Thursday, August 7, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 32 . . .

"భాను ప్రియ"
Ballpoint Pen on paper

గీసే ప్రతి గీత లో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీత లో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ - చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందునా వేసేది పోర్ట్రెయిట్ అయితే ఆ పొర, తడబాట్ల పరిమితి పరిధి మరింత ఎక్కువవుతుంది. ఇలా అన్ని విధాలుగా డ్రాయింగ్ అనేది ఒక ఛాలెంజ్ ప్రక్రియ. ఈ బొమ్మ నేరుగా బాల్ పాయింట్ పెన్ తో వేసింది. అంటే ఇంకెంత సవాలో ఊహించుకోవచ్చు. కళ్ళు, చూపు, ముక్కూ, ముక్కు పుడక, పెదవులు, ఆ పెదవులపై తళుక్కుమనే సన్నని వెలుగు, జుట్టూ, బొట్టూ, కట్టూ ఇలా అన్నీ కొలిచినట్టు ఉంటే తప్ప పూర్తి అయిన బొమ్మ ఆ బొమ్మ తాలూకు వ్యక్తి(ది)గా అనిపించదు. ఇవన్నీ ఒకే బొమ్మలో ఒడిసి పట్టుకో(గలగ)టమే పోర్ట్రెయిట్ స్పెషాలిటీ.

పోర్ట్రెయిట్ - బొమ్మల్లో ఇదొక ప్రత్యేక విభాగం, అందరు ఆర్టిస్టులు దీని జోలికి పోరు. పోయినవాళ్ళు ఇది బాగా ఇష్టపడతారు, బాగా ఆనందిస్తారు కూడ. ప్రతి మనిషి ముఖంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రత్యేకతల్ని గమనించి పట్టుకోగలిగితే ఆ వ్యక్తి ముఖకవళికలు దగ్గరగా వస్తాయి. ఒక్క చిన్న పొరబాటు చాలు, ఆ వ్యక్తి రూపురేఖలు వేసే బొమ్మలో పూర్తిగా మారిపోయి ఇంకెవరిదో అనిపించటానికి.

నా బొమ్మల్లో ఎక్కువగా వేసింది పోర్ట్రెయిట్స్ నే. చిన్నపుడు చందమామ బొమ్మల మాస పత్రిక చూస్తూ అందులో ఆఖరి పేజీల్లో చిన్నపిల్లల కోసం ఉండే వ్యాపార ప్రకటన "పాపిన్స్ పిప్పరమింట్స్" లో పిల్లాడి బొమ్మని చూసి, ఆ పిల్లాడి క్రాఫు ముందుకి తిరిగిన చిన్న రింగు, గుండ్రటి చుక్కల్లాంటి రెండు కళ్ళు, ఇంగ్లీషు అక్షరం యల్ షేపులో ఉండే ముక్కు, చేప లాంటి నోరు వేసి మొదలు పెట్టిందే నాకు తెలిసి మొట్టమొదట నేను వేసిన పోర్ట్రెయిట్. తర్వాత రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇలా దేవుళ్ళ బొమ్మలు వేస్తూ, కొద్దికాలంలోనే యన్.టీ.రామారావు, కృష్ణ, ఏ.యన్.ఆర్. ల బొమ్మలు వెయటంలో భలే సంతోషంగా అనిపిస్తూ ముందుకి సాగింది పోర్ట్రెయిట్స్ తో నా ప్రయాణం. అలా సినిమా హీరోల్ని అచ్చుగుద్దినట్టు వేస్తూ, చూడకుండా కూడా కొన్ని గీసే స్థాయి కి చేరుకున్నా. "నేరం నాది కాదు ఆకలిది" లో పెద్ద టోపీ పెట్టుకుని నోట్లో సిగరెట్ తో ఉన్న యన్.టీ.ఆర్. బొమ్మైతే చక చకా దొరికిన చోటల్లా గీసేసే వాడ్ని.

