Friday, December 5, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 35 . . .

Camel Poster Colors on Paper (8"" x 4")

నూతనం ఎప్పుడూ ఉత్సాహమే. కొత్త సంవత్సరం సమీపిస్తుందంటే ఏదో తెలీని నూతనోత్సాహం ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవిస్తుంది. రోజూ ఉదయించే సూర్యుని లేత కిరణాలే ప్రతి జీవిలోనూ నింపే ఊపిరి ఉత్సాహాలు. ప్రతి సంవత్సరం నూతనంగా చిగురిస్తూ చెట్లు సంతరించుకునే పచ్చని వసంతం కోయిల గానం కి ఇచ్చే జీవనోత్సాహం. జడి వాన చినుకులతో వచ్చి చేరే కొత్త నీరే నిశ్చల నదినీ ఉత్సాహంగా పరవళ్ళు తొక్కించే ప్రవాహ శక్తి. పాత కొత్తల కలయికే జీవన పయనం. ప్రతి జీవాన్ని ముందుకి నడిపే అద్భుతమైన అదృశ్య శక్తి నిస్సందేహంగా ఉత్సాహమే.

సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ లో ఉత్సాహంగా ముందుకి సాగిపోతున్న నూతన కాలం. రెండవ సంవత్సరం, క్యాంపస్ ఓల్డ్ హాస్టల్ లో ఎప్పటికీ పాతబడని అప్పటి నా కొత్త రోజుల అనుభవాలవి. డిసెంబర్ నెల. హాస్టల్ మెస్ లో భోంచేసి రూముకి వచ్చి పుస్తకం పట్టుకున్నా, చదువుకన్నా ఫ్రెండ్స్ తో కబుర్లే చురుగ్గా సాగుతున్న రాత్రి సమయం. సడెన్ గా ఒక వ్యక్తి ఒక పక్క భుజానికి తగిలిస్తే నడుము దగ్గర వేలాడే పొడవాటి సంచి తగిలించుకుని చేతిలో ఒక కట్ట గ్రీటింగ్ కార్డులు పట్టుకుని లోపలికి వచ్చి "న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు కొంటారా, చూడండి" అంటూ చేతిలోని కొన్ని కార్డుల్ని శాంపిల్స్ అన్నట్టుగా మా చేతులకి అందించటంతో కబుర్లు ఆపి ఒక్కసారిగా కొద్ది క్షణాల పాటు నిశ్శబ్ధం. ఆ కార్డుల్ని చూసీ చూడగనే నా మనసైతే ఉత్సాహంతో పులకరించి పోయింది. వచ్చిన ఆ వ్యక్తి సాదా సీదాగా ఉన్నాడు, పెద్ద వయసు కూడా లేదు, ముప్పై లోపే ఉండోచ్చు. తనకున్న కళ తో బ్రతుకు కలని నిజం చేసుకునే ప్రయత్నం తో అంత దూరం శ్రమ పడొచ్చాడు. పోస్ట్ కార్డు సైజ్ లో ఉండే చార్ట్ పేపర్, కొంచెం మందంగా ఉంటుంది, దీనికి తెలుగులో ప్రత్యేకమైన పేరేమీ లేదు కానీ రికార్డ్ పేపేర్ అనో, చార్ట్ పేపర్ అనో, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ భాషలో అయితే ఐవరీ బోర్డ్, లేదా పెళ్ళికార్డుల పేపర్ అనో అనాలి అంతే. GSM బరువు కొలతలు తెలీని అందరికీ సుపరిచయం అయిన పేపర్ అది. నేనూ నా బొమ్మలకప్పుడు ఎక్కువగా అదే వాడేవాడిని. అలాంటి పేపర్ మీద వేసిన ప్రకృతి పెయింటింగ్స్. ఆ రంగుల అమరిక, ఆ సింగిల్ స్ట్రోక్ బ్రష్ స్ట్రోక్స్, ఆ నైపుణ్యం అంతవరకూ ఎప్పుడూ చూడలేదు. ప్రతి పెయింటింగ్ లో చెట్లు, పక్షులు, చంద్రుడో, సూర్యుడో, కొలన్లో పడవలు, కొన్నిట్లో ఒకరిద్దరు మనుషులు, వాళ్ళ నీడలు, ఇవే అన్ని చిత్రాల్లోనూ. కానీ ఒక చిత్రం ఉన్నట్టు ఇంకొక చిత్రం లేదు. వైవిధ్యంతో దేనికదే ప్రత్యేకం. ఒక చిత్రం లో ప్రకృతి పచ్చని రంగుల్లో ఉంటే ఇంకొక చిత్రం లో పసుపు, ఎరుపు రంగుల్లో, మరొక చిత్రం లో నీలం రంగులో రాత్రిని మరిపిస్తూ, ఇలా విభిన్నమైన చిత్రాలు. అలా ఒక్కొక్క చిత్రాన్నీ ఫోల్డింగ్ గ్రీటింగ్ కార్డు మీద అతికించి లోపల ఒక పేపర్ లో "Happy New Year" అని ప్రింట్ చెయ్యబడిన, చేతితో తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు. అవి చూస్తున్న నా ముఖంలో సంతోషం వెంటనే పట్టేశాడాయన. నా స్టడీ టేబుల్ ఆనుకుని ఉన్న గోడపైన నేను వేసిన బొమ్మలు, పోస్టర్ కలర్స్ పెయింటింగ్స్ కూడా అప్పటికే గమనించే ఉంటాడు. ఖచ్చితంగా కొంటాను అన్న నమ్మకం కలిగే ఉంటుంది. నా చేతికిచ్చినట్టే మిగతా ఫ్రెండ్స్ చేతికీ తలా ఒకటీ రెండు సాంపిల్ కార్డులు ఇచ్చినా వాళ్ళవి చూసి బాగున్నాయి అని ఆయన చేతికి తిరిగి ఇచ్చెయ్యటం, నేను మాత్రం అవి పరిశీలించి చూస్తూ ఉండటంతో కొంటానన్న ఆశ ఆయనలో చిగురించిందేమో నా దగ్గరకి వచ్చి ఇంకా బ్యాగ్ లో ఉన్నాయి అని ఓపెన్ చేసి అన్నీ నా ముందు పరచి పెట్టేశాడు. 

