Pages

Saturday, May 6, 2023

వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 8 ...

"Dark and Light"
Indian Ink on Paper (8" x 12")

<-- నా "బొమ్మలు చెప్పే కథలు" - 7                                                          నా "బొమ్మలు చెప్పే కథలు" - 9 -->

ఇండియన్ ఇంక్‌
- అప్పట్లో ఈ ఇంక్ చాలా పాపులర్. ప్రత్యేకించి బ్లాక్ అండ్ వైట్ స్కెచింగ్ చెయటానికి ఎక్కువగా ఈ ఇంక్ నే వాడేవాళ్ళు. ఇంచుమించు అన్ని బుక్ షాపుల్లోనూ దొరికేది. ఆరోజుల్లో ఎవరో ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ వాడని ఇంక్ అయినా అంత సులభంగా అన్ని చోట్లా దొరికేది అంటే, దాని వాడకం చాలా పురాతనమై ఉండాలి. ఆర్ట్ కే కాకుండా ఇంకా చాలా విధాలా వాడుకలో ఉండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకూ ఆర్టిస్టులు స్కెచింగ్ కి ఎక్కువగా వాడేవాళ్ళు. చిక్కని అసలు సిసలు నల్లని డ్రాయింగ్ ఇంక్ కావాలంటే అప్పట్లో దీన్ని మించింది లేదు. చాలా మంది అర్టిస్ట్ లు బ్రష్ ముందు భాగం ఉండే కుంచెకి బదులు నిబ్ మాత్రమే ఉండి డమ్మీ పెన్ను లా ఉండే దాంతో ఈ ఇంక్ లో ముంచి లైన్ డ్రాయింగ్ వేసేవాళ్ళు. నేనూ ఇండియన్ ఇంక్ తో చాలా బొమ్మలు వేశాను. కానీ లైన్ డ్రాయింగ్ లు కాదు. అన్నీ కుంచె తో వేసిన నలుపు తెలుపు పెయింటింగ్సే.

నాకు ఊహ తెలిసి మొట్టమొదట నేను చూసిన ఇండియన్ ఇంక్ తో వేసిన బొమ్మ నాన్న వేసిన "అబ్రహామ్ లింకన్ పోర్ట్రెయిట్". నల్లని కోటు, తెల్లని టై తో నాన్న వేసి ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడకి తగిలించి ఉన్న ఆ బొమ్మ లో తెలుపు కన్నా నలుపే ఎక్కువ భాగం ఉండేది. తర్వాత ఆ ఇంక్ బుడ్డి మొదటిసారి చిన్నమామయ్య దగ్గర చూశాను. రెండు ఇంచుల ఎత్తు పిరమిడ్ ఆకారంలో ఉండే ప్లాస్టిక్ లేదా గ్లాస్ బుడ్డిలో దొరికేది. నేనూ ఒకటి కావాలని మా "కావలి - చెల్వపిళ్ళ బుక్ షాప్" లో కొనుక్కుని దాంతో చాలా బొమ్మలేశాను. 

ఇండియన్ ఇంక్‌ చాలా చిక్కగా ఉండేది, ఎక్కువసేపు మూత తీసిపెడితే మెల్లిగా అంచులకి అంటుకున్న ఇంక్ గడ్డకట్టుకుపోయేది. ముంచిన బ్రష్ కాసేపు అలా గాలికి పెట్టినా ఎండి పోయి బ్రష్ కూడా పాడయ్యేది. ఒకసారి గడ్డకడితే ఇక అది నీళ్ళలోనూ సరిగా కరిగేది కాదు. అంటే అది ఖచ్ఛితంగా "వాటర్ కలర్" మాత్రం కాదు అని అర్ధం అయ్యింది నాకు - కేవలం అనుభవంతోనే. నేను పెన్సిల్, పెన్నూ, స్కెచ్ పెన్నులూ...ఇంకా ఏ డ్రాయింగ్ మెటీరియల్ అయినా దాన్ని పెయింటింగ్ లానే వాడే వాడిని. బహుశా పెయింటింగ్స్ అంటే ఉన్న ఆసక్తి అలా అంతర్లీనంగా లోపల ఉండిందేమో అప్పట్లోనే. ఇండియన్ ఇంక్ తోనూ కొన్ని నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసి బ్యాక్ గ్రౌండ్ వేసిన బొమ్మలు లేకపోలేదు. ఉదాహరణ కి ఈ బొమ్మలో ఉన్న పలుచని జ్యూయెలరీ అండ్ లైట్ షేడ్స్ అలా వేసినవే.

నేనేసిన ఇండియన్ ఇంక్ బొమ్మల్లో ఈ బొమ్మ నాకెంతో ఇష్టం. అప్పటికి కాలేజి రోజుల్లో వాటర్ కలర్ తో కుస్తీలు పట్టి సాధించిన అనుభవం తో కొంచెం పెయింటింగ్ లో మెళకువలు తెలుసుకున్నాను. ఆ మెళకువలు మేళవించి ఇండియన్ ఇంక్ తో సులభంగా 1992లో పూర్తిగా బ్రష్ తోనే వేసిన పెయింటింగ్ ఇది. అప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి అయ్యి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న రోజులు. ఈ పెయింటింగ్ చూసినపుడల్లా, అప్పటి రోజులు ఇప్పటికీ ఇంకా నిన్నలానే అనిపిస్తూ నా జ్ఞాపకాల తరంగాల్లో నిత్యం వచ్చి నన్ను పలరించి వెళుతూ ఉంటాయి,

అది నా జీవితంలో కాలంతో వేగంగా పరుగులు తీసున్న అత్యంత రద్దీ కాలం. వారానికి ఆరు రోజులు జాబ్ చేస్తూనే  మాసబ్‌ట్యాంక్‌ JNTUలో పార్ట్‌టైమ్ M.Tech చేస్తున్నాను. నేను ఐదో క్లాస్ లో ఉన్నపుడు నన్ను M.tech చెయించాలన్న నాన్న కోరిక అది. B.Tech అయిన వెంటనే జాబ్ లో చేరిపోయానని, "నాయనా గిరీ మీ నాన్న కోరిక అది, ఎలాగైనా M.Tech చెయ్యి, మీ నాన్న కోరిక నెరవేర్చు." అని నాన్న నా గురించి తాతయ్య కి చెప్పి వెళ్ళిపోయిన ఆ మాటని తన బాధ్యతగా నాకు తాతయ్య పదే పదే గుర్తుచేస్తూనే ఉండేవారు.

పొద్దున 8 గంటలకి బయటపడితే ఇంటికొచ్చేసరికి రాత్రి 11 అయ్యేది. ఒక్కోసారి ఆఖరి సిటీ బస్ దొరికేది. కొన్ని సార్లు బస్సులకోసం వెయిట్ చేసీ చేసీ అవి రాక, ఒకవేళ వచ్చినా కాలు పెట్టేందుక్కూడా సందులేక ఫుట్ డోర్ స్టెప్స్ పై కాళ్ళు, గాల్లో వేళాడే బాడీలు అన్నంత కిక్కిరిసిన జనంతో దొరక్క కిలోమీటర్ల కొద్దీ పరుగు లాంటి నడక సాగించేవాడిని. చాలాసార్లు రాత్రి 10:30 కి మూసేసే మెస్ ఆఖరి ఎంట్రీ నాదే ఉండేది, తర్వాత తలుపులు మూసేసే వాళ్ళు. కొన్ని సార్లు అలా మూసేసిన మెస్ మిస్ అయ్యి డిన్నర్ లేకుండానే ఆకలితో బ్యాచిలర్ గా ఫ్రెండ్స్ తో కలిసుండే రూము కి చేరుకున్న రోజులూ ఇంకా గుర్తే. పొద్దున్నే మళ్ళీ కాలంతో పరుగులు. ఇక నాకంటూ మిగిలేది వారంలో కేవలం ఒక్క ఆదివారం మాత్రమే. ఆ ఒక్క రోజూ ఫ్రెండ్స్ తో సినిమాకో, షికారుకో వెళ్ళినా పొద్దున్నే కొంత టైమ్ నాది అన్నట్టు నాతోనే కట్టి పెట్టుకుని అప్పుడప్పుడూ బొమ్మల్లో మునిగి తేలే వాడిని. పూర్తి అయ్యాక చూసి "భలే వేశావ్ గురూ" అనే ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఒక్కటే తృప్తి గా అనిపించేది, నా చుట్టూ ఉన్న లోకం అంతే అప్పుడు. నా బొమ్మల్ని చూపెట్టటానికి నాకున్న వీక్షకులూ, నా అభిమానులూ, కళాభిమానులూ అన్నీ వాళ్ళే .

