Statue of Liberty - Ink on Paper (8" x 11")
నా బొమ్మల బాటలో "ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రిక కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా "చందమామ" కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్లకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు చదివే అలవాటు లేదు. అయితే "ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రికతో మాత్రం ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
"ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రిక - నాకు పరిచయం "కావలి" లో మా తాతయ్య వల్లనే. "డిప్యూటీ కలెక్టర్" గా రిటైర్ అయిన తాతయ్య అంతకు ముందు తాసిల్దారు గా పనిచేస్తున్నపుడు రోజూ పొద్దున్నే జీప్ లో బిళ్ళ బంట్రోతులు వచ్చి ఫైల్స్ పట్టుకుని తాతయ్యని జీప్ ఎక్కించుకుని ఆఫీస్ కి తీసుకెళ్ళటం, ఆఫీస్ లో ఉండే పెద్ద పెద్ద ఫైల్స్ టేబుల్ మీద పెట్టుకుని ఎప్పుడూ వాటిల్లో సంతకాలు పెడుతూనో, లేదా జీప్ లో క్యాంప్ లకి వెళ్తూనో నిత్యం పనిలో తలమునకలై ఉండే తాతయ్యని చాలా దగ్గరగా చూశాను. తాతయ్య రిటైర్ అయ్యాక ఏమీ తోచక పొద్దునే రెడీ అయ్యి కుర్చీలో కూర్చుని పెద్ద ప్యాడ్ పెట్టుకుని ఏవో కాగితాలు, పుస్తకాలు, లెక్కలు చూసుకుంటూనే ఉండేవాడు. "మీ తాతయ్యకి ఇన్నేళ్ళూ ఫైల్స్ రాసీ రాసీ ఇప్పుడేం పొద్దుపోవటంలేదు, అవే ముందేసుకుని కూర్చుంటాడు." అని అమ్మమ్మ అంటుండేది. ఉద్యోగం లో అన్నేళ్ళూ పని చేసి చేసి రిటైర్ అయ్యాక తోచని పరిస్థితి తాతయ్యది. అదే సమయంలో "పెద్దమామయ్య" రకరకాల బిజినెస్ లు చెయ్యాలని ఏవేవో మొదలు పెట్టటం అవన్నీ చివరికి తాతయ్య భుజాల మీద పడటం అయ్యేది. అందులో భాగంగా "కావలి" ప్రాంతానికి "డెక్కన్ క్రానికిల్, ఆంధ్రభూమి దిన, వార పత్రిక, ఎన్ కౌంటర్ పత్రిక లు" ఏజన్సీ తీసుకోవటంతో వాటి పనులూ తాతయ్యేకే తప్పలేదు. వారం వారం "ఆంధ్ర భూమి" వార పత్రిక కట్టలు "హైదరాబాద్" నుంచి రైల్లో "కావలి" స్టేషన్ కి వచ్చి పడేవి. అవి వచ్చే టైమ్ కి వెళ్ళి తేవటం నుంచీ "కావలి" లో అన్ని బంకులకీ, సుబ్ స్క్రైబర్స్ ఇళ్ళకీ డెలివరీ బోయ్ లతో పంపటం, తర్వాత నెల నెలా వసూళ్ళూ లెక్కలూ ఇలా బోలెడు పనులు. తాతయ్య మళ్ళీ బిజీ అయిపోయాడలా, కొన్నేళ్ళకి పూర్తిగా అలసి పోయే దాకా.
అలా వారం వారం వచ్చే "ఆంధ్ర భూమి" వార పత్రికతో మెల్లిగా నా పరిచయం మొదలయ్యింది. ఏ పత్రికలోనూ లేని విశేషం ఈ పత్రికలో ఉండేది. అది ఏంటంటే ఇలస్ట్రేషన్స్. కథలకి వేసే ఇలస్ట్రేషన్స్ ఎంత గొప్పగా ఉండేవంటే ఒక్కొక్కటీ ఒక్కొక పెయింటింగ్, అంతే. అన్ని పత్రికల్లోలా మామూలు గీతల బొమ్మలు కాదు. వాటిల్లో ఆర్టిస్ట్ "ఉత్తమ్ కుమార్" గారు ధారావాహిక కథలకి వేసిన పెయింటింగ్ ఇలస్ట్రేషన్స్ కి నేను కట్టుబడిపోయాను. "ఉత్తమ్" గారిది ఓ ప్రత్యేకమైన శైలి. అదే కోవలో "కళా భాస్కర్" గారు మొదలు పెట్టిన "ఎంకి బొమ్మలు" కు కూడా పెయింటింగ్సే. ఆ పరిచయం ఎంతగా బలపడిందంటే వారం వారం పత్రిక చూడందే నా మనసు మనసులో ఉండేది కాదు. విజయవాడ "సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" లోనూ వారం వారం "పటమట" వెళ్ళి "ఆంధ్రభూమి వారపత్రిక" కొనుక్కునేవాడిని, కేవలం అందులోని పెయింటింగ్ ఇలస్ట్రేషన్స్ కోసమే.
