"భాను ప్రియ"
Poster colors on Paper (3" x 5")
రంగులు అంటే చిన్నప్పట్నుంచీ భలే ఇష్టం. చిన్నప్పుడు తొడుక్కున్న చొక్కాల డిజైన్ రంగులు, ఆడిన ప్రతి బొమ్మ మీదా ఉన్న రంగులు, కుడి చేతి మధ్య వేలుకు ఎడమ చేతి మూడేళ్ళతో పట్టి వెనక్కి లాగి పెట్టి గురి చూసి కొట్టిన రంగు రంగుల గోళీ కాయల్లో లోపల తళ తళ మెరిసిపోయే రంగులు, బొంగరాల తల పైన వృత్తాకారం లో పెయింట్ వేసి ఉన్న లేత, ముదురు రంగులు, రంగు రంగుల కాగితాలతో చేసి మిద్దెపైన ఎగరేసిన గాలిపటాలు, మా పాత ఇంటి పెరట్లో, పొలాల్లోని రంగు రంగుల పువ్వులు...ఇలా చుట్టూ ఏ రంగు కనపడినా మనసు తన్మయత్వంతో పులకరించి పోయేది.
మొదటి అనుభవాల పులకింతలు జీవితాంతం గుర్తొచ్చినపుడల్లా పులకింతలుగానే పులకిస్తూ, పులకరిస్తూ, పలకరిస్తూ ఉంటాయి. అలా ఇప్పటికీ పులకింపజేసేవి నా ఆటల్లో వాడిన గోళీలు, దామరమడుగు మా పాత ఇంట్లోని మా పెరట్లో అమ్మ వేసిన రంగు రంగుల బంతి, ముద్ద బంతి, రెక్కబంతి, చేమంతి, సన్నజాజి, కనకాంబరం పూలు ఆ పూల పరిమళాలు, అప్పుడప్పుడే రంగుల్లో వస్తున్న తెలుగు సినిమాలు. నలుపు తెలుపుల్నుంచి "ఈస్ట్ మన్ కలర్" లోకి మారుతున్న సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎప్పుడూ ముదురు రంగుల దుస్తులే వేసేవాళ్ళు. హీరో ప్యాంటులు కూడా రంగులవే, పసుపు, ఎరుపు, బులుగు ఆకుపచ్చ, ముదురు వంగపండు - ఇలాంటి రంగులు. ఈ ప్యాంటులు బయట వెయ్యాలంటే చాలా ధైర్యసాహసాలు కావాలి. తెర మీద "ఈస్ట్ మన్ కలర్" ని ఇంకా బాగా అందరి కళ్లల్లో పండించాలనేమో అప్పటి సినిమా డ్రెస్ డిజైనర్స్ సెలెక్షన్స్ లో అన్నీ కాంట్రాస్ట్ గా ఉండే ముదురు రంగులే. ఇంకా గుర్తుంది "అన్నదమ్ముల అనుబంధం" యన్.టీ.ఆర్, మురళీ మోహన్, బాలకృష్ణ వేసుకుని క్లైమాక్స్ లోని రైలు పట్టాల మధ్యన నిలబడిన ఫోజు లోని రంగులు పసుపు రంగు మురళీ మోహన్, వంగ పండు రంగు బాలకృష్ణ, బులుగు రంగు యన్.టీ.ఆర్. చొక్క ప్యాంటూ రెండూ ఒకే కలర్ తో వేసుకుని ఉన్న ముగ్గురు హీరోలు, మూడు రంగులు, చూడ ముచ్చటగా అనిపించేది కళ్లకి.
ఇక తిరునాళ్ళల్లో అమ్మే బొమ్మలైతే అదిరిపోయే రంగులే, పిలకాయల కళ్ళకీ మనసులకీ రంగుల పండగే. పుల్లైసు, పిప్పరమింట్లు, పీచు మిఠాయిల్తో సహా అన్నిట్లోనూ రంగుల వాడకం విపరీతంగా ఉండేది. బయట బండ్ల మీదా బంకుల్లో అమ్మే రంగులున్న చిరుతిళ్ళు ఆరోగ్యానికి హానికరం అని నాన్న రంగులున్నవేవీ కొననిచ్చేవాడు కాదు, తిననిచ్చేవాడు కాదు. స్కూలుకి కూడా జేబులో న్యూట్రిన్ చాక్లెట్టో, బ్రిటానియా బిస్కెట్లో పెట్టి ఇంటర్వల్ లో తినండి అని చెప్పి పంపించేవారు తప్ప, అందరి పిలకాయల్లా ఐసు బండి దగ్గరకి కూడా వెళ్ళాలంటే భయమే, ఎవరైనా చూసి నాన్నకి చెబితే తన్నులు తప్పవని. పుల్లైసు తినలేకున్నా వాటికున్న ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్ని చూస్తే మనసు రంగుల్లో మునిగి తేలి ఉబ్బి తబ్బిబ్బై పోయేది.
