Pages

Sunday, July 2, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 ...

 
Portrait of the First Female Indian Prime Minister - Smt. Indira Gandhi
Ballpoint pen on paper 8" x 9"

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 9                                                         నా "బొమ్మలు చెప్పే కథలు" - 11 -->
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్ గా, ఇంగ్లీష్, సంస్కృతం లాంగ్వేజెస్ గా ఇంటర్మీడియట్ (11th & 12th Grade) విజయవాడ "ఆంధ్ర లొయోలా కాలేజి" లో ఉత్సాహంగా చేరా. అప్పట్లో లొయోలా కాలేజి లో సీట్ రావటం కష్టం. పదవ తరగతిలో చాలా మంచి మార్కులు తెచ్చుకోవటంతో, నాన్ లోకల్ అయినా నాకు  సులభంగా నే సీట్ వచ్చింది, చేరిపోయాను. ఆ కాలేజి లో చదివింది రెండేళ్ళే. కాలేజి ఆఫర్ చేయ్యని ఇంకో సబ్జెక్ట్ లో కూడా అక్కడ నాకు నేనుగా చేరిపోయాను. అదే "ఆర్ట్ సబ్జెక్ట్". చదవే మూడ్ లేని, ఏమీ తోచని సమయాల్లో ఒక్కడినే "గోగినేని హాస్టల్ రూమ్" లో కూర్చుని "ఆర్ట్ సబ్జెక్ట్" లో దూరి బొమ్మలు వేసుకునేవాడిని. ఆ రెండు సంవత్సరాల్లో అలా ఒక పదీ పన్నెండు దాకా బొమ్మలు వేసి ఉంటానేమో. ఆ బొమ్మల్లో అప్పుడావయసుకుకి నైపుణ్యం చాలానే ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. వేసిన బొమ్మలన్నీ పుస్తకాల్లోనే దాగి భద్రంగా ఉండేవి. బొమ్మలన్నీ ఒకదగ్గర చేర్చిపెట్టుకునే ఫైల్ లాంటిదేదీ ఉండేదికాదు. కొన్ని అప్పటి పుస్తకాల్లోనే ఉండిపోయి వాటితో పోగొట్టుకున్నాను. అయినా వేసిన ప్రతి బొమ్మా గుర్తుందింకా. అప్పుడు వేసిన బొమ్మల్లో ప్రముఖమైంది ఈ అప్పటి భారత ప్రధాని "శ్రీమతి ఇందిరా గాంధి" గారిది.

గతం లోకి - 1983-85, విజయవాడ "ఆంధ్ర లొయోలా కాలేజి"

గుణదల "మేరీమాత" కొండల క్రింద, ఆహ్లాదంగా ఎటుచూసినా పచ్చదనం, అత్యుత్తమమైన క్లాస్ రూమ్ లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆట స్థలాలతో అందమైన క్యాంపస్. ప్రవేశం పొందగలిగే ప్రతి హాస్టలర్‌ కు సింగిల్ రూములతో ఉత్తమ కళాశాల భవనాలు. కాలేజీలో అడ్మిషన్ పొందడం ఎంత కష్టమో, హాస్టల్‌లో అడ్మిషన్ పొందడం కూడా అంతే కష్టం. ఓవల్ ఆకారంలో ఉన్న మూడంతస్తుల హాస్టల్ భవనాలు, ఒక్కో అంతస్తులో వంద చొప్పున మొత్తం మూడొందల సింగిల్ రూమ్ లు అన్ని రకాల సౌకర్యాలను కలిగి, సెంటర్ గార్డెన్‌లు, రుచికరమైన ఆంధ్ర ఫుడ్ వండి వడ్డించే విశాలమైన డైనింగ్ హాళ్లు ఉండేవి.

