Sunday, March 5, 2023

Father and Son time...

Portrait of Geno Smith, American Football Seahawks Quarterback player
Oil on Canvas 24" x 36"

Father and Son Time

"Dad, I wanna do some Oil Painting of this over my Spring break." - got a message from my son Bhuvan, last Sunday, a day before he was scheduled to fly from Detroit to Boston for a 5-day Spring break, coming home. Along with the message, he sent me a picture of American Football player - Seahawks team  Quarterback, Geno Smith.

"Sure Boo babu, I will teach you.", I replied.

I was looking forward to the moment. He arrived Monday night. Tuesday morning he wanted to start his very first Oil Painting. Of course, he watched me several times doing Oil Paintings.

Day-1, Tuesday

All my Art material, framed paintings, blank canvases were still inside boxes in the basement in our new house we moved into 2 months ago. I took a 30 minute break after my morning meetings to open up the boxes, finding all required for him to start painting. I was able to locate and find all needed.

In the afternoon break, I quickly showed him on a canvas size newsprint paper, how to start sketching with a pencil, then outlining with a single Oil Paint, and then start underpainting. I even showed him how to hold the brush for an ease of hand movements. Bhuvan has been a keen observer right from his childhood. He picked up all in no time and then get going all by himself.

His underpainting looked very good in just one color of some brown shade. He followed all what I said identifying 3 different areas of light: leaving white canvas in the lighter areas, covering dark areas with paint, and covering light areas with lighter shade of the same color. He was on the right track.

Day-2, Wednesday

He asked me about how to proceed with the next steps. I explained him how to choose colors, mix colors on the palette, start painting the first abstract layer. He continued along the path.

Day-3, Saturday

Two days he didn't touch it, and as he was leaving Sunday morning, he was determined to finish it on Saturday afternoon. He focused on details, changed background the way he was visualizing the finished painting. He was on a mission that afternoon to complete. Indeed he finished and signed. He was so happy of his accomplishment at the end; took lot of pictures with it.

He came to me after dinner and shared his most happy moment, saying- "Dad, do you know that I posted this painting on Instagram and tagged "Geno Smith" and he liked it.", showing me that. I know that a sports star responding to an unknown fan's post/story on social media is a defined moment. I was extremely happy for Bhuvan.

Carrying forward the Legacy...

Kids watch us very closely, learn, and follow. I still remember the only one incident of my Dad doing an art work of "Swami Vivekananda" that I watched a little bit when I was 6 years old. That was a "defining moment" which put me on my Art journey with a life-long passion for it.

I am quite happy that my son started getting back onto his early developed childhood Art sense. Once you feel the "kick" of how satisfied you will be from your creation, you want to experience it again and again. That's an amazing feeling in any Art!

For me, it took 3 months to finish my very first oil painting. Bhuvan did it in just 3 days, working few hours each day. Also, it's big in size, 2 feet x 3 feet. I did not have any master to learn from. That's the difference. Learning from a master is like learning years of his experience in just a very short-time. One must be lucky to have this kind of opportunity. I am lucky to have my Son learning years of my experience.

I am with an amazing feeling now - my soul lives longer with my Son in his first Oil Painting, a first of it's kind experience.

"When my Son carries my legacy, I extend my life."
~ Giridhar Pottepalem


Saturday, November 19, 2022

ఇప్పటికీ, ఎప్పటికీ వేధించే సమాధానం లేని ప్రశ్న...


కొత్త బడి, కొత్త ప్రదేశం, కొత్త మిత్రులు, కొత్త టీచర్స్, కొత్త ఆహారపు రుచులు, కొత్త ఆటలు, కొత్త అనుభవాలు...ఇలా 9 యేళ్ళ ప్రాయానికి "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం" లో 5 వ తరగతి చేరేసరికి ఒక్కసారిగా అన్ని మార్పులు...కలిసి ఒకరకంగా జీవితం రుచి చూడకముందే మళ్ళీ కొత్త జీవనం. ప్రతిరోజూ పొద్దున 5 నుంచి రాత్రి 9:30 వరకూ అంతా కొత్త కి అలవాటుపడేసరికి ఒక సంవత్సరం తెలీకుండానే కొత్తగా గడచిపోయింది.

5 వ తరగతి క్వార్టర్లీ పరిక్షల్లో 36 మంది ఉన్న క్లాస్ లో నా ర్యాంక్ 20. దసరా శలవులనుంచి స్కూలుకి తిరిగి  వచ్చాక, పరీక్షల్లో ర్యాంకులిస్తారని, ఆ వివరాలు ప్రోగ్రెస్ కార్డ్ రూపంలో ఇళ్లకు పంపిస్తారని తెలిసింది. నాన్న రాసిన ఉత్తరం లో "మీ స్కూల్ నుంచి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. మీ క్లాస్ లో నీ ర్యాంక్ 20, ఈసారి పరీక్షల్లో బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి." అని చూసేదాకా ఎంత వెనకున్నానో కూడా అర్ధం కాని వయసు. హాఫియర్లీ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ కోసం పెద్దగా కృషి చేసింది లేదు. కొంచెం మెరుగయ్యి 18 ర్యాంక్ కి చేరాను. యాన్యువల్ పరిక్షలు రాసి వేసవి శలవులకి ఇంటికెళ్తే నాన్న గొంతు క్యాన్సర్ చికిత్సతో "మద్రాస్ విజయా నర్సింగ్ హోమ్" లో ఉన్నాడు. ఒకరోజు తాతయ్య నన్నూ అన్ననూ రైల్లో తీసుకెళ్తే కందుకూరు నుంచి మద్రాస్ వెళ్ళి ఒక్కరోజు ఉండి చూసి వచ్చాము. 

వేసవి శలవులు ముగిశాక, 6 వ తరగతి మొదటి రోజు మొదటి పీరియడ్ తెలుగు. క్లాస్ రూమ్ మారింది, సైన్స్ ల్యాబ్ దగ్గరుండేది. తెలుగు మాష్టారూ మారారు. వరుసకి నలుగురు చొప్పున రెండు వరుసల్లో అందరం రోల్ నంబర్స్ ప్రకారం కూర్చునేవాళ్ళం. నా క్లాస్ రోల్ నంబర్ 4, మొదటి వరసలోనే ఎప్పుడూ. కొత్త తెలుగు మాష్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు సార్. క్లాస్ లో అటెండన్స్ అయ్యాక వరసగా ఒక్కొక్కరినీ లేపి 5 వ క్లాసులో వచ్చిన క్వార్టర్లీ, హాఫియర్లీ, యాన్యువల్ మూడు ర్యాంకులూ చెప్పమన్నారు. నా వంతు వచ్చాక చెప్పాను, క్వార్టర్లీ 20, హాఫియర్లీ 18, యాన్యువల్ 4. మా క్లాస్ లో ఆటూ ఇటుగా మొదటి మూడు ర్యాంకులొచ్చిన ముగ్గురూ మూడు పరీక్షల్లోనూ అవే తెచ్చుకున్నారు. అందరం చెప్పటం అయ్యాక నన్ను లేచి నిలబడమన్నారు. "మీ క్లాస్ లో అందరికన్నా మంచి ర్యాక్ ఎవరు తెచ్చుకున్నరో తెలుసునా, ఈ అబ్బాయి." అంటూ ప్రశంశించారు. అంతేకాదు, "నీ ర్యాంక్ ని ఇలాగే నిలబెట్టుకుని వచ్చే పరీక్షల్లో ఇంకా ముందుకి వెళ్ళటానికి కృషి చెయ్యి." అంటూ ప్రోత్సహించారు కూడా. నాకు అలా ఎందుకన్నారో బోధపడనేలేదు. నాలుగో ర్యాంక్ ఎలా మంచి ర్యాంక్ అవుతుంది, ఒకటి, రెండూ మూడు కదా మంచి ర్యాంకులు అనుకున్నాను. తర్వాత మిత్రుడు పి.వి.రాం ప్రసాద్ చెప్తేకానీ బోధపడలేదు ఎందుకలా అన్నారో.

తర్వాత నాన్న కూడా అలానే మెచ్చుకుంటూ ఉత్తరం రాస్తాడని ఎదురు చూశాను. కానీ అప్పటికే ఉత్తరం రాయలేని స్థితిలో ఉన్నాడని తెలీదు. ఆ సంవత్సరమే సంక్రాంతి శలవుల్లో మమ్మల్ని ఈలోకంలో వదిలి నాన్న  పైలోకాలకెళ్ళిపోయాడు, ఒక సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడి. 

ఆ రోజు తెలుగు సార్ ప్రశంశల స్ఫూర్తితో 6 నుంచి 10 వ తరగతి వరకూ అన్ని పరిక్షల్లో నా ర్యాంక్ ని ఇటుగా నాలుగు కి దగ్గరే నిలుపుకోగలిగాను తప్ప ఎంత ప్రయత్నించినా ఒకటి, రెండు, మూడు...అటు మాత్రం చేరలేకపోయాను. ఎంత కష్టపడ్డా, ఒకటీ రెండు మార్కుల తేడాతో మొదటి ముగ్గురూ అక్కడే ఉంటూ వచ్చేవాళ్ళు. ఒక్కొకసారి మొదటి ముగ్గురిపైన టీచర్స్ ఇంప్రెషన్స్ కూడా అందుకు తోడ్పడుతూ దోహదపడేదేమో.

ఈ 6 వ తరగతి సంఘటనా, తెలుగు మాష్టారూ ఎప్పుడూ గుర్తుకి వస్తూనే ఉంటారు. అప్పటి టీచర్స్ ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక సహజ లక్షణాన్ని గుర్తించి ప్రోత్సహిస్తూ ప్రభావితం చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఒక్కటి మాత్రం అంతుతెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది, ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంది. అసలు  నాకు 4 వ ర్యాంక్ వచ్చిందని నాన్న కి తెలిసిందా, ఆయనున్న పరిస్థితిలో నా ప్రోగ్రెస్ కార్డ్ చూశాడా, చూస్తే మెచ్చుకుంటూ నాకు ఉత్తరం ఎందుకు రాయలేదు, బహుశా అప్పటికి రాయలేని స్థితిలో ఉన్నాడేమో, అని...

కొన్ని ప్రశ్నలకి జీవితంలో సమాధానం దొరకదు, సమాధానం లేని ప్రశ్నలుగానే ఎప్పటికీ మిగిలిపోతాయి...

