"అయ్యా...నాకేమైన ఉత్తరం వచ్చిందా?"
అటుగా వెళ్తున్న పోస్ట్ మ్యాన్ ని చూసి వాకిట్లో మెట్లపైన కూచుని, రోజూ ఆ సమయానికి అటు వస్తూ పోతూ ఉండే పిల్లా పెద్దని పరికిస్తూ, ప్రశ్నిస్తూ ఉండే బామ్మ ప్రశ్న.
"లేదు బామ్మా" అంటూ చేతిలో ఉత్తరాల కట్ట సర్దుకుంటూ వెళ్లిపోయిన పోస్ట్ మ్యాన్.
మరుసటిరోజూ అదేవేళకి మళ్ళీ వాకిట్లో బామ్మ. ఇల్లు దాటి ముందుకి పోబోతున్న పోస్ట్ మ్యాన్ ని ఆపి మళ్ళీ ప్రశ్న.
"అయ్యా...మా అబ్బాయి గిరి లండన్ లో ఉన్నాడు, నాకేమైనా జాబు రాశాడా?"
"అబ్బా....ఈమెకి లండన్ నుంచి రావాలయ్యా ఉత్తరం...ఏం లేవు పో బామ్మా." ఈసారి ఆ సమాధానంలో కొంచెం విసుగూ, వెటకారం.
ఆ మరుసటిరోజు...అదేవేళకి...ఈసారి బామ్మ వాకిట్లో కూచుని లేదు, ఇంట్లో లోపల ఏదో పనిలో ఉండగా మెట్లెక్కి, వరండా దాటి లోపలికొచ్చి, తలుపు దగ్గర నిలబడి, "బామ్మా..." అన్న పిలుపు.
ఆ పిలుపు పోస్ట్ మ్యాన్ దే.
పిలిచిన కాసేపటికి నిదానంగా "ఏయ్యా" అంటూ కళ్ళజోడు సరిజేసుకుంటూ వచ్చిన బామ్మతో పోస్ట్ మ్యాన్...
"ఇదుగో బామ్మా, నీకు ఉత్తరం వచ్చింది, ఆ...లండన్ నుంచే బామ్మా, నీ గిరి దగ్గరి నుంచే" అంటూ చేతిలో ఉత్తరం పెట్టిన పోస్ట్ మ్యాన్ తో...
"నేంజెప్పలా...మా గిరి లండన్ లో ఉండాడని...నీకంతా ఎకసెకం నేనంటే." అంటూ ఉత్తరం తీసుకున్న బామ్మ.
"లేదులే బామ్మా" అంటూ ఉత్తరాల కట్ట సర్దుకుంటూ మెట్లు దిగి వెళుతున్న పోస్ట్ మ్యాన్...
ఆ క్షణం అక్కడలేకున్నా ఆ "బామ్మ" పసిమనసెంత ఆనందంతో నిండిపోయి ఉబ్బితబ్బిబ్బయ్యి ఉంటుందో ఆ బామ్మ ప్రేమని పొందిన ఆమె ముద్దుల మనవడు "గిరి" ఊహించగలడు.
తొమ్మిదేళ్ళ వయసు లో 5 వ క్లాస్ నుంచీ హాస్టల్స్ లోనే ఉంటూ గిరి చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. చదువయ్యాక జాబు కోసం హైదరాబాదు ప్రయాణం. మూడు నెలల్లోనే మొదటి జాబు, మళ్ళీ కొత్త జాబు బొంబాయి లో, అట్నుంచి అటే జాబు పని మీద 3 నెలలు లండన్ పయనం. "అప్పుడప్పుడూ దామరమడుగులో బామ్మ కి ఉత్తరం రాస్తుండు" అని 5 వ క్లాస్ లో నాన్న రాసిన ఉత్తరాల్లో ని మాటలు చదువు ముగిసి జాబ్ లో చేరినా తూ...చ...తప్పకుండా పాటిస్తూ వచ్చిన గిరి.
ఆ "బామ్మ" ముద్దుల మనవడు "గిరి" ని నేనే. నన్ను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించి, తన జీవితం అంతా మాకోసమే మాతోనే ఉండి, నేను దగ్గరలేకుండానే కనుమూసి మా నాన్నను చేరుకుంది "నా బామ్మ"!
నేను పూర్తిగా తెలుగులో తన కళ్ళకి కట్టినట్టు లండన్ వైభవాలూ, విశేషాలూ వివరిస్తూ రాసిన ఆ ఉత్త్రరం ని, పాతదై, ముందూ వెనుకా చాలా పేజీలు పోయి, ఒక్కొక్క పేజీ చిరిగిపోతూ వస్తున్న తన మహాభారతం పుస్తకంలో మా దామరమడుగు ఇంట్లో రేడియో టెబుల్ డ్రాయర్ లో పెట్టుకుని అప్పుడప్పుడూ చదువుకుంటూనే ఉండేది "బామ్మ".
బామ్మకి తెలుగు చదవటం రాయటం బాగా వచ్చు, నిదానంగా అక్షరాలు తప్పుల్లేకుండా గుండ్రంగా రాసేది.. రామాయణం, మహాభారతం వంటి పెద్ద ఇంతింత లావు పుస్తకాలు ఉండేవి. ఇంగ్లీష్ లో P.R.C అన్న మూడు అక్షరాల్ని మాత్రమే చదవగలదు. మరే అక్షరమూ గుర్తుపట్టటం రాదు, నేర్చుకోలేక కాదు. ఈ లోకంలోనే తనకి అత్యంత ఇష్టమైన మా నాన్న "పి.రామచంద్రయ్య" తన షార్ట్ నేమ్ రాస్తే P.R.C అనే రాసేవాడు. ఆ మూడు ఇంగ్లిష్ అక్షరాల్నే బామ్మ ఇష్టపడింది.
నేటికి సరిగ్గా 26 సంవత్సరాల క్రితం నా మొదటి విదేశీయానం. ఆగస్ట్ 15, 1994, బోంబే టు లండన్.
"బామ్మ" ని గుర్తుచేసుకుంటూ...
నిండా కన్నీళ్ళు నిండిన కళ్లతో...
మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత...
"బామ్మ" కి ప్రేమతో...
- నీ "గోవర్ధన" గిరి