"బస్ స్టాండ్" లో శబ్ధాలకి బస్సులో మెలకువొచ్చింది. బహుశా ఉదయం 10 గంటల సమయం. ఎక్కడున్నానో తెలుసుకోటానికి కొన్ని క్షణాలు పట్టింది. నాన్న ఒళ్ళో పడుకున్నా. పక్క సీట్ లో నాన్న లేడు, బస్సాగితే దిగుంటాడు. ఒకవేళ నాన్న వచ్చేలోపు బస్సు కదిలెళ్ళిపోతే, భయంతో అటూ ఇటూ బస్సు విండోలోంచి చూస్తూనే ధైర్యం చేసి లేచి ఒకసారి బస్సు డోర్ దాకా వెళ్ళి తొంగి చూసి కూడా వచ్చా. దిగే ధైర్యం మాత్రం లేదు, బస్సెళ్ళిపోతే, లేదా సీట్ లో ఇంకెవరైనా కూర్చుంటే. కాసేపటికి నాన్నొచ్చాడు, జామకాయలు, అరటిపళ్ళు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని. మనసు కుదుటపడింది. కానీ రాగానే నన్ను ఇదివరకు బస్ స్టాప్ లో అడిగిన మాటే మళ్ళీ అడిగాడు. "నేను చెప్తా డ్రైవర్ కీ, కండక్టర్ కీ, నిన్ను జాగ్రత్తగా స్కూలు దగ్గర దించమని, ఏం భయం లేదు, ఒక్కడివే వెళ్ళగలవు, నేను దిగి వెనక్కి "కావలి" కెళ్ళనా" అని. మళ్ళీ గుండె గుభేలున ఏడుపు "అమ్మో నాకు భయం, నేనొక్కడినే పోలేను" అంటూ. అప్పటిదాకా అలా బస్సాగిన ప్రతిదగ్గరా అడుగుతూనే ఉన్నాడు, పాపం అనుకోకుండా నన్ను స్కూలు దాకా దిగబెట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పట్లో ఫోన్లు లేవు. నాన్న "కావలి బోయ్స్ హైస్కూల్" లో 9, 10 తరగతులకి "ఇంగ్లీష్" & "సోషల్ స్టడీస్" సబ్జక్ట్స్ టీచర్. రెండ్రోజులు స్కూల్ లో ముందు లీవ్ కి పర్మిషన్ తీసుకునే అవకాశం లేకుండా వెళ్ళాల్సివచ్చిన పరిస్థితి, నా స్కూల్ ప్రయాణంతో. నాన్న టెన్షన్స్ గ్రహిచేంత తెలివిగల వయసు రాలా నాకప్పటికింకా.
అప్పుడు నాకు 9 ఏళ్ళు. బస్సాగింది "మదనపల్లి" లో అని తెలిసింది. అప్పట్లో చాలా ఊర్లల్లో బస్ స్టాండ్ అంటే ఊరి మధ్యలో రోడ్డు పక్కన చిన్న మైదానం. గుంటలూ, నీళ్ళూ, చెత్తా-చెదారం తో చుట్టూ చిన్న చిన్న అంగళ్ళు, ఆగ్గానే బస్సు చుట్టూ పరిగెత్తి వచ్చే పళ్ళు, సోడాలు, రకరకాల లోకల్ మిఠాయిలు అమ్ముకొంటూ జీవించే వాళ్ళు...అంతే! ఊరిగుండా వచ్చేపోయే బస్సులు ఆ మైదానంలో వచ్చి కాసేపాగి వెళ్తాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా అక్కడే. ఏవైనా వివరాలు కావాలంటే ఆ అంగళ్ళలోనే అడగాలి. "తిరుపతి" నుంచి "హిందూపురం" దాటి అక్కడి నుండి 3 కి.మీ "సేవామందిరం" పక్కన ఉండే మా స్కూల్ మీదుగా "కర్ణాటక రాష్ట్రం" లో "చిత్రదుర్గ" కి వెళ్ళే బస్ లో ఉన్నాం. "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5 వ క్లాస్ చేరిన సంవత్సరం మొదటి దసరా శలవులకి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్ కి వెళ్తూ నేను, నన్ను తీసుకెళ్తూ నాన్న.
