ఈ భూమ్మీదపడ్డాక చుట్టూ ఉన్న మనుషులనీ, ప్రదేశాలనీ గ్రహించి గమనించగలిగే శక్తి కొన్నేళ్ళకి కానీ మనిషికి రాదు. ఒకటి రెండేళ్ళకే ఆ శక్తి వచ్చినా ఇంకో రెండు మూడేళ్ళు ఎలాంటి జ్ఞాపకాలూ గుర్తులేకుండానే గతంలోకి జారుకుంటాయి. నా గతంలో నాకు గుర్తుండి, నేనెళ్ళగలిగే నా అట్టడుగు జ్ఞాపకాల లోతులు నా మూడేళ్ళ వయసు నాటివి. అప్పుడు నా లోకంలో నాకుంది అమ్మ, నాన్న, బామ్మ, అన్న, చెల్లి. ఆ లోకం పేరు "బుచ్చిరెడ్డిపాళెం". "బుచ్చి" గానే అందరూ పిలిచే ఒక పచ్చని ఊరు, నెల్లూరు జిల్లా లో ఒక మోస్తరు పట్టణం.
అప్పట్లో బడిలో చేరాలంటే ఐదేళ్లు నిండాలి. నన్ను మాత్రం నాలుగేళ్ళకే బడిలో చేర్చారు నాన్న, ఐదేళ్ళ అన్నకి తోడుగా. బడికెళ్లక ముందు ఇంట్లో కొన్ని జ్ఞాపకాలున్నా, బడితోనే మొదలయిన జీవితానుభవాలు ఒక్కొక్కటీ జ్ఞాపకంగా గుండెలోతుల్లో చోటుచేసుకున్నాయి. మా బడి ని "కోనేరు బడి" అని పిలిచేవాళ్ళు. ఊరుకి ఒక చివర ఉన్న పెద్ద "శ్రీ కోదండరామ స్వామి దేవాలయం". ఎదురుగా చాలా పెద్ద కోనేరు. ఆ కోనేరు కి నాలుగు పక్కలా రోడ్డు. ఒక పక్కన రోడ్డుకానుకుని ఒక చిన్న బడి, అక్కడే మొదలయిన జ్ఞాపకాలు. మా ఇంటికెదురుగా ఉన్న రోడ్డెక్కి ఒక కాలు కిలోమీటరు (కాలు అంటే పావు అని) నేరుగా నడుచుకుంటూ వెళితే కోనేరు వస్తుంది. కోనేరంటే గుర్తోచ్చే అప్పటి మా ఇంట్లో నా పేచీ జ్ఞాపకం- అన్నకి ఇష్టమైనది ఏదైనా ఇంట్లో చేస్తే అమ్మతో "నేను నీ పిల్లోడ్ని కాదు, కోనేరు దగ్గర తిరణాల్లో దొరికితే తెచ్చి పెంచుకున్నారు, వాడే నీ పిల్లోడు" అని. ఇప్పుడు తల్చుకుంటే ఆ పసితనం లో "అమ్మ ప్రేమ" అంతా తనకి మాత్రమే దక్కాలని పేచీ పెట్టే పసి హృదయం, ఆ వయసులో లోకం తెలియని అమ్మే లోకం అయిన పిల్లలందరూ ఏ కాలంలో అయినా ఇంతే!
ఇండియా వెళ్ళిన ప్రతిసారీ నేను వెళ్ళాలని ఆరాటపడే ఊరుల్లో "బుచ్చి" ఒకటి. కొన్ని సార్లు వెళ్ళటం కుదిరేది కాదు. కొన్ని సార్లు వెళ్ళినా అన్ని ప్రదేశాలూ చూడలేకపోయేవాడిని. ఈసారి 2022 జనవరి లో మాత్రం చూడాలని ఆరాటపడే ప్రదేశాలన్నీ, కొన్ని దాదాపు 45 ఏళ్ళ తర్వాత మొదటిసారి మనసారా చూసుకున్నాను.
అప్పట్లో "బుచ్చి" లో బాగా ఇష్టమైన ప్రదేశం "బెజవాడ గోపాలరెడ్డి పార్కు". ఊరు మధ్య చాలా అందమైన పార్కు. పచ్చని పచ్చిక, పెద్ద పెద్ద చెట్లు, అశోక చెట్లు కూడ, అక్కడక్కడా మంచి నీళ్ళ కుళాయిలు, పెద్ద మెయిన్ గేటు, పార్కు మధ్యలో పెద్ద కొండ, కొండ కింద నీటికొలను, కొలనులో కాలు ముసలి నోటికి చిక్కి తొండం పైకెత్తి మొరపెట్టుకుంటున్న ఏనుగు, మొర ఆలకించి చేతిలో చక్రం తో కొండ మీద ప్రత్యక్షమైన విష్ణు మూర్తి. "గజేంద్ర మోక్షం" కథ ని కళ్లముందు అద్భుతంగా ఆవిష్కరించన వైనం ఎదురుగా, దూరంగా కట్టిన స్టేజి, ఆపైన కట్టిన మైకు సెట్టు, వెనుక ఎత్తైన స్థంభం పై పార్కు మూసే వేళ మోగే సైరను తో సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఆ పార్కుకి నేనూ అన్నా నాన్నతో కలిసి వెళ్ళి ఆడుకున్న చాలా చల్లని సాయంత్రాలు ఇప్పటికీ నిన్ననే అన్నంత స్పష్టంగా గుర్తున్నాయి.
