Pages

Saturday, December 18, 2021

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 4 ...

Ink on cheap Notebook Paper (6.5" x 8")
 

తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు "ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్" గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇలస్త్రేషనన్స్ స్ఫూర్తి గానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ కానూరు లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి నుండి బస్సెక్కి పటమట కెళ్ళి ఆంధ్రభూమి వారపత్రిక కొనుక్కుని తెచ్చుకునే వాడిని. అంతగా ఆయన పెయింటింగ్స్ అప్పట్లో నన్ను ప్రభావితం చేశాయి. బహుశా పూర్తి స్థాయి పెయింటింగ్ వారపత్రిక కథలకి వెయ్యటం అన్నది ఉత్తమ్ గారే మొదలుపెట్టిన ప్రక్రియ. నాకు తెలిసి ఆ స్థాయిలో వారపత్రిక లోపలి పేజీల్లొ కథలకి పెయింటింగులు అప్పటి ఏ ప్రముఖ ఆర్టిస్టూ వెయ్యలేదు. తర్వాత ఆంధ్రభూమి లో చాలా మంది ఆర్టిస్టులు ఆయన్ని అనుకరించటం గ్రహించాను. అలా పెయింటింగులు ఇలస్ట్రేషన్స్ గా కళకళలాడిన వారపత్రిక ఎప్పటికీ అప్పటి "ఆధ్రభూమి" ఒక్కటే తెలుగులో. 

తర్వాత ఓ ఐదారేళ్ళకి హైదరాబాదులో జాబ్ చేస్తున్నపుడు శోధించి, సాధించి, ఒకసారి పని గట్టుకుని ఎలాగోలా లోపలికి ఎంట్రీ సంపాదించి సికిందరాబాదు లో ఉన్న డెక్కన్ క్రానికిల్ పేపర్ ఆఫీసులో ఆర్టిస్టులు అందరూ కూర్చుని బొమ్మలు వేసే ఒక విశాలమైన హాలు లోపలికి కేవలం "ఉత్తమ్ గారి" ని కలవాలనే వెళ్ళాను. ఆరోజు ఒకరిద్దరు ఆర్టిస్టులు ఆ హాలులో ఉన్నారు, అయితే ఉత్తమ్ గారు లేరు. ఉత్తమ్ గారి టేబుల్ మాత్రమే చూపెట్టి ఆయన ఇక్కడే బొమ్మలు వేస్తారు, ఈమధ్యనే హాలీవుడ్ వెళ్ళారు అక్కడ వాల్ట్ డిస్నీ కంపెనీకి బొమ్మలు వేస్తున్నారు అని చెప్పారు. నిరాశతో వెనుదిరిగాను. కొద్ది రోజులకి నాలుగు పేజీల స్పెషల్ ఆర్టికిల్ ఆంధ్రభూమిలో వచ్చింది పూర్తి వివరాలతో ఉత్తమ్ గారి గురించి. తర్వాత 2008 లో ఉత్తమ్ గారితో ఫోన్ లో ముచ్చటించాను. నా కొడుకు "భువన్" ద్వారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన, మరో ఉత్తమ్ గారి పెయింటింగులో ముచ్చటిస్తాను ;)

అలా ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి వేస్తూ, అలానే అనుకరిస్తూ చాలానే వేశాను. అయితే ఈ పెయింటింగ్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి పెయింటింగ్ నేను మొదలుపెట్టటానికి మెటీరియల్ కూడా తెలియని, దొరకని రోజుల్లో కేవలం ఇంకు, వాటర్ కలిపి పెయింటింగులా మామూలు నోటుబుక్కు పేజీ మీద వెయ్యటం మొదలెట్టిన రోజుల్లోనిది. 