నిజానికి ఒక 8 వ తరగతి సీనియర్ ఫ్రెండ్ "ఆనంద్" ని వాళ్ళ నాన్న మా "కావలి" దగ్గరే "బిట్రగుంట" నుంచి మా స్కూల్ కి తీసుకెళ్తుంటే నన్ను వాళ్ళతో జతచేసి పంపుతూ ముందుగానే వాళ్ళని కలిసి మాట్లాడి అన్నీ సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేశాడు నాన్న. అనుకున్న ప్రకారం మేము "కావలి" లో ఫలానా రైలెక్కి "బిట్రగుంట" స్టేషన్ లో అదే ఫలానా రైలెక్కే వాళ్లని కలవాలి. నాన్న "నెల్లూరు" లో దిగిపోయి వెనక్కి "కావలి" వెళ్లాలి, వాళ్ళతో కలిసి నేను "తిరుపతి" వెళ్ళి, అక్కడి నుంచి "వెంకటాద్రి ట్రెయిన్" లో "హిందూపూర్" వెళ్ళి, అక్కడి నుండి స్కూల్ కి వెళ్లాలి, ఇదీ ప్లాన్. అనుకున్న రైలెక్కి "బిట్రగుంట" లో చూశాం, వాళ్ళు కనబడలా. నాన్నకి "నెల్లూరు" దాకే టికెట్ ఉంది. నాకేమో "తిరుపతి" దాకా ఉంది. నెల్లూరులోనూ దిగి చూశాం, ఆ రైల్లో ఎక్కడా కనబడలా. పాపం "దామరమడుగు" నుంచి "బామ్మ" కూడా వచ్చింది "నెల్లూరు" స్టేషన్ కి, నాన్ననీ కలిసి ఆ రెండు నిమిషాలు నన్ను చూడాలని. అప్పుడు ఉత్తరాలు, నోటి మాట తప్ప మరే కమ్యూనికేషన్ సాధనాలూ లేవు. అయినా ముందుగా అనుకుంటే, ఎక్కడా ఎవ్వరూ ఎవ్వర్నీ మిస్ అయ్యేవాళ్ళే కాదు. ఎక్కడ ఏ రోజు ఏ టైమ్ కి అనుకుంటే ఆ టైమ్ కి అక్కడ సరిగ్గా కలిసేవాళ్ళు. ట్రెయిన్ ఆగింది కొద్ది నిమిషాలే. అటూ ఇటూ పరిగెత్తినా లాభం లేదు, ఎంత వెదికినా వాళ్ళ జాడ లేదు. తర్వాత అక్కడే ఉండి అట్నుంచి వచ్చే మరికొన్ని రైళ్లకోసం వేచి, రాగానే వెదికి చూశాం, వాళ్ళు కనిపించలా. మధ్యాహ్నం దాటే దాకా అలా అన్ని రైళ్ళకోసం ఉన్నాం, ఇక ఎలాగో మిస్ అయ్యారనర్ధమైంది.