కోనేరు బడిలో ఒకటవ తరగతి, రెండవ తరగతి కొద్ది నెలలూ చదివాను. బడి మెట్లమీద ఇంటర్వల్ లో చిన్న చిన్న సీసాల్లో పొప్పరమిట్లు (పిప్పరమెట్లు), జీడి ఉండలు అమ్ముకునే ఒక అవ్వ మాత్రం జ్ఞాపకాల్లో ఇంకా గుర్తుంది. ఇంకా బాగా గుర్తున్న ఒక సంఘటన, ఇప్పటికీ నేనూ అన్నా తరచూ తలచుకుంటూనే ఉంటాం - ఒక చాలా బీద విద్యార్ధి చిరిగి పోయిన చొక్కా, చెడ్డీ మాసి చెరిగిన తలతో మా క్లాస్ లో ఉండేవాడు. గుడ్డలకి కూడా నోచుకోలేనంత బీద పిల్లలు ఉంటారని అప్పుడే అర్ధం అయ్యింది. ఒకరోజు ఆ విషయం అన్నా, నేనూ ఇంటికొచ్చి నాన్న కి చెప్పాం. తర్వాతి రోజు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకుని రమ్మని నాన్న చెప్పటంతో లంచ్ టైమ్ లో తీసుకొచ్చాం. ఆ అబ్బాయికి మాతోనే ఇంట్లో భోజనం పెట్టించి, మా బట్టలు ఒక రెండు జతలు ఇచ్చి, నూనె పెట్టించి తల దువ్వించి ఆ అబ్బాయిని మాతో బడికి నాన్న పంపారు. అపుడెంతగానో సంతోషించిన మా మనసుల ఆ అనుభవం ఇప్పటికీ మదిలో పదిలమే.
శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగేవి. రథోత్సవం, ఇంకా కోనేరులో తెప్ప ఉత్సవం కూడా జరిగేది. ఒక పడవలో దేవుని విగ్రహాలు పెట్టి కోనేరు నీళ్ళల్లో అంతా ఊరేగించేవాళ్ళు. ఒక సంవత్సరం మాత్రమే చీకటి పడే సాయంత్రం వెళ్ళి ఆ తిరునాళ్ళ సంబరాలు చూసిన గుర్తు. అప్పుడు రోడ్డు పక్కన రంగురంగుల ఆట బొమ్మలు, ఆట వస్తువులు అమ్మే చిన్న చిన్న అంగళ్ళు వెలిసేవి. మామూలుగా ఆ తిరునాళ్ళలో దొరికే కొన్ని ఆట వస్తువులూ, బొమ్మలు తర్వాత కావాలంటే ఎక్కడ వెతికినా దొరకవు. "నక్కలోళ్ళు" అనేవాళ్ళు అవి అమ్మేవాళ్లని. చాలావరకు వాళ్ళు చేత్తో తయారు చేసి తెచ్చి అమ్మేవే అవన్నీ. పిల్లల్ని ఆకట్టుకునే పసుపు, పచ్చ, రోజా, ఎరుపు, బులుగు రంగుల్లో చాలా ఇంపుగా ఉండేవి. చాలా ఆట వస్తువులు వెదురు పుల్లల్తో, లేదా ప్లాస్టిక్ తో చేసి ఉండేవి. ఆ తిరునాళ్ళ లో నాకు కొనిచ్చిన నాకమితంగా నచ్చిన ఒక ఆట వస్తువు - చక్రం. రెండు వేళ్ళతో పట్టి తిప్పి వదిలితే భూచక్రంలా నున్నటి గచ్చుపై ఏకబిగిన చాలా సేపు తిరిగేది. ఆ చక్రంతో సెట్టుగా సన్నని స్టీల్ రేకు తో చేసిన చేప, కప్ప, పాము, గద్ద లాంటి ఫ్లాట్ గా ఉండే పలుచని చిన్న చిన్న బొమ్మలు. ప్రతి బొమ్మకీ ఒక చిన్న సూది తో పొడిచినట్టు మధ్యలో ఒక డాట్ లాంటి నొక్కు ఉండేది. చక్రం తిరిగేప్పుడు ఆ చక్రం మొన కిందకి మెల్లిగా తోస్తూ జరిపి ఏదైనా ఆ బొమ్మ నొక్కు లో చక్రం మొన ఉండేలా చేస్తే ఆ చక్రం తో బాటు నేలపై ఆ బొమ్మ చాలా తమాషాగా కదలాడేది. మ్యాజిక్ ఏంటంటే చేప కదలికలు అచ్చం చేపలానే ఉండేవి, గద్ద అయినా, కప్ప అయినా అంతే, అచ్చం వాటిలానే. అది చాలా వండర్ లా అనిపించేది. ఆ చక్రంతో అలా ఎన్ని గంటలు ఆడి ఉంటానో నాకే తెలీదు. తర్వాతి సంవత్సరం పక్కనే మా ఊరు "దామరమడుగు" కి ఫ్యామిలీ వెళ్ళిపోయాం. అప్పుడు నాన్న కట్టిన మా కొత్తింట్లో గచ్చు చాలా నున్నగా ఉండేది, ఆ ఇంట్లోనూ వాటితో ఆడిన గుర్తులున్నాయి. ఆడి ఆడి ఇరిగిపోగా, మళ్ళీ అలాంటి బొమ్మలు కొనాలని అమ్మనీ బామ్మనీ చాలా సార్లు అడిగేవాడిని. ఎక్కడా దొరకలేదు. ఆ కోరిక ఇప్పటికీ కోరికగానే మిగిలిపోయింది. ఇక తీరదు. "బుచ్చి" అంటే గుర్తుకొచ్చే ఒక తియ్యని జ్ఞాపకం ఇది.