ప్రతి ఒక్క పెయింటింగ్ నీ పరిశీలించి చూస్తూ ఆశ్చర్యపోతూ ఎలా వేస్తారు, ఏం మెటీరియల్ తో వేశారు లాంటి ప్రశ్నలు వేశా. కొన్నిటికి మాత్రమే సమాధానం వచ్చింది, కొన్నిటిని అది సీక్రెట్ అనీ వాళ్ళ నాన్న వేసేవారనీ, ఆయన ద్వారా నేర్చుకున్నాననీ తప్ప ఇంకేమీ బహిర్గతం చెయ్యలేదు. ఎంత సేపు చూసినా తనివి తీరనంత ముచ్చటగా ఉన్న ఆ గ్రీటింగ్ కార్డులు అన్నీ చూసి ఒక మూడో నాలుగో కొనుక్కున్నాను. దానికే ఆయన చాలా సంతోషించేశాడు. ఒక్కొక్క గ్రీటింగ్ కార్డు ధర "ఐదు రూపాయలు". అప్పట్లో ఆ ధర చాలా ఎక్కువ. బయట ప్రింటెడ్ కార్డ్స్ ఒకటి రెండు రూపాయలకే దొరికేవి. కానీ అవన్నీ చేత్తో స్వయంగా వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్. నిజానికి ఐదు రూపాయల ధర చాలా తక్కువ. చేతి కళకి ఖరీదు కట్టటం చాలా కష్టం. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి కాలేజి లో చదువుకునే స్టూడెంట్ శక్తికి మించిందే ఆ గ్రీటింగ్ కార్డుల ఖర్చు. ఆర్ట్ ని చూస్తే వాటి వెలా కొంటే ఖర్చు అన్న వాస్తవం మర్చిపోయేవాడిని.

