Pages

Monday, November 4, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 26 . . .

"నిరీక్షణ"
Watercolors on Paper (8" x 11")

గిరీ..కమాన్...గో...గో...గో...అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా "విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి" స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటికప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. "సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్" ఇచ్చిన చేటీ లో రాసింది మైక్ లో చదివాను. "నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు" అంటూ ఒక నిమిషం ఆగి, ఎలా మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తోచక "నేను చెయ్యలేను" అంటూ స్టేజి దిగేశాను, "లేదు నువ్వు చెయ్యగలవు, ఏదో ఒకటి చెయ్యి...కమాన్...డు...సమ్‌థింగ్" అంటూ మళ్ళీ బలవంతంగా నన్ను స్టేజి మీదికెక్కించారు. మరో నిమిషం పాటు తపటాయిస్తూనే మైక్ పట్టుకుని నిలబడ్డాను. "నా వల్లకాదు, ప్లీజ్" అంటూ నిరుత్సాహంగా దిగేశాను. తర్వాత నాతో పోటీలో నిలబడ్డ "ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజి, వాకాడు, నెల్లూరు" విద్యార్ధి ఉత్సాహంగా స్టేజి ఎక్కి అదే చీటీ తీసుకుని చదువుకుని తనకున్న స్టేజి అనుభవం, డ్రామా పోటీలు, ఇంకా తెలుగు కవితల పోటీల్లో నెగ్గిన ప్రతిభ అంతా రంగరించి సరదాగా జోకుల్తో, తెలుగు భాషా యాసా ఛలోక్తుల్తో రక్తి కట్టిస్తూ ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా మాట్లాడి ఆ పోటీ లో నెగ్గి "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్" గా నిలిచాడు.

ఈ పెయింటింగ్ "ఆంధ్ర భూమి" వార పత్రికలో "ఉత్తమ్ కుమార్" ఓ కథకి వేసిన ఇలస్ట్రేషన్ చూసి అలానే వెయ్యాలని చేసిన ప్రయత్నం. వదలి వెళ్ళిపోయిన ప్రియుడిని తలచుకుంటూ ఒక చెట్టుకింద నిలబడి తనలో తాను ఏదో ఆలోచిస్తున్న ప్రియురాలు. ఆ పెయింటింగ్ లో ఆమె ఆనుకుని ఉన్న పెద్ద చెట్టు మొదలుకి వేసిన డీటైల్స్ నన్నమితంగా ఆకర్షించాయి. అందులోని అమ్మాయికన్నా ఆ చెట్టుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దానిపైన ఫోకస్ పెట్టి వేసిన పెయింటింగ్ ఇది. అందుకే అందులో ఉన్నన్ని డీటైల్స్ ఆ అమ్మాయి బొమ్మలో కనిపించవు. "ఉత్తమ్" గారి పెయింటింగ్ కూడా అచ్చు ఇలానే ఉంటుంది. సాధారణంగా పెయింటింగ్ చూసే వాళ్ళ చూపు పెయింటింగ్ మొత్తంలో ఒక విభాగం వైపు వెళ్ళకనే వెళుతుంది, ఆ విభాగం ఎక్కడా అన్నదానికి నిర్దిష్టమైన రూల్ ఉంది. మనకి తెలియకుండానే మన చూపు ఆ విభాగం వైపే వెళ్తుంది. దాన్ని "ది రూల్ ఆఫ్ థర్డ్" అంటారు. మొత్తం పెయింటింగ్ ని 3 x 3 చతురస్రాలుగా విభజిస్తే ఆ నిలువు అడ్డ గీతలు కలిసే చోట మధ్యలో కాకుండా ఎడమ వైపు పైనుంచి రెండవ చతురస్రం కింది కుడి భాగం. చూపరుల చూపు ముందు వెళ్ళేది ఇక్కడికే. కనుక పెయింటింగ్ లో అది ఫోకల్ పాయింట్ అవుతుంది. పెయింటింగ్ లో "కంపోజిషన్" అనేది ఒక నిగూఢ ప్రక్రియ, దాన్ని విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తారు. పెయింటింగ్ ఎంత బాగున్నా ఆ "కంపోజిషన్ థియరీ" ఫాలో కాకుంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వరనీ, అసలిలాంటి థియరీ ఒకటుంటుందనీ ఈమధ్య తెలుసుకున్నాగానీ, అప్పట్లో ఇవేవీ తెలీవు. ఇందులో "కంపోజిషన్" లో, "ది రూల్ ఆఫ్ థర్డ్" నూటికి నూరు పాళ్ళూ కనిపిస్తుంది. డీటైల్స్ కనిపించే ఆ చెట్టు తొర్ర వైపు చూపరుల చూపు వెళ్ళిపోతుంది. అదే ఏ పెయింటింగ్ లోనైనా చూపరుల చూపు పడే విభాగం.

