Friday, January 23, 2026

Thank you...


 Thank you!
Ink & Water colors on paper 5" x 4"

Thank all you those who sent me their wishes and kind words on my Birthday this year. Little things in life become valuable when they touch the receiver's heart. ❤️






Monday, January 19, 2026

Listen to your soul...

Ink pen on Paper (8.5" x 11")

Sometimes, life slows you down. But never stop your passion. It's the extra mile that you run that matters in life's race. That extra mile is the important one that makes you satisfied and fulfills your soul.

Always listen to your soul.

Sunday, January 11, 2026

All the best Chiru...

Chiranjeevi - Telugu Movie Actor (8.5" x 11")
Ink and Watercolors on Paper

All the very best Dear Chiru 💐💐
You are an inspiration for many even at this age.






Saturday, January 3, 2026

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 36 . . .

 
కొల్లేరు సరస్సు
Low Grade Poster Colors on Paper (7" x 12")

విలువిద్య నేర్చుకోవటానికి 'గాండీవం' అవసరం లేదు. రెండు వెదురు పుల్లలు, కొంచెం నార దొరికితే చాలు. విల్లు తయారు చేసుకుని ఆ విల్లు చేపట్టిన విలుకాడి చేతిలోని నేర్పు, అకుంఠిత దీక్ష, పట్టుదలతో చేసే విద్యా సాధన చాలు. విలువిద్య నేర్పు సాధనతో వస్తుంది తప్ప, ఎక్కుపెట్టే బాణంతో రాదు. విద్య నేర్పించే గురువుంటే మెళకువలు నేర్చుకోవడం సులువవుతుంది, లేదంటే ఏకలవ్య విద్యాభ్యాస సాధనే నేర్చుకోవాలన్న పట్టుదలకి గురువు.

నా రంగుల బొమ్మల విద్యాభ్యాసానికి ఊతగా నాకు దొరికిన నాసిరకం ఆరు రంగుబిళ్ళల వాటర్ కలర్ పెయింట్స్ పెట్టె, ఒక నాసిరకం బ్రష్ తో మొదలుపెట్టి సాగించిన బొమ్మల సాధన కాలం నాటి ఒకానొక రంగుల పెయింటింగ్ ఇది. "ఆధ్రభూమి దినపత్రిక, సండే స్పెషల్" లో వచ్చిన ఫొటో ఆధారంగా అభ్యాసం చేసి వేసింది. దీనికి  సరిగ్గా సంవత్సరం ముందొకసారి అదే ఫొటో ని చూసి బ్లాక్ అండ్ వైట్ లో బ్రిల్ ఫౌంటెన్ పెన్ ఇంకు తో మరీ నాసి రకం పేపర్ మీద దీనికన్నా పెద్ద సైజ్ లో పెయింటింగ్ వేశా. ఆ రంగుల పెట్టెలో ఉన్నదే ఐదారు రంగు బిళ్ళలు. రెండు మూడు రంగులు కలిపి కొత్త రంగులు సృష్టించే వీలూ లేని నాసి రకం రంగులవి. అయినా రంగుల్లో వెయ్యాలన్న ఉత్సాహంకి, దొరికిన ఆ కాస్త మెటీరియల్ తప్ప ఇంకేం అందుబాటులో లేని కాలమది. వెదురు పుల్లల్లాంటి ఆ రంగుల బిళ్ళలే నా రంగుల పెయింటింగ్ అభ్యాసానికి గాండీవం అయ్యాయి.

