Based on Artist Sankar's illustration published in
"చందమామ" 1978 - తెలుగు పిల్లల మాస పత్రిక
Ink and ballpoint pen on paper
మొట్ట మొదటి అనుభూతి, తీపైనా, చేదైనా, ఏదైనా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేము, ఎప్పటికీ మదిలో పదిలంగా ఉండిపోతుంది. చిన్నప్పడు తిరిగిన పరిసరాలు, మసలిన మనుషులు అయితే మరింత బలంగా మదిలో ముద్ర పడిపోతాయి. నేను పుట్టిన ఊరు "కావలి", నెల్లూరు జిల్లా, చిన్న పట్టణం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ కూడా అక్కడే పుట్టింది. కానీ నా ఊహ తెలిసే నాటికి నాన్న "బుచ్చి రెడ్డిపాళెం" హైస్కూలు లో టీచర్, అక్కడే ఉండేవాళ్ళం. ఒకటవ తరగతి అక్కడే కోనేరు బళ్ళో చదివాను, ఒక రెండేళ్ళున్నామేమో అక్కడ. మరో మూడేళ్ళు పక్కనే నాన్న పుట్టి పెరిగిన పల్లెటూరు "దామరమడుగు" లో ఉన్నాం. నాలుగవ తరగతి వరకూ అక్కడే ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో ఆడుతూ పాడుతూ పెరిగాను. తరువాత నాన్న కి ట్రాన్స్ఫర్ కావటంతో "కావలి" కి వచ్చేశాం.
"కావలి" నెల్లూరు జిల్లాలో, నెల్లూరు తరువాత పెద్ద పట్టణం. రెండుగా విభజిస్తూ, సరళరేఖ గీసినట్టు ఊరి మధ్యలో వెళ్ళే నేషనల్ హైవే రోడ్దు. "ట్రంకు రోడ్డు" అని పిలిచేవారు. రోడ్డుకిరువైపులా ఆ చివరి నుండి ఈ చివరి వరకూ రద్దీ షాపులు, పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్, కోర్టు, తాలూకా ఆఫీస్, జె.బి.యం.కాలేజి, ఆర్.టి.సి బస్ స్టేషన్, హోల్ సేల్ క్లాత్ షాపులు, వచ్చే పోయే వాహనాల్తో, మనుషుల్తో ఎప్పుడూ రద్దీగానే ఉండేది. అప్పటిదాకా చిన్నపాటి వీధుల్లో తిరుగాడిన అనుభవమే. కావలి లోనే పెద్ద రోడ్లు, ట్రాఫిక్, షాపులూ, సినిమాహాళ్ళు...ఇలా పెరుగుతున్న వయసుతోబాటు మొదటిసారిగా తిరిగిన పెద్ద ప్రదేశాల గురుతులు అక్కడ్నే.
అప్పటిదాకా బొమ్మలు చాక్ పీస్ తో నేలపైనో, బలపం తో పలకపైనో, బొగ్గుతో గోడపైనో వేసిన గుర్తులే తప్ప కుదురుగ్గా కూర్చుని కాగితంపైన వేసిన గురుతులు లేవు. అయినా కావలిలో నన్ను కట్టిపడేసిన కొన్ని బొమ్మల స్ఫూర్తి జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి.
తారు రోడ్డు మీద చాక్ పీస్ బొమ్మలు - మొదటిది కూరగాయల మార్కెట్ కి ఎదురుగా "ట్రంకు రోడ్డు" మీద ఒక అంచున మట్టి అంతా శుభ్రంగా ఊడ్చి ఆ తారు రోడ్డు మీద రంగుల చాక్ పీస్ లతో ఎంతో గొప్పగా వేసిన "ఆంజనేయ స్వామి", "యేసు ప్రభు" లాంటి దేవతామూర్తుల బొమ్మలు. చుట్టూ ఫ్రేమ్ చేసినట్టు బోర్డర్ కూడా వేసేవాళ్ళు. కొన్ని బొమ్మలకు రంగులతో తళుకులు కూడా అద్ది ఉండేవి. బహుశా సాయంత్రం వేసే వాళ్ళేమో, చీకటి పడి రద్దీ అయ్యే సమయానికి మధ్యలో ఒక కిరసనాయిలు దీపం వెలుగుతూ ఉండేది. ఆ బొమ్మలపైన ఐదు, పది, పావలా బిళ్లలు కొన్ని ఎప్పుడూ వేసే ఉండేవి. అప్పుడనుకునే వాడిని వీళ్ళకి ఎన్ని డబ్బులో కదా అని. కానీ నాకా వయసులో తెలీదు - వెలకట్టలేని వాళ్ళ ప్రతిభకి దయకలిగిన వాళ్ళ జేబులు దాటి చేతుల్లోంచి గలగల రాలి పడే ఆ కొద్దిపాటి చిల్లర డబ్బులు...