Pages

Sunday, February 4, 2024

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 17 ...

 
నలభైయేళ్ళ నాటి "సాగర సంగమం" - "బాలు" పాత్రకి జీవం పోసిన "కమల హాసన్"
Pencil on Paper, 1983
Naveen Nagar, Hyderabad

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 16                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 18 -->

సాగర సంగమం - నాకు అమితంగా నచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రం. ఏదైనా ఒక కళాత్మకమైన పనితనాన్ని పరిశీలించి చూస్తే ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక చిన్నపాటి లోపం, లేదా ఇంకాస్త మెరుగ్గా చేసుండొచ్చు అన్నవి కనిపించకపోవు. ఎక్కడా ఏమాత్రమూ మచ్చుకైనా వంక పెట్టలేని పనితీరు మాత్రమే "పరిపూర్ణత్వం" అన్న మాటకి అర్ధంగా నిలుస్తుంది. ఒక్క మనిషి చేసే ఒక పనిలో "పరిపూర్ణత" ని తీసుకురావటం అంత కష్టమేమీ కాదు, ఎందరో ఇది చేసి చూపెట్టారు. కానీ అరవైనాలుగు కళల మిశ్రమం అయిన సినిమాలో ఈ పరిపూర్ణతని సాధించటం చాలా అరుదు. తెలుగులో బహుశా ఈకోవలో ఒకప్పటి "మాయా బజార్" చిత్రం ఎప్పటికీ ముందే నిలుస్తుందేమో. నావరకైతే మాత్రం ఆ తర్వాత "సాగర సంగమం" అలాంటి "పరిపూర్ణత" ని తీర్చిదిద్దుకున్న ఆణిముత్యం, తెరపై తరతరాలకీ చూపించగల అజరామర చిత్రం.

కళ - దేవుడు అడగకనే ఇచ్చే అరుదైన వరం. అలాంటి వరం పొందిన ఒక పసిపిల్లవాడి మనసున్న కళాకారుడికి తన కళకి వెలుగుని చూపగల ఒకే ఒక్క ఆశాకిరణం పరిచయమయిన కొద్ది కాలంకే దూరమవటంతో మసిబారిన జీవితం. ఆ పాత్రలో కమలహాసన్ నటన, శాస్త్రీయ నృత్యకళలో చూపిన హావభావాలు అసమానం, అద్భుతం. అందరి నటీనటుల నటన, సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం, లొకేషన్స్ ఇలా ఈ సినిమాకి అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడి నుంచీ తమ తమ విభాగంలో "పరిపూర్ణత" ని రాబట్టి, అందరి పరిపూర్ణతలనీ కలిపి సంపూర్ణంగా మలచి చూపించిన దర్శకుడు కళాతపస్వి శ్రీ|| కె.విశ్వనాథ్ గారి "పరిపూర్ణ పరిపక్వ సాగరం" - ఈ "సాగర సంగమం".

అప్పుడే 10వ తరగతి పరీక్షలు రాసి 6 సంవత్సరాల గురుకుల పాఠశాల విద్యాభ్యాసం ముగించి మా ఊరు "కావలి" కి వచ్చి ఉన్నా. ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఆ గురుకులంలో ఎలా ఒదిగానో, ఎలా ఎదిగానో నాకే తెలీదు. ఇంకెప్పుడూ ఇల్లు వదిలి దూరంగా ఉండనులే, శలవులయ్యాక మళ్ళీ అంత దూరం స్కూలుకి వళ్ళాల్సిన అవసరం మొదటిసారి లేదు అన్న సంతోషం. అలా వచ్చి కొద్ది రోజులైనా అయిందో లేదో, ఒకరోజు తాతయ్య ఇంటికి వెళ్తే హిందు న్యూస్ పేపర్లో "రావూస్ ట్యుటోరియల్, హైదరాబాద్" వాళ్ళ IAS కీ, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కాలేజి లో ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ పరీక్షకీ కోచింగ్ ప్రకటన చూసి అప్పటికే హైదరాబాద్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్న చిన్నమామయ్య దగ్గర ఉండి కోచింగ్ తీసుకునేలా నన్నూ సెట్ చేసేసి ఒకరోజు నన్ను హైదరాబాదు తీసుకెళ్ళిపోయాడు. నిజానికి హైదరాబాద్ చూడాలన్న కుతూహలం తప్ప నాకా ఎగ్జామ్ రాయలన్న ఉత్సాహం లేనే లేదు. కావలిలో ఇంటిదగ్గరే ఉండి "జవహర్ భారతి" లో ఇంటర్మీడియట్ చదవాలని ఎంతో ఆశగా ఉండేది. అప్పటికే ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూల్ ఆరేళ్ళు, మళ్ళీ రెసిడెన్షియల్ కాలేజి రెండేళ్ళు, ససేమిరా ఇష్టంలేదు, కానీ పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్ప(లే)ని రోజులు, చెప్పినా నెగ్గలేని వయసు. ఆరేళ్ళు శలవులకి వచ్చిన ప్రతిసారీ నేనింకాస్కూలుకి పోను ఇక్కడే చదువుకుంటా అని మళ్ళీ స్కూలుకి వెళ్ళాల్సిన రెండురోజులముందు నుంచీ రోజంతా ఏడుస్తూ అమ్మ వెనకే పడి వేధించిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. నాతో వేగలేక, నన్ను పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోయేది అమ్మ. శలవులయ్యి స్కూలుకి వెళ్ళాల్సిన రోజెలాగూ వచ్చేసరికి నా ఎయిర్ బ్యాగు సర్దుకుని బరువెక్కిన గుండెతో పుట్టెడు శోకం లోపలే అదిమిపెట్టి "కావలి" నుంచి "నెల్లూరు" బస్సెక్కే వాడిని. నెల్లూరు నుంచి రాత్రంతా ప్రయాణం అనంతపూరు కి, అక్కడి నుంచి మళ్ళీ బస్ లో హిందూపురం, అక్కడి నుంచి జట్కా బండిలో సేవామందిరం, అలా కావలి నుంచి దాదాపు 20 గంటల ప్రయాణం, "హిందూపురం" దగ్గర నేను చదివిన "కొడిగెనహళ్ళి గురుకుల విద్యాలయం".