గిరిధర్ పొట్టేపాళెం
కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం, 1977 - 83, V-X

~~~~ *** ~~~~

Dec 2021, కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ 50 Years Golden Jubilee వేడుకలని పునస్కరించుకుని, ఆ సందర్భంగా మా స్కూల్ తో, మా స్కూల్ లో విద్యార్ధులుగా మాకున్న అనేక తీపి గురుతులనీ, అనుభవాలనీ కలగలిపి ఎప్పటికీ అందరూ హాయిగా చదువుకునేలా ఒక మంచి Coffee Table Book - Souvenir పుస్తకంగా తీసుకు రావాలని నేను Lead తీసుకుని చేసిన ప్రయత్నంలో భాగంగా నా వంతుగా రాసిన నా ఒక తియ్యని అనుభవం. Pandemic, మరియూ ఇతర కారణాలవల్ల ఆ ప్రయత్నం ఆగింది, ఆ పుస్తకం వెలుగు కి నోచుకో(లే)దు.

Saturday, October 8, 2022

విజిల్స్ తో దద్దరిల్లిన మా స్కూల్ ఆడిటోరియం . . .


“ఫిల్మ్ షో” లో వేసిన మొదటి తెలుగు సినిమా, విజిల్స్ తో దద్దరిల్లిన మా స్కూల్ ఆడిటోరియం...

అది 1982 నాటి సంఘటన. మేమప్పుడు 9 వ తరగతిలో ఉన్నాం, కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్, సేవమందిర్, హిందూపురం, అనంతపురం జిల్లా. ప్రతి శనివారం ఫిల్మ్ షో లో ఎక్కువగా సైన్స్ కి సంబంధించినవి, అప్పుడప్పుడు చిన్న చిన్న కార్టూన్ లాంటివీ 16 mm ప్రొజెక్టర్ తో శ్రీ|| రాజా రావు సారు, బయాలజీ, ల్యాబ్ హెల్పర్ చిక్కన్న అధ్వర్యంలో వేస్తుండేవాళ్ళు. L.R.G Naidu ఆడిటోరియం కట్టకముందు న్యూ డార్మిటరీ మధ్యలో ఉన్న ఓపన్ ఏరియా లో సాయంత్రం చీకటిపడ్డాక వేసేవాళ్ళు. మేము 9 వ తరగతికి వచ్చేసరికి ఆడిటోరియం వెలిశాక ఫిల్మ్ షోలు మధ్యాహ్నానికి మార్చారు.

ఒకసారి ఎలా లీక్ అయిందో ఏమో పొద్దున మ్యాథ్స్ స్టడీ అవర్, మా బ్యాచ్ కి రేపు మధ్యాహ్నం ఫిల్మ్ షో లో హిందూపూర్ నుంచి ఒక తెలుగు సినిమా తెప్పించి వేస్తున్నారని తెలిసిపోయింది. ఇక మా క్లాస్ లో ఉన్న N.T.R, A.N.R అభిమానులు మా హీరో సినిమా వేస్తారంటే కాదు మా హీరో అంటూ లేని మీసాలు మెలేస్తూ తిరగసాగాం.

రేపు రానే వచ్చింది, అందరం ఆడిటోరియంలో కింద పద్మాసనాలు వేసి కూర్చున్నాం. తలుపులన్నీ మూసి చీకటి వాతావరణం తో అంతా సిద్ధం. ఇక ఫిల్మ్ ప్రొజెక్టర్ స్విచ్ నొక్కి తెరపై రీలు తిరగడమే ఆలస్యం. అందరిలోనూ ఉత్కంఠ. ప్రొజెక్టర్ తో రీలూ తిరగసాగింది. తెరపై సినిమా మొదలయ్యింది. చిన్నప్పడు హీరో చిన్న రొట్టె దొంగతనం చేయడం, తరువాక ఒక దొంగల ముఠాకి చిక్కి వాళ్లతో కలిసి చిన్న చిన్న నేరాలు చేస్తూ పెద్దవాడై పోలీసులు తరుముతుంటే గోల్డు బిస్కెట్లున్న సూట్ కేస్ తో పరిగెత్తి వెళ్తున్న రైలు చివరి పెట్టెకున్న నిచ్చెన ఎక్కటం...ఎక్కి రైలు పెట్టెలపై పరిగెత్తే N.T.R. పై టైటిల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మొదలవుతాయి, సినిమా టైటిల్ "నేరం నాదికాదు ఆకలిది". అంతే ఇక ఆడిటోరియం N.T.R అభిమానుల విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. అందులో ఎక్కువగా మా క్లాస్ నుంచే విజిల్స్ పడ్డాయి. ఆ విజిల్స్ వెనకే "బోసిరెడ్డి సార్", మా P.E.T, పెద్ద పెద్ద కేకలు. "రేయ్...ఇది స్కూల్ అనుకుంటున్నారా, సినిమా హాల్ అనుకుంటున్నారా, ఆపండి..." అంటూ ప్రొజెక్టర్ కూడా ఆపించి, తలుపులు తెరిచి తిట్లు. అందరూ బిక్క మొహాలు, సినిమా వెయటం పూర్తిగా ఆపేస్తారేమోనని.

కాసేపు తిట్టాక మా బిక్కమొహాలు చూసో ఏమో ఎలాగోలా మళ్ళీ కరుణించి "ఈసారి చిన్న శబ్దం వచ్చినా సినిమా వేసేది లేదు, తిరిగి పంపించేస్తాం" అంటూ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ మొదలెట్టారు, ఇక ఆడిటోరియం లో చిన్న శబ్దం కూడా లేదు, చిన్న చిన్న గుసగుసలు తప్ప. అలా సినిమా రసవత్తరంగా సాగుతుండగా ఒక సీన్ లో మన హీరో ని దొంగలు చాలామంది కలిసి కొడుతూ ఉంటారు, హీరో ఎదుర్కో లేనంత మంది. హీరో కి జుట్టు చెదిరి, రక్తం కూడా వస్తూ ఉంటుంది ఒక పెదవి అంచునుంచి. అలా వాళ్ల చేతుల్లో దెబ్బలు తిని ఒక మఱ్ఱి చెట్టు కిందున్న ఆంజనేయస్వామి విగ్రహం ముందు పడిపోతాడు, దొంగలు చంపడానికి దగ్గరవుతూ ఉంటారు, చాలా ఉత్కంఠ. సడన్ గా ఆంజనేయ స్వామి విగ్రహ పాదాల మహత్మ్యం, చెట్టు ఊడలు పట్టుకుని చాలా కోతులు ఊగుతూ వచ్చి దొంగలపైన పడి హీరో ని రక్షించే ప్రయత్నం మొదలెడతాయి. అంతే, ఒక్కసారిగా నిశ్శబ్ధం చీలుస్తూ మళ్ళీ విజిల్స్ ఆడిటోరియం లో మొదలయ్యాయి, ఈసారింకా పెద్దగా, వెంటనే సడన్ గా సార్ వార్నింగ్ గుర్తొచ్చే మెల్లిగా వాటంతట అవే ఆగిపోసాగాయి. కానీ ఈసారి ఆశ్చర్యంగా "బోసిరెడ్డి సార్" కేకలు వినబడలేదు. వెనక్కి తిరిగి చూస్తే వెనక నిల్చుని చూస్తున్న టీచర్స్ అందరి నుంచి పెద్దగా నవ్వులు, బోసిరెడ్డి సార్ కూడా అందులో నవ్వుతూ కనిపించారు. ఇక సినిమా అంతా ఎంతో సరదాగా అందరి కేరింతల మధ్య ముగిసింది. N.T.R. అభిమానులం మాత్రం కాలర్లు ఎగరేసుకుంటూ బయటికి అడుగులేశాం A.N.R ఫ్యాన్స్ వైపు గర్వంగా చూస్తూ, మేమే గెలిచాం, మాహీరో సినిమానే వేశారు అన్నట్టు.

ఇప్పుడు మాతో భౌతికంగా లేకున్నా మా మనసుల్లోనే ఉన్న మా బ్యాచ్ లో NTR వీరాభిమాని, నా మితృడు "మంగమూరి రామకృష్ణ స్వామి (MRK స్వామి)" ని గుర్తు చేసుకుంటూ...

~ గిరిధర్ పొట్టేపాళెం, 1983 X Class బ్యాచ్


"ఆరు జతల చొక్కాచెడ్డీలు, ఒక్క టవలు, చెప్పుల జతా, దువ్వెన, అద్దం, పళ్ళెం, లోటా, పెన్నూపుస్తకాలతో... ఆరేళ్ళలోఉన్నతంగా ఎదగొచ్చన్న జీవితపాఠం నేర్పింది 'కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం'."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~~~ *** ~~~~

Dec 2021, కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ 50 Years Golden Jubilee వేడుకలని పునస్కరించుకుని, ఆ సందర్భంగా మా స్కూల్ తో, మా స్కూల్ లో విద్యార్ధులుగా మాకున్న అనేక తీపి గురుతులనీ, అనుభవాలనీ కలగలిపి ఎప్పటికీ అందరూ హాయిగా చదువుకునేలా ఒక మంచి Coffee Table Book - Souvenir పుస్తకంగా తీసుకు రావాలని నేను Lead తీసుకుని చేసిన ప్రయత్నంలో భాగంగా నా వంతుగా రాసిన నా ఒక తియ్యని అనుభవం. Pandemic, మరియూ ఇతర కారణాలవల్ల ఆ ప్రయత్నం ఆగింది, ఆ పుస్తకం వెలుగు కి నోచుకోలేదు.

Thursday, September 29, 2022

కదిలే కాలంతో మోసుకెళ్ళే జ్ఞాపకాలు...

Sep 28, 2009 . . .

ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలిద్దరితోబాటు, ఒక రాగి నాణెం (US one-cent Coin) , కొన్ని నవధాన్యాలు తీసుకుని 7 గంటలకి ముందే కార్ లో బయలుదేరా. ఆరోజు దసరా. కొత్త ఇల్లు ఫౌండేషన్ వేస్తామని బిల్డర్ రెండు రోజుల ముందే చెప్పాడు. ఏదీ ముందుగా అనుకోలేదు. కానీ మంచి రోజూ, దసరా అలా కలిసొచ్చాయి. దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాం. కష్టపడి స్వయం సంపాదనతో కట్టుకున్న మొదటి ఇల్లు, 9, 7 ఏళ్ళ పిల్లలు, ఈ ఇంట్లోనే ఆడుతూ, పాడుతూ పెరిగి పెద్దయ్యి రెక్కలొచ్చి కాలేజీలకె(గిరె)ళ్ళిపోయారు.

పిల్లల్తో కలిసి ఇంటా బయటా ఆడిన ఆటలు, చాలా కాలం బ్రేక్ తర్వాత బొమ్మల శ్రీకారం, వారం వారం క్రమం తప్పక కొన్నేళ్ళపాటు ఏకధాటిగా వేసిన వందలకొద్దీ బొమ్మలు, పదకొండేళ్ళు తప్పకుండా ప్రతి సంవత్సరం వినాయకచవితికి మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమలు, ప్రతి బొమ్మలోనూ పెనవేసుకున్న గాలీ, వెలుతురూ, అనుభవం తాలూకు జ్ఞాపకాలూ, జీవితంలోంచి కొందరి వ్యక్తుల నిష్క్రమణా, కొత్త పరిచయాలూ, రెండున్నర సంవత్సరం ఇల్లు కదలనివ్వని కరోనా మహమ్మారి కాలం, ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలతోబాటు కొన్ని చేదు అనుభవాలూ మిగిల్చి పదమూడేళ్ళు వేగంగా కదిలి ముందుకెళ్ళిపోయింది కాలం.

Sep 28, 2022 . . .

ప్రతి ఆదికీ తుది తప్పకుండా ఉంటుంది, అది ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది. సరిగ్గా పదమూడేళ్ళ తర్వాత అదే Sep 28, 2022 రోజు మా ఇంటితో అనుబంధం చివరి రోజు. అంతా యాదృచికమే. ముందుగా అనుకున్నదేమీ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం, కాలం తయారుచేసిన ప్రణాళికలానే అనిపిస్తూ ఆశ్చర్యం. ఎప్పుడెలా ఏం జరగాలన్నది కాలనిర్ణయమేనేమో, కాలమహత్యం అంటే ఇదేనేమో! 

కష్టపడి నిర్మించుకున్న గూడయినా, ఎంచుకున్న బంధమయినా, పెంచుకున్న అనుబంధమయినా వీడి వెళ్లటం కష్టమే. తప్పనపుడు వెళ్తూ తీసుకెళ్ళేది మాత్రం జ్ఞాపకాల్నే.

"కదిలే కాలంతో ప్రయాణించే జీవితం ఎక్కడికైనా, ఎప్పటికైనా మోసుకెళ్ళేది మాత్రం ఒక్క జ్ఞాపకాల్నే."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~~~ ** ~~~~

ఫౌండేషన్ - దసరా ఉదయం, Sep 28, 2009

Framing in progress, Oct 2009

Framing done, Nov 2009

Outside construction, pretty much done, Dec 2009

గృహప్రవేశం, Apr 2010

గృహప్రవేశం, Apr 2010

గృహప్రవేశం, Apr 2010

Good Bye, Sep 28, 2022, 7:20 PM

Monday, September 5, 2022

To a Teacher up in Heavens...

 
Right most sitting in the school photo was my Dad at the
High School, Sullurpet,  Nellore, AP, India

"My Father was my first and best Teacher".

With the best hand-writing I have ever seen and the very best Artistic skills, my Dad was a Teacher by profession. I only had watched him closely before I was 9 years old. At that age, I used to say to myself, when I grow up, I want to write and draw like my father does. Also, the concern he showed for poor kids was something touched me deep.

God neither gave me an opportunity to be his student, nor to wish him a "Happy Teachers Day".

From earth, I wish my Dad up in heavens a "HAPPY TEACHERS DAY" who is guiding and blessing me all my life invisibly.

HAPPY TEACHERS DAY! 💐💐

Sunday, August 21, 2022

పునాదిరాళ్ళు . . .

 
డియర్ చిరు, పుట్టినరోజు శుభాకాంక్షలు!
🌹🎂🌹

తెలుగు సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా మొదలయిన కాలం లో వచ్చిన కథానాయకులు తమ "ఉత్తమ ప్రతిభ" తో ప్రేక్షకుల్ని మెప్పించి, మెల్లిగా ఆదరణ పొంది, ఊపందుకుని, తారాపథానికి చేరి, కాలం మారినా వయసు మీదపడ్డా తాము మారక, వెండితెరపై కథానాయకుల పాత్రలని వీడక, మరెవ్వరికీ చోటివ్వక, పదోతరగతి పిల్లోడి పాత్ర అయినా, కాలేజి బుల్లోడి పాత్ర అయినా తామే అంటూ విగ్గులతో, ఎబ్బెట్టు డ్యాన్సులతో, డూపు పోరాటాలతో ప్రేక్షకుల్ని మభ్యపెడుతూనే వినోదం పంచుతున్న రోజుల్లో... మారిన కాలానికి మళ్ళీ వాస్తవికత తోడై వస్తున్న చిన్న సినిమాల్లో, ఇంకా చిన్న పాత్రలకి సైతం "పెద్ద న్యాయం" చేస్తూ "అత్యుత్తమ ప్రతిభ" కి నిత్య "స్వయంకృషి"నీ చేర్చి ఒక్కొక్కమెట్టూ ఎక్కుతూ, చేసే ప్రతి పాత్రలో రాణిస్తూ, మరెవ్వరూ అందుకోలేని శిఖరాగ్రాన్ని చేరిన తొలి తెలుగు సినిమా వెండి తెర కథానాయకుడు - "చిరంజీవి". 

చిరంజీవి - పేరుకి తగ్గట్టే అంత సత్తా, అంతే క్రమశిక్షణ, కృషీ, పట్టుదలా కలిగిన ప్రతిభావంతుడు. కనుకే అతి క్లిష్టమైన మార్గమైనా కాలానుగుణంగా పాత్రలకి తగ్గట్టు తననీ మలచుకుంటూ తిరుగులేని సుదీర్ఘ ప్రయాణం కొనసాగించగలిగాడు.

ప్రతిభ ఉన్న ఏ నటుడికైనా సహజత్వంతో పాత్రలో మరింత రాణించాలంటే మంచి కథ, అభిరుచి ఉన్న దర్శకుడితోబాటు "వయసుకి తగ్గ పాత్ర" అనే చిన్న అదృష్టమూ తోడవ్వాలి. కొన్నిసార్లు "వయసుకి మించిన" పాత్రలు చేయాల్సి వచ్చినా తపనతోబాటు ప్రతిభ గల నటులెప్పుడూ అందులో రాణిస్తారు. "బడిపంతులు లో NTR" అయినా, "ధర్మదాత లో ANR" అయినా, "సాగరసంగమంలో కమలహాసన్" అయినా, "ఇద్దరు మిత్రులు లో "చిరంజీవి" అయినా ఇలానే తమని నిరూపించుకున్నారు. అలా అని "వయసుకి సరిపడని" పాత్రల్లో రాణించాలంటే ఎంత ప్రతిభ ఉన్నా ఏ నటుడి తరమూ కాదు, వయసూ సహకరించదు. "అరవై లో ఇరవై" పాత్రలు ఇలాంటివే. వీటిల్లో ఒదగాలంటే సహజత్వం తీసి పక్కనబెట్టాలి. అసహజత్వంతో కూడిన మేకప్పుల్నీ, విగ్గుల్నీ, డూపుల్నీ, కెమెరా విన్యాసాల్నీ నమ్ముకోవాలి. ఎబ్బెట్టు అనిపించినా ఇంకా ప్రేక్షకుల్ని మభ్యపెట్టగలం అన్న ధీమానీ తలకెక్కించుకొవాలి. ఇంకెవ్వరినీ వెండి తెరపైకి రానివ్వని ఆ "ఆక్రమణ" కాలంలో ఆ ఆటలు చెల్లాయి, కానీ కాల భ్రమణంలో ఆ ఆటలు కాలం చెల్లాయి. ఇది వాస్తవం!