స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ - "ఆంధ్ర భూమి సండే స్పెషల్ పేపర్" లో "న్యూయార్క్" నగరం మీద ప్రచురించిన ఓ వ్యాసం లోని ఫొటో. అప్పట్లో నా బొమ్మలకి ఆధారాలన్నీ ఇలాంటి ఫొటోలే. చాలా క్లిష్టమైన ఫొటో అది. ఎత్తైన స్టాచ్యూ పైనుంచి తీసిన ఆ ఫొటోలో వెనక లిబర్టీ పార్క్, హడ్సన్ రివర్ ఇవన్నీ అస్పష్టంగానే ఉన్నాయి. నేనేమో నాసి రకం నోట్ బుక్ పేపర్, బ్రిల్ ఇంకు బుడ్డీ, జగ్గులో నీళ్ళు ఒక బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వెయ్యటానికి సిద్ధమయిపోయాను. ఇప్పుడు చూస్తే ఎలా వేశానా అంత ఛాలెంజింగ్ ఫొటోని అంతకన్నా ఛాలెంజింగ్ మెటీరియల్తో ఏ రఫ్ స్కెచ్ కూడా లేకుండా డైరెక్టుగా అని. ఇప్పుడైతే హై క్వాలిటీ వాటర్ కలర్ పేపర్, టాప్ మోస్ట్ క్వాలిటీ వాటర్ కలర్స్, కట్టలకొద్దీ బ్రషులూ, ముందుగా రఫ్ స్కెచ్, ఆ తర్వాత పేపర్ టేపింగ్ ప్రక్రియ ఇలా ఎన్నో ప్రక్రియలతో కానీ బొమ్మ మొదలయ్యి పూర్తి కాదు. అప్పటి బొమ్మల్లో ప్రక్రియంతా నేర్చుకోవాలన్న తపనా, పట్టుదలా, దీక్షా...ఇవే.
తాతయ్యతో నా అనుబధం ఇరవైతొమ్మిదేళ్ళు. చిన్నపుడు వేసవి శలవులకి మా ఊరు "దామరమడుగు" నుంచి తాతయ్య తాసిల్దారుగా పనిచేస్తున్న "చీరాల" వెళ్ళాలంటే ఎక్కడలేని సంబరం. "నెల్లూరు" నుంచి "చీరాల" కి రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం. అక్కడున్నన్ని రోజులూ ఇల్లంతా ఎప్పుడూ మనుషులే. మధ్యాహ్నం జీప్ లో సముద్రం బీచ్ లకీ, సాయంత్రం అయితే సినిమాలకీ, షికార్లకీ తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా జీప్, జవాన్ లు ఉండేవాళ్ళు. తాతయ్యకి ఇవి నచ్చేవి కాదు. కానీ శలవులే కదాని పెద్దవాళ్ళతో సహా పిల్లలం అని మమ్మల్ని ఏమీ అనేవాడు కాదు. అలా తాతయ్య పని చేసిన చీరాల, తెనాలి, ఒంగోలు, పొన్నూరు, మార్కాపురం అన్ని ఊర్లూ శలవులకెళ్ళాం. అలా ఎనిమిదేళ్ళుదాకా నా బాల్యం ఆడుతూ పాడుతూ సాగిపోయింది.
