Friday, January 5, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 16 ...

రాధాకృష్ణులు - రేఖా చిత్రం
Indian Ink and Poster Colors on Paper


<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 15                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 17 -->
రాయటం నేర్చిన ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు ఏదో ఒక రేఖాచిత్రం గీసే ఉంటారు. ఒక మనిషినో, పువ్వునో, చెట్టునో, కదిలే మేఘాన్నో, ఎగిరే పక్షులనో, నిండు చందమామనో, లేదా రెండు కొండల మధ్యన పొడిచే సూర్యుడినో. రేఖాచిత్రాలే గుహల్లో వెలుగు చూసిన మొదటి మానవ చిత్రాలు. ఎలాంటి బొమ్మల ప్రక్రియ అయినా మొదలయ్యేది ఒక చిన్న రేఖతోనే. సంతకం కింద తేదీ వెయ్యని నా అతికొద్ది బొమ్మల్లో ఈ రేఖా చిత్రం ఒకటి. 1992-93 సంవత్సరాల మధ్య వేసింది.

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజీ చదువు పూర్తి చేసాక, సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ కెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్ తోబాటు స్కాలర్ షిప్ రూపంలో వెనక్కి వచ్చిన ఆఖరి సంవత్సరం కట్టిన ట్యూషన్ ఫీజ్  Rs. 5,000 రూపాయలతో డిసెంబర్ 1989 లో భవిష్యత్తు బాటని వెదుకుతూ ఒక్కడినే హైదరాబాదు మహానగరానికి పయనమయ్యాను. అప్పట్లో బెంగుళూర్, ఢిల్లీ అయితే కంప్యూటర్ సైన్స్ కి జాబ్స్ ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువ అని విన్నా అక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేకపోవటం, హైదరాబాద్ లో చిన్నమామయ్య ఫ్యామిలీ శంకర్ మఠ్ దగ్గర విద్యానగర్ లో ఉండటం, ఇంకా నా పదవ తరగతి శలవుల్లో ఒక రెండు నెలలు హైదరాబాద్, నవీన్ నగర్ లో (శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి ఇంటి వెనుక) ఉంటూ హిమయత్ నగర్ "రావూస్ ట్యుటోరియల్స్" లో కోచింగ్ చేరి హైదరాబాద్ చూసిన అనుభవం...ఆ సుపరిచయం తో హైదరాబాద్ నాకు కొత్తేమీ కాకపోవటం...అలా అక్కడ జీవితం ఒకరకంగా పునః ప్రారంభమయ్యింది.