ఇద్దరికీ "హిందూపురం" దాకా పోనూ, నాన్న కి రానూ టికెట్స్ కి నాన్న దగ్గర డబ్బులు లేవు. అప్పటికి బ్యాంక్ లే అంతంతమాత్రం. ATM లు కనిపెట్టేదాకా మానవుడింకా ఎదగలేదు. ఎక్కడికి బయలుదేరినా ఖర్చు ఉరామరిగ్గా ఎంతో అంతే జేబులో పెట్టుకునేవాళ్ళు. పాపం నాన్నకి ఎప్పుడూ లేని సంకటస్థితొచ్చింది. మళ్ళీ వెనక్కి "కావలి" వెళ్ళి డబ్బులు చూసికుని వెళ్ళాలంటే నాకింకోరోజు స్కూల్ పోతుంది. "నెల్లూరు" లో బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఆ రాత్రికి అక్కడే ఉండాల్సొచ్చింది. రేపు పొద్దున్నే "తిరుపతి" ప్రయాణం. ఆ సాయంత్రం వాళ్ళింటి దగ్గర్లో ఉన్న "శ్రీరామ్ A/C థియేటర్" లో శోభన్ బాబు "గోరింటాకు" సినిమా కి తీసుకెళ్ళాడు, చాలా బాగా గుర్తుంది, నా మొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్ అనుభవం అది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మొట్టమొదటి ఎయిర్ కండిషనింగ్ థియేటర్. అప్పట్లో ఆ వయసులో ఆ థియేటర్ లో సినిమా చూస్తే "ఎవరెస్ట్" ఎక్కినంత సంబరంగా ఫ్రెండ్స్ తో గొప్పగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆ అనుభవం అలాంటిదే, ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికీ అప్పటికింకా ఆ అనుభవం సాధ్యంకాలా.
తర్వాతిరోజు పొద్దున్నే టిఫిన్ చేసి బయల్దేరి మధ్యాహ్నానికి "తిరుపతి" చేరుకున్నాం. బస్ స్టాండ్ లో ఎంక్వైరీ చేస్తే "హిందూపురం" నేరుగా వెళ్ళే బస్సు రోజుకి ఒక్కటే, పొద్దున్నే ఉంటుందని చెప్పారు. ఇక డైరెక్ట్ బస్సుల్లేవు. వెళ్ళాలంటే రెండు మూడు బస్సులు పట్టుకుని ఊర్లు మారి వెళ్ళొచ్చు, కానీ చాలా తిప్పలు పడాలి. నాన్న బస్ స్టాండ్ పక్కనే లాడ్జి లో రూమ్ తీసుకున్నాడు. ఇంకా గుర్తే, మధ్యాహ్నం పక్కనే రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళి ఎంక్వైరీ లో చాలా వివరాలు అడిగాడు ట్రెయిన్స్ గురించి కూడా. కానీ రూమ్ తీసేసుకున్నాం. ఇలా సందిగ్ధాల మధ్య ఎక్కడ భోజనం చేశామో మాత్రం నాకు గుర్తు లేదు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా అని చెప్పాడు. సంతోషానికి అవధుల్లేవు, నా ఫ్యావరెట్ హీరో కృష్ణ "దొంగలకు దొంగ" రిలీజ్ అయ్యుంది, ఆ సినిమా వాల్ పోస్టర్లే ఎక్కడ చూసినా. ఆ సినిమాకే వెళ్దాం అని పట్టుబట్టాను. అప్పట్లో మనం దేనికైనా ఇంట్లో పట్టుబడితే ఉడుంపట్టే, ఇప్పుడైతే పట్టుబట్టకున్నా పట్టించునే నాధుడే లేడు గానీ ;) సాయంత్రం రెడీ అయ్యి, టిఫిన్ చేసి "దొంగలకు దొంగ" సినిమా ఆడుతున్న "ప్రతాప్ థియేటర్" కెళ్ళాం. టికెట్ కౌంటర్స్ చాలా రష్ గా ఉన్నాయి, నాన్న చాలా ట్రై చేశాడు, దొరకలా, టికెట్స్ అయిపోయాయని బోర్డ్ తిరగేశారు. దానికానుకునే "మినీ ప్రతాప్ థియేటర్" లో "చిల్లరకొట్టు చిట్టెమ్మ" సినిమా కి టికెట్స్ తీసుకున్నాడు. "దొంగలకు దొంగ" తప్ప ఇంకే సినిమా చూడాలని నాకిష్టంలేదు, కానీ తప్పలేదు. పొద్దున్నే చీకటితో లేచి బస్సు టికెట్స్ కొనే దగ్గరనుంచీ నాన్న బస్సెక్కిస్తే నేనొక్కడ్నే వెళ్లగలను అని నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ససేమిరా పోలేనని ఏడుపే అడిగిన ప్రతిసారీ. కలిసి అలా ఆ బస్సులో మా స్కూలు కి బయల్దేరాం.