అక్కడి లెక్చరర్స్ కూడా వాళ్ళ సబ్జక్ట్స్ లో నిష్ణాతులు, కొందరు టెక్స్ట్ బుక్స్ ఆథర్స్ కూడా. అలా ఆ కళాశాల విద్యార్థులకు ఉత్తమమైన క్యాంపస్ అనుభవాన్ని అందించి ఇచ్చింది. వాస్తవానికి, మధ్యతరగతి కుటుంబాలకు ఆ కాలేజ్ లో చదవటం ఆర్ధికంగా అప్పట్లో చాలా భారం. కానీ మా అమ్మ "కావలి" లో గర్ల్స్ హైస్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తూ వచ్చే కొద్దిపాటి జీతంలో సగానికి పైగా నా నెలవారీ హాస్టల్ బిల్లుకే పంపించేది. అక్కడి క్రమశిక్షణ కూడా అంత ఉత్తమంగానే ఉండేది. హిందీ, ఇంగ్లీషు మాట్లాడే నార్త్ ఇండియా నుంచి వచ్చిన విద్యార్థులే సగం మంది ఉండేవాళ్ళు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జక్ట్స్ లో పర్ఫెక్ట్ స్కోర్లు సాధించాలనే ఒత్తిడి చాలా ఉండేది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి రావడం తో నాలాంటి విద్యార్థులపై అది మరింత ఎక్కువగా ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకునేందుకు మంచి స్నేహితులు ఇద్దరు ఎప్పుడూ పక్కనే ఉన్నా, అప్పుడప్పుడూ ఒంటరిగా హాస్టల్ రూమ్ లో ఉన్నపుడు నాకు నాతో తోడై ఉండే నేస్తాలు "నా బొమ్మలు".

నా కొత్త డ్రాయింగ్ నేస్తం - బాల్‌పాయింట్ పెన్

ఎక్కడ ఉన్నా బొమ్మలు గీయటం మానని నాకు "ఆంధ్ర లయోలా కాలేజి" క్యాంపస్‌లోనూ బొమ్మల జ్ఞాపకాలున్నాయి. నా బొమ్మల్లో గీతలు అక్కడే చాలా మెరుగయ్యాయి. అప్పటిదాకా పెన్సిల్ తో బొమ్మలేసే నేను, ఇంకొకడుగు ముందుకేసి బాల్ పాయింట్ పెన్ను తో వెయటం మొదలు పెట్టాను. పెన్సిల్ లా చెరపటం కుదరదు కాబట్టి ప్రతి గీతా ఖచ్చితంగా అనుకున్నట్టే పడి తీరాలి. అంటే ఎంతో ఓపికా, నేర్పూ కావాలి.

శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ, భారత ప్రధాని

అప్పటి ఆ జ్ఞాపకాలని గుర్తుచేస్తూ మనసు తలుపులు తట్టే నా బాల్ పాయింట్ పెన్ను బొమ్మ భారత ప్రధాని "శ్రీమతి ఇందిరా గాంధీ" గారిది. నేను ఆ కాలేజి లో ఉన్నపుడే అక్టోబర్ 1984 లో హత్యకు గురయ్యారు. ఒకటి రెండు రోజులు క్లాసులు లేవు, హాస్టల్ నుంచి కూడా మమ్మల్ని బయటికి రానివ్వలేదు. విజయవాడ లో సిక్కులు కొంచెం ఎక్కువగానే ఉండేవాళ్ళు, మా కాలేజి లో కూడా స్టూడెంట్స్ ఉండడంతో హై అలర్ట్‌ ప్రభావం మా కాలేజి క్యాంపస్ లోనూ ఉండింది కొద్ది రోజులు.

ఆ దురదృష్టకర సంఘటన తర్వాత కొన్ని నెలలపాటు ప్రతి పత్రిక ముఖ చిత్రం పైనా "ఇందిరా గాంధి" గారి ఫొటోనే ఉండింది. ఆ సంవత్సరం సంక్రాంతి శలవులకు "కావలి" ఇంటికి వచ్చినప్పుడు మా పక్కింటి కల్లయ్య మామ దగ్గర "న్యూస్ వీక్ (ఇంగ్లీషు)" వారపత్రిక ఉంటే చదవాలని తీసుకున్నాను. కవర్ పేజీ పై "ఇందిరా గాంధి" గారి ఫొటో చూసి, ఆమె బొమ్మ వెయ్యాలనిపించింది. ఆ పోర్ట్రెయిట్ ఫొటో చాలా ఆర్టిస్టిక్ గా అనిపించింది. ఆ ముఖచిత్రం ఆధారంగా వేసిందే ఈ బొమ్మ. ఇవన్నీ ఆ బొమ్మ వెనకున్న జ్ఞాపకాలు. అయితే ఈ బొమ్మ చూసినప్పుడల్లా ఇప్పటికీ గుర్తుకొచ్చే మర్చిపోలేని జ్ఞాపకం ఇంకొకటుంది. 