నవీన్ నగర్, హైదరాబాద్ - ఖైరతాబాద్ సెంటర్ లో బస్సు దిగి మెయిన్ రోడ్డు పక్క రోడ్డులో ఒక 20 నిమిషాలు రెండు మూడు వంపులు తిరిగి ఎత్తుగా పైకెళ్ళే రోడ్లు, నడిచి వెళ్తే బంజారా హిల్స్, సరిగ్గా అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి వెనుక ఉన్న రెండవ రోడ్డులో ఒక రెండంతస్థుల బిల్డింగ్ లో కింద ఒక రూమ్ లో చిన్నమావయ్య, ఇంకొక బంధువు సుబ్రమణ్యం మామయ్య ఇద్దరూ ఉండేవాళ్ళు. ఒక రెండునెలలున్నానేమో అక్కడ వాళ్ళతోబాటు. హైదరాబాద్ సిటీలో బస్సెలా ఎక్కాలి, ఎక్కడ ఏ బస్ ఎక్కి ఎక్కడికి ఎలా వెళ్ళాలీ ఇవన్నీ ఒకరోజు నన్ను తనతో తీసుకెళ్ళి తిప్పిమరీ నేర్పించాడు సుబ్రమణ్యం మామయ్య. ఆయనకి నెలవారీ బస్ పాస్ ఉండేది. నాకంటే కొద్ది సంవత్సరాలే పెద్ద, అప్పటికే చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడక్కడ. చిన్నమావయ్య ఆయన్ని సుబ్రమణ్యం అని పిలిస్తే నేనూ అలానే పిలిచేవాడిని, నాకన్నా పెద్ద అయినా. ఆ రెండు నెలల్లో నేను చిన్నమామయ్యతో కన్నా సుబ్రమణ్యం మామయ్య తోనే ఎక్కువగా గడిపాను. రోజూ ఆఫీస్ నుంచి సరిగ్గా టైమ్ కి ఇంటికి వచ్చేసేవాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా నా కోచింగ్ ఒక పూటే, సాయంత్రం వచ్చి నన్ను ఏదో ఒక ప్లేస్ కి తీసుకెళ్తుండే వాడు. అలా నెమ్మదిగా హైదరాబాద్ లో భయం లేకుండా ఒక్కడినే బస్సులు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళగలిగేలా నన్ను తయారుచేశాడు సుబ్రమణ్యం మామయ్య. ఆదివారం సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే తెలుగు సినిమా చూద్దామని పైన ఓనర్ ఇంటికి నన్ను తీసుకెళ్ళేవాడు. ఒక ఆదివారం నేను మొదటిసారి టీవీ లో చూసిన సినిమా యన్.టీ.ఆర్ "రాణీ రత్న ప్రభ". తర్వాత నేను ఇంటర్ ఆంధ్రలొయోలా కాలేజి, విజయవాడలో చేరి హాస్టల్ లో ఉన్న రెండేళ్ళు నాకు ఉత్తరాలు రాస్తుండేవాడు. నాన్నకున్న హాబీని కంటిన్యూ చేస్తూ అప్పటికే నేను స్టాంప్స్, ఫస్ట్ డే కవర్స్, కాయిన్స్ సేకరిస్తుండేవాడిని. ప్రతి ఉత్తరమూ ఫస్ట్ డే కవర్స్ లోనే రాసేవాడు. ఇంటర్ అయ్యాక నా అడ్రెస్ మారి మా ఉత్తరాలకు బ్రేక్ పడింది.