పాపం కనీసం ఒక్క పూటైనా వాళ్ల కడుపులు నింప(లే)వు అని. ఎంత కష్టపడి వేసే వాళ్ళో, ఎప్పుడూ వేస్తుంటే చూడలేదు. ఒక్కసారన్నా చూడాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఆ బొమ్మల లైఫ్ మహా అంటే ఒక్క రోజే, అదీ సాయంత్రం నుంచి రాత్రి దాకా కొద్ది గంటలు మాత్రమే. అర్ధరాత్రి నిర్మానుష్యం అయ్యాక కూడా తిరిగే బస్సులు, లారీలు, లేదా ఏ గాలో, వానో వచ్చి తుడిచిపెట్టేసేవి. ఇప్పుడా కళ బహుశా అంతరించిపోయిందేమో. అప్పుడప్పుడూ ఏవో ముగ్గులతో గొప్ప బొమ్మలని వాట్స్ అప్ మెసేజెస్ లో చూస్తుంటాను, ఏ ఆడిటోరియం లాంటి నేలపైనో వేసినవి. ఎన్ని చూసినా వాటితో మాత్రం సరికాలేవు, చిన్న నాటి మొట్టమొదటి జ్ఞాపకాల అనుభూతుల స్థాయి అలానే ఉంటుందేమో ఎవరికైనా.
సినిమా వాల్ పోస్టర్లు - తర్వాత అమితంగా ఆకట్టుకున్నవి అప్పటి సినిమా వాల్ పోస్టర్లు. నేనూ అన్నా రోడ్ల వెంట వెళ్తూ ఆ పోస్టర్ల మీద కింద ఆర్టిస్టుల సైన్ చూడకుండానే ఇది ఈశ్వర్, ఇది గంగాధర్ అని ఇట్టే గుర్తుపట్టేసేవాళ్లం. ప్రతి సినిమా పేరు కూడా విభిన్నంగా ఎంతో కళాత్మకంగా రూపకల్పన చేసేవాళ్ళు అప్పట్లో. ప్రత్యేకించి అడవి రాముడు, దాన వీర శూర కర్ణ, ప్రేమ సింహాసనం, జగ్గు, యమకింకరుడు ఇలాంటి విభిన్నమైన టైటిల్స్ అయితే ఇప్పటికీ గుర్తే. ప్రతి పోస్టర్ లో ఆర్టిస్ట్ కంపోజిషన్, ఎక్కువగా గీతలతో గీసిన హీరో, హీరోయిన్ల బొమ్మలు నన్నెక్కువగా ఆకట్టుకునేవి. నన్నమితంగా ఆకర్షించిన ఒకానొక వాల్ పోస్టర్ అయితే మాత్రం "దానవీరశూరకర్ణ" ది. అందులో మధ్యలో కర్ణుడు బాణం వేస్తూ ఉన్న ముఖం చెయ్యి వరకూ చుట్టూ కురుక్షేత్ర సమరసైన్యం, పక్కన దుర్యోధనుడు, కృష్ణుడు, కింద పెద్ద అక్షరాలతో ఒక కొండని చెక్కినట్టు తలపించేలా రూపొందించిన టైటిల్. శ్రీరామ్ థియేటర్ కి కావలిలో ఇంకే థియేటర్ కీ లేనంత ఎత్తులో మూడు వీధుల్లో నుంచీ కనిపించేలా వాల్ పోస్టర్ కోసమే ప్రత్యేకంగా కట్టిన ఎత్తైన గోడపైన చూసిన ఆ పోస్టర్ గుర్తు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తర్వాత ఆ సినిమా పోయి వేరే సినిమా వచ్చాక అటువెళ్ళిన ప్రతిసారీ అనుకునే వాడిని. అయ్యో ఆ పోస్టర్ అలానే ఉంచేయాల్సింది కదా అని. తెలీదింకా అప్పట్లో వాల్ పోస్టర్ అతి పెద్ద మార్కెటింగ్ చానెల్ అని.