అనుభవంతో ప్రతిభకి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ కాలానుగుణంగా ముందుకి వెళితేనే ఏ రంగంలో అయినా వరస విజయాలెదురౌతాయి. వాస్తవాన్ని మభ్యపెట్టి స్క్రిప్టులెంత పగడ్బంధీగా రాసుకున్నా, తమ ఇమేజ్ తో ప్రమోషన్స్ చేసుకున్నా, కధనంలో ఎమోషన్స్ తగ్గి అసహజత్వం ఎక్కువై వాస్తవానికి దూరమైతే సాధారణ ప్రేక్షకుడ్ని మభ్యపెట్టి మెప్పించటం ఈకాలంలో అసాధ్యం. ఎంత తన్నినా బూరెలు లేని ఆ ఖాళీ బుట్టలో వాళ్ళు బోల్తాపడరు. సాధారణ ప్రేక్షకుడి నాడి ఎప్పుడూ సింపులే, ఆ సింప్లిసిటీ ని మెప్పించటంలోనే ఉంది "విజేత"  విజయరహస్యమంతా.

ఈరోజుల్లో కష్టం ఎరగకుండా "ఒక్క హిట్టు"తోనే ఎగిరి చుక్కలెక్కికూర్చుంటున్న నటీనటుల్ని "ఒక్క ఫట్టు"తో నేలమీదికి దించి పడేసే శక్తి - ప్రేక్షకుల్ది. కష్టపడి తారాపథం చేరిన నటీనటుల్ని మాత్రం అంచనాల్ని తలకిందులుచేసినా తరవాతి సినిమాకోసం మళ్ళీ అదే అంచనాలతో ఎదురు చూస్తారు. హిట్టా, ఫట్టా అన్నది వాళ్ళు నిర్ణయించేదే. అందుకే వాళ్లని "ప్రేక్షక దేవుళ్ళు" అని తారలు సైతం పైకెత్తుతుంటారు. దేవుళ్ళని శతవిధాలైన నామాలతో కొలిచి మభ్యపెట్టినట్టు వీళ్ళని మభ్యపెట్టటం కుదరదు, నచ్చని సినిమా వీళ్ళచేతుల్లో ఫట్టే. 

సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తే ఒక సినిమా ఫట్టు అన్నా, ఇంకో మూడుంటాయి, ఆ వరసలో జాగ్రత్త పడటానికి. నాలుగేళ్ళకోసారి అలా తెరపై కనిపించి, వందలకోట్లు అనవసరంగా కుమ్మరించి దానికి రెట్టింపు లాగాలన్న ధ్యాస పక్కనబెట్టకుంటే కెరీర్ చివరి దశాబ్ధంలో వచ్చే రెండు మూడు సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ఏమాత్రం మెరుగవ్వదు. కెరీర్ లో మొదటి దశాబ్దం ఎంత ముఖ్యమో ఆఖరి దశాబ్దమూ అంతే ముఖ్యం. అలాంటివాళ్ళే "బిగ్ బి" లా గుర్తుండిపోతారు. దక్షినాది సూపర్ స్టార్ లు ఇప్పటికైనా మారాలి. ఆ బాటలో ప్రయాణించి, యాభై దాటిన వయసులో ఎలాంటి పాత్రలు చెయ్యాలి అన్న మార్గనికి "పునాదిరాళ్ళు" వెయ్యాలి.

విజయాన్ని డబ్బుతో కొలిచే కాలం. సినిమారంగంలో అయితే డబ్బు వలిచి మరీ కొలిచే కాలం. వందల కోట్లు గుమ్మరించి, రెండింతలు ఆశించేకన్నా, అతి తక్కువలో సహజత్వంతో ఆకట్టుకునే మంచి సినిమా తీసి పదిరెట్లు వచ్చేలా చేసుకోగలగటం ఇప్పుడున్న సినిమా లోకంలో నిజమైన హిట్ అంటే. అభిమానగణం ఉన్న పెద్ద హీరోలకిది మరింత సులభం. చెయ్యాల్సిందల్లా చిన్న సినిమా, అంతే! బడ్జెట్ తగ్గించి, మంచి అభిరుచి ఉన్న దర్శకులతో కలిసి మంచి సినిమాలు తీసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తే రాబడితోబాటు, ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్కు గాడిలోపడి తిరుగుతూ పోతే తట్టదు, పట్టదు.

"సినిమా" మళ్ళీ వాస్తవానికి దూరంగా పరుగులు పెట్టకుండా వెనక్కి మళ్ళించే "పునాది రాళ్ళు" గట్టిగా పడాలి. ప్రచారం మీద కృషి తగ్గి ప్రాచుర్యం మీద పెరగాలి. దీనికీ మళ్ళీ చిరంజీవే శ్రీకారం చుట్టాలి. మళ్ళీ ఒక "పునాది రాయి" గట్టిగా వెయ్యాలి. ఈసారి మరింత గట్టిగా, ఒక కొత్త ఒరవడికి నాంది పలికేలా, అందరు స్టార్ లూ ఆ "మెగా దిశ" గా పయనించేలా.

ఒకప్పటి తెలుగు సినిమా ట్రెండ్ ని మార్చిన "చిరంజీవి" మళ్ళీ మార్చగలడనీ, మారుస్తాడనీ ఆశిస్తూ...

డియర్ చిరు,
పుట్టినరోజు శుభాకాంక్షలు! !
🌹🎂🌹

"ప్రతిభకి కృషి తోడైతే విజయాల బాటని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు." - గిరిధర్ పొట్టేపాళెం

Thursday, August 4, 2022

"యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం" in Newspaper...

Facebook లో నా "యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం..." చదివి చాలా మంది స్పందించారు. ఇది Telugu Newspaper లో యధాతదంగా ప్రచురితం చేసిన Gonugunta Kalyan గారికి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ... 🙏


Sunday, July 31, 2022

యాభైఏళ్ళనాటి తియ్యని జ్ఞాపకం - బుచ్చిరెడ్డిపాళెం...

ఈ భూమ్మీదపడ్డాక చుట్టూ ఉన్న మనుషులనీ, ప్రదేశాలనీ గ్రహించి గమనించగలిగే శక్తి కొన్నేళ్ళకి కానీ మనిషికి రాదు. ఒకటి రెండేళ్ళకే ఆ శక్తి వచ్చినా ఇంకో రెండు మూడేళ్ళు ఎలాంటి జ్ఞాపకాలూ గుర్తులేకుండానే గతంలోకి జారుకుంటాయి. నా గతంలో నాకు గుర్తుండి, నేనెళ్ళగలిగే నా అట్టడుగు జ్ఞాపకాల లోతులు నా మూడేళ్ళ వయసు నాటివి. అప్పుడు నా లోకంలో నాకుంది అమ్మ, నాన్న, బామ్మ, అన్న, చెల్లి. ఆ లోకం పేరు "బుచ్చిరెడ్డిపాళెం". "బుచ్చి" గానే అందరూ పిలిచే ఒక పచ్చని ఊరు, నెల్లూరు జిల్లా లో ఒక మోస్తరు పట్టణం.

అప్పట్లో బడిలో చేరాలంటే ఐదేళ్లు నిండాలి. నన్ను మాత్రం నాలుగేళ్ళకే బడిలో చేర్చారు నాన్న, ఐదేళ్ళ అన్నకి తోడుగా. బడికెళ్లక ముందు ఇంట్లో కొన్ని జ్ఞాపకాలున్నా, బడితోనే మొదలయిన జీవితానుభవాలు ఒక్కొక్కటీ జ్ఞాపకంగా గుండెలోతుల్లో చోటుచేసుకున్నాయి. మా బడి ని "కోనేరు బడి" అని పిలిచేవాళ్ళు. ఊరుకి ఒక చివర ఉన్న పెద్ద "శ్రీ కోదండరామ స్వామి దేవాలయం". ఎదురుగా చాలా పెద్ద కోనేరు. ఆ కోనేరు కి నాలుగు పక్కలా రోడ్డు. ఒక పక్కన రోడ్డుకానుకుని ఒక చిన్న బడి, అక్కడే మొదలయిన జ్ఞాపకాలు. మా ఇంటికెదురుగా ఉన్న రోడ్డెక్కి ఒక కాలు కిలోమీటరు (కాలు అంటే పావు అని) నేరుగా నడుచుకుంటూ వెళితే కోనేరు వస్తుంది. కోనేరంటే గుర్తోచ్చే అప్పటి మా ఇంట్లో నా పేచీ జ్ఞాపకం- అన్నకి ఇష్టమైనది ఏదైనా ఇంట్లో చేస్తే అమ్మతో "నేను నీ పిల్లోడ్ని కాదు, కోనేరు దగ్గర తిరణాల్లో దొరికితే తెచ్చి పెంచుకున్నారు, వాడే నీ పిల్లోడు" అని. ఇప్పుడు తల్చుకుంటే ఆ పసితనం లో "అమ్మ ప్రేమ" అంతా తనకి మాత్రమే దక్కాలని పేచీ పెట్టే పసి హృదయం, ఆ వయసులో లోకం తెలియని అమ్మే లోకం అయిన పిల్లలందరూ ఏ కాలంలో అయినా ఇంతే!

ఇండియా వెళ్ళిన ప్రతిసారీ నేను వెళ్ళాలని ఆరాటపడే ఊరుల్లో "బుచ్చి" ఒకటి. కొన్ని సార్లు వెళ్ళటం కుదిరేది కాదు. కొన్ని సార్లు వెళ్ళినా అన్ని ప్రదేశాలూ చూడలేకపోయేవాడిని. ఈసారి 2022 జనవరి లో మాత్రం చూడాలని ఆరాటపడే ప్రదేశాలన్నీ, కొన్ని దాదాపు 45 ఏళ్ళ తర్వాత మొదటిసారి మనసారా చూసుకున్నాను.

అప్పట్లో "బుచ్చి" లో బాగా ఇష్టమైన ప్రదేశం "బెజవాడ గోపాలరెడ్డి పార్కు". ఊరు మధ్య చాలా అందమైన పార్కు. పచ్చని పచ్చిక, పెద్ద పెద్ద చెట్లు, అశోక చెట్లు కూడ, అక్కడక్కడా మంచి నీళ్ళ కుళాయిలు, పెద్ద మెయిన్ గేటు, పార్కు మధ్యలో పెద్ద కొండ, కొండ కింద నీటికొలను, కొలనులో కాలు ముసలి నోటికి చిక్కి తొండం పైకెత్తి మొరపెట్టుకుంటున్న ఏనుగు, మొర ఆలకించి చేతిలో చక్రం తో కొండ మీద ప్రత్యక్షమైన విష్ణు మూర్తి. "గజేంద్ర మోక్షం" కథ ని కళ్లముందు అద్భుతంగా ఆవిష్కరించన వైనం ఎదురుగా, దూరంగా కట్టిన స్టేజి, ఆపైన కట్టిన మైకు సెట్టు, వెనుక ఎత్తైన స్థంభం పై పార్కు మూసే వేళ మోగే సైరను తో సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఆ పార్కుకి నేనూ అన్నా నాన్నతో కలిసి వెళ్ళి ఆడుకున్న చాలా చల్లని సాయంత్రాలు ఇప్పటికీ నిన్ననే అన్నంత స్పష్టంగా గుర్తున్నాయి.

కోనేరు బడిలో ఒకటవ తరగతి, రెండవ తరగతి కొద్ది నెలలూ చదివాను. బడి మెట్లమీద ఇంటర్వల్ లో చిన్న చిన్న సీసాల్లో పొప్పరమిట్లు (పిప్పరమెట్లు), జీడి ఉండలు అమ్ముకునే ఒక అవ్వ మాత్రం జ్ఞాపకాల్లో ఇంకా గుర్తుంది. ఇంకా బాగా గుర్తున్న ఒక సంఘటన, ఇప్పటికీ నేనూ అన్నా తరచూ తలచుకుంటూనే ఉంటాం - ఒక చాలా బీద విద్యార్ధి చిరిగి పోయిన చొక్కా, చెడ్డీ మాసి చెరిగిన తలతో మా క్లాస్ లో ఉండేవాడు. గుడ్డలకి కూడా నోచుకోలేనంత బీద పిల్లలు ఉంటారని అప్పుడే అర్ధం అయ్యింది. ఒకరోజు ఆ విషయం అన్నా, నేనూ ఇంటికొచ్చి నాన్న కి చెప్పాం. తర్వాతి రోజు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకుని రమ్మని నాన్న చెప్పటంతో లంచ్ టైమ్ లో తీసుకొచ్చాం. ఆ అబ్బాయికి మాతోనే ఇంట్లో భోజనం పెట్టించి, మా బట్టలు ఒక రెండు జతలు ఇచ్చి, నూనె పెట్టించి తల దువ్వించి ఆ అబ్బాయిని మాతో బడికి నాన్న పంపారు. అపుడెంతగానో సంతోషించిన మా మనసుల ఆ అనుభవం ఇప్పటికీ మదిలో పదిలమే.

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగేవి. రథోత్సవం, ఇంకా కోనేరులో తెప్ప ఉత్సవం కూడా జరిగేది. ఒక పడవలో దేవుని విగ్రహాలు పెట్టి కోనేరు నీళ్ళల్లో అంతా ఊరేగించేవాళ్ళు. ఒక సంవత్సరం మాత్రమే చీకటి పడే సాయంత్రం వెళ్ళి ఆ తిరునాళ్ళ  సంబరాలు చూసిన గుర్తు. అప్పుడు రోడ్డు పక్కన రంగురంగుల ఆట బొమ్మలు, ఆట వస్తువులు అమ్మే చిన్న చిన్న అంగళ్ళు వెలిసేవి. మామూలుగా ఆ తిరునాళ్ళలో దొరికే కొన్ని ఆట వస్తువులూ, బొమ్మలు తర్వాత కావాలంటే ఎక్కడ వెతికినా దొరకవు. "నక్కలోళ్ళు" అనేవాళ్ళు అవి అమ్మేవాళ్లని. చాలావరకు వాళ్ళు చేత్తో తయారు చేసి తెచ్చి అమ్మేవే అవన్నీ. పిల్లల్ని ఆకట్టుకునే పసుపు, పచ్చ, రోజా, ఎరుపు, బులుగు రంగుల్లో చాలా ఇంపుగా ఉండేవి. చాలా ఆట వస్తువులు వెదురు పుల్లల్తో, లేదా ప్లాస్టిక్ తో చేసి ఉండేవి. ఆ తిరునాళ్ళ లో నాకు కొనిచ్చిన నాకమితంగా నచ్చిన ఒక ఆట వస్తువు - చక్రం. రెండు వేళ్ళతో పట్టి తిప్పి వదిలితే భూచక్రంలా నున్నటి గచ్చుపై ఏకబిగిన చాలా సేపు తిరిగేది. ఆ చక్రంతో సెట్టుగా సన్నని స్టీల్ రేకు తో చేసిన చేప, కప్ప, పాము, గద్ద లాంటి ఫ్లాట్ గా ఉండే పలుచని చిన్న చిన్న బొమ్మలు. ప్రతి బొమ్మకీ ఒక చిన్న సూది తో పొడిచినట్టు మధ్యలో ఒక డాట్ లాంటి నొక్కు ఉండేది. చక్రం తిరిగేప్పుడు ఆ చక్రం మొన కిందకి మెల్లిగా తోస్తూ జరిపి ఏదైనా ఆ బొమ్మ నొక్కు లో చక్రం మొన ఉండేలా చేస్తే ఆ చక్రం తో బాటు నేలపై ఆ బొమ్మ చాలా తమాషాగా కదలాడేది. మ్యాజిక్ ఏంటంటే చేప కదలికలు అచ్చం చేపలానే ఉండేవి, గద్ద అయినా, కప్ప అయినా అంతే, అచ్చం వాటిలానే. అది చాలా వండర్ లా అనిపించేది. ఆ చక్రంతో అలా ఎన్ని గంటలు ఆడి ఉంటానో నాకే తెలీదు. తర్వాతి సంవత్సరం పక్కనే మా ఊరు "దామరమడుగు" కి ఫ్యామిలీ వెళ్ళిపోయాం. అప్పుడు నాన్న కట్టిన మా కొత్తింట్లో గచ్చు చాలా నున్నగా ఉండేది, ఆ ఇంట్లోనూ వాటితో ఆడిన గుర్తులున్నాయి. ఆడి ఆడి ఇరిగిపోగా, మళ్ళీ అలాంటి బొమ్మలు కొనాలని అమ్మనీ బామ్మనీ చాలా సార్లు అడిగేవాడిని. ఎక్కడా దొరకలేదు. ఆ కోరిక ఇప్పటికీ కోరికగానే మిగిలిపోయింది. ఇక తీరదు. "బుచ్చి" అంటే గుర్తుకొచ్చే ఒక తియ్యని జ్ఞాపకం ఇది.

ఇంకా అందరం కలిసి సాయంత్రం నడచుకుంటూ వెళ్ళి "గిరిజా టాకీస్", "మమోలా మహల్" లో చూసిన "దసరా బుల్లోడు", "బుల్లెమ్మ బుల్లోడు", "ఇద్దరు అమ్మాయిలు" లాంటి సినిమాలు, రేడియోల్లో తరచూ విన్న "ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో ఆనందం నిండెనులే...", "నీ పాపం పండెను నేడూ నీ భరతం పడతా చూడు...", "కురిసింది వానా నా గుండెలోనా...", "నల్లవాడే అమ్మమ్మొ అల్లరిపిల్లవాడే...", "చేతిలో చెయ్యేసి చెప్పు రాధా..." పాటలు ఇప్పుడు చూసినా విన్నా అప్పటి జ్ఞాపకాల తరంగాలు తియ్యగా వచ్చి మదిని తాకుతూనే ఉంటాయి. 

ఇంటి కి ఆనుకునే ఉన్న వరిచేలూ, ఆ పక్కన కనిపించే పిల్ల కాలువ మల్దేవు, అది దాటి పార్కు మీదుగా వెళితే నాన్న పనిచేసిన పెద్ద హైస్కూలు, మెయిన్ రోడ్డు దగ్గర ఉండే అరటి పళ్ళు, స్వీట్స్ బళ్ళూ ఇవన్నీ నా చిన్ననాటి "బుచ్చిరెడ్డిపాళెం" చెరగని గురుతులు.

అన్నిటి కన్నా తియ్యనైన గురుతులు మాత్రం చల్లని సాతంత్రం స్కూలు నుంచి నాన్న వచ్చాక నాన్నతో కలిసి "బెజవాడ గోపాలరెడ్డి పార్కు" కెళ్ళి గడిపిన కొన్ని సాయంత్రాలు. చల్లని పైరగాలికి రయ్యిమంటూ దూసుకెళ్ళే తురిమెళ్ల బస్సెక్కి నెల్లూరు కి చేసిన ప్రయాణాలు, ఒకటి రెండు సార్లు నాన్న తో వెళ్ళి చూసిన నాన్న టీచరు గా పనిచేస్తున్న DLNR (దొడ్ల లక్ష్మినరసింహారెడ్డి) గవర్నమెంట్ హైస్కూలు".

నాన్నతో గడిపిన ఆ కొద్ది కాలం...
మదిలో గడచిన చెరగని మధురం!!

అప్పుడే కాదు ఇప్పుడూ "బుచ్చి" అలా పచ్చగానే ఉంది, ఎప్పటికీ అలానే ఉంటుంది. అది "బుచ్చి" ప్రత్యేకత!

"కదిలే కాలంతో కదలక ఆగిపోయే జ్ఞాపకాలే జీవితం."
- గిరిధర్ పొట్టేపాళెం