నా చేతుల్లోనే ముక్కలై చిరిగి పోయిన పూర్తికాని అదే "ఇందిరా గాంధి" గారి బొమ్మ

వేసిన ప్రతి చిన్న బొమ్మనీ ఎంతో భద్రంగా చూసుకుంటూ దాచుకునే అలవాటు చిన్నప్పటినుంచీ ఉంది. మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడిని. అప్పటి నా అతిచిన్న లోకంలో నా బొమ్మలే నా ఆస్తులూ, నా నేస్తాలూ.

ఈ బొమ్మ నాకెంతో సంతృప్తిని ఇచ్చినా ఎందుకో కొంచెం అసంతృప్తి మాత్రం ఉండిపోయింది. కారణం, ఏదో సాదా సీదా నాసిరకం నోట్ బుక్ పేపర్ మీద క్యాజువల్ గా మొదలు పెట్టి పూర్తి చేసేశాను. అక్కడక్కడా నేను వేస్తున్నపుడే గుర్తించినా సరిదిద్దలేని కొన్ని లోపాలు ఉండిపోయాయి. మొదటిసారి బ్లాక్ అండ్ రెడ్ రెండు బాల్ పాయింట్ పెన్స్ తో ప్రయోగాత్మకంగా వేసినా, బానే ఉంది అనిపించినా, ఎందుకో ఇంకాస్త పెద్దదిగా జస్ట్ బ్లాక్ పెన్ తో వేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తూఉండేది, చూసిన ప్రతిసారీ. కానీ వేసిన బొమ్మని మళ్ళీ రిపీట్ చెయ్యాలంటే ఏ ఆర్టిస్ట్ కి అయినా చాలా కష్టం. అలా వేద్దామా వద్దా అన్న సందిగ్ధానికి ఒకరోజు మా పెద్దమామయ్య "ప్రజ" (ప్రభాకర్ జలదంకి) ప్రోత్సాహం తోడయ్యింది. ఈ బొమ్మ చూసి "అబ్బా గిరీ ఏం వేశావ్ రా. ఇది గాని "పెండెం సోడా ఫ్యాక్టరీ" (కావలి సెంటర్ లో చాలా పేరున్న ఇంకెక్కడా అలాంటి సోడా, సుగంధ పాల్ దొరకని ఏకైక షాప్) ఓనర్ కి ఇస్తే (ఓనర్ పేరు తెలీదు) ఫ్రేం కట్టించి షాప్ లో పెట్టుకుంటాడు. వాళ్ళకి నెహ్రూ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. కావలి టౌన్ మొత్తం నీ బొమ్మని చూస్తారు." అంటూ వాళ్ళకిద్దామని అడిగేవాడు. కష్టపడి వేసిన బొమ్మ ఇవ్వాలంటే నాకు మనస్కరించలా. అయినా మళ్ళీ మళ్ళీ అడిగేవాడు - "నువు నీ బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే ఏం వస్తుంది రా? వాళ్ళకిస్తే అందరూ చూసి నీ బొమ్మని మెచ్చుకుంటారు. అంతా ఎవర్రా ఈ గిరి అని మాట్లాడుకుంటారు." అని ఇంత గొప్పగా చెప్పేసరికి నేనూ ఆ ఆలోచనతో చాలా థ్రిల్ అయ్యాను, నా ఆర్ట్ వర్క్ "టాక్ ఆఫ్ ది టౌన్" అవుతుందని ఊహించి సంతోషించాను. అయినా సరే, ఇది మాత్రం ససేమిరా ఇవ్వదల్చుకోలేదు.