నా తొమ్మిదేళ్ళపుడు తాలూకా, జిల్లా లెవెల్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయిన "ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి" లో నన్ను చేర్పించటానికి నాన్నకి స్కూల్ లో శలవు దొరక్క తాతయ్యతో నన్ను స్కూల్ అడ్మిషన్ కి పంపించాడు. అప్పుడు తాతయ్యతో కలసి చేసిన ప్రయాణం, ఆ స్కూల్ లో నన్ను చేర్చిన ఆ రోజూ ఇంకా నిన్నే అన్నట్టు గుర్తున్నాయి, హిందూపూర్ కి తాతయ్య నన్ను తీసుకెళ్ళి కొనిచ్చిన ప్లేటూ, గ్లాసుతో సహా.
నాన్నని నా 6 తరగతిలోనే దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోవటంతో తాతయ్యే నాకు గార్డియన్ అయ్యాడు. అన్ని అప్లికేషన్స్ లోనూ "Guardian జలదంకి మల్లిఖార్జునం" అని తాతయ్య పేరే రాసే వాడిని. టెన్త్ అయ్యాక హిందూ పేపర్ లో "హైదరాబాద్ రావూస్ ట్యుటోరియల్" లో "నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి" కి కోచింగ్ అన్న ప్రకటన చూసి నన్ను "హైదరాబాద్" తీసుకెళ్ళి ఒక నెల అక్కడా చేర్పించాడు. తాతయ్య రిటైర్ అయ్యాక కూడా తరచూ "హైదరాబాద్" వెళ్తుండేవాడు. ఎప్పుడు వెళ్ళి వచ్చినా మా ఇంటికి చిన్న "పుల్లారెడ్డి స్వీట్స్" ప్యాకెట్ తెచ్చిచ్చేవాడు. తాతయ్య "హైదరాబాద్" నుంచి వచ్చాడు అంటే నాకు ఆ స్వీట్స్ తియ్యని రుచులు గుర్తుకొచ్చేవి అప్పట్లో.
తర్వాత నన్ను ఇంటర్మీడియట్ "ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ" లో చేర్చటానికీ అమ్మని తీసుకుని తాతయ్యే నాతో వచ్చాడు. పదవ తరగతి పరిక్షల్లో మంచి మార్కులు రావటంతో కాలేజి సీట్ వచ్చేసినా హాస్టల్ సీట్ దగ్గర మాత్రం అప్పటి వార్డెన్ "ఫాదర్ ఇన్నయ్య" చాలా ఇబ్బంది పెట్టారు. హాస్టల్ అప్లికేషన్ లో విజయవాడలో ఎవరైనా బంధువులున్నారా అన్న కాలమ్ దగ్గర తాతయ్య అక్కడున్న బంధువుల పేరు రాయటం, అది ఆసరాగా తీసుకుని హాస్టల్ సీట్ ఇవ్వం, మీ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంచి కాలేజి కి పంపండి అని వార్డన్ "నౌ, యు కెన్ గో" అని రూమ్ లోనుంచి మమ్మల్ని బయటికి పొమ్మనటం. వాళ్ళు మా అబ్బాయికి అంతగా తెలీదు, వాళ్ళుండే సత్యనారాయణపురం ఇక్కడికి చాలా దూరం, అంత దూరం నుంచి రోజూ ఇక్కడిదాకా రావాలంటే బసులు కూడా సరిగ్గా లేవు, చాలా కష్టం అవుతుంది అని ఎంత ప్రాధేయపడినా ససేమిరా వినకుండా మమ్మల్ని బయటికి పంపేయటంతో ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో బయట చెట్టు కింది కొన్ని గంటలు నిలబడ్డాం. తాతయ్య అంతలా ప్రాధేయపడటం నచ్చని నేను "కాలేజి ఫీజ్ పోతే పోయింది తాతయ్యా, కావలి జవహర్ భారతి లో నా మార్కులకి నాకే ఫస్ట్ సీట్ వచ్చింది, అక్కడే చేరతా" అని నేనన్నా నాకు సర్ది చెప్పి అందరి అడ్మిషన్స్ అయ్యే దాకా వేచి చూసి మళ్ళీ హాస్టల్ ప్యూన్ "సెగైరాజ్" ని బ్రతిమాలుకొని వార్డన్ రూములోకి వెళ్ళి తాతయ్య ప్రాధేయపడ్డ తీరు నన్నిప్పటికీ కలవర పెడుతూనే ఉంటుంది. "తండ్రి