అద్దె నెలకి 100 రూ||, అయినా అమ్మ దగ్గర మాత్రం 50 రూ|| లే తీసుకునేది. అపుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి మిగిలినా పిల్లల చదువులకి ఉపయోగపడతాయి అన్న మా స్థితిలో, అలా సహాయం అందించి ఆదుకుని మా అభివృద్ధి బాటలో పరోక్షంగా ఎంతో పెద్ద సహాయం చేసింది "మా నారాయణవ్వ". అద్దె డబ్బులతోబాటు శ్రమించి సంపాదించుకున్న కొద్ది డబ్బులనూ జాగ్రత్తగా పొదుపుచేసి అందులోనూ కొంత మిగుల్చుకుని దాచుకునేది.

స్కూలు నుంచి శలవులకి ఇంటికొచ్చి శలవులయ్యాక తిరిగి వెళ్ళే ముందు, "వెళ్ళొస్తాను నారాయణవ్వా" అని చెప్పటానికి వెళ్ళిన ప్రతిసారీ "ఉండు నాయనా" అంటూ లోపలికెళ్ళి గుప్పెటలో మడిచిన 5 రూ|| ల కాయితం నా చేతిలో పెట్టేది. వద్దు నారాయణవ్వా అని ఎంత చెప్పినా వినేది కాదు. బహుశా ఆ 5 రూ లు అప్పట్లో ఆమెకి ఓ రెండు మూడు రోజుల సంపాదన, ఓ పదిరోజుల సేవింగ్స్ అయి ఉండొచ్చు. ఇలా క్రమం తప్పక ప్రతి శలవులకీ నాకు డబ్బులిచ్చిన "ఏకైక వ్యక్తి" గా "మా నారాయణవ్వ" నా మనసులో ఈనాటికీ పదిలంగా ఉండిపోయింది, అందుకే అప్పటి నా బొమ్మల్లో ఆమెని తల్చుకోకుండా ఉండలేను, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను.

ఈ బొమ్మ కూడా స్ట్రెయిట్ గా Bril ఇంకు బుడ్డీ, ఆ బుడ్డీ మూత ప్యాలెట్టు, మగ్గుతో నీళ్ళు, ఒకే ఒక్క బ్రష్, నాసిరకం నోట్ బుక్ పేపర్ మీద ఫ్రీ హ్యాండ్ తో వేసిందే. ఆధారం, వార పత్రికలో వచ్చిన "సితార భానుప్రియ" స్టిల్. అప్పటిదాకా పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ తో అచ్చు గుద్దినట్టు పోర్ట్రెయిట్ లు వెయటం సాధనతో  నేర్చుకున్నా. బ్రష్ తో కూడా సాధన చేస్తే సాధించగలనన్న బలమైన నమ్మకానికి పునాది వేసిన పెయింటింగ్ ఇది. ఇప్పుడు డిజిటల్ బొమ్మలో తెలియట్లేదు గానీ, అప్పటి నాకళ్ళకి మాత్రం ఆ డ్యాన్స్ కాస్ట్యూమ్, వేసుకున్న ఆభరణాలూ జిగేలుమంటూ వెలిగిపోతూ కనిపించేవి. బొమ్మ కింద పెట్టే సంతకం అప్పటికింకా పరిణతి చెందలేదు. ఇందులో కింద కనిపించే స్ఫురణకు రాని 19 అన్న అంకె నాకూ వీడని మిస్టరీనే!

అప్పటి బొమ్మల్లో తప్పులూ, తడికలూ, తప్పటడుగులూ వేసి ఉన్నా, అనాటి ఆపాటి జ్ఞానానికి అందుబాటులో నాకు తెలిసిన పరుగు అంతే. పడుతూ లేస్తూనే కొంచెం మెరుగవుతున్నాననిపిస్తూ ఇంకా ఉత్సాహంగా పరిగెట్టటమొక్కటే తెలుసు. అలుపులేని పరుగులో ఎప్పుడైనా ఇలా ఆగి ఒక్కసారి పరిగెట్టిన దూరం కొలుద్దామని ప్రయత్నిస్తే ప్రతి బొమ్మలో, ప్రతి మలుపులో ఎన్నో, ఎన్నెన్నో మధుర స్మృతులుగా మారిన జ్ఞాపకాలే ఆ దూరం కొలిచే నా కొలమానాలూ, కాలమానాలూ...

"ప్రతి అనుభవాన్నీ ఒక మంచి జ్ఞాపకంగా, ఆ జ్ఞాపకాన్ని ఓ మంచి స్మృతిగానూ మలుచుకోగలిగే జీవితం చిన్నదే అయినా దాన్ని సంపూర్ణంగా జీవించినట్టే." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Title: సితార - భానుప్రియ
Reference: A photo published in a Telugu weekly magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: Aug 18, 1985

Saturday, December 11, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 2 ...