సరే ఎలాగూ లోపాలేవీ లేకుండా ఇంకోటీ వేద్దామా అని అనుకుంటున్నా, వేసి అదే ఇద్దాంలే అనుకుని ఈసారి అనుకున్నట్టే పెద్ద సైజ్ చార్ట్ పేపర్ (డ్రాయింగ్ పేపర్) పై ముందుగానే పెన్సిల్ తో సరిదిద్దుకుంటూ లోపాలు లేకుండా స్కెచ్ వేసుకుని, తర్వాత బాల్ పాయింట్ పెన్ తో అసలు బొమ్మ వేస్తూ ఫినిష్ చెయటం మొదలు పెట్టాను. పోర్ట్రెయిట్ లలో హెయిర్ వెయ్యటం అంటే నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది మొదటి నుంచీ. మొదట వేసిన ఈ బొమ్మ క్యాజువల్ గా మొదలెట్టి పూర్తి చేసింది గనుక హెయిర్ మీద అంత శ్రద్ధ పెట్టినట్టు అనిపించదు. కానీ రెండవసారి వేస్తున్న బొమ్మ మాత్రం లో హెయిర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వేశాను. ప్రతి గీతా ఎంతో ఫోకస్ తో చిన్న లోపం కూడా లేకుండా వేసుకుంటూ తల పైభాగం పూర్తి చేసి, ముఖం పైనుంచి కిందికి ముక్కు దాకా సగ భాగం పూర్తి చేశాను. మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం గర్వంగానూ అనిపించేది, బాగా చాలా వేస్తున్నానని.

అలా ఉదయాన్నే ప్రతిరోజులానే అమ్మ, తను అప్పట్లో పనిచేస్తున్న "గర్ల్స్ హైస్కూల్" కీ, అన్నేమో బజారుకీ వెళ్ళటంతో ఒక్కడినే ముందు వరండాలో దీక్షగా కూర్చుని బొమ్మ వేస్తూ ఉన్నా. బహుశా అప్పటిదాకా ఒక నాలుగు గంటలు కూర్చుని వేస్తూ ఉన్నాను. ఇంతలో అన్న తన ఫ్రెండ్ "సంజీవ రెడ్డి" తో కలిసి ఇంటికి వచ్చాడు. సంజీవ్ ఈ లోకంలో ఏదైనా ఇట్టే మాటల్లో చేసిపారెయ్యగల గొప్ప మాటకారి. వచ్చీ రాగానే వేస్తున్న నా బొమ్మ చూసి మొదలుపెట్టాడు. "ఏం గిర్యా...నేంగూడా...చిన్నపుడు బొమ్మలు బలే ఏసేవోడ్నయా...ఇప్పుడు కొంచెం తప్పొయిందిగాన్యా... కూసున్నాంటే...యేశాస్తా ఎంత పెద్ద బొమ్మైనా...అంతే" ఇలా మాటలలోకం లో మమ్మల్ని తిప్పుతూ పోతున్నాడు. నాకేమో దీక్షగా కూర్చుని వేసుకుంటుంటే వచ్చి వేసుకోనీకుండా ఆపి ఆ మాటల కోటలు చుట్టూ తిప్పుతుంటే, తిరగాలంటే కొంచెం అసహనంగానే ఉన్నా, గబుక్కున మంచినీళ్ళు తాగొద్దమని లేచి రెండు నిమిషాలు గీస్తున్న బొమ్మ పక్కన బెట్టి లోపలికెళ్ళా. వచ్చి చూసే సరికి చూసి షాక్ తిన్నా. నాకింక ఏడుపొక్కటే తక్కువ. అలా నేనక్కడ లేని ఆ రెండు నిమిషాల్లో కూర్చుని ఇంకా వెయ్యాల్సిన ముఖం కింది భాగం పెన్సిల్ అవుట్ లైన్ మీద, పెన్ను తో వంకర టింకర బండ లావు లావు గీతలు చెక్కుతూ ఉన్నాడు. నన్ను చూసి "ఏం గిర్యా...ఎట్టేశా...చూడు...నీ అంత టైం పట్టదులేవయా నాకా...బొమ్మెయటానిక్యా... మనవంతా...శానా ఫాస్టులే..." అంటూ ఇంకా పిచ్చి గీతలు బరుకుతూనే ఉన్నాడు. నా గుండె ఒక్కసారిగా చెరువై కన్నీళ్లతో నిండిపోయింది. కష్టపడి ఒక్కొక్క గీతా శ్రద్ధగా గీస్తూ నిర్మిస్తున్న ఆశల సౌధం కళ్లముందే ఒక్కసారిగా కూలిపోయింది. అకస్మాత్తుగా ఆశల వెలుగు శిఖరం పైనుంచి చీకటి అగాధంలో నిరాశ లోయల్లోకి బలవంతంగా తోసేసినట్టనిపించింది. కానీ అన్న ఫ్రెండ్, నా కోపమో, బాధో వెళ్ళగక్కేంత ఇదీ లేదు. మౌనంగా  లోపలే రోదిస్తూ ఆ క్షణాల్ని దిగమింగక తప్పలేదు.

