Saturday, March 2, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 18 ...

Kashmir Winter
Poster colors on Paper (7" x 10")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 17                                                        నా "బొమ్మలు చెప్పే కథలు" - 19 -->

ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు, అప్పుడే మహాగ్రంధం రాసెయ్యలన్న తపన అన్నట్టుగా ఉండే రోజులవి, నా బొమ్మల జీవితంలో. ఒక అందమైన దృశ్యం ఏదైనా పత్రిక లోనో, క్యాలెండర్ లోనో కనిపిస్తే చూసి పరవశించిపోవటమే కాదు, దాన్ని నా చేత్తో అచ్చం అలాగే అచ్చుగుద్ది మరింతగా మైమరచిపోవాలనే తపన. గ్రాఫైట్ పెన్సిల్ తో బూడిద రంగు బొమ్మల నుంచి, ఇంక్ తో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు చేరి, అక్కడి నుంచి రంగుల లోకం వైపు పయనిస్తున్నా నా బొమ్మల బాటన. నేర్చుకోవాలన్న "తపన" ఒక్కటే నాకు "గురువు" అయ్యింది. అపుడప్పుడూ నన్ను తోస్తున్నా పడుతూ, చెయ్యిస్తే మళ్ళీ లేస్తూ, లేచిన ప్రతిసారీ తడబాటు తెలుసుకుని సరిచేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో పైపైకెగురుతూ ఒంటరిగా నా బొమ్మలతో సాహసంగా సావాసంగా సాగుతున్న నా పయనమది.

ఇప్పట్లా చేతిలో మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే చాలు అద్భుతమైన ఫొటో ఇమేజ్ లు వచ్చేసి, అరచేతిలో అద్భుతాలు జరిగిపోయే రోజులు కావవి. ఒక అందమైన ప్రకృతి దృశ్యాన్ని తదేకంగా చూడాలన్నా, చూసి పరవశించి పోవాలన్నా ఎదురుగుండా కళ్ళతోనైనా చూడాలి, లేదా ఏ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫరో తన కళ్ళతో చూసి కెమెరాలో బంధించిన ఫొటో డార్క్ రూమ్ లో డెవలప్ చేసి, ఏ పత్రికలోనో, పుస్తకంలోనో, లేకుంటే ఏ క్యాలెండర్ పేజీ గానో అచ్చయితే తప్ప చూట్టం సాధ్యం కాదు. ఒక సంవత్సర క్యాలెండర్ లో నెలకొక దృశ్యం ఫొటో చొప్పున పన్నెండు ఫొటోలు అచ్చు వేస్తే అందులో ప్రతి ఫొటో అద్భుతంగానే ఉండేది. ఇప్పుడు గూగుల్ ఒక్క క్లిక్ తో ప్రపంచాన్నంతా చుట్టేసొచ్చి, వెతికి వెతికి ఎన్ని ఫొటోలు చూపెట్టినా ఒక్కటీ నచ్చదు. మితం ఎప్పుడూ రుచికరమే, అమితం ఎప్పుడూ అజీర్ణమే.

టీనేజి వయసే నాదింకా ఈ పెయింటింగ్ వేసినపుడు. బహుశా ఆ వయసులో మనసుకుండే వేగం, వేసే ఉరకలు మరే వయసులోనూ ఉండవనేనేమో మనిషి జీవితంలో ఆ ఏడేళ్ళనీ ప్రత్యేకంగా గుర్తించి ప్రతి భాషలోనూ దానికి ఒక పదం కనిపెట్టారు, తెలుగులో యుక్త వయసది. కనపడ్డ మనసుకి నచ్చిన బొమ్మనల్లా ఉరకలు వేస్తూ అలా వేసుకుంటూ ముందుకి సాగి పోతూనే ఉన్నా.