కొల్లేరు సరస్సు
Ink on cheap Notebook Paper (11" x 14")


అప్పట్లో వెయ్యలన్న తపనే నా "పెయింటింగ్ స్టుడియో"! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే నా పెయింటింగ్ ఫర్నీచర్లు. Bril ఇంకు బుడ్డి, అదే ఇంకు బుడ్డీ మూత (ఇదే నా ప్యాలెట్టు), మగ్గుతో నీళ్ళు...ఇవి పక్కన పెట్టుకుని  కూర్చుని బ్రష్షు పట్టుకుంటే గంటలకొద్దీ దీక్షలోకెళ్ళినట్టే, ఇక లేచే పనేలేదు.

అప్పుడిలా ఎక్కువగా వేసిన పెయింటింగ్స్ అన్నీ పొద్దున 9గం నుంచి మధ్యాహ్నం 2గం లోపు వేసినవే. అమ్మ స్కూలుకి, అన్నేమో కాలేజి కో లేదా ఫ్రెండ్స్ అనో వెళ్లటం...ఎప్పుడన్నా మధ్యాహ్నం కొనసాగించాల్సి వస్తే నేనూ, నా పెయింటింగ్ స్టుడియో "నారాయణవ్వ తాటాకుల పూరి గుడిశ" కి షిఫ్ట్ అయ్యేవాళ్లం.

ఈ పెయింటింగ్ "ఆంధ్రభూమి న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ సంచిక" లో వచ్చిన "కొల్లేరు సరస్సు కలర్ ఫొటో" ఆధారంగా వేసింది. పెన్సిల్ గానీ, స్కేలు గానీ వాడకూడదు, అవి వాడితే ఆర్టిస్ట్ కాదు అన్న "పెద్ద అపోహ" ప్రస్ఫుటంగా ఇందులో కనిపిస్తుంది. బోర్డర్ లైన్స్ కూడా ఏ స్కేలో, రూళ్లకర్రో ఆధారం లేకుండా బ్రష్ తోనే వెయ్యాలన్న అర్ధం లేనిదే అయినా, వృధా కా(రా)ని ప్రయత్నం.

ఇక ఇందులో చెప్పుకోటానికి ఒక్కటంటే ఒక్క టెక్నిక్ కూడా లేదు, అప్పుడు టెక్నిక్కులే తెలీవు, తెలిసినా అసలా నాసిరకం పేపరు మీద టెక్నిక్కులకి తావేలేదు. మధ్య మధ్యలో లేచి దూరం నుంచి ఒక చూపు చూస్తే ఎలా వస్తుందో కరెక్ట్ గా తెలిసిపోతుంది, సవరణలేమైనా ఉంటే చేసుకోవచ్చు లాంటి "టాప్ సీక్రెట్ లు" కూడా ఉంటాయనీ తెలీదు. తెలిసిందల్లా కింది పెదవిని పంటితో నొక్కి పెట్టి, చెరిపే వీలు లేని ఒక్కొక్క బ్రష్ స్ట్రోక్ జాగ్రత్తగా వేసుకుంటూ పోటమే. బొమ్మయ్యాక అందులో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కొలతా కొలిచినట్టు కరెక్ట్ గా ఉండాలి, పక్కవాటితో చక్కగా ఇమడాలి, లేదంటే పూర్తి బొమ్మ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుందీ అని సరిపెట్టుకోటానికి మనమంత మాడ్రన్ ఆర్టిస్ట్ కాదు, మనది మాడ్రన్ ఆర్టూ కాదు ;)

ఏదేమైనా అప్పట్లో మాత్రం "భలే ఏసేన్రా" అని నాకు నన్ను వెన్నుతట్టుకుని ప్రోత్సహించుకుని ముందుకి అడుగులేసిన నా పెయింటింగ్ బొమ్మల్లో చాలా సంతృప్తిని ఇచ్చిన వాటిలో ఇదీ ఒకటి. ఈ పెయింటింగ్ నాకెంతగా నచ్చిందంటే, తర్వాత మళ్ళీ దీన్నే కొంచెం బెటర్ అనిపించే మందమైన పేపర్ మీద వేశాను. అయితే పేపర్ కాస్త మెరుగే అయినా నాసిరకం రంగుల్లో మళ్ళీ ఈ బొమ్మనే రిపీట్ చేశాను.

అలా నేను వేసేది పెయింటింగో కాదో కూడా తెలీకుండానే వేసుకుంటూ వెళ్ళిన బాటలో ఒంటరిగా నడుచుకుంటూ ముందుకెళ్ళాను. అందుకేనేమో ఇన్నేళ్ళయినా వెనక్కితిరిగి చూస్తే వేసిన ప్రతి అడుగూ చెక్కుచెదకుండా స్పష్టంగా మనసుకి కనిపిస్తుంది.

"మనం చేసే పనిపైన ధ్యాసే ముఖ్యమైతే దాని ఫలితం ఎప్పటికీ అబ్బురమే."
- గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: A color photo published in Andhra Bhoomi Newspaper Sunday special
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 11" x 14" (28 cm x 36 cm)
Signed & Dated: Jan 7, 1986

Sunday, November 28, 2021

"స్పందన"...