~~~~~ o o o o ~~~~

యాబైఏళ్ళ క్రితం మేమున్న ఇల్లు ఇప్పటి మొండి గోడలు
ఇంకా నాకోసమేనా అన్నట్టుండటం విశేషం

ఇంటి పక్కన కోనేరుకి వెళ్ళే రోడ్డు..
చెట్ల వెనక ఇరువైపులా ఇప్పటికీ ఉన్న అప్పటి  పెద్ద బంగళాలు

రోడ్డు పక్కన అప్పటి ఒక బంగళా

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - గాలిగోపురం
100 అడుగులతో రాష్ట్రంలోనే రెండవ ఎత్తైన గోపురం

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - లోపల విశాలమైన ఆలయం

శ్రీ కోదండరామ స్వామి దేవాలయం - గోపుర శిల్పాలు

ఆలయ ముఖద్వారం - అప్పుడేసిన బుడి బుడి అడుగుల్లో ఇప్పటి నేను

కోనేరు - ఈ పిక్చర్ లో కుడివైపున రోడ్డు మీదే మా బడి ఉండేది

ఆలయం వెలుపల పక్కన మండపం, స్టేజి

ఆలయ విశిష్టత తెలుపుతూ ఇప్పటి బోర్డ్

నాన్న టీచర్ గా పనిచేసిన హైస్కూల్ ఇప్పటికీ అలానే ఉంది

"పచ్చని బుచ్చి" చుట్టుపక్కల వరి పొలాలు

Saturday, June 18, 2022

కన్నీళ్ళలోనే కనిపిస్తూ కరిగిపోయే "నాన్న" జ్ఞాపకాలు...

 
🌹 "నాన్న" 🌹

"బస్ స్టాండ్" లో శబ్ధాలకి బస్సులో మెలకువొచ్చింది. బహుశా ఉదయం 10 గంటల సమయం. ఎక్కడున్నానో తెలుసుకోటానికి కొన్ని క్షణాలు పట్టింది. నాన్న ఒళ్ళో పడుకున్నా. పక్క సీట్ లో నాన్న లేడు, బస్సాగితే దిగుంటాడు. ఒకవేళ నాన్న వచ్చేలోపు బస్సు కదిలెళ్ళిపోతే, భయంతో అటూ ఇటూ బస్సు విండోలోంచి చూస్తూనే ధైర్యం చేసి లేచి ఒకసారి బస్సు డోర్ దాకా వెళ్ళి తొంగి చూసి కూడా వచ్చా. దిగే ధైర్యం మాత్రం లేదు, బస్సెళ్ళిపోతే, లేదా సీట్ లో ఇంకెవరైనా కూర్చుంటే. కాసేపటికి నాన్నొచ్చాడు, జామకాయలు, అరటిపళ్ళు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని. మనసు కుదుటపడింది. కానీ రాగానే నన్ను ఇదివరకు బస్ స్టాప్ లో అడిగిన మాటే మళ్ళీ అడిగాడు. "నేను చెప్తా డ్రైవర్ కీ, కండక్టర్ కీ, నిన్ను జాగ్రత్తగా స్కూలు దగ్గర దించమని, ఏం భయం లేదు, ఒక్కడివే వెళ్ళగలవు, నేను దిగి వెనక్కి "కావలి" కెళ్ళనా" అని. మళ్ళీ గుండె గుభేలున ఏడుపు "అమ్మో నాకు భయం, నేనొక్కడినే పోలేను" అంటూ. అప్పటిదాకా అలా బస్సాగిన ప్రతిదగ్గరా అడుగుతూనే ఉన్నాడు, పాపం అనుకోకుండా నన్ను స్కూలు దాకా దిగబెట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పట్లో ఫోన్లు లేవు. నాన్న "కావలి బోయ్స్ హైస్కూల్" లో 9, 10 తరగతులకి "ఇంగ్లీష్" & "సోషల్ స్టడీస్" సబ్జక్ట్స్ టీచర్. రెండ్రోజులు స్కూల్ లో ముందు లీవ్ కి పర్మిషన్ తీసుకునే అవకాశం లేకుండా వెళ్ళాల్సివచ్చిన పరిస్థితి, నా స్కూల్ ప్రయాణంతో. నాన్న టెన్షన్స్ గ్రహిచేంత తెలివిగల వయసు రాలా నాకప్పటికింకా.

అప్పుడు నాకు 9 ఏళ్ళు. బస్సాగింది "మదనపల్లి" లో అని తెలిసింది. అప్పట్లో చాలా ఊర్లల్లో బస్ స్టాండ్ అంటే ఊరి మధ్యలో రోడ్డు పక్కన చిన్న మైదానం. గుంటలూ, నీళ్ళూ, చెత్తా-చెదారం తో చుట్టూ చిన్న చిన్న అంగళ్ళు, ఆగ్గానే బస్సు చుట్టూ పరిగెత్తి వచ్చే పళ్ళు, సోడాలు, రకరకాల లోకల్ మిఠాయిలు అమ్ముకొంటూ జీవించే వాళ్ళు...అంతే! ఊరిగుండా వచ్చేపోయే బస్సులు ఆ మైదానంలో వచ్చి కాసేపాగి వెళ్తాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా అక్కడే. ఏవైనా వివరాలు కావాలంటే ఆ అంగళ్ళలోనే అడగాలి. "తిరుపతి" నుంచి "హిందూపురం" దాటి అక్కడి నుండి 3 కి.మీ "సేవామందిరం" పక్కన ఉండే మా స్కూల్ మీదుగా "కర్ణాటక రాష్ట్రం" లో "చిత్రదుర్గ" కి వెళ్ళే బస్ లో ఉన్నాం. "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5 వ క్లాస్ చేరిన సంవత్సరం మొదటి దసరా శలవులకి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్ కి వెళ్తూ నేను, నన్ను తీసుకెళ్తూ నాన్న.