అప్పటికే హైదరాబాద్ మహానగరం. ఎక్కడికెళ్ళాలన్నా సిటీ బస్సులు, ఆటోలు, లేదంటే నడక...ఇవే  మార్గాలు. సెల్ ఫోన్ తో బుక్ చేస్తే మనం ఉన్న దగ్గరికి వచ్చి ఎక్కించుకునే ఓలా, ఊబర్ల కాలం ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చి ఉన్నా, ఆటో ఎక్కాలంటేనే తిరిగే మీటర్ చూసి కళ్ళు తిరిగే కాలం, ఓలా గీలా టాక్సీలు భరించే స్తోమత అందరికీ ఉండేది కాదు. అయినా ఉత్సాహంగా వెళ్లిన రెండో రోజే ఉద్యోగ వేట మొదలయ్యింది. ఒక పేజీ Resume ఫైల్ పట్టుకుని The Hindu, Deccan Chronicle Newspapers లో చూసిన ఒకటి రెండు Computer Centers addresses వెదుక్కుంటూ విద్యానగర్ నుంచి సికిందరాబాద్ కి సిటీ ట్రెయిన్ లో ప్రయాణం, నా జాబ్ ప్రయత్నంలో తొలి ప్రయాణం...ఇప్పటికీ కొత్తగానే గుర్తుంది. అప్పుడు కొద్ది రూట్స్ లో మాత్రమే సిటీ ట్రెయిన్స్ ఉండేవి. బహుశా ఆ రూట్ ఫలక్ నుమా నుంచి సికిందరాబాద్ వరకూ అనుకుంటాను. క్రిక్కిరిసిన సిటీ బస్సులతో పోలిస్తే ట్రెయిన్స్ అర కొర ప్రయాణీకులతో చాలా ఖాళీ గా నడిచేవి. ఇప్పుడు మెట్రో రెయిల్ అంత ప్రాచుర్యం లో లేవవి. అసలు సిటీ ట్రెయిన్స్ ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలీదు. అలా సికిందరాబాద్ లో ఒకటి, రెండు చిన్న కంపెనీలకెళ్ళి రెసెప్షన్ డెస్క్ వద్ద పరిచయం చేసుకుని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని జాబ్స్ కోసం వచ్చాను అని చెప్పి ఇస్తే, ఏవైనా జాబ్స్ ఉంటే లెటర్ పంపిస్తాం అని చెప్పి Resume తీసుకునేవాళ్ళు. పోస్టల్ అడ్రెస్ చిన్నమామయ్య ఇంటిది ఇచ్చి రోజూ ఏమైనా పోస్ట్ లో వస్తాయా అని కొన్ని రోజులు ఎదురు చూశాను. ఎప్పుడూ ఎక్కడినుండీ అలాంటి కాల్ లెటర్స్ అయితే రానేలేదు. చివరికి విద్యానగర్ దగ్గరే ఉన్న VST Industries (Vazir Sultan Tubacco Company) కెళ్ళి కూడా Resume ఇచ్చి వచ్చాను, పెద్ద కంపెనీ, కంప్యూటర్స్ ఉండి ఉండొచ్చు అని చిన్నమామయ్య చెప్తే.

అప్పట్లో ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి పబ్లిక్ సెక్టర్ కంపెనీ జాబ్స్ కి ఎంట్రన్స్ పరీక్షలకి నోటిఫికేషన్స్ పేపర్స్ లో వేస్తూ ఉండేవాళ్ళు. అలా కొన్ని పరీక్షలు కూడా రాసి కాల్ లెటర్స్ కోసం ఒకటి రెండు నెలలు ఎదురుచూపులు. అలా రెండు మూడు నెలల తర్వాత News Paper లో A.P. Technology Services Limited, State Government Jobs కోసం Notification చూసి apply చేసి ఒకరోజు పొద్దున ఉస్మానియా యూనివర్సిటీ లో ఎగ్జామ్ రాశా. ఆరోజు సాయంత్రమే బూర్గుల రామకృష్ణా రావు గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్ లో, ట్యాంక్ బండ్ అంచున, లిబర్టీ దగ్గర రిజల్ట్స్ పెట్టారు. పరీక్షలో నెగ్గాను, తరువాతి రోజే ఇంటర్వ్యూ కూడా అయ్యింది. అదే మొట్టమొదటి ఇంటర్వ్యూ, బాగా చేశాను. ఒక నెల తర్వాత అనుకోకుండా రిజిస్టర్డ్ పోస్ట్ లో అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. Government Jobs అంటే నాకు ఆసక్తి లేదు. అయినా అయిష్టంగానే చేరిపోయాను. నెలకి Rs. 1,500 శాలరీ. అప్పుడు సగటు శాలరీల కన్నా చాలా తక్కువ. కానీ ఆ జాబ్ మంచి అనుభవాన్నిచ్చింది. చాలా నేర్చుకునే అవకాశం ఉండేది, ఎంతో స్వయంకృషితో నేరుకున్నాను. అదే నా కెరీర్ కి గట్టి పునాది అయ్యింది. అప్పుడప్పుడే గవర్నమెంట్ రికార్డ్స్ కంప్యూటరైజేషన్ మొదలయ్యింది. ట్రెజరీ, పోలీస్ శాఖ, RTO ఆఫీసుల్లో సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ మొదటిసారి ప్రవేశపెట్టిన బ్యాచ్ మాదే. ఆ ఘనత అంతా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్స్ గా ఉన్న శ్రీ. మర్రి చెన్నారెడ్డి, శ్రీ. నేదురుమల్లి జనార్ధన రెడ్డి, శ్రీ. కోట్ల విజయభాస్కర రెడ్డి గార్లదే. ఆ నాలుగైదు ఏళ్లలో చాలా గట్టి పునాదులు వేశారు. మొట్ట మొదటి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కూడా అమీర్ పేట లో వెలిసింది అప్పుడే. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కి పునాదులు వేసిన క్రెడిట్ నూటికి నూరు శాతం వాళ్ళదే.

