Saturday, March 5, 2022

"పిన్ని" - "అమ్మ" తర్వాత అంతటి కమ్మదనం, ఆప్యాయత నింపుకున్న తెలుగు పదం...

నా వాళ్లందరితో చాలా ఏళ్ళ తరువాత నేను జరుపుకున్న
నా పుట్టినరోజు కి "పిన్ని" శుభాకాంక్షలు, 2017

ఊహ తెలిసిన నాటి నుంచీ ఆ పిలుపూ ఆప్యాయతా మాకెంతో దగ్గరగానే ఉన్నాయి, పిన్ని రూపంలో. అప్పుడు నాకు బహుశా ఆరేళ్ళు. అయినా ఇంకా బాగా గుర్తుంది. "చీరాల" లో తాతయ్య తహసిల్దారు (అంటే ఒక తాలూకా కి హెడ్) గా ఉన్నారు. శలవులకి మేము దామరమడుగు నుంచి బయల్దేరి నెల్లూరులో రైలెక్కి సంబరంగా చీరాల చేరాం. "పిన్ని" ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరం కొద్ది గంటలు అటూ ఇటుగా చీరాల చేరుకున్నాం.

ఆ శలవులకి చీరాల చేరినరోజునే మధ్యాహ్నం, ఎప్పుడూ ఆటల్తో చలాకీగా ఉండే నేను కదలకుండా పడుకునే ఉన్నాను. నా వళ్ళు కాలిపోతుండటం చిన్నమామయ్య మొదటిగా గుర్తించాడు. ఇంట్లో అమ్మ, పిన్ని, అమ్మమ్మ, చిన్నమామయ్య, పిల్లలం మాత్రమే ఉన్నాం...ఇంతవరకే గుర్తుంది.

తర్వాతి రోజు కళ్ళుతెరిచి చూస్తే అమ్మ, పిన్ని ఇద్దరితో నేను హాస్పిటల్ లో ఒక రూమ్ లో, గంట గంటకీ వచ్చిపోయే డాక్టర్లు నర్సులు, బెడ్ దిగకూడదు. నాకిష్టం లేని పాలు గడగడా తాగెయ్యాలి, ఇంకెవరైనా అయితే ఈ ఒక్క మాట మాత్రం అస్సలు వినేవాడిని కాదు. కానీ చెప్పింది "పిన్ని". కాబట్టే గడగడా తాగేసేవాడిని. నాకు టైఫాయిడ్ జ్వరం అనీ, ఒక పదీఇరవై రోజులు చెప్పినట్టు వింటే తగ్గిపోయి ఇంటికెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చనీ "పిన్ని" చెప్తేనే తెలిసింది.

అప్పుడు అమ్మతో అన్నిరోజులూ అక్కడ మాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ త్వరగా కోలుకునేలా చూసుకుంది "పిన్ని". తర్వాత తెలిసింది నేను స్పృహలేకుండా వళ్ళు కాలిపోతూ పడుకుని మన స్మారకంలో లేకుండా ఉంటే అమ్మ ఏడుస్తూ దేవుడింట్లోకెళ్ళి పడిపోయిందని, అప్పుడు "పిన్ని" ఒక్కటే ధైర్యంగా పరుగున నన్ను భుజాన వేసుకుని ఇంట్లో ఉన్న ఒక జవాన్ (అప్పట్లో కనీసం ఒకరిద్దరు బంట్రోతులు తహసిల్దారు ఇంట్లో విధిగా రోజూ ఉండేవారు, ఏవైనా పనుల సాయంకోసం. ఒక జీప్ కూడా ఉండేది) సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి చేర్చిందని. ఆలశ్యం అయితే ఏమయ్యేదో ఊహకే అందని ఆలోచన అని. నా జ్ఞాపకాల్లో "పిన్ని" తో నా మొట్టమొదటి జ్ఞాపకం ఇదే. తన అక్కకే కే కాదు, మా ఫ్యామిలీ లో అక్కరకురాని ఎవరికి ఏ ఆపద వచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడేది "పిన్ని".

