Pages

Saturday, March 6, 2021

నా మొట్ట మొదటి బ్యాంక్ అకౌంట్...


నాకప్పుడు నిండా 9 ఏళ్ళే, అప్పుడే బ్యాంక్ అకౌంటా...

అదే "గురుకుల విద్యాలయ" మహత్యం. మా స్కూల్ - "ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం, కొడిగెనహళ్ళి", హిందూపురం దగ్గర, అనంతపురం జిల్లా. స్కూల్ పక్కనే "సేవామందిర్" చిన్న గ్రామం లో ఒక బ్యాంక్ ఉండేది, స్కూల్ మెయిన్ గేట్ ఎదురుగా తారు రోడీక్కి చూస్తే కనపడేది. చిన్న గది బ్యాంక్ వెనకవైపు వ్యూ కనిపించేది. ఒక చిన్న వరండా, ఒక్క రూమ్ ఉన్నట్టు జ్ఞాపకం. బ్యాంక్ పేరు మది లోతుల్లో దాగి బయటికి రానంటుంది, బహుశా ఎప్పుడూ గుర్తుచేసుకోలేదని న(అ)లిగి చెరిగిపోయిందేమో!

మాది రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో ఆ బ్యాంక్ లో మా స్కూల్ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయం అది. స్కూల్ లో చేరిన రోజే వచ్చిన తలిదండ్రులకో, పెద్దవాళ్ళకో ఆ వివరాలిచ్చి ఖాతా తెరవండి అని చెప్పి  ప్రోత్సహించేవారు. అందరూ అ సదుపాయం ఉపయోగించుకునే వాళ్ళు కాదు. కానీ నన్ను 5 వ క్లాస్ లో స్కూల్లో చేర్చటానికి తీసుకెళ్ళిన మా తాతయ్య "శ్రీ|| జలదంకి మల్లిఖార్జునం, B.A., (Retd. Deputy Collector)" నా పేరు మీద ఖాతా తెరిపించి అందులో 5 రూపాయలు డిపాజిట్ చేశారు. నాదగ్గర పాస్ బుక్ కూడా ఉండేదప్పుడు.

ఆరేళ్ళు ఆ బ్యాంక్ కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అయినా నా డబ్బులూ, అకౌంటూ వాళ్ళ రికార్డుల్లో అలాగే భద్రంగా ఉన్నాయి. 10 వ క్లాస్ పరీక్షలు రాసి "గురుకుల విద్యాభ్యాసం" ముగించి ఇంటికి వెళ్ళిపోయే రోజు కోసం "జీవిత కాలం" నిరీక్షించిన రోజు రానే వచ్చింది. తొమ్మిదేళ్ళవయసుకి ఆరేళ్ళ నిరీక్షణ ఒక జీవితకాలం కన్నా బహుశా ఇంకా ఎక్కువేనేమో. ఆరోజు కలిగినంత సంతోషం జీవితంలో బహుశా ఎప్పుడూ కలగ(లే)దేమో, ఇంక ఎప్పుడూ అమ్మ, అన్న, చెల్లెలు, బామ్మ నీ వదిలి దూరంగా వెళ్ళే అవసరమే ఉండదన్న ఒక్క ఆలోచనకే అదంతా. చాలా మంది స్నేహితులు పరీక్ష అయిన రోజే ఇళ్లకు వెళ్ళిపోయారు, కొద్ది మంది మాత్రం ఆ రోజు స్కూల్ లోనే ఉండి తరువాతి రోజు బయలుదేరి వెళ్లాం.

నా బ్రౌన్ కలర్ లెదర్ సూట్ కేసూ, భుజానికి తగిలించుకునే ముదురాకుపచ్చ ఎయిర్ బ్యాగూ, బెడ్డూ, నాలుగైదు జతల బట్టలూ, ప్లేటూ గ్లాసూ, క్యాన్వాస్ షూస్, చెప్పులూ, ఒకటో రెండో లేపాక్షి నోట్ బుక్కులూ ఇవే స్కూల్ నుంచి మోసుకెళ్ళాల్సిన నా వస్తువులు...కానీ వాటితోబాటే జీవితకాలానికి సరిపడా తీసుకెళ్తున్న జ్ఞాపకాలూ ఉన్నాయి గుండెల్లో...అన్నీ సర్దుకుంటుంటే బయట పడ్డ పాస్ బుక్ తీసుకుని ఒక స్నేహితుడితో బ్యాంక్ కి వెళ్ళటం ఇంకా గుర్తుంది.

ఆ బ్యాంక్ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా చెయ్యాలో, డబ్బులు ఇస్తారో లేదో, ఇన్నేళ్ళదాకా అకౌంట్ ఉందో లేదో ఇలా అనేక ప్రశ్నల ఆలోచనలతో వెళ్ళిన నన్ను ఆ బ్యాంక్ వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. "స్కూల్ అయిపోయింది, ఇక రాను, ఇంటికెళ్ళిపోతున్నాను" పాస్ బుక్ ఇస్తూ ఇంతే చెప్పినట్టు గుర్తు. పాస్ బుక్ తీసుకుని, లెక్కలు వేసి చేతిలో పెట్టిన ఐదు రూపాయలా ముప్పై పైసలు, ఒక పది పైసలో ఇరవై పైసలో క్లోజింగ్ ఫీ కింద తీసుకున్నట్టు గుర్తు. చేతిలో ఆ డబ్బులు చూసి చెప్పలేని ఆనందం, ఆ 5 రూపాయలు చూసి కాదు, వడ్డీ రూపంలో ఇంకో ముప్పై పైసలు ఎక్కువ ఇచ్చారని.