లేని బిడ్డ, బాగా తెలివైనవాడు, మంచి మార్కులొచ్చాయి, మంచి కాలేజి అని ఇంతదూరం వచ్చాము, భర్త లేని తల్లి, కనీసం ఆమెని చూసైనా సీట్ ఇవ్వండి, మీరే కరుణించాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను." అని ఆయన కాళ్ళు పట్టుకునే దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ క్షణాల్లో "డిప్యూటీ కలెక్టర్" గా చేసిన తాతయ్య ఆ "హాస్టల్ల్ వార్డన్" ని నాకోసం అంతలా బ్రతిమాడాల్సి రావటం నన్నెంతగానో కలవరపెట్టింది. అక్కడ చదివిన రెండేళ్ళూ "గొగినేని హాస్టల్" లో "ఫాదర్ ఇన్నయ్య" తెల్ల గౌన్ వేసుకున్న పులిలా గంభీరంగా అడుగులేస్తూ నడిచి వస్తుంటే ఎక్కడ నన్ను చూసి గుర్తుపడతాడో అన్న భయంతో గుండె వేగం పెరిగేది. ఎదురైతే "గుడ్ మార్నింగ్ ఫాదర్" అనో "గుడ్ ఈవినింగ్ ఫాదర్" అనో చెప్తూ ఆయన కళ్ళల్లోకి చూడాలన్నా భయం వేసేది.
చివరిగా నన్ను "సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ" లోనూ చేర్చటానికి తాతయ్యే వచ్చాడు. ఆరోజు "కావలి" లో బస్టాండు కి వస్తే "విజయవాడ" వెళ్ళే ప్రతి బస్సూ క్రిక్కిరిసే వచ్చాయి. కొన్ని గంటలు అలాగే వచ్చే పోయే బస్సులే తప్ప ఎక్కేందుకు చోటే లేని పరిస్థితి. చివరికి రేపు పొద్దున కాలేజి అడ్మిషన్ కి వెళ్ళగలమా, లేకుంటే కాలేజి సీట్ పోతుంది అన్నంత ఆందోళనలో పడ్డాం. అప్పుడొక బస్సు ఖాళీగా వస్తే తోసుకుంటూ ఎక్కి చివరికెలాగో ఆఖరి సీట్ లో అందరి మధ్య ఇద్దరం ఇరుక్కుని కూర్చోగలిగాం. తర్వాత ఒకాయనెక్కి ఈ సీట్ లో టవల్ వేశాను అంటూ తాతయ్యని నిర్దాక్షిణ్యంగా లాగే ప్రయత్నం చేశాడు. ఎన్నడూ తాతయ్య కోప్పడగా చూడనేలేదు. ఆరోజు గట్టిగా అరిచి ఆయన చెయ్యి విదిలించిన తాతయ్యని చూసి నాకూ భయం వేసింది, తాతయ్య చెయ్యికూడా వణుకుతూ ఉంది, అంటే అంత కోపం వచ్చింది. పక్కన అందరూ "పెద్దాయన్ని పట్టుకొని అలా లాగుతావా" అని ఆయన్ని తిట్టి పంపించారు. ఆ ప్రయాణం అంతా తాతయ్య చాలా అసహనంగానే ఉన్నాడు. నన్ను కాలేజి లోనూ, హాస్టల్ లోనూ చేర్పించి వెళ్ళాడు. అలా నా జీవితంలో నేను చదివిన ప్రతి స్కూలూ, కాలేజి అడ్మిషన్ కి తాతయ్యే వచ్చి నన్ను చేర్చాడు. నేను M.Tech చేశాక "మీ నాన్న కోరిక నాయనా అది, నెరవేర్చావు" అంటూ ఎంతో సంబరపడ్డాడు. నేను ఎప్పుడు శలవులకి వచ్చినా అన్నతో కలిసి ముందుగా వెళ్ళి దర్శించుకునేది తాతయ్యనే. నన్ను చూడగానే ఎంతో పొంగిపోయేవాడు. "అబ్బా...నా ముద్దుల మనవడు వచ్చాడయ్యా" అంటూ సంబరంతో ఆ నవ్వూ సంతోషం పసిపిల్లవాడు కేరింతలు కొట్టినట్టు అనిపించేది. ఇంజనీరింగ్ అయ్యాక నన్ను IAS Exams రాయమని చాలా అడిగేవాడు. మా స్కూల్ లో చదివిన నా సీనియర్స్, జూనియర్స్ ఇప్పుడు IAS చీఫ్ సెక్రెటరీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, IPS డీజి, డీఐజి, యస్పీలుగా వింటుంటే అప్పుడు తాతయ్య మాట ఎందుకు పెడచెవిన పెట్టానా అని అప్పుడప్పుడూ ఇప్పుడనిపిస్తుంటుంది.