కావలి - నా జీవితంలో మరచిపోలేని మధురమైన పట్టణం. ఎనిమిదేళ్ళ వయసులో హైస్కూలు టీచర్ గా ఉన్న నాన్నకి ట్రాన్స్ఫర్ అవటంతో, తను పుట్టి పెరిగిన నెల్లూరు దగ్గర పల్లెటూరు "దామరమడుగు" లోనే స్థిరపడాలని కొత్త ఇల్లు కట్టుకుని పక్కనే ఉన్న చిన్న పట్టణం బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్ లో పనిచేస్తూ రోజూ సైకిల్ మీద వెళ్ళి వస్తుండే నాన్న. ఎన్నో ఆశలతో ఎంతో అందంగా తనే డిజైన్ చేసుకుని కష్టపడి దగ్గరుండి కట్టించిన కొత్త ఇంట్లో బామ్మ ని ఒక్కదాన్నే పెట్టి, "ఒక్క సంవత్సరం ఓపిక పట్టు మళ్ళీ ట్రాన్స్ఫర్ చెయించుకుని వెనక్కి వచ్చేస్తాం" అని బామ్మకి మాటిచ్చి అమ్మా, అన్నా, నేనూ, చెల్లెలుతో కావలికి వచ్చాడు. తర్వాత ఒక్క సంవత్సరం తిరక్కుండానే అనూహ్యమైన మార్పులు, అందరమూ చెల్లా చెదురయ్యాం. నేనేమో దూరంగా రెసిడెన్షియల్ స్కూల్, అమ్మేమో నాన్న దగ్గర మద్రాస్ విజయా నర్సింగ్ హోమ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాన్న ని చూసుకుంటూ, బామ్మ ఒక్కటే మా ఊర్లో, అన్న ఎక్కడో కందుకూరులో పెద్దమామయ్య దగ్గర, చెల్లెలు అటూ ఇటూ బామ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో. ఒక సంవత్సరం లోనే ఊహించ(లే)ని మార్పులతో నాన్నని దేవుడు మా నుంచి దూరం చెయ్యటం, తర్వాత అమ్మ జాబ్ చెయ్యాల్సిరావటం, అక్కడ బామ్మ బాగోగుల్నీ, ఇక్కడ మమ్మల్నీ చూసుకుంటూ కావలి లోనే ఉండిపోవటం, అలా దాదాపు పద్దెనిమిదేళ్ళు బామ్మ ఒక్కటే మాకోసం ఆ ఊర్లోనే ఉండిపోయింది.

నిరాశా నిస్పృహల్లో విధి ముంచేసినా నెమ్మదిగా కొంచెం కొంచెం తేరుకుంటూ, ఎంతో పొదుపైన జీవితం, గర్ల్స్ హైస్కూల్ లో క్లర్క్ గా జాబ్ చేసుకుంటూ, మమ్మల్ని చదివిస్తూ, మాకన్నీ చూసుకుంటూ అమ్మ, ఆ పల్లెటూర్లో మా ఇంటికీ, మాకూ అండగా, మా రవ్వంత ఆస్తికి కొండంత తోడు గా బామ్మా, అలా  మళ్ళీ జీవితంలో మేము నిలదొక్కుకున్నదీ ఆ కావలిలో నివాసముంటూనే. నాన్నతో కలిసి చిన్నప్పుడు వెళ్ళిన రైల్వేస్టేషన్ రోడ్డులోని "గీతా మందిరం", చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళిన బజార్లు, చూసిన కొద్ది సినిమాలు, ఇవే ఎప్పటికీ చెరగని, తరగని జ్ఞాపకాలు. అలా నేను స్కూలూ, కాలేజీ అన్నీ దూరంగానే ఉండి చదువుకోవటంతో, శలవులకి వస్తే బయటికి వెళ్ళి కలిసే ఒక్క మిత్రుడూ లేకపోవటంతో పుస్తకాలు, బొమ్మలే నాకు నేస్తాలయ్యాయి. అమ్మ జాబ్ కీ, అన్న కాలేజీకో, ఫ్రెండ్స్ తోనో వెళ్తే ఒక్కడినే కూర్చుని గంటల కొద్దీ బొమ్మలు వేస్తూ గడిపేవాడిని. ఒకవేళ బయటికి ఒక్కడినే వెళ్తే అది ఒక్క లైబ్రరీకి మాత్రమే. ఇంకెక్కడికైనా అన్న తోడు లేనిదే పొయ్యేవాడిని కాదు.

కావలి, అమ్మమ్మ అమ్మ కూడా పుట్టి పెరిగిన ఊరది. ఒక చిన్న పెంకుటింట్లో నెలకి యాభై రూపాయల అద్దెకి. అదీ తన ఆదాయం అతితక్కువ అయినా, మా కుంటుంబ పరిస్థితులు తెలిసి, పెద్దమనసు చేసుకుని వంద అద్దెని యాభైకి తగ్గించి ఇచ్చిన తాతయ్య చెల్లెలు "నారాయణవ్వ" ఇల్లది, ఒప్పించి ఇప్పించింది మా తాతయ్య. ఆ పెంకుటింట్లోనే నా బొమ్మలు అద్భుతాల దారులవెంట నడిచాయి. నా మట్టుకు నేనక్కడ వేసిన బొమ్మలన్నీ నాకు ఇప్పటికీ అద్భుతాలే. ఒక అట్ట, ఒక పేపర్, నాలుగైదు కేమెల్ రంగుల సీసాలు, ఆ రంగుల సెట్ తో వచ్చిన ఒక చిన్న రంగులు కలుపుకునే ప్యాలెట్, ఒక బ్రష్, చిన్న మగ్ లో నీళ్ళు, ఎదురుగా ప్రింట్ అయిన బొమ్మ పెట్టుకుని నేను సాగించిన నా దీక్షలు ఎన్నో. ఆ దీక్షల్లో సృష్టించిన బొమ్మలు మరెన్నో.