నిజానికి ఒక 8 వ తరగతి సీనియర్ ఫ్రెండ్ "ఆనంద్" ని వాళ్ళ నాన్న మా "కావలి" దగ్గరే "బిట్రగుంట" నుంచి మా స్కూల్ కి తీసుకెళ్తుంటే నన్ను  వాళ్ళతో జతచేసి పంపుతూ ముందుగానే వాళ్ళని కలిసి మాట్లాడి అన్నీ సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేశాడు నాన్న. అనుకున్న ప్రకారం మేము "కావలి" లో ఫలానా రైలెక్కి "బిట్రగుంట" స్టేషన్ లో అదే ఫలానా రైలెక్కే వాళ్లని కలవాలి. నాన్న "నెల్లూరు" లో దిగిపోయి వెనక్కి "కావలి" వెళ్లాలి, వాళ్ళతో కలిసి నేను "తిరుపతి" వెళ్ళి, అక్కడి నుంచి "వెంకటాద్రి ట్రెయిన్" లో "హిందూపూర్" వెళ్ళి, అక్కడి నుండి స్కూల్ కి వెళ్లాలి, ఇదీ ప్లాన్. అనుకున్న రైలెక్కి "బిట్రగుంట" లో చూశాం, వాళ్ళు కనబడలా. నాన్నకి "నెల్లూరు" దాకే టికెట్ ఉంది. నాకేమో "తిరుపతి" దాకా ఉంది. నెల్లూరులోనూ దిగి చూశాం, ఆ రైల్లో ఎక్కడా కనబడలా. పాపం "దామరమడుగు" నుంచి "బామ్మ" కూడా వచ్చింది "నెల్లూరు" స్టేషన్ కి, నాన్ననీ కలిసి ఆ రెండు నిమిషాలు నన్ను చూడాలని. అప్పుడు ఉత్తరాలు, నోటి మాట తప్ప మరే కమ్యూనికేషన్ సాధనాలూ లేవు. అయినా ముందుగా అనుకుంటే, ఎక్కడా ఎవ్వరూ ఎవ్వర్నీ మిస్ అయ్యేవాళ్ళే కాదు. ఎక్కడ ఏ రోజు ఏ టైమ్ కి అనుకుంటే ఆ టైమ్ కి అక్కడ సరిగ్గా కలిసేవాళ్ళు. ట్రెయిన్ ఆగింది కొద్ది నిమిషాలే. అటూ ఇటూ పరిగెత్తినా లాభం లేదు, ఎంత వెదికినా వాళ్ళ జాడ లేదు. తర్వాత అక్కడే ఉండి అట్నుంచి వచ్చే మరికొన్ని  రైళ్లకోసం వేచి, రాగానే వెదికి చూశాం, వాళ్ళు కనిపించలా. మధ్యాహ్నం దాటే దాకా అలా అన్ని రైళ్ళకోసం ఉన్నాం, ఇక ఎలాగో మిస్ అయ్యారనర్ధమైంది. 

ఇద్దరికీ "హిందూపురం" దాకా పోనూ, నాన్న కి రానూ టికెట్స్ కి నాన్న దగ్గర డబ్బులు లేవు. అప్పటికి బ్యాంక్ లే అంతంతమాత్రం. ATM లు కనిపెట్టేదాకా మానవుడింకా ఎదగలేదు. ఎక్కడికి బయలుదేరినా ఖర్చు ఉరామరిగ్గా ఎంతో అంతే జేబులో పెట్టుకునేవాళ్ళు. పాపం నాన్నకి ఎప్పుడూ లేని సంకటస్థితొచ్చింది. మళ్ళీ వెనక్కి "కావలి" వెళ్ళి డబ్బులు చూసికుని వెళ్ళాలంటే నాకింకోరోజు స్కూల్ పోతుంది. "నెల్లూరు" లో బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఆ రాత్రికి అక్కడే ఉండాల్సొచ్చింది. రేపు పొద్దున్నే "తిరుపతి" ప్రయాణం. ఆ సాయంత్రం వాళ్ళింటి దగ్గర్లో ఉన్న "శ్రీరామ్ A/C థియేటర్" లో శోభన్ బాబు "గోరింటాకు" సినిమా కి తీసుకెళ్ళాడు, చాలా బాగా గుర్తుంది, నా మొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్ అనుభవం అది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మొట్టమొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్. అప్పట్లో ఆ వయసులో ఆ థియేటర్ లో సినిమా చూస్తే "ఎవరెస్ట్" ఎక్కినంత సంబరంగా ఫ్రెండ్స్ తో గొప్పగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆ అనుభవం అలాంటిదే, ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికీ అప్పటికింకా ఆ అనుభవం సాధ్యంకాలా.

తర్వాతిరోజు పొద్దున్నే టిఫిన్ చేసి బయల్దేరి మధ్యాహ్నానికి "తిరుపతి" చేరుకున్నాం. బస్ స్టాండ్ లో ఎంక్వైరీ చేస్తే "హిందూపురం" నేరుగా వెళ్ళే బస్సు రోజుకి ఒక్కటే, పొద్దున్నే ఉంటుందని చెప్పారు. ఇక డైరెక్ట్ బస్సుల్లేవు. వెళ్ళాలంటే రెండు మూడు బస్సులు పట్టుకుని ఊర్లు మారి వెళ్ళొచ్చు, కానీ చాలా తిప్పలు పడాలి. నాన్న బస్ స్టాండ్ పక్కనే లాడ్జి లో రూమ్ తీసుకున్నాడు. ఇంకా గుర్తే, మధ్యాహ్నం పక్కనే రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళి ఎంక్వైరీ లో చాలా వివరాలు అడిగాడు ట్రెయిన్స్ గురించి కూడా. కానీ రూమ్ తీసేసుకున్నాం. ఇలా సందిగ్ధాల మధ్య ఎక్కడ భోజనం చేశామో మాత్రం నాకు గుర్తు లేదు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా అని చెప్పాడు. సంతోషానికి అవధుల్లేవు, నా ఫ్యావరెట్ హీరో కృష్ణ "దొంగలకు దొంగ" రిలీజ్ అయ్యుంది, ఆ సినిమా వాల్ పోస్టర్లే ఎక్కడ చూసినా. ఆ సినిమాకే వెళ్దాం అని పట్టుబట్టాను. అప్పట్లో మనం దేనికైనా ఇంట్లో పట్టుబడితే ఉడుంపట్టే, ఇప్పుడైతే పట్టుబట్టకున్నా పట్టించునే నాధుడే లేడు గానీ ;)  సాయంత్రం రెడీ అయ్యి, టిఫిన్ చేసి "దొంగలకు దొంగ" సినిమా ఆడుతున్న "ప్రతాప్ థియేటర్" కెళ్ళాం. టికెట్ కౌంటర్స్ చాలా రష్ గా ఉన్నాయి, నాన్న చాలా ట్రై చేశాడు, దొరకలా, టికెట్స్ అయిపోయాయని బోర్డ్ తిరగేశారు. దానికానుకునే "మినీ ప్రతాప్ థియేటర్" లో "చిల్లరకొట్టు చిట్టెమ్మ" సినిమా కి టికెట్స్ తీసుకున్నాడు. "దొంగలకు దొంగ" తప్ప ఇంకే సినిమా చూడాలని నాకిష్టంలేదు, కానీ తప్పలేదు. పొద్దున్నే చీకటితో లేచి బస్సు టికెట్స్ కొనే దగ్గరనుంచీ నాన్న బస్సెక్కిస్తే నేనొక్కడ్నే వెళ్లగలను అని నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ససేమిరా పోలేనని ఏడుపే అడిగిన ప్రతిసారీ. కలిసి అలా ఆ బస్సులో మా స్కూలు కి బయల్దేరాం.

"మదనపల్లి" దాటాక ఇంక నాన్న ఒక్కడివే వెళ్ళగలవా అని అడగ లేదు. సాయంత్రం స్కూలు చేరుకున్నాం. ఇంకా కళ్ళకి కట్టినట్టే గుర్తుంది. ఒకరోజు స్కూల్ మిస్ అయ్యాను. సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ గేమ్‌స్ ఆడి వచ్చి డిన్నెర్ కి ముందున్న ఒక గంట బ్రేక్ టైమ్ అది. నా ఫ్రెండ్స్ అందర్నీ పలకరించి పరిచయం చేసుకున్నాడు, తర్వాత వాళ్ళని అడిగానని చెప్పు అంటూ ప్రతి ఉత్తరంలోనూ అందరి పేర్లూ రాసేవాడు. "కావలి" కి దగ్గరలో వేరే ఊర్ల నుంచి ఉన్న ఇద్దరు మా సీనియర్స్ , "గౌరవరం" నుంచి మధుసూధన్ 7 వ క్లాస్, "కావలి" నుంచి "ఫణీంద్ర" 6 వ క్లాస్ వాళ్ళనీ పరిచయం చేసుకుని, నన్ను చూసుకోమనీ చెప్పాడు వాళ్లకి. కొత్తగా మాకు స్కూల్ డార్మిటరీస్ లో ఉండే కాట్ సైజ్ కి సరిపడేట్టు ఆ శలవుల్లో ఇంట్లో మూడ్రోజులు మనిషిని పెట్టి బూరగదూది తో వడికించి, కుట్టించి మాతో తెచ్చిన నా పరుపూ, దుమ్ముకి మాసిపోకుండా ఆ పరుపుకి బాగా ఆలోచించి కుట్టించిన ముదురాకుపచ్చ రంగు ముసుగూ, కాట్ కి ఉండే వస్తువులు పెట్టుకునే డ్రాయర్స్, నా సూట్ కేస్ సర్ది, అన్ని జాగ్రత్తలూ చెప్పాడు. చీకటి పడుతూ ఉంది, డిన్నర్ బెల్లు కొట్టగానే నన్ను డిన్నర్ కి పంపించి తిరిగి వెళ్ళిపోయాడు. పాపం, ఆ టైమ్ లో భోజనంకూడా లేదు, స్కూల్ మెస్ లో అడిగుండొచ్చేమో, కానీ అక్కడ మాకు భోజనం ఫ్రీ, పేరెంట్స్ కి లోపలికి ఎంట్రీ లేదు. అక్కడినుండి "కావలి" దాకా ఆ రాత్రి ఎన్ని తిప్పలో చివరికెలావెళ్ళాడో, ఎప్పుటికి ఇల్లు చేరుకున్నాడో ఆ దేవుడికే తెలియాలి. చేరాక కొద్ది రోజులకి ఉత్తరంలో రాసిన గుర్తు, మా సీనియర్ ఫ్రెండ్ వాళ్ళు అనుకున్న ట్రెయిన్ కాకుండా, ముందు వెళ్ళే ట్రెయిన్ తీసుకున్నారని, పొరబాటు అని తెలియక మాకోసం వాళ్ళూ నెల్లూరు, తిరుపతి స్టేషన్స్ కూడా వెదికారని.

తర్వాత సంక్రాంతి శలవులకి నేను నాన్న ఉత్తరంలో రాసినట్టే మా ఇంకో సీనియర్ "గౌరవరం" 7 వ తరగతి అబ్బాయి "మధుసూధన్ రావు" తో కలిసి వచ్చా. శలవులయ్యాక ఆ అబ్బాయితోనే "గౌరవరం" లో కలిసి "నెల్లూరు" నుంచి బస్ లో నన్ను స్కూల్ కి పంపించాడు నాన్న.

వేసవి శలవులకి కూడా మళ్ళీ నాన్న ఉత్తరంలో వివరంగా రాసినట్టే నా సీనియర్ "మధుసూధన్ రావు", క్లాస్మేట్ "రాజశేఖర్" లతో కలిసి "నెల్లూరు" వచ్చి, "కావలి" బస్సెక్కి ఆ అబ్బాయి "గౌరవం" లోనూ, రాజశేఖర్ "చౌదరిపాళెం" రోడ్డు దగ్గరా దిగిపోతే నేను "కావలి" లో దిగా. దిగి నాన్న చెప్పినట్టే అర్ధరూపాయికే రిక్షా మాట్లాడుకుని నా ఎయిర్ బ్యాగు తో ఇంటిదగ్గర రిక్షా దిగా. ఇల్లు తాళం వేసుంది. ఎవ్వరూ లేరు, నాన్న "మద్రాస్" విజయా నర్సింగ్ హోమ్ లో ఉన్నాడు, ఉత్తరాల్లో రాశాడు నాన్న. ఆరోగ్యం బాలేక మద్రాస్ హాస్పిటల్ లో ఉన్నాడనీ, నేను శలవులకి వచ్చేలోపు వచ్చేస్తాడనీ మాత్రం తెలుసు. "గొంతు క్యాన్సర్" అని తెలీదు, ఒకవేళ తెలిసినా అదేంటో, ఎంత డేంజరో కూడా నాన్న చెప్తేనే తప్ప తెలియని వయసు. ప్రతి విషయమూ వివరంగా రాసే నాన్న, తను హాస్పిటల్ లో ఉన్నట్టు, ఏం భయం లేదని ఉత్తరాల్లో నాకు రాశాడు. నేను "కావలి" ఎవరితో కలిసి రావాలో, ఎలా రావాలో, దిగేముందు బస్సులో ఏమీ మర్చిపోకుండా బస్సు జాగ్రత్తగా దిగి రిక్షా ఎంతకి మాట్లాడుకోవాలో, రిక్షా ఆయనకి ఇంటి అడ్రెస్ ఏమని చెప్పాలో కూడా వివరంగా రాశాడు కానీ వచ్చే సరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరని మాత్రం రాయలేదు. ఎందుకు రాయలేదని నాకు ఆలోచనొచ్చింది, కానీ అడిగే అంత కొద్ది సమయం కూడా నేను తర్వాత నాన్నతో లేను. నేనొచ్చే సమయానికి ఎవరో ఒకరిని ఇంటి దగ్గర ఉండి నన్ను రిసీవ్ చేసుకోమని తప్పకుండా చెప్పే ఉంటాడు, ఎవరో మళ్ళీ మిస్ అయ్యేఉంటారు అని మాత్రం నా మనసుకి ఇప్పటికీ తెలుసు. ఆ శలవులన్నీ "కందుకూరు" లో కాపురం ఉంటూ "మార్కాపూర్" లో "డిప్యూటీ కలెక్టర్" గా పనిజేస్తున్న "తాతయ్య" దగ్గర అన్నతో గడిపాను. ఆ శలవుల్లో ఒకరోజు తాతయ్య మా ఇద్దరినీ "మద్రాసు" తీసుకెళ్ళాడు. "విజయా నర్సింగ్ హోమ్" లో విజిటర్ అవర్స్ లో వెళ్ళి కాసేపు నాన్నని చూసి వచ్చాం, అప్పుడు నన్నేం పలకరించాడో, నాతో ఏం మాట్లాడాడో గుర్తు లేదు. ఉత్తరాల్లో రాసినట్టే "బాగా చదువి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నాకు బాగయిపోతుంది, నా గురించి దిగులు పెట్టుకోవద్దు." అని మాత్రం చెప్పి ఉంటాడు.!