మా రూమ్ లో స్టవ్ ఉండేది. నేనూ చిన్నమామయ్య ఎక్కువగా మెస్ లో తింటుండేవాళ్ళం. అప్పుడప్పుడూ చిన్నమామయ్య చేసేవాడు. నాకప్పటికి వంట చెయటం రాదు. ఒక సారి చిన్నమామయ్య దగ్గర "పప్పు పులుసు" చెయటం నేర్చుకున్నా, "పాలకూర పప్పు" చిన్నమామయ్య చేస్తే చూసి నేర్చుకున్నా. అవి రెండే నాకొచ్చిన కూరలు. ఒకరోజు రాత్రి ఒంటరిగా ఉన్నాను, చిన్నమామయ్య కోసం ఎదురు చూసి చూసి మెస్ లు కూడా మూసేసిన టైమ్ కి వంట చేద్దామని రైస్ వండి, ఆమ్లెట్ వేద్దామని ఒక్కటే గుడ్దు ఉంటే అది కొట్టి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి కలిపాను, పెద్ద ఆమ్లెట్ వస్తుందని ఆశ అంతే. ఆ ఆమ్లెట్ కాస్తా హాంఫట్ అయ్యింది. బహుశా ఆ రాత్రి పస్తున్నానేమో. ఆ విషయం ఒకసారి బామ్మ కి చెప్తే కడుపుబ్బా నవ్వి, "పిచ్చి నాయనా నీళ్ళు పోసేస్తే పెద్ద ఆమ్లెట్ వచ్చేస్తుందా" అని నన్నూ నా వంటనీ ఎప్పుడూ తమాషా చేసేది. టెన్త్ పరీక్షల రిజల్ట్స్ నేను హైదరాబాదులో ఉన్నపుడే వచ్చాయి. మా స్కూల్ లో నలుగురికి టాప్ టెన్ లో స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. నాకూ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, ఎనిమిది మార్కుల్లో మిస్ అయ్యాను. చిన్నమామయ్య న్యూస్ పేపర్ తోబాటు స్వీట్స్ తెచ్చి కంగ్రాట్స్ చెప్పేదాకా రిజల్ట్స్ తెలీదు. మేముంటున్న నవీన్ నగర్ ఇంకొకవైపు నుంచి ఒక ఇరవై నిమిషాలు నడిచెళ్తే ఎర్రమంజిల్ మెయిన్ రోడ్డు పై ఒక నెల్లూరు వాళ్ళ హోటల్ ఉండేది. సండేస్ పొద్దున నేనూ చిన్నమామయ్య వెళ్ళి ఇడ్లీ, దోశ తినేవాళ్లం. తమాషా ఏంటంటే అక్కడ ఇడ్లీ లోకి కారప్పొడి, నెయ్యి, మినుముల పచ్చడి పెట్టేవాళ్ళు. మినుముల పచ్చడి నెల్లూరు స్పెషల్. నెల్లూరులో అందరికీ భలే ఇష్టం. దానికోసమే వెళ్ళేవాళ్ళం. అప్పుడే పది, ఇరవై పైసల నాణేలు కొత్త కొత్త రకాలు "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" కొన్ని నెలలు విడుదల చేస్తుండేది. హైదరాబాద్ లో మాత్రం సర్క్యూలేషన్లో ఉండేవవి కొత్తల్లో. ఆ హోటల్లో చిల్లర తళ తళ మెరుస్తున్న కొత్త కాయిన్స్ ఇచ్చేవాళ్ళు, అన్ని రకాలూ సేకరించానప్పట్లో. అప్పుడప్పుడూ సాయంత్రం ఒక్కడినే అలా బంజారా హిల్స్ అక్కినేని గారి ఇంటి మీదుగా హోటల్ బంజారా దాకా వెళ్తుండే వాడిని, ఎప్పుడన్నా నాగేశ్వర్రావు గారు కనిపిస్తారేమో అని ఆ ఇంటి వైపు చూసేవాడిని, ఇద్దరు మనుషులంత ఎత్తున్న ప్రహరీ పైన ఇనుప కంచె, ఇంటి రెండవ అంతస్తు రూమ్స్ కిటికీలు, కాగితం పూల చెట్లూ మాత్రం కనపడేవి, ఎప్పుడూ గేట్ మూసే ఉండేది, ఒక గార్డ్ కాపలా కూడా.

