Saturday, November 1, 2025

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 34 . . .

Ravi Sastry - Indian Cricketer, All-rounder 
Ink & Sketch pens on Paper
 
ట పాటలతో, బామ్మ బొమ్మల కథలతో హాయిగా సంతోషంగా గడిచి పోయే కాలం బాల్యం. జీవితంలో ఏ చీకూ చింతా లేని అందమైన, ఆనందమైన, అమరమైన అతి చిన్నదైన భాగం. ఎప్పుడు పెద్దవుతామా అనుకునేలోపే పెరిగి పెద్దయిపోతాం. ఆటలు పాటలు తగ్గుతూ, చదువు సంధ్యలు పెరుగుతూ, బడి, పుస్తకాలు, హోమ్ వర్కులు, పరీక్షలు ఇలా ఒక్కో క్లాస్ పైకెళ్ళే కొద్దీ చదువు బాధ్యతలే రోజులో ఎక్కువ భాగం ఆక్రమించేస్తాయి.

బాల్యం నాకూ అందరి లాగే ఐదవ క్లాసు దాకా ఆటపాటలతో హాయిగా గడిచిపోయింది. మా ఊరు "దామరమడుగు" లో స్నేహితుల్తో కలిసి ఆడుతూ పరుగులు పెట్టిన రోడ్లూ, ఎక్కి దూకిన గోడలు, ఆటలాడిన గుడి గోపురాలూ , చేలమ్మిట నడిచిన గెనేలూ అన్నీ కళ్ళముందు నిన్నే కదా అన్నట్టున్నాయి. పెద్ద వర్షం వచ్చి తగ్గగానే బయట పడి, పారే పిల్ల కాలువల నీళ్ళల్లో వదిలిన కాగితపు పడవలు, అవి ఆ నీళ్ళ తాకిడి చిన్న చిన్న అలలపై ఊగుతూ పయినిస్తుంటే వాటి వెంబడే తీసిన పరుగులు, తిప్పిన గానుగ బళ్ళు, జాలీ చుట్టి బొంగరాలతో కొట్టిన కుక్కజాలీలు గుమ్మాలు, గురి చూసి వేలు అంచున పెట్టి రెండేళ్ళతో పట్టి గిరికీలు తిప్పుతూ కొట్టిన రంగురంగుల గోళీలు, ఎగరేసిన పొడుగు తోక గాలిపటాలు, పొట్టి తోక సరాలూ, లాగి పెట్టి కొడితే గాల్లో గిరగిరా తిరిగిన కోడింబిళ్లలూ, పంగాలు కర్ర తో నడిపిన తాటి బుర్రల బళ్ళు, ఇసుక రాశులపై నడిపిన ఇటుకరాళ్ళ బస్సులు, డిమిండాల్, బాల్ ఆట, వంగుళ్ళు దూకుడ్లు, దారినపోయే ప్రతి ఎద్దుల బండి వెనకా పడి పొడవుగా ఉండే దృఢమైన రెండు కొయ్యల్లో ఒకదానిని రెండు చేతులతో పట్టి ఉయ్యాలలూగిన కోతి చేష్టలూ...ఇలా ఆడని ఆటా లేదు, పాడని పాటా లేదు. అప్పట్లో ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో అందరితో కలిసి ఎప్పుడైనా సినిమాలకో, లేదంటే ఎవరివైనా పెళ్ళిళ్లకో, ఎండాకాలం శలవులకి అమ్మమ్మ వాళ్ళ దగ్గరకో తప్ప మిగతా కాలం అంతా స్నేహితులతోనే. పొద్దున నిద్దర లేస్తే కలిసి ఊరి బయట వలకల దిబ్బ, కోవూరు కాలవ, పొలాల వైపు ఒక చుట్టు కొట్టి రావటం, బడి, సాయంత్రం మళ్ళీ చీకటి పడే దాకా ఒకటే ఆటలు. ఎంత అందమైందో కదా బాల్యం!