తర్వాత పది నిమిషాల్లోనే ఆ ముప్పై పైసలు తో ఆ పక్కనే ఉన్న చెక్ పోస్ట్ బంక్ లో "టైం పాస్", "బర్ఫీ" కొనుక్కుని చప్పరించేశాం. ఆ ఐదు రూపాయల్తో మాత్రం 2 K.M. "హిందూపురం" వెళ్ళి, మా స్కూల్  పక్కనున్న పెన్నా బ్రిడ్జి దగ్గరనుంచి కనిపించే  "శ్రీనివాస థియేటర్" లో బెంచి టిక్కెట్టు (పేరుకు బెంచి టిక్కెట్టే అది కొత్తగా ఆ ఇయర్ కట్టిన మాడ్రన్ థియేటర్, నేల కెళ్ళినా కుర్చీలే) కొనుక్కుని "బొబ్బిలిపులి" సినిమా నూన్ షో కెళ్లాం.  ఇంకా బాగా గుర్తు సినిమా మొదలు టైటిల్స్ లో...భారతదేశం మ్యాప్ లో NTR ఎంట్రీ, క్లోజప్  షాట్ లో NTR ఫేస్ మీద "బొబ్బిలిపులి" టైటిల్,  తరువాత "విశ్వ విఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ యన్.టీ.రామారావు"...అది చూసి మేము కొట్టిన విజిల్...థియేటర్ లో అదిరేలా నేను కొట్టిన ఒకేఒక్క విజిల్!

పట్టలేని ఆనందం ఆ రోజంతా ఇంటికెళ్ళిపోతున్నాం ఇంక ఎప్పుడూ ఇంత దూరంగా ఇంటికి ఉండే పని లేదని. కానీ అప్పుడు తెలీదు అది కేవలం మొదలు మాత్రమేననీ, తరువాతి చదువంతా ఇంటికి దూరంగానేననీ, ఆ తర్వాత ఉద్యోగంతో దేశమే వదలి ఇంటికి ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాననీ, ఇంట్లో గడిపిన బాల్యం అంతా కలిపి కేవలం ఆ తొమ్మిదేళ్ళలోపేననీ...

"బొబ్బిలి పులి" - NTR

ఏ జ్ఞాపకం తలుపుతట్టినా ఆ జ్ఞాపకంలో ఏదో ఒక నా బొమ్మ కనిపిస్తూనే ఉంటుంది, ఆర్ట్ తో ఇంతగా నా జీవితం పెనవేసుకుని ఉందా అప్పటి నుంచే అనిపిస్తూ, నను నిత్యం మురిపిస్తూ...

~~~ ** ~~~

"వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరికైనా జీవితాన కనిపించి పలకరించేవి చెదిరిపోని జ్ఞాపకాలే!" - గిరి

2 comments:

  1. మొదటి బ్యాంక్ ఖాతా థ్రిల్లే వేరు 🙂. ఇంకా చిన్నపిల్లలకు ఆ రోజుల్లో బ్యాంకులు కిడ్డీ బ్యాంక్ సౌకర్యం కూజా ఇచ్చేవి పిల్లలకు మరింత ఖుషీగా ఉండడానికి (పొదుపు అలవాటుతో బాటు).

    మీ స్కూల్ దగ్గర బ్యాంక్ బహుశః కెనరా బ్యాంకో, సిండికేట్ బ్యాంకో అయ్యుంటుంది - ఆ ప్రాంతం / జిల్లా కర్ణాటక బోర్డర్ కదా. అకౌంట్ మూసెయ్యడానికి ఛార్జీలు తీసుకున్నారంటున్నారు కదా, స్టేట్ బ్యాంక్ లో ఆ రోజుల్లో ఇటువంటి పద్ధతి లేదు (వ్యాపార సంస్కృతి బాగా కమ్మేసిన ఈ కాలం సంగతి తెలియదు).

    ఏమైనప్పటికీ మధుర స్మృతులు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ...ఫేస్ బుక్ లో మా స్కూల్ టీచర్, ఇంకా ఒక జూనియర్ confirm చేశారు అది సిండికేట్ బ్యాంక్ అని, మీరు భలే కరెక్ట్ గా గెస్ చేశారు, ఆ బోర్డర్ ప్రాంతాలు పరిచయం ఉండి ఉండాలి మీకూ అయితే. మా స్కూల్ ని ఆనుకుని ఉన్న "సేవామందిరం" ఊరు దాటితే కర్ణాటక, అక్కడి తెలుగు యాస విచిత్రంగా ఉండేది. అప్పుడు మాకు వాళ్ళ భాషే పెద్ద తమాషా ;)

      Delete