తడబడే అడుగుల్లో నిలకడగా అడుగులు పడటం అన్నది వెళ్ళే దారిలో మన మీద మనకి నమ్మకం కుదిరాకే మొదలౌతుంది. నా పెయింటింగ్ ప్రక్రియలో అలా నిలకడగా పడ్డ అడుగులకి ఒక నిదర్శనం ఈ పెయింటింగ్. అలా కలిగించిన నమ్మకమే నాకు "ఇంటర్ కాలేజియేట్ డెసెన్నియల్ డ్రాయింగ్ కాంపిటిషన్" లో పాల్గొనే కాన్ఫిడెన్స్ నీ ఇచ్చింది. 

"వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ, డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" వేడుకల్లో భాగంగా ఇండియాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆహ్వానించి, వచ్చిన ఇతర కాలేజి వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కల్పించి, వారం రోజుల పాటు మా కాలేజి లో వివిధ రకాల సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల్లో మా కాలేజి గెలిచిన "ఫుట్ బాల్" జట్టులో నేనూ ఉన్నాను. ఫైనల్స్ గెలిచి మేమే విజేతలుగా నిలిచాము. టీమ్ విజయానికి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 10 పాయింట్స్ వచ్చాయి. వ్యక్తిగత పోటీల్లో డ్రాయింగ్, కార్టూన్ విభాగాల్లో నేను పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి మరో 10, 5 పాయింట్స్ సాధించాను.

జీవితంలో స్టేజి ఎక్కి అందరి ముందు నిలబడటం అదే మొదటిసారి. ఎదురుగా అంతమంది స్టూడెంట్స్, ఇంకా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్, పైజ్ స్పాన్సరర్స్. ఎప్పుడూ అసలు మైక్ పట్టుకునిందీ లేదు, అందరి ఎదుట పెదవి విప్పి మాట్లాడిందీ లేదు. అలాంటిది అందరి ముందు నిలబడి "నా క్రియేటివ్ ఐడియాని వాళ్ళకి అమ్మే సేల్స్ మ్యాన్" గా ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడి అందర్నీ అలరించి ఆ పోటీలో నెగ్గాలి. నెగ్గితే "ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్" అవార్డ్ బహూకరిస్తారు. అసలలాంటి పోటీ ఒకటుందనీ ఎవరూ ఊహించ లేదు. చివరిరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముందు ఎవరూ ఊహించని విధంగా అది నిర్వహిస్తున్న "లిటరరీ క్లబ్ మెంబర్స్" అప్పటికప్పుడు "అత్యధికంగా పాయింట్స్ వచ్చిన ఒకరిని ఎంపికచేసి 'ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్' గా అనౌన్స్ చేస్తాం" అని చెప్పి, పాయింట్లు ట్యాలీ చేసి "ఎక్కువ పోటీల్లో నెగ్గి అత్యధిక పాయింట్స్ సాధించిన ఇద్దరికి సమానంగా అత్యధిక పాయింట్స్ వచ్చాయి, కానీ ఒక్కరే చాంపియన్ గా నిలుస్తారు. సరి సమానమైన పాయింట్స్ తో నిలిచిన ఆ ఇద్దరికీ ఇప్పుడు ఫైనల్ పోటీ పెడుతున్నాం" అంటూ ఐదు నిమిషాలు తర్జన భర్జనలు చేసి "ఒక టాపిక్ ఇస్తాం, అనర్గళంగా ఐదు నిమిషాల పాటు తడబడకుండా మాట్లాడాలి, నెగ్గిన వారిదే టైటిల్" అంటూ ప్రకటించటం చక చకా జరిగిపోయాయి. ఉత్కంఠంలో అందరి అరుపుల మధ్య రెండు పేర్లు అనౌన్స్ చేశారు. అందులో నాపేరుండటం చూసి ఆశ్చర్యపోయాను. నిర్వహించిన పోటీల్లన్నిటిల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ పాయింట్స్ వచ్చిన మా ఇద్దరికీ సమానంగా 25 పాయింట్లు చొప్పున వచ్చాయి. మా ఇద్దరి మధ్య పోటీ అప్పటికప్పుడు అందరి సమక్షంలో స్టేజి పైన ఎదుర్కునే ప్రక్రియకి మరి కొద్ది నిమిషాల్లోనే  తెర లేచింది. ఇద్దరి పేర్లు ప్రకటించే ముందు నాకూ ఆసక్తిగానే ఉన్నా, ప్రకటించాక అందులో నా పేరుండటం చూసి నీరుగారిపోయాను, ఎందుకంటే అనర్గళంగా మాట్లాడటం దేవుడెరుగు, అదీ స్టేజి మీద అంతమంది ముందా అని. 