తర్వాత అమ్మ ఇంటికి వచ్చాక అమ్మకి చూపించి కష్టపడి వేసుకుంటున్న బొమ్మని పాడుచేశాడని ఏడ్చా. కన్నీళ్లతో నిండిన బాధా, కోపంతో ఆ బొమ్మని ముక్కలుగా చించి పడేశా. అప్పట్లో ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో నా కోపం అమ్మ మీద, అన్నం మీద చూపెట్టేవాడిని. అలిగి అన్నం తినటం మానేసే వాడిని. ఎంత మొరపెట్టుకున్నా అమ్మ మాత్రం ఏం చెయ్యగలదు. "సంజీవ్ వస్తే నేను అడుగుతాన్లే. మళ్ళీ వేసుకుందువులే నాయనా." అంటూ నన్ను ఓదార్చటం తప్ప. అయితే అన్నకి మాత్రం అమ్మ తిట్లు పడ్డాయ్, ఫ్రెండ్స్ తో తిరుగుడ్లు ఎక్కువయ్యాయని, ఆ టైమ్ లో ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చాడనీ. అయినా అన్న మాత్రం ఏం చేస్తాడు పాపం. వాడూ జరిగినదానికి బాధ పడ్డాడు. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు మాత్రం చాలా రోజులు పట్టింది. అసలు ఉన్నట్టుండి వేస్తున్న బొమ్మ వదిలి ఎందుకు లేచి లోపలికెళ్ళానా, వెళ్ళకుండా ఉంటే అలా జరిగేదికాదని తల్చుకుని తల్చుకుని మరీ బాధపడ్డ క్షణాలెన్నో...

రెండవసారి అదే "ఇందిరా గాంధి" గారి బొమ్మ కష్టం అనిపించినా "కావలి టాక్ ఆఫ్ ది టవున్" అవుతుందన్న ఆశతో మొదలుపెట్టా. మళ్ళీ మూడవసారి వేద్దామా అన్న ఆలోచన మాత్రం అస్సలు రాలా. మొదటేసిన ఈ బొమ్మని మాత్రం పెద్దమామయ్య అడిగినట్టు "పెండెం సోడా ఫ్యాక్టరీ" వాళ్ళకి ఇవ్వదల్చుకోలా. ఏదేమైనా "టాక్ ఆఫ్ ది టవున్" అవుతాననుకున్న చిన్న మెరుపులాంటి చిగురాశ అలా మెరిసినట్టే మెరిసి చటుక్కున మాయమయ్యింది. అలా నేనేసిన ఒకేఒక్క "ఇందిరా గాంధి" గారి బొమ్మగా నా బొమ్మల్లో ఇప్పటికీ నా దగ్గర భద్రంగానే ఉంది, చూసిన ప్రతిసారీ ఆ జ్ఞాపకాల్నీ, ఇంకా బాగా వెయ్యాలని పడ్ద తపననీ, ఆ కష్టాన్నీ, తెచ్చిన రవ్వంత చిగురాశనీ, వెన్నంటే వచ్చిన కొండంత నిరాశనీ గుర్తుకి చేస్తూ...

"ప్రతి బొమ్మ వెనుకా ఖచ్చితంగా ఓ కథ ఉంటుంది, కొన్ని బొమ్మల్లో చిత్రకారుడి కన్నీటి చుక్కలూ దాగుంటాయి."
~ గిరిధర్ పొట్టేపాళెం

No comments:

Post a Comment