స్కూల్ రోజుల్లో చదువు, ఆటల మీదే ధ్యాసంతా. అందునా రెసిడెన్షియల్ స్కూల్ కావటంతో రోజూ ఆటపాటలున్నా చదువుమీదే అమితంగా అందరి ధ్యాసా. వారానికొక్క పీరియడ్ ఉండే డ్రాయింగ్ క్లాస్ రోజూ ఉంటే బాగుండేదనుకుంటూ శ్రద్ధగా డ్రాయింగ్ టీచర్ శ్రీ. వెంకటేశ్వర రావు సార్ వేసే బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంత బాగా వెయ్యాలని ప్రయత్నించేవాడిని. అడపాదడపా బొమ్మలంటే ఆసక్తి ఉన్న ఒకరిద్దరం ఫ్రెండ్స్ ఏవో తోచిన బొమ్మలు గీసుకోవటం, అంతే తప్ప సీరియస్ గా కూర్చుని బొమ్మలు వేసేది మాత్రం పరీక్షలు రాసి శలవులకి ఇంటికొచ్చినపుడే. అప్పటి బొమ్మలన్నీ ఎక్కువగా పెన్సిల్ తో వేసినవే. ఇంక్ పెన్ తో వేసినా అవి నచ్చేంతగా కుదిరేవి కావు. సరైన డ్రాయింగ్ పేపర్ లేక ఉన్న పేపర్ లన్నీ ఇంకు పీల్చేవి.
నా మొట్టమొదటి పెన్
బహుశా మూడో క్లాస్ లో ఉన్నానేమో. అమ్మమ్మ వాళ్ళుండే "పొన్నూరు" కెళ్ళాం, పెద్దమామయ్య పెళ్ళికి. నెల్లూరు నుంచి విజయవాడెళ్ళే రైలెక్కి "నిడుబ్రోలు" స్టేషన్ దగ్గర దిగి వెళ్ళాలి. స్టేషన్ నుంచి కనిపిస్తూ నడచి వెళ్ళగలిగేంత దగ్గరే ఊరు. తాతయ్య ఆఫీస్ జీప్ వచ్చి తీసుకెళ్ళేది. అప్పట్లో అర్ధం కాని విషయం, స్టేషన్ పేరేమో "నిడుబ్రోలు", ఊరు పేరేమో "పొన్నూరు". దానికీ ఓ బ్రిటీష్ కాలం నాటి చరిత్ర ఉండే ఉంటది. పలక-బలపం దాటి కాయితం-పెన్సిల్ దాకా వచ్చిన వయసు. అప్పట్లో పెన్ను పట్టాలంటే ఐదో క్లాస్ దాకా ఆగాలి. బాల్ పాయింట్ పెన్నులింకా అంతగా వాడుకలో లేవు, ఫౌంటెన్ పెన్నులే వాడేవాళ్ళు.
అమ్మా పిన్నీ, పెళ్ళి చీరల షాపింగ్ కెళ్ళి వస్తూ నాకూ అన్నకీ రెండు ఫౌంటెన్ పెన్నులు కొనుక్కొచ్చారు. అదే నా మొదటి పెన్ను. వాడిందానికన్నా దాంతో పడ్డ తిప్పలే ఎక్కువ.
ఫౌంటెన్ పెన్నుతోబాటు ఒక ఇంకు బుడ్డీ (కామెల్, లేదా బ్రిల్), ఒక ఫిల్లర్ (పిల్లర్ అనే వాళ్ళం, అది తెలుగు యాసలో వాడే బ్రిటీష్ పదం అనికూడా తెలీదు) కూడా వచ్చి చేరేవి. పెన్నులో ఇంకు పొయ్యాలంటే అదో పెద్ద సవాలే. నిబ్బు ఉండే పెన్ను పైభాగం మర తిప్పి, విప్పి కింది భాగం గొట్టం లోపల ఇంకు పొయ్యాలి. ఒక్కోసారది బిగుసుకుపోయి జారిపోతూ తిప్పలు పెట్టి, పంటి గాట్లు కూడా తినేది. ఎలాగోలా పోస్తే ఎంత ఇంకు పడిందో కనపడేదికాదు, పోసేకొద్దీ తాగీతాగనట్టుండి గబుక్కున నిండి పైకొచ్చి కారేది, నిండింది బుడ్డీలోకి వంచితే ఒకమాత్రాన ఇంకు బయటికి రాదు, వస్తే బుడుక్కున మొత్తం పడిపోయేది. ఆట మళ్ళీ మొదలు. ఎట్టోకట్ట నింపాం లేరా అనిపించి నిబ్బుండే పార్ట్ గొట్టం లో పెట్టి తిప్పితే ఇంకు కక్కేది. అది తుడవటానికి ఒక పాత గుడ్డో, పేపరో కావాలి. లేదా చేతి వేళ్ళతోనో, పాదాలకో, జుట్టుకో, చొక్కాకో తుడిచెయ్యటమే. ఎక్కువైన ఇంకు నిబ్బులోంచి కూడా కక్కేది. విదిలించి మళ్ళీ తుడిస్తేకానీ వాడటం కుదరదు. ఒక్కోసారి రాద్దామని క్యాప్ విప్పితే లోపలంతా ఇంకు కక్కి ఉండేది. నిబ్బులు ఒక మాత్రాన మంచివి దొరికేవి కాదు, సరిగా రాసేవి కాదు. ముందు సగం రెండుగా చీలి గ్యాప్ మధ్య ఇంక్ ఫ్లో సరిగ్గా అయ్యేలా ఆ పనితనం ఎంతో కుదురుగా వస్తేనే గానీ ఆ పెన్నులు రాయవు. నిఖార్సైన నిబ్బు దొరకాలంటే పెట్టిపుట్టాల్సిందే. మంచి నిబ్బు దొరికి బాగా రాసే పెన్నుంటే, "అన్నీ ఉన్నా 'కోడలి' నోట్లో శని (కాలం మారింది 😉)" లా పెన్ను లీకయ్యేది. వడ్డించిన విస్తరిలా బాగా రాసే పెన్ను లక్కు కొద్దీ చిక్కినా, అది ఎక్కువరోజులు బాగా రాస్తే పెద్ద వరం కిందే లెక్క. నిబ్బు చాలా డెలికేట్, రెండు చీలికల మధ్య గాలి దూరేంత గ్యాప్ లో ఇంకు ఫ్లో సరిగ్గా కొలతపెట్టినట్టు పిల్ల కాలవలా పారాలి, మొరాయిస్తే ఆ డెలికేట్ నిబ్బుని నేలమీద సాదాల్సిందే. కొద్ది రోజులు పెన్ను వాడకుంటే లోపల ఇంకు గడ్డగట్టేది. అప్పుడు మెకానిక్ అవక తప్పదు. ఇయన్నీ పక్కన బెడితే రాస్తూ రాస్తూ గబుక్కున ఇంకు గాని ఏ క్లాస్ లో ఉన్నపుడో అయిపోతే పక్కోడి పెన్నులోంచి కొంచెం పోయించుకోవాలి. పిల్లర్ తోనే కష్టం అంటే, ఇంకది సర్కస్ ఫీటే. ఇన్ని కష్టాల్తో రాయటానికే కష్టమయే ఫౌంటెన్ పెన్ ఇక డ్రాయింగుకి వాడాలంటే...పెన్ను మీద సామే.
"హీరో" ఫౌంటెన్ పెన్
పేరుకి తగ్గట్టే అప్పటి సినిమా హీరోల్లా టిప్పుటాపు గా ఉండేది. గోల్డు క్యాప్ తో లుక్కూ, నాణ్యతలోనూ చాలా మెరుగు. నిబ్ టిప్పు మాత్రమే కనపడేది. లీకులు తక్కువే, ఖరీదు ఎక్కువే. పదో క్లాస్ లో నా దగ్గర ఒకటుండేది, డ్రాయింగ్ కెప్పుడూ వాడ్లా.
ఎనిమిదో క్లాస్ నుంచీ బ్లాక్ ఇంకే
అప్పట్లో రూలేం లేదు కానీ ఎందుకో అందరూ బ్లూ ఇంకే వాడేవాళ్ళు. టీచర్స్ మాత్రమే రెడ్ ఇంకు వాడొచ్చు అదీ ఆన్సర్ పేపర్స్ దిద్దటం వరకే. నాన్న టీచింగ్ నోట్స్ అన్నీ బ్లూ, రెడ్, గ్రీన్ మూడు ఇంకుల్లో భలే కలర్ఫుల్ గా ఉండేవి. ప్రింట్ లా ఉండే నాన్న రైటింగ్, కొన్ని లైన్లు అండర్ లైన్ రెడ్ లేదా గ్రీన్ ఇంకు తో నీటి పై తేలే అలల్లా భలే అనిపించేది. ఒకసారి ఎనిమిదో క్లాస్ లో ఉన్నపుడు బ్లూ దొరక లేదని బ్లాక్ ఇంకు తెచ్చిచ్చాడు మా హౌస్ మాస్టర్. బ్లాక్ నచ్చి ఇంక నా చదువు పూర్తయ్యేదాకా బ్లూ కలర్ జోలికి పోనేలేదు.
రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ - అప్పట్లో ఒక అద్భుతం
ఇంటర్మీడియట్ దాకా బొమ్మలన్నీ ఎక్కువగా శలవుల్లో ఇంట్లో వేసినవే. అవీ ఎక్కువగా పెన్సిల్ తోనే. బొమ్మలకి పెన్ను పట్టటానికి కారణం అప్పట్లో ఫౌంటెన్ పెన్నులని మూలకి నెట్టి రెవెల్యూషన్ లా వాడుకలోకొచ్చిన "బాల్ పాయింట్ పెన్నులు".
ఫౌంటెన్ పెన్ లని తంతూ బాల్ పాయింట్ పెన్నులొచ్చిపడ్డా, మంచి క్వాలిటీ బాల్ పాయింట్ పెన్నులు ఇండియన్ మార్కెట్ లోకి రాటానికి కొన్నేళ్ళు పట్టింది. అలా వచ్చిన "పెన్ రెవల్యూషన్" లో బాల్ పాయింట్ పెన్ స్వరూపాన్ని పూర్తిగా మారుస్తూ వచ్చింది "రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్". నాజూగ్గా చూడముచ్చటైన better and simple design, good quality material, pleasant white, very smooth writing flow, fine pointed tip, పెన్ను తో బాటు రీఫిల్ కూడా కొంచెం పొడుగు, ఇలా అన్ని విధాలా ఎంతో మెరుగైన పెన్. మొదట బ్లాక్, బ్లూ రెండు రంగుల్లోనే దొరికేది. తర్వాత రెడ్, గ్రీన్, వయొలెట్ రంగుల్లో కూడా వచ్చాయి. అయితే ఒక్క బ్లాక్, బ్లూ మాత్రమే fine pointed ఉండేవి. అందరి జేబుల్లో రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నే ఉండేది, అంతగా పాపులర్ అయ్యింది అప్పట్లో.
రెనాల్డ్స్ పెన్ తో చాలా బొమ్మలేశాను. అన్నిట్లో ఇప్పటికీ ఈ మూడు బొమ్మలు మాత్రం చాలా ప్రముఖం నా స్వగతం లో.
మొదటి స్థానం - సోఫా లో పేపర్ తో రిలాక్స్డ్ గా...
ఈ బొమ్మ "కావలి" లో మేమున్న నారాయణవ్వ ఇంట్లో సాయంత్రం చీకటిపడి లైట్లు వెలిగే వేళ, ఏమీ తోచక తికమక పడే సమయం, అప్పట్లో అద్భుతమైన పేపర్ క్వాలిటీ తో మొదలయిన మ్యాగజైన్ "Frontline" లోని ఒక పేజి లో Advertisement ఆధారంగా వేసింది. ఏమీ తోచని సమయం టైం పాస్ కోసం పేపర్, రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నూ పట్టుకుని గీయటం మొదలెట్టా. బాగా వస్తుండటంతో శ్రద్ధగా వేస్తూ ఒక్క సిట్టింగ్ లోనే ముగించేశా. బాగా వేశానని చాలా మురిపించింది, అదంతా రెనాల్డ్స్ పెన్ను మహిమే అనిపించింది. నిజమే, డ్రాయింగ్ కి వాడే క్వాలిటీ మెటీరియల్ బొమ్మ స్వరూపాన్ని పూర్తిగా ఎలివేట్ చేసేస్తాయి. బాల్ పాయింట్ పెన్నుతో నేను వేసిన బొమ్మలన్నిటిలో నేనిచ్చే ప్రధమ స్థానం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ బొమ్మకే. ఎప్పుడు చూసినా నాకే ఆశ్చర్యం, ఆ ఫైనెస్ట్ గీతల స్ట్రోక్స్.
బొమ్మలో "హెయిర్" ఫోకస్డ్ గా వెయ్యటం అంటే చాలా ఇష్టం. ఈ బొమ్మలో అది స్పష్టం. ఇప్పటికీ నేనేసే చాలా పోర్ట్రెయిట్స్ సెలక్షన్ లో స్పెషల్ క్వాలిటీ హెయిర్ స్టయిల్ దే.
తరువాతి రెండు స్థానాలూ - "భానుప్రియ" వే...
