నేను, లక్ష్మి, అన్న (Dec 29, 1976, Kavali)
నా "కావలి" - తియ్యని జ్ఞాపకాలు
"ఎంగటేశులు" చనువున్నోళ్ళూ, నోరు తిరగనోళ్ళూ "వెంకటేశ్వర్లు" పేరు ని పిలిచే తీరు. ఆ పిలుపులో చనువూ ఆప్యాయతా రెండూ విడదీయరానంతగా కలిసిపోయి ఉంటాయి. కొందరు "వెంకటేశ్వర్లు"లకైతే అదే అసలు పేరైపోయేది, పిల్ల పెద్దా అందరూ అలానే పిలిచేవాళ్ళు.
"కావలి" - గుర్తుకొస్తేనే జ్ఞాపకాల కెరటాలు మనసులోతుల్లోంచి వచ్చి మదిని సున్నితంగా తాకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎనిమిదేళ్ళ వయసులో, రెండు మూడేళ్ళు "పచ్చని పల్లెసీమ" లో ఆటపాటల్తో గడిచిన బాల్యం తర్వాత నాన్న హైస్కూల్ టీచర్ జాబ్ ట్రాన్స్ ఫర్ తో "కావలి టౌన్" కొచ్చాం. పాతూరు గర్లిస్కూల్ దగ్గర అమ్మమ్మ వాళ్ళింట్లో చేరాం. నిజానికి కావలి అమ్మమ్మ వాళ్ళ ఊరు. కానీ అప్పుడు అక్కడ లేరు, తాతయ్య కందుకూరు లో తాసిల్దారుగా పనిచేస్తుండడంతో అమ్మమ్మవాళ్ళూ అక్కడే ఉన్నారు.
ఎక్కువగా పెద్ద పెద్ద ఇళ్ళు, రోడ్లు, విష్ణాలయం, శివాలయం, కలుగోళ్ళమ్మ దేవాలయం, ఇంకా చిన్న చిన్న ఆలయాలు, చర్చిలు, మశీదులు, మందిరాలు, పార్కులు, లైబ్రరీలు, ఐదారు సినిమా హళ్ళూ, ఊరు మధ్యలో వెళ్తూ ఎప్పుడూ వాహనాల్తో రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్, రోడ్డుకిరువైపులా చిన్న హోటల్స్, ఫ్యాన్సీ స్టోర్స్, క్లాత్ మర్చంట్స్, షూస్, బేకరీస్, ఫర్నీచర్స్, స్వీట్స్, టైలరు షాపులు, ఫొటో స్టుడియోలు, చిన్న చిన్న బంకులు, ఇలా అన్నిరకాల షాపులూ... పళ్ళూ, ప్లాస్టిక్ సామాన్లూ, వేపిన వేరుశనక్కాయలు, పులిబంగరాలు, మసాల వడలు, ఇడ్లీ, దోశ టిఫిన్లూ, ఇలా వివిధ రకాల తోపుడు బళ్ళూ... సెంటర్ లో తారు రోడ్డుపైన ఒకపక్కగా శుభ్రంగా చిమ్మి చుట్టూ చిన్న చిన్న రాళ్ళ బోర్డర్ తో మధ్యలో రంగు రంగుల చాక్ పీసులతో మెరుపులద్ది మెరిసిపోయే ఆంజనేయ స్వామి, యేసుప్రభుల బొమ్మలు, ఆ బొమ్మలపైన అక్కడక్కడా విసిరిన ఐదు, పది పైసల బిళ్ళలు... గోడల నిండా ఎక్కడ చూసినా సినిమా వాల్ పోస్టర్లు, "మశూచి తెలుపండి, రూ. వెయ్యి పొందండి" స్టెన్సిల్ రాతలు, కుటుంబ నియంత్రణ లాంటి గవర్నమెంట్ ప్రమోషన్ పెయింటింగులు... ఏమీ తోచని వాళ్ళు అలా బజార్ కెళ్తే చాలు, తెలీకుండానే సమయం గడిచిపోయేది. ఏ పనీలేక, ఏమీ తోచక రోజంతా బజారుల్లోనే గడిపేసేవాళ్ళూ ఊర్లో చాలా మంది ఉండేవాళ్ళు. ఇంకా బొంతరాళ్ళతో కట్టిన పెద్ద పెద్ద సువిశాలమైన స్కూల్స్, కాలేజ్ లూ, తాలూకా ఆఫీసూ, కోర్ట్, పోలీస్ స్టేషన్, బస్టాండ్, రైల్వే స్టేషన్...ఇలా నా ఎనిమిదేళ్ళవయసుకి "కావలి" చాలా పెద్ద పట్టణం.
