ఇద్దరు ధీటైన నటుల "రంగమార్తాండ"
"జీవిత రంగం" పై ప్రతి ఒక్కరూ నటులే. ఇది అందరూ అనేదే, ఒప్పుకునేదే. రకరకాల పాత్రల్లో ఎవరిశైలిలో వాళ్ళు జీవించేస్తారు, కానీ అందర్నీ మెప్పించలేరు. అదే, "రంగస్థలం" పై నటీనటులు నటనలో జీవించేస్తే ప్రతి ఒక్కరి మనసునీ దోచి అందర్నీ మెప్పించేస్తారు. అక్షరాలా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ తమ "నటనా ప్రతిభ" తో దోచేసుకునే చిత్ర రాజమే - "రంగమార్తాండ".
చాలా రోజుల తర్వాత ధీటైన నటులనుంచి ఇంకా ధీటైన మంచి అద్భుత నటన తోబాటు, విలువలు కూడిన జీవితాన్ని వెండితెరపైనే కాదు మన కళ్ళముందే ఆవిష్కరించిన అనుభూతిని మిగిల్చే సినిమా ఇది.
అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు అనేకన్నా దర్శకుడు "కృష్ణ వంశీ గారు" వాళ్ళందరి నటనలోని జీవాన్ని వెలికితీసి విలువలు కలిగిన, ఎప్పటికీ కాలం చెల్లని కుటుంబ కథాజీవం తో కలిపి అద్భుతంగా ఆవిష్కరించారు అనొచ్చేమో. నటనలో పూర్తిగా పండిన నటీనటులు తలపండిన దర్శకుడి చేతిలో మంచి కధతో కలిసి నడిస్తే ఒక జీవితమే కళ్ళ ముందు ఆవిర్భవిస్తుంది. ఖచ్ఛితంగా ఈ సినిమాలో ఇదే జరిగింది.
"ప్రకాష్ రాజ్" గారు తన విశ్వరూపాన్ని చూపించగల సత్తా ఉన్న పాత్ర లభిస్తే చూపించకుండా ఉండగలరా, ఉంటారా...అచ్చంగా అదే చేశారు. "బ్రహ్మానందం గారు" స్వచ్ఛమైన నవ్వులనే కాదు, నవ్వులంత స్వచ్ఛంగానే ఆర్ద్రతనీ, విషాదాన్ని చేసి చూపించగరని అందరికీ తెలిసినా ఆ సత్తా చాటగల పాత్ర రావటానికి ఇంత కాలం పట్టింది, అంతే...ఇద్దరూ కలిసి హృదయాన్ని పిండేస్తారంతే!
"ఇళయరాజా గారు" ఇచ్చిన సంగీతం మళ్ళీ చాలా కాలానికి వీనులవిందు చేసి వదిలేస్తుంది. ఒకప్పటి, ఎప్పటికీ వినగలిగే స్థాయి సంగీతం మళ్ళీ చాలా కాలానికి.
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు "ఆస్కార్" ని తాకింది. కానీ ఆకాశాన్నైనా తాకగల ప్రతిభ మనకెప్పుడూ ఉంది. ఇలా అప్పుడప్పుడూ వచ్చే "రంగమార్తాండ" లాంటి సినిమాలే అందుకు నిదర్శనం!
ఇప్పటి కాలం, మన చుట్టూనే కాదు మన జీవితాల్లోనూ ఎన్నెన్నో మార్పుల్ని త్వరత్వరగా తెస్తూ అందర్నీ తనతో పరుగులు పెట్టిస్తున్నా...కుటుంబం, బంధాలూ, బాంధవ్యాలూ, మనసులూ, మమతలూ ఎక్కడికీ పోవు, అలానే చెదరకుండా ఎప్పటికీ ఉంటాయి అని ఈ చిత్రం చూస్తే తప్పకుండా నమ్మకం వస్తుంది అనిపిస్తుంది.
తల్లీ, తండ్రి హృదయాలు ఏకాలంలో అయినా ఒకటే. ఇది పిల్లలు ఆకాలంలోనూ, ఈకాలంలోనూ, ఏకాలంలోనూ గ్రహించలేరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయి తల్లీ తండ్రీ పాత్రలు పోషించే కాలం రాక తప్పదు, అప్పుడు ఆ పాత్రల్లో వాళ్ళూ జీవించకా తప్పదు. అలా తరతరాలు ఆ విలువల్ని కాపాడకా తప్పదు...ఇదే "జీవిత రంగం" లోని "జీవి తరంగం"!