ఇంకా అందరం కలిసి సాయంత్రం నడచుకుంటూ వెళ్ళి "గిరిజా టాకీస్", "మమోలా మహల్" లో చూసిన "దసరా బుల్లోడు", "బుల్లెమ్మ బుల్లోడు", "ఇద్దరు అమ్మాయిలు" లాంటి సినిమాలు, రేడియోల్లో తరచూ విన్న "ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో ఆనందం నిండెనులే...", "నీ పాపం పండెను నేడూ నీ భరతం పడతా చూడు...", "కురిసింది వానా నా గుండెలోనా...", "నల్లవాడే అమ్మమ్మొ అల్లరిపిల్లవాడే...", "చేతిలో చెయ్యేసి చెప్పు రాధా..." పాటలు ఇప్పుడు చూసినా విన్నా అప్పటి జ్ఞాపకాల తరంగాలు తియ్యగా వచ్చి మదిని తాకుతూనే ఉంటాయి.
ఇంటి కి ఆనుకునే ఉన్న వరిచేలూ, ఆ పక్కన కనిపించే పిల్ల కాలువ మల్దేవు, అది దాటి పార్కు మీదుగా వెళితే నాన్న పనిచేసిన పెద్ద హైస్కూలు, మెయిన్ రోడ్డు దగ్గర ఉండే అరటి పళ్ళు, స్వీట్స్ బళ్ళూ ఇవన్నీ నా చిన్ననాటి "బుచ్చిరెడ్డిపాళెం" చెరగని గురుతులు.
అన్నిటి కన్నా తియ్యనైన గురుతులు మాత్రం చల్లని సాతంత్రం స్కూలు నుంచి నాన్న వచ్చాక నాన్నతో కలిసి "బెజవాడ గోపాలరెడ్డి పార్కు" కెళ్ళి గడిపిన కొన్ని సాయంత్రాలు. చల్లని పైరగాలికి రయ్యిమంటూ దూసుకెళ్ళే తురిమెళ్ల బస్సెక్కి నెల్లూరు కి చేసిన ప్రయాణాలు, ఒకటి రెండు సార్లు నాన్న తో వెళ్ళి చూసిన నాన్న టీచరు గా పనిచేస్తున్న DLNR (దొడ్ల లక్ష్మినరసింహారెడ్డి) గవర్నమెంట్ హైస్కూలు".
నాన్నతో గడిపిన ఆ కొద్ది కాలం...
మదిలో గడచిన చెరగని మధురం!!
అప్పుడే కాదు ఇప్పుడూ "బుచ్చి" అలా పచ్చగానే ఉంది, ఎప్పటికీ అలానే ఉంటుంది. అది "బుచ్చి" ప్రత్యేకత!
"కదిలే కాలంతో కదలక ఆగిపోయే జ్ఞాపకాలే జీవితం."
- గిరిధర్ పొట్టేపాళెం
~~~~~ o o o o ~~~~
యాబైఏళ్ళ క్రితం మేమున్న ఇల్లు ఇప్పటి మొండి గోడలు
ఇంకా నాకోసమేనా అన్నట్టుండటం విశేషం
100 అడుగులతో రాష్ట్రంలోనే రెండవ ఎత్తైన గోపురం
ఆలయ ముఖద్వారం - అప్పుడేసిన బుడి బుడి అడుగుల్లో ఇప్పటి నేను
కోనేరు - ఈ పిక్చర్ లో కుడివైపున రోడ్డు మీదే మా బడి ఉండేది
ఆలయం వెలుపల పక్కన మండపం, స్టేజి
ఆలయ విశిష్టత తెలుపుతూ ఇప్పటి బోర్డ్
నాన్న టీచర్ గా పనిచేసిన హైస్కూల్ ఇప్పటికీ అలానే ఉంది
"పచ్చని బుచ్చి" చుట్టుపక్కల వరి పొలాలు