జీవితంలో ఊహ తెలిశాక రెండు రోజులు నేనొక్కడినే పూర్తిగా నాన్నతో గడిపిన క్షణాల సంఘటన అదొక్కటే, ఆ నా స్కూలు ప్రయాణం లో! ఏ దురలటూ లేని, ఎందరికో సాయపడుతూ, ఎంతో ఉన్నత భావాలతో ఎందరికో స్ఫూర్తిగా జీవిస్తూ, ఆ కాలం సమాజ హెచ్చుతగ్గులపై కళ్ళముందు పసిపిల్లలని హేళనగా అవమానిస్తే సహించక, అలా అవమానించే వాళ్ళకి కనువిప్పు కలిగిస్తూ, హైస్కూల్ టీచర్ వృత్తిలో పాఠాలు చెప్తూ ఎందరి విద్యార్ధులనో ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన నాన్నని మానుంచి దూరంగా ఇంకొక్క సంవత్సరంలో తనదగ్గరికి తీసుకెళ్ళిపోవాలని, నాన్న కంఠానికి "గొంతు క్యాన్సర్" కర్కశంగా సృష్టించి, బహుశా అంత కర్కశంలోనూ కొంచెం దయతలిచి నాకా రెండు రోజుల జ్ఞాపకాల్ని మాత్రం అందివ్వాలని సంకల్పించి ఆ పరిస్థితుల్ని కల్పించాడేమో "దేవుడు"! నాకెదురుపడితే ఆ దేవుడి కంఠం మూగబోయేలా నిలేసి గట్టిగా "మా నాన్న జీవితంపై నీ హక్కేంది" అని "ఒకే ఒక్క ప్రశ్న" అడగాలని ఆ చిన్న వయసులో బలంగా అనుకున్నా చాలాసార్లు. అలాటి రోజు ఉండదనీ, రాదనీ అప్పుడు తెలీదు. ఇప్పుడు బాగా తెలుసు, అసలు "దేవుడు కేవలం మానవ సృష్టే" అని.

నాలుగు పదులు కూడా నిండని నాన్న జీవితం లో నేనున్నది పదేళ్ళే. "నాన్న" లేకుండా నాలుగు దశాబ్ధాలు దాటి ముందెకెళ్ళిపోయిన నా జీవితంలో నాన్నని తల్చుకోని రోజు ఒక్కటంటే ఒక్కటైనా లేదు. జీవితమంతా కలల్లోనే, కన్నీళ్ళలోనే కనిపిస్తూ, ఆ కలల్లోనే చెదిరిపోతూ, కన్నీళ్ళలోనే కరిగిపోతూ మదిలో మాత్రం "చెదరని కరగని జ్ఞాపకంగానే" ఎప్పటికీ మిగిలి పోయాడు "నాన్న"...

నిండు జీవితం గడిపి తమ పిల్లల ఉన్నతి చూసిన తల్లిదండ్రులూ, ఆ పిల్లలూ అదృష్టవంతులు!

పిల్లల ఉన్నతి చూసి మురిసిపోతూ వాళ్ళ కళ్ళెదుటే ఉన్న తండ్రులందరికీ -  
"హ్యాపీ ఫాదర్స్ డే!" 🌹🌷🌺

---------- o o o ----------

"చిన్నతనంలోనే తమ తల్లిదండ్రుల్ని దూరం చేసిన దేవుడు,
ఎప్పటికీ ఆ పిల్లల ఎదుట కంటబడ(లే)ని దోషిగా నిలబడిపోతాడు."
- గిరిధర్ పొట్టేపాళెం

Saturday, May 28, 2022

వందేళ్ళ "యుగపురుషుడు"...

వందేళ్ళ "యుగపురుషుడు"...

N. T. R. ఈ మూడు ఇంగ్లీష్ అక్షరాలు పక్కపక్కన చేరితే పుట్టే ఫైర్ "తెలుగు తేజం"
సాక్షాత్తూ దైవం భువికి దిగెనా అన్నంతగా వెండితెరపై అవతరించిన "అవతారం"
తెలుగు ఉనికినీ, ఉన్నతినీ, భాషనీ ప్రపంచ దశదిశలా ప్రతిష్టించిన "విశ్వరూపం"
ఇక్కడ గర్జిస్తే ఎర్రకోట సైతం ప్రకంపిస్తుందని నిరూపించిన "రాజకీయ సింహం"

వందేళ్ళ నాటి కారణ జననం తెలుగువారి అరాధ్యం నందమూరి "తారక రామం"

Saturday, April 23, 2022

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 7 ...

 
"Reading Girl"
Reynolds Ballpoint pen on paper (10" x 8")


స్కూల్ రోజుల్లో చదువు, ఆటల మీదే ధ్యాసంతా. అందునా రెసిడెన్షియల్ స్కూల్ కావటంతో రోజూ ఆటపాటలున్నా చదువుమీదే అమితంగా అందరి ధ్యాసా. వారానికొక్క పీరియడ్ ఉండే డ్రాయింగ్ క్లాస్ రోజూ ఉంటే బాగుండేదనుకుంటూ శ్రద్ధగా డ్రాయింగ్ టీచర్ శ్రీ. వెంకటేశ్వర రావు సార్ వేసే బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంత బాగా వెయ్యాలని ప్రయత్నించేవాడిని. అడపాదడపా బొమ్మలంటే ఆసక్తి ఉన్న ఒకరిద్దరం ఫ్రెండ్స్ ఏవో తోచిన బొమ్మలు గీసుకోవటం, అంతే తప్ప సీరియస్ గా కూర్చుని బొమ్మలు వేసేది మాత్రం పరీక్షలు రాసి శలవులకి ఇంటికొచ్చినపుడే. అప్పటి బొమ్మలన్నీ ఎక్కువగా పెన్సిల్ తో వేసినవే. ఇంక్ పెన్ తో వేసినా అవి నచ్చేంతగా కుదిరేవి కావు. సరైన డ్రాయింగ్ పేపర్ లేక ఉన్న పేపర్ లన్నీ ఇంకు పీల్చేవి.

నా మొట్టమొదటి పెన్

బహుశా మూడో క్లాస్ లో ఉన్నానేమో. అమ్మమ్మ వాళ్ళుండే "పొన్నూరు" కెళ్ళాం, పెద్దమామయ్య పెళ్ళికి. నెల్లూరు నుంచి విజయవాడెళ్ళే రైలెక్కి "నిడుబ్రోలు" స్టేషన్ దగ్గర దిగి వెళ్ళాలి. స్టేషన్ నుంచి కనిపిస్తూ నడచి వెళ్ళగలిగేంత దగ్గరే ఊరు. తాతయ్య ఆఫీస్ జీప్ వచ్చి తీసుకెళ్ళేది. అప్పట్లో అర్ధం కాని విషయం, స్టేషన్ పేరేమో "నిడుబ్రోలు", ఊరు పేరేమో "పొన్నూరు". దానికీ ఓ బ్రిటీష్ కాలం నాటి చరిత్ర ఉండే ఉంటది. పలక-బలపం దాటి కాయితం-పెన్సిల్ దాకా వచ్చిన వయసు. అప్పట్లో పెన్ను పట్టాలంటే ఐదో క్లాస్ దాకా ఆగాలి. బాల్ పాయింట్ పెన్నులింకా అంతగా వాడుకలో లేవు, ఫౌంటెన్ పెన్నులే వాడేవాళ్ళు.

అమ్మా పిన్నీ, పెళ్ళి చీరల షాపింగ్ కెళ్ళి వస్తూ నాకూ అన్నకీ రెండు ఫౌంటెన్ పెన్నులు కొనుక్కొచ్చారు. అదే నా మొదటి పెన్ను. వాడిందానికన్నా దాంతో పడ్డ తిప్పలే ఎక్కువ.

ఫౌంటెన్ పెన్నుతోబాటు ఒక ఇంకు బుడ్డీ (కామెల్, లేదా బ్రిల్), ఒక ఫిల్లర్ (పిల్లర్ అనే వాళ్ళం, అది తెలుగు యాసలో వాడే బ్రిటీష్ పదం అనికూడా తెలీదు) కూడా వచ్చి చేరేవి. పెన్నులో ఇంకు పొయ్యాలంటే అదో పెద్ద సవాలే. నిబ్బు ఉండే పెన్ను పైభాగం మర తిప్పి, విప్పి కింది భాగం గొట్టం లోపల ఇంకు పొయ్యాలి. ఒక్కోసారది బిగుసుకుపోయి జారిపోతూ తిప్పలు పెట్టి, పంటి గాట్లు కూడా తినేది. ఎలాగోలా పోస్తే ఎంత ఇంకు పడిందో కనపడేదికాదు, పోసేకొద్దీ తాగీతాగనట్టుండి గబుక్కున నిండి పైకొచ్చి కారేది, నిండింది బుడ్డీలోకి వంచితే ఒకమాత్రాన ఇంకు బయటికి రాదు, వస్తే బుడుక్కున మొత్తం పడిపోయేది. ఆట మళ్ళీ మొదలు. ఎట్టోకట్ట నింపాం లేరా అనిపించి నిబ్బుండే పార్ట్ గొట్టం లో పెట్టి తిప్పితే ఇంకు కక్కేది. అది తుడవటానికి ఒక పాత గుడ్డో, పేపరో కావాలి. లేదా చేతి వేళ్ళతోనో, పాదాలకో, జుట్టుకో, చొక్కాకో తుడిచెయ్యటమే. ఎక్కువైన ఇంకు నిబ్బులోంచి కూడా కక్కేది. విదిలించి మళ్ళీ తుడిస్తేకానీ వాడటం కుదరదు. ఒక్కోసారి రాద్దామని క్యాప్ విప్పితే లోపలంతా ఇంకు కక్కి ఉండేది. నిబ్బులు ఒక మాత్రాన మంచివి దొరికేవి కాదు, సరిగా రాసేవి కాదు. ముందు సగం రెండుగా చీలి గ్యాప్ మధ్య ఇంక్ ఫ్లో సరిగ్గా అయ్యేలా ఆ పనితనం ఎంతో కుదురుగా వస్తేనే గానీ ఆ పెన్నులు రాయవు. నిఖార్సైన నిబ్బు దొరకాలంటే పెట్టిపుట్టాల్సిందే. మంచి నిబ్బు దొరికి బాగా రాసే పెన్నుంటే, "అన్నీ ఉన్నా 'కోడలి' నోట్లో శని (కాలం మారింది 😉)" లా పెన్ను లీకయ్యేది. వడ్డించిన విస్తరిలా బాగా రాసే పెన్ను లక్కు కొద్దీ చిక్కినా, అది ఎక్కువరోజులు బాగా రాస్తే పెద్ద వరం కిందే లెక్క. నిబ్బు చాలా డెలికేట్, రెండు చీలికల మధ్య గాలి దూరేంత గ్యాప్ లో ఇంకు ఫ్లో సరిగ్గా కొలతపెట్టినట్టు పిల్ల కాలవలా పారాలి, మొరాయిస్తే ఆ డెలికేట్ నిబ్బుని నేలమీద సాదాల్సిందే. కొద్ది రోజులు పెన్ను వాడకుంటే లోపల ఇంకు గడ్డగట్టేది. అప్పుడు మెకానిక్ అవక తప్పదు. ఇయన్నీ పక్కన బెడితే రాస్తూ రాస్తూ గబుక్కున ఇంకు గాని ఏ క్లాస్ లో ఉన్నపుడో అయిపోతే పక్కోడి పెన్నులోంచి కొంచెం పోయించుకోవాలి. పిల్లర్ తోనే కష్టం అంటే, ఇంకది సర్కస్ ఫీటే. ఇన్ని కష్టాల్తో రాయటానికే కష్టమయే ఫౌంటెన్ పెన్ ఇక డ్రాయింగుకి వాడాలంటే...పెన్ను మీద సామే.

"హీరో" ఫౌంటెన్ పెన్ 

పేరుకి తగ్గట్టే అప్పటి సినిమా హీరోల్లా టిప్పుటాపు గా ఉండేది. గోల్డు క్యాప్ తో లుక్కూ, నాణ్యతలోనూ చాలా మెరుగు. నిబ్ టిప్పు మాత్రమే కనపడేది. లీకులు తక్కువే, ఖరీదు ఎక్కువే. పదో క్లాస్ లో నా దగ్గర ఒకటుండేది, డ్రాయింగ్ కెప్పుడూ వాడ్లా.