అలా "నెల్లూరు" కి కూతవేటు దూరంలోనే ఉండే అందమైన అసలు సిసలు పల్లెటూరు మా "దామరమడుగు" లో హాయిగా గడిచిన రెండు మూడేళ్ళు కే నేను రెసిడెన్షియల్ స్కూలు బాట పట్టాల్సి రావటం నా జీవితంలో అతిపెద్ద మలుపు. తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉండి చదువుకుంటూ శలవులకి మాత్రం ఇంటికి వస్తుండటంతో ఆ చిన్ననాటి ఆటలన్నీ నన్నొదిలి వెళ్ళిపోయాయి. రెసిడెన్షియల్ స్కూల్ లో క్రికెట్, హాకీ, ఖో ఖో, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, వాలీ బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఈ ఆటలన్నీ వచ్చి చేరాయి. అప్పట్లో టీవీ లు ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులోకి రాలా. మా స్కూల్ లో క్రికెట్ గేమ్ కామెంటరీ కోసం డైనింగ్ హాల్ కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఒక క్రికెట్ పిచ్చి వంట స్వామి ట్రాన్సిస్టర్ రేడియోలో వినే కామెంటరీ పిచ్చి మాకూ స్కూల్ లోనే వంట పట్టేసింది. ప్రతి పది నిమిషాలకీ క్లాస్ లో నుంచి ఎవరో ఒకరు సార్ ని ఒంటేలుకని అడిగి ఆ వంటగది కిటికీ దగ్గరకెళ్ళి కిటికీ చువ్వలు పట్టుకుని జంప్ చేసి మోకాళ్ళతో గోడ ని కరుచుకుని స్కోర్ కనుక్కుని రావటం, వచ్చి అందరికీ చెప్పటం...సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్  ల బ్యాటింగ్ అయినా,  కపిల్ దేవ్, మదన్ లాల్ ల బౌలింగ్ అయినా, కిర్మానీ వికెట్ కీపింగ్ అయినా, ఫీల్డింగ్, బ్యాటింగ్, ఫోర్, సిక్స్, వికెట్, రన్ అవుట్...ఇలా ఆటంతా ఊహే. క్రికెట్ ఆటగాళ్ళ  ఫొటోలు న్యూస్ పేపర్లో చూసీ చూసీ కామెంటరీ తో వాళ్ళ ఆట తీరుని బ్రహ్మాండంగా ఊహించుకునే తీరు చెప్పనలవి కాదు, వర్ణనాతీతం. ఇప్పుడు "అల్ట్రా క్లారిటీ హై డెఫినిషన్ స్క్రీన్" ల పై చూసే ప్రత్యక్ష ప్రసారం అప్పటి రేడియో కామెంటరీ విని మదిలో ముద్ర పడ్డ ఆటగాడి బొమ్మతో ఆ ఆటగాడు ఆడే ఆటని ఊహించుకునే ఆట ముందు బలదూర్, అంతే!

చిన్నప్పటి నుంచీ బొమ్మల లోకంలో విహరించే వ్యాపకం ఉండడంతో కనపడినవన్నీ గియ్యటమే నాకు నేను సృష్టించుకునే నా పని. అలా చిన్నపుడు గీ(సే)సిన బొమ్మల్లో దేవుళ్ళూ, సినిమా హీరోలు, బ్రూస్ లీ, క్రికెట్ స్టార్లూ వీళ్ళే ఎక్కువ. ఈ బొమ్మ అప్పటి స్టార్ క్రికెటర్ "రవి శాస్త్రి" ది. చాలా క్యాజువల్ గా ఏదో పత్రిక తిరగేస్తూ చూసిన వెంటనే పేపర్ పెన్ను కోసం చూసి, పేపర్ దొరక్క, ఏదో దొరికిన పెళ్ళి పత్రిక కార్డు వెనక అలా కొద్ది పాటి గీతలు గీసి స్కెచ్ పెన్ రంగులు అద్దింది. వేసిన కొద్దిపాటి క్రికెట్ స్టార్ల బొమ్మల్లో ఇది ఒకటి, భిన్నమైనది. పెద్దగా శ్రద్ధ పెట్టి వేసిన బొమ్మ కాకపోయినా, అ గీతల్లో ఉన్న పట్టు, వెయ్యగలనన్న ధీమా, రెండూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సంతకం తెలుగులో "గిరి" అని పెట్టటంలో అప్పటి తెలుగు గవర్నమెంట్ పథకాలకి ఆస్థాన ఆర్టిస్ట్ గా పనిచేసిన "గోపి" గారి సంతకం శైలి అనుకరణ కనిపిస్తుంది. గోపి గారి బొమ్మలు బాపు గారి ని అనుకరిస్తూనే ఒక ప్రత్యేకమైన వంకరలతో అదో ప్రత్యేకంగా ఉండేవి. ఎందుకో బాగా నచ్చేవి.