నాన్న పోయాక, నెల్లూరు లో ఉంటున్న "పిన్ని" శలవులకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతో బాగా చూసుకునేది. ఒకసారి పిల్లలనందరినీ రిక్షాల్లో నెల్లూరు , కనకమహల్ లో "రామదండు" సినిమా కి తీసుకెళ్ళింది. అప్పుడు పిల్లలం, మమ్మల్నందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. సినిమా చూసి రిక్షాల్లో ఇంటికి వెళ్తూ మేమూ పిన్ని తో "రామదండు" లోని పిల్లల్లా ఫీల్ అవుతూ సంబరపడిపోయిన ఆ రోజు ఇప్పటికీ కళ్ళకి కట్టిన అందని "అందని జ్ఞాపకమే".

నేను రెసిడెన్షియల్ స్కూల్ నుంచి శలవులకి వచ్చి వెళ్ళేప్పుడు ప్రతిసారీ కావలి నుంచి బస్ దిగి నెల్లూరులో సాయంత్రం పిన్ని దగ్గరికెళ్ళి కాసేపు ఉండి భోజనం చేసి రాత్రి బస్ అనంతపూర్ కి వెళ్ళటం పరిపాటి. ఇలా చాలా సార్లు వెళ్ళిన జ్ఞాపకం. నేను 8 వ తరగతికి వచ్చే సరికి పిన్ని వాళ్ళూ కావలికొచ్చి స్థిరపడిపోయారు. ఇక అప్పటి నుంచీ శలవుల్లో నాలుగైదురోజులకొకసారి పిన్ని దగ్గరికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. శలవుల్లో అందరం కలిసి అప్పుడప్పుడూ "దామరమడుగు" వెళ్ళి "బామ్మ" తో గడిపే వాళ్ళం. అలా "కావలి" లో ఒకే ఊర్లో అందరం కలీసి పెరిగిన జ్ఞాపకాల్లో "పిన్ని" లేని సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 

"పిన్ని" గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ వెనకే ఎక్కువగా గుర్తుకొచ్చే సంఘటన ఒకటి -
నేను "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్" లో 5th క్లాస్ నుంచి 10th దాకా ఆరేళ్ళు చదివాను. కొంతమంది స్నేహితులకి వాళ్ళ తలిదండ్రులు అప్పుడప్పుడూ వచ్చి, బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చిచ్చి, ఒకపూట ఉండి, అన్నీ చూసుకుని మరీ వెళ్ళేవాళ్ళు. ఆ ఆరేళ్ళలో ఎప్పుడూ ఎవ్వరూ నన్ను చూట్టానికి రాలేదు. నాన్న బ్రతికుంటే ఎన్నోసార్లు తప్పకుండా వచ్చి ఉండేవాడు. అమ్మకి అంత అండదండలు లేవు, అన్న నాకన్నా ఒక్క సంవత్సరమే పెద్ద.

కానీ ఒకరోజు నాకోసం వెతుక్కుని మరీ ఒకాయనొచ్చాడు. ఆయనెవరో నాకు తెలీదు, ఎప్పుడూ చూడనైనాలేదు. అప్పుడు 9th క్లాస్ లో ఉన్నాననుకుంటా. సాయంత్రం గేమ్స్ పీరియడ్ అయ్యాక వాళ్ళనడిగీ వీళ్ళనడిగి నా రూమ్ కనుక్కుని వచ్చి నన్ను కలిశాడు. "నేను నీకు మామయ్యని అవుతాను. పిన్ని పంపింది, చూసి రమ్మని" అని రెండు "క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్" ఇచ్చాడు. నాకు అంతుబట్టలేదు. ఎవరైనా పొరబాటున ఇంకొక పిల్లోడి కోసం వచ్చి నాకిచ్చిపోయాడా ఈయనెవరో నేనెప్పుడూ చూడలేదు అన్న సందేహం ఆయన వెళ్ళాక కూడా ఉండిపోయింది. కానీ తెల్లమొహం వేసుకుని ఉలుకూ పలుకూ లేని నన్ను ఆయన "గిరిధర్ నువ్వేకదా" అని మళ్ళీ అడిగి మరీ ఖచ్చితంగా "నీకోసమే, పిన్ని ఇచ్చి నిన్ను చూసి రమ్మంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. మా స్కూల్ మొత్తానికి నా పేరుతో ఇంకెవ్వరూ లేరు, ఖచ్చితంగా నేనే. కానీ ఎక్కడో ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో హిందూపురం దగ్గర ఒక మారుమూల పల్లెటూరు పక్కన "కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూలు". ఆ పేరింటేనే అలాంటి పేరుతో ఒక ఊరుంటుందా అన్న సందేహమే తప్ప దారి కనుక్కోవటమే కష్టం ఆరోజుల్లో. అసలు ఈ స్కూలు కి "కావలి" నుంచి ఎలా రావాలో తెలుసుకుని రావటం కూడా కష్టమే. ఇంత దూరం "పిన్ని" ఈయనెవర్నో ఎందుకు పంపుతుంది, ఆ ఏమోలే, అని నాలుగు రోజులు ఆ "క్రీమ్ బిస్కెట్లు" తినే సంతోషంలో ఉండిపోయాను. ఆరోజుల్లో జాబుజవాబులే కమ్యూనికేషన్. శలవులకి ఇంటికెళ్ళాక "పిన్ని" గుర్తుచేసింది ఆ విషయం. అప్పుడు అర్ధం అయ్యింది, నాకు తెలియని ఒక బంధువు పనిమీద "అనంతపురం" దగ్గరికి వెళ్తుంటే చూసి రమ్మని "పిన్ని" చెప్పిందనీ, వెళ్తూ "బిస్కెట్ ప్యాకెట్స్" తీసుకుని వెళ్ళమని మరీ చెప్పి పంపిందనీ. ఆ సంఘటన శిలపై చెక్కిన చెరగని గుర్తుగా నా పసిమనసు పై ముద్రపడిపోయింది. అన్నేళ్ళు దూరంగా ఉన్న నా దగ్గరికి ఒక్కరు చూట్టానికి వచ్చారు, ఆ ఒక్కరూ "పిన్ని" పంపితేనే అని. అప్పట్లో మామూలు బిస్కెట్లే అమృతంకన్నా మిన్న, ఇక "క్రీమ్ బిస్కెట్లు" అంటే అది దేవతలకి దక్కిన అమృతం కన్నా ఎక్కువే, దక్కనిదింకేదో. అది నాకు దక్కించింది మా "పిన్ని".