"స్పందన"
Oil on Canvas (16" x 20")

నా చిన్న నాటి మిత్రుడు "మల్లయ్య" కి పువ్వులన్నా, ప్రకృతి అన్నా, కళలూ, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం. వీటిని ఇష్టపడే, ఇవంటే స్పందించే హృదయాలన్నిటినీ ఒకచోట చేర్చి రోజూ ఎన్నో ఆహ్లాదకర విషయాలు తెలుసుకుంటూ, పంచుకుంటూ, ఆహ్లాదంగా సాగిపోయేదే "స్పందన" వాట్సప్ గ్రూప్. 

అందులో ఒకరోజు మల్లయ్య తన ఇంట పూలకుండీలో విరబూసిన పువ్వులని ఫొటో తీసి పెడితే "చాలా బాగుంది మల్లయ్యా" అన్న నా స్పందనకి ప్రతిస్పందిస్తూ "ఇది పెయింటింగ్ వెయ్యి గిరీ" అని అడిగిన మాట ప్రేరణగా, గుర్తుగానూ వేసిన "ఆయిల్ పెయింటింగ్" ఇది. ఒక గంట అవుట్ లైన్స్, ఇంకో ఐదారు గంటల పెయింటింగ్ పని. నేను అత్యంత త్వరగా పూర్తి చేసిన కొద్ది ఆయిల్ పెయింటింగ్స్ లో ఇదీ ఒకటి.

ఆర్ట్ కూడా పువ్వులంత సున్నితమే. ప్రకృతికి స్పందించే గుణం ని పుణికి పుచ్చుకున్న పువ్వుల్లా, ఆర్టిస్ట్ కీ భావనలకి స్పందించే గుణమే ఎక్కువ. మా "స్నేహ స్పందన" ల గుర్తుగా అతిత్వరలోనే ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ చేసి "మిత్రుడు మల్లయ్య" కి నా చేతులతోనే ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ...

"స్పందించే హృదయం ఉంటే ఆహ్లాదం తనంతట తనే వెతుక్కుంటూ వస్తుంది." - గిరిధర్ పొట్టేపాళెం


నా చేతులతో మిత్రుడు మల్లయ్యకివ్వాలని అనుకున్నట్టూ, మాట ఇచ్చినట్టుగానే జనవరి 2022, సంక్రాంతి రోజున నెల్లూరులో పండుగ జరుపుకుంటున్న మా ఇంటికి "తిరుపతి ప్రసాదం" తోబాటు "వెకటేశ్వర స్వామి" నీ తీసుకుని కొడుకుతోనూ వచ్చిన "మల్లయ్య" ని కలవగలగటం, కలిసినపుడు ఈ పెయింటింగ్ ని నా చేతులతోనే ఇవ్వటం ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి. 

"మన పని ఏదైనా దాని విలువని గుర్తించి దాన్ని గౌరవించే వారిని చేరినప్పుడె అది సాఫల్యం అవుతుంది." - గిరిధర్ పొట్టేపాళెం



"ఏ పనికైనా ప్రేరణ ఒక్క మాటలోనో, ఆలోచనలోనో దాగి ఉంటుంది. దానికి స్పందించే గుణం ఉంటేనే అది కార్యరూపం దాలుస్తుంది." - గిరిధర్ పొట్టేపాళెం


Details 
Title: స్పందన
Reference: Picture by my friend Mallaiah
Mediums: Oil on Canvas
Size: 16" x 20" (41 cm x 51 cm)

Sunday, May 16, 2021

Practice Good...

 Ballpoint Pen on Paper (8.5" x 11") 

Be good, do good.
Get better at doing good.

"The only way Good can become Better is through constant practice of Good."
~ Giridhar Pottepalem

Happy Painting !
Happy doing Good!!

Details 
Reference: Picture of Karronya
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Wednesday, March 31, 2021

Gentleman....

 
Portrait of Rithvik Pottepalem
Watercolors on Paper 8.5" x 11"  

A boy becomes a man by age. A man becomes a gentleman by his behavior and maturity.
A very "Happy Birthday" to my Son, a boy who becomes a Gentleman by all means!

Happy Birthday Rithvik!
Always be gentle and a Gentleman!!

Details 
Title: Gentleman...
Reference: Picture of my son Rithvik
Mediums: Ink and Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Saturday, December 19, 2020

Happy Mom and Son...

"Happy Mom and Son"
Watercolors on Paper (8.5" x 11") 
 
బొమ్మలని అభిమానించే రోజులు తగ్గిపోతున్న రోజుల్లో ఎవరో తెలీని అభిమాని "మా తమ్ముడి బొమ్మ వేసివ్వగలరా సార్" అంటూ అడిగితే "తప్పకుండా" అన్న మాటకి కట్టుబడి వేసిన ఈ బొమ్మ చూసి ఆ అభిమాని చెందిన సంతృప్తి కి వెలకట్టడం సాధ్యం కాదు. అందుకే అప్పుడప్పుడూ ఇలా తెలియని అభిమానులు అడిగితే వేసే బొమ్మలు "చాలా ప్రత్యేకమైనవి" నేనేసే బొమ్మల్లో...