హైదరాబాద్ వచ్చాక సరిగ్గా మూడు నెలలు పట్టింది అలా మొదటి జాబ్ లో చేరటానికి. ఆ మూడు నెలల్లో రోజూ చిక్కడపల్లి లైబ్రరీ కి నడిచి వెళ్ళి News Papers అన్నీ జాబ్ నోటిఫికేషన్స్ కోసం తిరగేయటం ఒక పూట పనిగా పెట్టుకున్నాను, పనిగా అనేకన్నా లక్ష్యంగా పెట్టుకున్నానేమో అనిపిస్తుందిపుడు, ఒకరోజు మిస్ అయినా ఏదో మిస్ అయిపోతాను అన్నంట్టుండేవాడిని. అయినా బొమ్మలు మాత్రం మానలేదు. అడపా దడపా పేపర్స్ పై  వేస్తూనే ఉన్నాను. జాబ్ వచ్చాక ఆర్ట్ మెటీరియల్ కొనటానికి డబ్బులుండేవి, అబిడ్స్, కోఠి కెళ్లి వెతికి మరీ ఆర్ట్ మెటీరియల్, ఆర్ట్స్ బుక్స్, మ్యాగజైన్స్ బాగా కొనేవాడిని.

ఇండియన్ ఇంక్ లో ముంచి బ్రష్ తో వేసింది ఈ రాధాకృష్ణుల బొమ్మ. ఈ బొమ్మకి మూలం నా మొదటి జాబ్ లో కొలీగ్ పెళ్ళి కార్డ్ పై ఒక కార్నర్లో ప్రింట్ చేసిన ఒక ఇంచ్ సైజ్ బొమ్మ. భలే నచ్చింది. పెన్సిల్ తో రఫ్ లైన్ స్కెచ్ వేసుకునేపుడు ముఖాల్లో ఆ ప్రశాంత చూపుల కోసం చాలా కష్టపడ్డాను. కళ్ళు, ముక్కు, పెదవులు, కింద గడ్డం తో సహా ప్రతిదీ చక్కగా అమరితే కానీ రాని ఆ ప్రశాంతతని రేఖల్లో తీసుకురావటం అంత సులభం కాదని నేర్చుకున్నాను. ఒకరకంగా సన్నని సున్నితమైన ఆ గీతల్లోనే 3D ఎఫెక్ట్ తీసుకురావాలి. ఆ గీతల వంపుల్లో బుగ్గలు, మెడ, పెదవి కింది గడ్డం వంపులు ప్రతిదీ కొలిచి గీసినట్టు వస్తే కానీ బొమ్మ పూర్తిగా అందంగా కనపడదు. చిన్న గీత ఎక్కడ కొంత అటూ ఇటూ అయినా కొట్టొచ్చే మచ్చలా కనపడిపోతుంది. ముఖ్యంగా రాధ బొమ్మ గడ్డం చాలా సార్లు రబ్బర్ (ఎరేజర్) తో రబ్బీ రబ్బీ వేశాను. రేఖల బొమ్మల్లో ఉన్న సవాలు అప్పుడు అర్ధం అయ్యింది, చూట్టానికి సులభం అనిపించేంత సులభం మాత్రం కాదని. ప్రతి రేఖలో అంతర్లీనంగా ఆ కష్టం, అనుభవం దాగి ఉంటాయి.