అలా నేను పెద్దయ్యాక తాతయ్యతో చాలా దగ్గరగా మెలిగాను. చివరిరోజుల్లో తాతయ్య, అమ్మమ్మ ఒంటరిగా మిగిలారు. ఎప్పుడు నేను వెళ్ళినా తలుపు తెరవగనే అదే కుర్చీలో కూచుని ఏవో పేపర్స్ మీద రాసుకుంటూనే కనిపించేవాడు. నేను నా మొదటి సంపాదనతో తాతయ్యకి 1990 లో "HMT Wrist వాచ్" హైదరాబాద్ నుంచి కొని తెచ్చాను. చాలా సంబరపడ్డాడు. తర్వాత TCS లో నా మొదటి London Trip లో Parker Ballpoint Pen తెచ్చిచ్చాను. తాతయ్యకి బ్రిటీష్ వాళ్ళ దగ్గరా పనిచేసిన అనుభవం ఉంది, "అబ్బా...చాలా రోజులయ్యిందయ్యా ఈ పెన్ వాడి" అంటూ ఎంతో సంబరపడ్డాడు అప్పటి రోజులు గుర్తుచేసుకుని. నేనిచ్చిన ఆ Pen నే ఇష్టంగా వాడేవాడు. తాతయ్య "కావలి పెన్షనర్స్ అసోసియేషన్" కి ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ పెన్షనర్స్ అందరూ ఇంటికొచ్చి ఏవో సంతకాలు పెట్టాక వాళ్ళల్లో ఎవరో ఆ Pen పట్టుకెళ్ళిపోయారని వాళ్ళకోసం పరిగెత్తి వెళ్ళినా అందులో ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలీలేదని చెప్తూ తాతయ్య ఆ Pen పోయిందని ఎంతో బాధ పడ్డాడు. తర్వాత నేను తెచ్చిచ్చిన HMT Wrist వాచీ కూడా తాతయ్య చేతికి లేకుండా పోయింది. నీతిగా నిజాయితీగా గొప్ప ఉద్యోగాలు చేసి ఎందరికో సహాయపడ్డ తాతయ్య రిటైర్ అయ్యాక మాత్రం చాలా సాదా సీదా జీవితం గడిపాడు. నాన్న లేని మాకూ అమ్మకు మాత్రం పెద్ద దిక్కయ్యాడు. ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చుని, మాతో కాసేపు గడిపి వెళ్ళేవాడు. ఏవన్నా చిన్న పనులున్నా "నా పెద్ద మనవడు నాకు చేస్తాడయ్యా" అంటూ అన్నకే చెప్పేవాడు, ఇంకెవ్వరినీ అడిగేవాడు కాదు.