ఒకసారి ఇంజనీరింగ్ చేస్తున్నపుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి "తిరుపతి" లో. చూసుకుని  వెనక్కి "విజయవాడ" వెళ్తూ, అప్పటికప్పుడు అనుకుని "కావలి" లో ముగ్గురు ఫ్రెండ్స్ తో దిగిపోయాను, వాళ్ళకి మా ఊరుని, మా ఇంటినీ, అమ్మనీ, అన్ననీ పరిచయం చెయ్యాలని. ఇలాంటపుడు అమ్మకి "పిన్ని" నే కొండంత అండ. ఆ రెండ్రోజులూ వచ్చి అమ్మకి అండగా ఉండి, మాకు వంటలూ, వడ్డింపులూ చేసి వెళ్ళింది. 

ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి అయ్యాక జాబ్ కోసం "హైదరాబాద్" వచ్చాను. అప్పట్లో "కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్" కి సరయిన జాబ్స్ లేవు. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరికి అప్పుడే ఏదో ఒక జాబ్ వచ్చేసింది. రెండు నెలల కృషి, అయినా జాబ్ రాలా. ఒకరోజు దిగులుగా ఇంటికి ఉత్తరం రాశాను. దానికి జవాబుగా వచ్చిన ఉత్తరం నన్నెంతో ఉత్సాహపరిచింది. అది రాసింది "పిన్ని". "గిరీ నువ్వెళ్ళి రెండు నెలలు కూడా కాలేదు, నీకప్పుడే ఏం వయసయిపోయిందని రా జాబ్ కోసం అంతగా దిగులు పడుతున్నావ్. తప్పకుండా వస్తుంది, త్వరలోనే, ధైర్యంగా కృషి చెయ్యి." అంటూ రాసింది. ఆ ఉత్తరం కొండంత ధైర్యాన్నిచ్చింది. తర్వాత ఒక నెల లోపే మొదటి జాబ్ లో జాయిన్ అయ్యాను. "పిన్ని" రాసిన ఆ "ఒకే ఒక్క ఉత్తరం" ఎప్పటికీ మరచిపోలేను.

నా పెళ్ళికి దగ్గరుండి నలుగు పెట్టి నన్ను పెళ్ళికొడుకుని చేసింది మా "పిన్ని".