1975 లో మా ఊరు "దామరమడుగు" లో నాన్న తన స్వశక్తితో దగ్గరుండి మరీ కట్టించిన మా కొత్త ఇంటికి లోపలా, బయటా గోడలకి వేసిన రంగులు, ఇంటి లోపల సీలింగ్ నుంచి వేలాడే లైటు బల్బులని పైన కవర్ చేస్తూ షడ్భుజాకారంలో ఉన్న ప్లాస్టిక్ డోమ్ కవర్లూ ఆ రంగుల్ని చూస్తూ "నాన్న సెలెక్షన్ ఎప్పుడూ భలే ఉంటుంది" అని నేనూ అన్నా ఎన్ని సార్లు మురిసిపోయేవాళ్ళమో. అప్పట్లో ఇళ్ళకంతా తెల్లని సున్నం, ఒక్క రంగే వేసేవాళ్ళు. బహుశా మా ఊర్లో రంగుల ఇల్లు అప్పట్లో మాదేనేమో. ఇంకా పల్లెటూరు ప్రత్యేకతలన్నీ సహజమైన రంగుల్లో చాటిచెప్పే ముదిరిన తాటి పండు లోపలి ముదురు కాషాయం రంగూ, లేత ముంజె సిల్వర్ రంగూ, పచ్చి గుబ్బల పచ్చని, ముదురు గుబ్బల ఊదా రంగులూ, తాటి ముంజెల్ని బొటన వేలితో లోడి తినేశాక రెండు తాటి బుర్రల మధ్యన పుల్ల గుచ్చి దాన్ని పంగాలు కర్రతో పట్టి నడిపేందుకు సిద్ధం చేసుకునే ఆ తాటికాయ బుర్రలపైన ముదురు నలుపుతో కలుస్తూ చాలా అర్టిస్టిక్ గా ఉండే ఒక ప్రత్యేక పసుపు రంగు, లేత వరినారు చిలక పచ్చ రంగూ, పెరిగే వరిపైరు ముదురు పచ్చా, రెండెద్దుల బండి చక్రాల ఇరుసుని పట్టి పెట్టి ఉండే ఇనుప కమ్మీ రాపిడి తగ్గించేందుకు చుట్టూ పూసే కాలిన గడ్డి బూడిదలో నూనె కలిపి చేసిన "కందిన" అసలు సిసలైన నల్లని రంగూ, ఇంటి దగ్గర ఆంజనేయస్వామి రాయికి పూసిన పసుపు రంగు, పైన పెట్టిన ఎర్రని బొట్లు, ఇంటికెదురుగా ఉన్న టెంకాయ చెట్ల పైన సాయంత్రం అయితే గుంపులుగా వచ్చి వాలే తెల్లని కొంగల తెలుపు రంగూ...ఇలా ఎటు చూసినా రంగుల ప్రపంచమే.
అలా మొదలు పెట్టిన రంగుల ప్రయణంలో రంగుల్తో చాలా గంటలు పేపర్ మీద కుస్తీ పట్టేవాడిని. కాటా కుస్తీలో అయితే పోటీలు పూర్తయ్యాక ఆ కుస్తీల్లో పడ్డ కష్టం అంతా వస్తాదుల్లో కనిపించదు. కానీ పూర్తయిన బొమ్మలోనే ఆ బొమ్మ వెయ్యటంలో ఆర్టిస్ట్ పట్టిన కుస్తీ, అందులో పడ్డ కష్టం అంతా కొట్టొచ్చినట్టు కనిపించేది. ఈ బొమ్మలో నా(టి) కుస్తీ పోటీ అంతా అణువణువునా నేటికీ చూడొచ్చు. నేను వాడిన పేపర్ కీ, ఆ పేపర్ మీద వేసిన రంగులకీ పొత్తు అస్సలు కుదరదు. చేసిన శ్రమ అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బొమ్మ పరిమాణం, ఆ కళ్ళు, ఆ ముఖవచస్సు, అన్నిటినీ మించి ఏ మాత్రం ఒకదానితో ఒకటి కలవని పేపర్ పైన కలవని రంగులతో కలపాలని చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రంగు బొమ్మలతో సమస్య అంతా మెటీరీయల్ లోనే ఉంది. ఎంచుకున్న పేపర్ సరికాదు, వాడిన రంగులు ఆ పేపర్ కి సరయినవి కావు. సంతకం గమనిస్తే వాడిన బ్రష్ పరిస్థితి కూడా పూర్తిగా ఇట్టే తెలిసి పోతుంది. సన్నని కుంచె గల ఆ ఒక్క బ్రష్ తోనే ఇలాంటి బొమ్మ పూర్తిగా, అదీ అద్దంలోని ప్రతిబింబం...వెయ్యాలంటే మాటలు కాదు. మాటల్లోనే కాదంటే ఇంక చేతల్లో చెప్పాలా? అయినా ఇంత సాహసం తో బరిలోకి దిగాలా? పట్టు తెలీదు, రూల్స్ తెలీవు, బరిలో వాడాలసిన సరంజామా సాంకేతిక పరిజ్ఞానమూ బొత్తిగా లేదు, సరైన పరికరాలు అసలే లేవు...అయినా కుస్తీ పట్టి గెలిచిపోవాలన్న తపన ఒక్కటే గంటల తరబడి ఏకాగ్రతతో నన్ను ఆ బొమ్మ చుట్టూ రంగులతో కట్టిపడేసేది.
ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే ఆ పట్టిన కుస్తీలో ఓడిపోయాను అని ఇట్టే గ్రహించగలిగినా, అప్పట్లో గెలిచానన్న ఆనందం ఉండేది. ఆ ఆనందం వెనుక వెన్నుదట్టి నిటారుగా నిలబడి ఉండేది నా పట్టుదల. ఆ పట్టుదలే తర్వాత క్రమేపీ అదే పేపర్, అదే మాట వినని రంగులతో ఔరా అనిపించే అద్భుతాలనీ సృష్టించ గలిగాయి.
"ఓటమే విజయానికి తొలిమెట్టు" అంటారు. అప్పట్లో నేనది ఓటమి అని భావించక పోయినా, దాన్నే పెద్ద విజయంగా మాత్రం అనుకోలా. ఇంకా పెద్ద విజయాలకై సాగిన నా బొమ్మల జైత్ర యాత్ర ఆ తరువాతి క్రమంలో వేసిన అప్పటి బొమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బొమ్మ బొమ్మ కీ సాధనలో సాధనతోనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. వాటిల్లో ఎలా వెయ్యాలో అనే పాఠాలకన్నా ఎలా వెయ్యకూడదో అన్న పాఠాలే ఎక్కువ. ఒక చిన్న మెళకువ పట్టుకోవటానికి ఎన్నో బొమ్మల యుద్ధం చెయ్యవలసి వచ్చేది. ఢక్కముక్కీలు తినాల్సి వచ్చేది. కిందామీదా పడుతూ లేస్తూనే మెల్లిగా అడుగులేస్తూ, క్రమేపీ ఉరకలెట్టవలసివచ్చేది. అయినా ఆపకుండా పరిగెట్టా, రంగులమీద మక్కువతోనే.
అప్పుడు నేను వాడుతున్నవి పోస్టర్ కలర్స్ అని మాత్రమే తెలుసు. కానీ వాటినే వాటర్ కలర్స్ అనుకున్నా. వాటర్ కలర్స్ అనేవి వేరే ఉంటాయనీ, వాటర్ కలర్ పెయింటింగ్స్ కి ప్రత్యేకమైన పేపర్ ఉంటుందనీ ఇవేవీ తెలీవు. అసలు వాటికోసం తిరిగిన షాపుల్లోనైనా ఎవరికన్నా వీటి గురించి తెలిస్తేగదా నాకు తెలిసే అవకాశం కి. విజయవాడ అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివార సాయంత్రం ఫుట్ పాత్ ల మీద పెట్టే పాత పుస్తకాల్లో కనపడే ఆర్ట్ మ్యాగజైన్స్ కొనేవాడిని, అందులో వివరించిన వాటర్ కలర్స్, బ్రషులు అప్పటి మార్కెట్లో దొరికేవి కాదు. అలా పోస్టర్ కలర్స్ తోనే, కొంచెం మందపాటి మామూలు పేపర్ పైనే వాటర్ కలర్స్ లా కొన్ని, ఆయిల్ పెయింట్స్ లా కొన్ని వేస్తూ విన్యాసాలు చేసేవాడిని. అంటే దొరికిన వెదురు పుల్లని విల్లుగా చేసి దాంతోనే బాణాల యుద్ధం, గదా యుద్ధం, కత్తి యుద్ధం చెయ్యటం అనమాట. అలా చేసిన యుద్ధ విన్యాసాల ప్రక్రియల్లో కొన్ని మాత్రం ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆ ఆశ్చర్యాల వెనుక ఓడిన ఈ "భాను ప్రియ" బొమ్మలాంటి బొమ్మలనేకం నాతో ఎన్ని వందల గంటలు ఎలా యుద్ధం చేయించాయో నా గతంలోనికి తొంగిచూస్తే, అందులోని అలుపు ఎరుగని నా రంగుల ప్రపంచంకే ఎరుక...
"విజయ పథంలో ఓటమి పాఠాలే గొప్పవి."
~ గిరిధర్ పొట్టేపాళెం
~~ ** ~~ ** ~~
("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)
నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" చదివి, అవి నచ్చి, ఆపకుండా ఎందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...