సంతకం కింద ఉన్న తేది చూసి వెనక్కి తిరిగి చూసుకుంటే, గీతల్లో కొంచెం పట్టు పెరిగి పెయింటింగ్ అధ్యయనం వైపు, అన్వేషణ మొదలు పెడుతున్న సంవత్సరం అది. సహజంగానే వేసవి శలవులకి "కావలి" ఇంటికి వచ్చినపుడే ఎక్కువగా బొమ్మలు వేసేవాడిని. ఇదీ అలా "కావలి" లో మేముంటున్న మా "నారాయణవ్వ పెంకుటింట్లో" వేసిందే. నా బొమ్మలకి పునాది అక్కడే. శలవులకి "విజయవాడ" నుంచి వస్తే కలిసి తిరిగేందుకు స్నేహితులెవరూ ఉండకపోవటం, ఊరికే కాలయాపనం చెయ్యటం నాకు అలవాటు లేకపోవటం తో, పొద్దున్నే లేచి లైబ్రరీ తెరిచే సమయానికి వెళ్ళి న్యూస్ పేపర్స్, పుస్తకాలు తిరగేసి రావటం, వచ్చాక, అమ్మ స్కూల్ కి, అన్న ఫ్రెండ్స్ తో బయటికి పోవటంతో ఏమీ తోచక పుస్తకాలు తిరగేస్తూనో, బొమ్మలు వేస్తూనో గడపటం ఇలానే నా శలవులన్నీ గడచిపోయేవి. అలా ఏమీ తోచని సమయంలో సరదాగా పట్టిన పెన్నూ పేపర్ సృష్టించిన బొమ్మలు నాతో పెరిగి పెరిగి చాలా చాలా అయ్యి అదొక లోకం లా అయ్యి అందులో విహారం చేసెయ్యటం అలవాటుగా మారింది. విహారం లేనప్పుడు విరహమూ ఉండేది. నేర్చుకునే మార్గాల కోసం అన్వేషణ చేసీ చేసీ అలసి, విసిగి వేసారి పోయి చివరికి కొన్నేళ్ళు "ఇంజనీరింగ్" కాలేజి లో "ఏకలవ్య" సాధన (కొన)సాగించా.

సాధన తో సాధ్యం కానిది, అసాధ్యమైనది ఏదీ లేదన్న జీవిత సత్యాన్ని నాకు నేర్పింది నా బొమ్మలే. ఏ పనికైనా దీక్షా, సాధనే మూల స్థంభాలు. అలా సాగించిన పయనమే తిరిగి ఎప్పుడు చూసుకున్నా తృప్తినీ హాయినీ ఇచ్చే నా కృషి ఫలితం, నా బొమ్మల ప్రతిసృష్టి లోకం. జీవరాశులు సలిపే ఆ కృషే ఈ సృష్టి కి మూలం. ప్రకృతిలో ప్రతి ప్రాణీ నిరంతరం తన మనుగడకై కృషి చేస్తూనే ఉంటుంది. గాలీ నీరూ, చెట్టూ చేమా, చీమా దోమా, ప్రాణమున్న ఏ జీవీ కృషి మానదు. కనీసం ఆర్ట్ మెటీరియల్ కూడా సరిగ్గా ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునే అవకాశాలు లేని ఆ వయసూ ఆ కాలం నుంచి ఏది కావాలన్నా నిమిషాల్లో దొరికిపోయే ఈ కాలం చేరుకోటానికి, చేరువవటానికీ ఒక జెనరేషన్ కాలం పట్టిందేమో. అయితే జరిగిన మార్పు మాత్రం విపరీతం. బాల్యం లో కథలు చెప్పే బామ్మలు లేరు, చెట్లూ చేమల వెంట పరిగెత్తి ఆటలాడే ప్రకృతీ చుట్టూ లేదు. అందరి చేతుల్లోకి వచ్చి చేరిన "స్మార్ట్ ఫోన్" అనే చిన్న సాధనం అన్నిటినీ అమాంతం(గా) మింగేసింది. న్యాచురల్ ఇంటెలిజెన్స్ నుంచి మాత్రమే కాదు, న్యాచురల్ ట్యాలెంట్ నుంచి ఆర్టిఫిషియల్ ట్యాలెంట్ వైపు కాలం అందనంత వేగంతో పరుగులు పెడుతోంది, సహజం నుంచి అసహజం వైపు మార్పు సహజమేనా - అన్న ప్రశ్న కి కూడా సమయం లేనంత వేగంతో. సమాధానం తెలుసుకునే సమయం ఇప్పుడు లేకున్నా, ముందున్న కాలం లోనే ఆ ప్రశ్నకీ సమాధానం ఉంది...దాగుంది...

"సమాధానం లేని ఏ ప్రశ్నా కాలంలో లేదు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...