"To a Child, mother is the first person, the first teacher, the first care, the first love, the first smile...the first and the best of everything in the world!"
~ Giri Pottepalem

Happy Painting!
Be kind to people around you like a mother to a child!!

Details 
Title: "Happy Mom and Son"
Mediums: Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Sunday, November 15, 2020

విజేత...

Portrait of Megastar Chiranjeevi   
Watercolors on Paper (8.5" x 11")

కష్టపడితే ఎంచుకున్న దారి ఎంత కఠినమైనా ఎదగొచ్చనీ
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటమే ఆ కష్టానికిచ్చే గౌరవం అనీ
చెప్పకనే తన విజయాల బాటలో చాటి చెప్పిన "విజేత"

ఒక్కొక్క మెట్టూ "స్వయంకృషి" తో ఎక్కిన సాదాసీదా మనిషి
ఇక ఎక్కేందుకు మెట్టేలేదు అన్నంత ఎత్తుకెక్కిన "మెగా" మనీషి

ఎప్పటినుంచో "అభిమానం" అనే బాకీని పెంచుకుంటూనే వస్తున్నా
ఇప్పటికైనా ఆ బాకీ ని ఇలా వడ్డీతోసహా చెల్లించేసుకుంటున్నా. . .

Hard-work never fails!
Happy Painting!!
 
"Winning your-self is the greatest win of life" ~ Girdhar Pottepalem

Details 
Title: "విజేత"
Reference: A picture of Megastar Chiranjeevi
Mediums: Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Saturday, September 12, 2020

పిల్లలూ దేవుడూ చల్లనివారే...