ఊరు: కావలి... సమయం: సాయంత్రం 7 గంటలు...
"కావలి" లో అప్పట్లో రోజులో సాయంత్రం చీకటిపడే వేళ మాత్రం చాలా బోరింగ్ గా ఉండేది. ఇంట్లో ఉంటే ఏమీ తోచని సమయం అది. అందుకేనేమో మగవాళ్ళందరూ అలా బజార్లో రోడ్లంబడి ఊరికే తిరిగైనా ఇంటికొస్తుండేవాళ్ళు. కావలి ట్రంకురోడ్డు కళకళలాడే సమయం అది. పనుండి బజారుకొచ్చే వాళ్ళకన్నా, స్నానం చేసి చక్కగా ముస్తాబై రోడ్లమీద తిరిగే మధ్యవయస్కులు, చల్లగాలికి నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగే పెద్దవారు, హుషారుగా ఫస్ట్ షో సినిమాలకెళ్ళే కుర్రకారు తోనే ట్రంకు రోడ్డు మొత్తం కళకళలాడేది. సాయంత్రం అయితే రోడ్డు పక్కన పెట్రొమాక్స్ లాంతర్లు సుయ్ మంటూ శబ్ధం చేస్తూ చిందించే వేడి వెలుగుల్లో వెలిసే దోశల బళ్లపక్కన నిలబడి వేడి రుచులు ఆరగిస్తున్న డైలీ కస్టమర్లతో ప్రతి దోశ బండీ క్రిక్కిరిసే ఉండేది. నాకెప్పుడూ ఆశ్చర్యం గానే ఉండేది, ఈ బళ్ళ దగ్గర ఒక్కొకరు ఒక ప్లేట్ ఇడ్లి, ఒక ప్లేట్ పులిబంగరాలు, ఒక ప్లేటు దోశా...ఎర్రకారం, పప్పుల చట్నీ, కారప్పొడి మూడూ కలిపి లాగించి, మళ్ళీ ఇంటికెళ్ళి రాత్రికి భోజనం ఎలా చేస్తారా అని. ఇది నిజం అక్కడ మూడు ప్లేట్ల ఫలహారం లాగించేవాళ్ళంతా ఒక అరగంటలో ఇంటికెళ్ళి మళ్ళీ భోజనం చేసేవాళ్ళే, ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు ;)

ఈ పెయింటింగ్ వేసిన సమయం సరిగ్గా ఏమీ తోచని అలాటి ఓ సాయంత్రమే. మామూలుగా అప్పుడూ, ఇప్పుడూ ఉదయమే నేను బొమ్మలు ఎక్కువగా వేసే సమయం. ఇంట్లో తక్కువ వోల్టేజి లోనూ అద్వితీయంగా వెలిగే ట్యూబు లైటు వెలుతురులో కూర్చుని ఏమీ తోచక, భిన్నంగా, ఒక సాయంత్రం ఇంట్లో గచ్చునేల మీద కూర్చుని వెయటం మొదలుపెట్టాను. చాలా త్వరగానే పూర్తిచేశాను, ఒక గంట పట్టిందేమో. ఏమాత్రం టెక్నిక్కుల్లేని నేరుగా కుంచె ఇంకులోనూ వాటర్లోనూ ముంచి వేసిన పెయింటింగ్ ఇది.

అప్పట్లో నాకున్న నైపుణ్యానికి, బొమ్మలు వెయ్యాలన్న పట్టుదలకి, పెయింటింగులో ఓ.నా.మా.లు రాకపోయినా ఎదురుగా ఏకలవ్యునికి ద్రోణాచార్యుని ప్రతిమ ఉన్నట్టు, ఉత్తమ్ గారి పెయింటింగ్ ఉంటే ఇక "బ్రష్ విద్య" కి ఎదురులేదన్నట్టు గచ్చునేలపై కూర్చుని ఏకబిగిన వేసుకుంటూ పోయానంతే. పూర్తి అయ్యాక చూసుకుని "భలే వేశాన్రా" అని  కాలర్ ఎగరేస్తూ చిందులు తొక్కిన సంబరమూ గుర్తుంది. అప్పట్లో నా బొమ్మల రాజ్యంలో మరి...బంటూ నేనే, సైన్యం నేనే, మంత్రీ నేనే, రాజూ నేనే...ప్రజ కూడా నేనే!