పుస్తకాలంటే ఎప్పుడూ మక్కువే. విజయవాడ లో ఇంజనీరింగ్ టైం లో ఆర్ట్ పుస్తకాలు కొన్ని కొనటం మొదలెట్టాను. ఎక్కువ దొరికేవి కాదు. వారపత్రికల్లో, వార్తాపత్రికల్లో వచ్చే ఆర్ట్స్ కట్ చేసి పెట్టుకునే వాడిని. "అలంకార్ థియేటర్ సెంటర్" ఫుట్ పాత్ ల మీద ఆదివారం సాయంత్రం పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు. ఒక్కడినే పనిగట్టుకుని "కానూరు" లో కాలేజి నుంచి బస్సెక్కి అక్కడిదాకా వెళ్ళి ఫుట్ పాత్ లన్నీ సర్వే చేసేవాడిని. అలా సర్వేలో దొరికొందొకసారి, "ఫిల్మ్ ఫేర్ (FILMFARE)" ఇంగ్లీష్ మూవీ మ్యాగజైన్ భానుప్రియ ముఖచిత్రం, అండ్ బాలీవుడ్ లో ఇంటర్వ్యూ తో. అందులో ముచ్చటైన కొన్ని పోర్ట్రెయిట్ ఫొటోస్ చూసి బొమ్మలు వెయటంకోసమే కొన్నాను. అవి తెలుగు సినిమా హీరోయిన్లందరూ బాలీవుడ్ లో తమ సామర్ధ్యాన్నీ, అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్న రోజులు.
ఈ రెండు బొమ్మల్లో సంతకం కింద డేట్స్ చూస్తే వరుసగా రెండు రోజుల్లోనే వేసా రెండూ. ఆ మ్యాగజైన్ లో చాలా ఫొటోస్ ఉన్నా ఈ రెండే ఎంచుకున్నాను, కారణం కేవలం హెయిర్ కావచ్చు. అప్పట్లో మొదలెట్టిన పోస్టర్ కలర్ పెయింటింగుల్లోనూ హెయిర్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టేవాడిని.
మా కాలేజి హాస్టల్ కి న్యూ యియర్ ముందు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆయన వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ తో చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అమ్మే వాడు, ఆయనకి ప్రతి సంవత్సరం రెగ్యులర్ కస్టమర్ ని నేను. చాలా కొనేవాడిని ఆర్ట్ మీద ఇష్టం, అండ్ ఆయనకి ఆర్ధికంగా కొంతైనా సహాయం అని. అక్కడి ఆఖరి న్యూ యియర్ నేను ఫైనల్ యియర్ లో ఉన్నపుడు కూడా వచ్చాడు, అప్పుడు నేను వేస్తున్న బొమ్మలన్నీ చూసి ఎంతో మెచ్చుకున్నాడు. మీ బొమ్మల్లో స్పెషల్ "హెయిర్" అని చెప్పేదాకా నాకూ తెలీదావిషయం. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న "బి.సరోజా దేవి" గారి పూర్తి డ్యాన్స్ స్టిల్ చూసి కలర్ లో పోస్టర్ కలర్ పెయింటింగ్ వేశాను, నేనూ న్యూ యియర్ గ్రీటింగ్ కార్డ్ కోసం అని. అందులో కూడా హెయిర్ కి నేనిచ్చిన ప్రత్యేక శ్రద్ధ చూసి ఆయనిచ్చిన కితాబు అది. తర్వాత నా బొమ్మలు శ్రద్ధగా గమనించే నా ఫ్రెండ్ "వాసు" కూడా తరచూ అదే మాటనేవాడు, "నువ్వేసే అన్ని బొమ్మల్లో హెయిర్ మాత్రం సూపర్ గిరీ" అని.
ఈ రెండు "భానుప్రియ పోర్ట్రెయిట్స్" లోనూ హెయిర్ ప్రత్యేకం. శ్రద్ధా, సహనం, శైలీ, నైపుణ్యం వీటన్నిటికీ స్వీయ పరిక్ష పెట్టుకుని మరీ గీశాను. ఈ మూడు బొమ్మలూ స్ట్రెయిట్ గా రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ తో వేసినవే. ముందుగా పెన్సిల్ స్కెచింగ్, అవుట్ లైన్ లాంటి తప్పులు సరిదిద్దుకోగలిగే అవకాశాలకి అవకాశమే లేదు. ఎక్కడ గీత దారి తప్పినా మొత్తం బొమ్మా అప్పటిదాకా పడ్డ శ్రమా రెండూ వృధానే. ఓపికున్న శిల్పి చేతిలో ఉలితో చెక్కే ఒక్కొక్క దెబ్బతో రూపుదిద్దుకునే శిల్పం లాగే, ఒక్కొక్క పెన్ స్ట్రోక్ తో ఓపిగ్గా చెక్కిన బొమ్మలే ఇవీ...
"బొమ్మలాగే జీవితమూ ఎంతో సున్నితం, దాన్ని ఓపికతో చెక్కి అందమైన శిల్పంగా మలచుకున్నపుడే దాని పరమార్ధానికి అర్ధం బోధపడేది." - గిరిధర్ పొట్టేపాళెం
~~~~ 💙💙💙💙 ~~~~
"Bhanu Priya"
Reynolds Ballpoint Pen on Paper
"Bhanu Priya"
Reynolds Ballpoint Pen on Paper