ఆ మహానగరం లో అన్ని పరుగుల్లోనూ న్యూస్ పేపర్ చూసి తెలుసుకునే, "రవీంద్ర భారతి" ఆనుకునే ఉన్న ఆర్ట్ గ్యాలరీ లోనో, ఇంకా హైద్రాబాద్ లో అప్పుడప్పుడూ, అక్కడక్కడా ఎక్కడో ఒకక్కడ జరిగే ఏ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ నూ మిస్ అయ్యేవాడిని కాదు. ఒక్కడినే, ఎంత దూరం అయినా, వెళ్ళి చూసి వచ్చే వాడిని. అప్పట్లో మ్యాగజైన్స్ కి బొమ్మలు వేసే ఆర్టిస్టులు, ఇంకా ఇలస్ట్రేటర్‌లనీ కలవడానికి కూడా చాలా ప్రత్నిస్తుండే వాడిని. ఆ ప్రయత్నాలూ, ఆ కలలూ ఏవీ పెద్దగా ఫలించలేదు. ఎంతో కష్టపడితే "ఆంధ్రభూమి వారపత్రిక" లో "కళా భాస్కర్ ఎంకి" శీర్షికన బొమ్మలు, ఇంకా ఇలస్ట్రేషన్స్ వేసే ఒక్క "కళా భాస్కర్" గారిని మాత్రమే, వెతుక్కుంటూ అందరినీ అడిగి అడిగి వెళ్ళి చిక్కడపల్లి లో ఆయన ఉంటున్న ఒక చిన్న రూము లో కలవగలిగాను. చాలా ఆప్యాయంగా ఆయన రాబోయే సంచికలకి వేస్తున్న బొమ్మలన్నీ చూపెట్టారు. "ఎంకి" సిరీస్ ఒక మైలు రాయి దాటుతున్న సందర్భంగా ఫుల్ పేజి లో కలర్ లో "కళా భాస్కర్ ఎంకి" వస్తుందని పూర్తి అయిన ఆ పెయింటింగ్ కూడా చూపెట్టారు, చాలా అద్భుతంగా ఉందది. కానీ తర్వాత ఆంధ్రభూమి లో ఆ బొమ్మ వచ్చినట్టు గానీ చూసినట్టుగానీ గుర్తులేదు.