చిన్నమామయ్య నాకప్పట్లో పుస్తకాలకీ, బొమ్మలకీ పెద్ద ఇన్స్పిరేషన్. చిన్నమామయ్య దగ్గర చాలా పుస్తకాలుండేవి. చాలా మంచి ఆర్టిస్ట్ అండ్ రైటర్ కూడ. కాన్పూర్ లో యమ్మెస్సీ అయ్యి కావలికి వచ్చి తాతయ్య వాళ్ళింట్లో మిద్దెమీద తన రూమ్ లో సగం పైగా పుస్తకాలే ఉండేవి. వెళ్ళినప్పుడల్లా అక్కడ కూర్చుని గంటలకొద్దీ పుస్తకాలు తిరగేసేవాడిని. అలా ఒకసారి స్పైరల్ టేబుల్ క్యాలెండర్ కనిపించింది. పన్నెండు నెలలు, నెలకొకటి చొప్పున పన్నెండు హార్డ్ పేపర్స్ మీద పన్నెండు అందమైన ఫొటోలు. అది తెచ్చుకుని అందులో రెండు ఫొటోలని వాటర్ కలర్ పెయింటింగులు గా వేశాను. ఆ రెండిట్లో ఇది మొదటిది.

కాశ్మీర్ లోయల మంచు, ఎత్తు పల్లంగా ఉన్న ఓ ప్రదేశం, ఎత్తున మంచుతో పూర్తిగా కప్పబడ్డ రోడ్డు, దిగువన కుటీరం లాంటి చిన్న ఇల్లు, కొంచెం కనిపిస్తూ మిగతా మంచుతో కప్పబడ్డ పై కప్పు, వరండా లో ఒక పేము కుర్చి, ఇంకేదో చెక్క ఫర్నీచర్, ఇంటి మెట్లు ఎక్కుతూ ఒక పెద్దాయన, వెనక చలికి శాలువా కప్పుకుని కర్ర పట్టుకుని మంచులో నడుస్తూ లోపలికెళ్తున్న ఒక పెద్దావిడ, ఆ మంచులో జాకెట్ కప్పుకుని ఆడుకుంటున్న ఒక పిల్లాడు, చుట్టూ అలాంటి ప్రదేశాల్లో పెరిగే ఎత్తయిన చెట్లు, వాటి వెనక నీలాకాశం, అక్కడక్కడా మంచుతో పూర్తిగా కప్పబడని నేలా, ఇన్నిటినీ ఒక 7 x 10 ఇంచ్ పేపర్ మీద పోస్టర్ కలర్స్ తో ఫొటో అనిపించేలా దించాలి. అప్పూడప్పుడే చిన్న చిన్న పెయింటింగ్స్ తడబడుతూ వేస్తూ కొంచెం కొంచెం మెళకువలు నేర్చుకుంటున్న నాకు అది చాలా పెద్ద సాహసం. అంత సాహసోపేతం ఇప్పుడైతే ససేమిరా చెయ్య(లే)నేమో. అంత ఓపికా, ఆ పట్టుదలా, ఆ దీక్షా, ఆ శక్తీ ఇవేవీ ఇప్పుడు ఉన్నాయో లేవో, ఉన్నా రమ్మన్నా రావేమో. ఏ పనినైనా అద్భుతంగా చెయ్యటానికి ఉండాల్సిన తపనకి పక్కన ఉత్సాహం, సాహసం, ఓపికా, పట్టుదలా, దీక్షా, శక్తీ కూడా తోడవ్వాలి అనటానికి నిదర్శనం ఈ పెయింటింగ్.

నా టీనేజి వయసులో వేసిన ఈ పెయింటింగ్ అప్పటి వయసుకి నాకు అద్భుతం అయితే ఈ వయసుకి మాత్రం అది మహాద్భుతం. ఓనమాలు దిద్దుతున్నపుడే ఒక మహా గ్రంధం రాయటం ఎవరికైనా సాధ్యమా? తపనకి తోడుగా ఉత్సాహం, సాహసం, ఓపిక, పట్టుదల, దీక్ష, శక్తి, ఆసక్తి కలసి వచ్చి మనల్ని ముందుకి నడిపిస్తే సాధ్యమే. ఆ దీక్షల్లో ఓనమాలు దిద్దుతూ సృష్టించేవి పెద్ద పెద్ద గ్రంధాలే...

"ఒకప్పటి అద్భుతాలే కాలంలో మహాద్భుతాలుగా నిలుస్తాయి."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...