"మదనపల్లి" దాటాక ఇంక నాన్న ఒక్కడివే వెళ్ళగలవా అని అడగ లేదు. సాయంత్రం స్కూలు చేరుకున్నాం. ఇంకా కళ్ళకి కట్టినట్టే గుర్తుంది. ఒకరోజు స్కూల్ మిస్ అయ్యాను. సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ గేమ్‌స్ ఆడి వచ్చి డిన్నెర్ కి ముందున్న ఒక గంట బ్రేక్ టైమ్ అది. నా ఫ్రెండ్స్ అందర్నీ పలకరించి పరిచయం చేసుకున్నాడు, తర్వాత వాళ్ళని అడిగానని చెప్పు అంటూ ప్రతి ఉత్తరంలోనూ అందరి పేర్లూ రాసేవాడు. "కావలి" కి దగ్గరలో వేరే ఊర్ల నుంచి ఉన్న ఇద్దరు మా సీనియర్స్ , "గౌరవరం" నుంచి మధుసూధన్ 7 వ క్లాస్, "కావలి" నుంచి "ఫణీంద్ర" 6 వ క్లాస్ వాళ్ళనీ పరిచయం చేసుకుని, నన్ను చూసుకోమనీ చెప్పాడు వాళ్లకి. కొత్తగా మాకు స్కూల్ డార్మిటరీస్ లో ఉండే కాట్ సైజ్ కి సరిపడేట్టు ఆ శలవుల్లో ఇంట్లో మూడ్రోజులు మనిషిని పెట్టి బూరగదూది తో వడికించి, కుట్టించి మాతో తెచ్చిన నా పరుపూ, దుమ్ముకి మాసిపోకుండా ఆ పరుపుకి బాగా ఆలోచించి కుట్టించిన ముదురాకుపచ్చ రంగు ముసుగూ, కాట్ కి ఉండే వస్తువులు పెట్టుకునే డ్రాయర్స్, నా సూట్ కేస్ సర్ది, అన్ని జాగ్రత్తలూ చెప్పాడు. చీకటి పడుతూ ఉంది, డిన్నర్ బెల్లు కొట్టగానే నన్ను డిన్నర్ కి పంపించి తిరిగి వెళ్ళిపోయాడు. పాపం, ఆ టైమ్ లో భోజనంకూడా లేదు, స్కూల్ మెస్ లో అడిగుండొచ్చేమో, కానీ అక్కడ మాకు భోజనం ఫ్రీ, పేరెంట్స్ కి లోపలికి ఎంట్రీ లేదు. అక్కడినుండి "కావలి" దాకా ఆ రాత్రి ఎన్ని తిప్పలో చివరికెలావెళ్ళాడో, ఎప్పుటికి ఇల్లు చేరుకున్నాడో ఆ దేవుడికే తెలియాలి. చేరాక కొద్ది రోజులకి ఉత్తరంలో రాసిన గుర్తు, మా సీనియర్ ఫ్రెండ్ వాళ్ళు అనుకున్న ట్రెయిన్ కాకుండా, ముందు వెళ్ళే ట్రెయిన్ తీసుకున్నారని, పొరబాటు అని తెలియక మాకోసం వాళ్ళూ నెల్లూరు, తిరుపతి స్టేషన్స్ కూడా వెదికారని.
