కొత్త బడి, కొత్త ప్రదేశం, కొత్త మిత్రులు, కొత్త టీచర్స్, కొత్త ఆహారపు రుచులు, కొత్త ఆటలు, కొత్త అనుభవాలు...ఇలా 9 యేళ్ళ ప్రాయానికి "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం" లో 5 వ తరగతి చేరేసరికి ఒక్కసారిగా అన్ని మార్పులు...కలిసి ఒకరకంగా జీవితం రుచి చూడకముందే మళ్ళీ కొత్త జీవనం. ప్రతిరోజూ పొద్దున 5 నుంచి రాత్రి 9:30 వరకూ అంతా కొత్త కి అలవాటుపడేసరికి ఒక సంవత్సరం తెలీకుండానే కొత్తగా గడచిపోయింది.
5 వ తరగతి క్వార్టర్లీ పరిక్షల్లో 36 మంది ఉన్న క్లాస్ లో నా ర్యాంక్ 20. దసరా శలవులనుంచి స్కూలుకి తిరిగి వచ్చాక, పరీక్షల్లో ర్యాంకులిస్తారని, ఆ వివరాలు ప్రోగ్రెస్ కార్డ్ రూపంలో ఇళ్లకు పంపిస్తారని తెలిసింది. నాన్న రాసిన ఉత్తరం లో "మీ స్కూల్ నుంచి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. మీ క్లాస్ లో నీ ర్యాంక్ 20, ఈసారి పరీక్షల్లో బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి." అని చూసేదాకా ఎంత వెనకున్నానో కూడా అర్ధం కాని వయసు. హాఫియర్లీ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ కోసం పెద్దగా కృషి చేసింది లేదు. కొంచెం మెరుగయ్యి 18 ర్యాంక్ కి చేరాను. యాన్యువల్ పరిక్షలు రాసి వేసవి శలవులకి ఇంటికెళ్తే నాన్న గొంతు క్యాన్సర్ చికిత్సతో "మద్రాస్ విజయా నర్సింగ్ హోమ్" లో ఉన్నాడు. ఒకరోజు తాతయ్య నన్నూ అన్ననూ రైల్లో తీసుకెళ్తే కందుకూరు నుంచి మద్రాస్ వెళ్ళి ఒక్కరోజు ఉండి చూసి వచ్చాము.
వేసవి శలవులు ముగిశాక, 6 వ తరగతి మొదటి రోజు మొదటి పీరియడ్ తెలుగు. క్లాస్ రూమ్ మారింది, సైన్స్ ల్యాబ్ దగ్గరుండేది. తెలుగు మాష్టారూ మారారు. వరుసకి నలుగురు చొప్పున రెండు వరుసల్లో అందరం రోల్ నంబర్స్ ప్రకారం కూర్చునేవాళ్ళం. నా క్లాస్ రోల్ నంబర్ 4, మొదటి వరసలోనే ఎప్పుడూ. కొత్త తెలుగు మాష్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు సార్. క్లాస్ లో అటెండన్స్ అయ్యాక వరసగా ఒక్కొక్కరినీ లేపి 5 వ క్లాసులో వచ్చిన క్వార్టర్లీ, హాఫియర్లీ, యాన్యువల్ మూడు ర్యాంకులూ చెప్పమన్నారు. నా వంతు వచ్చాక చెప్పాను, క్వార్టర్లీ 20, హాఫియర్లీ 18, యాన్యువల్ 4. మా క్లాస్ లో ఆటూ ఇటుగా మొదటి మూడు ర్యాంకులొచ్చిన ముగ్గురూ మూడు పరీక్షల్లోనూ అవే తెచ్చుకున్నారు. అందరం చెప్పటం అయ్యాక నన్ను లేచి నిలబడమన్నారు. "మీ క్లాస్ లో అందరికన్నా మంచి ర్యాక్ ఎవరు తెచ్చుకున్నరో తెలుసునా, ఈ అబ్బాయి." అంటూ ప్రశంశించారు. అంతేకాదు, "నీ ర్యాంక్ ని ఇలాగే నిలబెట్టుకుని వచ్చే పరీక్షల్లో ఇంకా ముందుకి వెళ్ళటానికి కృషి చెయ్యి." అంటూ ప్రోత్సహించారు కూడా. నాకు అలా ఎందుకన్నారో బోధపడనేలేదు. నాలుగో ర్యాంక్ ఎలా మంచి ర్యాంక్ అవుతుంది, ఒకటి, రెండూ మూడు కదా మంచి ర్యాంకులు అనుకున్నాను. తర్వాత మిత్రుడు పి.వి.రాం ప్రసాద్ చెప్తేకానీ బోధపడలేదు ఎందుకలా అన్నారో.