Ballpoint Pen on Paper (8.5" x 11")
Portrait of Baby Karronya Katrynn

పిల్లలూ దేవుడూ చల్లనివారే...
కల్లకపటమెరుగనీ కరుణామయులే..
~~~

విద్య + వినయం + విజ్ఞానం + వివేకం + వికాసం = విజయం

"The Innocence of a Kid is always mysterious to me!" ~ Giridhar Pottepalem

Happy Drawing!

Details 
Title: పిల్లలూ దేవుడూ చల్లనివారే...
Inspiration: Baby Karronya Katrynn
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Tuesday, August 4, 2020

నవ్వుల పువ్వుల వెన్నెల...

Portrait of Chi. Karronya Katrynn 
Watercolors on Paper (12" x 16")

నవ్వుల పువ్వుల వెన్నెలా...
వెన్నెల నవ్వుల పువ్వులా...
పువ్వుల వెన్నెల నవ్వులా...

ఈ "చిన్నారి" కి "పుట్టినరోజు శుభాకాంక్షలు"!
Happy Birthday Chi. Karronya!

I believe this painting unquestionably moved me one step up in both Watercolor painting and Portrait painting. It was very challenging to capture the beautiful smile of Chi. Karronya as beautiful as it was.

I am extremely happy with my efforts. Of course, best efforts give best results. I always used to say 'my best is yet to come`. I can now proudly say, "one of my best has come".

Happy Painting! Happy Memories!!

"Be at your best, beat your best."
- Giri Pottepalem

Details 
Title: నవ్వుల పువ్వుల వెన్నెల...
Inspiration: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 12" x 16" (30.5 cm x 40.5 cm)
Surface: Fabriano extra-white Watercolor Paper, Cold Press, 140 LB

Saturday, July 4, 2020

My friend goes with me wherever I go...

Piccadilly Circus - LONDON, Sep 25, 1994
Sketch pens on Paper (6" x 8")    

గుండె లోతుల్లోకి తొంగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలెంతో మధురంగా అనిపిస్తాయి. మది వినీలాకాశంలో తేలిపోతూ, సన్నని జల్లులు కురిపించి, ఆ జల్లుల్లో మదిని తడిపి ముద్దచేసి, వెళ్తూ వెళ్తూ జ్ఞాపకాల తెమ్మెరలు  అలా వీచి మదిని సేదతీర్చి మరీ వెళ్ళిపోతుంటాయి.

Aug 15 1994, London, my first step outside India.

స్వతంత్ర రాజ్యాలుగా వెలుగొందుతూ విలసిల్లుతున్న భారత సామ్రాజ్యాన్ని దాదాపు 200 సంవత్సరాలు తమ గుప్పిట్లో పట్టిపెట్టి గిలగిలలాడించి, ఆ గుప్పిట ఒక్కటై ప్రజలంతా ఏకమై జరిపిన పోరాటాల్లో గడగడలాడి, చివరికి భరతభూమిని రెండు ముక్కలు చేసి విడిచి వెళ్ళిన బ్రిటీష్ గడ్డపై మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజే అడుగుపెడుతున్నానని భావోద్వేగాల్లో, I boarded my first plane in my life from Bombay to Londan, on a 3 month project trip for TCS, Bombay.

కానీ లండన్ లో అడుగుపెట్టాక  అణువణువూ సుందర అందాలకు క్షణక్షణమూ మది పులకరించిపోయింది. అక్కడ గడచిన, గడిపిన 3 నెలల్లో ప్రతి శని,ఆదివారం తిరిగి చూసిన ప్రదేశాలూ, ఆర్ట్ గ్యాలరీలూ నాలోని ఆర్టిస్ట్ ని మళ్ళీ తట్టిలేపాయి. బొమ్మలని నేనెప్పుడూ వీడలేదు, ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక పెన్సిలో, పెన్నో పట్టుకుని గీసుకోవటం నాలో నా జీవితంలో ఆర్ట్ కి నేనిచ్చుకున్న ప్రాధాన్యం. ఏ కొత్త ప్రదేశం అయినా, అక్కడ మన మనసుకి నచ్చిన కొన్ని గురుతులతో, గడిపిన క్షణాలతో మనతో మనలో ఎప్పటికీ ఉండిపోతాయి. 

London has a special corner in my Art and in my Heart. Some of the world's finest Art galleries I visited, Art books, cards and Art material I bought in London are very special to me. Though I had no time left for my Art during those 10 to 12 weekends of my stay in London, I did few sketches including the one of Dianna, Princess of Whales which I gifted to my project-mate Deepti who joined me from TCS, Calcutta to work with me on the same project. Unfortunately, I did not take a picture of it.

This is a sketch done when I was in London based on my own photograph that I took at Piccadilly Circus, London. An Artist is connected with every small Art work of his/her own. I am no exception.

Art is my friend, goes with me wherever I go and wherever I stay...

"Connect, collect and re-collect good memories in anything and everything you do; 
anywhere and everywhere you go!"
~ Giridhar Pottepalem

Happy Painting!
Happy Memories!!

