Sep 28, 2009 . . .
ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలిద్దరితోబాటు, ఒక రాగి నాణెం (US one-cent Coin) , కొన్ని నవధాన్యాలు తీసుకుని 7 గంటలకి ముందే కార్ లో బయలుదేరా. ఆరోజు దసరా. కొత్త ఇల్లు ఫౌండేషన్ వేస్తామని బిల్డర్ రెండు రోజుల ముందే చెప్పాడు. ఏదీ ముందుగా అనుకోలేదు. కానీ మంచి రోజూ, దసరా అలా కలిసొచ్చాయి. దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాం. కష్టపడి స్వయం సంపాదనతో కట్టుకున్న మొదటి ఇల్లు, 9, 7 ఏళ్ళ పిల్లలు, ఈ ఇంట్లోనే ఆడుతూ, పాడుతూ పెరిగి పెద్దయ్యి రెక్కలొచ్చి కాలేజీలకె(గిరె)ళ్ళిపోయారు.
పిల్లల్తో కలిసి ఇంటా బయటా ఆడిన ఆటలు, చాలా కాలం బ్రేక్ తర్వాత బొమ్మల శ్రీకారం, వారం వారం క్రమం తప్పక కొన్నేళ్ళపాటు ఏకధాటిగా వేసిన వందలకొద్దీ బొమ్మలు, పదకొండేళ్ళు తప్పకుండా ప్రతి సంవత్సరం వినాయకచవితికి మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమలు, ప్రతి బొమ్మలోనూ పెనవేసుకున్న గాలీ, వెలుతురూ, అనుభవం తాలూకు జ్ఞాపకాలూ, జీవితంలోంచి కొందరి వ్యక్తుల నిష్క్రమణా, కొత్త పరిచయాలూ, రెండున్నర సంవత్సరం ఇల్లు కదలనివ్వని కరోనా మహమ్మారి కాలం, ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలతోబాటు కొన్ని చేదు అనుభవాలూ మిగిల్చి పదమూడేళ్ళు వేగంగా కదిలి ముందుకెళ్ళిపోయింది కాలం.
Sep 28, 2022 . . .
ప్రతి ఆదికీ తుది తప్పకుండా ఉంటుంది, అది ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది. సరిగ్గా పదమూడేళ్ళ తర్వాత అదే Sep 28, 2022 రోజు మా ఇంటితో అనుబంధం చివరి రోజు. అంతా యాదృచికమే. ముందుగా అనుకున్నదేమీ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం, కాలం తయారుచేసిన ప్రణాళికలానే అనిపిస్తూ ఆశ్చర్యం. ఎప్పుడెలా ఏం జరగాలన్నది కాలనిర్ణయమేనేమో, కాలమహత్యం అంటే ఇదేనేమో!
కష్టపడి నిర్మించుకున్న గూడయినా, ఎంచుకున్న బంధమయినా, పెంచుకున్న అనుబంధమయినా వీడి వెళ్లటం కష్టమే. తప్పనపుడు వెళ్తూ తీసుకెళ్ళేది మాత్రం జ్ఞాపకాల్నే.
"కదిలే కాలంతో ప్రయాణించే జీవితం ఎక్కడికైనా, ఎప్పటికైనా మోసుకెళ్ళేది మాత్రం ఒక్క జ్ఞాపకాల్నే."
~ గిరిధర్ పొట్టేపాళెం
~~~~ ** ~~~~
ఫౌండేషన్ - దసరా ఉదయం, Sep 28, 2009
Framing in progress, Oct 2009
Framing done, Nov 2009
Outside construction, pretty much done, Dec 2009
గృహప్రవేశం, Apr 2010