రావూస్ కోచింగ్ సెంటర్, హిమయత్ నగర్ లో ఉండేది. ఖైరతాబాద్ లో బస్సెక్కి లక్డీ కా పూల్ లో దిగి మరో బస్సెక్కి లిబర్టీ సెంటర్ దగ్గర దిగి 5 నిమిషాలు నడిస్తే చాలు. మొదటి రోజు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు రాజశేఖర్, హరనాథ్. కోచింగ్ కి వెళ్ళిన అన్ని రోజులూ ముగ్గురం రోజూ లిబర్టీ దగ్గర కలిసి అక్కడ ఒక హోటల్ లో ఇడ్లీ భలే ఉంటుందని వాళ్ళే నాకు చెప్తే (నిజంగానే భలే ఉండేది) రోజూ టిఫిన్ చేసి కోచింగ్ కి వెళ్ళేవాళ్ళం. ఒక ఆదివారం ముగ్గురం కలిసి అమీర్ పేట లో "మనిషికో చరిత్ర" సినిమాకెళ్ళాం. తర్వాత నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ లో, వాళ్ళిద్దరూ హైదరాబాద్ లోనే ఏవో కాలేజెస్ లో ఇంటర్మీడియట్ చేరిపోయాం. దార్లు తప్పినా రాజశేఖర్ నేనూ రెండేళ్ళు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, తర్వాత పూర్తిగా తప్పి పోయాం.

ఒకరోజు చిన్నమామయ్య లక్డీ కా పూల్, మీరా డీలక్స్ థియేటర్ లో "సాగర సంగమం" సినిమా సెకండ్ షో కి తీసుకెళ్ళాడు, నాకప్పట్లో ఫైటింగ్ సినిమాలంటేనే ఇష్టం ఉండేది, అయిష్టంగా ఆ సినిమాకెళ్ళాను, అయితే తమాషాగా నేనప్పటికి హైదరాబాద్ లో చూసిన ప్రదేశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయి రవీంద్రభారతి, ఖైరతాబాద్ వినాయక విగ్రహం, బిర్లా మందిర్, హోటల్ అశోక. నాకా సినిమా భలే నచ్చింది. తర్వాత "సితార" పత్రిక నా చేతికొస్తే ఒకరోజు మధ్యాహ్నం ఒక్కడినే ఏమీ తోచక పేపర్, పెన్సిల్ తీసుకుని ఆ పత్రిక ముఖచిత్రం పై ఉన్న కమలహాసన్ బొమ్మ వెయటం మొదలుపెట్టాను. చాలా బాగా వచ్చేసింది, అచ్చు గుద్దినట్టే అనిపించింది. తర్వాత చాలా రోజులు చూసుకుని పొంగిపోయాను. అన్న, నేనున్నానని హైదరాబాద్ చూట్టానికి వస్తే నేనే "సాగర సంగమం" సినిమా భలే ఉంది అని వాడికి చెప్పి మరీ తీసుకెళ్ళాను. అప్పటికే ఎక్కడికైనా సిటీ బస్సులెక్కి భయం లేకుండా తిరగటం వచ్చేసిన నేనే వాడికి అప్పుడు హైదరాబాద్ కి గైడ్. మొదటి జేమ్స్ బాండ్ సినిమా "ఫర్ యువర్ ఐస్ ఓన్లీ" కూడా లక్డీకాపూల్ అమరావతి థియేటర్ లో చిన్నమామయ్యతో కలసి చూశా. నేనూ అన్నా ఇద్దరం కలిసి అబిడ్స్ చెర్మాస్ పక్కన సందుల్లో గుండా లోపలికెళ్తే ఒక థియేటర్ ఉండేది, అందులో "మూన్ రేకర్" కూడా చూశాం. అవే నేను మొదట చూసిన జేమ్స్ బాండ్ సినిమాలు.