ఏదో పోటీల్లో పాల్గొని రిజల్ట్స్ లో పాల్గొన్న మూడింట్లో నెగ్గిన నా పేరు చూసుకున్నా గానీ, అసలా రోజు మధ్యాహ్నం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందని కూడా నాకు తెలీదు. ఒక గంట ముందు నా క్లాస్ మేట్ "శ్రీధర్" నేను హాస్టల్ కి వెళుతుంటే దార్లో కనిపించి "గిరీ పైజ్ డిస్ట్రిబ్యూషన్, మెయిన్ బిల్డింగ్ పైన హాల్ లో ఉంది, వచ్చి నీ ప్రైజెస్ తీసుకోవాలి." అని చెప్తేనే ఆరోజు మధ్యాహ్నం ఆ ఈవెంట్ ఒకటుందని తెలిసింది. నిజానికి పోటీల్లో నెగ్గిన వాళ్ళకి ఆ సాయంత్రం జరిగే "కాలేజి డెసెన్నియల్ సెలెబ్రేషన్స్ (పది సంవత్సరాల వార్షికోత్సవం)" లో ఒక్కొక్కరినీ స్టేజి మీదికి పిలిచి ఇవ్వాల్సిన బహుమతులు ముందుగానే ఇచ్చెయ్యాలని "లిటరరీ క్లబ్ మెంబర్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్" డిసైడ్ చేశారని కూడా అప్పుడే తెలిసింది. విజయవాడ నగరంలో వివిధ వాణిజ్య రంగాల్లోని వ్యాపారవేత్తలు ఆ ప్రైజెస్ స్పాన్సరర్స్. సాయంత్రం బహుమతులు ఇచ్చేందుకు వాళ్ళకి వీలు కాదని మధ్యాహ్నం ఇచ్చేస్తున్నట్టు ఆరోజు ఉదయం నోటీస్ బోర్డు లో పెట్టారని అక్కడికి వెళ్ళాక తెలిసింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ మధ్యాహ్నం ఈవెంట్ కి రాలేదు. నాకు పోటీల్లో గెలవటంతో వెళ్ళక తప్పలేదు.

అప్పటికే బొమ్మలువేస్తూ, కాలేజి మ్యాగజైన్స్ లో ప్రతి సంవత్సరం నా బొమ్మలు ప్రింట్ అవుతూ, కాలేజిలో అందరికీ నా పేరు తెలియటంతో సహజంగానే డ్రాయింగ్ పోటీలో నా పేరిచ్చాను. కార్టూన్లు ఎప్పుడూ వేసింది లేదు, అయినా మా జూనియర్స్ కొందరి ప్రోత్సాహంతో సరే అన్నాను, వాళ్ళే నా పేరిచ్చేశారు. రెండు పోటీలకీ ఒక పేపర్, పెన్సిల్స్ మాత్రమే ఇచ్చారు, టాపిక్ అప్పటికప్పుడు అనౌన్స్ చేసి డ్రాయింగ్ కి రెండు గంటలు, కార్టూను కి అర గంట సమయం ఇచ్చారు. పరీక్ష లాగా పోటీలో పాల్గొనే అందరూ ఒక రూమ్ లో కూర్చుని ఆన్ ది స్పాట్ ఇచ్చిన సమయంలో గీసి సబ్మిట్ చేసి రావాలి.