ఒక ఆర్టిస్ట్ వేసిన ఒరిజినల్ ఆర్ట్ ని దగ్గరగా చూడటమే ఒక పెద్ద వరం అన్న రోజులవి, అలాంటిది ఒరిజినల్ ఆర్ట్ చేతిలో గ్రీటింగ్ కార్డ్ రూపంలో ఉంటే అన్నీ మర్చిపోవటమే. అలా కొన్న గ్రీటింగ్ కార్డ్స్ ఎవ్వరికీ పంపలేదు, నా ఆర్ట్ కలెక్షన్స్ లో భద్రపరచుకున్నా. ఆరోజు హాస్టల్ లో రూము రూము తిరిగినా అక్కడక్కడా ఒకటీ అరా ఎవరైనా కొన్నారేమో. నేను కొన్నవి కొన్నే అయినా అన్ని కొన్న వాళ్ళెవరూ లేరు. తిరిగి వెళ్తున్న అతన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అనిపించింది, "చాలా దూరం సిటీ బస్సులో రెండు మూడు రూపాయలు చార్జి పెట్టి ఇంత దూరం వచ్చి, రూము రూముకీ తిరిగి అమ్మినా పట్టుమని పది కార్డులైనా అమ్ముడయ్యాయో లేదో, కానీ ఎంతో ఆశ ప్రయాసలతో ఇంత దూరం వచ్చి ఉంటాడు. ఇలాగే విజయవాడలో అన్ని కాలేజిలకీ వెళ్తాడేమో, ఎలాగోలా అన్నీ అమ్ముడుపోతాయి" అని అనుకున్నా. "డబ్బులుంటే ఆ సంచి మొత్తం కార్డులు కొనేసుండొచ్చు" అనికూడా అనుకున్నా.

తర్వాతి రెండేళ్ళూ న్యూ ఇయర్ కి ముందు ఆయన హాస్టల్ కి రావటం నేను ప్రతి సంవత్సరం కొంటూ ఉండటం పరిపాటయింది. ఆఖరి సంవత్సరం, నాలుగవ సంవత్సరం లో ఉన్నపుడు నా రూము వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజే ఒక గ్రీటింగ్ కార్డులా పోస్టర్ కలర్స్ తో "బి. సరోజా దేవి" హీరోయిన్ నాట్య భంగిమ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లో ప్రింట్ అయిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో చూసి రంగుల్లో పెయింటింగ్ వేస్తూ ఉన్నాను, దాదాపు పూర్తికావొచ్చింది. ఎప్పటిలానే కొన్ని కార్డులు కొన్నాను. నేను వేస్తున్న ఆ బొమ్మని చూపించి ఆయన అభిప్రాయం అడిగాను. నా బొమ్మలు ఒక బయటి ఆర్టిస్ట్ చూసి తన అభిప్రాయం చెప్పటం అదే మొదటిసారి. ఆయన దాన్ని పరిశీలనగా చూసి "చాలా బాగా వేశావు, హెయిర్, శారీ మీద చేసిన వర్క్ చాలా బాగుంది, ఇలా వెయ్యటం నావల్ల కూడా కాదు" అంటూ ఇచ్చిన కితాబు కి నిజమా అని ఒక పక్క ఆశ్చర్యం, నిజమేనేమో సింగిల్ స్ట్రోక్స్ తో వేసే ఆయన ప్రకృతి బొమ్మలు, డీటైల్స్ తో ఉండే నా బొమ్మలు ఆయన వెయ్యలేరేమో, ఎందుకు వెయ్యలేడు, అన్ని కిటుకులు తెలిసిన్ ఆయన సులభంగా వేస్తాడు, ఊరికే అలా అనుంటాడు అన్న ఒకింత అనుమానం కలగలిసిన ఆ భావనలోనూ అనుమానాస్పదంగా తొంగి చూసిన చిన్నపాటి సంతోషం. "ఇది నా ఫైనల్ ఇయర్ , వచ్చే సంవత్సరం మీరు వచ్చినా నేనుండను" అని ఆయనతో అన్నా. అప్పుడు కూడా ఆ పెయింటింగ్స్ వేసే విధానం గురించి డీటైల్స్ అడిగా. కొంచెం చూచాయగా ఎదో చెప్పినా పూర్తి డీటైల్స్ మాత్రం చెప్పలేదు. "చెప్తే నువు సులభంగా పట్టేస్తావు. ఇంత డీటైల్డ్ గా పెయింటింగ్స్ వేస్తున్న నీకిది కష్టం కాదు" అని మాత్రమే అన్నాడు. తిరిగి వెళ్తున్న ఆయన ముఖంలో సంతోషం ఇంకెన్నడూ చూడలేనని తెలుసు.