ఎనిమిదో క్లాస్ నుంచీ బ్లాక్ ఇంకే

అప్పట్లో రూలేం లేదు కానీ ఎందుకో అందరూ బ్లూ ఇంకే వాడేవాళ్ళు. టీచర్స్ మాత్రమే రెడ్ ఇంకు వాడొచ్చు అదీ ఆన్సర్ పేపర్స్ దిద్దటం వరకే. నాన్న టీచింగ్ నోట్స్ అన్నీ బ్లూ, రెడ్, గ్రీన్ మూడు ఇంకుల్లో భలే కలర్ఫుల్ గా ఉండేవి. ప్రింట్ లా ఉండే నాన్న రైటింగ్, కొన్ని లైన్లు అండర్ లైన్ రెడ్ లేదా గ్రీన్ ఇంకు తో నీటి పై తేలే అలల్లా భలే అనిపించేది. ఒకసారి ఎనిమిదో క్లాస్ లో ఉన్నపుడు బ్లూ దొరక లేదని బ్లాక్ ఇంకు తెచ్చిచ్చాడు మా హౌస్ మాస్టర్. బ్లాక్ నచ్చి ఇంక నా చదువు పూర్తయ్యేదాకా బ్లూ కలర్  జోలికి పోనేలేదు.

రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ - అప్పట్లో ఒక అద్భుతం

ఇంటర్మీడియట్ దాకా బొమ్మలన్నీ ఎక్కువగా శలవుల్లో ఇంట్లో వేసినవే. అవీ ఎక్కువగా పెన్సిల్ తోనే. బొమ్మలకి పెన్ను పట్టటానికి కారణం అప్పట్లో ఫౌంటెన్ పెన్నులని మూలకి నెట్టి రెవెల్యూషన్ లా వాడుకలోకొచ్చిన "బాల్ పాయింట్ పెన్నులు".

ఫౌంటెన్ పెన్ లని తంతూ బాల్ పాయింట్ పెన్నులొచ్చిపడ్డా, మంచి క్వాలిటీ బాల్ పాయింట్ పెన్నులు ఇండియన్ మార్కెట్ లోకి రాటానికి కొన్నేళ్ళు పట్టింది. అలా వచ్చిన "పెన్ రెవల్యూషన్" లో బాల్ పాయింట్ పెన్ స్వరూపాన్ని పూర్తిగా మారుస్తూ వచ్చింది "రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్". నాజూగ్గా చూడముచ్చటైన better and simple design, good quality material, pleasant white, very smooth writing flow, fine pointed tip, పెన్ను తో బాటు రీఫిల్ కూడా కొంచెం పొడుగు, ఇలా అన్ని విధాలా ఎంతో మెరుగైన పెన్. మొదట బ్లాక్, బ్లూ రెండు రంగుల్లోనే దొరికేది. తర్వాత రెడ్, గ్రీన్, వయొలెట్ రంగుల్లో కూడా వచ్చాయి. అయితే ఒక్క బ్లాక్, బ్లూ మాత్రమే fine pointed ఉండేవి. అందరి జేబుల్లో రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నే ఉండేది, అంతగా పాపులర్ అయ్యింది అప్పట్లో.

రెనాల్డ్స్ పెన్ తో చాలా బొమ్మలేశాను. అన్నిట్లో ఇప్పటికీ ఈ మూడు బొమ్మలు మాత్రం చాలా ప్రముఖం నా స్వగతం లో.

మొదటి స్థానం - సోఫా లో పేపర్ తో రిలాక్స్డ్ గా...

ఈ బొమ్మ "కావలి" లో మేమున్న నారాయణవ్వ ఇంట్లో సాయంత్రం చీకటిపడి లైట్లు వెలిగే వేళ, ఏమీ తోచక తికమక పడే సమయం, అప్పట్లో అద్భుతమైన పేపర్ క్వాలిటీ తో మొదలయిన మ్యాగజైన్ "Frontline" లోని ఒక పేజి లో Advertisement ఆధారంగా వేసింది. ఏమీ తోచని సమయం టైం పాస్ కోసం పేపర్, రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నూ పట్టుకుని గీయటం మొదలెట్టా. బాగా వస్తుండటంతో శ్రద్ధగా వేస్తూ ఒక్క సిట్టింగ్ లోనే ముగించేశా. బాగా వేశానని చాలా మురిపించింది, అదంతా రెనాల్డ్స్ పెన్ను మహిమే అనిపించింది. నిజమే, డ్రాయింగ్ కి వాడే క్వాలిటీ మెటీరియల్ బొమ్మ స్వరూపాన్ని పూర్తిగా ఎలివేట్ చేసేస్తాయి. బాల్ పాయింట్ పెన్నుతో నేను వేసిన బొమ్మలన్నిటిలో నేనిచ్చే ప్రధమ స్థానం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ బొమ్మకే. ఎప్పుడు చూసినా నాకే ఆశ్చర్యం, ఆ ఫైనెస్ట్ గీతల స్ట్రోక్స్.

బొమ్మలో "హెయిర్" ఫోకస్డ్ గా వెయ్యటం అంటే చాలా ఇష్టం. ఈ బొమ్మలో అది స్పష్టం. ఇప్పటికీ నేనేసే చాలా పోర్ట్రెయిట్స్ సెలక్షన్ లో స్పెషల్ క్వాలిటీ హెయిర్ స్టయిల్ దే.

తరువాతి రెండు స్థానాలూ - "భానుప్రియ" వే...

పుస్తకాలంటే ఎప్పుడూ మక్కువే. విజయవాడ లో ఇంజనీరింగ్ టైం లో ఆర్ట్ పుస్తకాలు కొన్ని కొనటం మొదలెట్టాను. ఎక్కువ దొరికేవి కాదు. వారపత్రికల్లో, వార్తాపత్రికల్లో వచ్చే ఆర్ట్స్ కట్ చేసి పెట్టుకునే వాడిని. "అలంకార్ థియేటర్ సెంటర్" ఫుట్ పాత్ ల మీద ఆదివారం సాయంత్రం పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు. ఒక్కడినే పనిగట్టుకుని "కానూరు" లో కాలేజి నుంచి బస్సెక్కి అక్కడిదాకా వెళ్ళి ఫుట్ పాత్ లన్నీ సర్వే చేసేవాడిని. అలా సర్వేలో దొరికొందొకసారి, "ఫిల్మ్ ఫేర్ (FILMFARE)" ఇంగ్లీష్ మూవీ మ్యాగజైన్ భానుప్రియ ముఖచిత్రం, అండ్ బాలీవుడ్ లో ఇంటర్వ్యూ తో. అందులో ముచ్చటైన కొన్ని పోర్ట్రెయిట్ ఫొటోస్ చూసి బొమ్మలు వెయటంకోసమే కొన్నాను. అవి తెలుగు సినిమా హీరోయిన్లందరూ బాలీవుడ్ లో తమ సామర్ధ్యాన్నీ, అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్న రోజులు.

ఈ రెండు బొమ్మల్లో సంతకం కింద డేట్స్ చూస్తే వరుసగా రెండు రోజుల్లోనే వేసా రెండూ. ఆ మ్యాగజైన్ లో చాలా ఫొటోస్ ఉన్నా ఈ రెండే ఎంచుకున్నాను, కారణం కేవలం హెయిర్ కావచ్చు. అప్పట్లో మొదలెట్టిన పోస్టర్ కలర్ పెయింటింగుల్లోనూ హెయిర్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టేవాడిని.

మా కాలేజి హాస్టల్ కి న్యూ యియర్ ముందు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆయన వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ తో చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అమ్మే వాడు, ఆయనకి ప్రతి సంవత్సరం రెగ్యులర్ కస్టమర్ ని నేను. చాలా కొనేవాడిని ఆర్ట్ మీద ఇష్టం, అండ్ ఆయనకి ఆర్ధికంగా కొంతైనా సహాయం అని. అక్కడి ఆఖరి న్యూ యియర్ నేను ఫైనల్ యియర్ లో ఉన్నపుడు కూడా వచ్చాడు, అప్పుడు నేను వేస్తున్న బొమ్మలన్నీ చూసి ఎంతో మెచ్చుకున్నాడు. మీ బొమ్మల్లో స్పెషల్ "హెయిర్" అని చెప్పేదాకా నాకూ తెలీదావిషయం. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న "బి.సరోజా దేవి" గారి పూర్తి డ్యాన్స్ స్టిల్ చూసి కలర్ లో పోస్టర్ కలర్ పెయింటింగ్ వేశాను, నేనూ న్యూ యియర్ గ్రీటింగ్ కార్డ్ కోసం అని. అందులో కూడా హెయిర్ కి నేనిచ్చిన ప్రత్యేక శ్రద్ధ చూసి ఆయనిచ్చిన కితాబు అది. తర్వాత నా బొమ్మలు శ్రద్ధగా గమనించే నా ఫ్రెండ్ "వాసు" కూడా తరచూ అదే మాటనేవాడు, "నువ్వేసే అన్ని బొమ్మల్లో హెయిర్ మాత్రం సూపర్ గిరీ" అని.

ఈ రెండు "భానుప్రియ పోర్ట్రెయిట్స్" లోనూ హెయిర్ ప్రత్యేకం. శ్రద్ధా, సహనం, శైలీ, నైపుణ్యం వీటన్నిటికీ స్వీయ పరిక్ష పెట్టుకుని మరీ గీశాను. ఈ మూడు బొమ్మలూ స్ట్రెయిట్ గా రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ తో వేసినవే. ముందుగా పెన్సిల్ స్కెచింగ్, అవుట్ లైన్ లాంటి తప్పులు సరిదిద్దుకోగలిగే అవకాశాలకి అవకాశమే లేదు. ఎక్కడ గీత దారి తప్పినా మొత్తం బొమ్మా అప్పటిదాకా పడ్డ శ్రమా రెండూ వృధానే. ఓపికున్న శిల్పి చేతిలో ఉలితో చెక్కే ఒక్కొక్క దెబ్బతో రూపుదిద్దుకునే శిల్పం లాగే, ఒక్కొక్క పెన్ స్ట్రోక్ తో ఓపిగ్గా చెక్కిన బొమ్మలే ఇవీ...