Sunday, May 17, 2020

No time to waste...

Portrait of Kamal Haasan from the movie Sagara Sangamam
Watercolors on Paper  (11" x 14")    

When I don't know what to do, I go back to my childhood and live in there again through my paintings. That's the best way I can spend my time in both present, past and live twice.

Now I clearly know what I want to master in Painting. Portraits is something I have been enjoying and will enjoy most than any other subject. My celebrities list is long, will get one by one out from my brush...

"I have no time to waste." ~ Giridhar Pottepalem

Happy Painting!
Do what you want to do and live the life you want to live!!

Details 
Title: Kamal Haasan...
Inspiration: My favorite movie Sagara Sangamam and Balu, the character Kamal played
Mediums: Watercolors
Size: 11" x 14" (28 cm x 35.5 cm)
Surface: Arches Watercolor Paper, Cold Press, 140 LB

Friday, February 21, 2020

Champion your Talent...

"The Portrait of Talent"
Portrait of Karronya Katrynn - Young talented Dancer and Telugu Actress
Watercolors on Paper (16" x 20")

Talent is a built-in and unique ability. Knowing that built-in ability, recognizing it, turning it into a quality, and letting it out is more than talent. It requires constant practice with no boundaries and limitations.

This portrait of talent is done in a unique way by mixing both slow and fast paced watercolor painting styles. Each style comes with its own challenges. With fast-paced style, dealing with color-flow and water control on the surface (paper) is a challenge. With slow-paced style, dealing with mixing colors as they sink in and dry fast into the surface is a challenge. After all, dealing with all those challenges, fixing any mistakes is another big challenge. Every watercolor painting is a new challenge.

Practice is the way, and in fact, the only way to overcome challenges and champion anything. Your talent is your friend, and is also your rival.

"Be a champion of your own talent, champion it with patience and practice."
~ Giridhar Pottepalem

Happy Painting!
Champion your own Talent!!

Details

Title: "The Portrait of Talent"
Reference: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 16" x 20" (41 cm x 51 cm)
Surface: Arches Bright White140LB Cold Press Watercolor Paper 

Tuesday, December 31, 2019

"నేనూ...నా సృష్టి..."

Looking Back... 2019    


"మీకు ఇంత టైమ్ ఎక్కడుంటుంది?" - ఇందులో కొంత ఆశ్చర్యం...
"మీకు చాలా టైమ్ ఉన్నట్టుందే?" - ఇందులో కొంచెం వెటకారం...
ప్రశ్న ఏదైనా నా జవాబు మాత్రం- "మీలాగే నాకూ దేనికీ టైమ్ ఉండదు, క్రియేట్ చేసుకున్నాను".
బొమ్మ చూసి బాగుందోలేదో, నచ్చిందోలేదో అని చెప్పేవాళ్ళకన్నా ఈ ప్రశ్నలడిగేవాళ్ళే ఎక్కువ.

దేనికైనా ముందు కావల్సింది టైమ్. అదిలేందే ఇంకేం లేవు, కావు, రావు. బొమ్మలకోసం నా టైమ్ కేవలం నా సృష్టి మాత్రమే. అవును, నాకంటూ సొంత "టైమ్" ని సృష్టించుకున్నాను. ఆ సృష్టి నా కోసమే, నా సంతృప్తి కోసమే.

బొమ్మలిప్పుడు నా జీవితంలో ఓ భాగం అయిపోయాయి అని సంతోషంగానూ, సగర్వంగానూ చెప్పుకుంటాను. గతైదారు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా బొమ్మలేస్తూనే ఉన్నా. దానికి ముందు ఓ రెండుమూడేళ్ళపాటు "క్విక్ డెయిలీ స్కెచెస్" వేస్తూ, చాలా ఏళ్ళుగా ఆగి ముందుకి కదలని నా బొమ్మల లోకంవైపు మళ్ళీ నెమ్మదిగా అడుగులు మొదలెట్టాను. ఈసారీప్రయాణం ఎట్టి పరిస్థితిలోనూ ఆగకూడదు, ఆపకూడదు అన్న ఆశయంతోనే. ఇన్నేళ్ళుగా ఎందుకు పక్కనబెట్టానో తెలీదు. "చాలా బిజీ లైఫ్" అని చెప్పుకోవటానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక "ఫేస్" ఉంటుంది. చెయ్యాలనుండీ చెయ్యలేందేదైనా, కారణాలు వెతుక్కుని మరీ ఆలోచించి, దొరక్కపోతే, ఆ "చాలా బిజీ లైఫ్" మీదికి నిస్సంకోచంగా నెట్టెయ్యొచ్చు. గతమెలాగూ తిరిగిరాదు, వచ్చి మనల్ని నిలదీయదు కనుక.