తర్వాత కొద్ది రోజులకి ఆయన వేసిన గ్రీటింగ్ కార్డు ని పరిశీలించి చూస్తూ నా దగ్గరున్న క్యామెల్ పోస్టర్ కలర్స్ తో అలాగే సింగిల్ స్ట్రోక్స్ కాకున్నా నాకు తెలిసిన స్ట్రోక్స్ తో నా దగ్గరున్న ఒకటీ రెండు చిన్న బ్రష్షులతో వేద్దామని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఆయన రంగుల్లో ఉన్నంత మెరుపు ఇందులో లేదు, ఎందుకంటే ఆయన వాడిన రంగులు నాకు తెలియదు, ఆయన సింగిల్ బ్రష్ స్టోక్స్ కి అందినంత పెద్ద బ్రష్ లూ నా దగ్గర  లేవు, ఆ బ్రష్ లు నింపుకోగలిగినంత రంగులూ లేవు, టెక్నిక్కులూ తెలీవు, అయినా వెయ్యాలని చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్న ఫలితం లో అలా వెయ్యలేకపోయాననే నిరాశ కొంచెం, అయినా ఎలాగోలా వేశాను అన్న సంతృప్తి కలగలిసి మిగిల్చిన మిశ్రమం - అనుభవిస్తే తప్ప అర్ధం కాని, మాటల్లో వివరించలేని అనుభూతి అది. ఇన్నేళ్ళకి తలచుకున్నా ఎప్పటికీ పాత బడక కొత్తగా అనిపించేదే.

అలా ఆయన దగ్గర కొన్న గ్రీటింగ్ కార్డులు కొని ఊరికే దాచుకుని ఉంటే అదొక కాలేజి రోజుల్లోని చిన్న జ్ఞాపకంగా మిగిలి మెల్లిగా కాలంతో వెనకబడి, పాతబడి కరిగిపోయి ఉండేది. అలా కాక ఉత్సాహంతో ఒక్క పెయింటింగ్ అయినా అలా వెయ్యాలని చేసిన ఆ ప్రయత్నంతో ఎంతో కొంత మాత్రం నేర్చుకున్నా. పెయింటింగ్ కి వాడే మెటీరియల్, అవి వేసే కొన్ని మెళకువల వల్లే కొందరి చిత్రాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి అన్న నిజాన్నీ గ్రహించా. నా బొమ్మల్లో ఒక బొమ్మై ఒదిగిన ఆనాటి ఉత్సాహం ఎప్పటికీ చెరగని తరగని ఒక అందమైన మరపురాని సరికొత్త జ్ఞాపకం...

"మొదటి అనుభవం ఏదైనా ఎప్పటికీ కొత్తే."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...