"బొమ్మలాగే జీవితమూ ఎంతో సున్నితం, దాన్ని ఓపికతో చెక్కి అందమైన శిల్పంగా మలచుకున్నపుడే దాని పరమార్ధానికి అర్ధం బోధపడేది."  - గిరిధర్ పొట్టేపాళెం

~~~~ 💙💙💙💙 ~~~~

"Bhanu Priya"
Reynolds Ballpoint Pen on Paper


"Bhanu Priya"
Reynolds Ballpoint Pen on Paper

Saturday, March 5, 2022

"పిన్ని" - "అమ్మ" తర్వాత అంతటి కమ్మదనం, ఆప్యాయత నింపుకున్న తెలుగు పదం...

నా వాళ్లందరితో చాలా ఏళ్ళ తరువాత నేను జరుపుకున్న
నా పుట్టినరోజు కి "పిన్ని" శుభాకాంక్షలు, 2017

ఊహ తెలిసిన నాటి నుంచీ ఆ పిలుపూ ఆప్యాయతా మాకెంతో దగ్గరగానే ఉన్నాయి, పిన్ని రూపంలో. అప్పుడు నాకు బహుశా ఆరేళ్ళు. అయినా ఇంకా బాగా గుర్తుంది. "చీరాల" లో తాతయ్య తహసిల్దారు (అంటే ఒక తాలూకా కి హెడ్) గా ఉన్నారు. శలవులకి మేము దామరమడుగు నుంచి బయల్దేరి నెల్లూరులో రైలెక్కి సంబరంగా చీరాల చేరాం. "పిన్ని" ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరం కొద్ది గంటలు అటూ ఇటుగా చీరాల చేరుకున్నాం.

ఆ శలవులకి చీరాల చేరినరోజునే మధ్యాహ్నం, ఎప్పుడూ ఆటల్తో చలాకీగా ఉండే నేను కదలకుండా పడుకునే ఉన్నాను. నా వళ్ళు కాలిపోతుండటం చిన్నమామయ్య మొదటిగా గుర్తించాడు. ఇంట్లో అమ్మ, పిన్ని, అమ్మమ్మ, చిన్నమామయ్య, పిల్లలం మాత్రమే ఉన్నాం...ఇంతవరకే గుర్తుంది.

తర్వాతి రోజు కళ్ళుతెరిచి చూస్తే అమ్మ, పిన్ని ఇద్దరితో నేను హాస్పిటల్ లో ఒక రూమ్ లో, గంట గంటకీ వచ్చిపోయే డాక్టర్లు నర్సులు, బెడ్ దిగకూడదు. నాకిష్టం లేని పాలు గడగడా తాగెయ్యాలి, ఇంకెవరైనా అయితే ఈ ఒక్క మాట మాత్రం అస్సలు వినేవాడిని కాదు. కానీ చెప్పింది "పిన్ని". కాబట్టే గడగడా తాగేసేవాడిని. నాకు టైఫాయిడ్ జ్వరం అనీ, ఒక పదీఇరవై రోజులు చెప్పినట్టు వింటే తగ్గిపోయి ఇంటికెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చనీ "పిన్ని" చెప్తేనే తెలిసింది.

అప్పుడు అమ్మతో అన్నిరోజులూ అక్కడ మాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ త్వరగా కోలుకునేలా చూసుకుంది "పిన్ని". తర్వాత తెలిసింది నేను స్పృహలేకుండా వళ్ళు కాలిపోతూ పడుకుని మన స్మారకంలో లేకుండా ఉంటే అమ్మ ఏడుస్తూ దేవుడింట్లోకెళ్ళి పడిపోయిందని, అప్పుడు "పిన్ని" ఒక్కటే ధైర్యంగా పరుగున నన్ను భుజాన వేసుకుని ఇంట్లో ఉన్న ఒక జవాన్ (అప్పట్లో కనీసం ఒకరిద్దరు బంట్రోతులు తహసిల్దారు ఇంట్లో విధిగా రోజూ ఉండేవారు, ఏవైనా పనుల సాయంకోసం. ఒక జీప్ కూడా ఉండేది) సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి చేర్చిందని. ఆలశ్యం అయితే ఏమయ్యేదో ఊహకే అందని ఆలోచన అని. నా జ్ఞాపకాల్లో "పిన్ని" తో నా మొట్టమొదటి జ్ఞాపకం ఇదే. తన అక్కకే కే కాదు, మా ఫ్యామిలీ లో అక్కరకురాని ఎవరికి ఏ ఆపద వచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడేది "పిన్ని".

నాన్న పోయాక, నెల్లూరు లో ఉంటున్న "పిన్ని" శలవులకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతో బాగా చూసుకునేది. ఒకసారి పిల్లలనందరినీ రిక్షాల్లో నెల్లూరు , కనకమహల్ లో "రామదండు" సినిమా కి తీసుకెళ్ళింది. అప్పుడు పిల్లలం, మమ్మల్నందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. సినిమా చూసి రిక్షాల్లో ఇంటికి వెళ్తూ మేమూ పిన్ని తో "రామదండు" లోని పిల్లల్లా ఫీల్ అవుతూ సంబరపడిపోయిన ఆ రోజు ఇప్పటికీ కళ్ళకి కట్టిన అందని "అందని జ్ఞాపకమే".

నేను రెసిడెన్షియల్ స్కూల్ నుంచి శలవులకి వచ్చి వెళ్ళేప్పుడు ప్రతిసారీ కావలి నుంచి బస్ దిగి నెల్లూరులో సాయంత్రం పిన్ని దగ్గరికెళ్ళి కాసేపు ఉండి భోజనం చేసి రాత్రి బస్ అనంతపూర్ కి వెళ్ళటం పరిపాటి. ఇలా చాలా సార్లు వెళ్ళిన జ్ఞాపకం. నేను 8 వ తరగతికి వచ్చే సరికి పిన్ని వాళ్ళూ కావలికొచ్చి స్థిరపడిపోయారు. ఇక అప్పటి నుంచీ శలవుల్లో నాలుగైదురోజులకొకసారి పిన్ని దగ్గరికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. శలవుల్లో అందరం కలిసి అప్పుడప్పుడూ "దామరమడుగు" వెళ్ళి "బామ్మ" తో గడిపే వాళ్ళం. అలా "కావలి" లో ఒకే ఊర్లో అందరం కలీసి పెరిగిన జ్ఞాపకాల్లో "పిన్ని" లేని సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 

"పిన్ని" గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ వెనకే ఎక్కువగా గుర్తుకొచ్చే సంఘటన ఒకటి -
నేను "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5th క్లాస్ నుంచి 10th దాకా ఆరేళ్ళు చదివాను. కొంతమంది స్నేహితులకి వాళ్ళ తలిదండ్రులు అప్పుడప్పుడూ వచ్చి, బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చిచ్చి, ఒకపూట ఉండి, అన్నీ చూసుకుని మరీ వెళ్ళేవాళ్ళు. ఆ ఆరేళ్ళలో ఎప్పుడూ ఎవ్వరూ నన్ను చూట్టానికి రాలేదు. నాన్న బ్రతికుంటే ఎన్నోసార్లు తప్పకుండా వచ్చి ఉండేవాడు. అమ్మకి అంత అండదండలు లేవు, అన్న నాకన్నా ఒక్క సంవత్సరమే పెద్ద.

కానీ ఒకరోజు నాకోసం వెతుక్కుని మరీ ఒకాయనొచ్చాడు. ఆయనెవరో నాకు తెలీదు, ఎప్పుడూ చూడనైనాలేదు. అప్పుడు 9th క్లాస్ లో ఉన్నాననుకుంటా. సాయంత్రం గేమ్స్ పీరియడ్ అయ్యాక వాళ్ళనడిగీ వీళ్ళనడిగి నా రూమ్ కనుక్కుని వచ్చి నన్ను కలిశాడు. "నేను నీకు మామయ్యని అవుతాను. పిన్ని పంపింది, చూసి రమ్మని" అని రెండు "క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్" ఇచ్చాడు. నాకు అంతుబట్టలేదు. ఎవరైనా పొరబాటున ఇంకొక పిల్లోడి కోసం వచ్చి నాకిచ్చిపోయాడా ఈయనెవరో నేనెప్పుడూ చూడలేదు అన్న సందేహం ఆయన వెళ్ళాక కూడా ఉండిపోయింది. కానీ తెల్లమొహం వేసుకుని ఉలుకూ పలుకూ లేని నన్ను ఆయన "గిరిధర్ నువ్వేకదా" అని మళ్ళీ అడిగి మరీ ఖచ్చితంగా "నీకోసమే, పిన్ని ఇచ్చి నిన్ను చూసి రమ్మంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. మా స్కూల్ మొత్తానికి నా పేరుతో ఇంకెవ్వరూ లేరు, ఖచ్చితంగా నేనే. కానీ ఎక్కడో ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో హిందూపురం దగ్గర ఒక మారుమూల పల్లెటూరు పక్కన "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూలు". ఆ పేరింటేనే అలాంటి పేరుతో ఒక ఊరుంటుందా అన్న సందేహమే తప్ప దారి కనుక్కోవటమే కష్టం ఆరోజుల్లో. అసలు ఈ స్కూలు కి "కావలి" నుంచి ఎలా రావాలో తెలుసుకుని రావటం కూడా కష్టమే. ఇంత దూరం "పిన్ని" ఈయనెవర్నో ఎందుకు పంపుతుంది, ఆ ఏమోలే, అని నాలుగు రోజులు ఆ "క్రీమ్ బిస్కెట్లు" తినే సంతోషంలో ఉండిపోయాను. ఆరోజుల్లో జాబుజవాబులే కమ్యూనికేషన్. శలవులకి ఇంటికెళ్ళాక "పిన్ని" గుర్తుచేసింది ఆ విషయం. అప్పుడు అర్ధం అయ్యింది, నాకు తెలియని ఒక బంధువు పనిమీద "అనంతపురం" దగ్గరికి వెళ్తుంటే చూసి రమ్మని "పిన్ని" చెప్పిందనీ, వెళ్తూ "బిస్కెట్ ప్యాకెట్స్" తీసుకుని వెళ్ళమని మరీ చెప్పి పంపిందనీ. ఆ సంఘటన శిలపై చెక్కిన చెరగని గుర్తుగా నా పసిమనసు పై ముద్రపడిపోయింది. అన్నేళ్ళు దూరంగా ఉన్న నా దగ్గరికి ఒక్కరు చూట్టానికి వచ్చారు, ఆ ఒక్కరూ "పిన్ని" పంపితేనే అని. అప్పట్లో మామూలు బిస్కెట్లే అమృతంకన్నా మిన్న, ఇక "క్రీమ్ బిస్కెట్లు" అంటే అది దేవతలకి దక్కిన అమృతం కన్నా ఎక్కువే, దక్కనిదింకేదో. అది నాకు దక్కించింది మా "పిన్ని".

ఒకసారి ఇంజనీరింగ్ చేస్తున్నపుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి "తిరుపతి" లో. చూసుకుని  వెనక్కి "విజయవాడ" వెళ్తూ, అప్పటికప్పుడు అనుకుని "కావలి" లో ముగ్గురు ఫ్రెండ్స్ తో దిగిపోయాను, వాళ్ళకి మా ఊరుని, మా ఇంటినీ, అమ్మనీ, అన్ననీ పరిచయం చెయ్యాలని. ఇలాంటపుడు అమ్మకి "పిన్ని" నే కొండంత అండ. ఆ రెండ్రోజులూ వచ్చి అమ్మకి అండగా ఉండి, మాకు వంటలూ, వడ్డింపులూ చేసి వెళ్ళింది. 

ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి అయ్యాక జాబ్ కోసం "హైదరాబాద్" వచ్చాను. అప్పట్లో "కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్" కి సరయిన జాబ్స్ లేవు. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరికి అప్పుడే ఏదో ఒక జాబ్ వచ్చేసింది. రెండు నెలల కృషి, అయినా జాబ్ రాలా. ఒకరోజు దిగులుగా ఇంటికి ఉత్తరం రాశాను. దానికి జవాబుగా వచ్చిన ఉత్తరం నన్నెంతో ఉత్సాహపరిచింది. అది రాసింది "పిన్ని". "గిరీ నువ్వెళ్ళి రెండు నెలలు కూడా కాలేదు, నీకప్పుడే ఏం వయసయిపోయిందని రా జాబ్ కోసం అంతగా దిగులు పడుతున్నావ్. తప్పకుండా వస్తుంది, త్వరలోనే, ధైర్యంగా కృషి చెయ్యి." అంటూ రాసింది. ఆ ఉత్తరం కొండంత ధైర్యాన్నిచ్చింది. తర్వాత ఒక నెల లోపే మొదటి జాబ్ లో జాయిన్ అయ్యాను. "పిన్ని" రాసిన ఆ "ఒకే ఒక్క ఉత్తరం" ఎప్పటికీ మరచిపోలేను.

నా పెళ్ళికి దగ్గరుండి నలుగు పెట్టి నన్ను పెళ్ళికొడుకుని చేసింది మా "పిన్ని".

తర్వాత అమెరికా వచ్చి స్థిరపడిపోయాను. "పిన్ని" కూడా కొన్నేళ్ళు తన కూతురు "ఇందు" దగ్గర "కాలిఫోర్నియా" లో ఉండేది. ఒకసారి అందరూ "బోస్టన్" లో మా ఇంటికొచ్చి కొద్దిరోజులుండి వెళ్ళారు. అప్పుడు మొదటి డిన్నెర్ కి, వచ్చేముందే ఒక కూర మాత్రం నేనే చేశాను, "చికెన్ ఫ్రై". భోజనం దగ్గర "పిన్ని" కి చిన్న పజిల్ విసిరాను. "ఉన్న కూరలన్నింటిలో ఒక్క కూర నేను చేశా పిన్నీ, ఏదో చెప్పుకో చూద్దాం, నువు చెప్పలేవు" అని. మరీ అంత నిఖ్ఖచ్చిగా అడిగే సరికి తప్పు పోకూడదని అన్నీ రుచి చూసి కనిపెట్టేశా అని, చాలా సమయస్ఫూర్తిగా-  "ఏదో కరెక్ట్ గా చెప్పలేను కాని ఖచ్చితంగా చికెన్ మాత్రం కాదు" అంది. అదొక్కటే పిన్నీ నేను చేసింది అంటే నిజంగానే బిత్తరపోయింది. "ఇది చేసింది నువ్వా, ఇంక గొప్ప టేస్ట్ చికెన్ నేనెపుడూ తిన్లేదు" అంది. తర్వాత వెళ్ళేరోజు మళ్ళీ నాతో చేయించుకుని "కాలిఫోర్నియా" తీసుకెళ్ళింది. ఎన్నో సార్లు మాటల్లో "నువు చేసిన చికెన్ ఫ్రై టేస్ట్ అట్టనే నా నాలిక మీద నిలబడిపోయింది గిరీ" అనేది. బహుశా పిన్ని కి నేనిచ్చిన తియ్యని గురుతు ఇదేనేమో.

ఇక శలవుల్లో "పిన్ని" తో మేమంతా కలసి వెళ్ళిన తిరుమల ప్రయాణాలూ, రామాయపట్నం సముద్ర విహార భోజనాలూ, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని తియ్యని అనుభూతులే!

నెలన్నర క్రితం "పిన్ని" కి ఆఖరి "సంక్రాంతి". క్యాన్సర్ తో చివరి రోజులు. నేనూ ఇండియా లో ఉన్నాను. రాలేని పరిస్థితిలోనూ ఎంతో తపనపడి, ఎంతో కష్టపడి కూతురు "ఇందు" తో  "హైదరాబాదు" నుంచి "నెల్లూరు" వచ్చి కొద్దిరోజులుండి మాతో పండుగ జరుపుకుంది. సంక్రాంతి కి నాకూ, అన్నకీ బట్టలు పెట్టింది. "పిన్ని" చేతుల మీదుగా కొత్త బట్టలు అందుకుని సంక్రాంతి ని పిన్నితో అందరం కలసి జరుపుకున్నాం. ఆఖరిసారి "పిన్ని" పాదాలని తాకి మనసారా నమస్కరించుకున్నాను. మళ్ళీ తాకగలనో లేదో అన్న ఆలోచన ఎంత దిగమింగినా గుండెని తొలిచేసింది. తిరిగి హైదరాబాదు కి వెళ్తూ ఎక్కలేక ఎక్కి కారు లో పడుకుని చేతిలో చెయ్యి వేసి "సరే గిరీ, వెళ్ళొస్తా" అన్న ఆఖరి మాట, ఆఖరి చూపు అదే...

అందర్నీ వదిలి ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయింది "పిన్ని".

ఎన్ని కష్టాలున్నా తనలోనే దాచుకుని అందరికీ "ప్రేమ" ని మాత్రం పంచి, ఏన్నో అందమైన జ్ఞాపకాలని మిగిల్చి అందనంత దూరం వెళ్ళిపోయిన "పిన్ని" కి... 
ప్రేమతో 
ప్రేమాంజలి ఘటిస్తూ... 🙏

"ప్రేమ- ప్రేమించే మనసుకది వరం. ప్రేమించబడే మనసుకది అదృష్టం." - గిరిధర్ పొట్టేపాళెం


"చిన్నది కాని పిన్ని కానుక", నా పుట్టినరోజు  కి

చివరి కొన్ని సంవత్సరాలు "కావలి ఇస్కాన్ కృష్ణుని సన్నిధి" లో
"పిన్ని" గడిపిన ప్రశాంత జీవితం గురుతుగా నాకు దక్కిన కానుక