"స్పందన"
Oil on Canvas (16" x 20")
నా చిన్న నాటి మిత్రుడు "మల్లయ్య" కి పువ్వులన్నా, ప్రకృతి అన్నా, కళలూ, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం. వీటిని ఇష్టపడే, ఇవంటే స్పందించే హృదయాలన్నిటినీ ఒకచోట చేర్చి రోజూ ఎన్నో ఆహ్లాదకర విషయాలు తెలుసుకుంటూ, పంచుకుంటూ, ఆహ్లాదంగా సాగిపోయేదే "స్పందన" వాట్సప్ గ్రూప్.
అందులో ఒకరోజు మల్లయ్య తన ఇంట పూలకుండీలో విరబూసిన పువ్వులని ఫొటో తీసి పెడితే "చాలా బాగుంది మల్లయ్యా" అన్న నా స్పందనకి ప్రతిస్పందిస్తూ "ఇది పెయింటింగ్ వెయ్యి గిరీ" అని అడిగిన మాట ప్రేరణగా, గుర్తుగానూ వేసిన "ఆయిల్ పెయింటింగ్" ఇది. ఒక గంట అవుట్ లైన్స్, ఇంకో ఐదారు గంటల పెయింటింగ్ పని. నేను అత్యంత త్వరగా పూర్తి చేసిన కొద్ది ఆయిల్ పెయింటింగ్స్ లో ఇదీ ఒకటి.
ఆర్ట్ కూడా పువ్వులంత సున్నితమే. ప్రకృతికి స్పందించే గుణం ని పుణికి పుచ్చుకున్న పువ్వుల్లా, ఆర్టిస్ట్ కీ భావనలకి స్పందించే గుణమే ఎక్కువ. మా "స్నేహ స్పందన" ల గుర్తుగా అతిత్వరలోనే ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ చేసి "మిత్రుడు మల్లయ్య" కి నా చేతులతోనే ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ...
"స్పందించే హృదయం ఉంటే ఆహ్లాదం తనంతట తనే వెతుక్కుంటూ వస్తుంది." - గిరిధర్ పొట్టేపాళెం
నా చేతులతో మిత్రుడు మల్లయ్యకివ్వాలని అనుకున్నట్టూ, మాట ఇచ్చినట్టుగానే జనవరి 2022, సంక్రాంతి రోజున నెల్లూరులో పండుగ జరుపుకుంటున్న మా ఇంటికి "తిరుపతి ప్రసాదం" తోబాటు "వెకటేశ్వర స్వామి" నీ తీసుకుని కొడుకుతోనూ వచ్చిన "మల్లయ్య" ని కలవగలగటం, కలిసినపుడు ఈ పెయింటింగ్ ని నా చేతులతోనే ఇవ్వటం ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి.
"మన పని ఏదైనా దాని విలువని గుర్తించి దాన్ని గౌరవించే వారిని చేరినప్పుడె అది సాఫల్యం అవుతుంది." - గిరిధర్ పొట్టేపాళెం
"ఏ పనికైనా ప్రేరణ ఒక్క మాటలోనో, ఆలోచనలోనో దాగి ఉంటుంది. దానికి స్పందించే గుణం ఉంటేనే అది కార్యరూపం దాలుస్తుంది." - గిరిధర్ పొట్టేపాళెం
Details
Title: స్పందన
Reference: Picture by my friend Mallaiah
Mediums: Oil on Canvas
Size: 16" x 20" (41 cm x 51 cm)