పోయింది కలలా కరిగిపోయిన కాలమైనా, వీడి వెళ్ళిపోయిన మనుషులైనా తిరిగి తెచ్చుకోలేమన్న "జీవిత సత్యం" తెలుసుకుని ఇప్పుడున్న కాలాన్ని వృధా చేసుకోకపోవటమే జీవితాన నేర్చుకోవలసిన గొప్ప పాఠం. ఏదో మిస్ అవుతున్నానే అన్న ఆలోచనా, చింతా చాలా ఏళ్ళుగా నన్ను వెంబడిస్తూనే ఉండేవి. ఇప్పుడా ఆలోచన లేదు, చింతా లేదు. అన్నీ నాదే అయిన నా "బొమ్మల లోకం" నన్ను పలకరిస్తూ ప్రతి వారం రెండు రోజులు వస్తుంది. వచ్చి నాతోనే ఉంటుంది, సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తూ. నాకింతకన్నా అందమైన లోకం, సృష్టీ...ఈ సృష్టిలో మరేదీ లేదు.

బొమ్మలతో నా సమయం కేవలం నాకోసం
నాకు నేనుగా సృష్టించుకున్న నా లోకం
నాదై నాతోనేఉండే అందమైన నా "బొమ్మల లోకం"...

2019 has been a special year in my heArt. I call it "My Year of Portraits". With 45 different finished-art-works posted with write-ups, few abandoned/unfinished ones, several hundreds of hours of planning and working with colors is not a joke in the given 52 weekends of time in busy life. That feeling itself makes me feel so good. When I look back into my time on the last day of this year, I see time-well-spent and time-fully-and-very-well-lived-in,

Many thanks to all friends, well-wishers and people who took time to take a look at my Artworks. Special thanks to those who even took few extra minutes to share their invaluable, encouraging words and suggestions with me. I have great respects for all your valuable time.

"Time is the most valuable resource given in life, always respect others time more than yours."
- Giridhar Pottepalem

Looking forward to another COLORFUL year ahead.

Good Bye 2019 !
Welcome 2020 !!

Thursday, November 14, 2019

తెలుగు వెలుగు...

(బాలల దినోత్సవం సందర్భంగా తెలుగు పై తెలుగు'వాడి' గా నా భావాలు కొన్ని...)


అందమైన "బాపు" తెలుగు అక్షరాలు, అ ఆ లు...  

నాకు ఊహ తెలిశాక ప్రభుత్వ పాఠశాలలని పట్టించుకునే ప్రయత్న దిశగా అడుగులేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఊహ తెలీక ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడూ శ్రీ పి.వి.నరసింహారావు గారి హయాం లో రాయలసీమలో వెలిసి, పల్లెల్లోని బీద, మధ్యతరగతి  పిల్లల్ని మాత్రమే ఎంచుకుని వాళ్ళని రత్నాలుగా తీర్చిదిద్ది, మన రాష్ట్రంలోనే ఓ గొప్ప పాఠశాలగా రెండు దశాబ్దాలపాటు తెలుగు వెలుగుల్ని ప్రపంచం అన్నిదిశలా విరజిల్లి, విరాజిల్లిన పాఠశాల "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం" విద్యార్ధి గా నాకు ఈనాటికీ ఒకింత గర్వంగానే ఉంటుంది.

పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివి, తరువాత ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయొలా కాలేజ్, విజయవాడ" లో ఇంగ్లిష్ మీడియం లో ఉత్సాహంగా చేరినప్పుడు మొదటి సంవత్సరం మార్కులకై చేసిన కృషి అంతా ఇంతా కాదు. Physics, Chemistry లో ప్రతి పాఠం ఒకటికి పది సార్లు చదవాల్సి వచ్చేది, ఐదు సార్లు అర్ధం చేసుకోవటానికి, మరో ఐదు సార్లు అర్ధం అయ్యిన వాక్యాల్ని ఇంగ్లీష్ లో అలాగే గుర్తుపెట్టుకోవటానికి. రెండవ సంవత్సరం వచ్చేసరికి ఇంగ్లీష్ లో అలవాటయిపోయి చాలా సులభంగా అనిపించేది. ఇక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ లో Physics, Chemistry నల్లేరు మీద నత్త నడకే అయిపోయింది. కానీ ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం లో చదివి, ఇంజనీరింగ్ కి వచ్చిన మిత్రులు నేను ఇంటర్ లో పడ్డ కష్టం మొదటి సంవత్సరంలో పడటం చూశాను. ఒక గంట చదివి నేను పరీక్షకి సిద్ధం అయితే, పాపం పది గంటల కష్టం వాళ్ళు పడేవాళ్ళు.

మాతృభాష గొప్పతనం, ఆ భాష ని నేర్చుకుని దాన్ని మాట్లాడుతూ, చదువుతూ, వీలైనంతలో రాస్తూ దాన్ని ప్రేమించటంలో, గౌరవించటంలోనూ ఉంది. నేర్చుకునే ప్రతి విషయమూ ఆ భాషలోనే నేర్చుకుంటేనే క్షుణ్ణంగా వస్తుంది అనుకోవటం ఉత్త "అవివేకం". ప్రతి వ్యక్తీ పెద్దచదువులు చదివి ప్రపంచంలో అందరితో ధీటుగా ముందుకెళ్ళాలి, లేదంటే మనుగడ కష్టం అన్న కాలమిది. దీనికి పునాది పాఠశాలల్లోనే గట్టిగా పడాలి. ఈ పునాదికి భాషా బేధం లేదు, భాష అడ్డూ కాదు. కానీ పై చదువులు ఒక్కసారిగా వేరే భాషలో చదవాల్సి వచ్చినపుడు తప్పకుండా ఆ పునాదికి "భాష" అడ్డుపడుతుంది, కష్టపెడుతుంది. ఈ కష్టం పునాది లోనే పడితే అది మరింతగా గట్టిగా ఉంటుంది. చైనా, జపానుల్తో మనల్నీ, మన పాఠశాలల్నీ పోల్చుకోవద్దు, బ్రిటీషువాళ్ళ ఏలుబడిలో 200 యేళ్ళు వాళ్ళూ ఉండి ఉంటే, వారి భాషాపరిస్థితీ ఈరోజు భిన్నంగా ఉండేది.

ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు "నిరుపేద"ల పాఠశాలలుగా మాత్రమే మిగిలిపోయాయి. వాటిని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో వచ్చే మంచి మార్పులని ఆహ్వానిద్దాం. మధ్యతరగతి, దిగువమధ్య తరగతి, పేదవాళ్ళు సైతం బోలెడు డబ్బులు పోసి తెలుగుని పూర్తిగా వదిలేసిన ప్రైవేటు పాఠశాలల్లో విద్యని "కొనుక్కుని" ఇంగ్లీష్ లో నేర్చుకుంటున్నారు. తెలుగు ని బ్రతికించాల్సింది పేదవాడి గుడిశల్లో కాదు. తెలుగు అనే సబ్జక్ట్ లేకుండా చేసి, అది మాటలాడితేనే ఫైన్లు వేస్తూ, భావితరాలకి అందకుండా చేసి చంపేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లోనే దాన్ని బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆలోచించి సరైనా మార్పులు, చేర్పులు సూచిద్దాం. భాషాభి వృద్ధికై సూచనలు చేయటానికి మేధావులు, అనుభవం లేని "రాజకీయ" నాయకులూ అఖ్ఖరలేదు. ఆలోచనాపరులు, అనుభవజ్ఞులూ కావాలి. తెలుగు మీడియం లో ప్రాధమిక విద్య చదివి, నేర్చిన జ్ఞానం ఇంగ్లీష్ భాషలో పై చదువులు చదివాక ఎంతగా, మరింతగా వృద్ధి చెందిందో...అదే ఇంగ్లీష్ జ్ఞానం, ఆ భాషపైన పట్టూ ప్రాధమిక విద్యలోనూ పొంది ఉంటే, పై చదువుల్లో ఇంకెంతగా రాణించి ఉండేవారో అనుభవంతో నేర్చుకున్న వ్యక్తులందరూ అర్హులే.

నా అలోచనల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే, అభివృద్ధి బాటవైపు (మరి)కొన్ని సూచనలు:

  • ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ పాఠశాల్ల్లోనూ ఒకటవ తరగతి నుంచి, పదవతరగతి వరకూ "తెలుగు" సబ్జెక్ట్ ని  తప్పనిసరి చెయ్యండి.
  • తెలుగు ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తూనే దాని అభివృద్ధి పైనా దృష్టి ని మరింతగా పెంచండి. తెలుగు భాషపైన పట్టు వచ్చేలా పాఠాలని సంస్కరించండి. వీలైతే ఒక్క తెలుగు సబ్జెక్ట్ లోనే పాస్ మార్కులు 35 నుంచి 50 కి పెంచుతూ దాని ప్రాముఖ్యాన్నీ, ప్రమాణాన్నీ పెంచండి.
  • పదవ తరగతి లో 95 కి పైగా తెలుగు లో మార్కులు సాధించిన విద్యార్ధి ఇంటర్మీడియట్ లోనూ తెలుగు భాషని సబ్జెక్ట్ గా ఎంచుకుంటే, ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఏ కాలేజి లో చేరినా ఫీజ్ లేకుండా చెయ్యండి. ఇంకా దరిదాపుల్లో కూడా ఉండనంత ఎక్కువ మోతాదులో స్కాలర్ షిప్ లాంటివి ప్రవేశ పెట్టండి. 99 పైగా మార్కులు వస్తే ఆ గుర్తింపు ఏ డిగ్రీ లో చేరినా వర్తించేలా విస్తరించండి.
  • తెలుగు భాషని బోధించే అధ్యాపకులకి, మాతృభాష ని బ్రతికిస్తూ భావితరాలకి అందిస్తున్నందుకు అందరి ఉపాధ్యాయులకన్నా ఎక్కువ జీతం ఇచ్చి భాషతోబాటుగా, బోధకులనీ గౌరవించండీ, ప్రోత్సహించండీ. మాతృభాష బోధించేందుకు మంచి ఉపాధ్యాయులు పోటీ పడేలా ఉత్సాహభరితమైన వాతావరణం కల్పించండి.
  • తెలుగు భాషా దినోత్సవాన్ని ఒక వారం కి పొడిగిస్తూ, "తెలుగు వారోత్సవ పండుగ" గా ప్రకటిస్తూ, మరే ప్రభుత్వమూ ఇక ఆ వారాన్ని మార్చే వీలు లేకుండా చట్టం చెయ్యండి. ఆ వారమంతా బడిబడి లోనూ, ఇంటింటా, ఊరూరా "తెలుగు వారోత్సవాలు" నడపండి. తెలుగు భాష ఉనికి దశదిశలా విస్తరించేలా ప్రతి తెలుగువాడూ గర్వపడేలా "భాషా పండుగ" అన్న కొత్త ఒరవడికి నాంది పలకండి, మనం ఇతరుల్ని చూసి నేర్చుకున్న మదర్స్ డే, ఫాదర్శ్ డే లాగా, ఇతరులు మనల్ని చూసి నేర్చుకునేలాగా. భాషాసంస్కృతుల్లో సంస్కృతికెలాగూ వీధి వీధినా గుళ్ళూ, సంవత్సరంలో బోలెడు పండుగలు ఉండనే ఉన్నాయి. భాష ని బ్రతికించేందుకు అలాటి పండుగ అవసరం ఆసన్నమయ్యింది.

తెలుగు భాషని బ్రతికించాలని తాపత్రయపడే భాషాభిమానులంతా మంచి సూచనలూ, సలహాలూ చెయ్యండి. తెలుగులో నే బయాలజీ చదువుకోవాలని ఉన్న విద్యార్ధికి ఆ వెసులుబాటు కల్పించండి అన్న అర్ధం లేని వాదన వ్యర్ధం. మనం జీవిస్తున్నది 2019 లో, 1919 కాదన్నది గుర్తించాలి. మేము తెలుగులోనే చదివాం, మేమెదగలేదా అన్న వాదనలోనూ 2019 లో పసలేదు. ఒకప్పుడున్న పోరాట వేదిక ఇప్పుడున్న అంతర్జాతీయ వేదికంత విశాలంగా లేదు. అప్పుడు ఆ వేదికనెక్కిన అందరూ ఆ వేదికపై రాణించారు. ఇప్పుడు ఆ వేదిక చేరాలంటేనే ఆ ప్రమాణాలతో పోటీ పడదగ్గ పునాది పడాలి, అది మరింత గట్టిగా పడాలి. ఆ పునాది ప్రాధమిక పాఠశాలల్లోనే సాధ్యం. దీనికి "అంతర్జాతీయ భాష" దోహదమైతే, మార్గం మరింత సులభం.

మాతృభాషని  బ్రతికిస్తూనే, ప్రభుత్వ కళాశాలల్లానే అందరూ ప్రభుత్వ పాఠశాలల కై పోటీ పడేలా వాటిని తీర్చిదిద్దే ఏ చిన్న ప్రయత్నాన్నైనా స్వాగతించండి, హర్షించండి.

పేదల బ్రతుకుల్లో నింపాల్సింది "తెలుగు" ని కాదు, "వెలుగు" ని. ఆ "వెలుగు" ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వం ఉచితంగా అందించే "చదువు" మాత్రమే.

"వివేకంతో కూడిన చదువును మించిన 'వెలుగు' లేదీలోకంలో!" - గిరిధర్ పొట్టేపాళెం