తర్వాత సంక్రాంతి శలవులకి నేను నాన్న ఉత్తరంలో రాసినట్టే మా ఇంకో సీనియర్ "గౌరవరం" 7 వ తరగతి అబ్బాయి "మధుసూధన్ రావు" తో కలిసి వచ్చా. శలవులయ్యాక ఆ అబ్బాయితోనే "గౌరవరం" లో కలిసి "నెల్లూరు" నుంచి బస్ లో నన్ను స్కూల్ కి పంపించాడు నాన్న.
వేసవి శలవులకి కూడా మళ్ళీ నాన్న ఉత్తరంలో వివరంగా రాసినట్టే నా సీనియర్ "మధుసూధన్ రావు", క్లాస్మేట్ "రాజశేఖర్" లతో కలిసి "నెల్లూరు" వచ్చి, "కావలి" బస్సెక్కి ఆ అబ్బాయి "గౌరవం" లోనూ, రాజశేఖర్ "చౌదరిపాళెం" రోడ్డు దగ్గరా దిగిపోతే నేను "కావలి" లో దిగా. దిగి నాన్న చెప్పినట్టే అర్ధరూపాయికే రిక్షా మాట్లాడుకుని నా ఎయిర్ బ్యాగు తో ఇంటిదగ్గర రిక్షా దిగా. ఇల్లు తాళం వేసుంది. ఎవ్వరూ లేరు, నాన్న "మద్రాస్" విజయా నర్సింగ్ హోమ్ లో ఉన్నాడు, ఉత్తరాల్లో రాశాడు నాన్న. ఆరోగ్యం బాలేక మద్రాస్ హాస్పిటల్ లో ఉన్నాడనీ, నేను శలవులకి వచ్చేలోపు వచ్చేస్తాడనీ మాత్రం తెలుసు. "గొంతు క్యాన్సర్" అని తెలీదు, ఒకవేళ తెలిసినా అదేంటో, ఎంత డేంజరో కూడా నాన్న చెప్తేనే తప్ప తెలియని వయసు. ప్రతి విషయమూ వివరంగా రాసే నాన్న, తను హాస్పిటల్ లో ఉన్నట్టు, ఏం భయం లేదని ఉత్తరాల్లో నాకు రాశాడు. నేను "కావలి" ఎవరితో కలిసి రావాలో, ఎలా రావాలో, దిగేముందు బస్సులో ఏమీ మర్చిపోకుండా బస్సు జాగ్రత్తగా దిగి రిక్షా ఎంతకి మాట్లాడుకోవాలో, రిక్షా ఆయనకి ఇంటి అడ్రెస్ ఏమని చెప్పాలో కూడా వివరంగా రాశాడు కానీ వచ్చే సరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరని మాత్రం రాయలేదు. ఎందుకు రాయలేదని నాకు ఆలోచనొచ్చింది, కానీ అడిగే అంత కొద్ది సమయం కూడా నేను తర్వాత నాన్నతో లేను. నేనొచ్చే సమయానికి ఎవరో ఒకరిని ఇంటి దగ్గర ఉండి నన్ను రిసీవ్ చేసుకోమని తప్పకుండా చెప్పే ఉంటాడు, ఎవరో మళ్ళీ మిస్ అయ్యేఉంటారు అని మాత్రం నా మనసుకి ఇప్పటికీ తెలుసు. ఆ శలవులన్నీ "కందుకూరు" లో కాపురం ఉంటూ "మార్కాపూర్" లో "డిప్యూటీ కలెక్టర్" గా పనిజేస్తున్న "తాతయ్య" దగ్గర అన్నతో గడిపాను. ఆ శలవుల్లో ఒకరోజు తాతయ్య మా ఇద్దరినీ "మద్రాసు" తీసుకెళ్ళాడు. "విజయా నర్సింగ్ హోమ్" లో విజిటర్ అవర్స్ లో వెళ్ళి కాసేపు నాన్నని చూసి వచ్చాం, అప్పుడు నన్నేం పలకరించాడో, నాతో ఏం మాట్లాడాడో గుర్తు లేదు. ఉత్తరాల్లో రాసినట్టే "బాగా చదువి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నాకు బాగయిపోతుంది, నా గురించి దిగులు పెట్టుకోవద్దు." అని మాత్రం చెప్పి ఉంటాడు.!