అలా నేనున్న, చూసిన హైదరాబాద్ మొదటి అనుభవంలో ఒక మధురమైన అనుభూతి "సాగర సంగమం" సినిమా. తర్వాత పరీక్ష రాసి "కావలి" కి వెళ్ళాక నా చేతికి అందిన "సాగర సంగమం" లోని "కమల్ హాసన్ డ్యాన్స్ స్టిల్స్" ప్రతిదీ పెన్సిల్ తో అప్పట్లో బొమ్మలు వేశాను. ఆ సినిమా అంటే నాకున్న ఇష్టం అభిమానం, U.S. వచ్చిన చాలా ఏళ్ళకి మళ్ళీ 2010 లో బొమ్మలు వెయటం మొదలుపెట్టాక వాటర్ కలర్స్ లో కమల్ హాసన్ నటరాజు డ్యాన్స్ భంగిమ ని వేశాను. ఇంకా కమల్ హసన్ పోర్ట్రెయిట్ కూడా వేశాను. అందులో హీరోయిన్ జయప్రద బొమ్మా వెయ్యాలని ఉండేది, కుదరలేదింకా. 2010 నుంచి దాదాపు పదేళ్ళు ప్రతి సంవత్సరం జనవరి 1 న ఈ సినిమా చూసేవాడిని. చూసిన ప్రతిసారీ అదే "గొప్ప" అనుభూతి. ఆ అనుభూతిని మాత్రం మాటల్లో పెట్టలేను. ఆ సినిమాలో బాలు పాత్రకి అంతగా కనెక్ట్ అయిపోయాను, అంతే. నా మొదటి హైదరాబాద్ అనుభవంలో చూసిన "సాగర సంగమం" సినిమా, ఆ సినిమా చూశాక వేసిన ఈ బొమ్మ ప్రభావం నామీద ఒక జీవితకాలం పడింది. శాస్త్రీయ నృత్యం అంటే ఒకరకమైనా ఆరాధనా ఏర్పడింది. ఓ పదేళ్ళ క్రితం "నృత్యాంజలి" అనే పేరుతో సిరీస్ మొదలుపెట్టి, ఇప్పటిదాకా ఒక యాభై దాకా బొమ్మలూ, పెయింటింగ్స్ వేసి ఉంటాను.

అప్పటిదాకా ఇంత కరెక్ట్ గా నేనేసిన పోర్ట్రెయిట్స్ ఏవీ లేవు, ఇదే ప్రధమం, అదే ఈ బొమ్మ ప్రత్యేకత. తర్వాత వేసిన పోర్ట్రెయిట్స్ అన్నిటికీ ఇదే కొలమానం అయ్యింది. పెన్సిల్ దాటి పెన్ను, అదీ దాటి ఇంకు, ఇంకా పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్ ఇలా వేసిన ఎన్నో పోర్ట్రెయిట్స్ కి వేసిన పునాది - ఈ బొమ్మ నాకు ఇచ్చిన స్ఫూర్తి, నాలో పెంచిన విశ్వాసమే. తర్వాత ఇంజనీరింగ్ రోజుల్లో ఉధృతంగా వేసిన బొమ్మలు, హైదరాబాద్ TCS లో జాబ్ చేస్తున్నపుడు ఆర్టిస్ట్ అయ్యే మార్గాలకోసం హైదరాబాద్ లో నా అన్వేషణలూ ఇలా నా బొమ్మల "సాగరం" లో హైదరాబాద్ సిటీ, ఆ అనుభవాలూ, అనుభూతులూ ఒక అనురాగ "సంగమం". ఇప్పుడు దూరమై పోయినా అప్పుడు తిరిగిన ఆ ప్రదేశాలనీ, కలిగిన అనుభవాలనీ, పొందిన  అనుభూతుల్నీ, పరిచయమయిన మనుషుల్నీ, దగ్గరయిన మనసుల్నీ నిత్యం గుర్తుకి తెస్తూ మదిలో నిరంతరం సంద్రించే "సాగర సంగమం"...

"ప్రదేశాలు మారినా మనుషులు వీడినా, మారని వీడని తొలి అనుభూతుల జ్ఞాపకాలే అనుభవాల సాగర సంగమాలు"
~ గిరిధర్ పొట్టేపాళెం

~~ ** ~~ ** ~~

("నెచ్చెలి" పత్రిక కోసం ప్రత్యేకంగా "బొమ్మల్కతలు" శీర్షికన నెల నెలా మాట్లాడుతున్న నా బొమ్మలు)

నా తొలినాళ్ళ బొమ్మల ప్రపంచంలో జీవం పోసుకుని వెలుగు చూడని నా బొమ్మలకి వెలుగు చూపే ప్రయత్నంలో మాట్లాడి ఆగిన నా కొన్ని "బొమ్మల జీవిత కథలు" నచ్చి, ఆపకుండా ఇదెందుకు కొనసాగించకూడదు అంటూ నన్నడిగి ప్రోత్సహించిన "నెచ్చెలి" పత్రికా సంపాదకులు "శ్రీమతి గీత" గారికి ధన్యవాదాలతో 🙏 ...

No comments:

Post a Comment