Simple, Special and Beautiful Pencil on Paper (5" x 7") |
Back to 1988...
స్వర్ణకమలం - కాలేజి రోజుల్లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన సినిమా. ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు. "భానుప్రియ" పాత్రని "కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్" గారు మలచి, తీర్చిదిద్దిన తీరు, దానికి సరిగ్గా తగ్గట్టు ఆమె చూపించిన అభినయం "స్వర్ణకమలం" అనే ఓ గొప్ప తెలుగు పదానికి నిండు రూపాన్నిచాయి. ఏ తెలుగు డిక్షనరీ లోనైనా ఈ పదానికి విడమరిచి మరీ అర్ధం చెప్పాలంటే ఈ సినిమాలో ఈ పాత్రని చూసి అర్ధం చేసుకోవాల్సిందే అన్నంతగా ఆ పాత్రని పోషించి, దానికి జీవం పోసి, ఆ పాత్రని ఎప్పటికీ సజీవం చేసిన నాటి మంచి నటీమణి, అంతకి మించిన మంచి నర్తకి "భానుప్రియ".
నా బొమ్మల్లో ఇప్పటికీ "భానుప్రియ" దే అగ్రస్థానం. దాదాపు 25 పోర్ట్రెయిట్స్ దాకా వేశాను. నా బొమ్మల్లో భరతనాట్యం మీద నా ఆసక్తి కి బీజం "సాగరసంగమం". ఆ మూవీ చూశాక, అప్పట్లో ఆ సినిమాలో "కమలహాసన్" డ్యాన్స్ స్టిల్స్ ప్రతిదీ పెన్సిల్ తో వేశాను. అలా నా బొమ్మల్లో డ్యాన్స్ కి "సాగరసంగమం" సినిమా బీజం అయితే, అది మొలకెత్తి చిగురించి ఎదిగింది మాత్రం "స్వర్ణకమలం" తోనే.
అలానే ఇప్పటిదాకా ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా పెయింటింగ్స్ వేసింది ఏదీ అంటే అది "భరతనాట్యం". "నాట్యాంజలి" అని మొదలెట్టి 1,2,3...12...21...అని ఇలా లెక్కపెట్టుకుంటూ పోతూ, ఎక్కడో లెక్క తప్పి, లెక్క పెట్టటమే మానేశాను. బహుశా అన్నీకలిపి ఓ యాభై పైనే వేసుంటానేమో ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ మీదే. ఈ సబ్జెక్ట్ కి స్ఫూర్తి కూడా అలనాటి నటి "భానుప్రియే"!
"భానుప్రియ" ని ఎప్పుడు TV లో చూసినా నువ్వే గుర్తొస్తావ్ గిరీ అని ఇప్పటికీ కొందరు ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు. అసలు "భానుప్రియ" ఎవరో తెలీకుండా, ఆమె సినిమా చూడకుండానే ఆమెకి అభిమానినయ్యాను.
Back to few more years, 1984...
"ఆంధ్ర లోయోలా, విజయవాడ" లో ఇంటర్మీడియట్ రోజులు..."నీలాచలం" అని ఒక ఫ్రెండ్ Bi.P.C. గ్రూపు, "తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్" నుంచి, అందుకేనేమో సహజంగా "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మా బ్యాచ్ లో ఉన్న మా ముగ్గురితోనే ఎక్కువగా సావాసం చేశాడు. చాలా సౌమ్యుడూ, నెమ్మదస్తుడూ. హాస్టల్లో ఎప్పుడూ మాతోనే మసలేవాడు. నన్ను `గిరిధర్` అని పిలిచే అతి కొద్ది ఫ్రెండ్స్ లో అతనూ ఒకడు. నేనేసే బొమ్మలు చూసి బాగ మెచ్చుకునేవాడు, నీలాచలం మాటలు నాకిప్పటికీ గుర్తే. "గిరిధర్ , నువ్వు `సితార` సినిమా చూడాలి, అందులో "భానుప్రియ" అని కొత్తనటి, ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయి, కళ్ళతోనే యాక్ట్ చేస్తుంది. మంచి డ్యాన్సర్ కూడా. నువ్వు ఆసినిమా చూస్తే తప్పకుండా ఇష్టపడతావు, ఆమె బొమ్మలు చాలా గీస్తావు." అని ఎప్పుడూ నా పక్కన భుజం మీద చెయ్యేసి నడుస్తూ అంటూనే ఉండేవాడు. అలా అతను అనేకసార్లు చెప్పీ చెప్పీ, తర్వాత `సితార` ఫొటోలు పత్రికల్లో చూసి, నీలాచలం చెప్పేది నిజమేనా అనుకున్నాను.