తర్వాత కొద్ది కాలానికి ఒక ఇంగ్లిష్ ఫిల్మ్ మ్యాగజైన్ లో, అప్పటి హింది సినిమా హీరోయిన్ "షబానా ఆజ్మీ" గారి ఒక హింది మూవీ స్టిల్ ఫొటో చూశాను, అచ్చు ఇలాగే ఉంది. అప్పుడనిపించింది బహుశా ఉత్తమ్ గారు ఆ స్టిల్ స్ఫూర్తిగా ఈ పెయింటింగ్ వేసుంటారేమోనని. ఏ ఫొటోని అయినా చూసి పెయింటింగు "లా" వెయ్యొచ్చు అన్న "టాప్ సీక్రెట్" అప్పుడే అవగతం అయ్యింది. అందరు ఆర్టిస్టులూ చేసేదిదే, ఎవ్వరూ ఆ రహస్యాన్ని పైకి చెప్పరంతే... ;)

ఏదేమైనా అలా నల్లని ఇంకు నిలువెల్లా పూసుకుని నాసిరకం పేపరు తో కుస్తీపట్లు పడుతూనే, చెయ్యి తిరగని నా చేతి బ్రష్ ఆ పేపర్ని ప్రతిసారీ ఎలాగోలా జయించే(తీరే)ది. ఇప్పుడైతే ఎన్ని టెక్కు, నిక్కులు తెలుసు(కు)న్నా మంచిరకం పేపర్ మీద కూడా పట్టే కుస్తీలో ఎప్పుడైనా పట్టుజారి ఓడిపోతుంటానేమో గానీ, అప్పట్లో మాత్రం బరిలోకి దిగితే...అసలు..."తగ్గెదే ల్యా" ;)

"చేసే పనిలో లీనమైతే ఎప్పటికీ ఆ పని ఛాయలు స్పష్టంగా మదిలో నిలిచి పోతాయి." - గిరిధర్ పొట్టేపాళెం

Details 
Reference: Artist Uttam Painting published in Andhra Bhoomi, Telugu Magazine
Mediums: Bril fountain pen ink on cheap Notebook Paper
Size: 6.5" x 8" (16 cm x 20 cm)
Signed & Dated: July 18, 1985

3 comments:

  1. informative post and it is very good to read. Thanks a lot! and I truly love your site, - Crazy Movie Updates

    ReplyDelete
  2. ఫోటోని చూసి పెయింటింగ్ వేయవచ్చును, అందరు అలా చేస్తూ ఉంటారూ అన్నారు. నిజమే. కృష్ణ గారు కూడా సావిత్రి వాష్ ఫోటోని ఒకపత్రికలోని ఫోటో ఆధారంగానే వేసారు. అసందర్భంగా జరిగిన సంభాషణలో ఆయన ఇలా ఫోటోను చూసి వేయటంలో కొంచెం ఇబ్బంది కూడా ఉందని అన్నారు. ఫోటోగ్రాఫరు మంచి ఆర్టిష్టు కాకపోతే ఫోటోలో లైట్&షేడ్ ఎఫెక్టులూ, డెప్తూ వగైరా సరిగా ఉండవూ అటువంటివి పెయింటింగ్ ప్రాక్టీసుకు పనికిరావూ అన్నారు. ఆయన ఎక్కువగా అడవిలోనికి వెళ్ళి ఏదో దృశ్యాన్ని స్కెచ్ వేసుకొని వచ్చి డెవలప్ చేయటం చేసేవారు. ఒకసారి ఐతే రోజుల తరబడి ఒకే ప్రదేశానికి వెళ్ళి ఒక తమాషా పోజులో పడిఉన్న ఒక మొద్దును పెయింటింగ్ చేస్తూ గడిపారు - చాలా బాగా వచ్చింది కూడా. (అడవిలో అన్న దానికి వివరణ. అప్పట్లో మేము రంపచోడవరంలో ఉండే వాళ్ళం. ఆయన సోషల్ స్టడీస్ టీచర్, మా నాన్నగారు అక్కడ హెద్మాష్టర్ గారు)

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ సో మచ్ అండీ, చాలా విషయాలు కృష్ణ గారి గురించి పంచుకున్నారు. నిజమే పోర్ట్రెయిట్ కి అయితే ఫోటో బాగా దెప్త్ తో తీసినది అయితే ముఖకవళికలు వయ్యటం సులభం. ఒక ఫొటో చుట్టుపక్కla ప్రదేశాలను ఆధారం గా తీసుకుని దానిki ఊహని కొంత జోడించి ఎక్కువగా ఆర్టిస్టులు బొమ్మలు గీస్తూ ఉంటారు, ఈ పెయింటింg ki ఉత్తమ్ గారు అలా ఆdhaaరంగా తీసుకుని వేసి ఉంటారు అన్న ఆలోచన అది, చాలా వరకూ నిజము కూడా.

      Delete