మనం చేసే పనుల్లాగే, ఆర్టిస్ట్ కి వేసే బొమ్మల్లోనూ కొన్ని అసంతృప్తి నీ, కొన్ని తృప్తి నీ, కొన్ని సంతృప్తి నీ కలిగిస్తాయి. కొన్ని బొమ్మలు ఎంత కష్టపడి, ఎంత బాగా వేసినా అసంతృప్తినే మిగిలిస్తాయి, ఇంకా వాటిల్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ని కలిగిస్తూ. కొన్ని తృప్తిగా అనిపిస్తాయి, బాగా వేశాను అన్న ఫీలింగ్ ని ఇస్తూ. అతికొద్ది బొమ్మలు మాత్రమే సంతృప్తిని ఇస్తాయి. అవి చూడటానికి సింపుల్ గా ఉన్నా, అందులో పడిన కష్టం, ఆ కష్టంలో ని సంతృప్తి వేసిన ఆర్టిస్ట్ మనసుకి మాత్రమే తెలుస్తుంది. అప్పటి నా బొమ్మల్లో సంతృప్తిని ఇచ్చిన బొమ్మల్లో ఇది ఒకటి.

అప్పుడు నా దగ్గర క్యామెల్ పోస్టర్ కలర్ సెట్ లో హైదరాబాద్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్లో ఒక బుక్ షాప్ లో కొన్న రెండు స్పెషల్ కలర్ బాటిల్స్ ఉండేవి, ఒకటి గోల్డ్, ఇంకొకటి సిల్వర్. బార్డర్లకి ఎక్కువగా ఆ రెండిటిలో ఏదో ఒకటి వాడేవాడిని, ఇందులో బార్డర్స్ కి గోల్డ్ కలర్, కార్నర్స్ లో ఇండియన్ ఇంక్ వాడాను. కాలక్రమేణా గోల్డ్ కలర్ కొంచెం వెలిసి పోయినా వేసినప్పుడు అచ్చం గోల్డ్ లా మెరిస్తూ ఉండేది. తర్వాత హైదరాబాద్, అబిడ్స్ లోని ఒక ఫ్రేమింగ్ షాప్ కెళ్తే సరిగ్గా ఈ బొమ్మ పట్టే రెడీమేడ్ ఫ్రేమ్ దీనికోసమే అన్నట్టుగా దొరికింది. నేను బంగారు రంగులో వేసిన బార్డర్ కి నలుపు, నలుపు వేసిన కార్నర్స్ కి బంగారు రంగు లో ఉన్న కాంట్రాస్ట్ మెటల్ ఫ్రేమ్ అది. చాలా కాలం నాతోనే నేనున్న చోటల్లా అలా అదే ఫ్రేమ్ లోనే ఈ రేఖాచిత్రం ఉండేది.

ఇప్పటికీ ఈ బొమ్మ నాదగ్గరే ఉంది, అయితే ఫ్రేమ్ లో లేదు. ఆ ఫ్రేమ్ జీవితకాలం ముగిసిపోవడంతో ఆర్ట్ పోర్ట్ ఫోలియో ఫైల్ లో భద్రంగా ఉంది. ఎపుడన్నా ఆ ఫైల్ తెరిస్తే ఒకటి రెండు క్షణాలు మాత్రమే చూస్తాను. చూసిన ప్రతిసారీ హైదరాబాద్ కి జాబ్ కోసం వచ్చిన తొలినాటి రోజులు, బయటి ప్రపంచంలో ఒంటరిగా వేసిన తొలి అడుగులు, విద్యానగర్ చుట్టూ నడచిన పరిసరాలు, విద్యానగర్ ట్రెయిన్ స్టేషన్ లో కూర్చున్న బెంచి, నడచిన రైలు పట్టాలు, ఇష్టంలో పడిన కష్టాలు, తడబడినా నిలకడగా నిలబడిన జీవితం ని గుర్తు చేస్తూ, మరచిపో(లే)ని హైదరాబాద్ జ్ఞాపకాల అనుభవాలని గుర్తుకి తెస్తూ...

"అసంతృప్తి, తృప్తి, సంతృప్తి ల కలయికే నిలకడగా కదిలే జీవితం."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

No comments:

Post a Comment