చివరికి ప్రతి ఆదివారం "కోఠీ" లో సాయంత్రం ఫుట్ పాత్ లపై పెట్టే పాత మ్యాగజైన్స్ కోసం పనిగట్టుకుని వెళ్ళి మరీ ఏవైనా పెయింటింగ్స్ మీద మ్యాగజైన్స్ దొరుకుతాయా అని అంతా, అన్నీ గాలించేవాడిని. "ఏవైనా ఆర్ట్ మీద పుస్తకాలూ, మ్యాగజైన్స్ ఉన్నాయా" అని అడిగితే, "ఆ పక్కకి వెళ్ళి చూడు అనో, లేదా వీటిల్లో నువ్వే చూసుకో" అనే సమాధానం వచ్చేది. అప్పుడప్పుడూ కొన్ని దొరికేవి - అమెరికన్, యూరోపియన్ ఆర్ట్ మ్యాగజైన్స్ ఎలా సంపాదించే వాళ్ళో కానీ కొన్ని సార్లు కొందరు అమ్మే పాత మ్యాగజైన్స్ లో వెదికితే కనపడేవి. అలా కనపడినవి చాలానే కొన్నాను. అప్పటికి నాదంటూ ఒక సంపాదన ఉండేది కనుక వెలెంతైనా డబ్బులకి వెనకాడే వాడినే కాదు. అలా కొన్నవన్నీ ఇప్పటికీ నా దగ్గర భద్రంగానే ఉన్నాయి. వాటిల్లో పెయింటింగ్స్ చూసి అలా వెయ్యాలంటే ఎలాంటి మెటీరియల్ కావాలో, ఎక్కడ దొరుకుతుందో తెలియక, అలా ఎప్పటికైనా వెయ్యాలనీ, ఆ రోజులు రాకపోతాయా అని మాత్రమే అప్పటికి సరిపెట్టుకోవాల్సిన రోజులవి. "Information Age" ఎంతో దూరంలో లేకున్నా, అప్పటికింకా ఆ సమయం రాని ఆ కాలం, ఆ రోజులు - ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు పెయింటింగ్ లో మెళకువలు ఎవరిదగ్గరయినా నేర్చుకోవాలని పడ్డ తపనా, వేదనా అంతా కళ్ళముందు కనిపిస్తుంది. అవన్నీ అప్పటి నా ప్రతి బొమ్మలోనూ ప్రతిబింబిస్తూ ఇంకా నాకాకాలాన్ని ఇప్పటికీ కళ్ళకు కట్టేస్తాయి.

ఇంకా ఎవరైనా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లని కలిసి, వాళ్ళు వేసిన ఒరిజినల్ బొమ్మలు చూడాలనీ, అడిగి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనీ, ఎంతో కొంత వాళ్ళ నుంచి నేర్చుకోవాలనీ కోరిక ఉండేది - ఇవేవీ సాధ్యం కాక JNTU Fine Arts లో అయినా "పెయింటింగ్ కోర్స్" చెయ్యలని కొద్ది రోజులు ఆ కాలేజి చుట్టూ తిరిగాను. తిరిగి తిరిగి కనుక్కుంటే మూడేళ్ళు Full-time Bachelor of Fine Arts Degree మాత్రమే ఉందని తెలిసింది. అయినా చేరిపోయి చేసెద్దామా అన్న ఆలోచన కూడా మదిలో మెదిలేది. కానీ అలా చెయ్యాలంటే అప్పుడే మొదలు పెట్టిన "సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్" కెరీర్ దారిలోంచి పక్కకు రాక తప్పదని అర్ధం అయ్యాక, "అయ్యో ఇంజనీరింగ్ చెయకున్నా బాగుండేది" అని కూడా అనుకున్నాను.

అలా అప్పటికే వీలు చిక్కినప్పుడల్లా, చిక్కకున్నా చిక్కించుకునైనా బొమ్మలు వేస్తూనే ఉన్నా...ఏదో తెలీని కొరత, నేనేస్తున్నవి అసలు బొమ్మలేనా, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని అయినా కలిసి అభిప్రాయం తెలుసుకోవాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది అప్పట్లో. ఇప్పుడా కోరిక అస్సలు లేదు. "Information Age" దాటి "Digital Age" కూడా దాటి "Artificail Intelligence Age" లోకి ప్రవేశిస్తున్న కాలం. ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఏది తెలుసుకోవాలన్నా వేలితో రెండు మూడు క్లిక్కుల్లోనే. పని గట్టుకుని గంటల కొద్దీ ఎక్కడెక్కడికో వెళ్ళి శ్రమ పడి వెతకాల్సిన పనిలేదు, ఎవరినీ అడగఖ్ఖర్లేదు. కావల్సిందల్లా - తెలుసుకోవాలన్న ఆసక్తి, చెయ్యాలన్న తపన, టైమ్ లేదంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటూ వృధా చేసుకో(లే)ని మనదైన మన సొంత సమయాన్ని మన చేతుల్లోనే ఉంచుకోగల సంయమనం...అంతే!

"కాలం ఖర్చయిపోయినా, వృధాకాని వెలకట్టలేని అనుభవాల జ్ఞాపకాలే జీవితానికి సంతృప్తి."
~ గిరిధర్ పొట్టేపాళెం