న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు - ఇంకా డిసెంబర్ నెలలో రాబోయే కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మార్కెట్ లో రెలీజ్ అయ్యే గ్రీటింగ్ కార్డులు. కావలి మెయిన్ రోడ్ బజార్ లో కేవలం గ్రీటింగ్ కార్డులే అమ్మే వాళ్ళు నాలుగు చక్రాల బళ్ళు పైన పెట్టి, ఆ నెలంతా. అందమైన ప్రకృతిని తీసిన ఫొటోలు, సినిమా స్టార్ లు, ఫ్లవర్స్ ఇలా రకరకాల కార్డులు ఉండేవి. అయితే కొత్తగా అప్పుడే మార్కెట్ లోకి రావటం మొదలయిన "బాపు గారి బొమ్మల గ్రీటింగ్ కార్డులు" మాత్రం నాకమితంగా నచ్చేవి. అప్పట్లో తాతయ్యకి తరచూ ఉత్తరాలు పోస్ట్ లో వస్తూ ఉండేవి. కొత్త సంవత్సరంకి గ్రీటింగ్ కార్డ్స్ కూడా చాలా వచ్చేవి. అవన్నీ నేనూ అన్నా కలసి కలెక్ట్ చేసి ఉంచుకునేవాళ్ళం. నా స్కూలుకి అన్న మంచి గ్రీటింగ్ కార్డ్ ప్రతి సంవత్సరం కొని పోస్ట్ చేసేవాడు. అది కూడా శలవులకి వస్తూ తెచ్చి ఇంట్లో మా కలెక్షన్ లో దాచుకునేవాళ్ళాం. ఒకటి రెండు బాపు గారి గ్రీటింగ్ కార్డు లు చూసి అచ్చం అలాగే వేశాను కూడా. అలా కొత్త సంవత్సరం నాటి మొదటి కొత్త అనుభూతులు "కావలి" లోవే.
సంక్రాంతి ముగ్గులు - ప్రత్యేకించి సంక్రాంతి ముగ్గులు. పండగ వస్తుందంటే ఒక నెల ముందు నుంచీ చలిలో పొద్దున్నే రోజూ లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు. అప్పటిదాకా ముగ్గులు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మా ఇంటి పక్కనే "జయక్క" అని ఒక అక్క ఉండేది, అమ్మకీ మాకూ ఎంతో ఆదరణగా గా ఉండేది. ఆమె వేసే ముగ్గులు మాత్రం చాలా గొప్పగా ఉండేవి. ఎంత గొప్పగా అంటే అసలు అలా పేపర్ పైన ఏ గొప్ప ఆర్టిస్ట్ కైనా వెయ్యటం సాధ్యం కాదు అన్నంత గొప్పగా. రోజూ పొద్దున్నే నిద్రలేచి ఏం ముగ్గు వేసిందా అని వెళ్ళి నిలబడి తదేకంగా చూసే వాడిని. చాలా నచ్చేవి, ముగ్గుల్లో రంగులు అద్దినా కూడా అలానే తీర్చిదిద్దినట్టు, క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేసినట్టే. ప్రతి గీతా, వంపూ కొలిచి గీసినట్టు, ప్రతి రంగూ గీత అంచుని తాకి కొంచెం కూడా గీతపైకి రాకుండా, చుట్టూ బోర్డర్ వేసినా స్కేలు పెట్టి కొట్టినట్టు ఉండేవి. ముగ్గుల్లో ఆ సిమ్మెట్రీ తల్చుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. సంక్రాంతి పండుగ మూడు రోజులూ అయితే మా "పోలువారి వీధి" ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి ఎవరు ముగ్గులు బాగా వేశారా అని చూసి వచ్చేవాడిని. అలా వెళ్ళిన ప్రతిసారీ "జయక్క" వేసిన ముగ్గుని కొట్టే ముగ్గు ఎక్కడా ఎప్పుడూ చూడ్లేదంతే. అలా ముగ్గులు వెయటం ఒక కళ అని "జయక్క" వేసిన ముగ్గుల ద్వారా "కావలి"లోనే, అప్పుడే అర్ధం అయ్యింది.