ఎంత కష్టం వచ్చినా ఎవ్వరితోనూ చెప్పుకోని తాతయ్య ఒక్కసారి మాత్రం నేను శలవులకి వచ్చాక తరువాతిరోజు ఉదయం నేనూ అన్నా ఎప్పటిలానే నా మొదటి దర్శనం తాతయ్య దగ్గరికి వెళ్ళి కాసేపుండి వెళ్తుంటే "ఉండండి నాయనా మీతో బజారు దాకా నేనూ వస్తాను" అని గబగబా చొక్కా ప్యాంటూ వేసుకుని మా ఇద్దరి మధ్య చెరో భుజంపై చేతులు వేసి మౌనంగా నడుస్తూ ఇంటి రోడ్డు "పోలేరమ్మ రాయి" దగ్గర ఒక్క సారిగా ఏడ్చేశాడు. "ఏమైంది తాతయ్యా, ఊరుకో" అని అడిగితే "సంక్రాంతి పండగ, అరిశెలక్కూడా డబ్బుల్లేవు" అంటూ బావురుమన్నాడు. మా జేబుల్లోనూ అప్పట్లో పెద్దగా డబ్బులుండేవి కాదు. తాతయ్యకి నచ్చచెప్పి ఇంట్లో దిగబెట్టి ఇంటికెళ్ళి అమ్మనడిగి డబ్బులు తీసుకెళ్ళి తాతయ్యకి ఇచ్చి వచ్చాము. ఇప్పటికీ గుర్తొచ్చినపుడల్లా గుండె బరువెక్కుతుంది. తాతయ్యకొచ్చే పెన్షన్ తో దర్జాగా నెలంతా అమ్మమ్మ, తాతయ్య హాయిగా గడపొచ్చు, కానీ పరిస్థితులవల్ల ఆయన నెల మధ్యకొచ్చేసరికల్లా వచ్చే నెల మొదటి వారం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితిలో ఆయన జీవితం పడింది. తాతయ్య పరిస్థితి అర్ధం అయ్యీ కాని పరిస్థితి నాది. తర్వాత TCS లో ఉండి 1997 లో నేను Tokyo, Japan లో ఉన్నపుడు నాకు Email ద్వారా తాతయ్య కూడా నాన్న దగ్గరికెళ్ళిపోయాడని తెలిసింది. మౌనంగా అంత దూరం నుంచే రాలేని స్థితిలో ఎంతో రోదించాను. "తాతయ్య శకం" ముగిసింది. ఆయన ఆఖరి చూపుకి నేను నోచుకోలేదు.
మా ఫ్యామిలీలో ఇప్పటికీ ఎవ్వరూ వెళ్ళని ఉన్నత స్థాయికి తాతయ్య వెళ్ళాడు. మంచీ, నీతీ, నిజాయితీ తో ఉన్నతంగా జీవించాడు. "మీ నాన్న ఉండి ఉంటే నాకెంతో అండగా ఉండేదయ్యా" అని నాతోనూ, అన్నతోనూ చాలాసార్లు అంటూనే ఉండేవాడు. నాన్న తాతయ్యకి అల్లుడే, అయినా ఎందుకలా అనేవాడో మాకు సరిగా అర్ధం అయ్యేది కాదు. తర్వాత అర్ధమయ్యింది, నాన్న ఉన్నంతవరకూ నాన్నతో తాతయ్యకి ఉన్న అనుబంధం తెలిసి. ఏ తండ్రికి అయినా రిటైర్ అయ్యాక ఆలోచనలన్నీ ఎదిగిన తన కొడుకుల పైనే ఉంటాయనీ, పెద్ద వయసులో ప్రతి మనిషీ ఒక అండ కోరుకుంటాడనీ, తాతయ్యకి అలా అండగా ఉండే మనిషే లేకుండాపోయారనీ మాత్రమే అర్ధం అయ్యింది.
చిన్న వయసులోనే నాన్న పోయాక అమ్మకి అన్నీ తానే అయి అమ్మ జీవితాన్ని ఒక దారిలో పెట్టి ఎవ్వరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలదొక్కుకుని ముందుకి నడిచే బాట తాతయ్యే దగ్గరుండి మరీ వేసి అమ్మని ముందుకి ధైర్యంగా నడిపించాడు. నా చదువు, విజయాల బాటలో తాతయ్య కి ప్రత్యేకమైన చోటుంది. ఎప్పటికీ ఉన్నతంగా తాతయ్య నా మదిలోనే ప్రముఖంగా కొలువై ఉన్నాడు. తాతయ్యని రోజూ నా ప్రేయర్స్ లో తల్చుకుంటూ నిత్య దర్శనం చేసుకుంటూనే ఉన్నాను. నా చిన్నప్పటినుంచీ ఎన్నో ఉత్తరాల్లో "My Dear Giri" అని మొదలుపెట్టి, "Yours affectionately" అంటూ తన సంతకంతో ముగించిన తాతయ్య, నా జీవితంలో, నా ఎదుగుదలలో నాకు దేవుడు ప్రసాదించిన ఎప్పటికీ ముగియని "మహానుభావుడు"... 🙏
"పుట్టిన ప్రతి మనిషి జీవితమూ ఎందరో మహానుభావులు తీర్చి దిద్దినదే."
~ గిరిధర్ పొట్టేపాళెం
~~ ** ~~ ** ~~
("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)
నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...