|
"సీతారాములు - బంగరు జింక" - by నాన్న (P.Ramachandraiah)
1953, దామరమడుగు, నెల్లూరు |
నాన్న - నాకు తెలిసిన మొట్టమొదటి ఆర్టిస్ట్
ఊహతెలిశాక నాన్న వేసిన కొద్ది బొమ్మలు దగ్గరగా చూసే అదృష్టం ఒకటిరెండుసార్లు మాత్రమే కలిగినా, అందంగా బ్లూ, రెడ్ ఇంక్ తో నాన్న రాసుకున్న టీచింగ్ నోట్స్, మా రెండు మూడు తరగతుల క్లాస్ పుస్తకాలపై అందంగా నాన్న రాసిన మా పేర్లు, నన్ను ఐదవ తరగతి లో రెసిడెన్షియల్ స్కూల్ కి పంపుతూ సర్దిన డార్క్ బ్రౌన్ లెదర్ సూట్కేస్ లోపల బ్రౌన్ లైనింగ్ క్లాత్ పై నల్లని ఇంక్ తో ఎంతో అందంగా రాసిన నా అడ్రస్ P.Giridhar, 4-12-14, Old Town, Kavali, Nellore Dist. PIN- 524 201, A.P., తర్వాత ఒక యేడాది పాటు వారం వారం క్రమం తప్పకుండా నాకు రాసిన ఉత్తరాలు ఇవే నాకు మిగిలిన అందమైన నాన్న జ్ఞాపకాలు.
"దామరమడుగు" - నెల్లూరు కి దగ్గర్లో, చుట్టూ పచ్చని వరి పొలాల్తో, అప్పట్లోనే ఆధునిక కమ్యూనిస్ట్ భావాల్తో కళకళలాడే మాడ్రన్ రిచ్ అందమైన పల్లెటూరు. అక్కడున్న రెండేళ్ళలో ఆడుతూ పాడుతూ గడిపిన బాల్యం. నాన్న పుట్టిపెరిగిన రెండంతస్తుల మిద్దింట్లో పైన పెద్ద గదిలో నున్నని సున్నపు గోడపై రెండు శ్రీరాముని పెయింటింగ్స్. ఒకటి బంగారు జింక ని చూపిస్తూ పట్టితెమ్మని అడుగుతున్న సీత పక్కన రాముడూ ఎదురుగా బంగరుజింక. ఇంకొకటేమో పక్కనే కిరీటం పెట్టుకుని, బాణం పట్టుకుని నిలబడ్డ శ్రీరాముడు.
ఆ రెండేళ్ళలో మిద్దెపై ఆడుతూ పాడుతూ గడిపిన రోజుల్లో నాన్న చిన్నప్పుడు అంత అందని అందమైన పెయింటింగ్స్ వేశాడు అని తప్ప ఆ బొమ్మల గురించి నాన్నని అడిగి తెలుసుకోవాలి అన్న ఊహ కూడా ఇంకా రాని వయసు. తెలుసుకోవాలన్న ఊహా, వయసూ, కుతూహలం కలిగేసరికి పక్కన లేని నాన్న. బహుశా నాన్న హైస్కూల్ చదివేరోజుల్లో వేసినవి అని, కింద P.Ramachandraiah, 1953 అని ఉన్న సంతకం, అప్పుడు నాన్నకి పదీ పదకొండేళ్ళ వయసు. ఏ రంగుల్తో వేశాడు, ఎలా అంత ఎత్తున వేశాడూ తెలుసుకోవాలన్న కోరిక ఎప్పటికీ కోరికగానే మిగిలిపోయింది. ఏ బల్లపైనో, కుర్చీపైనో ఎక్కి వేస్తే తప్ప అంత ఎత్తున గోడపై అంత పెద్ద సైజ్ లో పెయింటింగ్స్ సాధ్యం కావు.
తర్వాత చాలాకాలం ఆ గోడకి సున్నం వేసినప్పుడల్లా ఆ పెయింటింగ్స్ మాత్రం టచ్ చెయ్యకుండా వదలిన నాన్న చిన్న తమ్ముడు మా "సుధబాబు" (సుధాకర్ పొట్టేపాళెం), నేను పెరిగి పద్దయ్యి ఒకసారి నా కెమెరాతో ఊరెళ్తే "గిరీ ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను, ఇల్లు రీమోడలింగ్ చెయ్యిస్తే గోడ తీసేయాల్సి రావచ్చు, ఫొటో తీసి పెట్టుకో గుర్తుగా ఉంటుంది ఎప్పటికీ" అంటే ఫొటోలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడా ఇల్లు రూపురేఖలు మారిపోయాయి, ఆగోడా లేదు. మిగిలింది ఆ ఫొటోలే.
బాల్యం మిగిల్చిన జ్ఞాపకాలు ఎంతో మధురం.
ఆ జ్ఞాపకాల్లో నాన్న బొమ్మలు ఇంకెంతో అపురూపం.
నాన్న ద్వారా బొమ్మల హాబీ నాకు కలిగిన అదృష్టం.
ఆ హాబీ కొనసాగిస్తున్నానన్న భావన సంతృప్తికరం.
నేనేసిన ఒక్కచిన్నబొమ్మైనా నాన్న చూడలేదన్న బాధ ఎంతున్నా, నా బొమ్మల్లో నాన్నని చూసుకుంటూ ఆ స్మృతుల్లో ముందుకి కదిలే కాలం... ఈ ఫాదర్స్ డే నాడు నాన్ననీ, నాన్న వేసిన బొమ్మల్నీ గుర్తుచేసుకుంటూ...
Happy Father's Day!
Carry the heritage you inherited from your Father!!