మా ఇంటి దగ్గరే ఒక చిన్న నాలుగుగోడల రేకుల గది లో ఉండేవాడు, అప్పుడే కొత్తగా పెళ్లయి కాపురం పెట్టిన "ఎంగటేశులు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. బహుశా నాకన్నా ఒక పదేళ్లు పెద్ద ఉంటాడేమో, అంతే. ఆ చుట్టుపక్కల అందరిళ్ళకీ వస్తూ అమ్మనీ, నాన్ననీ విజయక్కా, రామచంద్ర మావా అంటూ పలకరిస్తూ రోజూ ఇంటికి వస్తుండేవాడు.
ఒకసారెప్పుడో స్కూలు నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన నాన్న ని బజారు తీసుకెళ్ళమని అడుగుతున్నామేమో...నేను తీసుకెళ్తా అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన "ఎంగటేశులు" అనటం, జాగ్రత్తగా తీసుకెళ్ళి, తీసుకొస్తాడో లేదో అన్న డౌట్ తో వద్దులే అని అమ్మ అనటం, లేదు పోవాలని మేము పట్టుబట్టటం, అలా మొదటిసారి మా ముగ్గుర్నీ "బజార్" కి తీసుకెళ్ళుంటాడు "ఎంగటేశులు". అప్పట్నుంచీ రోజూ సాయంత్రం "ఎంగటేశులు" తో చాలా సార్లు బజారుకెళ్ళిన గుర్తులు. ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టారు ఊర్లో, బస్టాండ్ లో బస్సులకోసం ఉండే విశాలమైన స్థలంలో. ఆరోజు బజారుకి తీసుకెళ్ళిన "ఎంగటేశులు" మమ్మల్ని ఎగ్జిబిషన్ కీ తీసుకెళ్ళాడు. ఎగ్జిబిషన్ లోని "రూపాయి ఫొటో స్టుడియో" లో మేమెంతో ముచ్చటపడ్డ "తాజ్ మహల్" తెర ముందు నిలబెట్టి తీయించి తీసుకొచ్చిన ఫొటో కావలిలో మా మొట్టమొదటి ఫొటొ. అప్పట్లో ప్రతిరోజూ భలే చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం, నిజంగానే తాజ్ మహల్ ఎదురుగా నిలబడి తీసుకున్నంత ఆనందంతో. నాన్న, ప్రతీ ఫొటో వెనకా తీసిన తేది తప్పక వేసేవాడు. ఈ ఫొటో వెనుక నాన్న వేసిన తేది 29-12-1976.
చాలా తక్కువ కాలం, కేవలం కొద్దినెలలే అలా "ఎంగటేశులు" తో నా అనుబంధం. ఆ తర్వాత కావలి కి చాలా దూరం, హిందూపూర్ దగ్గర "కొడిగెనహళ్ళి రెసిదెన్షియల్ స్కూల్" కెళ్ళిపోయాను ఐదవ క్లాస్ లోనే. మొదటిసారి దసరా శలవులకి, రెండోసారి సంక్రాంతి శలవులకీ ఇంటికొచ్చి గడిపిన పది పదిహేను రోజులు సరిగా గుర్తుకూడా లేవు. సమ్మర్ శలవులకి వచ్చినపుడు ఇళ్ళు తాళం వేసి ఉంది, బ్యాగ్ పక్కన పెట్టుకుని మెట్లమీద కూర్చుని ఏడుస్తూ ఉన్న ఆ గంటో, రెండు గంటలో మాత్రం బాగా గుర్తుంది. అప్పుడు "ఎంగటేశులు" రాలేదు, బహుశా ఇంట్లో లేడేమో. ఆ తర్వాత ఎప్పుడూ "ఎంగటేశులు" ని కలిసిన గుర్తులు లేవు. ఈ ఫొటో చూసుకున్న ప్రతిసారీ గుర్తుకొస్తూనే ఉంటాడు. "చిన్న శురీ, పెద్ద శురీ" అని నన్నూ అన్ననీ పిలుస్తూ, నవ్వుతూ రోజూ ఇంటికి వస్తూ ఉండేవాడు, మా ముగ్గుర్నీ చేతులుపట్టుకుని నడిపించుకుంటూ బజారుకి తీసుకెళ్తుండేవాడు.
జీవితంలో ఎందరో తారసపడుతూ ఉంటారు, కొందరితో గడిపేది కొద్ది కాలమే అయినా మదిలో ఎప్పటికీ "ఇష్టంగా" మిగిలిపోతారు. గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఆప్యాయంగా పలరిస్తూనే ఉంటారు...
మా మంచి "ఎంగటేశులు"... ఎక్కడో ఉండేవుంటాడు, అలాగే నవ్వుతూ పిల్లల్ని ఇప్పటికీ చెయ్యిపట్టుకుని నడిపించుకుని షికారుకో, బజారుకో తీసుకుని వెళ్తూ...