కానీ "నీలాచలం" నన్ను చూడమంటూ పదే పదే చెప్పిన `సితార` సినిమా చూసే అవకాశం చాలా సంవత్సరాలదాకా రాలేదు. అప్పట్లో ఆ సినిమా చాలారోజులు ఆడి సెన్సేషన్ సృష్టించి థియేటర్స్ లోనుంచి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన "ప్రేమించు పెళ్ళాడు" సినిమా నాకెంతో నచ్చింది. అదే నేను చూసిన "భానుప్రియ" మొదటి సినిమా. సితార ఫొటోల్లో చూసి నేననుకున్న సింప్లిసిటీ ఈ సినిమాలోనూ కనిపించింది. అందులో "భానుప్రియ" కళ్ళతోనే చేసిన అభినయం, నృత్యాలూ చూసి "సింపుల్" గా అభిమానినయ్యాను. తర్వాత వచ్చిన "అన్వేషణ" కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఆ సినిమాలో డైరెక్టర్ వంశీ గారు చాలా ఫ్రేముల్లో కళ్ళతోనే అభినయం చేయించారు. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ గా అనిపించింది. "విజేత" లోనూ బాగా నచ్చింది. "ఆలాపన" లో ఒక పాటకి చేసిన నృత్యం ఎప్పటికీ మరచిపోలేను. "మంచిమనసులు" సినిమాలోనూ ఒక పాటలో ఎంతో హృద్యంగా చేసిన నాట్యం ఎప్పుడు చూసినా నన్ను కదిలిస్తూనే ఉంటుంది.
తర్వాత వచ్చిన "స్వర్ణకమలం" అయితే ఇక ఇంతకన్నా "భానుప్రియ" కి గొప్ప సినిమా రాదేమో అన్నంతగా నన్నూ నా బొమ్మల లోకాన్నీ ఆకట్టుకునేసింది. పేపర్స్ లో వచ్చిన డ్యాన్స్ స్టిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను, బొమ్మలు వెయ్యటంకోసం. చికాగో లో ఉన్నపుడు ATA Conference లో నా Art Works 5 display చేస్తే, అందులో "స్వర్ణకమలం" లోని ఓ డ్యాన్స్ స్టిల్ ని పెన్సిల్ తో వేసిన బొమ్మ చాలా నచ్చింది, కొనుక్కుంటాను అంటూ నాకొచ్చిన ఫోన్ కాల్ ఎప్పటికీ మర్చిపోలేని ఆనందం. "స్వర్ణకమలం" లో "భానుప్రియ" డ్యాన్స్ స్టిల్స్ చాలా వేశాను. ఇంకా చాలా ఉన్నాయి, వెయ్యాలి, వేస్తాను.
వికీపీడియా లో "భానుప్రియ" ప్రొఫైల్ పేజి లో ఇప్పటికీ నేను వేసిన డ్రాయింగ్స్ ఉన్నాయి. వికీపీడియా "స్వర్ణకమలం" పేజి లోనూ నేనేసిన బొమ్మ ఒకటి ఇప్పటికీ ఉంది. గూగుల్ లో ఎవరైనా సెర్ఛ్ చేసినా బహుశా నేను వేసిన బొమ్మలే ఎక్కువగా కనిపించొచ్చు. ఆ మధ్య ఒకసారి TV9 చూస్తున్నపుడు "భానుప్రియ" చెల్లెలు "శాంతిప్రియ" పై ఏదో ప్రోగ్రాం వస్తూ చూపించిన కొన్ని ఫొటోల్లో నేనేసిన "భానుప్రియ" బాల్ పాయింట్ పెన్ స్కెచ్ చూసి చాలా థ్రిల్లింగ్ అయ్యాను.
"భానుప్రియ" కనపడకుండా నా బొమ్మలలోకం లేదు, నా బొమ్మలు చెప్పే కబుర్లు పూర్తి కావు. అలా "భానుప్రియ" నా బొమ్మల్లో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సింపుల్, స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ గానే మిగిలి ఉంది, ఉంటుంది...
Check the following links: