Pages

Saturday, December 18, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 4 ...

Ink on cheap Notebook Paper (6.5" x 8")
 

తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు "ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్" గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇలస్త్రేషనన్స్ స్ఫూర్తి గానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ కానూరు లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి నుండి బస్సెక్కి పటమట కెళ్ళి ఆంధ్రభూమి వారపత్రిక కొనుక్కుని తెచ్చుకునే వాడిని. అంతగా ఆయన పెయింటింగ్స్ అప్పట్లో నన్ను ప్రభావితం చేశాయి. బహుశా పూర్తి స్థాయి పెయింటింగ్ వారపత్రిక కథలకి వెయ్యటం అన్నది ఉత్తమ్ గారే మొదలుపెట్టిన ప్రక్రియ. నాకు తెలిసి ఆ స్థాయిలో వారపత్రిక లోపలి పేజీల్లొ కథలకి పెయింటింగులు అప్పటి ఏ ప్రముఖ ఆర్టిస్టూ వెయ్యలేదు. తర్వాత ఆంధ్రభూమి లో చాలా మంది ఆర్టిస్టులు ఆయన్ని అనుకరించటం గ్రహించాను. అలా పెయింటింగులు ఇలస్ట్రేషన్స్ గా కళకళలాడిన వారపత్రిక ఎప్పటికీ అప్పటి "ఆధ్రభూమి" ఒక్కటే తెలుగులో. 

తర్వాత ఓ ఐదారేళ్ళకి హైదరాబాదులో జాబ్ చేస్తున్నపుడు శోధించి, సాధించి, ఒకసారి పని గట్టుకుని ఎలాగోలా లోపలికి ఎంట్రీ సంపాదించి సికిందరాబాదు లో ఉన్న డెక్కన్ క్రానికిల్ పేపర్ ఆఫీసులో ఆర్టిస్టులు అందరూ కూర్చుని బొమ్మలు వేసే ఒక విశాలమైన హాలు లోపలికి కేవలం "ఉత్తమ్ గారి" ని కలవాలనే వెళ్ళాను. ఆరోజు ఒకరిద్దరు ఆర్టిస్టులు ఆ హాలులో ఉన్నారు, అయితే ఉత్తమ్ గారు లేరు. ఉత్తమ్ గారి టేబుల్ మాత్రమే చూపెట్టి ఆయన ఇక్కడే బొమ్మలు వేస్తారు, ఈమధ్యనే హాలీవుడ్ వెళ్ళారు అక్కడ వాల్ట్ డిస్నీ కంపెనీకి బొమ్మలు వేస్తున్నారు అని చెప్పారు. నిరాశతో వెనుదిరిగాను. కొద్ది రోజులకి నాలుగు పేజీల స్పెషల్ ఆర్టికిల్ ఆంధ్రభూమిలో వచ్చింది పూర్తి వివరాలతో ఉత్తమ్ గారి గురించి. తర్వాత 2008 లో ఉత్తమ్ గారితో ఫోన్ లో ముచ్చటించాను. నా కొడుకు "భువన్" ద్వారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన, మరో ఉత్తమ్ గారి పెయింటింగులో ముచ్చటిస్తాను ;)

అలా ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి వేస్తూ, అలానే అనుకరిస్తూ చాలానే వేశాను. అయితే ఈ పెయింటింగ్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి పెయింటింగ్ నేను మొదలుపెట్టటానికి మెటీరియల్ కూడా తెలియని, దొరకని రోజుల్లో కేవలం ఇంకు, వాటర్ కలిపి పెయింటింగులా మామూలు నోటుబుక్కు పేజీ మీద వెయ్యటం మొదలెట్టిన రోజుల్లోనిది. 

ఊరు: కావలి... సమయం: సాయంత్రం 7 గంటలు...
"కావలి" లో అప్పట్లో రోజులో సాయంత్రం చీకటిపడే వేళ మాత్రం చాలా బోరింగ్ గా ఉండేది. ఇంట్లో ఉంటే ఏమీ తోచని సమయం అది. అందుకేనేమో మగవాళ్ళందరూ అలా బజార్లో రోడ్లంబడి ఊరికే తిరిగైనా ఇంటికొస్తుండేవాళ్ళు. కావలి ట్రంకురోడ్డు కళకళలాడే సమయం అది. పనుండి బజారుకొచ్చే వాళ్ళకన్నా, స్నానం చేసి చక్కగా ముస్తాబై రోడ్లమీద తిరిగే మధ్యవయస్కులు, చల్లగాలికి నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగే పెద్దవారు, హుషారుగా ఫస్ట్ షో సినిమాలకెళ్ళే కుర్రకారు తోనే ట్రంకు రోడ్డు మొత్తం కళకళలాడేది. సాయంత్రం అయితే రోడ్డు పక్కన పెట్రొమాక్స్ లాంతర్లు సుయ్ మంటూ శబ్ధం చేస్తూ చిందించే వేడి వెలుగుల్లో వెలిసే దోశల బళ్లపక్కన నిలబడి వేడి రుచులు ఆరగిస్తున్న డైలీ కస్టమర్లతో ప్రతి దోశ బండీ క్రిక్కిరిసే ఉండేది. నాకెప్పుడూ ఆశ్చర్యం గానే ఉండేది, ఈ బళ్ళ దగ్గర ఒక్కొకరు ఒక ప్లేట్ ఇడ్లి, ఒక ప్లేట్ పులిబంగరాలు, ఒక ప్లేటు దోశా...ఎర్రకారం, పప్పుల చట్నీ, కారప్పొడి మూడూ కలిపి లాగించి, మళ్ళీ ఇంటికెళ్ళి రాత్రికి భోజనం ఎలా చేస్తారా అని. ఇది నిజం అక్కడ మూడు ప్లేట్ల ఫలహారం లాగించేవాళ్ళంతా ఒక అరగంటలో ఇంటికెళ్ళి మళ్ళీ భోజనం చేసేవాళ్ళే, ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు ;)

ఈ పెయింటింగ్ వేసిన సమయం సరిగ్గా ఏమీ తోచని అలాటి ఓ సాయంత్రమే. మామూలుగా అప్పుడూ, ఇప్పుడూ ఉదయమే నేను బొమ్మలు ఎక్కువగా వేసే సమయం. ఇంట్లో తక్కువ వోల్టేజి లోనూ అద్వితీయంగా వెలిగే ట్యూబు లైటు వెలుతురులో కూర్చుని ఏమీ తోచక, భిన్నంగా, ఒక సాయంత్రం ఇంట్లో గచ్చునేల మీద కూర్చుని వెయటం మొదలుపెట్టాను. చాలా త్వరగానే పూర్తిచేశాను, ఒక గంట పట్టిందేమో. ఏమాత్రం టెక్నిక్కుల్లేని నేరుగా కుంచె ఇంకులోనూ వాటర్లోనూ ముంచి వేసిన పెయింటింగ్ ఇది.

అప్పట్లో నాకున్న నైపుణ్యానికి, బొమ్మలు వెయ్యాలన్న పట్టుదలకి, పెయింటింగులో ఓ.నా.మా.లు రాకపోయినా ఎదురుగా ఏకలవ్యునికి ద్రోణాచార్యుని ప్రతిమ ఉన్నట్టు, ఉత్తమ్ గారి పెయింటింగ్ ఉంటే ఇక "బ్రష్ విద్య" కి ఎదురులేదన్నట్టు గచ్చునేలపై కూర్చుని ఏకబిగిన వేసుకుంటూ పోయానంతే. పూర్తి అయ్యాక చూసుకుని "భలే వేశాన్రా" అని  కాలర్ ఎగరేస్తూ చిందులు తొక్కిన సంబరమూ గుర్తుంది. అప్పట్లో నా బొమ్మల రాజ్యంలో మరి...బంటూ నేనే, సైన్యం నేనే, మంత్రీ నేనే, రాజూ నేనే...ప్రజ కూడా నేనే!

తర్వాత కొద్ది కాలానికి ఒక ఇంగ్లిష్ ఫిల్మ్ మ్యాగజైన్ లో, అప్పటి హింది సినిమా హీరోయిన్ "షబానా ఆజ్మీ" గారి ఒక హింది మూవీ స్టిల్ ఫొటో చూశాను, అచ్చు ఇలాగే ఉంది. అప్పుడనిపించింది బహుశా ఉత్తమ్ గారు ఆ స్టిల్ స్ఫూర్తిగా ఈ పెయింటింగ్ వేసుంటారేమోనని. ఏ ఫొటోని అయినా చూసి పెయింటింగు "లా" వెయ్యొచ్చు అన్న "టాప్ సీక్రెట్" అప్పుడే అవగతం అయ్యింది. అందరు ఆర్టిస్టులూ చేసేదిదే, ఎవ్వరూ ఆ రహస్యాన్ని పైకి చెప్పరంతే... ;)

ఏదేమైనా అలా నల్లని ఇంకు నిలువెల్లా పూసుకుని నాసిరకం పేపరు తో కుస్తీపట్లు పడుతూనే, చెయ్యి తిరగని నా చేతి బ్రష్ ఆ పేపర్ని ప్రతిసారీ ఎలాగోలా జయించే(తీరే)ది. ఇప్పుడైతే ఎన్ని టెక్కు, నిక్కులు తెలుసు(కు)న్నా మంచిరకం పేపర్ మీద కూడా పట్టే కుస్తీలో ఎప్పుడైనా పట్టుజారి ఓడిపోతుంటానేమో గానీ, అప్పట్లో మాత్రం బరిలోకి దిగితే...అసలు..."తగ్గెదే ల్యా" ;)

"చేసే పనిలో లీనమైతే ఎప్పటికీ ఆ పని ఛాయలు స్పష్టంగా మదిలో నిలిచి పోతాయి." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: Artist Uttam Painting published in Andhra Bhoomi, Telugu Magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: July 18, 1985

Sunday, December 12, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 3 ...

సితార - భానుప్రియ
Ink on cheap Notebook Paper (6.5" x 8")


కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా అప్పటి వెలుగు చూడని నా "ఇంకు పెయింటింగుల్లో" పరిపూర్ణంగా ప్రతి క్షణమూ గుర్తున్న వాటిల్లో ఇదొకటి.

సుర్రున మండిస్తూ ముందరి వరండాలోకి కటకటాలగుండా దూసుకొచ్చే సూరీడెండని ఆపగలిగే సాధనాలు అప్పట్లోనూ ఉన్నా, అంత ఆర్ధిక స్థోమత లేదు. దుప్పటి అడ్డం కడితే వెలుతురుని కొంత ఆపగలిగినా ఆ వేడితాకిడిని ఆపటం దుప్పటి తరం అయ్యేది కాదు. మధ్యాహ్నం వెయ్యాలని కూర్చున్న ఈ బొమ్మకి నారాయణవ్వ తాటాకుల వసారానే మళ్ళీ ఆసరా అయ్యింది. ఈ పెయింటింగు మొదలెట్టింది ఒక మధ్యాహ్నం అక్కడే, పూర్తి చేసిందీ ఆ మధ్యాహ్నమే, అక్కడే. అప్పటి నా "ఇంకు పెయింటింగుల్లో" ప్రతిసారీ తప్పక వస్తున్న ప్రస్తావన "నారాయణవ్వ పూరి గుడిశ".

అవును, "నారాయణవ్వ పూరి గుడిశ", అక్కడ కూర్చునే అప్పట్లో చాలా బొమ్మలేశాను. అసలు మేముంటున్న పెంకుటిల్లూ మా నారాయణవ్వదే. రెండు పెంకుటిళ్ళ జంట, ఆ ఇళ్ళ వెనుక ఉండేది చిన్న పూరి గుడిశ, ఆ గుడిశ ముందు ఒక వసారా, వసారాలో నాపరాళ్ళ అరుగు, ఆ అరుగు మీద లోపల దిండు తో సహా చుట్టచుట్టి పెట్టిన పరుపు, కింద ఎత్తిపెట్టిన ఒక నులకమంచం. రెండు పెంకుటిళ్ళూ అద్దెకిచ్చి తను మాత్రం పూరి గుడిశ లోనే ఒక్కటే నివాసముండేది. శ్రమ, కాయకష్టమే చివరిదాకా ఆమె నమ్ముకున్న జీవనం. ఒక్కొక్క ఇంటికీ అద్దె నెలకి 100 రూ||, అయినా అమ్మ దగ్గర మాత్రం 50 రూ|| లే తీసుకునేది. అపుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి మిగిలినా పిల్లల చదువులకి ఉపయోగపడతాయి అన్న మా స్థితిలో, అలా సహాయం అందించి ఆదుకుని మా అభివృద్ధి బాటలో పరోక్షంగా ఎంతో పెద్ద సహాయం చేసింది "మా నారాయణవ్వ". అద్దె డబ్బులతోబాటు శ్రమించి సంపాదించుకున్న కొద్ది డబ్బులనూ జాగ్రత్తగా పొదుపుచేసి అందులోనూ కొంత మిగుల్చుకుని దాచుకునేది.

స్కూలు నుంచి శలవులకి ఇంటికొచ్చి శలవులయ్యాక తిరిగి వెళ్ళే ముందు, "వెళ్ళొస్తాను నారాయణవ్వా" అని చెప్పటానికి వెళ్ళిన ప్రతిసారీ "ఉండు నాయనా" అంటూ లోపలికెళ్ళి గుప్పెటలో మడిచిన 5 రూ|| ల కాయితం నా చేతిలో పెట్టేది. వద్దు నారాయణవ్వా అని ఎంత చెప్పినా వినేది కాదు. బహుశా ఆ 5 రూ లు అప్పట్లో ఆమెకి ఓ రెండు మూడు రోజుల సంపాదన, ఓ పదిరోజుల సేవింగ్స్ అయి ఉండొచ్చు. ఇలా క్రమం తప్పక ప్రతి శలవులకీ నాకు డబ్బులిచ్చిన "ఏకైక వ్యక్తి" గా "మా నారాయణవ్వ" నా మనసులో ఈనాటికీ పదిలంగా ఉండిపోయింది, అందుకే అప్పటి నా బొమ్మల్లో ఆమెని తల్చుకోకుండా ఉండలేను, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను.

ఈ బొమ్మ కూడా స్ట్రెయిట్ గా Bril ఇంకు బుడ్డీ, ఆ బుడ్డీ మూత ప్యాలెట్టు, మగ్గుతో నీళ్ళు, ఒకే ఒక్క బ్రష్, నాసిరకం నోట్ బుక్ పేపర్ మీద ఫ్రీ హ్యాండ్ తో వేసిందే. ఆధారం, వార పత్రికలో వచ్చిన "సితార భానుప్రియ" స్టిల్. అప్పటిదాకా పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ తో అచ్చు గుద్దినట్టు పోర్ట్రెయిట్ లు వెయటం సాధనతో  నేర్చుకున్నా. బ్రష్ తో కూడా సాధన చేస్తే సాధించగలనన్న బలమైన నమ్మకానికి పునాది వేసిన పెయింటింగ్ ఇది. ఇప్పుడు డిజిటల్ బొమ్మలో తెలియట్లేదు గానీ, అప్పటి నాకళ్ళకి మాత్రం ఆ డ్యాన్స్ కాస్ట్యూమ్, వేసుకున్న ఆభరణాలూ జిగేలుమంటూ వెలిగిపోతూ కనిపించేవి. బొమ్మ కింద పెట్టే సంతకం అప్పటికింకా పరిణతి చెందలేదు. ఇందులో కింద కనిపించే స్ఫురణకు రాని 19 అన్న అంకె నాకూ వీడని మిస్టరీనే!

అప్పటి బొమ్మల్లో తప్పులూ, తడికలూ, తప్పటడుగులూ వేసి ఉన్నా, అనాటి ఆపాటి జ్ఞానానికి అందుబాటులో నాకు తెలిసిన పరుగు అంతే. పడుతూ లేస్తూనే కొంచెం మెరుగవుతున్నాననిపిస్తూ ఇంకా ఉత్సాహంగా పరిగెట్టటమొక్కటే తెలుసు. అలుపులేని పరుగులో ఎప్పుడైనా ఇలా ఆగి ఒక్కసారి పరిగెట్టిన దూరం కొలుద్దామని ప్రయత్నిస్తే ప్రతి బొమ్మలో, ప్రతి మలుపులో ఎన్నో, ఎన్నెన్నో మధుర స్మృతులుగా మారిన జ్ఞాపకాలే ఆ దూరం కొలిచే నా కొలమానాలూ, కాలమానాలూ...

"ప్రతి అనుభవాన్నీ ఒక మంచి జ్ఞాపకంగా, ఆ జ్ఞాపకాన్ని ఓ మంచి స్మృతిగానూ మలుచుకోగలిగే జీవితం చిన్నదే అయినా దాన్ని సంపూర్ణంగా జీవించినట్టే." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Title: సితార - భానుప్రియ
Reference: A photo published in a Telugu weekly magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: Aug 18, 1985

Saturday, December 11, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 2 ...

కొల్లేరు సరస్సు
Ink on cheap Notebook Paper (11" x 14")


అప్పట్లో వెయ్యలన్న తపనే నా "పెయింటింగ్ స్టుడియో"! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే నా పెయింటింగ్ ఫర్నీచర్లు. Bril ఇంకు బుడ్డి, అదే ఇంకు బుడ్డీ మూత (ఇదే నా ప్యాలెట్టు), మగ్గుతో నీళ్ళు...ఇవి పక్కన పెట్టుకుని  కూర్చుని బ్రష్షు పట్టుకుంటే గంటలకొద్దీ దీక్షలోకెళ్ళినట్టే, ఇక లేచే పనేలేదు.

అప్పుడిలా ఎక్కువగా వేసిన పెయింటింగ్స్ అన్నీ పొద్దున 9గం నుంచి మధ్యాహ్నం 2గం లోపు వేసినవే. అమ్మ స్కూలుకి, అన్నేమో కాలేజి కో లేదా ఫ్రెండ్స్ అనో వెళ్లటం...ఎప్పుడన్నా మధ్యాహ్నం కొనసాగించాల్సి వస్తే నేనూ, నా పెయింటింగ్ స్టుడియో "నారాయణవ్వ తాటాకుల పూరి గుడిశ" కి షిఫ్ట్ అయ్యేవాళ్లం.

ఈ పెయింటింగ్ "ఆంధ్రభూమి న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ సంచిక" లో వచ్చిన "కొల్లేరు సరస్సు కలర్ ఫొటో" ఆధారంగా వేసింది. పెన్సిల్ గానీ, స్కేలు గానీ వాడకూడదు, అవి వాడితే ఆర్టిస్ట్ కాదు అన్న "పెద్ద అపోహ" ప్రస్ఫుటంగా ఇందులో కనిపిస్తుంది. బోర్డర్ లైన్స్ కూడా ఏ స్కేలో, రూళ్లకర్రో ఆధారం లేకుండా బ్రష్ తోనే వెయ్యాలన్న అర్ధం లేనిదే అయినా, వృధా కా(రా)ని ప్రయత్నం.

ఇక ఇందులో చెప్పుకోటానికి ఒక్కటంటే ఒక్క టెక్నిక్ కూడా లేదు, అప్పుడు టెక్నిక్కులే తెలీవు, తెలిసినా అసలా నాసిరకం పేపరు మీద టెక్నిక్కులకి తావేలేదు. మధ్య మధ్యలో లేచి దూరం నుంచి ఒక చూపు చూస్తే ఎలా వస్తుందో కరెక్ట్ గా తెలిసిపోతుంది, సవరణలేమైనా ఉంటే చేసుకోవచ్చు లాంటి "టాప్ సీక్రెట్ లు" కూడా ఉంటాయనీ తెలీదు. తెలిసిందల్లా కింది పెదవిని పంటితో నొక్కి పెట్టి, చెరిపే వీలు లేని ఒక్కొక్క బ్రష్ స్ట్రోక్ జాగ్రత్తగా వేసుకుంటూ పోటమే. బొమ్మయ్యాక అందులో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కొలతా కొలిచినట్టు కరెక్ట్ గా ఉండాలి, పక్కవాటితో చక్కగా ఇమడాలి, లేదంటే పూర్తి బొమ్మ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుందీ అని సరిపెట్టుకోటానికి మనమంత మాడ్రన్ ఆర్టిస్ట్ కాదు, మనది మాడ్రన్ ఆర్టూ కాదు ;)

ఏదేమైనా అప్పట్లో మాత్రం "భలే ఏసేన్రా" అని నాకు నన్ను వెన్నుతట్టుకుని ప్రోత్సహించుకుని ముందుకి అడుగులేసిన నా పెయింటింగ్ బొమ్మల్లో చాలా సంతృప్తిని ఇచ్చిన వాటిలో ఇదీ ఒకటి. ఈ పెయింటింగ్ నాకెంతగా నచ్చిందంటే, తర్వాత మళ్ళీ దీన్నే కొంచెం బెటర్ అనిపించే మందమైన పేపర్ మీద వేశాను. అయితే పేపర్ కాస్త మెరుగే అయినా నాసిరకం రంగుల్లో మళ్ళీ ఈ బొమ్మనే రిపీట్ చేశాను.

అలా నేను వేసేది పెయింటింగో కాదో కూడా తెలీకుండానే వేసుకుంటూ వెళ్ళిన బాటలో ఒంటరిగా నడుచుకుంటూ ముందుకెళ్ళాను. అందుకేనేమో ఇన్నేళ్ళయినా వెనక్కితిరిగి చూస్తే వేసిన ప్రతి అడుగూ చెక్కుచెదకుండా స్పష్టంగా మనసుకి కనిపిస్తుంది.

"మనం చేసే పనిపైన ధ్యాసే ముఖ్యమైతే దాని ఫలితం ఎప్పటికీ అబ్బురమే."
- గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: A color photo published in Andhra Bhoomi Newspaper Sunday special
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 11" x 14" (28 cm x 36 cm)
Signed & Dated: Jan 7, 1986

Sunday, December 5, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 1 ...

Suman, Telugu Cine Hero
Ink on Paper 7 1/2" x 5 1/2"


బొమ్మల్లో నా ఆనందం ఈనాటిది కాదు. వేసిన ప్రతి బొమ్మా ఆర్టిస్ట్ కి సంతృప్తిని ఇవ్వదేమో కానీ సంతోషాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది.

రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో "కావలి" అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా బొమ్మల్లోని మధుర జ్ఞాపకాలు.

ఎండాకాలం మధ్యాహ్నం 12 దాటితే మా ఇంటి  "మెష్ వరండా" లోకి సూటిగా దూసుకొచ్చే ఎండవేడికి తాళలేక పక్కనే ఉన్న నారాయణవ్వ పూరి గుడిసె కి షిఫ్ట్ అయ్యేవాడిని, నా బొమ్మల సరంజామా అంతా పట్టుకుని.

సరంజామా అంటే పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఒక పెద్ద అట్ట ప్లాంక్ (తాతయ్య దగ్గరినుంచి తెచ్చుకున్నది), బ్రిల్ బ్లాక్ ఇంకు బుడ్డి, ఒక మగ్గులో నీళ్ళు, ఒక్కటంటే ఒక్కటే బ్రష్ (బహుశా అన్న 6వ తరగతి పాత డ్రాయింగ్ బాక్సులోదయ్యుండాలి), ఒక నాసిరకం నోట్ బుక్ నుంచి చింపిన తెల్లకాయితం. అంతే. అలా అప్పుడు ఆ పెయింటింగ్ సరంజామాతో వేసిన నా "పెయింటింగ్" ల వెనక "పెన్సిల్ లైన్ స్కెచ్" అనే "సీక్రెట్ కాన్సెప్ట్" ఉండేది కాదు. అసలలా ప్రొఫెషనల్ గా పెన్సిల్ స్కెచ్ వేసుకుంటే పెయింటింగ్ బాగా వస్తుందన్న ఇంగితం కూడా లేదు, ఇంకా రాలా. ఆర్ట్ లో ప్రముఖ పాత్ర పెన్సిల్ దే అని నా పెన్సిల్ డ్రాయింగ్స్ తో తెలుసుకున్నా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవ్వరూ అసలు పెన్సిల్ వాడరనుకునే వాడిని. అలా వేస్తేనే అది పెయింటింగ్ అన్న భ్రమలోనే ఉండేవాడిని.

అసలు ఇంకుతో వేస్తే దాన్ని పెయింటింగ్ అంటారా, ఏమో అదీ తెలీదు. నాకున్న అపోహల్లా ఒక్కటే, పెయింటింగ్ అంటే బ్రష్ తోనే వెయ్యాలి. ఒక బ్రష్ ఎలాగూ నాదగ్గరుంది కాబట్టి దాంతో పెయింటింగ్ లు వెయ్యాలి. రంగుల ముఖచిత్రం తప్ప లోపలంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉండే పత్రికల్లో కథలకి కొందరు ఆర్టిస్ట్ లూ వేసే బొమ్మలు పెయింటింగుల్లా అనిపించేవి. అలా వెయ్యాలనీ, వేసిన ప్రతి ఇంకు బొమ్మా పెయింటింగ్ నే అని ఉప్పొంగిపోయేవాడిని. నీళ్ళు కలిపి ఇంకు ని పలుచన చేస్తే నలుపు తెలుపులో చాలా షేడ్స్ తెప్పించొచ్చన్న "రహస్యం" పట్టుకున్నా. ఆ రహస్య (పరి)శోధనే చిట్కాగా చాలా పెయింటింగ్ లు వేశాను. అలా వేసిన వాటిల్లో సినిమా స్టార్ లే ఎక్కువగా ఉన్నారు. వాటిల్లో "కొల్లేరు సరస్సు", "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" లాంటి అతి క్లిష్టమైన పెయింటింగులు కూడా ఉన్నాయి.

అప్పట్లో నేనే (పరి)శోధించి కనిపెట్టాననుకొంటూ, నాకై నేను తెలుసుకున్న, నాకు తెలిసిన ఒకే ఒక్క పెయింటింగ్ రహస్యం అదే- ఇంకు లో నీళ్ళు కలిపి వెయటం. ఇదే అనుకరిస్తూ రంగులతో "మంచిరకం ప్రొఫెషనల్ వాటర్ కలర్ పేపర్" మీద వేస్తే దాన్ని "వాటర్ కలర్ పెయింటింగ్" అంటారని చాలా లేట్ గా తెలుసుకున్నా ;)

Details 
Reference: Picture of Suman, Telugu Cine Hero
Mediums: Brill Ink on cheap notebook paper
Size: 7 1/2" x 5 1/2" (19.5 cm x 13.5 cm)
Signed & Dated: August 18, 1985