తర్వాత అమెరికా వచ్చి స్థిరపడిపోయాను. "పిన్ని" కూడా కొన్నేళ్ళు తన కూతురు "ఇందు" దగ్గర "కాలిఫోర్నియా" లో ఉండేది. ఒకసారి అందరూ "బోస్టన్" లో మా ఇంటికొచ్చి కొద్దిరోజులుండి వెళ్ళారు. అప్పుడు మొదటి డిన్నెర్ కి, వచ్చేముందే ఒక కూర మాత్రం నేనే చేశాను, "చికెన్ ఫ్రై". భోజనం దగ్గర "పిన్ని" కి చిన్న పజిల్ విసిరాను. "ఉన్న కూరలన్నింటిలో ఒక్క కూర నేను చేశా పిన్నీ, ఏదో చెప్పుకో చూద్దాం, నువు చెప్పలేవు" అని. మరీ అంత నిఖ్ఖచ్చిగా అడిగే సరికి తప్పు పోకూడదని అన్నీ రుచి చూసి కనిపెట్టేశా అని, చాలా సమయస్ఫూర్తిగా-  "ఏదో కరెక్ట్ గా చెప్పలేను కాని ఖచ్చితంగా చికెన్ మాత్రం కాదు" అంది. అదొక్కటే పిన్నీ నేను చేసింది అంటే నిజంగానే బిత్తరపోయింది. "ఇది చేసింది నువ్వా, ఇంక గొప్ప టేస్ట్ చికెన్ నేనెపుడూ తిన్లేదు" అంది. తర్వాత వెళ్ళేరోజు మళ్ళీ నాతో చేయించుకుని "కాలిఫోర్నియా" తీసుకెళ్ళింది. ఎన్నో సార్లు మాటల్లో "నువు చేసిన చికెన్ ఫ్రై టేస్ట్ అట్టనే నా నాలిక మీద నిలబడిపోయింది గిరీ" అనేది. బహుశా పిన్ని కి నేనిచ్చిన తియ్యని గురుతు ఇదేనేమో.

ఇక శలవుల్లో "పిన్ని" తో మేమంతా కలసి వెళ్ళిన తిరుమల ప్రయాణాలూ, రామాయపట్నం సముద్ర విహార భోజనాలూ, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని తియ్యని అనుభూతులే!

నెలన్నర క్రితం "పిన్ని" కి ఆఖరి "సంక్రాంతి". క్యాన్సర్ తో చివరి రోజులు. నేనూ ఇండియా లో ఉన్నాను. రాలేని పరిస్థితిలోనూ ఎంతో తపనపడి, ఎంతో కష్టపడి కూతురు "ఇందు" తో  "హైదరాబాదు" నుంచి "నెల్లూరు" వచ్చి కొద్దిరోజులుండి మాతో పండుగ జరుపుకుంది. సంక్రాంతి కి నాకూ, అన్నకీ బట్టలు పెట్టింది. "పిన్ని" చేతుల మీదుగా కొత్త బట్టలు అందుకుని సంక్రాంతి ని పిన్నితో అందరం కలసి జరుపుకున్నాం. ఆఖరిసారి "పిన్ని" పాదాలని తాకి మనసారా నమస్కరించుకున్నాను. మళ్ళీ తాకగలనో లేదో అన్న ఆలోచన ఎంత దిగమింగినా గుండెని తొలిచేసింది. తిరిగి హైదరాబాదు కి వెళ్తూ ఎక్కలేక ఎక్కి కారు లో పడుకుని చేతిలో చెయ్యి వేసి "సరే గిరీ, వెళ్ళొస్తా" అన్న ఆఖరి మాట, ఆఖరి చూపు అదే...

అందర్నీ వదిలి ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయింది "పిన్ని".

ఎన్ని కష్టాలున్నా తనలోనే దాచుకుని అందరికీ "ప్రేమ" ని మాత్రం పంచి, ఏన్నో అందమైన జ్ఞాపకాలని మిగిల్చి అందనంత దూరం వెళ్ళిపోయిన "పిన్ని" కి... 
ప్రేమతో 
ప్రేమాంజలి ఘటిస్తూ... 🙏

"ప్రేమ- ప్రేమించే మనసుకది వరం. ప్రేమించబడే మనసుకది అదృష్టం." - గిరిధర్ పొట్టేపాళెం


"చిన్నది కాని పిన్ని కానుక", నా పుట్టినరోజు  కి

చివరి కొన్ని సంవత్సరాలు "కావలి ఇస్కాన్ కృష్ణుని సన్నిధి" లో
"పిన్ని" గడిపిన ప్రశాంత జీవితం గురుతుగా నాకు దక్కిన కానుక