కార్టూను పోటీలకి మాత్రం ఒక గంట ముందు నా దగ్గరున్న "ఆర్.కె.లక్ష్మణ్" గారి కార్టూన్ల పుస్తకం తిరగేసుకుని వెళ్ళాను. "కరెప్షన్ ఇన్ పాలిటిక్స్" అనే టాపిక్ ఇచ్చారు. నేను గీసిన కార్టూను బొమ్మ ఇంకా గుర్తుంది. "ఆర్.కె.లక్ష్మణ్" ని అనుకరిస్తూ 3డి లోనే గీశాను. కొన్ని పూరి గుడిశెల మధ్య ఒక ఎత్తయిన భవనం, దార్లో మాట్లాడుకుంటూ ఇద్దరు ఆ భవనం వైపు చూస్తూ వెళ్తూ, ఒకాయన ఇంకొకాయనతో ఇలా అంటుంటాడు, "మొన్నటి దాకా అదీ పూరి గుడిశే, అందులో ఉండే ఆయన ఆ పక్కనున్న పూరి గుడిశె ఓట్లతోనే నెగ్గి రాజకీయ నాయకుడయ్యాడు." అదీ క్యాప్షన్. డ్రాయింగ్ లో గెలుస్తానో లేదో నమ్మకం లేకున్నా, ఇందులో మాత్రం ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఉండింది ఎందుకో. అయితే నాకు ఇందులో "ద్వితీయ బహుమతి" వచ్చింది.

డ్రాయింగ్ పోటీకి ప్రైజ్ స్పాన్సరర్ అప్పటి విజయవాడ, బీసెంట్ రోడ్డు లోని "ఇన్నొవేషన్స్" అని ఒక "ఎంటర్ ప్రైజ్ స్టోర్" వాళ్ళు. ఇచ్చిన టాపిక్ - ఒక "సూట్ కేస్ షో రూమ్" ని 50 "సూట్ కేస్" లతో అలంకరించాలి ఇంటీరియర్ డిజైన్స్ అవీ మీ ఇష్టం, ఒక్కటే రూల్ యాభై సూట్ కేసులు తప్పకుండా ఉండి తీరాలి, దానికి ఏదో ఒక క్యాప్షన్ కూడా రాయాలి". ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో నేను అమితంగా ఎంజాయ్ చేసిన టాపిక్ "పర్స్ పెక్టివ్ డ్రాయింగ్", 3D లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ని అర్ధం చేసుకుని గీయాలి. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్స్ గీసే డ్రాయింగ్స్ అవి, అందరికీ అర్ధం కావు ఆ ప్రిన్సిపుల్స్ అత సులభంగా. నేను అది ఫాలో అవుతూ 3D లో గీశాను, షాపు లోకి ఎంటర్ అవగానే మనకి కనిపించే వ్యూ - మూడు గోడలు, రూఫ్, ఫ్లోర్,  ఫ్లోర్ మీద కార్పెట్, రూఫ్ కి సీలింగ్ ఫ్యాన్స్, అందమైన లైట్స్, మధ్యలో షాన్డిలియర్, ఇంకా ఒకరిద్దరు  సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఇలా. ఇక్కడ ఒక తమాషా సంఘటన ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. సీరియస్ గా డ్రాయింగ్ వేస్తూ ఉంటే, నా బెంచ్ మీద ఒక నలిపిన కాగితం ముక్కొచ్చి పడింది, చూస్తే పక్కనుంచి వెళ్తూ నా క్లాస్ మేట్ "U.V.H. ప్రసాద్", కాలేజి లో అందరూ "బాబాయ్" అని పిలుస్తుండేవాళ్ళం. ఏదో సైగ చేస్తూ వెళ్ళి ఆ పోటీ నిర్వహిస్తున్న స్టూడెంట్ వాలెంటీర్స్ ని మాటల్లో పెడుతున్నాడు. ఏంటా అని పేపర్ విప్పి చూస్తే అందులో ఇంగ్లిష్ లో మూడు క్యాప్షన్స్ రాసి ఉన్నాయి. నివ్వెరపోయాను, ఈ బాబాయ్ కి ఈ పోటీ ఒకటుందని, ఇక్కడ నేను పాల్గొంటున్నానని తెలిసి ఎవరినో అడిగి నాకోసం మూడు క్యాప్షన్స్ రాసి తెచ్చి చిట్టీ నాకందించి వెళ్ళాడని తెలిసి నివ్వెరపోయాను. "బాబాయ్" అంతే, ఎప్పుడు ఎలా ఎవరికి, ఎక్కడ కనిపించి ఆశ్చర్యపరిచేవాడో ఎవ్వరికీ తెలీదు. బాబాయ్ ఇచ్చిన క్యాప్షన్స్ లో ఒక నచ్చిన క్యాప్షన్ కొంచెం మార్చి రాశాను. కాపీ కొట్టానా అన్న ఆలోచన వేధించినా "కొంచెం మార్చి రాశా కదా, అయినా క్యాప్షన్ ఒక్కటి చూసి ఎంపిక చెయ్యర్లే" అని సరిపెట్టుకున్నా. నాకందులో "ప్రధమ బహుమతి" వచ్చింది. ప్రైజ్ గా "నమస్కారం" పెడుతున్న అమ్మాయి అవుట్ లైన్ చెక్కతో కార్వింగ్ చేసిన డెకరేటివ్ బొమ్మ ఇచ్చారు. అది చాలా రోజులు "కావలి, జనతాపేట" లో మా ఇంట్లో వాకిలిపైన నమస్కారం చెపుతూ కనిపించేది. ఆ సెలెబ్రేషన్స్ అయిన పక్క రోజు "ఈనాడు దిన పత్రిక" జిల్లా ఎడిషన్ లో న్యూస్ తోబాటు ప్రైజెస్ తీసుకున్న అందరం స్పాన్సర్స్ తో కలసి నిలబడి ఉన్న ఫొటో ప్రింట్ అయింది. అదే న్యూస్ పేపర్లో నా ఫొటో చూసుకోవటం, చాలా ఆనందం వేసింది, కత్తిరించుకుని దాచుకున్నాను. ఆ ఫొటోలో నా చేతిలో ఈ ప్రైజ్ బొమ్మ ఉంటుంది.

నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజి రెండవ సంవత్సరంలో మొదలుపెట్టిన పెయింటింగ్ ప్రక్రియ ఎడతెరిపి లేకుండా మూడేళ్ళు కొనసాగించాను. అప్పుడు వేసిన పెయింటింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ ఆనాటి కాలేజి సంఘటనలు, సరదాలు, ఫ్రెండ్స్ తో సినిమాలు, కబుర్లు, షికార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏదో తెలియని తపనతో కృషి చేస్తూ వేసిన అప్పటి బుడి బుడి అడుగుల బాటల్లో ఆనాటి తియ్యటి జ్ఞాపకాలని గుర్తుచేస్తూ అప్పటి కాలాన్ని ఇప్పుడు చూపించేవి నా బొమ్మలే. పక్కన కనిపించే స్నేహితులు, మనసులో దాగి ఒదిగి కనిపించని ఒక సున్నిత సన్నిహిత ప్రోత్సాహం, పత్రికలు, పుస్తకాలు తప్ప అప్పటి నా చిన్నిలోకంలో ఇంకేవీ లేదు. 

ప్రోత్సాహం మనిషికి ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది. ఉత్సాహం మనిషిని ముందుకి నడిపిస్తుంది. ఆనాటి నా బొమ్మల్లో ఉన్నవి అప్పటి ఉత్సాహాలే. ప్రోత్సాహ ఉత్సాహాలే అద్భుతాలకి పునాదులు. ఆ పునాదులపై కాలక్రమేణా వెలిసేవే అనుభవాల భవనాలు. ఆ అనుభవాల భవంతుల్లో నివశించిన అనుభూతులే తియ్యని జ్ఞాపకాలు. కదలే కాలం చెదిరినా చెరిగినా కరిగినా, చెదరని చెరగని కరగని జ్ఞాపకాలే జీవితం. ఆ జ్ఞాపకాల వెల్లువలో మునిగి తడిసి మురిసేదే మనసు. . .

"జ్ఞాపకాల వెల్లువలే జీవన సంధ్యా రాగాలు."
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

No comments:

Post a Comment