తర్వాత నాన్న కూడా అలానే మెచ్చుకుంటూ ఉత్తరం రాస్తాడని ఎదురు చూశాను. కానీ అప్పటికే ఉత్తరం రాయలేని స్థితిలో ఉన్నాడని తెలీదు. ఆ సంవత్సరమే సంక్రాంతి శలవుల్లో మమ్మల్ని ఈలోకంలో వదిలి నాన్న పైలోకాలకెళ్ళిపోయాడు, ఒక సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడి.
ఆ రోజు తెలుగు సార్ ప్రశంశల స్ఫూర్తితో 6 నుంచి 10 వ తరగతి వరకూ అన్ని పరిక్షల్లో నా ర్యాంక్ ని ఇటుగా నాలుగు కి దగ్గరే నిలుపుకోగలిగాను తప్ప ఎంత ప్రయత్నించినా ఒకటి, రెండు, మూడు...అటు మాత్రం చేరలేకపోయాను. ఎంత కష్టపడ్డా, ఒకటీ రెండు మార్కుల తేడాతో మొదటి ముగ్గురూ అక్కడే ఉంటూ వచ్చేవాళ్ళు. ఒక్కొకసారి మొదటి ముగ్గురిపైన టీచర్స్ ఇంప్రెషన్స్ కూడా అందుకు తోడ్పడుతూ దోహదపడేదేమో.
ఈ 6 వ తరగతి సంఘటనా, తెలుగు మాష్టారూ ఎప్పుడూ గుర్తుకి వస్తూనే ఉంటారు. అప్పటి టీచర్స్ ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక సహజ లక్షణాన్ని గుర్తించి ప్రోత్సహిస్తూ ప్రభావితం చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఒక్కటి మాత్రం అంతుతెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది, ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంది. అసలు నాకు 4 వ ర్యాంక్ వచ్చిందని నాన్న కి తెలిసిందా, ఆయనున్న పరిస్థితిలో నా ప్రోగ్రెస్ కార్డ్ చూశాడా, చూస్తే మెచ్చుకుంటూ నాకు ఉత్తరం ఎందుకు రాయలేదు, బహుశా అప్పటికి రాయలేని స్థితిలో ఉన్నాడేమో, అని...
కొన్ని ప్రశ్నలకి జీవితంలో సమాధానం దొరకదు, సమాధానం లేని ప్రశ్నలుగానే ఎప్పటికీ మిగిలిపోతాయి...
గిరిధర్ పొట్టేపాళెం
కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం, 1977 - 83, V-X
~~~~ *** ~~~~
Dec 2021, కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ 50 Years Golden Jubilee వేడుకలని పునస్కరించుకుని, ఆ సందర్భంగా మా స్కూల్ తో, మా స్కూల్ లో విద్యార్ధులుగా మాకున్న అనేక తీపి గురుతులనీ, అనుభవాలనీ కలగలిపి ఎప్పటికీ అందరూ హాయిగా చదువుకునేలా ఒక మంచి Coffee Table Book - Souvenir పుస్తకంగా తీసుకు రావాలని నేను Lead తీసుకుని చేసిన ప్రయత్నంలో భాగంగా నా వంతుగా రాసిన నా ఒక తియ్యని అనుభవం. Pandemic, మరియూ ఇతర కారణాలవల్ల ఆ ప్రయత్నం ఆగింది, ఆ పుస్తకం వెలుగు కి నోచుకో(లే)దు.