కావలి - బాల్యంలో స్కూలు, కాలేజి శలవులన్నీ ఎక్కువగా గడిపిన మా ఊరు. గత కాలపు వెలుగు చూడని నా బొమ్మల స్మృతులన్నీ ఆ ఊరిలోనే ఊపిరి పోసుకున్నాయి, ఆ ఊరితోనే ఎక్కువగా అనుబంధాల్నీ పెనవేసుకున్నాయి. అప్పటి నా బొమ్మలకి నేర్చుకోవాలన్న తపన ఉత్తేజమైతే, ప్రేరణ మాత్రం అప్పటి పత్రికలే. వాటిల్లో ప్రముఖమైన వార పత్రిక ఆంధ్రభూమి. అన్ని వార పత్రికలకన్నా భిన్నంగా ఉండేది. అప్పటి ప్రముఖ రచయితల సీరియల్స్ తోబాటు అద్భుతమైన ఇలస్ట్రేషన్ ఆర్టిస్టులు వేసే బొమ్మలు అత్యంత ఆసక్తికరంగా ఉండేవి. గీతల బొమ్మల ఇలస్ట్రేషన్స్ కాకుండా, మరే పత్రికలోనూ లేని కొత్త ఒరవడి, పూర్తి స్థాయి పెయింటింగ్స్ ఇలస్ట్రేషన్స్ తో చాలా ప్రత్యేకంగా ఉండేది. చందమామ, యువ, స్వాతి లాంటి పత్రికల ముఖచిత్రాలని శ్రీ వడ్డాది పాపయ్య గారు వేసే పెయింటింగ్స్ అలరించినా లోపలి ఇలస్ట్రేషన్స్ మాత్రం గీతల బొమ్మలు, లేదా గీతల బొమ్మలకి రంగులు అద్దిన బొమ్మలే. ఆంధ్రభూమి లో అలా పూర్తి స్థాయి పెయింటింగ్స్ ని ఇలస్ట్రేషన్స్ గా వేసిన నాకు నచ్చిన ఇద్దరు ఆర్టిస్టులు - ఒకరు "ఉత్తమ్ కుమార్" గారు, ఇంకొకరు "కళా భాస్కర్" గారు. ఇంకా కొంతమంది ఆర్టిస్ట్ లు ఆంధ్రభూమిలో వీళ్లని అనుకరిస్తూ అప్పుడప్పుడూ అక్కడక్కడా కొన్ని కథలకి వేసేవారు. ఇలస్టేషన్స్ మాత్రమే కాకుండా ఉత్తమ్ గారు మొదలుపెట్టిన ఉత్తమ కథానాయికలు సిరీస్, కళా భాస్కర్ గారు మొదలుపెట్టి చాలా పెద్ద సంఖ్య వరకూ కొనసాగించిన "ఎంకి" సిరీస్ నా పెయింటింగ్ సాధనకి చాలా తోడ్పడ్డాయి. ఉత్తమ్ గారి పెయింటింగ్స్ తోబాటు ఆయన వేసిన రంగుల జోక్సూ, కామిక్స్ బొమ్మలూ ఓ ప్రత్యేక ఆకర్షణతో నన్నలరించేవి.

తర్వాత నా ఇంజనీరింగ్ అయ్యి హైదరాబాదులో జాబ్ చేస్తున్నపుడు ఆంధ్రభూమి ఆర్టిస్టులని కలవాలని నేను పనిగట్టుకుని చేసిన చాలా ప్రయత్నాల ప్రయాసల్లో ఒక్క "కళా భాస్కర్" గారిని మాత్రం కలవ గలిగాను. చిక్కడపల్లి లో ఉంటున్నారని మాత్రమే తెలిసింది, సికిందరాబాద్ లోని డెక్కన్ క్రానికిల్ ఆఫీస్ కెళ్తే అక్కడి అటెండర్ ద్వారా. జనసాంద్రమైన, చిక్కడపల్లి సందుల్లో ఒక ఇంటి మిద్దెపైన చిన్న రూములో ఆయనుంటున్న ఇంటిని ఎలా పట్టానో తెలీదు గానీ, ఎట్టకేలకు పైకెళ్ళి తలుపు తడితే "కళా భాస్కర్" గారు తలుపు తీసి లోపలికి ఆహ్వానించారు.చాలా చిన్న గది, ఒక్కరే ఉంటున్నారు. ఉత్తమ్ గారి బొమ్మలకీ, కళా భాస్కర్ గారి బొమ్మలకీ అభిమానినని చెప్తే ఎంతో సంతోషించారు. "ఎంకి" బొమ్మల ప్రస్థావనలో ఆయన అప్పుడే పూర్తి చేసిన "ఎంకి" సిరీస్ 100 వ చిత్రం నాకు చూపెట్టారు. పూర్తి రంగుల్లో వేసిన పెద్ద సైజ్ వాటర్ కలర్ పెయింటింగ్ అది. కొద్ది వారాల్లో రాబోయే సంచికలో ప్రచురితం అవుతుందనీ చెప్పారు. "ఎంకి" నలుపు తెలుపు పెయింటింగ్స్ వారం వారం పత్రికలో  ఒక పేజి లో సగం సైజ్ నిలువుగా చూట్టమే అప్పటి దాక. వాటిల్లో ఒక బ్లాక్ అండ్ వైట్ బొమ్మని పత్రికలో చూసి యధాతధంగా రంగుల్లో మార్చి కూడా వాటర్ కలర్ పెయింటింగ్ వేశాను. కానీ అలా తర్వాతి సంచికలో ప్రచురితం కాబోయే అంత పెద్ద ఒరిజినల్ పెయింటింగ్ చూసిన సంతోషం మాటల్లో వర్ణించలేనిది. అప్పటికి ఉత్తమ్ గారు అమెరికా లో వాల్ డిస్నీ స్టుడియోస్ లో ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చి వెళ్ళారని డెక్కన్ క్రానికిల్ ఆఫీస్ అటెండర్ ద్వారా తెలుసుకున్నా, కళా భాస్కర్ గారు ఆ వివరాలు మరికొన్ని చెప్పారు. ఆంధ్రభూమి లో పనిచేసే ఆర్టిస్టులకందరికీ ఉత్తమ్ గారే స్ఫూర్తి అని, తనూ ఆయన వేసిన బొమ్మలు చూస్తూ చాలా నేర్చుకున్నాననీ నాతో అన్నారు. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ కళా భాస్కర్ గారిని కలుద్దామని వెళ్తే ఆయనక్కడ లేరనీ, రూము ఖాళీ చేసి ఇంకొక చోటుకి వెళ్ళిపోయారనీ తెలిసింది. అలా "కళా భాస్కర్" గారితో గడిపిన ఆ కొద్ది సాయంత్ర సమయం ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది. అయితే నేను చూసిన ఆ ఒరిజినల్ పెయింటింగ్ ప్రచురించిన ఆంధ్రభూమి సంచిక మాత్రం నా చేతికి అందలేదు, నేను చూడలేదు. ఇక చూసే అవకాశం లేదు. తర్వాత కొద్ది కాలానికి "కళా భాస్కర్" గారూ ఆంధ్రభూమి పత్రిక వదలి మూవీ వాల్ పోస్టర్ డిజైన్స్ మొదలెట్టారని కొన్ని సినిమా వాల్ పోస్టర్స్ మీద "కళ" అన్న ఆయన సంతకం చూసి గ్రహించాను. ఉత్తమ్, కళా భాస్కర్ ల బొమ్మలతో కళ కళలాడిన ఆంధ్రభూమి వారపత్రిక స్వర్ణ యుగమూ వారి నిష్క్రమణతోనే ముగిసింది. తర్వాత వాళ్లలా పెయింటింగ్స్ ఇలస్ట్రేషన్స్ వేసే ఆర్టిస్టులే తెలుగు వారపత్రికల్లో కరువయ్యారు. బాపు, వడ్దాది పాపయ్యల బొమ్మలూ పత్రికల్లో తగ్గిపోయాయి. మంచి బొమ్మ ఒక్కటీ పత్రికల్లో చూసిన గుర్తులు లేవు.