జీవితంలో ఊహ తెలిశాక రెండు రోజులు నేనొక్కడినే పూర్తిగా నాన్నతో గడిపిన క్షణాల సంఘటన అదొక్కటే, ఆ నా స్కూలు ప్రయాణం లో! ఏ దురలటూ లేని, ఎందరికో సాయపడుతూ, ఎంతో ఉన్నత భావాలతో ఎందరికో స్ఫూర్తిగా జీవిస్తూ, ఆ కాలం సమాజ హెచ్చుతగ్గులపై కళ్ళముందు పసిపిల్లలని హేళనగా అవమానిస్తే సహించక, అలా అవమానించే వాళ్ళకి కనువిప్పు కలిగిస్తూ, హైస్కూల్ టీచర్ వృత్తిలో పాఠాలు చెప్తూ ఎందరి విద్యార్ధులనో ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన నాన్నని మానుంచి దూరంగా ఇంకొక్క సంవత్సరంలో తనదగ్గరికి తీసుకెళ్ళిపోవాలని, నాన్న కంఠానికి "గొంతు క్యాన్సర్" కర్కశంగా సృష్టించి, బహుశా అంత కర్కశంలోనూ కొంచెం దయతలిచి నాకా రెండు రోజుల జ్ఞాపకాల్ని మాత్రం అందివ్వాలని సంకల్పించి ఆ పరిస్థితుల్ని కల్పించాడేమో "దేవుడు"! నాకెదురుపడితే ఆ దేవుడి కంఠం మూగబోయేలా నిలేసి గట్టిగా "మా నాన్న జీవితంపై నీ హక్కేంది" అని "ఒకే ఒక్క ప్రశ్న" అడగాలని ఆ చిన్న వయసులో బలంగా అనుకున్నా చాలాసార్లు. అలాటి రోజు ఉండదనీ, రాదనీ అప్పుడు తెలీదు. ఇప్పుడు బాగా తెలుసు, అసలు "దేవుడు కేవలం మానవ సృష్టే" అని.
నాలుగు పదులు కూడా నిండని నాన్న జీవితం లో నేనున్నది పదేళ్ళే. "నాన్న" లేకుండా నాలుగు దశాబ్ధాలు దాటి ముందెకెళ్ళిపోయిన నా జీవితంలో నాన్నని తల్చుకోని రోజు ఒక్కటంటే ఒక్కటైనా లేదు. జీవితమంతా కలల్లోనే, కన్నీళ్ళలోనే కనిపిస్తూ, ఆ కలల్లోనే చెదిరిపోతూ, కన్నీళ్ళలోనే కరిగిపోతూ మదిలో మాత్రం "చెదరని కరగని జ్ఞాపకంగానే" ఎప్పటికీ మిగిలి పోయాడు "నాన్న"...
నిండు జీవితం గడిపి తమ పిల్లల ఉన్నతి చూసిన తల్లిదండ్రులూ, ఆ పిల్లలూ అదృష్టవంతులు!
పిల్లల ఉన్నతి చూసి మురిసిపోతూ వాళ్ళ కళ్ళెదుటే ఉన్న తండ్రులందరికీ -
"హ్యాపీ ఫాదర్స్ డే!" 🌹🌷🌺
---------- o o o ----------
"చిన్నతనంలోనే తమ తల్లిదండ్రుల్ని దూరం చేసిన దేవుడు,
ఎప్పటికీ ఆ పిల్లల ఎదుట కంటబడ(లే)ని దోషిగా నిలబడిపోతాడు."
- గిరిధర్ పొట్టేపాళెం