"చందమామ" బొమ్మల పుస్తకం - ఇంకా, నెల నెలా తాతయ్యనడిగి కొనిపిచ్చుకున్న "చందమామ" బొమ్మల పుస్తకాల అనుభూతులు కూడా "కావలి" లోనే. ఆ పుస్తకాలే, బాల్యం లో బామ్మ చెప్పిన కథలకి ప్రతిరూపంగా నిలిచాయి. రామాయణం, మహాభారతం గాధలన్నీ బామ్మ చెప్తుంటే ఊహించుకున్న వాటికి అప్పటి కొన్ని పౌరాణిక సినిమాలు మనసుల్లో రూపాలు ఇచ్చినా, "చందమామ" లో శంకర్, జయ, రాజి లాంటి ఆర్టిస్టులు వేసిన బొమ్మల ముందు ఆ సినిమాలన్నీ బలాదూర్ అంతే. పిల్లల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్ళి విహరింపజేసేవి. ప్రతి నెలా "కావలి పెండెం సోడా ఫ్యాక్టరీ" కి ఎదురుగా ఉండే బంకులో టెంకాయ తాడు పైన వేళాడే పత్రికల్లో "చందామామ" కొత్త సంచిక వచ్చిందా అని చూసుకునేవాళ్ళం. నాకూ అన్నకీ ప్రతి నెలా తాతయ్య కొనిచ్చేవాడు. ఇంటికి రాగానే ముందు మా ఇద్దరికీ బొమ్మల పోటీ ఉండేది. ఇద్దరం ఒకటనుకుని నీవి కుడి వైపు, నావి ఎడమ వైపు అని ఇలా ఒక తీర్మానం చేసుకుని, పుస్తకం తెరిచి కుడి వైపు పేజీల్లో ఎన్ని బొమ్మలున్నాయి, ఎడం వైపు పేజీల్లో ఎన్నున్నాయి అని లెక్కబెట్టే వాళ్ళం. ఎటువైపు బొమ్మలు ఎక్కువ ఉంటే అటు వైపు కోరుకున్న వాడు గెలుస్తాడనమాట. ఇలా బొమ్మలతోనే ముందు మా చందమామ చదవటం మొదలయ్యేది. ఇద్దరం వంతుల వారీగా పుస్తకం చదివేవాళ్ళం. అయ్యాక మళ్ళీ ప్రతి బొమ్మనీ లోతుగా విశ్లేషణ కూడా చేసేవాళ్ళం. అప్పట్లో పుస్తకం చివర ధారా వాహికగా వస్తున్న "వీర హనుమాన్" ఆర్టిస్ట్ శంకర్ రంగుల బొమ్మలతో అద్భుతంగా ఉండేది. ప్రతి సంచిక లోనూ ఒక ఫుల్ పేజీ బొమ్మ తప్పనిసరిగా ఉండేది.
ఈ బొమ్మ "అశ్వమేధ యాగం" చేసి వదలిన అశ్వాన్ని లవకుశులు పట్టుకునే ఘట్టం కి ఫుల్ పేజీ లో "ఆర్టిస్ట్ శంకర్ గారు" వేసిన బొమ్మ ఆధారంగా వేశాను. అప్పుడు నేను ఆరవ క్లాస్ లో ఉన్నాను. శలవులకి "కావలి" వచ్చినపుడు అమ్మమ్మ వాళ్ళింట్లో మధ్యలో హాల్ లో నేలపైన కూర్చుని బొమ్మ పూర్తి చేశాను. "ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్", అయినా కొలతలు కొలిచి గీసినట్టే వచ్చాయి. నా అభిమాన చందమామ చిత్రకారుడు "శంకర్ గారి" బొమ్మని అచ్చు గుద్దినట్టు వేశానని నేను పొందిన ఆనందానికి అవధుల్లేవు. అప్పటి దాకా అడపా దడపా గీస్తున్నా, ఒక దాచుకోదగ్గ బొమ్మ అంటూ మొట్టమొదటిసారి వేసింది అదే. తర్వాత "చిన్నమామయ్య (ఆర్టిస్ట్)" ఆ బొమ్మకి షేడింగ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అని రెడ్ బాల్ పాయింట్ పెన్ తో కొంచెం వేసి చూపించాడు. ఇంకొంచెం షేడ్స్ వేసి వేసి అదే పెన్ తో నేను సంతకం చేసి మురిసిపోయిన క్షణాలు నేనెప్పటికీ గర్వించే క్షణాలే.
తర్వాత బ్లూ కలర్ ఇంకు కన్నా బ్లాక్ ఇంకు తో వేసుంటే బాగుండేది అని మనసు తొలుస్తూ ఉండేది, సరే ఏమైంది బ్లూ ఇంకు మీద బ్లాక్ ఇంకు తో గీద్దాం అని మొదలు పెట్టాను, కానీ పేపర్ సాదా సీదా రకం, ఒక గీత గియ్యగానే ఇంకు పీల్చి పక్కకి వ్యాపించటం మొదలయ్యింది. ఆ ప్రయత్నం విరమించుకున్నాను.
అలా నా మొట్టమొదటి బొమ్మ "కావలి" లోనే పుట్టింది. ఇప్పటికీ నాతోనే ఉంది. ఈ బొమ్మకిప్పుడు 44 యేళ్ళు. నాతోనే పెరిగి పెద్దయ్యింది. బొమ్మ చిన్నదే అయినా నా మదిలో మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఈ విశ్వం కన్నా పెద్దది, అంతే...!
"విశ్వంనైనా తనలో దాయగల శక్తి మానవ హృదయం లో దాగుంది."
~ గిరిధర్ పొట్టేపాళెం
No comments:
Post a Comment