చిన్నపుడు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి బొమ్మని వెయ్యాలని ట్రై చేసే ఉంటారు. చాలా మంది ముక్కుని వేసే దగ్గర మాత్రం చాలా కష్టపడే వాళ్ళు. అప్పుడు మేముంటున్న మా ఊరు "కావలి". సినిమా థియేటర్స్ లో ఇంటర్వల్ తర్వాత సినిమా మొదలయ్యే ముందు బయట క్యాంటీన్ లో వేడి వేడి పులిబంగరాలు, మసాలా వడలు తిని, చల్లని సోడానో, వేడి వేడి టీ నో, సిగిరెట్టో తాగొచ్చి సెటిల్ అయ్యే ప్రేక్షకులు వచ్చి కుర్చీల్లో కూర్చునేలోపు తెరపై వేసే, గ్లాస్ పలక మీద వేసిన స్లైడ్స్ లో "పొగ త్రాగరాదు", "ముందు సీట్లపై కాళ్ళూ పెట్ట రాదు" అన్న స్లైడ్స్ తప్పనిసరిగా ఉండేది. ఎవరితో వేయించేవాళ్ళో తెలీదు గానీ, అప్పుడున్న సినిమాల ట్రెండు ని బట్టి "పొగ త్రాగరాదు" అన్న స్లైడ్ కి ఏదో ఒక హీరో సిగిరెట్ తాగుతూ ఆ సిగిరెట్ మీద పెద్ద ఇంటూ మార్కు తో అంతా బానే వేసే వాళ్ళు, ఒక్క ముక్కు తప్ప. ముక్కు దగ్గర మాత్రం సునాయాసంగా అనిపిస్తూనే పడ్డ కష్టమంతా కొట్టొచ్చినట్టు కనపడేది. సునాయాసంగా విచిత్రంగా వేసి పారేసే వాళ్ళు, ముక్కు ముక్కే కాకుండా పోయినా చూడగానే ఫలానా హీరో అని తెలిసిపోయేలా. నాకెప్పుడు థియేటర్లో అవి చూసినా నేనైతే ఇంకా బాగేద్దును అనుకునేవాడ్ని, కానీ అవి ఎవరేస్తారో ఎలా వేస్తారో మాత్రం తెలిసేది కాదు. మా అన్న ఫ్రెండ్స్ నా బొమ్మలు చూసి నువ్వెయ్యొచ్చు కదా గిరీ, బొమ్మలు సరిగ్గా వెయటం రానోళ్ళే వేస్తున్నారు అనేవాళ్ళు. అవెలా వేస్తారో తెలుసుకుని వెయ్యాలని ఉన్నా, ఎవర్ని సంప్రదించాలో తెలిస్తే కదా. చొరవ తీసుకుని థియేటర్ యజమానిని కలిసేంత వయసూ లేదు, ఆ పిల్ల వయసులో అంత పెద్ద సాహసమూ చెయటం తెలీదు. "సాహసం శాయరా ఢింబకా" అని పలికే మాంత్రికుడూ లేడప్పుడు పక్కన. అందుకే ఇంట్లో నాలుగు గోడల మధ్యనే నా పోర్ట్రెయిట్ బొమ్మలు క్రమేపీ కుదురుగా ఎదగ సాగాయి.

ఇంటర్మీడియట్ కాలేజి రోజుల్లో హీరోల్ని దాటి హీరోయిన్ బొమ్మలు అడపా దడపా వేసేవాడ్ని. బాపు, చంద్ర గార్లు వేసిన అందమైన వయ్యారాల అమ్మాయిల బొమ్మలూ వెయటం మొదలుపెట్టాను. ఆడవాళ్ళ ముఖం లో సహజంగానే ఉండే సున్నితత్వాన్ని, కళ్ళల్లో, నవ్వులో ఉండే అందాన్ని, జుట్టులోని హొయల్నీ బొమ్మల్లో పట్టుకో గలగటం నాకేమీ కష్టంగా అనిపించలేదు. యన్.టీ.ఆర్ ని పట్టినంత తేలిగ్గానే పట్టేశా. తర్వాత శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల హాసన్ ఇలా వేస్తూ వేస్తూ ముఖకవళికలు అచ్చు పోసినట్టు గీయటంలో పట్టు సాధించా. అలా వేస్తూ వేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో చాలా కాలం అలనాటి అందాల తార "భాను ప్రియ" బొమ్మల్ల దగ్గర ఆగిపోయా.