అలా ఆంధ్రభూమి వారపత్రికతో నా బొమ్మల అనుబంధం విడదీయరానిది. ఈ పెయింటింగ్ మాత్రం ఆంధ్రభూమి దినపత్రిక సండే ఎడిషన్ లో వచ్చిన ప్రత్యేక శీర్షికలోని ఒక ఫొటో చూసి వేశా. కావలి లో తాతయ్య కి డెక్కన్ క్రానికిల్ గ్రూప్ సంస్థల పత్రికల డిస్ట్రిబ్యూషన్ ఉండేది, ఏజన్సీ తీసుకున్నారు. అలా నాకు "ఆంధ్రభూమి వారపత్రిక" పరిచయం అయ్యింది. ఆ పరిచయం నా బొమ్మల సాధనకి మార్గదర్శి గా నిలబడింది. అప్పట్లో ఇదీ అదీ అన్న భేదం లేదు, నచ్చిన ఫోటో అయినా, పెయింటింగ్ అయినా చూసి నా దగ్గరున్న మెటీరియల్ తో వెయ్యాలని దీక్షగా కూర్చుని గంటల తరబడి అలా సాధన చేస్తూ వేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కావలి పాతూరు లో "పోలువారి వీధి" లో మా నారాయణవ్వ ఇంట్లో మేము అద్దెకుంటున్న చిన్న పెంకుటిల్లే నా ఆర్ట్ విద్యాలయం. ఆ విద్యాలయం లో సాగించిన ఏకలవ్య సాధనలోని బొమ్మల్లో ఇదీ ఒకటి. ఇందులో వాడిన రంగులు చూస్తే ఇట్టే ఎవరికైనా తెలిసి పోతుంది. అప్పట్లో హైస్కూల్ విద్యార్ధులకి మొక్కుబడిగా ఉండే డ్రాయింగ్ క్లాస్ పిల్లలకోసం ఒక ఆరు రంగుల బిళ్ళల పెట్టె రంగుల డబ్బా బుక్ షాప్స్ లో దొరికేది. అన్న హైస్కూల్ లో కొన్న వాడని ఆ రంగు బిళ్ళల డబ్బా ఇంట్లో అలా ఖాళీగా ఉంటే, అది నా పెయింటింగ్స్ సాధనకి ఆది గా నిలిచింది. అందులో ఒకటి రెండు రంగులు పూర్తయ్యేదాకా వాటితోనే సాధనా చేశా. ఇప్పుడా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంటే "సాధన చేయుమురా నరుడా...సాధ్యము కానిది లేదురా" - అన్న రామకృష్ణ గారి అప్పటి సినిమా పాట మదిలో మెదుల్తుంది.

ఏ పనికైనా అంతిమంగా నేర్పు ముఖ్యం. ఆ నేర్పుకి సాధనే తొలి మెట్టు. తొలి మెట్టే కాదు, తొలి పదీ, వందా, వేల మెట్లు, అంతిమ మెట్టు కూడా సాధనే. ఏదయినా సాధనతోనే సాధ్యం. అప్పటి ఆ అకుంఠిత సాధనే ఇప్పటికీ నా బొమ్మలకీ, బొమ్మలతో నా అనుబంధాలకీ స్ఫూర్తి...

"సాధించటం సాధనవల్లే సాధ్యం."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...