"భాను ప్రియ" కళ్ళల్లో పలికే భావాలని, అమాయకత్వాన్ని బొమ్మల్లో పట్టాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఆ నాలుగేళ్ళలోనే. దాదాపు రెండు డజన్ల దాకా రకరకాల పోర్ట్రెయిట్స్ వేసుంటా. ఈ బొమ్మ బహుశా "శ్రావణ మేఘాలు" అన్న సినిమా లోని స్టిల్ అనుకుంటా. ఇందులో ఏదో తెలియని అమాయకత్వం తొణికిసలాడుతున్న ఒక పల్లెటూరి పిల్ల ముఖంలో సహజమైన అమాయకత్వంలో దాగిన ఒకింత సిగ్గు, ఒకింత బిడియం, ఒకింత మురిపెం కలిపిన ఆ చూపుల భావాల్ని వెయ్యాలని చేసిన ప్రయత్నమిది. నేరుగా బాల్ పాయింట్ పెన్ను తోనే వేసిన బొమ్మ కనుక తప్పుల తడికలకి తావే లేదు, ఉన్నా సరిదిద్దటం వీలే కాదు. నిజానికి నేరుగా బాల్ పెన్ తో మొదలు పెట్టేంత సాహసం చెయ్యవసరం లేదు గానీ, కొన్ని కొన్ని అలా అనుకోకుండా వేసి బాగా కుదరటంతో చాలా వరకు అలాగే మొదలుపెట్టి వేసేసేవాడ్ని. ఇప్పుడు వెను దిరిగి చూస్తే అంత కాన్ఫిడెన్స్, అంత నైపుణ్యం ఎట్టొచ్చిందా ఆ రోజుల్లో అనిపిస్తూ ఉంటుంది.

అప్పట్లో వేసిన చాలా బొమ్మలకి చుట్టూ రకరకాల బార్డర్స్ వేసేవాడ్ని. ఈ బొమ్మకి మాత్రం ఒక సర్కిల్ గీశా. దాని వల్ల ఈ పోర్ట్రెయిట్ మరింతగా ఎలివేట్ అయ్యిందనిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి అమెరికా వచ్చాక తెలుసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్ "నార్మన్ రాక్వెల్" పోర్ట్రెయిట్స్ లో ఎక్కువగా కనిపించేది ఇలా బొమ్మ చుట్టూ సర్కిల్. బహుశా అప్పటికి ఎక్కడైనా "నార్మన్ రాక్వెల్" వేసిన బొమ్మలు ఎప్పుడైనా చూశానా అంటే ఆ ఛాన్సే లేదు. అప్పట్లో మనకి "రవి వర్మ" పేరు, చందమామ, నవలలు, వారపత్రికల్లో బొమ్మలు వేసే తెలుగు ఆర్టిస్టుల పేర్లు, బొమ్మలూ తప్ప ఇంకెవరివీ తెలీవు.

కాలేజి లో నా రూమ్ కి వచ్చి నేనేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకున్న ఫ్రెండ్స్ కొద్ది మందే అయినా నేనప్పుడు వేసిన "భానుప్రియ" పోర్ట్రెయిట్స్ ద్వారా అందరికీ నేను "భానుప్రియ" అభిమానిగా ఎప్పటికీ గుర్తుండిపోయా. అమెరికా వచ్చిన కొత్తల్లో "లాస్ ఏంజలస్" లో ఉండే ఒక ఫ్రెండ్ "ఏం గిరీ, మీ భానుప్రియ ఉండేది ఇక్కడే తెలుసా" అన్నపుడు మాత్రం అయ్యో అక్కడుంటే ఎప్పుడైనా కనిపిస్తే నేను వేసిన బొమ్మలు చూపెట్టే వాడిని అని మాత్రం అనుకున్నా. 1997 లో "Giri's Home" అని నా వెబ్సైట్ లో నేనప్పటికి వేసిన బొమ్మలన్నీ ఉండేవి. ఎప్పుడో ఒకప్పుడు "భానుప్రియ" కంటపడకపోతుందా అనుకునేవాడ్ని.

ఆర్ట్ నా హాబీనే అయినా, దాంతో నా సుదీర్ఘ ప్రయాణం లో నా బొమ్మలు మెచ్చిన మనుషులు అతి కొద్దిమందే, నేనూ, నా బొమ్మలూ వాళ్ళకి గుర్తున్నా లేకున్నా నాకు మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తే. చాలా ఏళ్లకి మళ్ళీ టచ్ లోకి వచ్చిన నా ఇంజనీరింగ్ కాలేజి నాటి మిత్రులు మాటల్లో "ఎప్పుడు టీవీ లో భానుప్రియ ని చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి గిరీ" అన్న మాటల్లో చెప్పలేని సంతోషం మాత్రం నా పోర్ట్రెయిట్స్ లో అంతగా ఒదిగి పోయిన అలనాటి అందాల నటి ఆ "భానుప్రియ" బొమ్మల దే...

"గీసే గీత లో నింపే ఇష్టమే బొమ్మకు ప్రాణమై జీవం పోసేది."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...